Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మూడు ఈశాన్య రాష్ట్రాలలో మా పర్యటన

[ఇటీవల మిత్రుల కుటుంబాలతో మూడు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించి ఆ అనుభూతులను పంచుకుంటున్నారు శ్రీమతి పైడిమర్రి పద్మ.]

మా ఫెడరల్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగస్తులం కొంతమంది ఒక చక్కటి గ్రూప్‍గా ఏర్పడి నాలుగు సంవత్సరాల నుంచీ ప్రతీ ఏడాదీ ఏదో ఒక చోటకి ఓ పది రోజులు యాత్ర చేసి వస్తున్నాము. ఈ ఏడాది North-East లోని అస్సాం, మేఘాలయ, అరుణాచలప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ముఖ్య ప్రదేశాలు చూసి వచ్చాము.

చాలామంది చూసి వుండవచ్చు. కొంతమంది చూసి వుండకపోవచ్చు. ఎవరికైనా ఉపయోగపడతాయని మా అనుభవాలు ఇక్కడ పంచుకుంటున్నాను.

***

22 ఫిబ్రవరి 2025 న హైదరాబాద్‌లో సాయంత్రం 5 గంటలకు విమానం ఎక్కాము. గౌహతి చేరుకునేటప్పటికి 7.45 అయ్యింది. మేము RV Travels వాళ్ళ ద్వారా వెళ్ళాము. వాళ్ల గైడ్ వినోద్ ముందుగానే హైదరాబాద్ నుంచీ గౌహతి చేరుకుని మమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకుని హోటల్‌కి తీసుకుని వెళ్ళారు.

మరునాడు అంటే 23 ఫిబ్రవరి ఉదయం 6 గంటలకే బయలుదేరి కామాఖ్య అమ్మవారి గుడికి వెళ్ళాము.

శక్తి స్వరూపిణి వెలసిన అత్యంత శక్తి వంతమైన క్షేత్రము. శక్తి పీఠాలలో ముఖ్యమైనది. గౌహతిలో వున్న నీలాచల్ కొండల్లో బ్రహ్మపుత్రా నది ఒడ్డున కామాఖ్య అమ్మవారి ఆలయం వుంది. 1565 ప్రాంతాల్లో నిర్మించబడినదని అంటారు.

దక్షయజ్ఞంలో దక్షుడు శివునికి చేసిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అగ్నికి ఆహుతి ఐపోతుంది. ఆ బాధ తట్టుకోలేక శివుడు సతీదేవి దేహాన్ని పట్టుకుని తిరుగుతూ వుంటాడు. ఇది చూసిన విష్ణుమూర్తి శివుని దృష్టి మరల్చడం కోసం తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. అలా చేసినప్పుడు సతీదేవి దేహభాగాలన్నీ చాలా చోట్ల పడ్డాయిట.

అమ్మవారి యోని భాగం ఇక్కడ గౌహతిలో నీలాచల్ కొండలలో పడిందని అంటారు. అమ్మవారి విగ్రహం వుండదు ఇక్కడ. శిలారూపంలో యోని ముద్రలో పూజలు అందుకుంటారు. ఆ రాతిలోనే కామాఖ్యాదేవి కొలువై వుంటారు. ఆ రాతి స్థలాన్ని ఎప్పుడూ వస్త్రంతో, పువ్వులతో, కప్పివుంచుతారు.

ఇది దర్శించాలంటే చిన్న గుహలో మెట్లు దిగి కిందకు వెళ్ళాలి. అమ్మవారు వుండే రాతి శిల మీద అన్నీ కప్పి ఉంచుతారు, మనకు ఏమి కనిపించదు. ఆ శిల కిందనుంచీ నీరు ప్రవహిస్తూ వుంటుంది. అది మనకి తీర్థంగా ఇస్తారు. అమ్మవారు వెనకాల లక్ష్మీ, సరస్వతీ విగ్రహలు వున్నాయి.

ప్రధాన గోపురంపై బంగారు కలశం వుంది. గుడి పక్కనే చిన్న కోనేరు, ఆదిశంకరాచార్యుల విగ్రహం, పెద్ద త్రిశూలం వున్నాయి.

