[వి. శాంతి ప్రబోధ గారి ‘మిస్సింగ్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
మా అపార్ట్‌మెంట్‌లో రెండేళ్ల క్రితం వచ్చారు రజిత, సందీప్ రాజ్ దంపతులు. ఆమెకు అరవై ఐదు లోపు, అతనికి డెబ్బై లోపు. పక్క బ్లాక్‌లో వారి ఇల్లు, వారి ప్రేమ కథలా ఒక సుందర చిత్రం. ఎక్కడికి వెళ్లినా చేయి చేయి కలిపి, ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ, నవ్వులతో, నడకలతో జీవితాన్ని ఆస్వాదించే వారి జోడీ చూస్తే గుండె నిండేది.
ఆమె ఒక్కటే బయటికి వెళ్లడం కొన్నిసార్లు చూశాను, కానీ సందీప్ రాజ్ ఒంటరిగా ఎప్పుడూ కనిపించలేదు. ఆమె అతని నీడ, అతను ఆమె ఆలోచనల సముద్రం. వారి సాంగత్యం ఒక అపురూప కావ్యం. ప్రేమ, నమ్మకం, సహవాసంతో నిండినది.
మా పరిచయం సామాన్యమైనది. “హాయ్, హలో” అని చిరునవ్వుతో పలకరించుకునే వాళ్లం. మాటలు ఎక్కువ లేవు, కానీ వారి కళ్ళలో ప్రేమ మాటల అవసరం లేకుండా చెప్పేది.
నేను ఆరు నెలలు అమెరికా వెళ్లి వచ్చేసరికి, ఆ సుందర చిత్రం మసకబారింది. కువకువలాడే జంటపక్షుల్లా తిరిగే ఆ జంటలో రజిత ఒంటరిగా కనిపించింది. సందీప్ రాజ్ లేడు. ఆమె ముఖంలో ఒక అస్పష్టమైన భయం, ఆందోళన, గుండెలో దాగిన బాధ. అతనికి ఏదైనా అనారోగ్యమేమో అనుకున్నాను. కానీ అసలు విషయం తెలిసినప్పుడు, నా గుండె బరువెక్కింది. జీవితం ఎంత నిర్దయగా ఒక్క క్షణంలో అన్నీ మార్చేస్తుందో!
***
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ సిగ్నల్స్ దగ్గర ఎప్పుడూ రద్దీ ఎక్కువ. సాయంకాలాల్లో మరింత ఎక్కువ. ఆ సాయంత్రం రజిత, సందీప్ రాజ్ రోడ్డు దాటుతున్నారు. వారి నడకలో ఒక లయ, చేతిలో చేయి, కళ్లలో ప్రేమ.
కానీ ఆ క్షణంలో దూసుకొచ్చిన వాహనం ఆ లయను ఛిన్నాభిన్నం చేసింది.
రజిత రోడ్డు దాటగలిగింది, సందీప్ రాజ్ ఆగిపోయాడు. ఆమె తిరిగి చూసేసరికి, అతను కనుమరుగైపోయాడు. ఆ క్షణం ఆమె గుండెను చీల్చింది. ఆ రోజు నుండి ఐదారు నెలలు గడిచాయి, కానీ సందీప్ రాజ్ ఆచూకీ దొరకలేదు.
***
సందీప్ రాజ్ చెన్నై ఐఐటీలో రిటైర్డ్ ప్రొఫెసర్. రజిత, అదే యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా రిటైర్డ్. జీవితంలో సంపాదించిన హోదా, ఆస్తులతో హైదరాబాద్‌లో బంధుమిత్రుల సమీపంలో ఉండాలని వచ్చారు. కానీ అప్పటికే అల్జీమర్స్ చీకటి నీడ వారి జీవితంపై పడింది. సందీప్ రాజ్ జ్ఞాపకాలు క్రమంగా కరిగిపోతున్నాయి. రజిత అతని ఆలోచనల సముద్రంలో నీడలా వెన్నంటి ఉండేది. ఇంటి చిరునామా అతని జేబులో ఉంచేది, ఎప్పుడూ అతన్ని కనిపెట్టుకునేది.
