Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మేనల్లుడు-24

[కారులో బయటకి వచ్చిన సునీల్, అమృత మాట్లాడుకుంటూంటారు. తన తండ్రికి కేన్సర్ కాబట్టి, చనిపోతానేమోనని భయపడి తన పెళ్ళి వివేక్‌తో చేయాలనుకున్నాడనీ, కానీ అమ్మకి, అత్తకి ఏమయింది, తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు అని అంటుంది అమృత. వివేక్‍తో తన బంధం స్నేహ బంధం అనీ, రక్త సంబంధం కన్నా ఎక్కువ అని అంటుంది. తన వల్ల పాపం వివేక్ నరకం అనుభవిస్తున్నాడని అంటుంది. తన బాధంతా చెప్పుకున్న అమృతని చూసి జాలిపడతాడు సునీల్. ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో ఇంటి దగ్గర నుండి అమృతకి ఫోన్ వస్తుంది. పొరపాటున చేయి తగిలి వాయిస్ పైకే వినబడుతుంది. డాక్టర్ గారి కోసం ఏయే వంటలు చేయించాలో అడుగుతారు. వాళ్లు చెప్పిన పదార్థాల పేర్లు విన్న సునీల్ కంగారు పడతాడు. పొద్దున్న తిన్న టిఫినే ఇంకా గొంతు దిగలేదని అంటాడు. అమృత కాసేపు సునీల్‍ని ఏడిపిస్తుంది. తన తండ్రి పరిస్థితి తలచుకుని బాధ పడుతుంది. తండ్రి కాస్త కోలుకునే వరకు ఉండమని సునీల్‍ని అడుగుతుంది. సునీల్ సరేనంటాడు. గుడిలో దర్శనం చేసుకుని ఇంటికి చేరుతారు. రాధిక వివేక్‌కి ఫోన్ చేస్తుంది. దివ్య ఆలోచనలతో తన మనసు మాట వినడం లేదని అంటూ, దివ్యకి క్షమాపణలు చెప్పుకోవాలని అంటాడు. దివ్య ఇంటికి వచ్చేసిందని, వెళ్ళి కలిసి మాట్లాడమని చెప్తుంది రాధిక. మర్నాడు ఉదయం తొందరగా లేచి తయారై, దివ్య కొనిచ్చిన షర్ట్ వేసుకుని దివ్య వాళ్ళింటికి వెళ్తాడు. – ఇక చదవండి.]

భాలున ఆలోచనల నుండి తేరుకొని, కారు డోరు తెరుచుకొని అడుగులు వేసి, డోరు బెల్ కొట్టాడు. తలుపు తెరుచుకొగానే.. ఎదురుకుండా కనిపించిన డా. రంగారావుగారిని చూసి “నమస్తే డాక్టరుగారు.. బావున్నారా?” అన్నాడు.

ఒక్క నిమిషం వివేక్ కళ్ళలోకి చూసి.. చిరునవ్వుతో.. అభిమానంగా భుజం మీద చెయ్యి వేసి.. “రా!.. వివేక్..” అని సోఫా వరకు వివేక్ కూడా నడుస్తూ.. “ఎలా ఉన్నావు వివేక్!.. నువ్వు చాలా disturb mood లో ఉన్నావని తెలుసు.. ప్చ్.. మనిషన్నాక ఒక్క సంతోషాలే కాదు.. అన్నీ భరించాలి. మీ అంకుల్‍కి ఎలా ఉంది?.. పేషంట్ పరిస్థితి ఎలా ఉంటుందో.. చుట్టూ ఉన్న వాళ్ళు.. ఎంత టెన్షన్‌లో ఉంటారో? పేషంట్‌ని ఎలా డీల్ చేయాలో తెలియక ఎంత బాధపడతారో అన్నీ డాక్టరుగా నాకు తెలుసు.. సారీ వివేక్.. నీ మెంటల్ కండిషన్ నేను ఊహించగలను” అని డా. రంగారావు మాట్లాడుతుండగానే గభాలున రెండు చేతులు పట్టుకొని.. కంగారుగా అన్నాడు వివేక్..

“ఏంటి సార్!.. మీ మంచితనంతో.. నేను సారీ చెప్పాలని, ఏవేవో చెప్పాలని వచ్చాను.. అన్నీ మరిచిపోయాను. మీ మంచితనమే దివ్యకి వచ్చిందని ఇప్పుడర్థమయింది.”

