46
ఒకటి రెండోది లేకుండా శూన్యం
మరొకటి దానిని నిజం చేస్తుంది
47
జీవతపు పొరపాట్లు
పూర్ణ సామరస్యంలోంచి వేరుపడటాన్ని సవరించమని
కృపామయ శోభ కోసం రోదిస్తాయి
48
వెళ్ళగొట్టబడిన గూడు కోసం
వారు ధన్యవాదాలు ఆశిస్తారు
వారి పంజరం సుందరంగా సురక్షితంగా ఉంది గనుక
49
ప్రేమలో నీదైన కౌశల్యానికి
అంతులేని అప్పు తీరుస్తాను నీకు
50
దాని చీకటినుండి కొలను
లిల్లీ పూలతో గేయాలు పంపుతుంది
అవి బాగున్నాయి అంటాడు సూర్యుడు
51
గొప్పవారి మీద, నీ అపనింద, ద్రోహం
అది నిన్నే బాధిస్తుంది
తక్కువవారి మీద, నీ అపనింద, నీచం
అది బాధితుడ్ని బాధిస్తుంది
52
భూమి మీద పుష్పించిన మొదటి పుష్పం
బయటపడని పాటకు ఆహ్వానం
53
వేకువ – అనేక రంగుల పుష్పం – మాసిపోతుంది
తరువాత సహజమైన కాంతిఫలంగా, సూర్యుడు ప్రత్యక్షమౌతాడు
54
కండ ఏదైతే దాని తెలివిని సంశయిస్తుందో
అది ఏడ్చే గొంతు నులిమి చంపుతుంది
55
కేవలం దాన్ని ఆర్పడానికే
వీచేగాలి మంటని ముట్టడిస్తుంది
56
జీవితపు ఆట సత్వరం
జీవితపు ఆటవస్తువులు
ఒకదాని వెంట ఒకటి రాలిపోయి మరచిపోబడతాయి
57
నా పుష్పం
మూర్ఖుడి గుండీ తగిలించే రంద్రంలోంచి
దాని స్వర్గాన్ని ఆశించదు
58
నా నెలవంకా, నువ్వు ఆలశ్యంగా వచ్చినా
నా రాత్రిపక్షి ఇంకా మేలుకునే ఉంది
నీకు అభివాదం చేయడానికి
59
ముసుగులోని వధువు చీకటి
నిశ్శబ్దంగా ఎదురుచూ స్తుంది
సంచరించే వెలుగు తన హృదయంలోకి తిరిగొస్తుందని
60
భూమి చేసే అంతులేని ప్రయత్నం చెట్లు
వినే ఆకాశంతో మాటాడటానికి
(మళ్ళీ వచ్చే వారం)
శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S.
కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు.
అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు.
వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.