Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిత్రమా! సెలవు..

[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి రచించిన ‘మిత్రమా! సెలవు..’ అనే కథని అందిస్తున్నాము.]

ప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉండే గోపాలం ఆ రోజు చాలా దిగులుగా ఉన్నాడు.

మొబైల్ కూడా ముట్టుకోలేదు. ఏదో ఆలోచనలో ఉన్నాడు.

ఇంట్లో ఎవరూ పట్టించుకోలేదు.

భుజం మీద కండువా వేసుకొని చెప్పులు లేకుండానే బయటకు నడిచాడు. నడుస్తున్నాడు.

ఎప్పటికీ ఆలోచన తెగటం లేదు. నడుస్తూనే ఉన్నాడు. రచ్చబండ దగ్గర ఎండగా ఉంది. అయినా అక్కడ కూర్చున్నాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు తొందరగా ఉన్నారు. ఇతని వేపు ఒక చూపు చూసి ముందుకు వెళ్ళిపోతున్నారు.

అతను అంత విచారంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది?

ఏమో అతను చెబితే కదా! తెలిసేది చెప్పాలంటే ఎవరున్నారు?? ఎవరికి చెప్పాలి? ఎవరు వింటారు?

మళ్లీ అతని మనసంతా గుబులుగా అయింది.

ఆ రోజుల్లో రచ్చబండ అంటే ఎండైనా, వానైనా, చలైనా, ఋతువులను బట్టి వాళ్ళ ఆహార్యం మార్చుకుంటూ, నెగడు కాచుకుంటూ, చల్లని వేప, రావి చెట్లు కవలపిల్లల్లాగా పెనవేసుకున్న ఆ చెట్టు కింద సేద తీరుతూ కబుర్లు.

ఊరిలోని అన్ని విషయాలు వీళ్ళకే కావాలి. ఇష్టం లేనివాళ్ళు ఎవరేమనుకున్నా వీరికి సంబంధం లేదు. మాట్లాడుకుంటూనే ఉండేవారు. ఒక్కోసారి బిగ్గరగా నవ్వుకోవడం,  ఒకసారి మౌనంగా బేలగా ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం.

ఎవరింట్లో సమస్య అయినా అందరూ కలిపి ఒక మంచి పరిష్కారం సూచించుకోవడం అది చిన్న విషయం అనుకునేవారు.

కానీ కానే కాదు. అది మనుషులుగా పుట్టినందుకు మనం నడవాల్సిన బాట.

ఆలోచనల ఒత్తిడి తట్టుకోలేక తల విదిలిస్తూ ఒక్కసారి చుట్టూ చూసాడు. వీళ్ళెవరికీ తెలియదా? ఈ విషయం తనకే ముందు తెలిసిందా? పిలిచి చెబుదామా?

వద్దులే నిజమో కాదో కనుక్కుందాం అనుకుంటూ నడక మొదలుపెట్టాడు బస్టాండ్ దాకా వెళ్ళాడు. అప్పుడు గుర్తొచ్చింది. బస్సు ఎక్కుదాం అంటే టికెట్టు తీయడానికి తన దగ్గర డబ్బులు లేవు అని.

తను ఎప్పుడు వెళ్లే కిళ్ళీకొట్టు దగ్గరకు వెళ్లి “ఒరే! రామూ! ఒక వంద రూపాయలు ఉంటే ఇవ్వు. ఎవరైనా కుర్రాడుంటే మా ఇంటికి కబురు పెట్టు నేను పక్క ఊరు వెళ్తున్నానని.” అంటూ ఆ డబ్బులు చేతిలో పట్టుకొని బయలుదేరాడు.

బస్సు సిద్ధంగా ఉంది. ఎక్కాడు. బస్సులో ఎవరికీ ఈ సంగతి పట్టదేంటి? ఎవరూ మాట్లాడుకోరేంటి? ఆలోచనలో పడిపోయాడు.

