Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మేమూ మనుషులమే

[శ్రీ సోమవఝల నాగేంద్ర ప్రసాద్ రచించిన ‘మేమూ మనుషులమే’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

 

విజయవాడ హెడ్డాఫీసులో పని ముగించుకుని తిరిగి తన బ్రాంచ్ ఆఫీస్ వైజాగుకు జన్మభూమిలో బయలుదేరిన కిరణ్ విండో ప్రక్క సీట్లో కూర్చున్నాడు.

రైలు వేగంగా ముందుకు దూసుకుపోతోంది. చుట్టు ప్రక్కల ఉన్నవాళ్లు ఎవరి తోటి సంబంధం లేనట్లుగా మొబైలే లోకంగా ఉన్నారు.

కిరణ్‌కి చిన్నప్పటి నుండి కదులుతున్న రైల్లో వెనక్కు వెళుతున్న చెట్లను పరిసరాలను చూడ్డం అంటే ఎంతో ఇష్టం. ఇప్పడు కూడా అతను అదే పని జేస్తూ మనసులోనే ఎంతో ఆనంద పడుతున్నాడు.

అతనికి రెండేళ్ల క్రితమే వాణితో పెళ్లి అయింది. ప్రస్తుతం వాణి పురిటికని పుట్టింటికి వెళ్ళింది. రెండు మూడు వారాల్లో ఆమెకు డెలివరీ కూడా అవుతుంది. భార్య డెలివరీ సమయానికి కంపెనీ పెట్టిన టార్గెట్‌లు ఎలా పూర్తి చెయ్యాలా అని ఆలోచిస్తున్న కిరణ్‌కు సడనుగా భార్య గుర్తుకు రావడంతో వెంటనే ఆమెకు ఫోను చేసి “ఎలా ఉన్నావు” అని అడిగాడు..

“ఏంటండీ గంట క్రితమే ట్రైనెక్కుతూ ఫోను చేసినప్పుడు నేను బానే ఉన్నాను అని చెప్పాను కదా” నవ్వుతూ అంది వాణి.

“సారీ మర్చిపోయాను. అవునూ, అదేదో మందు వేసుకోవాలన్నావు, వేసుకున్నావా?” అడిగాడు కిరణ్

“మహానుభావా!! ఆ మందు రాత్రి భోజనం చేసే ముందు వేసుకోవాలి అని ఇంతకు ముందే చెప్పాను మీకు ఇంత మతిమరుపు ఏంటండీ బాబు” మరోసారి నవ్వుతూ అంది వాణి.

“ఏమిటో వాణి, నువ్వు అక్కడ ఎలా ఉన్నావోనని ప్రతి క్షణం నాకు భయంగానే ఉంటుంది” సిగ్గుగా అన్నాడు కిరణ్.

భర్త ప్రేమకు మనసులోనే పొంగిపోయిన వాణి “ఏవండీ మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అయినా నేను ఉన్నది అమ్మానాన్నల దగ్గర. కాబట్టి మీరేం బెంగ పెట్టుకోకండి. వేళకి అమ్మ నాకు అన్ని అమరుస్తోంది” చెప్పింది వాణి.

“సరే వాణి నీకు వీలు దొరికినప్పుడల్లా నాకు ఫోను చెయ్యి. అలాగే సాయంత్రం వాకింగ్ కూడా తప్పకుండా చేస్తూ రాత్రి తొందరగా పడుక్కో” అని ఆమెకు చెప్పిన కిరణ్ మరలా కదులుతున్న రైలులోనుండి బైటకు చూడసాగాడు.