ప్రతిరోజూ అల్జీమర్స్ సొసైటీ డే కేర్ సెంటర్‌కు తీసుకెళ్లేది. అతను కారు నడిపితే, ఆమె పక్కన కూర్చుని దారి చెప్పేది, అతను తడబడితే స్టీరింగ్ అందుకునేది. అక్కడ సంగీతం, ఆటలు, చర్చలతో అతన్ని కూర్చోబెట్టేవారు.
సందీప్ రాజ్ తన రోబోటిక్స్ పాఠాలను గుర్తుచేసుకుని, ఒకప్పటి ప్రొఫెసర్‌లా మాట్లాడేవాడు. రెండు గంటల తర్వాత ఇంటికి చేరేవారు. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకునేవారు.
సాయంత్రం టీ తర్వాత ఇందిరా పార్క్‌లో నడక. వ్యాధి ఉన్నప్పటికీ వారి జీవితం ఒక క్రమపద్ధతిలో సాగింది, ఆ రోజు వరకూ.
ఆ రోజు, అతను కనిపించని ఆ క్షణం ఆమె గుండెను ఆపేసినట్లైంది. ఆమె రోడ్లపై, పార్క్‌లో వెతికింది, భర్త కనిపించలేదు.
ఇందిరాపార్క్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్ చూసింది. అతను గాంధీ నగర్ వైపు నడిచినట్లు కనిపించాడు.
హైదరాబాద్ అతని సొంత నగరం. దోమలగూడలో బాల్యం, యవ్వనం గడిచాయి. కానీ అల్జీమర్స్ అతని జ్ఞాపకాలను, ఇంటి దారిని చెరిపేసింది. అందుకే రజిత గుండెలో ఒక అలజడి, భయం.
24 గంటలైనా ప్రొఫెసర్ ఇంటికి రాలేదు. ఆమెలో కంగారు పెరిగిపోయింది. బంధు మిత్రుల ఇళ్లకు వేళ్ళాడేమోనని ఆరా తీసింది. ఎవరి ఇంటికి వెళ్లలేదు. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది.
సిసి కెమెరాల ఆధారంగా ప్రయత్నం చేశారు. రెండు మూడు చోట్ల అలా కనిపించి మాయమయ్యాడు. ఆ ప్రాంతాల్లో టీ షాప్‌లు, ఇతర షాపుల్లో అడిగారు.
అతని కోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. నగరమంతా అతని ఫోటో, పేరు, వయసుతో పోస్టర్లు వేసింది. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పార్కులు, సినిమా హాళ్లు వగైరా వగైరా.. ఎక్కడా అతని జాడ లేదు.
రేడియో, టీవీ, సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది. శ్రమ, సమయం, డబ్బు అన్నీ ఖర్చయ్యాయి. కానీ సందీప్ రాజ్ కనిపించలేదు. ఆమె గుండెలో ఒక నిశ్శబ్ద ఆక్రందన. ఒక తపన.
రజిత ఆవేదన చూస్తే గుండె కరిగిపోయేది. ఆమెను పలకరించి, “ఏ సాయం కావాలన్నా మేమున్నాం,” అని భరోసా ఇచ్చాను. అలా మా పరిచయం స్నేహంగా మారింది.
సందీప్ రాజ్‌లో ముఖం కడుక్కుని మర్చిపోవడం, కళ్లజోడు, ఫోన్ ఎక్కడ పెట్టాడో మర్చిపోవడం వంటివి కనిపించినప్పుడు, గదిలో నక్షత్రాలతో మాట్లాడుతున్నప్పుడు అల్జీమర్స్ లక్షణాలని గుర్తించలేకపోయామనీ, రిటైర్మెంట్ సంగతి మరచిపోయి కాలేజీకి బయల్దేరడం వంటి సంఘటనల తర్వాత వైద్యుడిని సంప్రదించినప్పుడు అల్జీమర్స్ అని తెలిసిందనీ ఆమె చెప్పి, వెంటనే తెల్సుకోలేకపోయిన తనంతో తనను తాను నిందించుకున్నది రజిత. అప్పుడు ఆమె గుండెలోని బాధ ముఖంలో కనపడింది నాకు.
