మనం నివసించే హక్కుకి పూర్తి మూల్యం చెల్లించినపుడు
స్వాతంత్రం ఆర్జిస్తాం
77
ఒక క్షణంలో నీ అశ్రద్ధ కానుకలు
శరత్కాలపు రాత్రి ఉల్కాపాతంలా
నా ఉనికి లోతుల్లోకి మంటల్లా వ్యాపిస్తాయి
78
విత్తనపు హృదయంలో నిరీక్షిస్తున్న నమ్మకం
వెంటనే నిరూపించలేని
అద్భుతమైన జీవితపు ఆశను కల్పిస్తుంది
79
చలికాలం ద్వారం దగ్గర వసంతం సంశయిస్తుంది
కానీ పెరిగిన మామిడిపంట దూకుడుగా దాని సమయానికి ముందే
దాని దగ్గరకు పరుగెట్టి దాని అంతాన్ని చేరుకుంటుంది
80
ప్రపంచం – ఎప్పుడూ మారే నురగ లాంటిది
నిశ్శబ్ద సముద్ర ఉపరితలంలో తేలుతూనే ఉంటుంది
81
వేరుకాబడ్డ రెండు తీరాలూ
అర్థంకాని కన్నీటి పాటలో గొంతు కలుపుతాయి
82
సముద్రంలోని నదిలా
శ్రమ దాని సిద్ధిని
సంపూర్ణ తీరికలోనే తెలుసుకుంటుంది
83
నా దారిలో నేను
వికసించని నీ చెర్రీ చెట్టు వరకూ నడుస్తుంటే
నెమ్మదిగా నీ మన్నింపుగా పూలపొద
నా ప్రేమను నాకు తెచ్చి ఇస్తుంది
84
నీ దానిమ్మ
చిన్న సిగ్గరి మొగ్గ
దాని ముసుగు వెనక ఈ రోజు ఎర్రబడుతోంది
రేపు నేను దూరంగా ఉన్నప్పుడు
రేగే పూవుగా విచ్చుకుంటుంది
85
అధికారం మొరటుదనం
తాళంచెవిని చెడగొట్టి
గడ్డపారని వాడుతుంది
86
పుట్టుక
రాత్రి అద్భుతం నుండి
పగలు ఇంకా అద్భుతంలోకి
87
నా కాగితం పడవలు
సమయం అలలమీద నర్తించటానికే
ఏదో గమ్యం చేరటానికి కాదు
88
వలసగీతాలు నా హృదయం నుండి ఎగిరి
నీ ప్రేమ స్వరంలో, వాటి గూళ్లను వెతుకుతాయి
89
భయానక సముద్రం
మనిషి చిరు దీవి చుట్టూ సందేహం
నిరాకరణ అజ్ఞాతాన్ని ఎదిరించమని
నిశ్చయంగా అతనికి సవాలు చేస్తాయి
90
ప్రేమ క్షమించినా
భయంకర నిశ్శబ్దంతో
గాయపడ్డ దాని అందం శిక్షిస్తుంది
(మళ్ళీ వచ్చే వారం)
శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S.
కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు.
అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు.
వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.