[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన అప్పరాజు నాగజ్యోతి గారి ‘మిత్రద్వయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతదేశంలోని లక్షా తొంభై కార్యాలయాల్లో ఒకానొకచోట..
ఫైల్లో తల దూర్చేసి దీక్షగా పని చేసుకుంటున్న గిరీష్ వద్దకి పరిగెట్టినట్టే వచ్చాడు ప్రక్క సెక్షన్లో పనిచేసే మహేష్. కొత్త విషయమేదైనా చెవినపడడం ఆలస్యం, గభాల్న వెళ్లి దాన్ని తన బాల్యమిత్రుడైన గిరీష్‌తో పంచుకుంటే గానీ అతనికి నిద్రపట్టదు!
“ఈవేళ్టి దినపత్రిక చదివావటోయ్ గిరీ? మన సిటీలోని ఇంజనీరింగు కుర్రాడొకడు చేసిన ప్రాజెక్టు గూగుల్ కంపెనీకి తెగ నచ్చేయడంతో ఇరవైలక్షలిచ్చి దాన్ని కొనుక్కోవడమే కాకుండా, మంచి జీతంతో ఆ కుర్రాడికి తమ కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చారట.”
స్నేహితుడు చెప్పింది వింటూనే “ఔనా, ఏమైనా ఈ కాలపు కుర్రాళ్ళు చాకుల్లాంటివాళ్ళు, మాంచి ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్నారు సుమీ” అంటూ తెగ మెచ్చేసుకున్నాడు గిరీష్.
అప్పుడే అటువేపు వచ్చిన క్యాషియర్ జగన్ “ఆ కుర్రాడు మరెవరో కాదండోయ్, మన ఆఫీస్‍లో పర్చేజ్ సెక్షన్లో పని చేసే శ్యాంసుందర్, వాడి భార్య సునందా లేరూ, వాళ్ల సుపుత్రుడే” అని చెప్పగానే గిరీష్, మహేష్ ల మొహాల్లో రంగులు మారిపోయాయి.
“ఏమిటీ, ఆ కుర్రాడు మన చవటాయి శ్యాంసుందర్ కొడుకే? అయితే సందేహం లేదు, ఖచ్చితంగా ఇదేదో మోసపూరిత వ్యవహారమే! గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లో ఏ గొట్టంగాడి మొహానో డబ్బులు పోసి ప్రాజెక్టుని కొనుక్కోవడమూ, ఆ తర్వాత తనే దాన్ని కష్టపడి చేసినట్టుగా అందరికీ చెప్పుకుంటూ తిరగడమూ ఈ మధ్యన రివాజు అయిపొయింది లెద్దూ. ఛ ఛ, ఈ కాలం పిల్లల్లో నీతీ, నిజాయితీలన్నవి బొత్తిగా మృగ్యమైపోయాయి కదరా మహీ! పిదపకాలం, పిదప బుద్ధులాని, అయినా ఇవన్నీ కలికాలం ప్రభావాలని ఆనాడే చెప్పలేదూ మన పోతులూరి బ్రహ్మంగారు”.
“మరే.”
ఓ ప్రక్క పని చేసుకుంటూనే మరో ప్రక్క వీళ్ళ సంభాషణపై చెవి వేసిన అకౌంటెంట్ గగన్ అవాక్కయాడు.
“ఇదేం చోద్యం గిరీష్ గారూ, రెండు నిముషాల క్రితం మీ నోటితో మీరే పొగిడిన వ్యక్తిని అంతలోనే అలా ఎలా విమర్శిస్తారండీ! మహేష్ గారూ, మీరు కూడా ఆయన చెప్పినదానికి తానతందానా అంటారేమిటండీ?”
గగన్ మాటలకి జవాబు చెప్పకుండా, అతని వేపు గుర్రుగా చూస్తూ లంచ్‍కి వెళ్ళిపోయారు గిరీష్, మహేష్‌లు.