ఇక్కడ తాంత్రిక పూజలు గూడా జరుగుతూ వుంటాయిట. మేకలను బలిఇస్తూ వుంటారు.

ప్రతీ ఏడాది ఆషాడమాసంలో 5 రోజులపాటు ‘అంబు బాచి’ అనే మేళా చాలా వైభవంగా చేస్తారు.

ఇక్కడ శివుడు ఉమానంద భైరవుడిగా పూజలు అందుకుంటున్నారు.

అమ్మవారి దర్శనం తరువాత మేఘాలయ లోని షిల్లాంగ్‌కి బయలుదేరాము.

షిల్లాంగ్‌కి 15 కిలోమీటర్ల దూరంలో బారాపానీ అని పిలవబడే ఉమియం సరస్సు దగ్గర ఆగాము. 1960లో ఉమియం నది మీద జలవిద్యుత్ అనకట్ట కట్టడం వల్ల ఏర్పడిన పెద్ద సరస్సు ఇది. వాటర్ స్పోర్ట్స్, బోట్ రైడ్స్ చాలా బాగున్నాయి. సరస్సు చుట్టూ పచ్చదనంతో కూడిన ఖాసీ కొండలు చూస్తూ సరస్సులో బోట్లో తిరగడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నీళ్ళు నీలం రంగులో వుంటాయి. అందుకే దీన్ని కొంతమంది నీలి సరస్సు అని గూడా అంటారు.

ఇది చూసాకా షిల్లాంగ్ కి వెళ్లి రాత్రి అక్కడ వున్నాము.

***.

రెండవ రోజు ఉదయాన్నే లేచి బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకుని షిల్లాంగ్ నుంచీ మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాము. షిల్లాంగ్ నుంచీ రెండు గంటలు ప్రయాణం చేసి మావ్లినాంగ్ అనే గ్రామం చేరుకున్నాము. ఈ గ్రామం ప్రాముఖ్యత ఏమిటంటే ఇది ఆసియాలోనే అతి పరిశుభ్రమైన గ్రామం. ఇక్కడ ప్రజలు 90 శాతం మంది చదువుకున్నవారే. పిల్లలూ, పెద్దలూ, అందరూ కలసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. ఎక్కడికక్కడ వెదురుతో చేసిన డస్ట్‌బిన్లు వుంచారు. ఇది దేవుని సొంత ఉద్యానవనం అని రాసి వుంటుంది.

ఇంకో ముఖ్య ఆకర్షణ sky view point. అక్కడనుంచి చూస్తే చుట్టూ పచ్చని అడవి, దూరంగా ఆకాశం భూమి కలసిపోయిట్టుగా ఓ నది కనిపిస్తూ వుంటుంది. అది మనకి బంగ్లాదేశ్‌కి సరిహద్దులో వున్న నది.

చూడటానికి చాలా బాగుంది. కానీ అక్కడకి చేరాలంటే చాలా ఎత్తెన వెదురు వంతెన ఎక్కాలి.

అక్కడ భోజనం చేసి మరో ఆకర్షణ అయిన రూట్ బ్రిడ్జి చూడటానికి వెళ్ళాము.

ఈ రూట్ బ్రిడ్జి ప్రాముఖ్యత ఏమిటంటే నదికి ఇరువైపులా ఫికస్ ఎలాస్టికా అనే జాతికి సంబంధించిన రబ్బరు మొక్కలు నాటుతారుట. మేము చూసిన బ్రిడ్జికి సంబందించిన మొక్కలు సుమారుగా 1840లో నాటినవని అక్కడ బోర్డు వుంది. ఈ బ్రిడ్జి సుమారు 30 మీటర్లు వుంది. ఈ మొక్కల వేళ్ళు భూమిలోకి చొచ్చుకుపోయి గట్టిగా తయారవుతాయి. అప్పుడు ఖాసీ తెగకు చెందినవారు ఆ వేళ్లను అటూ ఇటూ వంతెనలా పెనవేస్తారుట. ఇప్పటికీ నదులు దాటడానికి ఎక్కువగా ఇవే ఉపయోగిస్తారు.

