[మణి గారు రచించిన ‘మెరిసిన ముత్యం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఆరాధనా సంభావన కోసం,
ముత్యాలు చేరేసి,
ముంగిలిలో ముగ్గులు వేయాలని,
దీపాలు వెలిగించి సందడి చేయాలని!
అంతరాల లోతుల్లో,
చిక్కని చక్కని రంగుల,
మేలిమి ముత్యాలు కోసం మునకలు వేస్తాను!
ముత్యపు చిప్పల, కఠోర నిశ్శబ్దం!
ఎంత ప్రయత్నించినా పహరా విడవదు!
ముత్యాల పలుకులు, చిలకల్లా తొంగి చూసి
మళ్ళీ లోపలకి జారుకుంటాయి!
లోతులకి వెళ్ళే కొలదీ,
వీడని నిశీధి నిశ్శబ్దం!
బయటపడని ముత్యాలు!!
తప్పిపోతానేమో అని,
తల మునకలు అవుతూ నేను!!
ఊపిరి ఆడని బాధ,
అమృత బిందువులై ,
రసమయం చేసింది!!!
‘నేను’, వ్యర్థమై, రాలిపోయింది!!!
జాలు వారిన నిశ్శబ్దం లోంచి,
ముత్యం ఒకటి, మెరిసింది!
దీపమై వెలిగింది!