లోయలోకి దిగడానికి మనవాళ్లకు మూడు గంటలు పట్టింది. మధ్యాహ్నం 2 గంటలకు దిగడం పూర్తయేటప్పటికి భోజనవేళ దాటిపోయింది. డబుల్ రూట్ బ్రిడ్జి వద్ద చిన్న చిన్న కాకా హోటళ్లు, ఏదో ఇంత తిన్నామనిపించారు.
ఆవిరి మీద ఉడికించిన భోజనం విజయభాస్కర్ రెడ్డి బృందం రుచిచూశారు.
బిల్ హార్న్
మిత్రులు
మిత్రులు
మేఘాలయలో గ్రామీణులు చాలా చోట్ల సెలయేళ్ళ మీద మహావృక్షాల వేళ్ళతో రూట్ బ్రిడ్జిలు లేదా వెదురుగడలతో వంతెనలు ఏర్పరచుకున్నారు, సెలయేళ్ళను దాటడానికి. డబుల్ రూట్ బ్రిడ్జి దృశ్యం అపూర్వమైనది. మరెక్కడా చూడని ఆరుదైన దృశ్యం.
డబుల్ రూట్ బ్రిడ్జి
మేఘాలయ పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణ. ఇక్కడకు చేరుకోవాలంటే సమీప గ్రామాలనుంచి కాలినడకన వెళ్ళాలి. నవంబరు నుంచి మార్చ్ నెలవరకు శీతాకాలం ఇక్కడికి వెళ్ళడానికి అనుకూలమైన సమయం. వీళ్ళు వెళ్ళే సమయానికి అక్కడ రెండు మూడు వందల సందర్శకులు చేరారు. రూట్ బ్రిడ్జిలన్నీ స్థానికులు ఏర్పాటు చేసుకొన్నవే. మహావృక్షాల వేళ్ళను వాగులు, వంకలు దాటడానికి సాధనాలుగా చేసుకొన్నారు. చెట్లవేళ్ళను ప్రవాహం ఆవలిగట్టకు మళ్ళించి భూమిలోకి వెళ్ళేట్లు చేస్తారు. ఆ వేళ్ళే వారికి వంతెనల్లా ఉపయోగపడతాయి.
మిత్రులు
మనవాళ్ళు అక్కడ పరమ ప్రశాంత ప్రకృతిమధ్య హోమ్ స్టేలో ఉన్నారు. హోమ్ స్టేలలో బాడీ మసాజ్, పాదాలకు మసాజ్, బఫె వంటి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. సౌరశక్తితో విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. మరురోజు డబుల్ రూట్ బ్రిడ్జి నుంచి అడవిదారిలో రెయిన్ బో ఫాల్సుకు నడిచారు విజయభాస్కర్ రెడ్డి, దయానంద బాబు ఇద్దరే. హనుమంతరావు, కోటేశ్వరరావు రూంలోనే ఉండిపోయారు. ఈ ట్రెక్కింగ్ కాస్త శ్రమతోకూడినది. అడవిలో గుంతలు, మిట్టలు చూసుకొంటూ ముందుకు సాగాలి. జలపాతం పెద్ద బండమీదపడి నీరు తుంపరలుగా పైకి చిమ్మడంతో సూర్య కాంతికి ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఆ రోజు మబ్బుల చాటున సూర్యుడు దాగివుండి దర్శనమివ్వలేదు. ఈ ట్రెక్కింగ్ వల్ల దయానంద కూడా ట్రెక్కింగ్‌లో సమర్థులని తేలింది.
రెండు రోజులు డబుల్ రూట్ బ్రిడ్జి వద్ద హోంస్టే లోవుండి, మూడోరోజు తిరుగు ప్రయాణమయ్యారు. అందరూ కాలినడకన 3000 అడుగులు మెట్లమార్గంలో నడిచి రెండుగంటల్లో తిర్నా చేరారు. బైపాస్ ఆపరేషన్ చేసుకున్నా ఇటువంటి సాహస యాత్రల్లో పాల్గొనవచ్చని నిరూపించడం కూడా తన ధ్యేయమమని అన్నారు. తిర్నాలో లుంబ్లిం అనే స్థానికుని ఇంట్లో రాత్రికి హోమ్ స్టే చేశారు.
మాస్ మెయి గుహలు
దారిలో మాస్ మెయి గుహలు చూచారు. గుహాల లోపల కరెంటు దీపాల ఏర్పాటుంది. ఇరుకు దారులమధ్య నడుస్తూ రెండు గుహలూ చూసారు.
