[శ్రీ ఆర్.సి. కృష్ణస్వామిరాజు గారి ‘మేకల బండ’ నవలను పరిచయం చేస్తున్నారు శ్రీ ఎస్. హనుమంతరావు.]
ఇటీవలి కాలంలో చాలా విస్తృతంగా రాస్తున్న రచయితల్లో శ్రీ ఆర్.సి. కృష్ణస్వామి రాజు ఒకరు. ‘ప్రోలిఫిక్ రైటర్’ అన్న మాటకు సరిగా సరిపోయే రచయిత. ఆయన ఈమధ్య రాసిన నవల ‘మేకల బండ’. నవల పేరే సూదంటు రాయిలా పాఠకుల్ని ఆకర్షించే విధంగా వుంది. ఇది రాజు తొలి నవల. చాప్లిన్ మార్క్ హాస్యం, మధురమైన చిత్తూరు మాండలికం ఈ నవల ప్రత్యేకత.
‘ఏల్‌గోరీ’కి ప్రపంచ ప్రసిద్ధి పొందిన జార్జ్ ఆర్వెల్ నవల ‘ఏనిమల్ ఫార్మ్’ నిజానికి జంతువుల గురించి రాసిన నవల కాదు. అలాగే కృష్టస్వామి రాజు రాసిన ఈ ‘మేకల బండ’ నవలలో జీవాలు.. అంటే మేకలు, గొర్రెలు ప్రముఖంగా కనిపించినా ఇది వాటిని ఉద్దేశించి రాసింది కాదు. తను గురిపెట్టిన వ్యవస్థని చీల్చి చెండాడటానికి జంతువుల్ని ఆసరాగా తీసుకున్నాడు ఆర్వెల్. రాజు కూడా ఈ నవల జంతు ప్రపంచం గురించి రాయలేదు. మానవ సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రచన చేశారు. సమాజంలో నెలకొన్న లోటుపాట్లు వ్యక్తుల జీవన సంఘర్షణ ఈ నవలలో మనకి ప్రధానంగా కనిపిస్తాయి.
నలుగురు సావాసగాళ్లు, వారికి చెందిన జీవాలు నవలలో పైకి కనిపించే పాత్రలలో దృష్టికి కనిపించేది సమాజమే!
ఈశ్వరాపురం సుందరం, చెర్లోపల్లి పెంచల్ రాజు, బొజ్జనత్తం తిరుపాలు, అగ్రహారం వడివేలు స్నేహితులు. మేకలు, గొర్రెల్ని పెంచడం వారి వృత్తి. జీవాల మందల్ని ‘గోవింద పాదం’ కొండ దగ్గర మేపడానికి తోలుకెళుతూ వుంటారు. అక్కడ కాస్త చదునైన ప్రదేశమైన మేకల బండ మీద మధ్యాహ్నం పూట జీవాలు, వాటి పెంపకందార్లు కాస్త విశ్రాంతి తీసుకుంటూ వుంటారు.
ఓ రోజు సుందరం మందలోని మేకపోతు ఒకటి బందీ జీవితం ఇక ఎంతమాత్రం వద్దనుకుని, స్వేచ్ఛని కోరుతూ నెమ్మదిగా మందనుండి జారుకుంటుంది. దాన్ని గమనించిన పెంచల రాజు నల్ల గొర్రె, తిరుపాలు తెల్ల పొట్టేలు, వడివేలు కుంటిమేక తామూ పారిపోవాలని నిర్ణయించుకుని, మేకపోతును అనుసరిస్తాయి. తప్పించుకోవడానికి ప్రతిదానికీ ఒక్కో కారణం వుంటుంది. అవి చెప్పిన కారణాలు ఆసక్తికరంగాను, నవ్వు పుట్టించే విధంగా వుంటాయి.
ఇక వాటిని వెతికే క్రమంలో కాపర్లు నలుగురూ పడిన కష్టాన్ని హాస్యపు తళుకులద్ది చెబుతారు రచయిత.