ఆ రూట్ బ్రిడ్జి చూడటానికి మేము గూడా సుమారుగా 50 మెట్లు కిందకి దిగి చూసాము. ఆ మెట్లు దిగడం చాలా కష్టం. కానీ ఒక్కసారి ఆ బ్రిడ్జి చూసాకా అంతా మర్చిపోయాం.

చుట్టూ కొండలూ, చెట్లూ, కింద నది, మధ్యలో వేలాడే బ్రిడ్జి. మంచి అనుభవాన్ని మిగిల్చింది.

ఇది చూసాకా డ్వాకీ నది చూడటానికి వెళ్ళాము. ఈ నది మనకూ, బంగ్లాదేశ్‌కూ మధ్య ప్రవహిస్తోంది. అక్కడ ఇరుదేశాల జండాలూ వున్నాయి. ఈ నదిలో నీళ్ళు ఎంత పారదర్శకంగా వుంటాయి అంటే లోపల రాళ్ళు మనకి స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ నదిలో పడవ ప్రయాణం మర్చిపోలేము.

ఇది పూర్తి చేసుకుని మళ్ళీ షిల్లాంగ్‌కి బయలుదేరాము.

***

మూడవరోజు పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ తరువాత షిల్లాంగ్ లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన పెద్ద చర్చికి వెళ్ళాము. చర్చి అంతా sky blue కలర్లో వుంటుంది. చుట్టూ మొక్కలతో చాలా ప్రశాంతంగా వుంది.

ఇక్కడనుండి చిరపుంజికి బయలుదేరాము. సుమారు 55 కిలోమీటర్లు దూరం.

మామూలుగా మనం చిన్నప్పటి నుంచీ అత్యధిక వర్షపాతం చిరపుంజిలోనే అని చదువుకుని ఉంటాం కదా! కానీ వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు అక్కడ గూడా వర్షం పడటం లేదు. అందుకే చిరపుంజిలో

అతి ముఖ్యమైన సెవెన్ సిస్టర్స్ జలపాతాలు కొంచం గూడా లేవు. పూర్తిగా ఎండిపోయాయి. అది చూసి మాకు కాస్త నిరాశ అనిపించింది.

చిరపుంజీలోనే నోహ్కలికై అనే జలపాతం చూసాం. మన దేశంలోనే పొడవైన జలపాతం. సుమారు 1,115 అడుగులు వుంటుంది.

లికై అనే మహిళ తన కూతురిని భర్త చంపెయ్యడంతో ఆ బాధతో ఈ జలపాతం పైనుంచీ దూకేసిందిట. అప్పటినుంచీ ఈ జలపాతాన్ని ఆమె పేరున పిలుస్తారుట.

ఈ జలపాతం చివర గ్రీన్ కలర్లో చిన్న పూల్ ఏర్పడింది. చూడటానికి చాలా బాగుంది.

Eco park గూడా చూసాము. ఇక్కడనుండి బంగ్లాదేశ్ కొంచం కనిపిస్తుంది తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇవన్నీ వర్షాలు ఉంటేనే బాగుంటాయి.

ఇంకా చివరగా Mawsmai Caves కి వెళ్లాం. ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. సుమారు 150 మీటర్ల పొడుగు వున్నాయి. లోపల కొంచం నడవాలి, కొంచం పాకాలి. ఏదో కొంచం సాహసంగా అనిపించింది. మొత్తానికి పూర్తి చేసాం. వర్షాలు లేకపోవడంతో జలపాతాలు ఏవీ లేక ఈరోజు కొంచం నిరుత్సాహంగా సాగింది ప్రయాణం.

అక్కడనుంచీ 5 గంటలు ప్రయాణం చేసి గౌహతి చేరుకున్నాం.

