అతడు
నడుస్తున్నాడు అనాదిగా
ఏ తీరాలకో మరి ఆ గమనం
చీకటిలో వేకువకై ఉరికే పరుగు చేసే శబ్దాలు
ఆకాశంలో చీకటి తెర వీడే ఉరుముల మెరుపులు
నిశ్చలంగా నిర్మలంగానే ఉంటుంది నింగి
కానీ, మేఘాలే నల్లని తెరల్లా పట్టి కుదిపేస్తాయ్
మెరిసే నేల ముఖంలో దీపకాంతి రెపరెపలు
మబ్బు పరదాల్లో సూర్యుని నడకల పదనిసలే!
బతుకు ఇప్పుడు కరిగిపోతున్న కొవ్వొత్తి
ప్రాణమే ప్రమిద కాలేటి నూనెలో వెలిగేవొత్తి
నేల విడిచిన బతుకుల నడిచింది
నింగి మెరుపు విసిరిన కాంతి అదిగో!
శూన్యంలో వెదికే దారిలో
ఎక్కడ ఏ వెలుగులు కురిసేనో
ఎవరికి తెలుసు కాలంకన్నా….
ఆశలు పూలు రాలేది అమ్మ వొడినే
వాన కురిసింది నింగి ఆర్ద్రంగా
నేల తడిచి పులకించే మొక్కలు…
తన పుట్టుక మరువని నేల తత్వం
ఆకాశంలో ధ్వని తీగల్లో మెరుపైంది
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.