***

జన్మభూమి రాజమండ్రి స్టేషన్ వదిలి మెల్లిగా స్పీడు అందుకుంటోది. అప్పుడే టీ తాగిన కిరణ్ వెనక్కు వాలి కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. అంతలో “ఏంటి బాయా! ఎంతసేపు ఆలా బాబాలా కళ్ళు మూసుకుంటావు, కళ్ళు తెరిచి కాస్త మాకేసి కూడా చూడు” అంటూ తన ఎదమీది పైటను సవరించుకుంటూ ఓ మగ గొంతుక అనడంతో ఎవరా అని మెల్లగా కళ్ళు తెరిచిన కిరణ్ తనకు దగ్గరగా నించున్న ఓ హిజ్రాని చూసి సీటులో కాస్త వెనక్కు జరిగాడు.

“ఏంటి అదంతా భయమే!!” అతని బుగ్గల మీద రాస్తూ అంది ఆ హిజ్రా.

ఆమె చేష్టలకు ఏం చెయ్యాలో తెలియని కిరణ్ ఆమె వైపు అదోలా చూసాడు. కిరణ్ పరిస్తితిని గమనించిన మిగతా వాళ్ళు మనసులోనే ముసిముసిగా నవ్వుకున్నారు.

“చూసింది చాల్లే గాని ముందు ఓ వంద కొట్టు” తన గార పళ్ళను బైటికి పెట్టి వెకిలిగా నవ్వుతూ అంది ఆ హిజ్రా.

“చిల్లర లేదు” మెల్లగా అన్నాడు కిరణ్

“చిల్లర లేదు, డబ్బులు లేవు అని అందరు చెప్పే మాటే కానీ ఇంతకీ, ఎంతకు కావాలి చిల్లర. ముందు బైటికి తియ్యి” అంది హిజ్రా.

‘ఏంటి బైటికి తీసేది” అర్థం కానట్టుగా అన్నాడు కిరణ్

“ఆ.. నీకంత సీను లేదుగాని ముందు నీదగ్గరున్న ఆ పెద్దనోటు తియ్యి చిల్లర ఇస్తాను” తన గుండెల లోపల చెయ్యి పెట్టి ఓ పర్సును బైటికి తీస్తూ అందా హిజ్రా.

అప్పటికే చుట్టుప్రక్కల వాళ్ళు తనకేసి అదోలా చూస్తూ ఉండడంతో ఇంక చేసేది ఏమిలేక తన జేబులో ఉన్న ఐదు వందల నోటుని ఆమెకిస్తూ “చిల్లర ఇయ్యి” సిగ్గుగా అన్నాడు కిరణ్.

“అదీ.. అలా.. రా.. దారికి” అంటూ అతని చేతికి నాలుగు వంద నోట్లు తిరిగి ఇచ్చిన ఆ హిజ్రా మరోసారి అతని బుగ్గల మీద సుతారంగా రాసి ముందుకు వెళ్ళిపోయింది. ఆమె అక్కడనుండి వెళ్ళిపోవడంతో తేలిగ్గా ఊపిరి పీలుచుకున్న కిరణ్ చుట్టుప్రక్కల వాళ్ళు చూస్తున్న జాలిచూపులు తట్టుకోలేక తనతో అంత అసభ్యంగా ప్రవర్తిచిన ఆ హిజ్రాని మనసులోనే తిట్టుకుంటూ ఎంతగానో అసహ్యించుకున్నాడు..

అంతలో అతనికి ఎదురుగా కూర్చున్న ఓ పెద్దాయన “ఎందుకు బాబు వాళ్ళ నోట్లో నోరు పెడతావు. వాళ్ళు సిగ్గు శరం వదిలేసిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు” అని చెప్పడంతో కిరణ్‌కి ఇంకా ఒళ్ళు మండింది. అంతలో అక్కడ ఏదో గొడవ జరుగున్నట్లు అనిపించడంతో ఆ పెద్దాయనతో పాటు ఏంటా అని ప్రక్కకు చూసాడు కిరణ్.

“ఏంటి నీ దగ్గర పది రూపాయలు కూడా లేవా? మరి ఆ మాత్రం డబ్బులు కూడా లేకుండా ట్రైను ఎందుకు ఎక్కావు?” ఓ కుర్రాడి చేతిని పట్టుకుంటూ అంది ఓ హిజ్రా.