***

నాలుగవ రోజు గౌహతిలో బ్రేక్‌ఫాస్ట్ చేసి తవాంగ్‌కి బయలుదేరాము. 14 గంటలు ప్రయాణ సమయం. అంత ప్రయాణం ఒకేసారి చెయ్యడం కష్టం అనిపించి మధ్యలో బోమ్డిలా అనే వూరిలో రాత్రి వుండి, మళ్ళీ పొద్దున్నే తవాంగ్ బయలుదేరాము.

బోమ్డిలాకి వెళ్ళడానికి అరుణాచలప్రదేశ్ లోకి ప్రవేశించగానే ట్రిపి Orchid Centre దగ్గర ఆగాము. Kameng నది పక్కనే వుంది.

ఇది మనదేశంలోనే ముఖ్యమైన orchid centre. ఇక్కడ వందల రకాల orchids వున్నాయి. Asian ladies slipper orchid అనేది చాలా ప్రత్యేకమైనదిట. నవంబరు నుంచి మార్చి మధ్య లోనే పూస్తుంది. Wild life act కిందకు వస్తుంది ఈ orchid. అంత ప్రొటెక్షన్ ఈ మొక్కకు.

Fox tail orchid. ఇది అరుణాచలప్రదేశ్‍కి రాష్ట్ర పుష్పం. అస్సాం రాష్ట్రానికి కూడా అధికారిక పుష్పం.

Bamboo orchid. ఇది 3మీ మీటర్లు పెరిగి చివర పింక్ రంగులో పువ్వు పూస్తుంది.

ఇలా చాలా రకాల orchids వున్నాయి. కొన్ని మేము వెళ్ళినప్పుడు కనిపించలేదు.

తవాంగ్ కి వెళ్ళే దారిలో చాలా Buddhist Monasteries కనిపిస్తాయి.

అన్నీ చోట్లా ఎక్కువగా చెక్క వంతెనలే కనిపించాయి.

రాత్రికి బోమ్డిలాలో బస చేసాము.

***

ఐదవరోజు బోమ్డిలా నుంచీ తవాంగ్‍కి బయలుదేరాము. ఐదు, ఆరు, రోజుల ప్రయాణం గురించి రాసేముందు BRO గురించి తప్పక తెలుసుకోవాలి.

Borders & Roads Organisation – ఈ సంస్థ1960లో ఏర్పడింది. దేశ సరిహద్దుల్లో రోడ్లు, సొరంగాలు, హెలీపాడ్స్, అన్నీ ఈ సంస్థే నిర్మిస్తుంది. కొండ చరియలు విరిగిపడినా, మంచుతో రోడ్లు మూసుకుపోయినా వీళ్ళే మార్గం సుగమం చేస్తూ వుంటారు. మనం ప్రయాణం చేసే దారి పొడుగునా మనం అలెర్ట్‌గా వుండటానికి మంచి slogans రాస్తారు. వీళ్ళ సహకారం లేనిదే ప్రయాణం చేయలేము.

ముందుగా రైఫెల్ మెన్ జస్వంత్ సింగ్ రావత్ war memorial చూసాము.

ఈయన 1941లో జన్మించారు. 1962లో వచ్చిన ఇండో – చైనా యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అంటే కేవలం 21 సంవత్సరాలు మాత్రమే జీవించారు.

ఒకానొక సమయంలో చేతిలో పెద్దగా ఆయుధాలు లేకపోయినా స్థానిక అమ్మాయిలు సేలా, నూరా అనే వారి సాయంతో మరింత ముందుకువెళ్లి 72 గంటలపాటు చైనా సైన్యాన్ని నిలువరించారు. పోరాటంలో జస్వంత్ సింగ్ రావత్, సేలా, ఇద్దరూ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. నూరా చైనా సైన్యానికి పట్టుబడిపోయింది.

ఈయన జ్ఞాపకార్థం కట్టించిన గుడి లాంటిది ఈ war memorial. మరణానంతరం ఈయనకు మహా వీర చక్ర ప్రదానం చేసింది భారత ప్రభుత్వం. మన జాతీయ గీతం పాడి అక్కడ నుంచీ సేలా పాస్‌కి బయలుదేరాము.

