సుప్రసిద్ధ రచయిత శ్రీ ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారు రచించిన 30 మినీ కథల సంపుటి ఇది. మనుషుల ప్రవర్తనని కాచి వడపోసినట్లుగా – అత్యంత సహజంగా చిత్రించిన కథలు ఇవి.
***
మనుషుల బుద్ధులు ప్రధానం గానీ, ఎత్తు ముఖ్యం కాదని తెలుపుతుంది ‘పొట్టి మొగుడు’ కథ. చిన్న చిన్న విషయాలకి అనవసరమైన ప్రాధాన్యం ఇస్తూ, పట్టించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలని పట్టించుకోకపోతే జీవితం వెలవెలబోతుందని ‘ముదురు’ కథ చెబుతుంది.
తెనాలి నుంచి తిరుపతికి ఏదో పని మీద వచ్చిన నాగసుబ్బడు మిత్రుడు మునిరత్నం ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. ఆయన ట్రిమ్మింగ్ చేస్తున్నాను, వచ్చేయ్ అంటాడు ఫోనులో. అడ్రసు దొరకదు. మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళా విడ మాట్లాడి ట్రిమ్మింగ్ చేస్తున్నాను, ఆయన బాత్‍రూమ్‌లో ఉన్నారు, అంటూ ఎలా రావాలో చెబుతుంది. ట్రిమ్మింగ్ చేయడమంటే ఏమిటో అర్థమయిన నాగసుబ్బడు విస్తుపోతాడు. ‘ట్రిమ్మింగ్’ కథ పెదాలపై నవ్వులు పూయిస్తుంది.
పనిమనిషి చెప్పిన మనిషిగా ఒకరికి బదులు ఒకరిని పొరపాటుగా ఊహించుకున్న దంపతులకు మూర్ఛ పోయినంత పని ఎందుకయిందో ‘స్వచ్ఛతే సేవ’ కథ చెబుతుంది.
ఓ ప్రముఖ సినీనటికి యోగా నేర్పించే అవకాశం వస్తే ఉబ్బితబ్బిబ్బయిన శేషసాయి, ఆ తర్వాత తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడో ‘యోగా నేర్పబడును’ కథలో చదవవచ్చు.
మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకోవాలనుకునే చిత్రాణి ఒక వినూత్న ఐడియాతో తమ పనిమనిషికి గౌరికి సాయం చేస్తుంది. చిత్రాణి, గౌరి తమ రంగాలలో ఎలా రాణించారో ‘ఐడియా’ కథ చెబుతుంది.
వైద్యరంగంలోని అవినీతిని కళ్ళకు కట్టినట్టు చూపిన కథ ‘స్కానింగ్’. థర్డ్ గ్రేడ్ కాంట్రాక్టరు చైతన్య కార్పోరేషన్ వారి పనులు దక్కించుకుని, సకాలంలో పూర్తి చేసి బిల్లులు పాస్ చేయించుకోడానికి పడ్ద తిప్పలు ‘దానికదే దీనికదే’లో చదవచ్చు. చక్కని సామెతలున్నాయీ కథలో.
బదిలీ కోరుకున్న ఇంజనీరు ఇంద్రసేన పై అధికారిని ప్రసన్నం చేసుకున్నా – అతను అనుకోని విధంగా మరో కారణంగా కోరుకున్న చోటుకి బదిలీ పొందుతాడు ‘బదిలీ’ కథలో.
‘వడ్ల ఒలుపు’ కథ ఆసక్తిగా చదివిస్తుంది. భద్రాచాల రామయ్యకి పోసే తలంబ్రాలకు వడ్లు గోళ్ళతో ఎలా ఒలుస్తారో ఈ కథ చెబుతుంది. అత్తా కోడళ్ళ మధ్య గొడవలు సమసిపోయిన వైనాన్ని చెబుతుంది.