“ఏయ్ చెయ్యి వదులు మర్యాదగా ఉండదు” ఆమె చేతిలోనుండి తన చేతిని వెనక్కు లాక్కుంటూ కాస్త కోపంగా అన్నాడా కుర్రాడు.

“ఏంటి అంత ఫోజుగా మాట్లాడుతున్నావు. నాకు కానీ తిక్క రేగింది అనుకో ఇక్కడే నీ ముందే బట్టలు ఇప్పేస్తాను. మర్యాదగా డబ్బులు ఇయ్యి” పైట మీద చెయ్యి వేస్తూ అందా హిజ్రా.

“నీకు ఎన్ని సార్లు చెప్పాలి నా దగ్గర డబ్బులు లేవని” మరలా అన్నాడు ఆ కుర్రాడు.

“ఎందుకురా ఓ ముష్టి పది రూపాయల కోసం అంతలా అబద్ధం ఆడతావు. ఛీ.. నీ బ్రతుకు చెడ, ఇదిగో ఇది తీసుకుని పండగ చేసుకో’ అంటూ అతని ఒళ్ళో పది రూపాయల నోటుని విసురుతూ అందా హిజ్రా.

“చూడు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, మర్యాదగా ఉండదు” కాస్త రోషంగా అన్నాడా కుర్రాడు.

“ఏంట్రా నీకు మర్యాద, జేబులో పట్టుమని ఓ పది రూపాయలు కూడా లేని బికారివి నీకు మర్యాద ఎందుకు, అక్క అడిగింది ఏదో నోరు మూసుకుని ఇచ్చేయ్. అక్క అసలే మంచిది కాదు” అతనికి ఇంకా దగ్గరగా వస్తూ అన్నారు అక్కడున్న మిగతా ఇద్దరు ముగ్గురు హిజ్రాలు

“నా దగ్గర డబ్బులు లేవు” అని ఇంకా మొండిగా ఆ కుర్రాడు అనడంతో “చూసావా ఇందాకల నుండి ఇదే పాట పాడుతున్నడు ఈడికి ఇలా కాదు ఇంక నా దెబ్బ చుపించాల్సిందే” తన పైట కొంగుని పూర్తిగా తీసేస్తూ అందా హిజ్రా.

దాంతో సిగ్గు పడిన ఆ కుర్రాడు వెంటనే జేబులోనుండి పది రూపాయల నోటుని తీసి ఆమె కిచ్చాడు.

“అదీ అలారా దారికి, ఈ పని ముందే చేసి ఉంటే నీకింత శాస్తి జరిగేది కాదు కదా” అంటూ వాడి నెత్తిమీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి వెళ్ళిపోయిందా హిజ్రా.

వాళ్ళు అక్కడనుండి వెళ్లడంతో మళ్ళీ ఆ పెద్దాయన “ఎందుకు బాబు వాళ్ళతో గొడవ. వాళ్ళసలే మంచివాళ్ళు కారు. దేనికైనా తెగిస్తారు. వాళ్ళ ఉసురు మనకు తగలడం కూడా అంత మంచిది కాదు” అని ఆయన ఆ కుర్రాడితో అంటుంటే కిరణ్‌కి ఎందుకో చాలా బాధ అనిపించింది.

అతని ఆలోచనలు కొంతసేను ఆ హిజ్రాల చుట్టూనే తిరిగాయి. నిజమే ఎవరూ కావాలని హిజ్రాలుగా పుట్టరు. శరీరంలో జన్యుపరమైన లోపం వలన వాళ్ళు అలా మారతారు, అని తనకున్న కొద్దిపాటి జ్ఞానంతో అనుకున్న కిరణ్ కొంత సేపటి తర్వాత ఇంటికి చేరుకున్నాడు.

