[అనుకృతి గారు రచించిన ‘మిథ్యా బింబం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
పరిమళ ‘యశోదా హాస్పిటల్’కి కొడుకు గౌతమ్, కోడలు శ్రావ్యతో కలిసి వచ్చింది. కోడలు తాతగారికి బాగా లేదంటే పూనానుండి పిల్లలతో కలిసి వచ్చింది, చాలా పెద్ద వెయిటింగ్ హాల్ అది. గౌతమ్, శ్రావ్యలు కొత్తగా పెళ్లయిన జంట. “టైం వుంది” కాబట్టి, కాసేపు అలా వెళ్ళొస్తామని వెళ్లారు. నవ్వుకుని, వెళ్ళమని చెప్పి, ఒక సీట్ చూసుకొని కూర్చుంది.
ఫోన్ మ్రోగితే తీసి చూసింది, కేశవ్. “హలో” అన్నది.
“ఎప్పుడు వస్తున్నావు?”
“గౌతమ్ నాలుగు రోజులు ఉంటాడట, నేను కూడా వాళ్ళతోనే వస్తాను” కవ్వింపుగా అన్నది
“కొత్త జంట, వాళ్ళ మధ్యలో నువ్వెందుకు?, నువ్వు వచ్చేయి.”
“ఎందుకో అంత తొందర” నవ్వుతూ అన్నది.
“ప్రతి పదినిముషాలకి నా దగ్గిరికి వస్తుంటావుగా ఆఫీస్‌లో, నువ్వు కనపడకపోతే ఏమీ బాగోలేదు, ఇంట్లో కూడా వుండాలనిపించటం లేదు.”
“అయ్యో పాపం, పెద్ద కష్టమే వచ్చింది మీకు” వెక్కిరింపుగా అన్నది.
“నిజంగా చెబుతున్నా, వాడికి చెప్పా, నీకు టికెట్ బుక్ చేయమని”
“60 లోకి వచ్చారు, ఈ విరహమేమిటి?” అతని మాటలకి లోలోపల మురిసిపోతూ అన్నది.
“80 వచ్చినా ఇంతే, ప్లీజ్ వచ్చేయి పరిమళా” అర్థింపుగా అన్నాడు.
“వచ్చేస్తాను కానీ, ఎల్లుండికి చేయమనండి, సరేనా” అన్నది.
“ఓకే” అంటూ పెట్టేసాడు.కేశవ.
కేశవ్ స్వంతంగా ప్రాక్టీస్ పెట్టాక, పరిమళ అతని ఆఫీస్ లోనే చేరింది. గౌతమ్, శ్రావ్య కూడా ‘కేశవ్ అండ్ కో’ లోనే చేరారు. ఇద్దరూ చార్టెడ్ అకౌంటెంట్స్.
కేశవ్‌తో మాట్లాడాక, పరిసరాలు గమనించింది. తన ప్రక్కనే ఒక యువతి, ఆమె తల్లి కాబోలు కూర్చుని వున్నారు. కూతురికి ముప్పయి లోపు వండొచ్చు, తల్లికి తన వయసే ఉంటుంది అనుకుంది పరిమళ.
ఆమె ఫోన్ మోగింది, “నమస్కారం శాస్రిగారు” అన్నదావిడ.
“మీకు తెలుసు కదా ఈయనకు మళ్ళీ సీరియస్ అయ్యింది, ప్రస్తుతం ‘యశోదా’ లో వున్నారు, ఏమీ లేదండి, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడామని ఫోన్ చేసాను, ఎందుకో శాస్రిగారు, ఈ సంబంధం ఖాయం చేసుకున్నప్పటినుండీ ఈయనకు అస్సలు బాగా లేదండి, ఈ మ్యాచ్ వద్దండి, వాళ్లకు ఏదో ఒకటి చెప్పి కాన్సిల్ చేయండి.”
వింటున్న పరిమళకు ఆశ్చర్యం వేసింది. ఆయనకు బాగోలేకపోతే పాపం ఆ అమ్మాయేమి చేసింది? అనుకుంది.
బహుశా అవతలి నుండి మాట్లాడున్న ఆ శాస్రిగారు ఏదో అన్నారు కాబోలు, ఆవిడే మళ్ళి అన్నది “దానిదేముందండీ, పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి, ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు, ఏదో ఒకటి చెప్పి కాన్సిల్ చేసేయండి” అన్నది నిర్లక్ష్యంగా.
ఆమె కూతురు ఆమె చేతిలోనుండి ఫోన్ లాక్కుని, “శాస్రిగారు, ఇప్పుడేమీ తొందరపడి వాళ్ళకేమీ చెప్పకండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను” అంటూ ఫోన్ ఆఫ్ చేసింది.