అతని వ్యాధి లక్షణాలు రజిత జీవితాన్ని సవాలుగా మార్చాయి. ఆమె అతన్ని 24 గంటలూ కాపాడుకునేది, అతని ప్రతి అడుగు గమనించేది. కానీ ఆ రోజు ఆమె చేతిలోని చేయి జారిపోయింది. ఆ క్షణం ఆమెను నిస్సహాయంగా నిలబెట్టింది. వృద్ధాప్యానికి తోడు భర్త కోసం వెతుకులాట, మానసిక ఆందోళనతో ఆమె అలసి పోతున్నది. దానికి తోడు నడుము నొప్పి వేధిస్తున్నది.
జ్ఞాపక శక్తికి అతను మందులు వేస్కోకపోవడం వల్ల మరింత క్షీణించే అవకాశం ఉంది. ఇంటి కోసం వెతుకులాటలో అతనికి అస్థిమితం మరింత పెరుగుతుంది, గందరగోళం వస్తుంది.
క్రమశిక్షణకు, శుభ్రతకు ప్రతిరూపంగా ఉండే ప్రొఫెసర్ గారు అయోమయంలో టాయిలెట్ సీటు బయట మలమూత్ర విసర్జన చేయడం ఆమెను చికాకు పెట్టినప్పటికీ అతను తెలిసి చేయడం లేదని తెలుసు. అందుకే గట్టిగా అరవలేకపోయానని, ఇటువంటి జబ్బు వల్ల బాధ పడేది రోగి మాత్రమే కాదు కుటుంబమనీ చెప్పి, ఇప్పుడెక్కడ ఎలా ఉన్నారో అని రజిత చాలా ఆందోళన పడింది, భయపడింది. బాధపడింది.
మరొక్క రోజయితే రౌండ్ ది క్లాక్ ఉండి చూసుకునే సహాయకుడు కూడా ప్రొఫెసర్ గారితో ఉండేవాడు. ఇటువంటి సందర్భాలు ముందే ఊహించిన ప్రొఫెసర్ గారి అన్న కొడుకు అమెరికా నుంచి ఆపిల్ ఫోన్, ట్రాకర్ మిత్రుడితో పంపించాడు. అవి చేతికి రాకముందే ఇలా జరిగిందని బాధపడింది రజిత.
ప్రొఫెసర్ గారు తప్పిపోయిన మొదట్లో వెంట వచ్చిన బంధువులు, మిత్రులు నెమ్మదిగా దూరం జరిగారు. కానీ బంధుమిత్రులు ఆమెను నిందించడం మొదలెట్టారు. “అతన్ని జాగ్రత్తగా చూసుకోలేదు,” అని ఆమెనే బాధ్యురాలిగా చిత్రీకరించారు. ఆ బాధలో ఆమె ఒంటరిగా నిలబడింది. అయితే, సందీప్ రాజ్ విద్యార్థులు, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న చెన్నై ఐఐటీయన్లు ఆమెకు అండగా నిలిచారు. వారి మద్దతు ఆమెకు కొంత స్వాంతన.
పదిహేను రోజుల తర్వాత ఒక టీ షాప్ యజమాని ఫోన్ చేసి, “మాసిన బట్టల్లో ఒకాయన ఇంగ్లీష్‌లో పాఠం చెప్పాడు. కస్టమర్లు వింతగా చూశారు, కానీ ఒక యువకుడు అతనికి భోజనం పెట్టించాడు,” అన్నాడు.
రజిత అక్కడికి పరిగెత్తింది, కానీ అతను లేడు. అలా ఆశలు చిగురించడం, నీరసించడం జరుగుతున్నది.
అలా ఫోన్‌లు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. అలా వచ్చిన ప్రతిసారి ఆమె గుండెలో ఒక కొత్త గాయం.
అల్జీమర్స్ డిమెన్షియా వంటి మానసిక సమస్యలున్న వాళ్ళు తమ చిరునామా మరచిపోయి తప్పిపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. రోజులు, వారాల్లోనే దొరుకుతారు. లేదా వారికి తమ ఇంటి అడ్రస్ గుర్తొస్తుందని వైద్యులతో జరిపిన సంభాషణలో చెప్పిన మాటలు. ఆమె మదిలో పదిలంగా ఉన్నాయి. అవే ఆమెకు ఆశను, ఇంధనాన్ని ఇస్తున్నాయి.