***

“బాబూ కిరణ్ నేను అత్తయ్యను. అమ్మాయికి ఇప్పుడే సడనుగా నొప్పులు ప్రారంభ మయ్యాయి. సమయానికి మావయ్యగారు కూడా ఊళ్ళో లేరు” ఓ రోజు మధ్యాన్నం వాణి తల్లి కంగారుగా ఫోనులో చెప్పింది.

“అదేంటి అత్తయ్య, డాక్టరు వచ్చే వారం కదా డేటు ఇచ్చింది. మరి ఇంత సడనుగా నొప్పులేంటి. అయినా ఆడవాళ్ళని ఇద్దర్ని వదిలేసి మావయ్యగారు ఎక్కడికి వెళ్లారు?” కాస్త కోపంగా అన్న కిరణ్ “అత్తయ్యా నేను రాత్రికే బయలుదేరి వచ్చేస్తాను” అని చెప్పాడు.

“బాబు నువ్వేం కంగారు పడకు., మావయ్యగారు సాయంత్రానికల్లా వచ్చేస్తారు. అలాగే మన పక్కింటి ఆవిడ వస్తున్నారు. నేను ఇప్పడే అమ్మాయిని తీసుకుని హాస్పటలుకు వెళ్తున్నాను. ఏ విషయం నీకు ఫోను చేస్తూ ఉంటాను సరేనా” అని చెప్పి ఫోను పెట్టేసిన అత్తగారు మరలా కొద్దీ గంటల తర్వాత అతనికి ఫోన్ చేసి “బాబూ అమ్మాయికి ప్రసవం తేలిగ్గానే అయింది,” అని చెప్పడంతో “అత్తయ్యగారు నాకు చాలా ఆనందంగా ఉంది. అవునూ!! ఇంతకీ బాబా? పాపా?? మీరు చెప్పనే లేదు, ఏంటి సస్పెన్సులో ఉంచమని వాణి చెప్పిందా, ఏది ఒక్కసారి ఫోను ఇవ్వండి తన సంగతి చెబుతాను” నవ్వుతూ అన్నాడు కిరణ్

“బాబూ ఇప్పడు అది మాట్లాడే స్థితిలో లేదు” అని అన్న అత్తగారి మాటల్లో ఏదో తెలియని బాధను గమనించిన కిరణ్ “ఏంటి అత్తయ్యా ఏమైంది, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు. వాణికి ఎలా ఉంది” భయంగా అన్నాడు.

“ఏం చెప్పమంటావు బాబూ!! అంతా మన కర్మ” మెల్లగా ఏడుస్తూ అంది అత్తగారు.

“అబ్బా అత్తయ్యగారు, అసలేం జరిగిందో చెప్పకుండా ఎందుకిలా మాట్లాడుతున్నారు?”, బాధగా అన్నాడు కిరణ్.

“అదీ.. అదీ.. బాబు నీకు విషయం ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు” మెల్లగా అంది అత్తగారు.

విషయం చెప్పకుండా నానుస్తున్న అత్తగారి మీద పీకల దాకా కోపం వచ్చినా తమాయించుకుంటూ “ఏంటి అత్తయ్యా జరిగింది ఏంటో చెప్పకుండా మీరెందుకలా మాట్లాడుతున్నారు. ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్” అని అన్నాడు కిరణ్.

‘ఏంలేదు బాబూ ఇప్పడు మీకు పుట్టిన బిడ్డ ఆడో మగో తెలియడం లేదు” భార్య చేతిలో నుండి ఫోను అందుకుని బాధగా చెప్పాడు అతని మావగారు..

“ఏంటి మావయ్యారు!! మీరేం మాట్లాడుతున్నారు!! లింగ నిర్ధారణ కాకపోవడం ఏమిటి? ఆడో మగో, ఎవరో ఒకరు పుట్టాలి కదా?” బాధగా అన్నాడు కిరణ్.

“అవును బాబూ, అయితే ఇప్పడు పుట్టిన బిడ్డకు ఆ రెండు జననాంగాలు లేవు” అని ఆయన ఎంతో బాధగా చెప్పడంతో “మావయ్యగారు మీరు సరిగ్గా చూసారా?” అని అడిగాడు కిరణ్.

