[ఫేస్‌బుక్ సమూహం అయిన తెలుగు సాహితీ వనం సభ్యులు రచించిన కవితలతో, శ్రీమతి శాంతి కృష్ణ సంపాదకత్వంలో వెలువడిన ‘మిళిత’ కవితా సంకలనాన్ని సమీక్షిస్తున్నారు డా. మంథా అనూరాధ సెంథిల్.]
తెలుగు సాహితీ వనం అంతర్జాల అంతర్జాతీయ సాహిత్య సమూహం, ముప్పైవేలకు పైగా ఉన్న సభ్యులతో శోభిల్లుతూ దినదిన ప్రవర్ధమానముగా నిత్యనూతనముగా శాంతికృష్ణగారి అధ్వర్యములో మరో 9మంది టీమ్ సభ్యులతో ప్రకాశిస్తున్న సమూహం.
ఇటీవల తెలుగు సాహితీ వనం గ్రూపు వారు ఎంతో ఘనంగా జరుపుకున్న వార్షికోత్సవ సభలో ఈ పుస్తకం ఆవిష్కరించబడింది. ఒక ఏడాది వరకు నిర్వహించిన కవితల పోటీలలో ఉత్తమ ప్రశంసలు అందుకున్న కవితలతో పాటుగా, కవిసమ్మేళనంలో చదివినవి మరియు సమూహ కార్యనిర్వాహకుల విరచిత కవితల సంకలనమే ఈ ‘మిళిత’. మరి ఈ అత్యధిక సభ్యుల మధ్య జరిగిన పోటీలలో మనస్సుని ఆకట్టుకునే భావాలతో కూడిన అక్షర గుళికలను అందరూ ఆస్వాదించాలని ఆకాంక్షిస్తూ ‘మిళిత’ సమీక్షని మీకందిస్తున్నాను.
కవితా పురస్కారం 2025లో పురస్కార గ్రహీత జయసుధ కోసూరి రచించిన ‘కొత్తేముంది’ కవితలో..
“నిలకడలేని కాల రథం సాగిపోతూనే ఉంటుంది
ఎక్కి దిగే వాళ్ళే మారుతూ ఉంటారు
ఆపేక్షలే లేని ఈ సాపేక్ష రోజుల్లో
బంధాలన్నీ బరువైన గోళీలే
వాటం చూసి జారిపోతూంటాయి”
అంటూ మన జీవన పయనంలో వెనక్కి వెళ్ళిపోతున్న అనుభవాలనీ, వదిలి వెళ్ళిపోతున్న బంధాల గూర్చి హృదయాన్ని హత్తుకునేట్లు చెప్తూ “నిన్నటి నీడల్ని వీడిన కాలం కొత్త జాడల్ని వెతుక్కుంటోంది,
మారేది వత్సరమూ వయస్సే గానీ విధి వ్రాతలు కావంటూ” తాత్వికంగా ముగించి మన మనస్సులని కదిలించారు.
క్రోధి నామ సంవత్సర ఉగాది కవితల పోటీలకు ఇచ్చిన దత్తాంశం ‘ఆరు రుచులు’. ఇందులో కారుణ్యకుమార్ వ్రాసిన ‘నీతోనే నేనున్నాను’లో ఆరు రుచుల సారాంశాన్ని మన నిత్య జీవనంతో ముడిపెడుతూ అలోచింపచేసారు.
“గుర్తించలేకున్నావు నీతోనే నేనున్నా ప్రతినిత్యం
ఇకనైనా లేవరా చెలికాడా గొంతెత్తి చాటరా తెలుగోడా
ఉగాది వచ్చిందని, వెలుగు తెచ్చిందని..
నీలోనే నేనున్నా, నీతోనే నేనున్నా ఉగాదినై”
అంటూ మన జీవితంలో ఎదుర్కునే వాటిని షడ్రుచులతో మిళితం చేస్తూ నిద్రపోతున్న జాగృదావస్థని మేల్కొలిపారు.
‘తొలకరి’ లో ‘ఆశల ఝల్లు’ని కురిపించారు వసుధాదేవి తిరుమల.
“మేఘమాలిక చిలిపి కనుగీటులకు పరవశించిన నెమలి
మెలికలు తిరిగి వయ్యారాలు పోయింది. అది ప్రియనర్తనమే కదా”
అంటూ వర్షంలో అందమైన ప్రకృతిని సుందర దృశ్య కావ్యంలాగా చూపించి నయనానందం కలిగించారు.
‘మొగలిపూల వాసన’ తో మోసాల రంగులని పోల్చి చెప్పారు అవ్వారు శ్రీధర్ బాబు.
“నమ్మకం నీ బలహీనత కావొచ్చు
అయినా, అదేమీ బలహీనత కాదేమో..
ఆ మాత్రం నమ్మటం మనసు తడిని ఆరనివ్వకపోవడమే”
అని చెప్తూ మనస్సు గాయపడినా, మోసాన్ని గుర్తించి మనుష్యులతో మనడమే జీవనోపాయం అంటూ అప్రమత్తం చేసారు.