“అమ్మా. ఏమిటమ్మా నువ్వు, నాన్న కండిషన్‌కీ ఆ అమ్మాయికీ ఏమి సంబంధం అమ్మా? అన్నివిధాలా మంచి మ్యాచ్, నువ్వు తొందరపడి తమ్ముడిని కష్ట పెట్టకు, వాడికి చాలా నచ్చింది ఆ అమ్మాయి., అయినా నాన్న మనం ఎన్ని చెప్పినా ఎప్పుడైనా మన మాట విన్నాడా? ఇది రెండో సారికదా తనకిలా అవటం, ఆ సిగరెట్లు, డ్రింక్స్ మానెయ్యమంటే విన్నాడా!, ఇప్పుడు లివర్ చాలా వరకు డామేజ్ అయ్యింది, ఒకవేళ ఈ గండం గట్టెక్కినా నాన్న ఒక గాజు బొమ్మలా బ్రతకాల్సిందే, పైగా నిన్నే నిందిస్తుంటాడుగా, నువ్వు తగులుకోబట్టే తాను ఆమెని వదిలేసాడంట, లేకపోతే తాను చాలా గొప్ప స్థాయిలో వుండేవాడట” ఆ అమ్మాయి ఆగింది, ఎర్రబడ్డ తల్లి మొహం చూసి.
“అవునే, ఎర్రగా, బుర్రగా వున్నాడని వీడి వలలో పడ్డాను. తనే నా వెంటబడ్డాడు. ఆమెని నేనెప్పుడూ చూడలేదు, డబ్బుకి ఆశపడి పెద్దవాళ్లు ఇష్టం లేని పెళ్లి చేశారని చెప్పాడు. ఆమె పడివుంటుంది, నాకు ఏ ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటానని చెప్పి, రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నాకు వయసు వేడిలో తెలియలేదు, పైగా డాక్టరుకీ చూపిస్తే అసలు ఆమెకి ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పిందని చెప్పాడు, నమ్మాను, అప్పటికే నేను ప్రెగ్నెంట్” చెప్పటం ఆపి కళ్ళొత్తుకుంది ఆమె.
కూతురు అడిగింది “ఆమె ఏమయ్యిందమ్మా?”
“వాళ్ళ నాన్న ఊరుకోలేదట, పెద్ద గొడవే జరిగింది, మోసం చేసాడని కేసు పెట్టి, వుద్యోగం ఊడగొట్టిస్తానని చెప్పి బెదిరించాడట, ఈయన భయపడి విడాకులకి ఒప్పుకున్నాడు. కట్నం క్రింద ఇచ్చిన మొత్తాన్ని వసూలు చేసారట ఆమె తండ్రీ వాళ్ళు, నేను దాచుకున్న డబ్బంతా ఇచ్చి, బయటపడ్డాడు” మళ్ళీ కళ్ళొత్తుకుంది ఆమె.
అప్పటిదాకా నిశ్శబ్దంగా వింటున్న పరిమళ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తలతిప్పి ఆమెకేసి పరీక్షగా చూసింది, ఆమెనెప్పుడూ తాను చూడలేదు కానీ, అతను వర్ణించిన విషయం గుర్తుకు వచ్చింది, తెల్లగా దేవతా స్త్రీలా ఉంటుందని, తాను ఆమె ముందు ఒక దిష్టిబొమ్మని నిందించాడు అప్పట్లో.. సో, ఈవిడన్నమాట, తనని , మోసం చేసి, సుధాకర్ దొంగ పెళ్లి చేసుకున్న దేవతా స్త్రీ, ప్రమీల.
తల తిప్పి మళ్ళీ ఆమెను పరీక్షగా చూసింది. తెల్లటి తెలుపే కానీ బాగా ఒళ్ళు వచ్చింది, మోటుగా వున్నది. మొహం బాగా మోటుగా తయారయ్యింది, ఎందుకో ఆమెకు విపరీతంగా చెమటలు పోస్తున్నాయి.
పరిమళ కెందుకో ఆమెను చూస్తే కోపం రాలేదు, జాలివేసింది, ఒక రకంగా ఆమె తనని ఒక నరకం నుండి తప్పించింది. గత జ్ఞాపకాలతో , నిశ్శబ్దం గా కూర్చుండి పోయింది పరిమళ.. సుధాకర్ తో పెళ్లి అయినప్పుడు తనకు ఇరవై. డిగ్రీ పాస్ అయ్యింది.
సెంట్రల్ PWD లో ఇంజనీర్ అతను, తండ్రి గ్రాండ్‌గా పెళ్లి చేసాడు. అప్పుడు తను బొద్దుగా, చామనఛాయలో ఉండేది. బొద్దుగా ఉండటం వల్లనో ఏమో, 5”3 వున్నా, పొట్టిగా అనిపించేది.
