Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మేరే దిల్ మె ఆజ్ క్యా హై-9

ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ సాహిర్ లుధియాన్వీ శత జయంతి సంవత్సరం సందర్భంగా వారి ఎంపిక చేసిన కొన్ని కవితలను ‘మేరే దిల్ మె ఆజ్ క్యా హై’ శీర్షికతో స్వేచ్ఛానువాదం చేసి సంచిక పాఠకులకు అందిస్తున్నారు గీతాంజలి.

కొత్త సంవత్సరపు తొలి రోజు! {సుబహే-నౌరోజ్}

తెల్లారింది.. తూర్పు దిక్కున వెలుగు కిరణాలు లోకం మీదికి చిప్పిల్లాయి!
మళ్ళీ ఒక కొత్త రోజు మొదలయింది
పేరుకే కొత్త సంవత్సరం !
గత కాలపు కట్టుకథల్లో కాలం మళ్ళీ బందీ అయింది.
తిరిగి, తిరిగి అవే దారిద్ర్య దుఃఖ గీతాలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.

అయితేనేం ..మీకెందుకు ఇవన్నీ?
బల్ల మీద మీ దోస్తులు పంపిన కానుకలు కుప్పగా ఒక మూలన పడి ఉన్నాయి!

నగర దారులన్నీ కొత్త పెళ్లి కూతుర్ల లాగా ముస్తాబు అయ్యాయి
చలో .. కొత్త సంవస్తరపు వేడుకలు చేసుకోండి ఇక !
అదిగో ..
బంగళా లోపల నుంచి.. ముడుచుకుపోయి, కాంతిహీనమైన మొఖంతో..
నొప్పెడుతున్న దేహ భాగాలను ఒత్తి పెడుతూ ..దాచి పెడుతూ..
చీర కొంగులో దుఃఖ పడుతున్న హృదయాన్ని కప్పేడుతూ..
గుప్పిట్లో ఒక్కగానొక్క రూపాయి కాగితం బిగించి పడుతూ..
తడి కళ్ళతో..
తడబడుతున్న అడుగులతో..
బయటకి వస్తున్నదొక బీద రైతు కూతురు.
ఆమె నీరసమైన మొహం వంక చూసారా ఒకసారైనా?
అయినా మీకేం పట్టిందని ఆమె గురించి?
పోండి..పోయి చేసుకోండి నూతన సంవత్సర ఉత్సవాలను!

ఇదిగిదుగో.. పోనీ ఇక్కడ ఈ వీధుల్లోకి చూడండోసారి!
ఆకలితో అల్లాడుతూ .. పుండ్లతో.. రసికారే దేహాలతో .. పుల్లల్లాంటి పసి బిడ్డలు
అదిగో చూడండి.. మీ కార్ల వెనకాలే రొప్పుతూ .. రోజుతూ ..పరిగెడుతున్నారు.
ఉదయాన్నే .. కాలం కంటే ముందే మేలుకొంటారు వాళ్ళు.
పుసులు నిండిన కళ్ళని మెల్లగా తుడుచుకుంటూ .. నెత్తి మీది పుండ్లను గోక్కుంటూ..
చూడండి.. అటు చూడండి.. మరి కొంతమంది బయలు దేరారు!
అయినా..మీకెందుకులే ..మీకేం పట్టిందని?
వెళ్ళండి .. వెళ్ళండి కొత్త సంవత్సరపు వేడుకలను మహోత్సహంగా జరుపుకోండి..!
షీర్ ..బిరియానీలను కడుపారా ఆరగించి త్రెంచండి..

మీ వీధుల్లోనే ..మీ బంగాళాల పక్కనే , ముసలివాళ్లు .. పిల్లలూ.. బికారీలు..
వొంటి నిండా కప్పుకొన బట్టల్లేని ఆడవాళ్ళూ ..
ఆకలితో రోగాలతో చస్తేనేం …చస్తేనేం?
మీకేం .. వెళ్ళండి.. వెళ్లండిక!
జోరుగా హుషారుగా కొత్త సంవత్సరపు వేడుకల్లో మునిగిపోండి!

మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి

Exit mobile version