“మీరీ ఆఫీసులోచేరి నెలరోజులైనా కాలేదుగా, అందుకే ఆ మిత్రద్వయం మాటలు మీకు కొత్తగా ఉన్నాయి. ముందు ముందు అన్నీ బోధపడుతాయిగానీ, పదండి, అలా క్యాంటిన్‍కి వెళ్లి భోజనం చేసొద్దాం” అన్న జగన్ మాటలకి సీట్లోంచి లేచాడు గగన్.
***
అదే సమయానికి ఒకానొక గృహంబున..
సోఫాలో కూర్చుని తీరిగ్గా టీవీ చూస్తూ ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు.
“సాయంత్రం ఏడుగంటలకి వచ్చే ‘వాసంత సమీరం’ డైలీ సీరియల్ అంటే నాకెంతో ఇష్టం హేమా. తిండి తినడమైనా మానేస్తానుగానీ ఆ సీరియల్ చూడడం మాత్రం చస్తే మానను. ఆ సీరియల్ దర్శకురాలు గీతకి కన్నడంలోనూ మంచిపేరుంది తెలుసా! ఆవిడకీమధ్యనే ఏదో అవార్డునిచ్చి బెంగళూరులో ఘనంగా సన్మానం కూడా చేసారు!”
“ఔనౌను, ఆ విషయం ఏదో పత్రికలో నేనూ చదివానులే వనజా! అన్నట్లు నీకు తెలీదేమో, ఆవిడ మరెవరో కాదు, మన ప్రక్క బ్లాక్‍లో మూడువందల ఆరవ ఫ్లాట్లో వుండే సంగీతే. ఎవడో జ్యోతిష్కుడు ఆవిడ పేరులో ఒక అక్షరం తగ్గాలని చెబితే ‘గీత’ అని కుదించుకుందటలే. ఈ విషయం నాకూ నిన్ననే తెలిసింది” సన్నాయి నొక్కులు నొక్కుతూ చెప్పింది హేమ.
హేమ చెప్పింది వింటూనే, బుగ్గపై చూపుడు వేలు పెట్టుకుని “ఎట్టెట్టా, ఆ పొట్టి చేతుల జుబ్బాలు వేసుకుని తిరుగుతుందే, ఆ సంగీతే! సన్మానం వార్తని పత్రికలో చూసిననాడే అనుకున్నా సుమీ, ఇదేదో ఊరూపేరూ లేని సంస్థలకి ఎదురు డబ్బులిచ్చి చేయించుకున్న సన్మానం అని. అడ్డమైనవాళ్ళ కాళ్ళూ పట్టేసుకుని ఒకటీ అరా అవకాశాలని కొట్టేయడమూ, ఎలాగోలా వార్తల్లో తమ పేరూ, ఫోటోలూ పడేట్టు చేసుకోవడమూ, ఇంక ఆ తర్వాత తామంతటి వాళ్ళే లేరన్నట్టుగా రొమ్ములు విరుచుకుని తిరిగేయడమూ ఈ మధ్యన ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదే హేమా!”
“మరే.”
ఇలా ప్రక్కోడ్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకునే శాల్తీలు మనచుట్టూరా చాలామందే ఉన్నారండోయ్!
కాకపొతే, అత్యంత అచ్చరువొందే విషయమేమిటంటే ఈ ఇరువురు స్త్రీలూ మరెవరో కాదు, మన మిత్రద్వయాలని అగ్నిసాక్షిగా (విడివిడిగానే లెండి) పెళ్ళాడి వారి అడుగుజాడల్లో కలివిడిగా నడిచే ఆదర్శ అర్థాంగీమణులే.
అవాక్కయారా!
***
సాయంత్రం అయిదున్నరకల్లా ఆఫీసులో పనిముగించుకుని ఇళ్ళకి వెళ్లబోతున్న మిత్రద్వయం వద్దకి చింకిచాటంత మొహంతో వచ్చింది పర్సనల్ సెక్షన్లో పనిచేసే సుజాత.
“ఏమండోయ్, మీ ఇళ్ళల్లో తెలుగు దినపత్రిక తెప్పిస్తారా?”
