Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మయూఖుడు

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘మయూఖుడు’. రచన శ్రీమతి అవధానుల విజయలక్ష్మి.]

కురుక్షేత్ర యుద్ధానికి ముందు రోజులు..

హస్తినాపురంలో రాజసభలో..

దుర్యోధనుడు, కర్ణుడు, శకుని యుద్ధ వ్యూహాల గురించి చర్చిస్తున్నారు.

దుర్యోధనుడు నవరత్నఖచిత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మిగిలిన వారు మాత్రం మామూలు బంగారు సింహాసనాలే అధిష్టించారు..

దుర్యోధనుడి కళ్ళు అహంకారంతో పెద్దవై ఉంటే శకుని కళ్ళు ఆలోచనతో చిన్నవై ఉన్నాయి.

కర్ణుడు మాత్రం దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్లు రాజమందిరం పైకప్పు మీద చెక్కిన బంగారు లతలను తదేకంగా చూస్తున్నాడు.

“హూ! చిన్న పొరపాటు వలన శ్రీకృష్ణుని అండను పోగొట్టుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఎంత సైన్యం ఉన్ననూ ఏమి లాభము!” అంటూ నిట్టూర్చాడు దుర్యోధనుడు.

“వలదు, దుర్యోధనా పశ్చాత్తాము వలదు. కృష్ణుడు లేకపోయిననేమి? మరొక ఉపాయం ఆలోచించెదము” అన్నాడు శకుని మీసం మెలిస్తూ..

“కర్ణా! ఏమి నీ ఆలోచన? అంత నిశ్శబ్దం ఏల” అన్నాడు దుర్యోధనుడు కర్ణుని వైపు చూస్తూ.

“మన దగ్గర ఒక అద్భుతమైన రథం ఉన్నచో ఎటుల ఉండునోయని ఆలోచించుచుంటిని” అన్నాడు కర్ణుడు పైకప్పుమించి చూపు తిప్పి దుర్యోధనుడి వైపు సాలోచనగా చూస్తూ.

“అద్భుతమైన రథమా? అంటే??”

“చెప్పెదను వినుడు” అంటూ కర్ణుడు చెప్పడం మొదలెట్టాడు..

***

రాజభవనానికి రెండు క్రోసుల దూరంలో..

అక్కడ రాళ్లు నాట్యం చేస్తున్నాయి.. సంగీతం పాడుతున్నాయి.. కథలు చెప్తున్నాయి..

ఒక్కొక్క శిల్పంలో ఉన్న రాయి తన జన్మ ధన్యమైందని మురిసిపోతోంది..

అక్కడ ఉలి చేసే శబ్దం తప్ప మరొక శబ్దం లేదు..

మిట్ట మధ్యాహ్నం కూడా వెన్నెలలో తడుస్తున్నట్లు తన పని ఏకాగ్రతగా చేస్తున్నాడు అతను..

అతని పేరు మయూఖుడు.

తనకు విచిత్రమైన ప్రతిభ ఉంది..

రాళ్లలో, లోహాల్లో, కలపలో జీవం నింపినట్టుగా శిల్పాలు చెయ్యగలడు.

అంతేకాదు చెక్కిన శిల్పములను అదృశ్య రూపంలో ఉంచగలడు..

కలపతో చేసిన శిల్పములను రాతి శిల్పములుగానూ, రాతితో చేసిన శిల్పములను లోహ శిల్పములు గాను మార్చగలడు.

ఎవరికీ అతని అసలైన వంశం తెలియదు. అతని తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అతను చెక్కే శిల్పాలు మాత్రం అందరికీ తెలుసు..

అసలు అతను ఉలితో చేసే శబ్దంలోనే ఒక లయ ఉంటుంది ఒక సంగీతం ఉంటుంది..

సంగీతంలో నుంచి శిల్పాలు పుట్టాయో శిల్పాల నుంచి సంగీతం పుట్టిందో చూసినవారికి అర్థం కాదు..

అద్భుతమైన ప్రపంచంలో మైమరిచిపోవడం ఒక్కటే తెలుసు..

