[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘మేలుకొలుపుకు శ్రీకారం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఈ నడిరేయి
నిశ్శబ్ద నీరవంలో
ప్రకృతి ప్రశాంతతను
సంతరించుకున్నా..
నా గుండె లోతులన్నీ
ఎండి బీటలు వారిన
బీడు భూమిలా మారి
నన్ను వేదనకు గురి చేస్తున్నాయి!
సమాజ హితం కోసం..
సామాన్యుడి సంక్షేమం కోసం..
క్షణమైనా విరామ మెరుగక
కలాన్ని హలంలా మార్చి
సాహితీ సేద్యం చేస్తుంటే..
నా గోడు ఎవరికీ పట్టదేం!?
అభ్యదయ ఉద్యమ నినాదం ముసుగులో
ఉన్నత విద్యావంతులు కూడా
రాజకీయం ఉచ్చులో చిక్కుకొని
సమైక్యతా భావనకు తిలోదకాలిచ్చి
మనిషితనానికి చరమగీతం పాడుతున్నారు!
కుల సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి
చట్ట సభల్లో చోటు కోసం
రాజకీయ వేదికలపై
బేరాలు మొదలెట్టాయి!
కలానికి కులానికి నడుమ
చిచ్చు రగిల్చి..
ఆ కుంపట్ల ముందు చలి కాచుకుంటూ
వినోదం చూస్తున్నారు రాజకీయ మేధావులు!
అందుకే..
నా కలం పాళీకి పదును పెట్టి
యువత మెదడు పొరలలో
విప్లవాగ్నిని రగిల్చే
మేలుకొలుపు గీతాలకు
శ్రీకారం లిఖిస్తాను!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.