శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ, ప్రాచ్య పరిశోధన సంస్థ, తిరుపతి, మరియు ‘తెలుగు సంపద’ బెంగుళూరు వారి సంయుక్త ఆధ్యర్యంలో, ఫిబ్రవరి 27, 28 తేదీలలో 3వ అంతర్భాతీయ తెలుగు భాషా సమావేశాలు అంగరంగ వైభోగంగా జరిగాయి.
ప్రారంభ సమావేశం, నీలం సంజీవరెడ్డి భవన్, (అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్) లోని సెనేట్ హాలులో జరిగింది. వైస్ చాన్సలర్ ఆచార్య సిహెచ్. అప్పారావు గారు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, M.L.A గారు ముఖ్య అతిధిగా హజరైనారు. సభకు విశిష్ట అతిథిగా శ్రీ ఆచార్య జి. యస్. ఆర్ కృష్ణమూర్తి, వైస్ ఛాన్సలర్, సంస్కృత విశ్వవిద్యాలయం సభను అలంకరించారు. కీలకోపన్యాసం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వర రావు గారు చేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఎందరో తెలుగు భాషాభిమానులు ఈ ఉత్సవాలకు హాజరై, వాటిని సుసంపన్నం చేశారు. కొందరు రీసెర్చి స్కాలర్లే గాక, ఇతర భాషావేత్తలు, రచయితలు, పండితులు తమ తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ప్రముఖ రచయితలు వి.ఆర్. రాసాని, శ్రీ ఆర్. సి. కృష్ణస్వామిరాజు సభలకు హాజరైనారు.
అతిథులకు, పత్రసమర్పకులకు నిర్వాహకులు చక్కని వసతిని, విశ్వవిద్యాలయ హాస్టళ్లలో ఏర్పాటు చేశారు. భోజన సదుపాయం, టీ, కాఫీ, టిఫిన్ సమకూర్చారు.
మొదటి సెషన్‍లో (27 ఫిబ్రవరి తేదీన) శ్రీ ప్రాణ్యం దత్తశర్మ తన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. మొదటగా, కవిసమ్రాట్ విశ్వనాథ విరచితమైన ‘ఒక్క సంగీతమేదో పాడునట్లు, భాషించునపుడు వినిపించు భాష’ అన్న తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని వివరించే సీస పద్యాన్ని దత్తశర్మ సుస్వరంగా ఆలపించగా, సభికులు పరవశించి, కరతాళ ధ్వనులు చేశారు.
పాణ్యం దత్తశర్మ తీసుకున్న ఇతివృత్తం ‘తెలుగు కథ, భాషా సౌందర్యం’. ఇందులో ఆయన 3 కధాసంకలనాల నుండి కొన్ని కథలను పరిశీలించి, పరిశోధించి, తమ పరిశోధనా పత్రాన్ని వ్రాశారు. 16 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు.
దత్తశర్మ గారు తీసుకున్న కథలు:
- ‘అంతఃపురోపన్యాసము’. రచయిత శ్రీ ఆచంట సుందరరామయ్య. జూన్ 1896 నాటి చింతామణి పత్రికలో ప్రచురితం.
- ‘బాలవితంతువు’, రచయిత శ్రీ పూళ్ల సుబ్బరాట్కవి. ఆగస్టు 1905 ‘హిందూసుందరి’ లో ప్రచురితం.
- ‘గొల్లరామవ్వ’, రచయిత శ్రీ పి.వి. నరసింహారావుగారు, భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు, 15-8-49 న, కాకతీయ పత్రికలో ప్రచరితం.
- ‘యుగాంతం’, రచయిత శ్రీ నెల్లూరి కేశవస్వామి – 1982లో ‘చార్మినార్’ కథల సంపుటిలో ప్రచురితం.
- ‘భూమి దుఃఖం’- శ్రీ రామచంద్రమాళి – వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
- ‘ఉన్నోడు లేనోడు’ – శ్రీ మూరిశెట్టి గోవింద్
- ‘వేకువ నక్షత్రం’ – కళాగోపాల్
- ‘కడగండ్లు’ – కె.సభా, ఏప్రిల్ 1944, చిత్రగుప్తలో ప్రచురితం.
- ‘పురాగానం’ – జి.ఆర్.మహర్షి, సాహితీ ప్రచురణ జనవరి 2013.
పత్ర సమర్పకులలో సర్వశ్రీ డా॥ బానోతు స్వామి. డా. బ్రహ్మనందరెడ్డి, అనిల్ గూడపాటి, డా. ఎల్. కస్తూరి ప్రభృతులు ఉన్నారు. జానపద గేయ సాహిత్యం, కోనసీమ తంబుర కథలు, పద్య గణితం, భాషాభివృద్ధి, తిక్కన తెలుగు నుడికారాలు, రాయవాచకంలో తెలుగు జాతీయాలు, తెలంగాణలో నీతి, సామాజిక శతకాలు, శంకరంబాడి సుందరాచారి “సుందర రామాయణము’, తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమాలు, ఇంకా ఎన్నో విషయాలపై పరిశోధనాపత్రాలు సమర్చించబడ్డాయి!
భాషాయోషా జయోస్తుతే!
పురోహితం నాగరాజశర్మ, తిరుపతి.