Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నవ్వుకుందామనే కథల సంపుటి ‘మీది తెనాలి – మాది తెనాలి’

[ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు గారి హాస్య కథల సంపుటి ‘మీది తెనాలి – మాది తెనాలి’ సమీక్ష.]

ప్రముఖ రచయిత ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు గారి 18వ పుస్తకం ‘మీది తెనాలి – మాది తెనాలి’. ఇందులో ఇరవై కథలున్నాయి. ఇవన్నీ కొసమెరుపుల కామెడీ కథలు.

కామెడీ కథలను సమీక్ష చేస్తే, స్పాయిలర్ అయిపోతాయన్న భయం ఉంటుంది. అందుకని ఒక్కో కథని విడమర్చి చెప్పకుండా కొన్ని హాస్య సంభాషణలనో, నవ్వించిన సన్నివేశాలనో చెప్తాను.

తన కూతురికి తగిన భర్తని ఎంపిక చేయడంలో రత్నమాల చూపిన విచక్షణ గొప్పది. ఎదుటివారిపై మనం చూపించే కన్సర్న్ ఒక్కోసారి మనకు ప్లస్ అవుతుందని ‘కల్యాణ కట్ట’ కథలో మనోహరుడు నిరూపిస్తాడు. అల్లుడిగా ఇద్దరిలో ఒకతన్ని ఎంచుకున్న రత్నమాల కూతురుకి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు ‘తేనే తొట్లోకి సర్రుసర్రున జారినట్లయింది వీరశివకుమారికి’ అంటారు రచయిత. ఈ వాక్యం చదువుతుంటే చిన్న నవ్వొకటి పాఠకుల పెదాలపై తచ్చాడుతుంది.

ఇంగ్లీషులో ‘సౌండ్ స్లీప్’ అనే పదాల గురించి చక్కని జోక్స్ ఉన్నాయి. మూమూలు పరిభాషలో ‘సౌండ్ స్లీప్’ అంటే చక్కని నిద్ర. కానీ అవే పదాల్ని వ్యంగ్యంగా వాడితే, గురక బాధితులని అర్థం చేసుకోవాలి. ఇదే ఇతివృత్తం మీద అల్లిన కథ ‘మీది తెనాలి – మాది తెనాలి’. ‘సౌండ్ స్లీప్’ అనే పదాలని తప్పుగా అర్థం చేసుకున్న వైద్యుడికి, ఎంబిఎలో ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ చేసిన ఆయన భార్య ఓ గొప్ప వ్యాపార సూత్రం చెబుతుంది. హాయిగా నవ్విస్తుందీ కథ.

నాటకం సందర్భంగా ఊరిజనం ఏర్పాటు చేసిన పాయసం వితరణలో దొన్నెలో పాయసం తాగి భామామణిని దక్కించుకుంటాడు మునిశేఖరుడు. అంతకుముందు వారంలో చెయ్యని ఆ పనిని ఈ వారం చేయడంలోని రహస్యాన్ని గ్రహించిన రెడ్డిరాణి మునిశేఖరుడిని పెళ్ళాడేందుకు ఒప్పుకుంటుంది, ‘విదుర విందు’ కథలో.

ముక్కుపొడి కొనుక్కుపోతున్న మునిలక్ష్మక్క జరిగినదంతా చూసి పకపకా నవ్వబోయింది. పడిశం ముక్కు పడనీయలేదు. దగ్గర్లోని ఓ చెట్టు దగ్గరకి వెళ్ళి ముక్కుపొడి పీల్చి మరీ – ఆగి ఆగి నవ్వుకుంది. ఎందుకో తెలియాలంటే, ‘పారాచూట్’ కథ చదవాలి.

సినిమా వాళ్ళూ మామూలు మనుషులేననీ, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయని లైటర్ వీన్‌లో చెప్తుంది ‘ఛత్రపతి’ కథ. ఊరు ఊరంతా తనని ఎందుకంత గౌరవిస్తున్నారో రాజశేఖరుడికి అర్థం కాదు. విషయం తెలిసాకా నవ్వుకుంటాడు.