“భలేదానివే సుజాతా, ఉదయం కాఫీ త్రాగడమన్నా మానేస్తాను గానీ తెలుగు దినపత్రిక చదవకుండా మాత్రం ఉండలేను” అన్నాడు గిరీష్.
“నేనూ డిటోనే” అన్నాడు మహేష్.
“ఆ విషయం నువ్వు మాకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదులే” జగన్ చెవిలో గొణిగాడు గగన్.
ఎంత మెల్లిగా అన్నా మహేష్ పాముచెవులు ఆ మాటలని పసిగట్టేసాయి.
“ఏమిటి, జగన్ చెవిని కొరికేస్తున్నట్టున్నావు?” అన్న మహేష్ మాటలకి కంగారుపడ్డాడు గగన్.
“అబ్బే, అదేంలేదండీ, మీరిద్దరూ ప్రాణమిత్రులు కాబట్టి ఏ పని చేసినా కలిసే చేస్తారని చెబుతున్నాను. జగన్ గారూ, అంతే కదూ?”
ఔనన్నట్టుగా తలూపాడు జగన్.
“సర్లేగానీ సుజాతా, ఇంతకీ అసలు విషయమేంటి?”అడిగాడు గిరీష్.
“మరేంలేదండీ, ఈ ఆదివారం అనుబంధంలో పడ్డ కథ ‘నీలో నేను’ అంటూ ఉత్సాహంగా చెబుతున్న సుజాతకి మాటలకి మధ్యలోనే అడ్డొచ్చి “భలే బాగుందండీ ఆ కథ. హృదయాన్ని కదిలించే అద్భుతమైన ప్రేమకథ. చివరికొచ్చేటప్పటికి నా కళ్ళు చెమ్మగిల్లాయంటే నమ్మండి. ఎంత చక్కగా వ్రాసాడండీ రచయిత! అబ్బో నభూతో న భవిష్యతి” అన్నాడు మహేష్.
“ఔనౌను. చాన్నాళ్ళకి ఒక మంచికథని చదివిన అనుభూతి కలిగింది” అన్న గిరీష్ మాటలకి సుజాత ముఖం వెలిగిపోయింది.
ఆమె నోరు తెరిచి ఏదో చెప్పబోతోండగా, అటెండర్ ఏసోబు వచ్చి బాసు పిలుస్తున్నాడన్న కబురందించడంతో, హడావిడిగా బాస్ ఛాంబర్లోకి దూరింది సుజాత.
“ఆఫీసు కట్టేసే సమయంలో బాసాసురుడు ఈవిడని ఎందుకు పిలిచాడంటావు ఏసోబూ” అన్నాడు మహేష్ బుర్ర గోక్కుంటూ.
“ఆ ఏముంది సార్, మేడంగారి భర్తగారు కథలూ, కవితలూ వ్రాస్తారుగా! నిన్న పత్రికలో ఆయన కథ పడిందిగా, దానిగురించే అయుంటది. మన బాస్‍కి తెలుగుకథలంటే ప్రాణం కదా” అన్న ఏసోబు మాటలతో, తాము ఇంతదాకా పొగిడిన ఆ రచయిత మరెవరో కాదనీ, సుజాత భర్తేనని అర్థమయింది ఆ మిత్రద్వయానికి.
ఇంకేముందీ, క్షణాలమీద ప్లేట్ ఫిరాయించేసారిద్దరూ.
“అనుకున్నాను సుమీ, ఆంగ్ల నవల్లు ఎడాపెడా చదవేసేయడమూ, వాటిని మక్కీకి మక్కీ మరో భాషలోకి దించేయడమూ, ఆపైన అదంతా తమ స్వంతమేనన్నట్టుగా గప్పాలు కొట్టుకుంటూ తిరగడమూనూ! జనాలని బొత్తిగా వెర్రివెంగళాయలని చేసేస్తున్నారు, ఛ ఛ, ఈ మధ్యన ఈ బాపతు కాపీరైటర్లు మరీ ఎక్కువైపోతున్నారు కదూ గిరీ”
“మరే.”
