Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కమర్షియల్ మసాలా లేని ‘మేము’

2015 లో విడుదలైన చిత్రం ఇది. PASANGA 2 అనే తమిళ చిత్రం ఈ సినిమాకి మాతృక.

టూకీగా కధ:

భార్య గర్భం ధరించింది అని తెలిసిన మరుక్షణం నించీ, తమకి కావలసిన బిడ్డ రంగు.. రూపు, తెలివితేటలు, పొడుగు.. లావు లాంటి వివరాల గురించి డాక్టర్స్‌తో చెప్పి అందుకు తగు ఏర్పాట్లు చేసుకుంటారు. చివరికి నార్మల్ డెలివరీ అయితే ముహూర్తం ఎలా ఉంటుందో అనే అనుమానంతో ఒక జ్యోతిష్యుడిని సంప్రదించి ముహూర్తం పెట్టించుకుని సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డని కంటారు. అలాంటి ఇద్దరు పిల్లల చుట్టూ అల్లుకున్న కథ ఈ చిత్రం!

పుట్టిన బిడ్డ డాక్టరో ఇంజనీరో కావాలని ముందే నిర్ణయించేసుకుంటారు. దానికోసం బిడ్డ పుట్టక ముందే ఒక పేరున్న కార్పొరేట్ స్కూల్లో సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటారు.

***

ఈ కాలపు యువత ప్రతిది వారు కోరుకున్న పద్ధతిలో… ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ ప్రోగ్రాం లాగా వారు కోరుకున్న చట్రంలో ఉండాలి అనీ, అది తాము నిర్దేశించగలమని అనుకుంటున్నారు. ఈ థీం మీద ఆధారపడ్డ చిత్రం ఇది.

ఇలా ప్రకృతి విరుద్ధంగా పుట్టిన పిల్లలు హైపర్‌గా ఉండి, స్కూల్లో రోజువారీ చదువులో ఆటపాటల్లో చేసే ఆగడాలు, అల్లరి మీద టీచర్ల కంప్లెయింట్స్.. దాని వల్ల తరుచు స్కూల్ మార్చవలసిన అవసరం వస్తుంది. ఒక్కోసారి ఒకే సంవత్సరంలో రెండు స్కూళ్ళు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరికి తల్లిదండ్రులే వారిని భరించలేని పరిస్థితి చాలా సహజంగా చూపించారు.

తమ చిన్నతనంలో తీరని, తీర్చుకోలేని సంగీతం.. డ్యాన్స్… కరాటేలు లాంటి కోరికలు పిల్లల ద్వారా తీర్చుకోవటానికి వారి మీద తీసుకొచ్చే ఒత్తిడి, బయటి వారి ముందు తమ సహజత్వం కోల్పోయి కీ ఇచ్చిన బొమ్మల్లాగా ప్రవర్తించాలని వారిని శాసించటం… వారికిష్టం లేని ఆ కళలు నేర్చుకోవటానికి వారికి కలిగే అయిష్టం… అది పిల్లల మీద కలిగించే ప్రభావం… వారి మనసులో కలిగిన భావాలని వ్యక్తపరచటానికి ఇంటికొచ్చిన అతిథుల ముందు తమని తల్లిదండ్రులు దండించరులే అని నిర్భయంగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ అయిష్టతని మాటల్లో వ్యక్తపరచటం… ఈ కాలపు పిల్లల మీద జాలిని కలిగిస్తుంది.

పిల్లలు ఎక్కువగా ఇష్టపడే యానిమేషన్ చిత్రాలు అసాధ్యాలని సుసాధ్యాలుగా (స్పైడర్ మాన్, హనుమాన్) చూపిస్తాయి. అది అసహజమని, అసంభవమని వారి చిన్న మనసుకి తెలియదు. అందులో మమేకమైన ఆ పిల్ల స్కూల్ ఎడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు రామాయణంలో సూపర్ మాన్ కథ కలిపి టీవీ భాషలో ప్రిన్సిపల్‌కి చెబుతుంది.

స్పెషల్ ఎడ్యుకేషన్ అందించే స్కూల్లో ఎక్కువ ఫీజులు కట్టి చేర్చటానికి వచ్చిన అనేక మంది తల్లిదండ్రులు.. పిల్లలని మన కోరికలు తీర్చుకునే యంత్రాలుగా కాకుండా వారి ఇష్టాలని వారు తీర్చుకునే పద్ధతిలో వారి చదువు వుండాలని చెప్పిన యాజమాన్యం మాటతో నిరుత్సాహపడి వెనక్కెళ్ళిపోతారు.

ఈ ఇద్దరు పిల్లల అల్లరి, వాళ్ళు చేసే తుంటరి పనుల వల్ల అపార్ట్మెంట్స్‌లో వచ్చే సమస్యల వల్ల వారిని హాస్టల్లో చేరుస్తారు.

హాస్టల్లో నచ్చక, ఆ పిల్లలిద్దరూ రాత్రి పూట మిగిలిన పిల్లలకి దయ్యం కథలు చెప్పి భయపెడతారు. హాస్టల్ కిటికీలో నించి దూకి పారిపోతారు. మిగిలిన పిల్లల తల్లిదండ్రులు ఇది భరించలేక ఆ పిల్లలని తీసుకెళ్ళిపొమ్మని పంపించేస్తారు.