చిన్నగా నవ్వాడు.. “నీకన్నానా బాబూ!.. నీ గురించి నాతో దివ్య చెప్పలేదనుకున్నావా?.. ఏమీ మనసులో పెట్టుకొని వర్రీ కాకు.. అన్నట్లు త్రాగడానికి ఏమయినా కావాలా? నేనైతే గ్రీన్ టీ ఇవ్వగలను. మా దివ్య అయితే ఫిల్టర్ కాఫీ బ్రహ్మండంగా పెడుతుంది.”

కంగారుగా అన్నాడు..

“దివ్య లేదా? వచ్చేసింది అని రాధికా చెప్పింది.”

ఒక్క నిముషం చూసి.. “వచ్చింది.. దివ్యని పలుకరించకపోవడమే బెటర్..”

కంగారుగా చూసాడు వివేక్.

“ప్చ్!.. సారీ వివేక్.. దివ్య చాలా sensitive. చాలా disturb అయింది.. ఇప్పుడు కూడ ఇక్కడకు రాకపోను.. ఉన్న ఒక్కగానొక్క.. తనకున్న ఒకే బంధం నేను. నేను ఏమయిపోతానో అని.. వచ్చింది..”

“అమ్మా, నాన్న.. దివ్య చిన్నతనంలో పసిబిడ్డగా ఉన్నప్పుడే చనిపోయారు.. తల్లి తండ్రి అన్నీ నేనై పెంచాను. నాతో attachment ఎక్కువ.. ఆ sentiment తోనే వచ్చింది దివ్య.. తన జరిగినదంతా మరిచిపోవడానికి ప్రయత్నిస్తుంది.. by mistake జరిగినదాని గురించి.. పెద్దవాడిగా ఒక మాట అన్నాను..”

“ప్రేమలో నువ్వు మోసపోతే బాధపడాలి.. అని నేను అంటుండగానే దివ్య ఏమందో తెలుసా?”

“కరక్టుగా చెప్పావు తాతయ్య.. ప్రేమలో మోసపోతే తప్పకుండా ఈ పాటికి మరిచిపోయేదానిని.. ఎందుకంటే.. అటువంటి.. ప్రేమని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి?.. ఆ ప్రేమని ద్వేషించేదానిని.. అసహ్యించుకొనే దానిని.. కాని.. ఈ ప్రేమని.. ఎలా మరిచిపోగలను?.. నువ్వు చెప్పు తాతయ్య?.. నన్ను ఏం చెయమంటావు?.. ఓకే.. ఓకే.. కంగారు పడకు.. మరిచిపోతాను.. కాని టైమ్ కావాలి.. అప్పటి వరకు.. నేను ఎవరిని కలవాలనుకోవడం లేదు.. తాతయ్యా!.. నాకో మాట ఇవ్వు.. ఎప్పుడు వివేక్ గురించి కాని.. అదే తాతయ్యా జరిగిపోయిన దాని గురించి అస్సలు.. ఎత్తవద్దు.. అని నా దగ్గర మాట తీసుకుంది” అని దివ్యకీ తనకీ మధ్య జరిగినదంతా.. చెప్పి.. కళ్ళద్దాలు తీసి కళ్ళలో తడి తుడుచుకున్నాడు. అది చూసి కంగారుగా.. డా. రంగారావుగారి చేతులు పట్టుకొని.. “క్షమించమని అడగడం.. చాలా పెద్ద నేరం అవుతుంది సార్!.. కాని.. అడుగుతున్నాను.. అంతకన్నా.. నేను ఏం చేయలేను.. క్షమించండి.. చాలా ఆశతో దివ్యని మీట్ అవుదామని వచ్చాను.. కాని మీరన్నట్లు నేను దివ్యని మీట్ కాకపోవడమే మంచిది.. మరోసారి చెబుతున్నాను.. క్షమించండి” అన్నాడు వివేక్..

అభిమానంగా భుజం మీద చెయ్యి వేసి, “డాక్టర్ నయినా చాదస్తంగా మాట్లాడుతున్నానుకోవద్దు వివేక్.. విధి ఆడే వింత నాటకాలను ఎవరు ఆపలేరు.. లేకపోతే నా కొడుకు, కోడలు.. ఎంతో ఉత్సాహంతో.. ఇద్దరూ కలిసి ట్రైనింగ్ కోసం వెళ్ళారు.. వచ్చినాక హాస్పటల్ పెట్టాలనుకున్నారు. సైట్ కొన్నారు.. అన్నీ ఎరేంజ్‌మెంట్స్ స్టార్ట్ చేసారు. కాని జరిగింది ఏమిటి?.. దివ్య ఎలా ఉంది అని.. రోజు ఫోన్లు చేస్తూనే ఉండేవారు.. కాని విధి వ్రాత.. కానరాని లోకాలకి వెళ్ళిపోయారు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. ఇవన్నీ తెలియని మనిషి future గురించి ఎన్నో కలలు కంటాడు.. “ అని ఏదో గుర్తు వచ్చిన వాడిలా.. “సారీ.. నువ్వెళ్ళు బాబూ!.. ఏవేవో మాట్లాడుతున్నాను..” అని డా. రంగారావుగారు అనగానే కృతజ్ఞతగా చూసి రెండు చేతులు జోడించి.. గబగబా అడుగులు కారు వైపు నడిచాడు వివేక్.