సేలా పాస్ అనేది అరుణాచలప్రదేశ్‌లో తవాంగ్‌లో ఒక ఎత్తైన మంచు పర్వత మార్గం.

ఈ మార్గం ద్వారానే తవాంగ్ భారతదేశంలోని అన్ని మార్గాలకు కలపబడుతుంది. 1962 ఇండో చైనా యుద్ధంలో జస్వంత్ సింగ్ రావత్‌కు సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయింది సేలా అనే అమ్మాయి. ఆమె పేరు మీదనే ఈ ప్రాంతానికి సేలా పాస్ అని పేరు పెట్టారు.

సముద్ర మట్టానికి 13,700 అడుగుల ఎత్తులో వుంది. ఎప్పుడూ మంచుతో కప్పబడి వుంటుంది. చిన్న సరస్సు గూడా వుంది. కానీ మంచుతో గడ్డకట్టుకు పోయింది. ఆక్సిజన్ సమస్య వున్నవాళ్ళు ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. దీనినే paradise Lake అని గూడా అంటారు.

మేము సుమారుగా గంట సమయం గడిపాము. మంచు మూసేసిన పర్వతాలు, వంపులు తిరిగే రోడ్లు, కనుచూపుమేర అంతా తెల్లటి మంచు, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ సుందర దృశ్యాన్ని మనసుతో క్లిక్ మనిపించాలి. జీవితాంతం గుర్తుండి పోతుంది.

సేలా పాస్ నుంచీ నూరా నాంగ్ జలపాతానికి వెళ్ళాము. దీనినే జంగ్ జలపాతం అని గూడా అంటారు. 1962 ఇండో చైనాయుద్ధంలో జస్వంత్ సింగ్ రావత్ కు సహాయం చేస్తూ చైనా సైన్యానికి పట్టిబడిపోయిన నూరా నాంగ్ అనే అమ్మాయి పేరు ఈ జలపాతానికి పెట్టారు.

ఇది 100మీటర్ల ఎత్తునుంచి పడుతో వుంటుంది. పైనుంచీ రాళ్ళమధ్య పడుతూ కింద తవాంగ్ నదిలో కలుస్తూ వుంటుంది. చూడటానికి చాలా బాగుంది. కానీ జలపాతం దగ్గరకు రావడానికి చాలా మెట్లు దిగాలి. ఇది కొంచం కష్టం అనిపించింది. ఒక్కసారి దిగాకా చుట్టూ పచ్చటి కొండలూ, పక్కన నదీ, పైనుంచీ జలపాతం మరింకేం కావాలి. చాలు అనిపించింది.

***

ఆరవ రోజు ఉదయాన్నే తవాంగ్ నుంచీ బూమ్లా పాస్ చూడటానికి బయలుదేరాం. తవాంగ్ నుంచీ 37 కిలోమీటర్లు దూరం.

మేము రోజూ ప్రయాణం చేసే బస్సు అక్కడకు అనుమతించలేదు. బూమ్ల పాస్ చూడటానికి అక్కడ లోకల్‌గా వుండే కారు లోనే వెళ్ళాలి. 1962లో జరిగిన ఇండో చైనా యుద్ధంలో ఈ బూమ్లా పాస్‌లో జరిగిన యుద్ధం చాలా భయంకరమైనది. యుద్ధంలో చైనా బూమ్లా పాస్ లోకి ముందు చొచ్చుకు వచ్చినా, తరువాత వెనక్కి వెళ్లిపోయారు. చైనాకు మనకు సరిహద్దు ప్రాంతం. ఇక్కడ చర్చలు జరుగుతూ వుంటాయిట.

మేము తవాంగ్ నుంచీ ఓ 10 కిలోమీటర్లు ముందుకు వచ్చేటప్పటికి మంచు కురవడం మొదలైంది. టెంపరేచర్ -1°C వుంది. మా ముందు ఆర్మీ వెహికల్స్ మంచులో దిగబడిపోయాయి. దాంతో అంత మంచులో గూడా ట్రాఫిక్ జామ్.

