నిన్నా – నేడు! {కల్ ఔర్ ఆజ్}
ఈ రోజు కూడా మబ్బులు కమ్మాయి..
బహుశా వర్షం ఏ క్షణాన్నో కురవచ్చు.
కానీ.. కవి ఆలోచనలో ఇంకేదో ఉంది.
బస్తీ మీద కూడా మబ్బులు కమ్ముకున్నాయి..
కానీ ఈ బస్తీ ఎవరిది?
ఈ భూమ్మీద అమృతం కురుస్తుంది
కానీ ఈ భూమి ఎవరిది?
రైతుల పంటపొలాలని నాగళ్లు దున్నుతాయి
భూమి నుంచి ఆ నిరుపేదల కష్టం ఉవ్వెత్తున పొలమై లేస్తుంది.
పంటలు కోసి శ్రామికులు ధాన్యం కుప్పలుగా పోస్తారు.
కానీ ..ఆఖరుకి ఏమవుతుంది?
భూస్వాములు వచ్చి ఆ శ్రమనంతా దోచుకుని డబ్బులు చేసుకుంటారు
ముసలి రైతుల ఇంట్లోకి మాత్రం వ్యాపారస్థుడు అడవి కోడై దూరిపోతాడు
అప్పుల.. వడ్డీల మాయజాలంలో ఇంటి ఆడబిడ్డ అమ్ముడుపోతుంది
ఇదే కదా నిన్నా.. నేడు జరిగింది ?
రేపు జరగబోయేదీ ఇదే కదా..
కష్టం రైతుది.. కానీ లాభం భూస్వామిది ఎందుకైంది?
పంటా..భూమీ రెండూ రైతువి ఎందుకు కాలేదు?
భూమ్మీద రైతు అమృతం పండిస్తాడు..
కానీ భూమి ఎవరిదైంది?
నిన్నే కాదు ..చరిత్ర అంతా అన్నార్తులు ఆకలితో అలమటించిపోయారు
ఈ రోజు కూడా జనం అంతే ఆకలితో ఉన్నారు..
నిన్న కురిసిన వర్షమే
ఈ రోజు కూడా కురిసి ఉంటుంది
నిన్నటి దోపిడీయే..
ఈ రోజూ కొనసాగుతున్నది
దాని గురించే మరి నాలోని కవి ఆలోచిస్తున్నాడు ..
అదిగో..అలా చూడండి..
నాకు కనిపించేది మీకూ కనిపిస్తోందా?
ఈ రోజు కూడా ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నాయి
మారు మూల పల్లెల్లో బీద రైతుల ఆకలి కేకల మధ్య
ఇక ఏ క్షణంలోనో వర్షం కురవచ్చు!
మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964