గోపాలంకి ప్రాణస్నేహితుడు గుర్తుకొస్తున్నాడు. నిజంగా ప్రాణ స్నేహితుడేనా? తనతో ఎందుకు ఏ విషయాలు చెప్పుకోలేకపోయాడు? ఏమైందో? అసలు తానెందుకు పట్టించుకోలేదు?? తప్పు నాదే! స్నేహితుడు, ప్రాణస్నేహితుడు అన్నంత మాత్రాన సరిపోదు. కనీసం రోజూ మాట్లాడుకోకపోయినా వారానికి ఒకసారి అయినా కనీసం నెలలో ఒకసారి అయినా మాట్లాడుకో లేకపోతే ఇంకెందుకు?

అవును. గుర్తొస్తోంది. ఆఖరిసారిగా తామిద్దరూ మాట్లాడుకున్నది మొబైల్ లోని వాట్సాప్ లోనే.

ఏదో కార్యక్రమం చేసినందుకు జిల్లా కలెక్టర్ గారు అతనికి సన్మానం చేసి ప్రశంసా పత్రం కూడా ఇచ్చారు. ఆ ఫోటో పేపర్లో పడింది. తనకు పంపించాడు. తను మాట్లాడాడా?

లేదు. చూసి ‘సూపర్!’ అని ఒక పదం రాశాడు. అదే గుర్తుంది. తర్వాత??

ఇది జరిగి నాలుగు ఐదు నెలలు అవుతుందేమో?

అపరాధభావన మనసంతా నిండి పోతుండగా తను దిగాల్సిన ప్రదేశం వచ్చింది. దిగాడు. చుట్టూ చూసాడు. తను వస్తున్నాను అని చెప్పగానే బస్సు దాకా వచ్చి ‘మిత్రమా! అంటూ భుజాల మీద చేతులు వేసి, ఆనందం మొహంలో ప్రతిఫలిస్తుంటే చిరునవ్వు నవ్వుతూ ఉండే ఆ స్నేహితుడు ఏడీ? రాలేదు.

తలదించుకుని నడుస్తున్నాడు.

ఎవరో తెలిసిన వాళ్ళు “ఒరేయ్! గోపాలం బాగున్నావా!” అంటూ పలకరిస్తూ ఉంటే చూశాడు. కళ్ళనిండా నీరు నిండిపోయి ఉండడం వలన ఎవరో గుర్తించలేకపోయాడు.

“నేనే రా! దాసుని” అన్నాడు.

అవును తాము చేసే కార్యక్రమాలకు హార్మోని వాయించేవాడు. నోట్లోంచి మాట రాలేదు కదా! అందుకే తల ఊపాడు.

“ఇది నిజమా!” అన్నాడు మాట పెగుల్చుకుంటూ.

దాసుకి అర్థమైంది. ఎవరి గురించి అతడు అడుగుతున్నాడో?!

అతడు కూడా తనతో పాటు నడుస్తూ “రా! వెళ్దాం” అంటూ “ఏముంది?? అక్కడ” అన్నాడు నిరాశగా.

ఇద్దరు స్నేహితుడి ఇంటి ముందు కాదు కాదు ప్రాణ స్నేహితుడి ఇంటి ముందు నిలిచారు. విచిత్రం ఎవరూ లేరు.

కిట్టిగాడు వెళ్ళిపోతూ ప్రపంచంలోని సందడినంతా తనతోనే తీసుకుపోయాడా అనిపించింది.

తాను వస్తే ఎప్పుడు కూర్చునే ఆ ముంజూరు దగ్గర బల్లమీద కూర్చున్నాడు.

దాసుకి తెలుసు కాబోలు.

“అమ్మా! కళ్యాణీ! ఒక్కసారి ముందుకు రామ్మా! మన గోపాలం వచ్చాడు.” దాసు పిలుపుకి ముందుకు వచ్చిందామె.

