[‘మూడు దేశాలు – మూడు నవలలు – ముగ్గురు రచయిత్రులు’ అనే రచనని అందిస్తున్నారు కృష్ణచైతన్య.]
ఆంగ్ల రచయితల పుస్తకాలు చదువుతూ తెలుగు సాహిత్య ప్రపంచంలో సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తూంటే, గమ్మత్తుగా అనిపిస్తుంది. తెలుగు రచయితలు తామున్న కొమ్మని నరుక్కునే వారిలా అనిపిస్తారు. తామున్న దేశాన్ని, సమాజాన్ని ద్వేషించటంలో వారికి ఆనందం, సంతృప్తులు అధికంగా కలుగుతాయన్న భావన వారి రచనలు, ప్రవర్తనలు, ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియాల్లో వారు వెలిబుచ్చే అభిప్రాయాలు కలిగిస్తాయి. తమ సమాజాన్ని దూషించటం, తక్కువ చేయటం, హేళన చేయటం వారికి అహాన్ని సంతృప్తిపరచే చర్య అనిపిస్తుంది. ఎక్కడయినా ఒక అనుచిత చర్య జరిగితే ఆ చర్యను సమస్త దేశానికి ఆపాదించి, దేశమంతా ఉచ్చల సముద్ర తరంగాలతో పరవళ్ళు త్రొక్కుతోందని ప్రదర్శించాలన్న ఆత్రం, అహం, సృజనాత్మక దౌష్ట్యాలు, ఆశ్యర్యం, అసహ్యం, జాలి భావనలు కలిగిస్తాయి.
ఇదే సమయానికి ఇటీవలె ఆంగ్లంలో వచ్చిన రచనలు చదివితే, తమ దేశాల్లోని పరిస్థితులను వారు తీర్పు చెప్పుతున్నట్లు కాక, వాటిని అవగాహన చేసుకుంటూ, సానుభూతితో అర్థం చేసుకుంటూ, ప్రపంచ పరిణామ క్రమంలో సంభవించే సంఘటనలు ప్రదర్శించటం కనిపిస్తుంది. వారి రచనల్లో ద్వేషం కానీ, చులకన, హేళనలు కానీ, తమ దేశాలపట్ల, సమాజాల పట్ల, సాంప్రదాయాలపట్ల అగౌరవపుటాలోచనలు కానీ కనబడవు. అయితే, వారి రచనల నేపథ్యం దేశంలో జరుగుతున్న సంఘటనలు, ప్రపంచ రాజకీయాలున్నా, వాటి చుట్టూ ఒక అందమైన చక్కని ఆసక్తికరమైన ప్రేమకథ అల్లుతారు. అంటే, రచనను అత్యంత ఆసక్తికరంగా రూపొందిస్తారు. నేపథ్యంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులను కథలో అంతర్భాగం చేసారు. దాంతో, కథ, నేపథ్యం పడుగులో పేకల్లాగా అల్లుకుపోయి విడదీయరానివవుతాయి. రచనను చదవటం ఒక విజ్ఞానమయమయిన అనుభవంలా ఎదుగుతుంది. ఎందుకంటే, మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు, అవి సామాన్యులపై చూపిస్తున్న ప్రభావాలు ఎదకు హత్తుకుపోతాయి కాబట్టి. ఇలాంటి రచనలకు ఉదాహరణగా ఎన్నో చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతానికి మూడు విభిన్నమైన రచనలను ఉదాహరణలుగా ఎంచుకోవచ్చు.
ఈ మూడు రచనలు, మూడు దేశాలలోని సంక్లిష్టమైన సందిగ్ధ సమయాన్ని ప్రదర్శిస్తాయి. అంతర్జాతీయ రాజకీయాలటలలో పావులయి అల్లకల్లోలమైన దేశాల అంతర్గత పరిస్థితులను చూపిస్తాయి. తమ ప్రమేయం లేకుండానే, ఆ అల్లకల్లోలాల ప్రభావంతో దశ దిశ మారిన సామాన్యుల జీవితాలను ప్రదర్శిస్తాయి. అలాగని ఆర్ట్ సినిమాల్లాగా, గంభీరంగా సాగవు. అత్యంత ఆసక్తిని కలిగిస్తూ, సున్నితమైన భావాలను రగిలిస్తూ, ఆహ్లాదం కలిగిస్తూ, ఆలోచింపచేస్తూ, ఉత్కంఠ భరితంగా సాగుతాయి. ఆరంభించినప్పటి నుంచి పూర్తయ్యే వరకూ నిలవనివ్వవు.