“చూసాం బాబు” అని అన్న మావగారు “చూడు బాబు జరిగింది ఏదో జరిగిపోయింది. అమ్మాయికి ఇంకా తెలివి రాలేదు. టైం పడుతుందని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పడు చెప్పు, బిడ్డను ఏం చేద్దాం?” కిరణ్‌ని అడిగాడు మావగారు.

“ఏం చేయడమేంటి!! అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? ఇప్పడు అడ మగా కానీ బిడ్డ పుట్టాడని, వాణ్ణి ఏదో చేసేస్తామని మీరు ఎలా అనుకున్నారు? ఇప్పడు ఎవరు పుట్టినా వాళ్ళు మా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు. అంగ లోపంతో పుట్టడంలో ఆ పసి బిడ్డ తప్పేముంది? చూడండి మావయ్యారు నేడు సైన్స్ చాలా డెవలప్ అయింది. కాబట్టి డాక్టర్ గారితో మాట్లాడి అప్పడు ఏం చెయ్యాలన్నది ఆలోచిద్దాం. వాణి ఆరోగ్యం జాగ్రత్త” అని బాధగా ఫోను పెట్టేసిన కిరణ్ ఆలోచనలో పడ్డాడు.

***

“ఏమండీ మనం ఏం పాపం చేసామండీ, ఇలా జరిగింది?” అంది వాణి ఏడుస్తూ.

 “ఊరుకో వాణి అంతా మన కర్మ. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం లేదు” ఆమెను ఇంకా దగ్గరకు తీసుకుంటూ ప్రేమగా అన్నాడు కిరణ్.

“నిజమేనండి, కానీ రేప్పొద్దున్న బిడ్డ పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ మనము ఎన్ని ప్రాబ్లమ్స్ పేస్ చెయ్యాలో ఒక్కసారి ఆలోచించండి” అని బేలగా అన్న వాణితో “ఔను అది నాకు తెలుసు. ఆలా అని ఇప్పడు ఆ పసికందుని ఏం చెయ్యగలం?” అడిగాడు కిరణ్.

“పోనీ ఏ అనాథ శరణాలయంకైనా ఇచ్చేద్దామా?” సడనుగా అంది వాణి.

“ఏంటి వాణి ఏం మాట్లాడుతున్నావు! ఓ కన్నతల్లి అనాల్సిన మాటలేనా?” బాధగా అన్నాడు కిరణ్

“పోనీ ఏం చేద్దామో చెప్పండి. ముందు ముందు చుట్టు ప్రక్కల వాళ్ళు అనే సూటి పోటీ మాటలు విని భరించ గలమా?” అని వాణి బాధగా అనడంతో “అంటే ఎవరో ఏవో అంటారన్న భయంతో నువ్వు ఆ పిల్లవాణ్ణి ఆలా చేద్దామంటున్నావు, అవునా? లేదు వాణి నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. చదువుకున్న నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే నమ్మ బుద్ధి కావడం లేదు. తల్లి తండ్రి ఉండి కూడా వాడు ఓ అనాథలా ఎందుకు పెరగాలి? సారీ వాణి నువ్వు ఏమైనా చెప్పు నేను వాడిని ఓ అనాధ శరణాలయానికి ఇస్తాను అంటే మాత్రం చచ్చినా వప్పుకోను” కాస్త కోపంగా అన్నాడు కిరణ్

“సరేనండి మీరన్నట్లు మనమే వాడిని పెంచుకుందాం. కానీ వాడు పెరిగి పెద్దవుతాడు. తోటి పిల్లలు వాడిని అవహేళన చేస్తూ ఆట పట్టిస్తారు. అప్పడు ఆ పసిమనసు ఎంత గాయ పడుతుందో ఏనాడైనా ఆలోచించారా?” మెల్లగా అంది వాణి.