అధికారులలో పాతుకుపోయిన లంచాల ధోరణిని చక్కగా ప్రదర్శించిన కథ ‘మిక్చర్ పొట్లం’. తమ ఇంట్లో పని చేసే పనిమనిషిని మంచిచేసుకోవాలని ఓ జంట పడిన అవస్థలు ‘మ్యాచింగ్’ కథలో చదవవచ్చు.
సిబ్బంది బదిలీలలో దళారుల ప్రమేయం వద్దని ఓ ఛైర్మన్ ఎందుకు అన్నాడో, దాని అంతరార్థం ఏమిటో ‘దళారి’ కథ చెబుతుంది.
తమ ఇంటి దగ్గర పోగు పడుతున్న చెత్త నుంచి ఎరువు తయారు చేయించాలనుకున్న ఓ విలేఖరి ప్రయత్నాలు ఎలా ఫలించాయో ‘వ్యర్థంతో(లో) అర్థం’ కథ తెలుపుతుంది.
తను చేసిన ఓ చిన్న పని కారణంగా ఓ అనాథ శవానికి చక్కని రీతిలో అంత్యక్రియలు జరగడానికి కారణమవుతాడు ఆనందనాయుడు. చురుక్కుమనిపించే వాస్తవాలతో అల్లిన కథ ‘అనాథ(?) శవం’.
చిన్నదానిగా కనబడాలనే తపనతో, కూతురి స్కూల్ అడ్మిషన్ అప్లికేషన్‍లో తన వయసుని తగ్గించి వ్రాసిన తల్లి కారణంగా – కూతురికి ఆ స్కూల్లో అడ్మిషనే దొరకని పరిస్థితి ఎదురవుతుంది ‘(మైనర్) మమ్మీ’ కథలో. కానీ, ఎట్టకేలకు సర్టిఫికెట్లు అవీ చూపించి, స్కూలు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సక్రమంగా చెప్పి పాపకి సీటు సంపాదిస్తారు.
రాజకీయ నాయకులు నాలుగు ఆకులు తింటే, ఓటర్లు వారి కన్నా ఆరు ఆకులు ఎక్కువే తినగలరని చెప్పిన కథ ‘ఓటు-నోటు’. ఎమ్మెల్లే సిఫార్సు ఉత్తరంలో నల్ల సిరాతో సంతకం పెడితే ఏం అర్థమో ఆలస్యంగా తెలుస్కుంటాడు సిద్ధయ్య ‘సంతకం’ కథలో.
ఆకాశంలో విహరిస్తున్న భర్తని నేలకి దించడానికి ఓ ఇల్లాలు ఏం చేసిందో ‘దూరపు కొండలు’ కథ చెబుతుంది. తెలివైన అవినీతిపరుడి లౌక్యం ఎలా ఉంటుందో ‘నే(నీ)తి బీరకాయ’ కథ ప్రదర్శిస్తుంది.
చిన్నతనంలో ఏమోమో అనుకుంటాం, కానీ జరగాల్సిందే జరుగుతుందని భానుమతి మిత్రులు గ్రహిస్తారు ‘రైటర్’ కథలో.
ఓ సర్పంచ్ 12 ఏళ్ళ కూతురుది నాల్గవ పుట్టిన రోజు జరుపడంలోని లెక్క ఏమిటో కాస్త ఆలస్యంగా తెలుసుకుంటారు వార్డు సభ్యులు ‘భలే బర్త్ డే’ కథలో.
దొంగ – భక్తుడు, రాజ’కీ’యం, శల్యవైద్యుడు, నాటుకోడి, జజ్జనక, బంద్, చెక్ డామ్ వంటి కథలు సమాజపు రీతి రివాజులని ప్రదర్శిస్తాయి.
***
రచన: ఆర్.సి. కృష్ణస్వామి రాజు
పేజీలు: 115
వెల: ₹ 125
ముద్రణ: మల్లెతీగలు, విజయవాడ
ప్రతులకు:
ఆర్ సి కృష్ణ స్వామి రాజు
ఫోన్ 9393662821.
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.