Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మూడు మనస్సుల మూగవేదన

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి ‘మూడు మనస్సుల మూగవేదన’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“సార్!..”

దినపత్రికను చదువుతున్న రిటైర్డ్ హైస్కూల్ మాస్టర్ బాలయ్య పత్రికను క్రిందికి దించి సూటిగా చూచాడు.

దాదాపు పాతికేళ్ళ వయస్సు యువకుడు.. చిరునవ్వుతో వారి ముఖంలోకి చూచాడు. రెండు చేతులు జోడించి.. “నమస్కారం సార్!..” ఎంతో వినయంగా చెప్పాడు.

“మీరు ఎవరు బాబు?”

“టులెట్ బోర్డు!.. నమస్కారం సార్!” అన్నాడు మరోసారి చిరునవ్వుతో అతను.

“ఓహో!.. ఇల్లు కావాలా!.. మీ పేరు?”

“సత్యం సార్!”

“ఏం చేస్తున్నారు?”

“ఈ ఊరి పి.డబ్ల్యు.డి ఆఫీసులో ఉద్యోగం సార్!”

‘వారి నెక్స్ట్ ప్రశ్న, ఏం ఉద్యోగమో అవుతుంది, కనుక మనమే చెప్పేయడం మంచిది కాదా!’ అనుకొని సత్యం.. “అసిస్టెంట్ ఇంజనీర్ సార్!” అన్నాడు.

“ఓహో ఇంజనీరువా!..” చిరునవ్వుతో అడిగాడు బాలయ్య.

“అవును సార్!”

“పెండ్లి అయ్యిందా?”

“లేదు సార్!”

“ఏ వూరు?”

“పంటలల్లూరు, నెల్లూరు జిల్లా!”

“సరే, రా!.. కూర్చో!”

సత్యం వరండాలో ప్రవేశించాడు. అదే సమయానికి బాలయ్య కుమార్తె బిందు కాఫీ గ్లాసుతో వరండాలోనికి వచ్చింది. నిలబడి వున్న సత్యాన్ని చూచింది. ‘ఎవరబ్బా ఈ ఆరడుగుల అందగాడు!’ అనుకొంది బిందు.

“కూర్చో సత్యం!” అన్నాడు బాలయ్య.

‘ఓహో అయ్యగారి నామధేయం సత్యమా.. బాగుంది’, బిందు మనోభావన.

బిందు రెండుక్షణాలు సత్య ముఖంలోకి చూచి, తలతిప్పి.. “నాన్నా!.. కాఫీ” గ్లాసును తండ్రి చేతికి అందించింది.

మరోసారి సత్యం ముఖంలోకి క్షణంసేపు చూచి లోనికి వెళ్ళిపోయింది బిందు.

‘పిల్ల బాగానే వుంది. మాస్టారు గారి కూతురు కదా. బాగా చదివే వుంటుంది. ఏ సన్యాసిగాడికి ఇల్లాలు కాబోతు వుందో, వాడు నిజంగా అదృష్టవంతుడు’ అనుకొన్నాడు సత్యం.

“అమ్మా..” పిలిచాడు బాలయ్య, తలుపు చాటునే వున్న బిందు.. “ఏం నాన్నా!” అంది.

“మరో గ్లాను కాఫీ తేమ్మా!”

“ఎవరికి?”

“చూచావుగా ఈ అబ్బాయికి!”

“అలాగా!”

“ఎదుట మనిషిని పెట్టుకొని నేను ఎలా కాఫీ త్రాగగలనమ్మా. అది తప్పు కదూ!” అనునయంగా చెప్పాడు బాలయ్య.

“..తెస్తాను” అంది బిందు.

“సార్!”

“ఆ చెప్పు సత్యం..!” చిరునవ్వుతో అడిగాడు బాలయ్య.

“సార్!.. పోర్షన్ చూపిస్తారా!”

“ఆగవయ్యా ఆగు. నా చేతిలో కాఫీ గ్లాస్ వుందా!.. నేను తాగాలా!.. నీవు చూస్తుంటే నేను ఎలా త్రాగగలను. అందుకే అమ్మాయితో మరో గ్లాస్ కాఫీ తెమ్మని చెప్పాను. క్షణాల్లో వచ్చేస్తుంది. ఇద్దరం కాఫీ త్రాగుదాం. ఆ తర్వాత ఇల్లు చూపిస్తాను. సరేనా!” చిరునవ్వుతో చెప్పాడు బాలయ్య.