అలా అన్న ఆమెతో ఏదో అనబోతున్న కిరణ్‌తో “బాబూ బయట హిజ్రాలు వచ్చారు. అమ్మాయిగారికి పురుడు అయింది కదా మాకు బహుమానం ఇప్పించండి, బిడ్డని ఆశీర్వదించి వెళ్ళిపోతామంటున్నారు” అని అత్తగారు చెప్పడంతో “అదేంటి అత్తయ్యా మనింట్లో బిడ్డ పుడితే వాళ్ళకి ఎందుకు బహుమానం” ఆశ్ఛర్యంగా అన్నాడు కిరణ్.

“ఇక్కడ అంతే బాబూ, ఇవ్వకపోతే ఊరుకోరు సరికదా నానా శాపనార్ధాలు పెడతారు. అందుకే ఎంతో కొంత ఇచ్చి పంపించివేస్తాము. వాళ్ళ ఉసురు బిడ్డకు తగల కూడదు, కాబట్టి వాళ్లను వీలైనంత తొందరగా పంపించెయ్యాలి వాళ్ళు కోరింది ఇవ్వక పొతే ఆ పసిబిడ్డను తమలాగే కావాలని శపిస్తారుట కూడాను” భయంగా అంది అత్తగారు.

“సరే అత్తయ్యా! నేను వస్తున్నాను పదండి”, అని అన్న కిరణ్ ఆ హిజ్రాలతో “మాయింట్లో బిడ్డ పుట్టినందుకు మీరనుకుంటున్నట్లు మేము సంతోషంగా లేము. లేదంటే మేమే మీకు మంచి బహుమతిని తప్పకుండా ఇచ్చేవాళ్ళము.. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి” వాళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ అన్న అతని కళ్ళల్లో కన్నీళ్లు. .

అతని ముఖంలో బాధని గమనించిన ఆ హిజ్రాలతో ఒకామె “ఏమిటి బాబుగారు మీకు పుట్టిన బిడ్డ చనిపోయాడా లేక ఏదైనా లోపంతో పుట్టాడా?” అని ఎంతో ఉదాత్తంగా అడగడంతో ఆమెకు జరిగింది చెప్పాడు కిరణ్.

“అయ్యో సారు మీకు ఎంత కష్టమొచ్చింది” అని అన్న ఆమె తోటి హిజ్రాలను ప్రక్కకు తీసుకుని వెళ్ళి కొంత సేపటికి తిరిగి వచ్చి “సార్ మమ్మల్ని క్షమించండి, జరిగింది తెలియక మేము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము. ఆ అన్నట్లు సారు మీకు, అమ్మగారికి అభ్యంతరం లేకపోతే మీ బిడ్డను మేం తీసుకుని వెళ్ళి చక్కగా పెంచుతాం. ఇటువంటి పిల్లలు మా దగ్గర ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో పాటే మీ బిడ్డ కూడా ఏ లోటు లేకుండా మా దగ్గర పెరుగుతుంది..

మీకు తెలుసో లేదో మాలాంటి హిజ్రాలు సంపాదించిన దాంట్లోంచి కొంత సొమ్ముని పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న మా అసోసియేషన్ కి పంపిస్తాము. ఆ డబ్బులతోనే ఇటువంటి పిల్లలను మా సొంత స్కూల్లో చక్కగా చదివిస్తూ, వారి బాగోగులు చూస్తాము. అలాగే మాలో ఎవరికీ వంట్లో బాగులేకపోయినా, ఎటువసన్తి రోగాలు వచ్చినా తగిన వైద్యం కూడా చేయిస్తాము. వయసు మళ్ళిన వాళ్లను ఏ లోటూ లేకుండా కూడా చూసుకుంటాము. అంతే కాదు మాలో కొంతమందికి ఇల్లు కూడా మా అసోషియేషన్ కట్టించి, తిండికి గుడ్డకు కూడా లోటు లేకుండా చేస్తోంది.