మంచు గూడా బాగా పడుతుందడంతో మమ్మల్నీ అందరినీ వెనక్కి పంపించేసారు.

బూమ్లా పాస్ చూడలేక పోయాంగానీ మంచు బాగా కురియడంతో మొక్కలూ, ఇళ్ళూ అన్నీ తెల్లటి మంచు దుప్పటి కప్పేసుకుని చక్కటి చల్లని అనుభూతిని మిగిల్చాయి. ఏదైనా మన మంచికే. ముందుకు వెడితే వెనక్కి రావడం చాలా కష్టం అయ్యేది.

వెనక్కి వచ్చేసి భోజనం చేసి మన దేశంలోనే అతి పెద్దదైన Buddhist monastery చూడటానికి వెళ్ళాము. 2017లో దలైలామా తవాంగ్ monastery కి వచ్చారుట. బుద్ధుని విగ్రహం చాలా ప్రశాంతంగా వుంటుంది.

1962 ఇండో చైనా యుద్ధ సమయంలో చైనా వాళ్ళు 6 నెలల పాటు ఈ monastery ని తమ ఆధీనంలో వుంచుకున్నారుట.

Monastery పైనా చాలా ఎత్తుగా బుద్ధుని విగ్రహం వుంటుంది. వూరిలో ఎక్కడ నుంచైనా కనిపిస్తుంది.

అక్కడ నుంచీ తవాంగ్ వార్ మెమోరియల్ చూడటానికి వెళ్ళాము.

1962 ఇండో చైనా యుద్ధ సమయంలో చైనా బూమ్లా పాస్ ఆక్రమించడానికి చాలా ముందుకు వచ్చింది. కమెంగ్ పరిధిలో ఈ యుద్ధంలో 2,140 మంది తమ ప్రాణాలు దేశం కోసం విడిచారు. ఆ వీరుల జ్ఞాపకార్థం ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. వారందరి పేర్లు లోపల రాసి వుంటాయి.

సుబేదార్ జోగేందర్ సింగ్ యుద్ధంలో గాయపడినా గూడా ధైర్యంగా ముందువుండి 72 గంటలపాటు వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారు. గుర్తుగా ఆయన విగ్రహం వుంటుంది.

అమరవీరుల పట్ల గౌరవంగా భారత సైన్యం ఈ వార్ మెమోరియల్ నిర్మించింది. లోపల మన సైనికులు అప్పుడు వాడిన వస్తువులు అన్నీ వున్నాయి.

యుద్ధ సంఘటనలు వివరించే లైట్ అండ్ సౌండ్ షో గూడా వుంది. తవాంగ్ చరిత్రను చెప్పే మ్యూజియం గూడా వుంది.

2024లో డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తవాంగ్ వచ్చి ఇక్కడ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చూడటానికి చాలా బాగుంటుంది.

మనం జీవితాంతం అమరవీరుల త్యాగాలు గుర్తుంచుకావాలి. అవన్నీ చూసాకా మనసంతా చాలా భారమైపోయింది.

***

ఏడవ రోజున ఉదయాన్నే దిరాంగ్ లోఉన్న ముఖ్యమైన Thup Sung Dhargye Long Gompa అనే monastery చూసాము. ఈ పేరు దలైలామా పెట్టారుట. చూడటానికి చాలా విశాలంగా వుండి, లోపల గోడలపై చక్కటి బొమ్మలు చిత్రీకరించబడి వున్నాయి. బుద్ధుని, దలైలామాల విగ్రహాలు కన్నుల పండుగలా వున్నాయి. చుట్టూ కొండలూ, లోయలూ, ధ్యానం చేసుకోవడానికి చాలా బాగుంది.

తరువాత kiwi, apple gardens చూద్దాం అనుకున్నాం గానీ సీజన్ కాకపోవడంతో, అవి ఎండిపోయాయి.

అక్కడనుండి దిరాంగ్ నది చూసాము. ఇక్కడ home stay చేసినా, కాంపింగ్ చేసినా హాయిగా వుంటుంది.