అలా వచ్చిన పిల్లలని తల్లిదండ్రులు దండిస్తారు. అలా ఆ పిల్లలని ఆ కాంప్లెక్స్ లోనే ఉండే పిల్లల మనస్తత్వ నిపుణుడి పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి, వారి స్నేహశీలతని చెప్పి తమ ఇంటికి తీసుకెళతారు.

ఆ మనస్తత్వ నిపుణుడు, పిల్లల్లో ఇది ఒకరకమైన లక్షణమని, మిగిలిన పిల్లల కంటే వారు తెలివితేటల్లో ఓ మెట్టు పైనుంటారని చెప్పి సమాధాన పరుస్తాడు.

ఆ ప్రత్యేకతే ADHD…. ATTENTION DEFICIENT HYPER DISORDER

పిల్లలకి మార్కులు ముఖ్యం కాదు, వారిలో ఉండే సహజ నైపుణ్యాలు గుర్తించి పైకి తీసుకురావాలని చెబుతాడు. తన చిన్నప్పుడు రన్నింగ్ రేసులో చివర వచ్చానని, అలా వచ్చిన వారు ఎవరికంటే తక్కువ కాదని చెబుతాడు. మార్కుల రేస్‌లో నించి తల్లిదండ్రులు బయటికి రావాలి అని సలహా చెబుతాడు.

ఆ పిల్లల మనస్తత్వ నిపుణుడి భార్య అలాంటి స్పెషల్ ట్రయినింగ్ ఇచ్చే స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ ఉంటుంది. గుంజీలు తియ్యటం, మనసారా గట్టిగా నవ్వటం శిక్షలు కావని అవి ఒకరకమైన సూపర్ బ్రైన్ యోగా అని చెబుతుంది.

పిల్లల మనస్తత్వ నిపుణుడు పిల్లలు విత్తనాల వంటి వారయితే వారి తల్లిదండ్రులు తోటమాలులు, కుటుంబ సభ్యులు మట్టి, టీచర్స్ సూర్యరశ్మి, ఫ్రెండ్స్ మొక్కకి నీరు లాంటి వారు. అలాంటి చోట పెరిగే పిల్లలు జీవితంలో అనుకున్నవి సాధించగలరు అని తల్లిదండ్రులకి ఒక కౌన్సిలింగ్ సెషన్‌లో చెబుతాడు.

ఒక అంతర స్కూళ్ళ పోటీలకి ఈ పిల్లలిద్దరితో పాటు ఆ మనస్తత్వ నిపుణుడి కొడుకు కూడా వెళతాడు. ఆ పోటీలో డ్యాన్స్, story telling అనే విషయాల్లో పాల్గొంటారు. కూడూ గుడ్డ పెట్టని డ్యాన్స్ నేర్చుకోవటం వల్ల వారికి ఐ.ఐ.టి.లో సీట్స్ రావు అని ఆ పిల్లల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తపరుస్తారు. అలా ఎప్పుడూ ఆలోచించకూడదని, పిల్లలు అందులో రాణించినప్పుడు దాని విలువ మీకు తెలుస్తుంది అని చెబుతారు.

ఫ్యామిలీ ప్లానింగ్ అంటే గర్భస్థ శిశువుకి వీళ్ళ దిన చర్య చెబుతూ, వారితో సంభాషిస్తూ స్నేహం పెంచుకుని వారికి కొన్ని నైపుణ్యమైన రంగాలు పరిచయం చెయ్యటం అని తల్లిదండ్రులు తెలుసుకుంటారు.

మహా భారతంలో అభిమన్యుడు, ప్రహ్లాదుడు జననం అలాగే జరిగిందని.. ఇప్పుడు బెనారస్ విశ్వ విద్యాలయంలో అలాంటి ప్రయోగం ఒకటి జరుతుగుతున్నదని ఈ మధ్య వార్తా పత్రికల్లో చదివాను.

ఆ విషయం మీద నేను ఒక సైంటిఫిక్ కధ కూడా వ్రాశాను.

***

సిజేరియన్ డెలివరీకి వెళ్ళకుండా వ్యాయామాలు చేసి నార్మల్ డెలివరీ చెయ్యాలి. పిల్లల జననం అలా ప్రాకృతికంగా జరగాలి, అప్పుడే పిల్లలు నార్మల్‌గా ఉంటారు అని చెబుతూ… పోటీల్లో గెలవటం ముఖ్యం కాదు… అలాగే ఆ బహుమతి అందుకోవటానికి స్టేజి మీదకెళ్ళి మిగిలిన పిల్లలని చిన్నపుచ్చద్దు అని ఆ మనస్తత్వ నిపుణుడు చెప్పటంతో సినిమా ముగుస్తుంది.

ఈ సినిమాలో చూపించిన చాలా అంశాలు విదేశాల్లో పాటిస్తున్నారు. మనం అక్కరలేని విషయాల్లో విదేశీయులని అనుకరిస్తాము, ఇలాంటి వాటిని కలలో కూడా నిజమని ఆమోదించి అమలుపరచం!

ఆరేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాని ఇప్పుడు చూశాను. కమర్షియల్ మసాలా లేని ఇలాంటి సినిమాలు తియ్యటానికి ఎంత మంది నిర్మాతలు ముందుకొస్తారో సందేహమే!

కానీ చాలా నచ్చి ఈ వ్యాసం రాశాను. మన ఆలోచనలు మూలాల నించీ మారాలంటే ఇలాంటివి ఇంకా ఎన్నో సినిమాలు రావాలి.

Exit mobile version