“అలాగే సార్!”

బిందు వచ్చింది.

“నాన్నా! కాఫీ”

“ఆ..ఆ.. అబ్బాయికి ఇవ్వమ్మా!”

బిందు సత్యానికి కాఫీ గ్లాస్ అందించింది. కృతజ్ఞతతో పూర్వకంగా, సత్యం చిరునవ్వుతో బిందు ముఖంలోకి చూచాడు.

“సత్యం..!”

“సార్!”

“మా అమ్మాయి పేరు బిందు. బి.ఎస్సీ. ఫస్ట్ క్లాసులో పాసయ్యింది. బి.ఇడి ఫైనల్ ఇయర్ చదువుతుంది. కరోనా కాలగతిలో నా ఇల్లాలు శ్యామల పైకి వెళ్ళిపోయింది” విచారంగా చెప్పాడు బాలయ్య.

“ఓహో! అలాగా. సారీ సార్” రెండు క్షణాల తర్వాత “కాఫీ చాలా బాగుంది” బిందు ముఖంలోకి చూస్తూ చెప్పాడు సత్యం.

“థాంక్యూ!” బిందు ఖాళీ గ్లాసులను తీసుకొని లోనికి వెళ్ళిపోయింది.

పోర్షన్ మేడ మీద..

బాలయ్య ఇంట్లో ప్రవేశించి తలుపు ప్రక్కన గోడ చీలకు తగిలించి వున్న తాళాన్ని తీసుకొని బయటికి వచ్చారు. మేడమీదికి ఇంటి ముందునుండి మెట్లు వున్నాయి.

“రా సత్యం!”

“పదండి సార్!”

ఇరువురూ మెట్లు ఎక్కి టెర్రస్ పైకి చేరారు. మేడమీది ఇంటికి పేరపెట్ గోడకు ఇంటికి ఎనిమిది అడుగుల దూరం. బాలయ్యగారు ఆ ఇంటి తాళం తీసి తలుపు తెరిచారు. సత్యం ఆత్రంగా లోనికి చూచాడు. బాలయ్య ఇంట్లోకి ప్రవేశించి..

“రా సత్యం!” పిలిచాడు. సత్యంలోన ప్రవేశించి ఇల్లంతా చూచాడు. హాలు, ప్రక్కన బెడ్ రూం, వ్యతిరేక దిశలో ఆగ్నేయ మూల వంటగది, దాని ప్రక్కన నైరుతీ మూలంగా బాత్ రూం లెట్రిన్, క్రమంగా నిర్మించబడి వున్నాయి.

టెర్రస్ ఈశాన్యమూల సన్నజాజుల పందిరి, ఆ తూర్పు గోడకు జాజిపందిరి కనుపించేలా కిటికీలు వున్నాయి. జాజితీగల్లో చాలా పూలమొగ్గలు. కొన్ని సాయంత్రానికి విచ్చుకొనేవి. మిగతావి రెండు మూడు రోజుల తర్వాత.

“ఎలాగుంది సత్యం!” అడిగాడు బాలయ్య.

“బాగుంది సార్.. నచ్చింది. బాడుగ ఎంతో చెప్పండి” అన్నాడు సత్యం.

“ఆరువేలు. మూడునెలల అడ్వాన్స్” బాలయ్య గారి జవాబు.

సత్యం జేబునుండి పర్స్ తీసి పదివేలు బాలయ్యకు ఇచ్చాడు.

“సార్!.. మీకు అభ్యంతరం లేకపోతే రేపు శుక్రవారం దశమి ఉదయాన్నే ఇంట్లో చేరుతాను సార్!” చిరునవ్వుతో చెప్పాడు సత్యం.

“నాకేం అభ్యంతరం లేదు. రేపు రా.”

“సార్!.. రాగానే మిగతా అడ్వాన్స్ ఇస్తాను.”

“అలాగే!..” తాళం సత్యానికి ఇచ్చి, బాలయ్య క్రిందికి వెళ్ళిపోయాడు. సత్యానికి వున్నది తల్లి జానకి. వారి తండ్రి కూడా కరోనా వాత పడ్డాడు.

తాళం వేసి, సత్యం తన బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు. మరుదినం ఉదయం ఏడున్నరకు ఆ ఇంట్లో చేరాడు.