కళకళలాడే ఆ కల్యాణి కళ తప్పిన ఈ జీవచ్ఛవం అంటే నమ్మకం కలగక నీరు నిండిన కళ్ళు తుడుచుకుంటూ చూసాడు.

ఒకసారి కిట్టు తనతో చెప్పాడు. కల్యాణికి కేన్సర్ అని, ఆపరేషన్ చేయించాలి అని. ఆరోజు తన చేతిలో ఉన్న రెండు వేల రూపాయలు వద్దంటున్నా వాడి చేతిలో పెట్టాడు.

రుణం తీర్చుకోడానికి అన్నట్లు తన చేత ఏకపాత్రాభినయం చేయించాడు దుర్యోధన పాత్ర. ఇంతోటి ఆ అభినయానికే తనకు తన నిలువెత్తు సన్మానపత్రం రాసి చదివాడు. ‘నట కిరీటి’ అని బిరుదు తన సంస్థ తరఫున ఇచ్చాడు. శాలువా కప్పి సన్మానం చేసి వేలికి బంగారు ఉంగరం తొడిగాడు. ఏంటో వాడి పనులు అస్సలు అర్థమయ్యేవి కావు.

ఈరోజు చేతిలో డబ్బులు తెచ్చుకోలేదు అయినా ఆ వేలి ఉంగరం తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటే ఆ ఉంగరం తీసి ఒక అడుగు ముందుకు వేసి ఆమె చేతిలో పెట్టాడు.

“అమ్మా! అవసరానికి ఉంచు. కళ్యాణి నిన్ను నా కూతురుగా భావిస్తున్నాను వేరే విధంగా భావించకు. నేను తండ్రిగా నా బాధ్యత కొంత నీకు ప్రతి నెల నా పెన్షన్ లోంచి పంపిస్తాను. కాదనకు తల్లీ! ఆరోగ్యం జాగ్రత్త!” ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు.

“వెళ్ళొస్తానమ్మా!” వెను తిరిగాడు.

అప్పుడు చూశాడు.

పది రోజులూ ఎవరైనా వస్తారని ముంజూరులో ఒక కుర్చీ వేసి శాలువా పరిచి, కిట్టుగాడి ఫోటో పూలదండతో నుదుటన బొట్టుతో చిరునవ్వుతో తనని చూస్తుంటే దుఃఖమాగలేదు.

దాసు వీపు మీద అరచేతితో సాంత్వనగా రాస్తున్నాడు.

ఇద్దరూ నెమ్మదిగా వెనుతిరిగారు.

“దాసూ! క్షమించరా! నేను.. నాకు వెంటనే వార్త తెలియలేదు. రాలేకపోయాను. 200 గ్రూపులలో 2000 మంది జనాలు. ఇవాల్టి వరకు ఎక్కడా కనబడలేదు. ఈరోజు కిట్టుగాడి ఫోటో పక్కనే శంకర్రావు రాసిన నివాళి కవిత చూశాక తెలిసింది. అందరికీ గొప్ప నియమాలు – ‘చావు వార్తలు ప్రచురించకూడదు. ఆ గ్రూపులో పెద్దవారికి ఇబ్బంది.’ అని. నిజమే! కానీ ఇలా..”  దాసు ఆసరాతో నడుస్తూనే ఉన్నాడు.

దుఃఖం వలన కళ్ళు కనబడటం లేదు. గొంతు కూడా బొంగురు పోతోంది.

“అంతేరా! ఆధునికతతో పెరిగిన సాంకేతిక  పరికరాలు దూరం వాళ్ళను అరచేతిలో ఉన్నట్లుగా భ్రమ పెడుతుంది. దగ్గర వాళ్లను పలకరింపుకే నోచుకోనీయదు.” అన్నాడు దాసు.

మిత్రమా! సెలవు..

కాలంతో పాటు నడవడమే!

Exit mobile version