‘వందనాల చందనాలు’ కవితలో తెలుగు భాష గూర్చి ‘నిన్నేమని వర్ణించను’ అంటూ రవికుమార్ సింగంపల్లి అందమైన తెలుగు భాషని తేనెలొలుకు పదాలతో “పద్యోదయపు ఉషస్సులు! కావ్యాకాశాన ఇంద్రధనుస్సులు” అని చేసిన పద ప్రయోగాలు చదివి ఆస్వాదించాల్సిందే. ఈ కవిత మనస్సుని చాలా ఉత్తేజపరుస్తుంది అని అనడంలో సందేహం లేదు.
‘ఎప్పటికీ పదిలమే’ అంటూ చదువరులను కూడా జ్ఞాపకాల్లోకి నెట్టేసారు హిమబిందు రామకృష్ణ.
“గుండెలోతుల్లో నిక్షిప్తమైయున్న గతకాలపు సంఘటనలకు సాక్ష్యాధారాలు
జరిగిపోయిన వాటిని మరలా కళ్ళముందు కదలాడజేసే స్మృతులు”
అంటూ జ్ఞాపకాలని వెలకట్టలేని ఆస్తులు అని సంబోధిస్తారు. నిజమే కదా.. స్వానుభవాలు పాఠాలు నేర్పినా గాయపరిచినా స్మృతులు మధురమైనవైనా చేదువైనా.. మన ఆఖరి క్షణం వరకూ మనం వద్దన్న మనల్ని విడచిపోకుండా మనతోనే ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ప్రాణమూ జ్ఞాపకమూ ఒకటేనేమో అనిపిస్తోంది. రెండూ హృదయంలోనే కదా దాక్కున్నది.
సత్య చాగంటి ‘అర్జున పర్వమెప్పుడు’ అంటూ నేటి సమాజంలో పైశాచిక నృత్యం చేస్తున్న నగ్న సత్యాలను దుయ్యబట్టారు.
“అమృతతుల్యమైన అమ్మ గర్భాన
రావణ, కీచకాది వారసులెలా ఉద్భవిస్తున్నారని
రోదిస్తోంది కల్మషం లేని మాతృత్వం”
నాగరికత అంటూ నవతరం చేసే వికృత చేష్టలని తలచుకోవడం కూడా భయమేస్తోంది ఈ రోజుల్లో. ఈ విశృంఖలత్వాన్ని రాక్షసపోకడలని ఛేదించడానికి సంఘంలో ప్రతి వ్యక్తీ కూడా సమాజ శ్రేయస్సు కొఱకు అర్జునుడై పోరాడాల్సిన ఆగత్యం ఎంతగానో ఉంది.
మాతృభాషని ‘జీవనది’గా పోలుస్తూ మహమ్మద్ అఫ్సర వలీషా మాతృభాష యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పారు.
“మాతృభాషకి నింగిలోన వేద్దాం పెద్దపీట
తెగులు పట్టిన ఆచారాలకు కడదాం అందరం ఆనకట్ట”
తెలుగుని మరుగున వేయొద్దని తేనెపలుకుల రసమిది అని ఎంతో చక్కగా రసరమ్యంగా మాతృభాష తెలుగుని అభివర్ణించారు.
సుకన్య వేదం ‘నేటి మహిళ’కి అర్థాన్ని చెప్పిన తీరు ప్రతి గుండెలో నాదాన్ని మ్రోగిస్తుంది.
“పరిస్థితులు ప్రతికూలంగా మారితే అంత తెగింపేమిటో?
జీవితమే ఒక పోరాటమైనప్పుడు
ఏటికి ఎదురీదాలన్న పట్టుదలేమిటో?
ఎవరికీ అంతుచిక్కని ఒక అద్భుతం తాను
పడినా ఓటమిని అంగీకరించక మళ్ళీ పైకెగిసే ఒక కెరటం తాను”
“అందుకే తానొక ధీర.. అనుకున్నది సాధించగల గంభీర” అంటూ నిరుత్సాహంతో ఉన్న స్త్రీలలో చైతన్యాన్ని నింపే విధంగా, వనితలు ఉప్పొంగేలా నేటి మహిళని ధీరవనితగా శక్తివంతమైన అమ్మవారిలా గుర్తుచేసారు.
ఇదే అంశంపై ‘ప్రణామం’ అంటూ అల్లాడి శ్రీనివాస్ జీవన యానంలో స్త్రీ యొక్క ప్రాధాన్యతను ఎంతో గొప్పగా చెప్పారు.
“బ్రతుకుత్రోవ చూపెడి పవిత్రమైన ప్రకృతివి
అసలు నీవు లేనిదే ఏమీ లేదు
నీవే అనంత సృష్టికి ఆదిమూలం
నీకు ప్రమాణ పూర్వక ప్రణామం”
ఈ కవితలో ప్రతీ వాక్యం కూడా స్త్రీ పాటించే విధులు నిర్వహణలు కుటుంబానికి ఎంతటి వన్నె తెస్తాయో అన్న వాస్తవాన్ని స్త్రీ తత్వాన్ని అక్షరీకరించారు.