***

సత్యం ఆ ఇంట్లో చేరి వారం రోజులైంది. ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు బిందు మేడపైకి వచ్చి సన్నజాజి మొగ్గలను కోసుకొని క్రిందికి వెళ్ళిపోయేది. రెండు మూడు సార్లు సత్యం బిందును పూలుకోసేటప్పుడు చూచాడు. అతనికి ఆమె ఎంతగానో నచ్చింది. సహజంగా బిందు మంచి అందగత్తె. వయస్సులో వున్న ఏ యువకునినైనా ఆమె శరీరపు రంగు జడం అందచందాలు తప్పనిసరిగా నచ్చుతాయి. సత్యం అవివాహితుడు, అతని అప్పటి పరిస్థితి అదే. ఏకాంతంలో బిందును గురించి ఆలోచిస్తూ కూర్చుండిపోయేవాడు.

బిందు చాలా రిజర్వుడుగా వుంటుంది. అనవసరమైన ప్రసంగం ఎవ్వరితో ఎప్పుడూ చేయదు. అలాంటి మంచి పద్ధతులన్నీ ఆమె తల్లి శ్యామల ఆమెకు నేర్పింది. కానీ ఈనాడు ఆమె లేదు. ఆమె లేని ఇంట్లో తిరుగుతున్న బిందుకు తన తల్లి జ్ఞప్తికి రాని క్షణం లేదు. ఆ తల్లి చెప్పిన ఏ మాటను బిందు మరువలేదు.

శ్యామల గతించకముందు ఆ పై పోర్షన్‍లో బాలయ్య బిందు స్కూలు పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. వారు వెళ్ళిపోయాక సన్నజాజుల మధురమైన ఆ వాసనని ఆఘ్రాణిస్తూ బిందు చదువుకొనేది.

కాలం ఎప్పుడూ ఒకేరీతిగా సాగదుగా!.. భూమికి చీకటి వెలుగులు మనిషికి కష్టసుఖాలు సహజం. అంతా దైవ నిర్ణయం.

సత్యం ఆ ఇంటికి వచ్చి నెలరోజుల పైన అయింది. ఊరికి వెళ్ళి తన తల్లితో బిందును గురించి చెప్పాలనుకొన్నాడు. బాలయ్య, తన తల్లి సమ్మతిస్తే బిందును వివాహం చేసుకోవాలనుకొన్నాడు సత్యం. కానీ.. ఆ ఆఫీసుకు అతను కొత్త కాబట్టి పని ఒత్తిడి వలన తాను అనుకొన్న రీతిగా తన ఊరికి వెళ్ళలేకపోయాడు సత్యం.

***

సత్యం ఆఫీసుకు తల్లి అనారోగ్యంగా వుందని వెంటనే బయలుదేరి రావలెనని అతని మేనమామ రాంబాబు ఫోన్ చేసి చెప్పాడు. బాస్‌ని బ్రతిమిలాడుకొని సత్యం తన ఊరికి చేరాడు.

తల్లి తీవ్ర జ్వరంతో హాస్పిటల్ పాలైవుంది. సత్యం గొంతు వినగానే జానకమ్మ కళ్ళు తెరిచింది. తమ్ముడు రాంబాబుకు అక్క పట్ల అభిమానం వుంది. కానీ.. రాంబాబు ఇల్లాలు సుగుణ పేరుకే సుగుణ. యథార్థంగా ఒట్టి అవగుణ. సుగుణకు జానకమ్మ గిట్టదు. ఆమె మోడరన్ ఉమన్. జానకమ్మ పాతకాలం మనిషి. తత్వభేదాలు వున్న వ్యక్తుల మధ్యన సఖ్యత పొసగదు. ఆ కారణంగా రాంబాబు భార్యకు భయపడతాడు.

సత్యం తల్లి అనారోగ్యం కారణంగా సొంత ఊర్లో తల్లిని హాస్పిటల్లో వుంచి పదిరోజులు వుండవలసి వచ్చింది. బాస్‌కు విషయాన్ని వివరించి సత్యం వేరే మార్గం లేక తల్లిని కనిపెట్టుకొని మందుమాకు సమయానికి ఇస్తూ తల్లి సేవలో హాస్పిటల్లో వుండిపోయాడు.