అదే సమయానికి బాస్ ఛాంబరునుండి బైటకి వచ్చిన సుజాత చెవిలో వీళ్ళ మాటలు పడడంతో ఆమె మొహం మాడిపోయింది.
ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న గగన్ ‘వీళ్ళు బాగుపడరు’ అని గొణుక్కుంటూ ఆఫీసు అల్మారాకి తాళం వేసేసి తన బ్యాగుని సర్దుకుని జగన్‌తో కలిసి బైటకి నడిచాడు.
***
“జగన్ గారూ, పొయ్యే కాలం కాకుంటే ఆ మిత్రద్వయానికి అంత నోటిదూల దేనికి చెప్పండి? కష్టపడి ఒక మెట్టు పైకెక్కిన వ్యక్తిని మనసారా అభినందిస్తే వాళ్ళ సొమ్మేంపోతుందంటారు? ప్రక్కోడి ఉన్నతిని చూసి ఉప్పొంగకపొతేమానె, కనీసం ఈర్శ్యపడకుండానైనా ఉండొచ్చుగా”
ఆఫీసయిపోయాక బస్సుస్టాండు వేపు నడుస్తూ, మిత్రద్వయం మాటల్నే తలచుకుంటూ వాపోయాడు గగన్.
“చూడండి గగన్, ఎవడో ముక్కూమొహం తెలీనోడు ఎవరెస్ట్ శిఖరాన్నెక్కేసి గిన్నిస్ బుక్కులోకి చేరిపోయాడంటే అదేదో తామే సాధించేసినట్లుగా ఆనందించేసే ఈ జనమే, ఆ ఘనతని సాధించింది మన ప్రక్కింటోడో, లేదా మనకి తెలిసినోడో అని తెలియడం ఆలస్యం, వెంటనే ‘వార్నీ, ప్రక్క గల్లీలో వున్న భువనగిరి ఖిల్లా ఎక్కేసి ఎవరెస్ట్ అని బిల్డప్ యిస్తున్నాడీడు! కెమెరాలో జిమ్మిక్కులెక్కువైపోయాయి మామా’ అంటూ అవాకులూ చెవాకులూ పేలి సదరుశాల్తీని అపకీర్తిపాలు చేస్తే కానీ నిద్రపోలేరు” అన్నాడు ఏళ్ల తరబడీ ఆ మిత్రద్వయం మనస్తత్వాలని కాచి వడబోసిన జగన్.
“ఉత్తి పుణ్యానికి ఎదుటివారి మనసుని కష్టపెడితే వీళ్ళకి ఏం ఒరుగుతుందంటారు?”
“ఎదురుగా కనిపించే వాడితో కాకుండా ఎక్కడో ఉన్నోడితో, అదీ ఏమాత్రం పరిచయం లేనోడితో పోలిక పెట్టుకోవడంలో కిక్కేముంటుంది చెప్పండి? అదే తమ చుట్టుప్రక్కలే వుంటూ తమని బాగా ఎరిగున్నవారితో తమని తాము పోల్చుకుంటూ, పొరపాటున ఏ చిన్నవిషయంలోనో వాళ్ళు తమకంటే ఆవగింజంత పైనుంటే, యికంతే, వాళ్ళని ఏ కీలుకి ఆ కీలు విరిచేసి క్రిందకి దింపేస్తే కలిగే శునకానందం మరెందులోనూ దొరకదండీ వాళ్ళకి. మీరనవసరంగా వాళ్ళగురించి ఆలోచించి మీ బుర్ర పాడుచేసుకోకండి, కాలమే వాళ్లకి తగిన గుణపాఠం చెబుతుందిలెండి.”
***
పదునైన మాటలనే గునపాలతో జనాలని మానసికంగా పాతాళానికి అదిమేసీ, చిదిమేసీ, వీరి మాటలపోటుకి ఆ అభాగ్యులు విలవిల్లాడుతుంటే అది చూసి అమితానందాన్ని పొందే ఈ మిత్రద్వయానికి ఈమధ్యన అతి పెద్ద సమస్య ఒకటి వచ్చిపడింది.