ఉదయం ఫలహారం అక్కడే చేసి, నవకాళిక(Nohkalikali) జలపాతం చూడడానికి వెళ్ళారు. ఇది చిరపుంజికి సమీపంలోనే, తూర్పు ఖాశిజిల్లాలో ఉంది, ప్రపంచంలోనే అత్యంత వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలలో ఇదొకటి. ఎప్పుడూ చిత్తడిగా ఉంటుంది. జలపాతం పైభాగం వరకూ కార్లు వెళతాయి. దృఢకాయులు జలపాతంవల్ల భూమి మీదపడి ఏర్పడిన మడుగు వరకూ, కిందకు దిగొచ్చు వర్షాకాలం కాకపోతే. శీతాకాలం కనక జలధార తగ్గిపోయింది. మేఘాలయలోనే కాదు భారతదేశంలోనే ఇది అతిపెద్ద జలపాతం, పైనుంచి కిందపడే దూరం దృష్ట్యా(జలపాతం 340 మీటర్ల ఎత్తునుంచి కిందకు పడుతుంది).
విజ్లింగ్‍లో గ్రామీణుడు
నవకాళిక నుంచి విజ్లింగ్ గ్రామానికి చేరేవేళకు మధ్యాహ్నం రెండుగంటలయింది. ఆ గ్రామీణులు దూరాలనుంచి విజిల్స్ సంకేతాల ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకొంటారట! అక్కడ గ్రామీణులెవరూ లేరు. అందరు పనుల కోసం అడవిలోకి వెళ్ళారు. రాత్రికి చిరపుంజిలో ఉండి, ఉదయం డాకి గ్రామం, డాకినది దర్శనానికి వెళ్ళారు.
వంతెన
నది, వంతెన
స్వచ్ఛమైన నీరు
టూరిస్ట్‌తో మిత్రులు
డాకీ నది మేఘాలయ, బంగ్లాదేశ్ మధ్య ప్రవహిస్తుంది. నది దాటితే, ఆవలి వైపు బంగ్లాదేశ్. శరదృతువు, నది ప్రశాంత గంభీరంగా ప్రవహిస్తోంది. నీళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉండి నీటి అడుగున సన్ననిరాళ్లు కూడా కనిపిస్తున్నాయి. వాటర్ ప్రూఫ్ కెమెరాతో విజయభాస్కరరెడ్డి నీటి అడుగు దృశ్యాలు ఫొటోలు తీశారు. డాకినది దర్శనం అద్భుతమైన అనుభవం. నదిలో బోటుమీద గంటసేపు విహారం చేశారు.
డాకీనదీ దర్శనం తర్వాత, అత్యంత పరిశుభ్రమైన గ్రామమని ప్రసిద్ధికెక్కిన మావ్ లిన్నాంగ్‌కు బయలుదేరారు. దారిలో అదనంగా కొంచం దూరం వెళ్ళవలసి వచ్చినా, నెట్ గ్రామానికి వెళ్ళి అక్కడ రోప్‌వే బ్రిడ్జి వ్యూపాయిట్ చూసి, మావ్ లిన్నాంగ్ దారిపట్టారు.
అప్పటికే మావ్ లిన్నాంగ్ గ్రామానికి చాలామంది పర్యాటకులు వచ్చివున్నారు. ఆ పల్లెలోనే సాయంత్రం హోమ్ స్టే తీసుకొని ఉన్నారు. తెల్లవారి గ్రామమంతా తిరిగిచూసారు. గ్రామంలో వంద ఇళ్ళున్నాయి. అయిదారు వందల జనాభా. కుదురైన, తీరైన వీధులు పరిశుభ్రంగా ఉన్నాయి. ఇంటిముంగిళ్ళు పూలమొక్కలతో. ఎక్కడా మురికిలేదు. వీధి మొదట వెదురు బుట్టల చెత్తకుండీలు.
మావ్ లిన్నాంగ్ లో చెత్త బుట్ట మెట్లవద్ద
పరిశుభ్రమైన శృంగాటకం, మావ్ లిన్నాంగ్ పల్లె
ఊరిచుట్టూతా కనువిందుచేసే పచ్చని వృక్షాలు, ఊరు చాల బాగుంది. తెల్లవారి, గౌహతికి బయల్దేరారు. దారిలో ఎలిఫెంట్ ఫాల్స్ చూసారు. జలపాతం కింద ఏర్పడిన సరస్సు వద్దకు చేరడానికి 30నిముషాలు పట్టింది. షిల్లాంగ్ దాటి ముందుకు వెళ్తే యూమియం సరస్సు వస్తుంది. ఇది మానవ నిర్మితమైన సరస్సు. ఈ బృందం వెళ్ళినపుడు సరస్సుమీద బోటు షికారు నిలిపివేశారు. సాయంత్రానికి గౌహతి చేరారు.
కంగ్లా కోటలో గుడి, మనణిఊపూర్
మరుసటిరోజు, డిసెంబరు 14వ తారీకు ఉదయం దయానంద, కోటేశ్వరరావు, హనుమంతరావు విమానంలో స్వస్థలాలకు వెళ్లారు. విజయభాస్కరరెడ్డి హిమాలయాల్లో ట్రెక్కింగ్ కోసం ముస్సోరి వెళ్ళారు.*
(విజయభాస్కర్ రెడ్డి గారు చెబుతూంటే, డాక్టర్ కాళిదాసు పురుషోత్తం రాశారు. ఫొటోలు విజయభాస్కర్ రెడ్డి గారు తీసినవి).
(సమాప్తం)
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.