జానకమ్మను డిశ్చార్జి చేశారు. తల్లి కొడుకులు ఇంటికి చేరారు. తల్లి చాలా బలహీనంగా వున్నందున మరో మూడురోజులు వుండి, ఒక పనిపిల్లను ఏర్పాటు చేసి సత్యం విశాఖకు, పంటలల్లూరు నుండి బయలుదేరాడు. దాదాపు ఆ రెండువారాల కాలంలో బాలయ్య గారింట్లో అనూహ్యమైన సంఘటన ఒకటి జరిగింది. బాలయ్య బావమరిది కోదండయ్య తల్లి నాంచారమ్మ మంచంలో వుంది. ఆమె వయస్సు ఎనభై సంవత్సరాలు. కొడుకును పిలిచి తన మనవడు మురళికి, బాలయ్య కూతురు బిందుకు వెంటనే వివాహం జరిపించాలని, ఆ వివాహాన్ని చూచి తాను ప్రశాంతంగా చచ్చిపోతానని కొడుకు కోదండయ్యను కోరింది. కోదండయ్య వెంటనే చినగంజాం నుండి విశాఖపట్నం వెళ్ళి తన బావగారైన బాలయ్యగారిని కలిసి, తన తల్లిగారి చివరి కోర్కెను బావగారికి తెలియజేసి, బాలయ్యను ఒప్పించి, పురోహితుల వద్ద పదిరోజులలోపలే వివాహానికి ముహూర్తం, శుభలేఖలు అచ్చు వేయించి కోదండయ్య ఆనందంగా చినగంజాంకు చేరాడు. తండ్రి మేనమామ ఒకటైనందు వలన బిందు ఏమీ అనలేక మౌనంగా తలాడించింది.

బావమరిది కోదండయ్య వెళ్ళిపోగానే బాలయ్య.. “అమ్మా!.. బిందూ!.. నీకు ఈ సంబంధం ఇష్టమేగా! మురళీ రైల్వే ఇంజనీరమ్మా!.. నీ జీవితం బాగుంటుంది తల్లీ!” అనునయంగా చెప్పాడు.

“మనదేముంది నాన్నా!.. అంతా దైవ నిర్ణయం” విరక్తిగా నవ్వింది బిందు. తలవంచుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది.

సత్యం ఆ రోజు వేకువన హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం చేరాడు. బాలయ్య ఇంటికి ఆటోలో వచ్చాడు. రిజర్వ్ టికెట్ లేని కారణంగా రాత్రంతా లెట్రిన్ ఏరియాలో నిలబడి.. నిలబడి ప్రయాణం చేసి అలసిపోయిన అతనుఉ (అతి ప్రయాసతో) వేరే ఆలోచన లేకుండా మెట్లు ఎక్కి గది తలుపు తెరుచుకొని లోన ప్రవేశించి లోన బిగించి పడకపై వాలిపోయాడు.

సత్యం కళ్ళు తెరిచి చేతి వాచీని చూచుకొన్నాడు. గంట పదకొండు. లేచి కాలకృత్యాలు, స్నానం చేసి డ్రస్ చేసుకొని ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

మెట్లు దిగే సమయంలో అతనికి బిందు జ్ఞాపకం వచ్చింది కానీ.. వారి ఇంటి తలుపు మూసి ఉంది. వరండాలో ఎవరూ లేరు. మౌనంగా సత్యం ఆఫీసుకు వెళ్ళిపోయాడు. రాత్రి గదికి ఆలస్యంగా వచ్చాడు.

***

మరుదినం ఆదివారం. ఆరుగంటలకు లేచి ఉదయం కలాపాలు ముగించుకొని టిఫిన్ తినేటందుకు హోటల్‌కు వెళ్ళడానికి మెట్లు దిగుతున్న సమయంలో తలుపు తెరిచి వరండాలోకి రాబోయిన బిందు వెనక్కు తిరిగి తలుపు మూసింది.

ఆ దృశ్యాన్ని సత్యం చూచాడు. ఆశ్చర్యపోయాడు. అతని హృదయంలో కలవరం..

‘నన్ను చూచి బిందు ఎందుకు తలుపు మూసింది. రెండు వారాల తర్వాత కనిపించాను కదా!.. పలకరించాలి కదా!.. తలుపు మూయడంలోని అర్థం ఏమిటి?.. నేను ఇక్కడ వుండగా ఏ విషయంలోనైనా ఆమెను నేను నొప్పించానా, అసలు పలకరించనే లేదే!.. నా వల్ల ఏం తప్పు జరిగింది?’ అన్నీ ప్రశ్నలే, జవాబు శూన్యం.

అదే ఆలోచనలతో హోటల్‌కి  వెళ్ళి ఏదో తిని ఇంటికి తిరిగి వచ్చాడు సత్యం. బాలయ్యగారి సింహద్వారం మూసి ఉంది.