కారు వెళుతుందే కాని.. ఆలోచనలు వివేక్‌ని వదలలేదు..

దివ్యతో గడిపిన రోజులు.. తన పట్ల దివ్య చూపెట్టిన అభిమానం.. ప్రేమ.. ఇష్టం.. అన్నీ వరుసగా వివేక్‍కి గుర్తు రాసాగాయి.

ఇంటికి వచ్చి.. మంచం మీద వాలాడు.. ఎంతో ఆశతో దివ్యని చూడడానికి వెళ్ళాడు.. ప్చ్!.. పాపం దివ్య.. ఎంతో బాధలో ఉంది. దానికి కారణం తనే.. ఏ మనిషైనా తప్పు చేసినప్పుడు.. తన వలన అవతల మనిషికి బాధ కలిగించినప్పుడు.. క్షమించమని అడిగితే.. ఆ మనసుకి కాసింతయినా ఊరట కలుగుతుంది. కాని ఆ అవకాశం కూడా లేకుండా అయింది. దివ్యని కలవలేకపోయినా, తన మనసులో బాధ.. జరిగినదానికి.. సారీ చెప్పాలి అని గభాలున సెల్ తీసి.. వాయిస్ మెసేజ్ పెట్టాడు వివేక్..

“దివ్యా!.. ఎలా ఉన్నావు?.. సారీ!.. అలవాటుగా అడిగేసాను.. మన ఇద్దరి మధ్య ఇటువంటి పరిస్థితి వస్తందనుకోలేదు దివ్యా!.. నిన్ను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు.. కాని ఒక్కసారంటే ఒక్కసారి నీతో మాట్లాడాలని, సారీ.. చెప్పాలని.. ఉంది.. ఇలా చెప్పకపోతే నా మనసు ఊరుకునేలా లేదు.. నా మనసులో బాధ అంతకంతకు ఎక్కువవుతుందే తప్ప.. తగ్గడం లేదు.. నేను పడుతున్న బాధకి రెట్టింపు బాధ.. నువ్వు పడుతున్నావని నాకు తెలుసు.. నీ బాధని నేను పోగొట్టలేనని తెలుసు.. కాని అలా అని ఉండలేకపోతున్నాను.. అందుకే.. ఈ మెసేజ్ పెడుతున్నాను.. దివ్యా!.. నిన్ను చాలా బాధ పెట్టాను.. ఈ మెసేజ్ వలన.. నువ్వు ఇంకా బాధ పడతావని తెలుసు.. కాని ఏం చేయను దివ్యా!.. నువ్వు ఆలోచించి, ఆలోచించి.. నీ ఆరోగ్యం పాడు చేసుకోకు.. చివరగా ఒక్క మాట!.. చిన్నప్పుడు ఒట్టు అన్న మాటకి చాలా విలువ ఉండేది.. చిన్నతనంలోనే కాదు.. ఇప్పుడు కూడా ఒట్టు అన్న దానికి విలువ ఇస్తాను.. నీ ఆరోగ్యం జాగ్రత్త.. నువ్వు బావుండాలి.. నా మీద ఒట్టు!.. నీకేమైన అయితే ఈ వివేక్ ప్రాణాలతో ఉండడు.. ఒక్కటి మాత్రం నిజం.. మరో జన్మంటూ ఉంటే నిన్ను మిస్ చేసుకోను..” అని వాయిస్ మెసేజ్ దివ్యకి పెట్టి.. చేరిందో లేదో అని చెక్ చేసాడు.. అప్పుడు గుర్తు వచ్చింది.. అందరి contacts దివ్య బ్లాక్ చేసిందన్న విషయం. ప్చ్!.. నిర్లిప్తంగా కళ్ళు మూసుకున్నాడు వివేక్..