ఒక రాత్రి, చంద్రకాంతి వెలుగులో..

అతడు గంగా తీరంలో శిల్పం చెక్కుతుండగా ఒక నాగకన్య అతనికి ప్రత్యక్షమైంది.

“మయూఖా! నువ్వు సాధారణ మనిషివి కాదు. నువ్వు మా నాగవంశానికి చెందిన వాడివి. కానీ మానవుల మధ్య పెరిగావు.”

“అవునా!” ఆశ్చర్యంగా అన్నాడు మయూఖుడు.

“అందుకేనా నాకు ఎప్పుడు నా తల్లిదండ్రులు గుర్తుకురారు!?” అన్నాడు విచారంగా. ఆమె చల్లగా నవ్వింది.

“నీకు తెలుసా మయూఖా! కొన్నిరోజుల్లో కౌరవులకి పాండవులకి మధ్య పెద్ద యుద్దం రాబోతోంది. దానినే కురుక్షేత్ర సంగ్రామం అంటారు.”

“అవునా నేను నా శిల్ప ప్రపంచంలో పడి చుట్టుపక్కల విషయాలు పట్టించుకోవడం లేదు.”

“ఈ యుద్ధం లోకాన్నినాశనం చేస్తుంది. మన నాగవంశం ఈ విధ్వంసానికి దూరంగా ఉండాలనుకుంటుంది. కానీ నువ్వు మానవులలో ఉన్నావు. నీ శిల్ప చాతుర్యంతో ఈ యుద్ధం వల్ల వినాశనాన్నికాస్త తగ్గించగలవు.”

“మాతా, నేను ఏం చేయాలో చెప్పండి”

ఆమె చెప్పడం మొదలెట్టింది..

***

రెండు రోజుల తర్వాత మయూఖునికి దుర్యోధనుడి దగ్గర నుండి పిలుపు వచ్చింది.

“మయూఖా! నువ్వుఅద్భుతమైన శిల్పివని విన్నాను. శిల్ప కళలోనేగాక నువ్వు నీ మంత్ర శక్తితో శిల్పాలలో అద్భుతాలు సృష్టించగలవని విన్నాను. నిజమేనా?”

“నాకు ఏ మంత్ర తంత్రములు తెలియవు మహారాజా. కానీ నాకు తెలియకుండానే పుట్టినప్పటి నుండి ఆ శక్తినా చేతుల్లోకి వచ్చింది.”

“శభాష్! ఐతే నువ్వు నా యోధుల కోసం నువ్వుఒక అదృశ్య రథం తయారు చేయాలి. పాండవులు మోసపోవాలి.”

మయూఖుడు నాగకన్య ఇచ్చిన హెచ్చరికను గుర్తుచేసుకున్నాడు. కానీ రాజాదేశానికి అవిధేయుడిగా ఉండలేడు!

“అదృశ్య రథం అంటే ఎలా ఉండాలి మహారాజా?”

“అంటే అది కౌరవులకు మాత్రమే కనపడవలె. మిగతా వారికి అదృశ్య రూపంలో ఉండవలె.”

మయూఖుడు ఆలోచించాడు..

వినయంగా చేతులు కట్టుకుని దుర్యోధనునితో ఇలా అన్నాడు,

“మహారాజా రథం నిర్మించెదను, కానీ దానికి చాలా ఏకాగ్రత అవసరం నేను పని చేసినన్ని రోజులు ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండరాదు.”

“సరే అయితే మా కోటలో నీకు ఒక ఏకాంత ప్రదేశం ఏర్పాటు చేయుదుము. అక్కడ నువ్వు ఏ ఆటంకమూ లేకుండా పని చేసుకోవచ్చును.”

“మహారాజా నేను కోటలో పనిచేసిన నా శిల్ప చాతుర్యము పూర్తిగా ఉపయోగించుకోజాలను. నేను నాకు అలవాటు అయిన ప్రదేశంలో రథము నిర్మించెదను”

“సరే అట్టులే కానిమ్ము” అన్నాడు దుర్యోధనుడు కాస్త అయిష్టంగా.