‘బాలయ్యగారు ఈ సమయంలో వరండాలో కూర్చుని దినపత్రికను చదివేవారు కదా!.. వారు ఏమైనారు? వెళ్ళి తలుపు తట్టి విచారిద్దామా!.. ఆహా!.. అది తప్పు. అనుచితమైన కార్యాలు ఎప్పుడూ ఎవరి విషయంలోనూ చేయకూడదు’ అనుకొన్నాడు.

మెట్లెక్కి గదిలో ప్రవేశించి తలుపు దగ్గరకు నెట్టాడు. పడకపై వాలిపోయాడు. అరగంట గడిచింది. మదిలో బిందు, బాలయ్యల ఆలోచనలు.

తలుపు తట్టిన శబ్దం.. లేచి వెళ్ళి తలుపు తెరిచాడు సత్యం.

ఎదురుగా.. బాలయ్య.. వారి చేతిలో వివాహ ఆహ్వాన పత్రిక.

“సత్యం గారూ! గుడ్ మార్నింగ్” అన్నాడు బాలయ్య.

“ఆఁ.. గుడ్ మార్నింగ్ సార్!.. రండి.. కూర్చోండి.”

బాలయ్య కుర్చీలో కూర్చున్నాడు.

“ఏమిటి సార్ విషయం?”

“మా బిందు వివాహం సత్యంగారూ. పత్రిక తీసుకోండి” అందించాడు బాలయ్య. సత్యం తన చెవులను తానే నమ్మలేకపోయాడు. బిక్కమొఖంతో యాంత్రికంగా బాలయ్యగారి చేతిలోని పత్రికను అందుకొన్నాడు సత్యం.

“వరుడు మా బావమరిది కొడుకు. వారుండేది చినగంజాం. పై శుక్రవారం వివాహం. మీరు తప్పక రావాలి. మా అత్తగారు వృద్ధురాలు. మంచంలో వుంది. ఆమె ఆనందం కోసం వెంటనే పెండ్లి జరిపిస్తున్నాము” బాలయ్య తన పద్యాన్ని ఒప్పచెప్పాడు. సత్యంకు అంతా తేటతెల్లం. వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. కొన్ని క్షణాల తర్వాత.. “చాలా సంతోషం సార్!” మెల్లగా చెప్పాడు సత్యం.

“టిఫిన్ చేశారా!”

“అయింది సార్!”

“ఈరోజు ఆదివారం శలవు కదూ!”

“రెండువారాలు అమ్మ అనారోగ్యం కారణంగా శలవులో వున్నా కదా, పని వుంది. ఆఫీసుకు వెళతాను సార్!”

“మంచిది సత్యం వస్తా!”

“అలాగే సార్!”

బాలయ్య గదినుండి బయటికి నడిచాడు. సత్యం అప్రసన్నంగా ఆ వివాహ పత్రికను చూచి మంచంపై వదలి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. అతని ఆశలు నిరాశలైనాయి. మనస్సున మూగబాధ.

***

ఆ శుక్రవారం నాడు బిందు మురళీల వివాహం చినగంజాంలో ముక్తసరిగా జరిగింది.

సత్యం వెళ్ళి తాళి కట్టేవరకూ వుండి బయలుదేరి విశాఖకు వచ్చేశాడు. బిందు అతనివైపు చూడలేదు. కానీ.. సత్యం ఆమె ముఖంలోకి పరీక్షగా చూచాడు. ఆ వివాహం బిందుకు ఇష్టం లేదన్న విషయం సత్యానికి అర్థం అయ్యింది. అయితే!.. ఏం చేస్తాడు?.. ఏం చేయగలడు?

ఆ ఇంటి వాతావరణం అంతా సత్యానికి అరుణ్యంగా తోచింది. తాను మనసారా ప్రేమించి, వివాహం చేసుకోవాలనుకొన్న బిందు, పరాయి వాడి ఆలి అయింది. అతని కల కలగానే మిగిలిపోయింది. మూడురోజులు (నిద్రలు) నామమాత్రంగా చినగంజాంలోనే జరిగాయి. మురళీ ఆ మూడురాత్రులు త్రాగాడు. నాల్గవ రోజు సాయంత్రానికి నవ వధూవరులు కోదండయ్య సతీమణి రుక్మిణి బాలయ్యలు విశాఖకు వచ్చారు.

అది తాను పెరిగిన ఇల్లే కాబట్టి బిందు వంటచేసి రాత్రి భోజనాలు ఏర్పాటు చేసింది. రుక్మిణి కొంత సాయం చేసింది.