పితృదినోత్సవ సందర్భంగా జూం కవి సమ్మేళనంలో ‘నాన్న’ గూర్చి ప్రేమ అత్యంత హృద్యంగా వ్రాసారు.
“నలభై సంవత్సరాలు గడిచాయి
నా ఒంటరి జీవితంలో నీ జ్ఞాపకాలే
నాకు స్ఫూర్తిదాయకం, ఆత్మవిశ్వాసం
నీ అడుగుజాడలే నాకు మార్గదర్శకం
నీ స్పర్శ నన్ను తాకుతోంది నాన్నా”
అంటూ ఉంటే కళ్ళు చెమర్చుతాయి. నాన్నకి నిర్వచనం నాన్న అయ్యాక తెలుస్తుంది, నాన్న లేని లోటు జీవితాంతం ఉంటుంది. ఇది సత్యమే కదా!
తెలుగు సాహితీ వనం కార్య నిర్వాక బృందం వారి కవిత్వంలో..
ముందుగా శాంతికృష్ణ అందరికీ ‘తన్మయత్వపు జోహార్లు’ అర్పించారు.
“పచ్చని పూలుగా విచ్చుకుని
ముచ్చటగా గుర్తొచ్చే వెలకట్టలేని మౌక్తికంలా
నా బాల్యపు గుర్తుల పరిమళమై..
విరబూసే వెన్నెల సిరి”
అంటూ ప్రకృతిని బాల్యంలొ ఉన్న మాధుర్యాన్ని మనకి అందించిన వైనం చాలా మధురంగా ఉంటుంది.
డా. కృష్ణారావు రెడ్నం “అలజడులే అక్షరాలుగా మార్చేను కలం.. సజీవ శిల్పములై నిలిచి పాడేను కవిత్వం” అంటూ మనలో కలిగే భావాలకీ వాటికి అనుగుణంగా వెలువడే అక్షరాలు కళ్ళ ఎదురుగా నాట్యం చేస్తున్నట్లుంది. సూక్ష్మంగా ఉన్నా సుందరమైన రమణిలాగ ఉందీ కవిత.
“మాటాడు పూలబాటలు పరిచేట్లు
చైతన్య గీతికలు పాడునట్లు
అధ్భుతమైన జ్ఞానహిత వచనాలు పలికేటట్లు
ఎదుటివారి సుగుణాలకు ఆలంబనై నిలిచేటట్లు”
అంటూ అరుణ సందడి మాట యొక్క విలువలను తెలియచేసారు. ఈ కవితలో వ్యక్తపరిచనట్లు పూర్తిగా ఉండగలిగితే సకల జనులకీ మనం ప్రీతిదాయకమే అవుతాం మరి. ప్రయత్నించాల్సిన విషయమే.
‘అదే నీవు అదే నేను’ అంటూ సుమన ప్రణవ్
“దారంతా ఋతురాగం.. మలిగిపోని వత్తిలా మనసు దీపం
దగా పడిన గుర్తులలో మరల మరలా మరువ పారే కన్నీటి దోసిలి గీతం”
అనుభవాలకీ ఋతువులను మిళితం చేస్తూ ఒక ఆశావహ ధోరణితో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని తెలియచేసారు.
“నా మస్తిష్కపు మాగాణిలో తను నాటిన ప్రేమాక్షరాలు
నా హృది పొరలను చీల్చుతూ అంకురాలుగా మొలకెత్తినపుడు
కంటి చెమ్మ నా గుండెల్ని హత్తుకుని జారిపోయింది”
అంటూ ‘నడిచే గతం’ ని అభివర్ణించారు వెంకట్ కంచిపాటి. తనులేని విశ్వమంతా ఓ ఒంటరి గదిగా మారుతుంది అని మనస్సుని బరువెక్కెంచిన ఈ కవితలో ప్రతీ వ్యాక్యం హృదయాన్ని స్పృశిస్తుంది.
‘వసంత శోభ’తో “వాహన మోతలు కోయిల గానాలని మింగేసి.. ఆకాశ సౌధాలు సూర్యచంద్రులకు అడ్డుతెరలవుతున్నాయి.. మళ్ళీ ప్రకృతి మేల్కొనగలదా? మళ్ళీ వసంత శోభ పునరాగమించగలదా?” అంటూ శ్రీనివాస్ తొడుపునూరి ముందుగా వసంత పరిమళాలను కీర్తిస్తూ మనం చూస్తున్న వసంత శోభ ఎంత వెలవెలాబోతోందో గుర్తు చేసారు. ఈ వసంతాన్ని కబళించివేయబడుతోన్న ప్రకృతి సహజత్వాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది.
‘మిళిత’ కవితా సంకలనంపై సమీక్ష వ్రాసే సదవకాశాన్ని మహదావకాశాన్ని ఇచ్చిన తెలుగు సాహితీ వనం అధ్యక్షురాలు శాంతికృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్సులు. ధన్యవాదాలు.
***
సంపాదకత్వం: శ్రీమతి శాంతి కృష్ణ
ప్రచురణ: శామ్ పబ్లికేషన్స్
పేజీలు: 124
వెల: ₹ 100/-
ప్రతులకు
శ్రీ నవీన్:
8309686404