Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మెలకువ కవిత

[గీతాంజలి గారు రచించిన ‘మెలకువ కవిత’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

నిద్ర పట్టని రాత్రులలో
నువ్వు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా
మనసు చెదిరి చందమామ వైపు చూస్తాను!

తోటలో నా లాగే దుఃఖంతో రాలిపోయిన
మల్లెల్ని ఏరుకుని శ్వాసిస్తాను.
పున్నాగల మంచు వర్షంలో
తడిసిపోయి చల్లారుతాను.
మనకి ఇష్టమైన రాగాలన్నీ వింటూనే ఉంటాను!

నేనూ పాడతాను.. నీదాకా
వినపడదా అని ఒక వెర్రి ఆశ!
నీకో ప్రేమలేఖ
రాయాలనుకుంటాను వియోగవేదనలో
పదాలు దొరకవు!
కాగితాలు కన్నీటితో తడిసి ముద్ద అవుతాయి.
నాతో పాటు నా కలమూ ఏడుస్తుంది.
దొరికిన ఆ కాసిన్ని అక్షరాలు కన్నీటిలో ద్రవించి పోతాయి.

కాగితంపై చెదిరిన పదాలు
మళ్లీ వెనక్కి జారి నా గుండెల్లో ఒదిగి..
హృదయ స్పందనలో వెక్కిళ్లు పడతాయి.

ఏ తెల్లవారు జామునో పట్టిన నిద్రలో..
నువ్వు వస్తావేమో కలలో మరి?
కాసిన్ని కవితా వాక్యాలు దొరుకుతాయి
ఇక అప్పుడు లేచి నీ మీద
మెలకువ కవిత ఒకటి రాస్తాను!

మెలకువలో ఎలాగూ దొరకవు..
కలలో నైనా నీకు వినిపించుకుంటాను.
ఈ రాత్రికి కనురెప్పల తలుపులు
తెరిచే పెడతాను..
వస్తావు కదూ కలలోకి?

Exit mobile version