ఆఫీస్ నుంచి లేటుగా బయలుదేరి, హోటల్లో భోంచేసి సత్యం తన నిలయం చేరాడు. బాలయ్య కోదండయ్యలు వరండాలో కూర్చొని వున్న కారణంగా సత్యం రాకను బాలయ్య గమనించాడు. కుర్చీనుండి లేచి అతన్ని సమీపించాడు బాలయ్య.

“సత్యం గారూ!”

“చెప్పండి సార్!”

“రేపు మా ఇంట్లో వ్రతం. మీరు మా ఇంట్లో భోంచేయాలి” చిరునవ్వుతో చెప్పాడు బాలయ్య.

“సార్!.. కుదరదు సార్!.. నేను ఉదయం ఏడున్నర కల్లా ఆఫీసుకు చేరాలి. అర్జంటు పనులు అన్యథా భావించకండి” ఎంతో వినయంగా చెప్పాడు సత్యం.

“అలాగా!”

“అవును సార్!”

“బిందూ పిలవమంది!” అన్నాడు బాలయ్య.

ఆ పేరు వినగానే సత్య ముఖంలో రంగులు మారాయి. తలను ప్రక్కకు త్రిప్పుకొని.. “చెప్పాను కదా సార్!.. కుదరదని!” నెమ్మదిగా అన్నాడు.

“సరే!.. మీ ఇష్టం..”

బాలయ్య వరండా వైపుకు నడిచాడు. సత్యం మేడమీదికి నడిచాడు.

***

ఆ మరుదినం సాయంత్రం వ్రతం తరువాత అందరూ చినగంజాం వెళ్ళిపోయారు. సాయంత్రం సత్యం వచ్చి చూచేసరికి ఎవరూ లేరు. మేడపైకి ఎక్కాడు. అప్రయత్నంగా అతని చూపులు సన్నజాజి పందిరి వైపు మళ్ళాయి. దాదాపు రెండువారాలకు పైగా బిందు పూలను కోయనందున పూచినపూలు క్రిందకు రాలి పడివున్నాయి. వాటిని గురించి పట్టించుకొనే నాథుడే లేడు.

‘వాటి స్థితి నా స్థితిలానే వుంది’ అనుకొని విరక్తిగా నవ్వుకొన్నాడు.

అతను బిందును ఎంతగా మరచిపోవాలనుకొన్నా మరచిపోలేక పోతున్నాడు. ఏవేవో కలలు. మనస్సుకు శాంతి లేదు. విజయవాడలో ప్రకాశం అనే వ్యక్తి తన హోదా అసిస్టెంట్ స్టేషన్ మాస్టరుగా పనిచేస్తున్నాడు. అతని స్వస్థలం వైజాగ్. అతను సత్యాన్ని రెండుసార్లు కలిసి.. “విజయవాడ నెల్లూరి దగ్గర కదా!.. నీవు విజయవాడకు, నేను వైజాగ్‌కు మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్లు పెట్టుకుందాం. డివిజినల్ ఆఫీసర్‍తో మాట్లాడుదాం. అలా జరిగితే మన ఇరువురికి ఆనందం కదా!” అని చెప్పి వున్నాడు.

ఆ విషయం గుర్తుకు వచ్చింది. మరుదినం అతనికి ఫోన్ చేసి తన సమ్మతిని చెప్పాడు సత్యం. డిపార్టుమెంటులో ప్రకాశానికి పై ఆఫీసర్లతో బాగా పరిచయం ఉంది. తన పలుకుబడిని ఉపయోగించి వారంరోజుల్లో సత్యం విజయవాడకు, ప్రకాశం విశాఖపట్నానికి మారిపోయాడు.

***

ఇల్లు ఖాళీ చేసే ముందు రోజు రాత్రి బాలయ్యకు విషయం చెప్పేదానికి తలుపు కొట్టాడు సత్యం.

