121
ప్రపంచం నాతో చిత్రాలతో మాటాడుతుంది
గానంతో నా ఆత్మ జవాబిస్తుంది
122
రాత్రంతా ఆకాశం దాని పూసలకు చెబుతుంది
సూర్యుని స్మృతిలో
అసంఖ్యాక నక్షత్రాల గురించి
123
రాత్రి చీకటి, నొప్పిలా మూగ
వేకువ చీకటి, శాంతిలా మౌనం
124
అప్రసన్నతని అహంకారం తన రాళ్లలో మలుస్తుంది
ప్రేమ పూలలో దాని సమర్పణని అర్పిస్తుంది
125
పరిమితమైన కేన్వాసులా వినయంగా కాక
అతివినయంతో కుంచె సత్యాన్ని తక్కువచేస్తుంది
126
దూరాకాశాన్ని కోరుతూ కొండ
అనంతమైన కోరికతో కదిలే
మేఘంలా అవాలనుకుంటుంది
127
ఒంపిన వాళ్ల సిరాని సమర్థించుకుందుకు
పగలుని రాత్రి అని వాళ్లు ఉచ్చరిస్తారు
128
మంచి అన్నది లాభమైనాక
మంచితనం మీద లాభం నవ్వుకుంటుంది
129
ఉబ్బిన దాని అహంకారంలో
సముద్ర సత్యాన్ని బుడగ అనుమానిస్తూ
శూన్యంలో నవ్వుతూ పగిలిపోతుంది
130
అనంత రహస్యం ప్రేమ
స్పష్టం చేయడానికి దానికి ఏమీ లేదు గనుక
131
సూర్యున్ని వాటికవే
దాచాయని మరచిపోయి
మేఘాలు చీకటిలో దుఃఖిస్తున్నాయి
132
దేవుడు తన కానుకలు అడగడానికొచ్చినపుడు
తన సొంత సంపదని మనిషి కనుగొంటాడు
133
నా ఏకాంత వియోగ ప్రమిదెకు
జ్వాలలా నీ జ్ఞాపకాన్ని నువు వదులుతావు
134
నీకు పుష్పాన్ని సమర్పించాలని వచ్చాను
కానీ నా తోటంతా నీదే అయినపుడు
అది నీదే
135
నీడ నిక్షేపించుకొన్న ఒక కాంతి జ్ఞాపకం
(మళ్ళీ వచ్చే వారం)
శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S.
కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు.
అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు.
వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.