బాబూ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వమే మా పిల్లలకు చదువులోనూ, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు జీవితంలో ఎంతో పైకి వస్తారు. అవసరమైతే మేము మా హక్కుల కోసం పోరాడుతాము. అంతెందుకు మొన్న జరిగిన బిగ్ బాస్ షోలో కూడా మా జాతివాళ్ళకు అవకాశం కల్పించారు.

బాబూ మాలోను తెలివైన వాళ్ళు, టేలెంట్ ఉన్నవాళ్లు ఉన్నారు. ఈ సమాజంలోని వాళ్ళు కాస్త పెద్దమనసు చేసుకుని మాకొక్కసారి అవకాశం ఇస్తే చాలు.

అవును సారూ!! మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎందుకు నీచంగాను, అసహ్యంగాను చూస్తారు? మాకూ మీలాగే నలుగురిలో తిరగాలని ఉంటుందని మీరెందుకు అనుకోరు. ఇలా పుట్టడమే మేము చేసిన తప్పా? అయినా ఇందులో మా తప్పేముంది? అందుకే సారూ మేము కావాలనే మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు బలవంతా గుంజి మా తోటి హిజ్రాలకు సాయపడుతూ వాళ్ళు అలా పుట్టినందుకు బాధ పడకుండా చూస్తూ వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నాము.

నిస్సహాయులైన మమ్మల్ని వీలైనంతవరకు ఆదరించి ఆదుకోండి. అంతేకాని మా మానాన బ్రతుకుతున్న మమ్మల్ని దయచేసి మీ అనందం కోసం అవహేళన చెయ్యకండి. పూర్వ జన్మలో ఏదో తెలియని పాపం చేసి ఉంటాము అందుకే ఈ జన్మలో ఇలా పుట్టి అనుభవిస్తున్నాము. మా దుస్థితి తెలిసి కూడా మీలాంటి వాళ్ళు మా పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే వచ్చే జన్మలో మీరు మాలాగే పుట్టవచ్చు. అప్పుడు గానీ మీకు తెలియదు మా బాధ. కాబట్టి కనీసం ఆ భయంతోనైనా మా పట్ల కాస్త సానుభూతితో ఉంటూ ‘మేమూ మనుషులమే’ అని గుర్తించండి చాలు.

మమ్మల్ని ఎవరూ చేరదీయరు. మాతో ఎవరూ మాట్లాడకుండా ఏదో వెలివేసినట్లు చూస్తారు. అందుకే మా మనుగడ కోసం సిగ్గు విడిచి ముష్టి ఎత్తుకుంటూ మా బ్రతుకులు మేం బ్రతుకుతున్నాము. మాకూ ఆత్మాభిమానం అవీ ఉన్నాయి. దయచేసి మమ్మల్ని ఇలా అయినా హాయిగా బ్రతక నివ్వండి. సమాజంలో మాకంటూ ఓ గౌరవం కానీ, స్థానం కానీ లేదని బాధ పడున్న మమ్మల్ని ఇంకా బాధపెట్టకండి. చేతనైతే ప్రభుత్వ సంస్థలు, ప్రయివేటు సంస్టలు మాకు చేయూత నిస్తే మేము మా ప్రతిభను చూబిస్తాము. మాకు కావాల్సింది మీ జాలి దయ కాదు. మేమున్నామన్న భరోసా, ధైర్యము. సార్ ‘మేమూ మనుషులమే’ అని ఎంతో బాధగా అన్న ఆమె, “కాబట్టి మీరు ఇంకేం ఆలోచించకుండా ఆ పసిగుడ్డిని మాకు ఇవ్వండి. మేము పువ్వుల్లో పెట్టుకుని ఏ లోటు రాకుండా చేసుకుంటాము.

మేమ పిల్లలను కనలేక పోవచ్చును కానీ మాలోను ప్రేమ, దయ అన్ని ఉన్నాయి. వాటి విలువ మాకు తెలుసు. మాకూ ఓ మనసుంది, ఎందుకంటె మేము కూడా మీలాగే మనుషులమే కదా బాబూ.

