ప్రసార ప్రచార మాధ్యమాలు
ప్రజలకు, ప్రభుత్వానికి వారధులు కావాలి!
సన్మార్గంలో నడిపించే సారధులు కావాలి!
ప్రజల ఆశలు నెరవేర్చే హితులు కావాలి!
అక్షరాల్లో సామాన్యుడి ఆకాంక్షలు
సీతాకోక చిలుకలై ఎగరాలి!
సగటు మానవుని కలలు
సప్త వర్ణాలై శోభిల్లాలి!
క్లేశ వినాశులై
జ్ఞాన కోశాలై వెలుగొందాలి!
వదన విహాయసంలో
శాంతి కపోతాలై విహరించాలి!
అవినీతికి అరదండాలు వేసే
న్యాయమూర్తులు కావాలి!
అక్రమాలని, అన్యాయాల్ని చీల్చి చెండాడే
ఆయుధం కావాలి!
నయవంచకుల, ఊసరవెల్లుల
ఆటకట్టించే వీరులు కావాలి!
అక్రమార్కులకు సింహస్వప్నమై నిలవాలి!
రాజకీయ దుర్గంధాల్ని ప్రక్షాళన చేసే పావన గంగలు కావాలి!
బాధితుల పక్షాన నిలిచే
ఆపద్భాంధవులు కావాలి!
వాణిజ్యమే పరమావధి కాకుండా
విష విద్వేషాలు విరజిమ్మకుండా
వివేక సుధాంబుధిలో తేల్చాలి!
విజ్ఞతతో విషయ పరిజ్ఞానం అందించాలి.
సమగ్ర సమాచార దర్పణాలు కావాలి
ప్రతీ పథం ప్రగతి పథం కావాలి!
అసత్యాన్ని ప్రచారం చేసే స్వేచ్ఛ కాదు –
పత్రికా స్వేచ్ఛ అంటే!
వార్తల్ని వక్రీకరించే హక్కు కాదు –
సమాచార హక్కంటే;
ప్రజాస్వామ్య బద్ధులై
రాజ్యాంగ నిబద్ధులై మెలగాలి!
దుష్ట దండకులు కావాలి! శిష్ట రక్షకులై నిలవాలి!
సుగుణాల్ని గానం చెయ్యాలి
ప్రజాహితం పతాక శీర్షిక కావాలి!
నిర్మొహమాటమే నిచ్చెనగా
నిష్పక్షపాతమే నిత్యశ్వాసగా
మానవీయ విలువలే మకుటాయమానంగా
విలువల వలువలు వలవకుండా
నిలువెత్తు నిజాయితీకి నిదర్శనంగా
జన బాహుళ్యానికి జవసత్త్వాలివ్వాలి!
పారదర్శకత, పరమార్థకత ప్రణవం కావాలి!
ప్రతీ హృదయంలో పదిలంగా
పది కాలాలు పరిఢ విల్లాలి!
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.