అక్కడ నుంచీ హోటల్‌కి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాం. మర్నాదు ఉదయం కాజీరంగాకు ప్రయాణం.

***

ఎనిమిదవ రోజు ఉదయాన్నే దిరాంగ్ నుంచీ కాజీరంగా నేషనల్ పార్క్‌కి బయలుదేరాము.

మధ్యలో Tenga War Museum దగ్గర ఆగాము. దీనినే Ball of Fire Museum అని గూడా అంటారు.

మన సైనికులు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు ఆర్పించే ముఖ్యమైన స్థలం. ఇందులో మూడు విభాగాలు వున్నాయి. సాయుధ దళాల ధైర్య సాహసాల చిత్రాలు, యుద్ధ సమయంలో వారి కథలు ఎన్ని ఉన్నాయో చెప్పలేము. సైనికులు వారి కుటుంబాలకు రాసిన ఉత్తరాలు చదువుతుంటే కన్నీరు ఆగదు.

1962 యుద్ధ సమయానికే చైనా దగ్గర ఆధునిక ఆయుధ సంపత్తి వుండేది. మన దగ్గర సైన్యం తక్కువ. ఆయుధాలు తక్కువ. అయినా సరే మనో ధైర్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారు. Battle of Namka chu, Battle of Bumlaa, Battle of jaswanth ghar, ఈ యుద్దాలలో చాలా మంది అమరులు అయ్యారు. ఇదంతా documentary వేసి చూపించారు. ఏదో తెలియని బాధ గుండెల్ని పిండేసింది.

ఇది చూసాకా ఇక్కడ నుంచీ కాజీరంగా National orchid park కి వెళ్ళాము. సాయంత్రం ఐపోయింది. ఇక్కడ అస్సాం ప్రజల సాంస్కృతిక కార్యక్రమాలు చూసాము. చాలా బాగా చేసారు.

ఇక్కడ నుంచీ హోటల్‍కి వెళ్ళాము.

***

తొమ్మిదవ రోజున కాజీరంగా నేషనల్ పార్క్ చూడటానికి వెళ్ళాం. అందులో తిరగడానికి టాప్ లెస్ జీపులు వుంటాయి. వాటిలో ఎక్కాము.

ప్రపంచంలోనే ఎక్కువ ఖడ్గమృగాలు వుండే ప్రదేశం. సుమారుగా 2000 పైనే వున్నాయిట. ఇందులో ఇవేకాక అడవిదున్నలూ, ఏనుగులూ, జింకలూ, ఎక్కువగా వున్నాయి. దూరం నుంచీ ఖడ్గమృగాలు బానే కనిపించాయి. అడవి ఏనుగులను, జింకల్ని కొంచం దగ్గర్నుంచీ చూసాం.

ఇక్కడ బాగా పొడవుగా వుండే గడ్డి పెరుగుతుంది. కొన్ని రోజులకు దాన్ని కాల్చేస్తారుట. వాటికి మళ్ళీ చిగురులు వస్తాయి కదా, అప్పుడు అవి తినడానికి ఎక్కువ జంతువులు బయటకు వస్తాయిట. మా గైడ్ చెప్పాడు.

లోపల చాలా చిన్న చిన్న నదీ పాయలు వున్నాయి. బ్రహ్మపుత్రా నదికి వరదలు వస్తే పాపం జంతువులకు ఇబ్బందే.

ఆశించినట్టుగా ఖడ్గమృగాలు కనిపించక పోయినా, అడవిలో టాప్ లెస్ జీపులో ప్రయాణం చేయడం మంచి అనుభూతిని ఇచ్చింది.

ఇది చూసాకా వశిష్ఠ ఆశ్రమానికి వచ్చాము. 1764 ప్రాంతాల్లో నిర్మించారుట. ఆలయం వుండి అందులో చిన్న గుహలా వుంది. అక్కడే వశిష్ఠ మహర్షి తపస్సు చేసుకున్నారుట.

పక్కనే శివలింగం గూడా వుంది. గుడి పక్కనే చిన్న నది పారుతూ వుంటుంది. దాన్ని వశిష్ఠ గంగా అంటారు. అమ్మవారు, వినాయకుని ఆలయాలు గూడా వున్నాయి.

