31
తెలుపు గులాబీరంగు గన్నేరులు కలిసి
వివిధ రీతుల్లో ఉల్లాస పరుస్తాయి
32
శాంతి చురుకుగా
దాని ధూళిని తుడిచేసుకుంటుంటే
అది తుఫాను
33
వంగని కొండ కాళ్ల దిగువన
కన్నీళ్లు నింపుకున్న ప్రేమ నివేదన
సరస్సు
34
అర్థహీనమైన మేఘాలు
ఆటవస్తువుల అశాశ్వత వెలుగునీడల మధ్య
పవిత్ర శిశువు నవ్వుకుంటాడు
35
కమలంతో గాలి గుసగుసలాడుతుంది
ఏమిటి నీ రహస్యమని
నేనే అది అంటుంది కమలం
అపహరించు దాన్ని, అప్పుడు “నేను” అంతర్ధానమైపోతుంది
36
తుఫాను స్వేచ్ఛ, కాండం బానిసత్వం చేతులు కలుపుతాయి
కొమ్మల్ని ఊపి నాట్యం చేయించడానికి
37
మల్లెకు
సూర్యునితో అస్పష్టమైన ప్రేమ
దాని పూలు
38
స్వేచ్ఛని చంపడానికి స్వేచ్ఛ కోరతాడు క్రూరుడు
అయినా దానిని తనదగ్గరే ఉంచుకుందుకు
39
దేవతలు వారి స్వర్గంతో విసిగిపోయి,
మనిషిని చూసి అసూయపడతారు
40
ఆవిరి కొండలు మేఘాలు
రాతి మేఘాలు కొండలు
కాలం కలలో అదో విచిత్ర ఊహ
41
తన గుడి ప్రేమతో కడతారని దేవుడు చూస్తే
మనుషులు రాళ్లు తెస్తారు
42
దూరాన ఉన్న సముద్రాన్ని
కొండ తన జలపాతంతో స్పర్శిస్తున్నట్టు
నా పాటలో నేను దేవుడ్ని స్పర్శిస్తాను
43
మేఘాల శత్రుత్వంలో
తన రంగుల నిధిని
కాంతి తెలుసుకుంటుంది
44
నా హృదయం ఈరోజు నిన్నటి కన్నీటి రాత్రికి నవ్వుతోంది
వర్షం వెలిసాక తడిసిన చెట్టు ఎండలో మెరుస్తున్నట్టు
45
నా జీవితాన్ని ఫలవంతం చేసిన చెట్లకు ధన్యవాదాలు చెప్పాను
కానీ ఎప్పుడూ పచ్చగా ఉండే పచ్చికని మరచిపోయాను
(మళ్ళీ వచ్చే వారం)
శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S.
కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు.
అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు.
వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.