అదేమిటంటే, అరచేతుల్లో అందమైన బుజ్జి బుజ్జి సెల్‍ఫోన్లు, వాటినిండా పేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ లాంటి బోలెడన్ని సాంఘికమాధ్యమాలు రావడంతో, జనాలు నేరుగా మాట్లాడుకోవడాలు త్రగ్గించేసి ఆన్‌లైన్ ఛాటింగుల్లో మునిగిపోతుండడం మూలాన మిత్రద్వయానికి నోటిదూల తీరే అవకాశాలు బాగా కుంచించుకుపోయాయి.
సమస్య తీవ్రత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగీపెరిగీ మానసిక క్రుంగుబాటు లోకి దించేయకముందే యిరుబుర్రలనీ ఏకంచేసి సానపెట్టగా, పెట్టగా, ఇరువురి మెదడుల్లో ఒకేసారి మహత్తరమైన ఆలోచన మెదిలింది.
ముల్లుని ముల్లుతోనే తీయాలి, సాంకేతికత సృష్టించిన సమస్యని సాంకేతికతతోనే సాధించాలి!
అంతే, ఇక ఆ మిత్రద్వయం చెలరేగిపోయి, చకచకా అన్ని సాంఘికమాధ్యమాల్లోనూ తమ పేరుతో విరివిగా ఖాతాలని తెరిచేసి, వాటిలోని మెళకువలన్నీ ఔపోసన పట్టేసారు.
మరి, అనతికాలంలోనే వీరిరువురూ ఎంతటి అద్భుతమైన ప్రావీణ్యతని గడించారో ఒక్కసారి చూసేద్దామా!
***
“మహీ, ఈ శంకరంగాడిని చూడ్రా, వాడి కొడుకు ఓ డొక్కు మ్యూజిక్ బ్యాండుని తయారుచేసి, రెండు మూడు ప్రదర్శనలిచ్చేప్పటికి, దానికే వాడేదో పేద్ద శంకర్‍మహదేవన్ అయిపోయినట్టుగా వీడి కాళ్ళు భూమ్మీద ఆనడంలేదు! పైగా తలకి మాసిన సంగీతసంస్థ ఒకటి ఆ బోడిబ్యాండ్‍కి ఏదో అవార్డుని ప్రదానం చేసిందట నిన్న, ఠక్కున ఈరోజు ఆ ఫోటోలని గ్రూప్‍లో పెట్టేసాడు! ఏదోటి చేసి వీడి పొగరు దించేయాల్రా బాబూ”
“దానికంత ఆలోచన దేనికి గిరీ? ఈరోజు మన శివ పుట్టినరోజుగా, వాడిని అభినందిస్తూ గ్రూపులో నేను శుభాకాంక్షలు పెడతాను. నువ్వూ వెంటనే మరో గ్రీటింగ్ కార్డు గానీ, స్టిక్కర్ గానీ పెట్టేయ్. వీలైతే పావుగంట నిడివికి త్రగ్గకుండా వుండే రెండు వీడియోలని కూడా పెట్టేయ్. దాంతో గ్రూప్‍లో అందరి ధ్యాసా యిటు మళ్ళుతుంది. అంతే.”
“భేషయిన ఆలోచనరా”
అప్పటికప్పుడే ఆ పని చేసాకగానీ వారి మనసులు శాంతించలేదు.
***
పెరిగిపోతున్న సాంకేతికతకు ధీటుగా మన మిత్రద్వయం ఇలా చెలరేగిపోతుంటే, మరి పతియే ప్రత్యక్ష దైవమని భావించే వీళ్ళ భార్యలు మాత్రం మడిగట్టుకుని కూర్చుంటారా ?