ఇందులో ఒక రచన ఇరాన్‌లో ప్రజాస్వామ్యం స్థానాన్ని ఇరాన్ షాహ్ నియంతృత్వ ప్రభుత్వం ఆక్రమించిన కాలం కేంద్రంగా సాగుతుంది. మరో నవల అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ప్రాపుతో నిలచిన నిస్సహాయ అహ్మద్ కర్జాయ్ ప్రభుత్వపు ఆఖరి రోజులు నేపథ్యంగా సాగుతుంది. మూడో నవల సిరియాలో అసద్‌కూ రెబెల్స్‌కూ నడుమ జరిగే పోరువల్ల ప్రాణాలు అరచేత పట్టుకుని సిరియన్లు ఇంగ్లండ్‌కు అక్రమంగా వలసవెళ్ళటాన్ని చూపుతుంది. ఈ మూడు నవలలు చదవటం ఒక అద్భుతమైన అనుభవం.
ఈ నవల ఒక సినిమా కథలా అనిపిస్తుంది. దీన్ని ఆధారం చేసుకుని చక్కని సినిమా సులభంగా తీయవచ్చు. నవల 2013లో అమెరికాలో ఆరంభమవుతుంది. కథానాయిక రోయా దృక్కోణంలో, ఉత్తమ పురుషలో కథ సాగుతుంది. ఒకప్పటి తన ప్రేమికుడు ఆస్పత్రిలో వుంటే అతడిని చూసేందుకు భర్తతో బయలుదేరుతుంది రోయా. ఆమె భర్త ఆస్పత్రిముందు వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పటికే ఆమె ఆస్పత్రిలో వున్నతడిని ప్రేమించిందని, కానీ, ఆయన ఎక్కడో కలుస్తానని రాలేదని, మోసం చేశాడని , దాంతో ఆమె అమెరికా వచ్చేసిందని, ఇక్కడ ఇంకొకరిని వివాహమాడిందని మనకు మొదటి అధ్యాయం పూర్తయి ఫ్లాష్‌బాక్ ఆరంభమయ్యేసరికి అర్థమవుతుంది.
ఫ్లాష్‌బాక్ పూర్తిగా ఒక రొమాంటిక్ సినిమా చూస్తున్న ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అబ్బాయి, అమ్మాయి, స్టేషనరీ దుకాణంలో కలవటం, ఒకరి వైపు ఒకరు ఆకర్షితులవటం, వారి ప్రేమ పెరగటం, ఆ అబ్బాయి అప్పటి ఇరాన్ ప్రధాని మొస్సదేఘ్ సమర్థకుడవటం వంటి విషయాలు ఆసక్తికరంగా సాగుతాయి. ఈ విషయాలు తెలిపిన పద్ధతి చక్కగా వుంటుంది. ఏదీ తిన్నగా చెప్పకుండా, సంఘటనల ద్వారా, సంభాషణల ద్వారా తెలుస్తూండటం, అన్నీ అమ్మాయి దృష్టిలో కావటం పఠనాన్ని ఆసక్తికరం చేస్తుంది. అంతే కాదు, ఆ అబ్బాయి ద్వారా ఆమెకు అనేక రాజకీయ విషయాలు తెలుస్తాయి. ఆమెకు ఈ విషయాలు తెలుస్తున్న సమయానికి పాఠకుడికి కూడా, ఆ కాలం నాటి ఇరాన్ రాజకీయ, సామాజిక స్థితిగతులు తెలుస్తాయి. ఎలాంటి శక్తులు ఇరాన్ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తున్నాయో తెలుస్తుంది. అంతే కాదు, వివిధ పాత్రల ద్వారా, ఇరాన్ సామాజిక వ్యవస్థలోని వివక్షతలు, అపోహలు, సంఘర్షణలని ప్రదర్శిస్తుంది రచయిత్రి. అయితే ఎక్కడ కూడా రచయిత్రి సమాజంపై, కట్టుబాట్లపై, రాజకీయాలపై తీర్పు చెప్పదు. విషయాలను చెప్తుంది. ప్రధాన పాత్ర మనోభావాలను, ఆలోచనలను తెలుపుతుంది.