‘కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయ్’ అన్న ప్రయోగాన్ని ఆధునికం చేసి, ‘జీర్ణాశయంలో జెర్రులు ప్రాకినట్టు ఉండాది’ అంటారు ‘కొండలడ్డు నవ్వింది’ కథలో. “అబ్బ.. అబ్బ.. ఒళ్ళు పులకిస్తా ఉంది” అని తియ్యటి గుటకలు మింగుతాడు దొరసామి ‘ఫారిన్ రిటర్న్‌డ్’ కథలో. కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు.

సహన ‘తీపి జబ్బు, తీపి మొగుడు’ అని ఎందుకు అనుకుందో తెలియాలంటే, ‘తీపి జబ్బు’ కథ చదవాలి. చక్కెర పందిట్లో తేనె వాన కురిస్తే ఎలా ఉంటుందీ? పచ్చనోటు చూసిన నటరాజు మనసులా ఉంటుంది. ఎవరా నటరాజు, ఏమా కథా కమామీషు అనుకుంటున్నారా? ‘చక్కెరక్కను కుక్కు కరిచింది’ కథ చదవాలి మరి!!

హీరోయిన్ ముక్కు కుట్టించుకుంటే, యూట్యూబ్ ఛానెల్ వాళ్ళ హడావిడి.. నోస్ బోరింగ్ ఫంక్షన్.. గొప్ప సైటైరిక్ కథ. తమ వ్యక్తిగత వేడుకలని ఓటిటిలకు అమ్ముకునే నాయికానాయకులపై వ్యంగ్యాస్త్రం ‘ముక్కు పుడక’ కథ.

“పదేళ్ళ ముందు రెండు కళ్ళకూ కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నఈయనకు ఇన్ని సోకులు అవసరమా?” అనుకుంటుంది జలజక్క, వాళ్ళాయన భోజరాజు గురించి! ఆయన ఏం చేశాడో, ఎందుకు చేశాడో తెలిసాకా, ఆమె మనసు సెగ తగిలిన వెన్నలా అయిపోతుంది ‘పెళ్ళి కళ వచ్చిందే బాలా’ కథలో. నవ్విస్తూనే, ఓ విలువైన విషయాన్ని చెబుతుందీ కథ.

ఓ కథలో ఓ పాత్ర పేరు వితండం! ఆ పేరుని అన్ని సార్లు చదువుతుంటే, తెలియకుండానే నవ్వొస్తూంటుంది.

~

గ్రామీణుల సంభాషణల్లో అలవోకగా, అప్రయత్నంగా దొర్లే హాస్యాన్ని ఈ కథలు ఒడిసిపట్టాయి. అమాయకత్వం, naiveté పోగొట్టుకోని గ్రామస్థుల సహజ ప్రవర్తన నుంచి వెలువడిన హస్య సంఘటనలతో అల్లిన ఈ కథలు రండి, నవ్వుకుందామని పిలుస్తాయి పాఠకులని.  ఒత్తిడి నిండిన దైనందిన జీవితాలలో కాస్తంత సేద తీర్చుతాయి. రెండు కథల్లో హీరో ప్రభాస్ పాత్ర అవుతాడు, అతని అభిమానులను అలరిస్తాడు.

***

మీది తెనాలి – మాది తెనాలి (కొసమెరుపు కామెడీ కథలు)
రచన: ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు
ప్రచురణ: హాస్యానందం ప్రచురణలు
పేజీలు: 160
వెల: ₹ 140/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు,
ఫోన్ 9393662821
~
ఆన్‌లైన్‌లో:
https://logilitelugubooks.com/book/meedi-tenali-maadi-tenali-r-c-krishna-swamy-raju

Exit mobile version