“వనజా, మన ప్రక్క ఫ్లాట్ జ్యోతిక తెలుసుగా, వాళ్ళ పెద్దపిల్లకి చదరంగం ఆటలోమొదటి బహుమతి వచ్చిందని మొన్న మన అపార్ట్‌మెంట్ వాట్సప్ గ్రూపులో పెట్టిందా, ఈ రోజేమో వాళ్ళ చిన్నపాపకి బాడ్మింటన్‍లో బంగారుపతకం వచ్చిందని గొప్పగా పెట్టేసింది. ఆ పిల్లలని చూసుకుని దానికి ఎంత మిడిసిపాటో! దాని అహంకారం అణగాలంటే మనం వెంటనేఏదోటి చేయాల్సిందే” ఆవేశంగా అంది హేమ.
“అదెంత పని హేమా! మా రిషీగాడు ఆమధ్యన మా బాల్కనీలో నిలబడి సంధ్యవేళలో సూర్యుడు క్రిందకి దిగుతున్న ఫోటోని తీసాడుగా, ఆ ఫోటోని నేనిప్పుడే గ్రూపులో పెడతాను. నువ్వు వెంటనే ‘వావ్, బ్యూటిఫుల్, గ్రేట్ క్లిక్’ అంటూ ఓ నాలుగు యిమోజీలతో కామెంట్ పెట్టేసేయ్. దెబ్బకి గ్రూప్‍లో అందరి దృష్టి ఇటు మళ్ళుతుంది. యిక ఆ జ్యోతికకీ, దాని పిల్లలకీ గ్రూప్‍లో ఏ ఒక్కరైనా అభినందనలు పెడితే ఒట్టు. ఏమంటావ్?”
“సూపర్ ఆలోచన వనజా, నీ బుర్ర అమోఘం, మరెందుకింక ఆలస్యం. ఫోటో పెట్టేసేయ్.”
వనజని మెచ్చుకుంటూనే తొందరపెట్టింది హేమ.
***
అలా సతీసమేతంగా పది వెటకారాలూ, పాతిక వేళాకోళాలతో కులాసాగా కాలం వెళ్ళబుచ్చుతున్న మిత్రద్వయం, ఈవేళ ఒకటే ఆందోళన పడుతున్నారు. దానికి కారణం, ఆఫీసులో పదోన్నతి ఫలితాలని మరి కొద్దిసేపట్లో ప్రకటించబోవడమే!
ఫలితాల జాబితాని చేతిలో పట్టుకుని మేనేజరు గదిలోనుండి ఏసోబు బైటకి రాగానే, తమ బ్రాంచినుండి ఆ చిట్టాలో ఎవరెవరికి చోటు దొరికిందాని, మిత్రద్వయంతో సహా అంతా బెల్లం చుట్టూ మూగిన చీమల్లా అతని చుట్టూ గుమిగూడారు.
జాబితాలోకి తొంగి చూస్తూనే, సంతోషంతో కెవ్వుమన్నారు మిత్రద్వయం!
ఎందుకంటే, ఆ జాబితాలోని మొదటి రెండుపేర్లూ వీళ్ళవే!
మాటలతోనే మనుషులకి ఘాటుగా చురకలు పెట్టడంలో ఆరితేరిన వీరులైన వీరిద్దరూ ఆఫీసు పనిలోనూ ఉద్దండులేనని నిరూపించుకున్న ఆనందంలో ఒకరినొకరు అభినందించేసుకుని, ఆపైన సెల్‍ఫోనుల్లోకి తలలు దూర్చేసి, ఠకఠకా ఆన్‍లైన్ గ్రూపులన్నింట్లోనూ ఈ శుభవార్తని పెట్టేసి, ఆత్రంగా ఫోన్‌కి కళ్ళప్పగించేసారిద్దరూ.
క్షణాలు కాస్తా నిముషాలుగా మారుతున్నా, ఏ గ్రూపులోనూ ఏ ఒక్కరినుండీ అభినందనలు రాకపోవడంతో నుదిటికి పట్టిన చెమటని జేబురుమాళ్ళతో తుడుచుకుంటూ మొహామొహాలు చూసుకున్నారిద్దరూ!
ఇంతలో ‘టైపింగ్’ అంటూ ఫోనుకి పైవేపు కనబడడంతో మిత్రద్వయం మొహాలు వెలిగిపోయాయి.