కోతులు విపరీతంగా వున్నాయి. చాలా జాగ్రత్తగా వుండాలి.

ఇక్కడనుండి బ్రహ్మపుత్రా నదిలో క్రూజ్‌లో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్ళాము.

మూడు అంతస్తుల చిన్న ఓడ. భోజనం ఆటలూ, పాటలూ, అన్నీ అందులోనే.

నెమ్మదిగా నదిలో రెండు గంటలు తిప్పారు. మా గ్రూప్ లోని ఆడవాళ్ళం అందరం పాటలకు తగ్గట్టుగా డ్యాన్సులు చేసి బాగా ఎంజాయ్ చేసాం. మంచి గుర్తుగా వుండిపోయింది.

మళ్ళీ రాత్రి హోటల్‌కి వెళ్లిపోయాం.

***

ఈ రోజు మా ప్రయాణంలో ఆఖరిరోజు. బ్రహ్మపుత్రా నదిలో స్నానం చెయ్యాలని ముందు నుంచీ అనుకుంటున్నాం. కానీ కుదురుతుందా లేదా అనిపించేది. మొత్తానికి సాధించాం.

ఉదయాన్నే 5 గంటలకే బయలుదేరి వెళ్లి బ్రహ్మపుత్రా నదిలో స్నానం చేసి దీపాలు వదిలి వచ్చాము. చాలా తృప్తిగా అనిపించింది.

బ్రహ్మపుత్రానది మానస సరోవరం దగ్గర కైలాస పర్వత హిమనదాల్లో పుట్టి టిబెట్ గుండా అరుణాచల ప్రదేశ్ లో ప్రవేశించి అస్సాం, బంగ్లాదేశ్ లలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుందిట.

మామూలుగా అన్ని నదులకూ ఆడవాళ్ళ పేర్లు వుంటాయి. ఈ నదికే మగవాళ్ళ పేరు. బ్రహ్మ యొక్క పుత్రుడుగా చెబుతారు.

ప్రపంచంలోని పెద్ద నదులలో ఇది ఒకటి బ్రహ్మపుత్రలో స్నానం చెయ్యడం మా అదృష్టం.

తరువాత బ్రహ్మపుత్రా నది మధ్యలో వున్న ఉమానందస్వామి ఆలయానికి వెళ్ళాము. ఈ గుడికి వెళ్ళడానికి పడవ ఎక్కి వెళ్ళాలి. పడవ దిగాకా సుమారు 50 మెట్లు ఎక్కాలి. అప్పుడు చిన్న గుహ లోపల శివుడు దర్శనం ఇస్తారు. ఇక్కడ శివుడు పార్వతీదేవితో కలసి ఆనందంగా వుంటారు కాబట్టి ఇది ఉమానంద ఆలయం అయ్యింది. ఈ గుడి వున్న కొండను భస్మాచల అని పిలుస్తారు. మన్మథుడిని శివుడు భస్మం చేసిన చోటు అని గూడా చెబుతారు.

ఈ ద్వీపం పురివిప్పిన నెమలిలా వుంటుంది చూడటానికి. అందుకే దీనిని పీకాక్ ఐలాండ్ అని గూడా అంటారు.

ఇది చూసేసాకా ఆఖరున నవగ్రహాల గుడికి వెళ్ళాము. ఇది చాలా పురాతనమైన గుడి. 18వ శతాబ్దంలో నిర్మించారుట. ఆలయం లోపల 9 శివలింగాలు వున్నాయి. ప్రతీ శివలింగం పైనా ఒక్కో రంగు వస్త్రం కప్పారు. మధ్యలో లింగం సూర్యుడికి ప్రతీక. ప్రతి రోజూ నవగ్రహ పూజలు జరుగుతూ వుంటాయి.

ఇది చూడడంతో మా యాత్ర పూర్తి అయ్యింది.

అందరం భోజనం చేసి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి, హైదరాబాద్ చేరుకున్నాము.

Exit mobile version