***
జీవితం ఒక అనిశ్చిత ప్రయాణం. ఒక క్షణం నవ్వులతో నిండితే, మరుక్షణం కన్నీళ్లతో తడమగలదు. సందీప్ రాజ్, రజితల జీవితం ఈ సత్యాన్ని నిరూపించింది. వారు చదువుకున్నారు, ఉన్నత హోదా సంపాదించారు. కానీ అల్జీమర్స్ వారి సౌందర్యమైన సుఖ జీవితాన్ని చీకటిలోకి నెట్టింది.
కోవిడ్ సమయంలో వారి కొడుకు స్వరాజ్ ఇంగ్లాండ్‌లో చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు చివరి మాటలు, చివరి చూపులు కూడా లేని ఆ బాధ వారిని కుంగదీసింది. లోలోనే కుమిలిపోయిన భర్తను ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నించింది. ప్రేమతో, ఆశతో సందీప్ రాజ్‌ను కాపాడుకుంది. ఆ సమయంలో వారికి తెలియకుండా ఎప్పుడొచ్చి తిష్టవేసిందో మాయదారి రోగం? అప్పటి నుంచి ఆమె అతని ఊతకర్ర అయింది. ఆటను లేని ఆమె ఆ వెతుకులాటలో మానసికంగా, శారీరకంగా తీవ్రంగా అలసిపోయింది. తనలో తాను ఎంత యుద్ధం చేస్తున్నదో తెలియదు కానీ, ప్రేమ ఆయుధంగా, ఆశ శక్తిగా ఆమె జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు.
“ప్రొఫెసర్ గారిలాగే ఉన్న వ్యక్తి మృతదేహం కనుగొన్నాం. మీరు ఒకసారి వచ్చి గుర్తించండి” అని పోలీస్ స్టేషన్ నుండి ఫోన్. వెంట నా కొడుకు మనోజ్ ని పంపించా.
పరుగు పరుగున వరంగల్ చేరింది. కానీ అతనిది కాదు. అలా గుర్తించడానికి వెళ్లిన ప్రతిసారి ఎన్నో చేదు అనుభవాలు. ఆ శరీరాలు గుర్తించడానికి అనువుగా ఉండవు. కొన్నిసార్లు డి ఎన్ ఏ పరీక్ష చేయించాల్సి వస్తున్నది.
రజిత కుటుంబ విషాదాన్ని, ఆమె నిస్సహాయస్థితి, ఒంటరితనం, గిల్ట్ చూసి నా కొడుకు మనోజ్ కదిలిపోయాడు. అల్జీమర్స్ బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించాడు. ఐఐటీ విద్యార్థులతో కలిసి, క్యూఆర్ కోడ్ ఉన్న పెండెంట్‌లు, బ్రాస్‌లెట్‌లు తయారు చేయాలని ఆలోచించాడు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పేరు, చిరునామా, అత్యవసర కాంటాక్ట్, వైద్య వివరాలు కనిపిస్తాయి. ఇది తప్పిపోయిన వారిని కుటుంబాలతో కలపడానికి సహాయపడుతుంది. మనోజ్ ఆలోచన ఒక చిన్న అడుగు, కానీ ఒక పెద్ద ఆశాజ్యోతి. సాంకేతికత ద్వారా మానవత్వాన్ని కాపాడవచ్చని అతను నమ్మాడు.
***
18 నెలల తర్వాత, పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. “మీ ఆయనై ఉండొచ్చు, ఒకసారి చూడండి,” అన్నారు. రజితతో నేనూ వెళ్లాను.
చింపిరి జుట్టు, ముక్కలు చెక్కలైన మురికి బట్టలు, ధూళి దుమ్ముతో కప్పబడిన వ్యక్తిని అలా కళ్లప్పగించి చూసింది రజిత. ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. అతని నుదుటిపై ముద్దు పెట్టి, ఆమె తన గుండె బరువును దించుకుంది.
కానీ, ప్రొఫెసర్ సందీప్ రాజ్ ఆమెను గుర్తించలేదు. అల్జీమర్స్ అతని జ్ఞాపకాలను తీసుకుంది, కానీ రజిత ప్రేమను తీసుకోలేదు.
ఆమె కళ్లలో కన్నీళ్లు, గుండెలో ఒక ఊరట. అతను బతికే ఉన్నాడు. అది చాలు ఆమెకు.