రెండుక్షణాల తర్వాత ఠక్కున ఇద్దరి ఫోనుల్లోకి మెసేజి వచ్చిపడింది.
అది చదివేలోగా మరో మెసేజి, ఆపైన మరోటి, వెంటవెంటనే మెసేజిల పరంపర!
‘యాహూ’ అంటూ చేతులతో హైఫై చెప్పుకుని ఆనందంగా ఫోన్ల వేపు చూపు సారించిన రెండుక్షణాలకే బిర్రబిగుసుకుపోయారిద్దరూ!
అందాకా వీళ్ళనే గమనిస్తున్న గగన్ అకస్మాత్తుగా మారిపోయిన వాళ్ళ వాలకాలని చూసి కంగారుపడ్డాడు.
‘ఉన్నట్టుండిఏమైందబ్బా వీళ్ళకి?’ అనుకుంటూ వాళ్ళ చేతుల్లోని ఫోన్ల ని చూసిన గగన్ కి, మెసేజిల ప్రవాహంతో ఇద్దరిఫోనుల్లోని ఛాట్‍బాక్సులూ అంగుళం ఖాళీ లేకుండా నిండిపోయి కనిపించడంతో, ఒక్కో మెసేజినీ ఓపిగ్గా చదవడం మొదలెట్టాడు గగన్.
‘రాజు, స్వరూపలకి పెళ్లిరోజు శుభాకాంక్షలు’
‘విష్ యు బోత్ ఎ వండర్ ఫుల్ మ్యారేజ్ యానివర్సరీ’
‘వావ్, వాట్ ఏ ఫెంటాస్టిక్ ఆర్ట్’
‘బ్యూటిఫుల్ వీడియో’
‘వండర్‍ఫుల్ క్లిక్’
‘ఈ మెసేజిని చదివిన వారు మరో ముగ్గురికి ఫార్వర్డ్ చేయండి. వెంటనే మీ ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది’
‘తిరుపతి శ్రీనివాసుని నిజరూప దర్శనం ఈ వీడియో. చూసి తరించండి’
‘ఈ ఫోటోలోని మూడేళ్ళ పాప తప్పిపోయి ఇప్పటికే ఆరు రోజులయింది. మానవతా దృక్పథంతో దీన్నిఫార్వర్డ్ చేయండి’
..
..
అన్ని గ్రూపుల్లోనూ లెక్కలేనన్ని మెసేజిలూ, వీడియోలూ, స్టిక్కర్లూ, గ్రీటింగ్‍కార్డులూనూ!
వాటి ధాటికి తట్టుకోలేని మన మిత్రద్వయం ఫోన్లు రెండూ ‘మెమరీ స్పేస్ రన్నింగ్ అవుట్’ అన్న నోటిఫికేషన్‌ని రంగురంగుల్లో ఫ్లాష్ చేయడం మొదలెట్టాయి.
విషాదకరమైన విషయమేమిటంటే, ఈ మెసేజీల సునామీలో, మన మిత్రద్వయం పోస్టు చేసిన పదోన్నతి శుభవార్త కాస్తా, కన్ను పొడుచుకున్నా కానరాని సుదూరతీరాలకి కొట్టుకుపోయింది.
ఢాం..
పెద్దగా వినొచ్చిన శబ్దానికి గగన్‌తో సహా ఆఫీసులో అందరూ తలలు త్రిప్పి చూస్తే ఏముందీ, సాంఘికమాధ్యమాల సమూహాలన్నీ కూడబలుక్కుని కొట్టిన బూమరాంగ్ దెబ్బకి ఊపిరాడక క్రిందపడి గిలగిలా కొట్టుకుంటున్నారు మాటలతోనే మనుషుల మనసులని కుంచించేసే మన మిత్రద్వయం.
ఎదుటివారు నొచ్చుకునేలా ప్రవర్తించే శాల్తీలకి ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి శాస్తి జరగక తప్పదు కదూ!
“మరే!!!”