***

రథము నిర్మించే పని మొదలైంది.. మయూఖుడు నిద్రాహారాలు మాని రథం నిర్మిస్తూనే ఉన్నాడు.

ఎట్టకేలకు మయూఖుడు ఒక రథం నిర్మించాడు.

కానీ దానిలో ఒక రహస్యాన్ని దాచాడు!

ఆ రథం ఎవరైనా అన్యాయ యోధుడు ఎక్కితే వెంటనే రథం రాతి రథంగా మారిపోతుంది.

ధర్మానికి దగ్గరైన వాడు ఎక్కితే మాత్రం అది ఏం మార్పు చెందదు.

***

యుద్ధం రోజు దగ్గర పడింది..

ఆ రథాన్ని దుర్యోధనుడు కర్ణునికి బహుకరించాడు..

కర్ణుడు ఎక్కగానే రథం రాతి రధంలా మారిపోయింది!

అందరూ ఆశ్చర్యపోయారు.

దుర్యోధనుడు కోపంతో మయూఖుని పిలిపించాడు.

“నేను చెయ్యమన్నదేమి? నువ్వు చేసినదేమి? నేను అదృశ్యరథం నిర్మించమన్నాను. నువ్వు రాతిరథం నిర్మించావు. ఈ రాజాధిక్కారమునకు నీకు ఉరిశిక్ష వేయడం అయినది,” అన్నాడు మండి పడుతూ.

“మహారాజా నేను మీ ఆజ్ఞను మీరలేదు. ఈ రథం కౌరవులకొక్కరికే కనిపిస్తుంది. అదే కదా మీరు నిర్మించమన్నది.” తొణకకుండా అన్నాడు మయూఖుడు.

“కానీ ఈ రాతిరథమును నేను ఏమి చేసుకొనదెను? నీకు ఉరిశిక్ష తప్పదు!”

దుర్యోధనుని మాట పూర్తికాకముందే అక్కడికి వేవేల సర్పములు వచ్చాయి.

నాగు పాములు..

త్రాచు పాములు..

రక్తపింజరీలు..

కొండచిలువలు..

కట్ల పాములు..

మొత్తం సర్పజాతి అంతా అక్కడకు చేరి రథాలపై ఎక్కసాగాయి..

సైనికులు భయవిహ్వలులు అయ్యారు..

వాటిలో ఒక పాము స్త్రీగా మారి ఇలా అంది.

“మయూఖుడు సర్ప జాతికి చెందినవాడు. అతనికి ఇసుమంత అపాయం కలిగినను మీ కౌరవులు మొత్తం పాము కాట్లకు గురై మరణిస్తారు.”

ఎక్కడినుండో “ఆగండి” అంటూ ఒక గంభీరమైన స్వరం వినిపించింది..

అక్కడ కృష్ణుడు ప్రత్యక్షం అయ్యాడు!

“మయూఖుడు మోసగాడు కాదు. తన శిల్పంలోనే ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. నిజమైన యోధుడు ఎవరనేది రథమే నిర్ణయించింది.”

అందరూ స్తంభించిపోయారు.

దుర్యోధనుడు కోపంతో చిందులు వేస్తూ వెళ్ళిపోయాడు.

పాములు అన్నితమ తమ కలుగుల్లోకి వెళ్ళిపోయాయి.

మయూఖుడు మాత్రం గంగాకట్టకు వెళ్ళి తన రహస్యం గోప్యంగా ఉంచాడు.

నాగకన్య రాత్రి వచ్చి చెప్పింది..

“నువ్వు నాగవంశానికే గౌరవం తెచ్చావు. మానవుల యుద్ధంలోనూ ధర్మానికి దారి చూపావు.”

మయూఖుడు చిరునవ్వు చిందించి గంగలో కనుమరుగయ్యాడు.

ఆ రోజు నుండి అతని గురించి ఎవ్వరూ వినలేదు.

(మహాభారతంలో ఈ కధ లేదు. ఇది మైథలాజికల్ ఫిక్షన్ గురించి కల్పించిన కథ)

Exit mobile version