ఎంతో సంతోషంగా అత్తగారింట్లో అడుగుపెట్టింది. ఒక నెలలోనే అతని నిజ స్వరూపం బయటపడింది, సంస్కారహీనత్వం, అహంకారం అతని సొత్తు. ఎదురుతిరిగితే కొట్టేవాడు. ఒకసారి పెద్ద వదిన అనుకోకుండా వచ్చి, అతని కఠినత్వం చూసి మందలించింది. ఎదురుతిరిగి వదినను నానా మాటలన్నాడు.. వదిన తనని తండ్రి దగ్గరకు తీసుకొచ్చేసింది.
సంవత్సరం నాన్న నయానా, భయానా చెప్పిచూసారు, అన్నయ్యలు పంపించమని మొండికేశారు, అతను లొంగిరాలేదు.
తను పుట్టింట్లో వున్నప్పుడే ఈమెను పెళ్లి చేసుకున్నాడు.
తనవాళ్లు ఊరుకోలేదు, విడాకులిప్పించి, కట్నంగా ఇచ్చిన డబ్బంతా వసూలు చేశారు. ఒక్క సంవత్సర కాలంలో పెళ్లి పెటాకులయ్యింది. మళ్ళీ చదువు కొనసాగించి, ఎంకామ్ చేసింది. చిన్నన్నయ్య స్నేహితుడు, కేశవ్ తరచూ అన్నయ్యతో కలిసి వచ్చేవాడు. తర్వాత అందరికీ అర్థమయ్యింది. అతను అన్నయ్య కోసం కాదనీ తన కోసం వస్తున్నాడని కనిపెట్టారు. అతనికి పెళ్ళికాలేదు. అతను CA చేసి, అన్నయ్య పనిచేసే కంపెనీ లోనే పని చేస్తున్నాడు.
తన సంగతి తెలిసీ, చేసుకుంటానని చెప్పాడు. వాళ్ళ వాళ్ళు కూడా అతని నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. విడాకులైన తర్వాత తనని తాను ప్రేమించుకోవటం మొదలెట్టింది. శరీరాన్ని తీగలా చేసుకుంది, తన కోసం తానే సన్నగా, అందంగా మారింది, పెళ్లి అయ్యాక కేశవ్ పూనాలో ప్రాక్టీస్ పెట్టాడు.
కేశవ్, వైవాహిక జీవితంలో ఉండాల్సిన స్నేహం, ప్రేమ, అనురాగం, గౌరవం అన్నీ చవి చూపించాడు. సంస్కారవంతుడైన భర్త సాన్నిహిత్యంతో తాను ఎంతో ఎదిగింది. గౌతమ్, అజయ్ లకు తల్లి అయ్యింది. గౌతమ్, శ్రావ్య ఇద్దరూ కేశవ్ ఆఫీస్ లోనే పనిచేస్తున్నారు, తనలాగే.
విజిటింగ్ అవర్స్ మొదలవగానే, ఒక రకమైన కుతూహలంతో లోపలికి వెళ్ళింది పరిమళ. శ్రావ్య తాతగారు వున్న షేరింగ్ రూమ్ లోనే అతను, సుధాకర్ కూడా వున్నాడు. పొడవుగా, తెల్లగా అందంగా వుండే సుధాకర్ కాదు బెడ్ మీద వున్నది. పీలగా, నల్లకప్పేసిన మొహంతో, ఎండు కట్టెలాంటి శరీరంతో వున్నాడు సుధాకర్.
ఏ అందాన్ని చూసుకొని తనని హింసపెట్టాడో ఇప్పుడా అందం మచ్చుకైనా లేదు. దేవతా స్త్రీ కూడా అతని సాంగత్యంలో తన సౌకుమార్యమంతా కోల్పోయి, కన్నీళ్లు పెడుతున్నది. అతని భార్య అతన్ని చిన్న గొంతుతో సాధిస్తూ ఏడుస్తున్నది. అతను పరిమళను చూడలేదు. ఆమె కూడా అతను తనని చూడాలని అనుకోలేదు. నర్స్ వచ్చింది. పరిమళ చెప్పింది రెండు బెడ్స్ మధ్య ఉన్న కర్టెన్ వేసేయ్యమని.
(సమాప్తం)
అనుకృతి అనే కలం పేరుతో రచనలు చేసే బి. భవాని కుమారి గారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 34 ఏళ్ళు లెక్చరర్‌గా పని చేసి 2014లో రిటైరయ్యారు. 2019లో వీరి మొదటి కథ ‘తొలకరి’ సాక్షి ఆదివారం అనుబంధం ‘ఫండే’లో ప్రచురితమైంది. ఆ తరువాత రాసిన అనేక కథలు పలు వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.