మేము అందరం కూడా మీలాగే నీతిగాను, నిజాయితీ గాను బ్రతకాలనే అనుకుంటాము. కానీ ఒక్కొక్కసారి కొంతమంది కామాంధుల చేష్టల వల్ల మేము అదుపు తప్పి ప్రవర్తించాల్సి వస్తుంది” అని ఆమె ఎంతో బాధగా అంది.

ఆమె చెప్పింది విన్న కిరణ్ ఆలోచనలో పడ్డాడు. నిజమే వాళ్ళు చెప్పినట్లు ఏ అంగము లేకుండా జన్యుపరమైన లోపంతో పుట్టిన తమ బిడ్డ వాళ్ళ దగ్గర అయితే హాయిగా చక్కగా పెరుగుతాడు. ఇప్పడు తమ దగ్గర ఏ లోటు లేకుండా పెరిగినా కాలం గడిచి పెద్దవాడు అవుతున్న కొద్దీ ఎదో తెలియని న్యూనతా భావంతో, ఆత్మస్థైర్యం లేని ఓ పిరికి వాడిగా పెరిగి సమాజంలోని మనుషులు చేసే అవమానాలను తట్టుకోలేడు.

కానీ..

ఈ విషయంలో తానొక్కడే నిర్ణయం తీసుకోలేడు.. అందుకే, వాళ్ళని మరుసటి రోజు రమ్మని చెప్పి లోపలకు వచ్చాడు.

భార్యకు, ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.

“హిజ్రాలు, అడుక్కోవటం తప్ప మరో ఆదాయంలేనివారు ఇంతగా తమవారికోసం చేస్తూంటే, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మనము మన స్వంత పిల్లను చదివించలేమా? మంచి భవిష్యత్తు ఇవ్వలేమా? తన ప్రమేయం లేకుండా వచ్చిన లోపానికి అనాథగా, అందరికీ దూరంగా వెలివేసి, వదిలేయటం తప్ప మనకు మరో గత్యంతరం లేదా? జంతువులు కూడా, తమ సంతానాన్ని అక్కున చేర్చుకుని వెయ్యికళ్ళతో కాపాడతాయి. మనం మన సంతానాన్ని పనికిరాదని పారేస్తామా?” ఆవేశంగా అడిగాడు కిరణ్.

అతని కళ్ళముందు హిజ్రాలే కనిపిస్తున్నారు. కళ్ళు ఇంకా తెరవని ఈ పసిగుడ్డును అలాంటి భవిష్యత్తు కోసం వదిలేయటం అమానుషమనిపిస్తోంది.

కిరణ్ ఆవేశం, ఆవేదనలు గమనించి అందరూ మౌనంగా వుండిపోయారు. అతని భార్య నోరు విప్పింది.

***

ఇంటిముందు డప్పులు, వాయిద్యాల మోతలు వినిపిస్తున్నాయి. సంతోషంగా హారతి పట్టుకుని బయటకు వచ్చింది వాణి.

గర్వంగా డబ్బుల కట్టలు పట్టుకువచ్చాడు కిరణ్.

‘నేను పార్లమెంటుకు ఎన్నికయ్యాను నాన్నా’ వంగి కిరణ్, వాణిల కాళ్ళకు దణ్ణం పెట్టింది వాళ్ళు హిజ్రాలకిచ్చేయాలనుకున్న వాళ్ళ సంతానం.

టీవీ కెమేరాలు మెరుపులు మెరిశాయి. అక్కడున్న ప్రజల హర్షధ్వానాలు మిన్నంటాయి.

సంతోషంతో, డబ్బును నృత్యం చేస్తున్న హిజ్రాలకు అందించాడు కిరణ్. తమ సంతానాన్ని, మంచో, చెడో, తామే పెంచాలన్న తమ నిర్ణయం సరైనదని కాలం నిరూపించినందుకు సంతోషిస్తూ..

Exit mobile version