సుందరం మేకపోతు తనని యజమాని పూర్తిగా పట్టించుకోవడం మానేశాడని, అందుకే అతని దగ్గర వుండబుద్ధి కాక తప్పించున్నానని తనతో వున్న మిగతా జీవాలతో చెబుతుంది. ఒకప్పుడు తనని ఎంతో ప్రేమగా చూసుకునే యజమాని, ఇప్పుడు చెడు సావాసం మరిగి తనని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని వాపోతుంది. ‘సావాసం తాగుబోతులతోనా తిరుగుబోతులతోనా?’ అని అడుగుతాయి చుట్టూ వున్న జీవాలు. “అబ్బే.. అలాంటిదేమీ లేదు, ఈమధ్య సెల్‌ఫోను కొన్నాడు” అని అంటుంది మేకపోతు. ఈ మాటతో కథ మనకి మొత్తం అర్థమై నవ్వుకుంటాం.
ఇక తెల్ల పొట్టేలు పారిపోవడానికి కారణం వేరుగా వుంది. తన తిండీ, శుభ్రతల విషయంలో చాలా శ్రద్ధ చూపే యజమాని భార్య, ఈమధ్య కాలంలో టీవీ రిమోటుని చేతిలో పెట్టుకుని ఛానళ్లు మారుస్తూ బిజీగా వుంటూ తనని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, అందుకే పారిపోవాలని అనుకున్నానని అంటుంది. ఇలా మిగతా రెండు జీవాలు కూడా మంద నుండి తప్పించుకోవడానికి గల కారణాల్ని చెబుతాయి. ఇవి వర్తమాన సమాజపు పోకడలపై రచయిత వేసిన చెణుకులు.
తప్పించుకున్న జీవాలు ఓ యోగి దగ్గర మానవ భాషని మాట్లాడే వరం పొందుతాయి. కేవలం మాట్లాడటమే కాదు రకరకాలైన చర్చలు కూడా చేస్తాయి. శేషాచలం అడవిలో ఎర్రచందనం స్మగ్లర్ల నుండి అడవిలో అన్నల గురించి కూడా అవి ముచ్చటించుకుంటాయి. సెటైర్లు వేస్తాయి. తీర్పులు అలవోకగా ఇస్తాయి. రచయిత ఈ జీవాల్ని అడ్డం పెట్టుకుని మొత్తం సమాజాన్ని స్కాన్ చేస్తారు.
“కల్తీ లేని వ్యాపారి, కాపీ కొట్టని కవీ ఉంటారా ఈ భూమ్మీద?” అని అంటుంది నల్ల గొర్రె ఓ సందర్భంలో. చదవగానే అప్రయత్నంగానే నవ్వు వస్తుంది.
“మటన్ ఖర్చు కన్నా మసాలా ఖర్చు ఎక్కువైందిరా నాయనా..” అని అంటుంది ఓ పాత్ర. ఒకామె భర్తకి ముక్క లేందే ముద్ద దిగదు. కాని అతను కిడ్నీ వ్యాధిగ్రస్థుడు. డాక్టర్ మటన్ ముట్టవద్దని చెబుతాడు. భార్య ఈ సమస్యకి పరిష్కారంగా మటన్ సూపు చేసి భర్త ముందు పెడుతుంది. ఆ వాసన చూస్తూ అతను ఏదో సర్దుకుపోతాడు. ఆ సందర్భంలో అన్న మాట ఇది.
గొర్రెల, మేకల పెంపకందార్ల జీవితాల్లోని విషాద కోణాన్ని కూడా ఈ నవల ఆవిష్కరించింది. పైకి పరిహాసంగా కనిపించినా, వారి వేదన విషాద సంగీతంలా నేపథ్యంలో వినిపిస్తూనే వుంటుంది.
రచయిత తను పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లా ఈశ్వరాపురం గ్రామ నేపథ్యంలోనే ఈ నవల రాశానని చెప్పారు. ఆ ప్రాంత గ్రామీణుల కలుపుగోలుతనం, అమాయకత్వం, మంచితనం, చాలా సహజంగా చిత్రించారు రచయిత. జాతరక్క పాత్రని ఒక నమూనా పాత్రగా మనం భావించవచ్చు.