రచయిత్రి రచన పధ్ధతి ఎంత ఆసక్తికరంగా వుంటుందంటే, నాయికానాయకులు దగ్గరవుతున్నకొద్దీ పాఠకుడికి వీళ్ళు ఎలా వేరవుతారు, వేరయితే పాత్రలు భరించగలవా? అన్న ఆందోళన కలుగుతుంది. దాంతో నిజంగా, షాహ్ అధికారానికి రావటం, ప్రేమికులు విడిపోవటం ఊహించినవే అయినా పాత్రల ఆవేదనలతో పాఠకుడు మమేకమవుతాడు. ఈ సందర్భంలో గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, ఇరాన్ మత కట్టుబాట్లను, ఆచార వ్యవహారలనూ రచయిత్రి చక్కగా, సానుభూతితో, ఒకింత గర్వంతో ప్రదర్శిస్తుంది. ఆయా ఆచార వ్యవహారాలను కించపరచటమో, దూషించటమో, తక్కువచేసి వ్యాఖ్యానించటమో అస్సలు కనబడదు. పాఠకుడికి వారి పద్ధతులు తెలుస్తాయి.
ఇద్దరి ఎంగేజ్‌మెంట్ అయి, ప్రభుత్వం మారటంతో కథ దిశ కూడా మారుతుంది. సంఘటనలు వేగంగా సాగుతాయి. ప్రేమికులు వేరయిపోతారు. వారు వేరవటం వెనుకదాగిన రహస్యం తెలుసుకోవటం, ప్రేమికుల అపోహలు దూరమవటం కథ. నవల సినిమాటిక్‌గా వున్నా, రచించిన విధానం, పాత్రలను తీర్చిదిద్దిన విధానం, ఇరాన్ సామాజిక రాజకీయాంశాలు నవలను విడవకుండా చదివిస్తాయి. నవల పూర్తయిన తరువాత ఒక గొప్ప రచనను చదివిన భావనను కలిగిస్తాయి.
అయితే, ఈ నవలకు సంబంధించిన అసలు షాక్ నవల చదివిన తరువాత తగులుతుంది. నవల చదువుతున్నంత సేపూ, పాఠకుడికి ఈ రచన రచయిత్రి అనుభవాలనుంచి రూపొందిందన్న నమ్మకం కలుగుతుంది. చదివిన తరువాత రచయిత్రి గురించి తెలుసుకుంటే, ఈ నవలలో వర్ణించిన సంఘటనలు జరిగిన ఇరవై అయిదేళ్ళ తరువాత రచయిత్రి జన్మించిందని తెలియగానే రచయిత్రి రచనా ప్రతిభాపాటవాలకు ఆశ్చర్యం కలుగుతుంది. తానే అనుభవించినట్టు ఉత్తమ పురుషలో రచించటం వల్ల రచయిత్రి పాఠకుడి మెదడుని అదుపులో తీసుకుని ప్రభావం చేసిన విధానం అర్థమవుతుంది. అద్భుతం అనిపిస్తుంది. ఇది కదా రచనలో వున్న మేజిక్ అనిపిస్తుంది.