ఆ సమయంలో బాలయ్య తన మిత్రునితో కలిసి మందు సేవిస్తున్నాడు. ఆ స్నేహితుడు తలుపు సమీపించి తలుపును తెరిచాడు. సత్యాన్ని చూచాడు. వారి పేరు ముకుంద. సత్యానికి తెలిసిన వ్యక్తి. అప్పటికే రెండు రౌండ్స్ వేసియున్న ముకుంద నవ్వుతూ సత్యం చేయి పట్టుకొని లోనికి ఆహ్వానించాడు. బాలయ్య కూడా స్వాగతం పలికాడు. సత్యం ఇరువురి ప్రక్కన కూర్చున్నాడు. ముకుంద గ్లాస్ నింపి, వారి ఇరువురి గ్లాసులను నింపుకొని, సత్యానికి గ్లాస్ అందించాడు ముకుంద. సత్యానికి ఆ క్షణంలో తాగాలనిపించింది. ఛియర్స్ కొట్టి తాగాడు. ఆ తరువాత మరో రెండు.. ముగ్గురూ బాధలో వున్నారు.

“ఓరేయ్.. ముకుందా.. నేను నా బిందును ఆ నీచుడు మురళి గాడికిచ్చి పెండ్లి చేసి, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశానురా!.. ఆ.. ఆ.. గాడిద కొడుకు నా బిడ్డని.. నా బిడ్డని ‘నీవు వర్జిన్‌వేనా’ అని అడిగాడంటరా!.. కిరాతకుడు? పశువు!” భోరున ఏడ్చాడు బాలయ్య.

అతని మాటలు విన్న ఆ ఇరువురి కళ్ళల్లో నీళ్ళు.. బాలయ్య తన ప్రక్కన వున్న డైరీని చేతికి తీసుకొని కొన్ని పేజీలు తిప్పి.. ఇది నా బిందు డైరీ. చూడరా.. చూడు.. అందులో నా తల్లి ఏం వ్రాసిందో చూడు” ఆవేశంగా డైరీని ముకుంద చేతికి ఇచ్చాడు బాలయ్య

“బాబూ!.. నీవు చదువు బాబూ!..” ఆ డైరీని ముకుంద సత్యం చేతికి ఇచ్చాడు. సత్యం.. రెండుసార్లు కళ్ళు మూసి తెరిచి డైరీలోని బిందు అక్షరాలను చదవసాగాడు.

‘జీవితంలో ఎవరు ఎప్పుడు ఎవరికి ఎందుకు తటస్థపడతారో తెలియదు. ఆ రీతిగా నాకు ఏర్పడిన బంధం సత్యంగారు. తొలిచూపులోనే వారు నాకు ఎంతగానో నచ్చారు. రోజులు గడిచేకొద్దీ వారి మాటల్లోని గౌరవం, సౌమ్యత్వం, ప్రీతికరమైన వారి చూపులు నన్ను ఆకర్షించాయి. అమ్మలేని నేను సత్యం విషయంలో నా భావాలను నాన్నకు చెప్పాలనుకొన్నాను. ఆ మరుదినం సత్యంగారు వారి తల్లికి బాగాలేదని వూరికి వెళ్ళిపోయారు. ప్రతి సాయంత్రం నేను మేడమీది జాజి పందిరిలోని పూలను కోసేటప్పుడు సత్యంగారు కిటికీ గుండా నన్ను చూస్తుండేవారు, పూలు కోస్తూ అటూ ఇటూ తిరుగుతూ నేను వారిని చూస్తున్న విషయాన్ని, వారు గ్రహించ లేకపోయారు. కానీ వారు నా మనస్సున తిష్ట వేశారు. అకస్మాత్తుగా మామయ్య కోదండయ్య రావడం, అమ్మమ్మ నిర్ణయాన్ని నాన్న మీతో చెప్పడం, నా పరీక్షలు ముగిసినందున, మీరు మామయ్య అభిప్రాయంతో ఏకీభవించడం, ముహూర్తాలు పెట్టించడం, శుభలేఖలు ప్రింట్ చేయించడం, నా వివాహం, అన్నీ రెండు వారాల లోపల, సత్యం గారికి కాని, నీకు గానీ నేను నా మనో అభిప్రాయాన్ని చెప్పుకొనేదానికి అవకాశం లేకుండా జరిగిపోయాయి. నా ఆశలు నాలోనే వుండిపోయాయి. జీవితంలో రాజీపడాలనుకొన్నాను. కానీ.. త్రాగి వచ్చిన మురళి నన్ను తొలిరేయి నాడే అడగకూడని ప్రశ్న అడిగి నన్ను అవమానించాడు. అతను నన్ను అనుమానిస్తున్నాడని నాకు అర్థం అయ్యింది. అతనితో జీవితం దుర్లభం.’

సత్యం చదవటం ముగిసింది. అతనికి ఎక్కిన కైపు దిగిపోయింది. వాకిట్లో ఆటో ఆగిన శబ్దం.. ముకుంద తూలుతూ వెళ్ళి తలుపు తెరిచాడు. బాలయ్య సత్యం ద్వారం నుండి బయటికి చూచారు.

“రేయ్ బాలా!.. బిందు ఒంటరిగా వస్తూ వుందిరా!” అన్నాడు ముకుంద. సత్యం, బాలయ్యలు లేచి నిలబడ్డారు.

బిందు వేగంగా ఇంట్లోకి వచ్చి తన గదిలో ప్రవేశించి తలుపు మూయబోతూ ఆగి “నాన్నా! నాకు విడాకులు కావాలి. మురళి పచ్చి త్రాగుబోతు. అతడంటే నాకు ఇష్టం లేదు. చదువుకొన్నదాన్ని. గౌరవంగా నా బ్రతుకు నేను బ్రతకగలను. నిన్ను నా జీవితాంతం పోషించగలను. నామీద నాకు నమ్మకం వుంది నాన్నా!” గట్టిగా చెప్పి తలుపును మూసుకొంది బిందు.

ఆ ముగ్గురూ తెల్లబోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. బాలయ్య భోరున ఏడ్చాడు. మైకంలో తూలి నేలకు వాలాడు. ముకుంద స్థితీ అంతే.. తూలుతూ సత్య మేడపైకి వెళ్ళాడు.

***

సమయం ఉదయం ఎనిమిది గంటలు.. సత్యం తన లగేజీని ప్యాక్ చేసుకొని క్రిందికి వచ్చాడు. వారికి చెప్పి వెళ్ళేదానికి వరండాలో ప్రవేశించి కాలింగ్ బెల్ నొక్కాడు. బాలయ్య తలుపు తెరిచాడు.

“సార్!.. నాకు విజయవాడకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. వెళ్ళిపోతున్నాను. నేను మీ ఇంట్లో వున్న కాలంలో, నా వలన మీకు ఏదైనా కష్టం కలిగి వుంటే నన్ను క్షమించండి. తెలిసి నేను ఏ తప్పూ చేయలేదు” చేతులు జోడించాడు సత్యం.

తలుపు తెరవబోయి సత్యం మాటలు విని బిందు తలుపు దగ్గరకు నెట్టింది.

“సార్!.. రాత్రి నాచేత మీరు మీ అమ్మాయి గారి డైరీలోని చివరి పేజీని చదివించారు. నాకు తెలియని ఎన్నో విషయాలు తెలిశాయి. బిందూ గారి మనస్సు ఎలాంటిదో కూడా నాకు అర్థం అయ్యింది. వెళ్ళబోయే ముండు నా మనస్సులోని మాటను మీకు చెబుతున్నాను. నేను మీ బిందుగారిని ప్రేమించాను. ఆ విషయం మీతో చెప్పాలనుకొన్నాను. మా తల్లిగారి అనారోగ్యం కారణంగా నేను ఆ విషయాన్ని మీతో చెప్పకుండానే ఊరికి వెళ్ళిపోయాను. అక్కడ రెండు వారాలకు పైగా అమ్మ ఆరోగ్యం నిమిత్తం వుండిపోయాను. నేను తిరిగిరాగానే మీరు నాకు బిందూగారి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. నా నోరు మూతపడింది. ఆ భర్తతో విడాకులు కోరుతున్న బిందూ గారిని విడాకుల అనంతరం నేను వివాహం చేసుకొంటాను. విజయవాడలో మా మామయ్యగారు లాయర్. మీరు అక్కడికి రండి. ఇది నా విజయవాడ అడ్రస్. మామయ్యతో మాట్లాడి, త్వరగా విడాకులు మంజూరు అయ్యేదానికి ప్రయత్నిస్తాను. తప్పక రండి. శలవు” చేతులు జోడించాడు సత్యం.

బిందు తలుపు తెరిచింది. “గుడ్ మార్నింగ్ సార్!..” అంది చిరునవ్వుతో..

“బిందూ గారూ!.. గుడ్ మార్నింగ్. మన మూడు మనస్సుల మూగ వేదనను మేడమీది సన్నజాజి పరిమళంగా నేను మారుస్తాను. బి హ్యాపీ. త్వరగా రండి. వస్తాను” వేగంగా బయటికి నడిచి లగేజీ తీసుకొని వీధిలో ప్రవేశించాడు సత్యం. ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు.

బాలయ్య, బిందుల వదనాల్లో ఆనంద తాండవం.

Exit mobile version