రచయిత ఒక లాండ్‌స్కేప్ ఆర్టిస్టుగా అవతారం ఎత్తారు. గోవింద పాదం చుట్టుపక్కల ప్రకృతి అందాల్ని తన రచనా కాన్వాస్‌పై అద్భుతంగా చిత్రించారు.
పారిపోయిన జీవాలు తిరిగి వాటి యజమానులకు లభిస్తాయా లేదా అన్నది ఒక సహజ కుతూహల అంశం. ఆ కుతూహలాన్ని చివరివరకు నిలబెట్టడంలో రచయిత చాతుర్యం కనబరిచారు. చివరికి వాటిని యజమానులు కనుక్కొన్నారనే విషయాన్ని కేవలం సూచనప్రాయంగా చెప్పి, మంచి శిల్ప పరిణితిని ప్రదర్శించారు.
జంతువుల ప్రవర్తన సహజాత జనితం. అది మానవుల్లోలా బుద్ధిప్రేరితం కాదు. బహుశా ఆ కారణంగానే మనుషుల్లో కనిపించే కుళ్ళూ కుతంత్రాలు, పగ, ద్వేషం, వంచన, దగా, అసూయ లాంటి అవలక్షణాలు జంతుజాతిలో కనిపించవు. యోగి వరం కారణంగా మానవ భాష అబ్బిన ఆ నాలుగు జీవాలకి మానవ దౌర్భల్యాలు కూడా అంటుకుంటాయి. దీన్ని నెపంగా తీసుకుని మానవ సమాజాన్ని, దాని చెడు లక్షణాల్ని చురకత్తుల్లాంటి చెణుకులతో ఎద్దేవా చేశారు రచయిత. రాజుగారి ఛలోక్తులు చురకలు పెడుతూనే, కితకితలు పెట్టినట్టు నవ్విస్తాయి.
ఈయన వాక్యాలు ‘కులకతా’ సాగుతాయి. ప్రతి వాక్యంలోను హాస్యం, వ్యంగ్యం తుళ్లింతలుపోతూ తోటలోని సీతాకోకచిలుకల్లా ఎగురుతూ వుంటాయి నవలంతా. పుస్తకం పూర్తి అవగానే పాఠకుడికి మంచి ‘కుశాలు’గా అనిపించడం ఖాయం.
కొన్ని చోట్ల రచయిత తనకు తెలిసినవన్నీ పాఠకులకి చెప్పేయాలనే ఆతృత కనబరచడం గమనించవచ్చు. దీనివల్ల నవల అల్లికకి బిగి సడలింది. నవల చివరిలో హడావిడిగా ముగించినట్టు కూడా అనిపించింది.
***
రచన: ఆర్.సి. కృష్ణస్వామి రాజు
ప్రచురణ:
మువ్వ చిన రామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్
పేజీలు: 117
ధర: ₹ 100/-
ప్రతులకు:
ఫోన్: 93936 62821
ఆన్‍లైన్‌లో
https://books.acchamgatelugu.com/products/mekala-banda?sku_id=51660988
వృత్తిరీత్యా ఆకాశవాణి హైదరాబాద్, విశాఖ కేంద్రాలలో పనిచేసి, ఎకౌంటెంట్‌గా పదవీ విరమణ చేసిన శ్రీ ఎస్. హనుమంతరావు ప్రవృత్తి రీత్యా, కవి, కథకులు. 1976 లో తొలి కవిత, 1979లో తొలి కథ ప్రచురితమయ్యాయి. తదుపరి వీరి కవితలు, కథలు అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. సొల్లుఫోను అనే కథా సంపుటి, స్నేహ ధర్మం అనే బాలల కథల పుస్తకం వెలువరించారు. శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక అవార్డు, శ్రీ నారంశెట్టి బాల కథాసాహిత్య పీఠం నుంచి ప్రశంసాపత్రం పొందారు. ప్రస్తుత నివాసం విశాఖపట్టణం.