ఈ రచనలో నాయిక సాంప్రదాయ పరిధిలో వొదుగుతూ, కట్టుబాట్లను పాటిస్తూ తన అభీష్ట ప్రకారం వ్యవహరిస్తూ స్వీయ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుంది. ఇందుకు భిన్నంగా తెలుగు రచయితలు చంకల్లో వెంట్రుకలుంటే స్లీవ్‌లెస్ వేసుకోవాలవద్దా అన్న మీమాంసలు, చర్చల్లోనే తిరుగుతూ సభ్యతా హద్దులు దాటి అదే అభ్యుదయం, అదే విప్లవం, అదే ఉత్తమ రచన అనుకుంటూండటం గమనిస్తే, ప్రతిభవున్న వారు రచన ద్వారా గుర్తుంటారు. ప్రతిభ లేని వారు ఇతర విషయాల ద్వారా గుర్తింపు సాధిస్తారు అనిపిస్తుంది. కానీ, ఈ ప్రక్రియలో దెబ్బతింటున్నది ఎవరో చెప్పనవసరం లేదు.
‘ది లిటిల్ కాఫీ షాప్ ఆఫ్ కాబుల్’ నవల ఒక కాఫీ షాప్ కేంద్రంగా నడుస్తుంది. ఈ నవల రచించింది డెబోరా రోడ్రిగ్వెజ్. 2002లో
కాబుల్‌లో విదేశీయుల జీవితాలకు కాఫీ దుకాణాలు కేంద్ర బిందువులు. అఫ్ఘన్ పురుషులు, విదేశీ మహిళలు, పురుషులు కలిసే స్థలం. అఫ్ఘన్ మహిళలు కాఫీ షాప్ లలో అడుగుపెట్టరు. ఒకవేళ ఇంటర్నెట్ కోసం అడుగుపెట్టినా అందరూ కళ్ళప్పగించి వారివైపే చూడటం ద్వారా వారు ఎక్కువసేపు వుండలేని ఇబ్బందికర పరిస్థితులు కలిగిస్తారు.
ఈ నవల కాఫీ షాప్ నడిపే విదేశీ మహిళ ‘సన్నీ’ ఆధారంగా నడుస్తుంది. కానీ, నవల ఆరంభం యాజ్మినా అనే అఫ్ఘన్ యువతిని ఆమె తండ్రి తీర్చాల్సిన అప్పుకు బదులుగా వార్ లార్డ్స్ ఎత్తుకుపోతూండటంతో ఆరంభమవుతుంది. దారిలో ఆమె భర్త మరణించాడనీ, ఆమె గర్భవతి అనీ తెలియటంతో ఆమెని కొట్టి రోడ్డుపై విసిరేసి వెళ్ళిపోతారు. ఇక్కడే అఫ్ఘన్‌లో మహిళల పరిస్థితి తెలుస్తుంది. భర్త చనిపోయిన అమ్మాయి, ఆ భర్తవల్లనే గర్భవతి అయినా ఆమెకు సమాజంలో స్థానం లేదు. ఆ పుట్టేది ఆడపిల్ల అయితే ఆ పిల్లను చంపటం తప్ప వేరే మార్గం లేదు. ఎవరయినా రహస్యంగా పెంచాలని ప్రయత్నించినా నిజం తెలిస్తే తల్లికి కూడా ముప్పే. ఇలాంటి పరిస్థితిలో యజ్మినా కాఫీ షాప్ చేరుతుంది. ఆ కాఫీ షాప్‌లో ఇజాబెల్ అనే జర్నలిస్టు, కాండైస్ అనే యువతి (భర్తను వదలి అఫ్ఘన్ ప్రేమికుడి కోసం అఫ్ఘనిస్తాన్ వస్తుంది), సన్నీని కలుస్తుంది. సన్నీ కాఫీ షాప్‌లో హాలాజాన్ అనే ఒక వృద్ధ మహిళ భర్త మరణించిన తరువాత మరో వృద్ధుడితో రహస్యంగా ప్రేమ వ్యవహారం సాగిస్తూంటుంది. అయితే, అది కేవలం వారానికి ఒక రోజు కలసి ఉత్తరం అందుకోవటం మటుకే. దీనికే ఇది ఎక్కడ కొడుక్కు తెలుస్తుందో నని భయపడుతూంటుంది. ఎందుకంటే, కొడుకు ఇస్లామ్ ఛాందసవాది. తల్లి విషయం తెలిస్తే, ఆమెను రాళ్ళతో కొట్టి చంపేందుకూ వెనుకాడడు. సన్నీకి ఒక ప్రియుడుంటాడు. ఇంకొకాయన ఆమెని ప్రేమిస్తూంటాడు. కాండైస్ ప్రెమించిన అఫ్ఘన్ పురుషుడు సమాజ సేవ, అనాథలకాశ్రయమిచ్చే ముసుగులో తీవ్రవాదులను తయారు చేస్తూంటాడు. ఈ ప్రేమ వ్యవహారాలు, సామాజిక నియమ నిబంధనలను ఆమోదించని మానవ సంవేదనలు, ఫలితంగా జనించే సంఘర్షణలు, ఆవేదనలు, వీటన్నిటిపై ప్రభావం చూపించే రాజకీయాలు, ఇలా అన్నిటినీ కలగలుపుకుని ఊహించినదే అయినా ఉద్విగ్నతా భరితమయిన క్లైమాక్స్ కు చేరుకుంటుంది నవల.