తెలవారింది.. రెడీ అయి సెల్ జేబులో పెట్టుకోబోతూ.. ఏదో గుర్తు వచ్చిన వాడిలా.. సెల్ తీసి చెక్ చేసాడు వివేక్..

దివ్య దగ్గిర నుండి వచ్చిన వాయిస్ మెసేజ్ చూసి షాక్ అయ్యాడు.. గభాలున ఓపెన్ చేసాడు.

“వివేక్! ఎలా ఉన్నావు?.. నిన్న నువ్వు మా ఇంటికి వచ్చావు.. నీ వాయిస్ వినబడింది.. కాని రాలేకపోయాను.. నేను చాలా సిల్లీగా ప్రవర్తిస్తున్నానని తెలుసు.. కాని.. అలా అందరికి దూరంగా ఉంటే నేను తొందరగా.. మామూలు కాగలనేమో అనిపిస్తుంది. ఎవరి మాట వినకపోయినా మనసు చెప్పినట్లే కదా మనిషి వింటాడు.. సరే!.. నిన్నటి దాక అలానే, అనుకున్నాను. కానీ నిన్న నువ్వు వచ్చి వెళ్ళాకా, నేను తప్పు చేస్తున్నానేమోనని అనిపించింది.. ప్చ్!.. సరే!.. ఒక్క మాట చెప్పదలచుకున్నాను.. నేను క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు.. నేను అంతే!.. వివేక్!.. నువ్వు బాగుండాలి.. నీ నుంచి నేను అంతకన్నా ఏం కోరను.. సరేనా?.. అన్నట్లు చెప్పడం మరిచాను.. wish you happy married life.. ఉంటాను.. take care దివ్య.”

దివ్య వాయిస్ వింటున్న వివేక్ సోఫాలో కుప్పకూలాడు..

***

“అమ్మా!.. అమృతా!.. డాక్టరుగారు చాలా మొహమాటస్థుల్లా ఉన్నారు.. నువ్వే దగ్గిర నిలబడి వడ్డించమ్మా!..” అంది సుమిత్ర..

“నేను.. ఆ మాటే చెబుదామనుకున్నాను.. డాక్టరుగారికి నువ్వే వడ్డించు.. అన్నట్లు ఏది తిన్నా తినకపోయినా, పులస చేప, రొయ్యల ఫ్రై, అన్నట్లు సందువా ఫ్రై వడ్డించడం మరిచిపోకు.. స్వీటు పెడతావు కదమ్మా..” అంది శారద.

“ఏంటత్తా!.. ప్రత్యేకించి చెప్పాలా?..”

“అది కాదమ్మా!.. దేవుడిలా సమయానికి వచ్చారు డాక్టరుగారు!.. డాక్టరుగారు ఉండబట్టి నిశ్చింతగా ఉన్నాం.. ఏం ఇచ్చి డాక్టరుగారి ఋణం తీర్చుకోగలం అనిపిస్తుంది..” అంది శారద.

ఎదురుగా వస్తున్న సునీల్ వైపు గభాలున  చూసింది అమృత..

‘ఏం ఇచ్చి ఋణం తీర్చుకోవడం కాదు.. సునీల్ గారి మనసు ముక్కలు చేసాను.. పాపం సునీల్ మనసులో కొండంత బాధను దాచుకొని పైకి ఏమీ లేనట్లు నటించలేకపోతున్నాడు.. మంచి మనిషి కాబట్టి నోరు మెదపకుండా తనకి ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉన్నా..’ అనుకుంది అమృత.

అప్పటికే డైనింగ్ టేబిల్ దగ్గరకు వచ్చిన సునీల్ మొహమాటంగా అటు ఇటు చూసి “మంగమ్మ భోజనానికి రమ్మంది” అన్నాడు.

గభాలున ఆలోచనలనుండి తేరుకొని..

“రండి.. కూర్చోండి..” అని గ్లాసులో నీళ్ళు పోసి.. కంచంలో అన్ని రకాలు ఒకొక్కటి వడ్డించడం చూసి కంగారుగా అన్నాడు..

“ఏంటండి.. ఇంత పెద్దగా ఉంది కంచం? పూజల దగ్గిర కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూలు, పూజ సామాగ్రి ఇలాంటి పెద్ద ప్లేటులో పెడతారు.. అలా ఉంది.”

“ఇంకా పెద్ద అన్నం కంచాలు ఉన్నాయండి మా ఇంట్లో.. మీరు కంగారు పడతారని అన్నింటిలో చిన్న కంచం ఇది తీసాను.. మాటలు తరువాత.. ముందు తినండి..” అంది నవ్వుతూ..

“అమ్మో!.. మైగాడ్!.. ప్లీజ్ అండి.. నన్ను ఫోర్సు చేయవద్దు.. If you don’t mind.. వేరే చిన్న కంచం ఇస్తారా?..” అన్నాడు కంగారుగా సునీల్.

సునీల్ కంగారు చూసి.. ఏడిపించాలనిపించింది అమృతకి..

“ఎలా అండి?.. చిన్నకంచాలు మా ఇంట్లో లేవు..”

“అలానా!.. నో ప్రోబ్లమ్!.. ఈ కంచంలో ఇవన్నీ తీసేసి.. అదిగో ఆ Fish పీస్ ఒకటి, ఫ్రాన్స్ ప్రై వద్దు, డేంజర్.. egg వేసి చేసిన ఫ్రాన్స్ కర్రీ ఒక స్పూను.. సాంబారు.. ఇవి చాలు.. ఇంత హైవీ డైట్ నాకు అలవాటు లేదండి.. ప్లీజ్ అండి” అన్నాడు సునీల్.

“నో!.. వీల్లేదండి.. ఇంత కష్టపడి.. మా వాళ్ళు వంటలు చేసారు.. మీరు తినకపోతే వాళ్ళు బాధపడతారు.. వాళ్ళకన్నా ఎక్కువ నేను బాధపడతాను.. నా కోసం కూడా తినరా?..” అంది.

కంగారుగా అమృత వైపు చూసాడు..

ఇంతంత కళ్ళతో తన వైపే చూస్తున్న అమృత కళ్ళను చూసి ఒక్క నిమిషం తనలో అనుకున్నాడు ‘ఎంత అంతమైన కళ్ళు?.. కళ్ళే కాదు.. బంగారు బొమ్మలా ఉంది.. ఎంత పెద్ద జడ?.. తల నిండా పూలు?.. ఇలాంటి అమ్మాయిలు ఈ మధ్యన కనిపించడం లేదు.. పొడవాటి జడలు.. మచ్చుకి కూడ కనపడడం లేదు.. తనకి ఎలాంటి అమ్మాయి కావలనుకున్నాడో.. అలాంటి అమ్మాయి అమృత..’

పకపకా నవ్వింది అమృత..

గభాలున ఆలోచనల నుండి సునీల్ తేరుకొని తినడం మొదలు పెటాడు.

“డాక్టరుగారు!.. చాలా సేపు ఆలోచనల్లో ఉండిపోయారు?.. కొంపదీసి నన్ను తిట్టుకుంటున్నారా?” అంది..

“ఛ!.. ఛ!.. తిట్టుకోవడం ఏమిటి?.. మీ గురించే ..” అని ఏదో గుర్తు వచ్చిన వాడిలా.. “ఇన్ని varieties ఎలా తినాలా? అని ఆలోచిస్తున్నాను” అన్నాడు.

సునీల్ ఆలోచిస్తుంది ఏమిటో అర్థమయిన దానిలా “సారీ!.. సారీ!.. మిమ్ములను ఇబ్బంది పెట్టను.. మీకెంత కావాలో అంతే తినండి.. ఇలా అన్నానని మరీ తగ్గించి తింటే ఉరుకునేది లేదు..” అని చిన్నగా గొంతు తగ్గించి.. “అనుకోకుండా మీరు ఇక్కడకు వచ్చారు. నా చేత్తో వడ్డించే అదృష్టం దక్కింది.. తినండి” అంది కొంచెం బాధగానే అమృత..

గభాలున తల ఎత్తి అమృత వైపు చూసాడు..

కళ్ళల్లో నిండిన నీటిని కనబడడం ఇష్టం లేని దానిలా గభాలున వెనక్కి తిరిగింది.

‘జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చి పోతుంటాయి. కాని అన్ని కష్టాలు, బాధలు కన్నా.. ఎక్కువ బాధ కలిగించేది ప్రేమే!.. విఫలం అయితే అంత కన్నా మరో బాధ.. ఇంకేది ఉండదు..’

‘ప్రేమ ఎంత మధురం అన్న మాట ఎక్కువ వింటుంటాం.. కాన ప్రేమ ఫెయిల్ అయితే నరకం అని ఇప్పడే తెలిసింది..’

‘పాపం అమృత.. పైకి చెప్పలేక లోలోపల నరకం అనుభవిస్తుంది అని అర్థమయింది. సారీ అమృతా!..’ అని మనసులో అనుకున్నాడు.

(సశేషం)

Exit mobile version