ఈ మూడు నవలలో రచన పరంగా బలహీనమయినది క్రిస్టీ లీఫ్టెరి రచించిన ‘ది బీ కీపర్’. ఇటీవలే వచ్చిన జేసన్ స్ఠాథాం సినిమాకూ ఈ నవలకూ ఏ మాత్రం సంబంధం లేదు. ఇది సిరియా నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని అక్రమంగా ఇంగ్లండ్ వచ్చి ఆశ్రయం కోరిన నూరి అతని అంధ భార్య అఫ్రాల కథ.
సిరియాలో పెద్ద పట్టణం అయిన అలెప్పోలో నూరి,
ఈ నవల రచయిత్రి క్రిస్టీ లెఫ్టెరి సైప్రస్ నుంచి ఇంగ్లండ్‌కు వలసవచ్చిన వారి సంతానం. ఇంగ్లండ్‌లో పెరిగింది. కాబట్టి కాందిశీకుల బాధలు, మానసిక వేదనలు సమస్యలు ఆమెకు బాగా తెలుసు. క్రియేటివ్ రైటింగ్‌లో డాక్టరేట్ పొందిందీమె. గ్రీసు దేశానికి చెందిన ఎథెన్స్‌లో కాందిశీకులతో పనిచేసిన అనుభవం ఆధారంగా ఈ నవలను సృజించింది.
రచయితలలో ప్రతిభ, విభిన్నంగా రాయాలన్న తపనలు వుంటే, కళ్ళ ముందు అనంతమయిన అంశాలున్నాయి. కానీ, తెలుగు రచయితలు ముఠాల పరిధుల్లో ఒదిగి, గుంపుల కౌగిట్లో కరిగి, అవార్డులకు, వేదికలపై అందే శాలువాలకు, టీవీ ఇంటర్వ్యూలకు, ఆబద్ధపు పొగడ్తలకు, ఉద్యమం పేరిట తిట్లకు, ద్వేషాలకు పరిమితమై, స్వీయ వ్యక్తిత్వాన్ని తాకట్టుపెడితే రాయటానికి ఒంటిపై చెప్పకూడని ప్రాంతాలలో వెంట్రుకలు తప్ప మరో వస్తువు దొరకదు. ప్రదర్శించటానికి ఉచ్చ తప్ప మరో అంశం దొరకదు. పది కాపీలు అమ్ముడవగానే సూపర్ హిట్, అచ్చువేసిన కాపీలన్నీ అమ్ముడుపోయాయని సంబరాలు చేసుకునేందుకు గాలి అంకెలు తప్ప అమ్మకాలు అరుగులు దాటవు.
ఈ నిజాన్ని పైన ఉదాహరించిన నవలలకు ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆదరణ నిరూపిస్తుంది. తెలుగు రచయితలు కూడా కళ్ళకు కమ్మిన పొరలను, మెదడుకు పట్టిన తెగుళ్ళను వదిలించుకుని, స్వేచ్చగా, తమ సృజనాత్మకతను ముఠాలకో, గుంపులకో తాకట్టు పెట్టకుండా, సృజనాత్మక రచనలు జనరంజకంగా చేసే రోజులు ఎంతో దూరంలో లేవన్న దురాశతో, సంచిక పాఠకులందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను.