“మాయా బజార్ జిందాబాద్! మాయా బజార్ అభిమాన సంఘం వర్ధిల్లాలి” అంటూ కుడి చెయ్యి పిడికిలి బిగించి అరుస్తూ వచ్చేడు మూర్తి.
మూర్తి నా బాల్య స్నేహితుడు.
మూర్తి కుటుంబము, మా కుటుంబము పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళము. మాకు ఊహ తెలిసినప్పటి నుండీ కలిసి పెరిగేము. ఒకే ఊరిలో ఒకే ఆఫీస్ లో పని చేస్తున్నాము.
“ఏమిటి మూర్తీ? మాయా బజార్ అభిమాన సంఘం ఏమిటి?” అడిగేను.
“మాయా బజార్ అభిమాన సంఘం జిందాబాద్!” మళ్ళీ అరిచేడు మూర్తి.
“ఈ అరుపులు కేకలు మాని అసలు ఈ మాయా బజార్ అభిమాన సంఘం ఏమిటి? మాయా బజార్ సినీమాకి, అదీ అరవై ఏళ్ళ పాత సినీమాకి అభిమాన సంఘం అవసరము ఎందుకు వచ్చింది చెప్పు మూర్తీ” అన్నాను.
“ఒరేయ్! సినీమా స్టార్లకి అభిమానులూ, అభిమాన సంఘాలూ ఉన్నాయి. అవునా కదా? అల్లాగే క్రికెటర్లకీ అభిమాన సంఘాలూ, అభిమానులూ ఉంటున్నారు. మాయా బజార్ సినీమాకీ అభిమానులూ ఉన్నారు. అవునంటావా కాదంటావా?” మూర్తి ప్రశ్నకు అవుననే చెప్పేను.
“అద్గదీ! ఇప్పుడు దారికి వచ్చేవు. కూర్చో! ఇప్పుడు వివరంగా చెప్తాను” అన్నాడు మూర్తి.
మూర్తి గురించి మీకు కొంచెం చెప్తాను. మూర్తి నాకు బాల్య మిత్రుడైనా మేమిద్దరమూ నాణేనికి బొమ్మను బొరుసూ లాంటి వారం. కలిసే అతుక్కుని ఉంటాము కానీ మా అభిప్రాయాలు కలవవు.
“ఏం చేస్తున్నారు మూర్తీ” అంటూ వచ్చేరు రాజు గారు అనబడే రామ కృష్ణ రాజు.
నా పేరు రామారావు. మూర్తి పేరు కృష్ణమూర్తి.
నాణేనికి బొమ్మ బొరుసులను కలుపుతూ ఉండే పదార్థం లాంటి వారు రామ కృష్ణ రాజు గారు.
“ఏముంది రాజు గారూ! మూర్తి ఇప్పుడు మాయా బజార్ అభిమాన సంఘం పెడుతున్నాట్ట” అన్నాను.
వెంటనే లంకించుకున్నాడు మూర్తి.
“అవునండి రాజు గారూ! మాయా బజార్ సినీమాకి అభిమానులయితే లక్షలు లక్షలు ఉన్నారు కానీ, అభిమానులను ఒక్కచోట చేర్చే సంఘం లేదనిపించింది. ఆ లోటు తీర్చే పనిలో ఉన్నాను” అన్నాడు మూర్తి.
“ఇంతకీ ఆ మాయా బజార్ సినీమాలో అభిమానించాల్సినది ఏముంది చెప్పండి రాజు గారూ? అయినా చూసిన సినీమా ఎన్ని సార్లు చూడగలం చెప్పండి రాజు గారూ? రెండో సారి చూసినంత మాత్రంలో కథ మారుతుందా డైలాగులు మారుతాయా ? పాటలు మారి పోతాయా?” అన్నాను.
“ఇప్పుడు దారిలోకి వచ్చేడు గురుడు!” అంటూ ప్రారంభించేడు మూర్తి.
“నీకు బీచ్‌లో కూర్చుని సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూడడం ఇష్టం కదా?”
మూర్తి అడిగిన ప్రశ్నకు ఇష్టమన్నట్లు తల ఊపేను.
“రాత్రి పూట వెన్నెలలో బాలమురళీ కృష్ణ గారి ఎందరో మహానుభావులు కేసెట్ వినడం కూడా ఇష్టమే కదా?”
మళ్ళీ తల ఊపేను ఇష్టమన్నట్లు.
“కదా! అదే సముద్రం, అదే సూర్యుడు! ఎన్ని సార్లు చూస్తున్నా నీకు తనివి తీరనప్పుడు, అదే కేసెట్లో బాలమురళీ గారి పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరనప్పుడు …”
మూర్తి మాటలకు అడ్డు తగులుతూ “ప్రతి సారీ నాకు ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది” అన్నాను.
“ఇప్పుడు నువ్వు నా దారికి పూర్తిగా వచ్చేవు. సూర్యోదయం చూస్తున్న ప్రతి సారీ ఏదో కొత్తదనం కనిపిస్తున్నట్లు, బాలమురళీ గారి పాట వింటున్నప్పుడల్లా ఏదో కొత్తదనం నీకు వినిపించినట్లు మాయా బజార్ చూసిన ప్రతిసారీ నాకు ఏదో కొత్త విషయము కనిపిస్తూంటుంది” అన్నాడు మూర్తి.
“మరో మాట! మహా భారత, రామాయణం, భగవద్గీత కూడా అటువంటివే. చదివే వారి వయసు బట్టి, అనుభవము బట్టి ఆ గ్రంథాలలో కొత్తదనం కనిపిస్తూంటుంది” అన్నాడు మూర్తి.
మూర్తి మాటలతో ఏకీభవిస్తున్నట్లు తల ఊపేరు రాజు గారు.
“అయితే మాయా బజార్ సినీమా భగవద్గీత రామాయణాలతో సమానం అంటావు” అన్నాను.
“అవును” అన్నాడు మూర్తి.
“అయితే మాయా బజార్ సినీమాకి భగవద్గీత పక్కనే చోటివ్వాలి అంటావు. సరే, ఒప్పుకోవడానికి ఒక్క కారణం చెప్పు” అన్నాను.
“ఒక్కటేమిటి? ఎన్నో చెప్తాను.”
“మొట్టమొదటిగా, మాయాబజార్ విడుదల అయిన 63 సంవత్సరాల తరువాత కూడా జనం చర్చించుకోవడం ప్రధాన కారణం. రెండోది, ఇప్పటికీ, మాయా బజార్ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఇంట్లోనో, సినీమా హాల్ లోనో కనీసం పది మందైనా చూస్తూ ఉంటారు.”
“దీనికి నేనొప్పుకోను “ అన్నాను గట్టిగా .
“వదిలేయ్! 1950 తరువాత పుట్టిన వారిలో చాలా మందికి మాయా బజార్ సంగతి బాగా తెలుసును” అన్నాడు మూర్తి.
“అవును! మాయా బజార్ గురించి 2007 మార్చ్ నెలలో ఈ నాడు ఒక ప్రత్యేక సంచికను అదివారం అనుబంధంగా ప్రచురించిందనో, రావి కొండల రావు గారు మాయాబజార్ సినీమా గురించి నవలా రూపంలో పుస్తకం వ్రాసారనో, ఆయన, సింగీతం శ్రీనివాసరావు గారు మాయాబజార్ గురించి చెప్పినవన్నీ యూ ట్యూబ్‌లో ఉన్నాయనో నాకు చెప్పొద్దు” అన్నాను.
“అందరికీ తెలిసేటట్లు యూ ట్యూబ్‌లో ఉన్న వాటి గురించి, అందరికీ తెలిసిన వాటి గురించి నేను చెప్పనులే” అన్నాడు మూర్తి.
“మరి కొత్త విషయాలు చెప్పు” అన్నాను .
“అయితే మాయా బజార్ గొప్పతనం గురించి మరి కొన్ని విషయాలు చెప్తాను వినండి రాజు గారూ!”
మూర్తి మాటలు నేను వింటున్నానని నిర్ధారించుకుని ప్రారంభించేడు మూర్తి.
“భారత దేశములో నిర్మించబడిన అత్యుత్తమ చలన చిత్రము ఏదో అని నిర్ధారించుకొనడానికి CNN IBN వారు 2013 మే లో నిర్వహించిన పోటీలో మాయా బజార్ ప్రథమ స్థానములో నిలిచింది.
ఆంధ్ర ప్రదేశ ప్రభుత్వములో మాయా బజార్ సినీమాని పదవ తరగతి పాఠ్యాంశముగా చేర్చేరు.
విశాఖ పట్టణము, చెన్నై, పూణే ఇంకా మరెన్నో చోట్ల లో ఉన్న చలన చిత్ర ప్రశిక్షణా కేంద్రములలో, సంస్థలలో పాఠ్యాంశములలో మాయా బజార్ సినీమా ప్రతి విభాగములోను చోటు చేసుకొంటూంటుంది.
1957వ సంవత్సరములో విడుదల అయిన హిందీ చిత్రములు మదర్ ఇండియా, నయా దౌర్, ప్యాసా ల తో పోటీగా నిలిచింది మాయా బజార్.
ఒక్క నిముషము ఆగి అందుకున్నాడు మూర్తి.
“మాయా బజార్ సినీమా వీరాభిమాని హాస్య బ్రహ్మ జంధ్యాల గారు ఏ ముహూర్తంలో “ ఆహా నా పెళ్ళంట “సినీమా తీసేరో గాని ఆ సినీమా సూపర్ హిట్ అయ్యింది. దానితో ఆయన “చూపులు కలసిన శుభ వేళ, వివాహ భోజనంబు , హై హై నాయక, సినీమాలు తీసేరు.
బొమ్మరిల్లు చలన చిత్ర నిర్మాణ సంస్థ తరఫున నిర్మాత దర్శకులు వై వీ ఎస్ చౌదరి గారు 2002 వ సంవత్సరములొ నిర్మించిన “లాహిరి లాహిరి లాహిరి” లో సినీమా సూపర్ హిట్ అయ్యింది.
“మాయా బజార్ సినీమా దయ వలన నేను తీయబోయే సినీమాలకు టైటిల్స్ కు కొదవ లేదు” అనే వారట జంధ్యాల గారు .
“సరే కొత్త విషయాలు చెప్పే ముందు, మాయా బజార్ పుట్టు పూర్వోత్తరాలు చెప్పాలి.
మాయా బజార్ చిత్రము 184 నిముషములు. నిడివి 5888 మీటర్లు. అనగా 19318 అడుగులు. సెన్సార్ ప్రమాణ పత్రము 04 మార్ 1957 న లభించగా 27 మార్చ్ 1957 న విడుదల అయింది.
మాయా బజార్ కధా వస్తువు శశిరేఖా పరిణయము అనే పేరుతో మహా భారతము లోని కొన్ని పాత్రలతో జానపదులు అల్లుకున్న ఒక కధ. ఈ కధ భారతములో ఎక్కడా లేదు. కాని, కధా రూపములో ఉన్నదాన్ని నాటక రూపములోకి మార్చి ప్రదర్శించేవారు. మల్లాది వెంకట కృష్ణ శర్మ గారు వ్రాసిన శశిరేఖా పరిణయము అనే నాటకమును సురభి వారు మాయాజాల దృశ్యములతో ప్రదర్శించి ఆ కల్పిత గాథకు జీవం పోసేరు.
మాయా బజార్ కధా వస్తువుగా వివిధ భాషలలో 11 సార్లు సినీమాగా తీసేరు.
ఇక్కడ ఒక ముఖ్య విషయము చెప్తాను.
బలరాముని కుమార్తెకు సురేఖ, వత్సల, శశిరేఖ అనే పేర్లు ఉన్నాయి.
మనదేశములో మొదటి సారిగ శ్రీ బాబూరావు పేంటర్ దర్శకత్వములో “సురేఖా అభిమన్యు – వత్సలాపహరణ్” అనే పేరుతో ఆరు రీళ్ళ మూకీ సినీమా 06 అక్టోబర్ 1921 న విడుదల అయ్యింది.
ఆ తరువాత శ్రీ నానూభాయ్ వకీల్ దర్శకత్వములో హిందీ భాషలో “మాయాబజార్ – సురేఖా హరణ్” పేరుతో 1932 లో సినీమా వస్తే, తమిళ భాషలో ఆర్. పద్మనాభన్ దర్శకత్వములో “వత్సలాకళ్యాణం” సినీమా 1935 లో వచ్చింది. ఆ మరుసటి సంవత్సరము అంటే 1936 లో వేల్ పిక్చర్స్ సంస్థ ద్వారా తెలుగులో పీ వీ దాస్ నిర్మాణ దర్శకత్వ బాధ్యతలు వహించిన “ మాయా బజార్ -శశిరేఖాపరిణయము” వచ్చింది.
ఈ సినీమాలో ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు బాల అభిమన్యునిగా నటించేరు. ఈ చిత్రములో కృష్ణునిగా యడవల్లి నాగేశ్వర రావు గారు, శ్రీమతి సీనియర్ శ్రీరంజని సుభద్రగా, శ్రీమతి పీ. శాంతకుమారి శశిరేఖగా, ఎస్ పీ లక్ష్మణ స్వామి అభిమన్యునిగా, నెల్లూరు పహల్వాన్ రాజం రెడ్డి రామిరెడ్డి ఘటోత్కచునిగా, తుర్లపాటి ఆంజనేయులు బలరామునిగా, రాయప్రోలు సుబ్రహ్మణ్యం దుర్యోధనునిగా, పోతూరి సత్యనారాయణ శకునిగా నటించేరు.
ఈ చిత్ర విజయానికి ఎం రాం నాథ్ గారి ట్రిక్ ఫోటోగ్రఫీ దోహదం చేసింది. ఏ కే శేఖర్ కళా దర్శకత్వం తో పాటు శబ్దగ్రహణ బాధ్యతలను నిర్వహించేరు.”
“శాంత కుమారి అంటే?” రాజు గారు అడిగేరు.
“శాంత కుమారి అనగానే మనకు 1955 లో వచ్చిన “అర్ధాంగి” జమీందారిణి, 1960లో వచ్చిన “శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం” సినీమాలో వకుళా మాత, 1962లో వచ్చిన సిరి సంపదలు, 1970లో వచ్చిన “ తల్లా పెళ్ళామా” సినీమాలు గుర్తుకు వస్తాయి. ఆ పైన ఆవిడ పాడిన నందలాలా, ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ ఎదురుగా చూతురా గోపాలా పాటలు కూడా గుర్తుకు వస్తాయి.
అన్నట్టు రాజు గారూ ! శాంత కుమారి గారి అసలు పేరు సుబ్బమ్మ. శశిరేఖా పరిణయము సినీమాలో ఆవిడను శశిరేఖ పాత్రకు నిర్ణయించుకోగానే చిత్ర నిర్మాత దర్శకుకు పీ వీ దాస్ గారు ఆవిడకు శాంత కుమారి అనే పేరు పెట్టేరు.
“మాయా బజార్ సినీమా అభిమాన సంఘం ఎందుకూ అంటే ఈ సొద ఎందుకు చెప్పండి రాజు గారూ?” విసుగ్గా అన్నాను.
“మాయా బజార్ అంటే అల్లాటప్పా సినీమా కాదని చెప్పడానికే ఈ పూర్వాపరాలూ వంశ చరిత్ర చెప్తున్నాను రాజు గారూ” అన్నాడు మూర్తి నా విసుగుకు పరోక్షంగా .
“అయినా, మాయా బజార్ గురించి బ్రహ్మాండమైన భవనం కట్టాలనుకున్నప్పుడు పునాది బలం కావాలి కదా రాజు గారూ ! నేను చెప్పినది, పునాది అనిపించడము లేదూ రాజు గారూ?” అన్నాడు మూర్తి.
“ఈ పునాదులు తవ్వుతూ కూర్చుంటే, అసలు కథలోకి ఎప్పుడు వస్తాడో మూర్తి?” అన్నాను విసుగ్గా.
“ఇదిగో వస్తున్నాను” అన్నాడు మూర్తి.
మాయా బజార్ అనగానే మనకు విజయా వారి మాయా బజార్ అని ఎలా గుర్తుకు వస్తుందో, దర్శకులు కే వీ రెడ్డి గారి పేరు కూడా అలాగే గుర్తుకు వస్తుంది.
మాయా బజార్ విజయా వారి ఆరవ చిత్రం. షావుకారు, పాతాళ భైరవి, పెళ్ళి చేసి చూడు చంద్రహారం, మిస్సమ్మ తరువాత వచ్చిన చిత్రమే మాయా బజార్. చంద్రహారం సినీమాతో నష్ట పోయిన విజయా సంస్థ మిస్సమ్మ సినీమాతో లాభాలలోకి వచ్చింది .
ఆ తరువాత ఏ కధా అంశం మీద సినీమా తీయాలో అని నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి ఆలోచిస్తున్న సమయములో పాతాళ భైరవి దర్శకులు వాహినీ వారి చిత్రాలకు పనిచేసి ఆరు చిత్రములకు దర్శకత్వము వహించిన కే వీ రెడ్డి గారు అనబడే కదిరి వెంకట రెడ్డి గారు తన వద్ద మాయా బజార్ చిత్ర కథ చిత్రానుకరణ (స్క్రీన్ ప్లే) తో సహా సిధ్ధంగా ఉన్నది చెప్పేరు.
రెడ్డి గారు 1938వ సంవత్సరములో ఇరవయ్యారేళ్ళ వయసులో బీ ఎన్ రెడ్డి గారు స్థాపించిన వాహినీ సంస్థలో కేషియర్ గా చేరి అంచెలంచెలుగా ఎదిగి నాలుగేళ్ళలో వాహినీ వారి భక్త పోతనకు (1942) దర్శకత్వము వహించేరు.
భక్త పోతన ఘన విజయము సాధించి వారి యోగి వేమన, గుణ సుందరి కధల ద్వారా వాహినీ వారికి అఖండ విజయములను అందించి, విజయా వారి పాతాళ భైరవి, వాహినీ వారి పెద్ద మనుషులు , అన్నపూర్ణా వారి దొంగ రాముడు చిత్రములకు కూడా దర్శకత్వము వహించి తన దర్శకత్వ పటిమను నిరూపించుకున్నారు.
1955 సంవత్సరము ప్రారంభములో విజయా పిక్చర్స్ నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి గారు మాయా బజార్ సినీమాకు అంగీకారము తెలుపగానే , విజయా వారి ఆస్థాన కవి రచయిత పింగళి నాగేంద్ర రావు గారూ, కే వీ రెడ్డి గారూ కధ స్క్రీన్ ప్లే మీద కసరత్తు మొదలు పెట్టేరు. మాటలు నాగేంద్ర రావు గారు ప్రారంభిస్తే రెడ్డి గారు విజయా వారి సాంకేతిక నిపుణులకు , పాత్రలకు పాత్రధారులను, వారి దుస్తులు, ఆభరణాలు, సెట్టింగుల మీద దృష్టి పెట్టేరు.
“మళ్ళీ మాయా బజార్ అంటూ మహా భారతం పురాణం చెప్తావేంటి మూర్తీ” అన్నాను.
నా మాటలను పట్టించుకోకుండా చెప్పసాగేడు మూర్తి.
“మాయా బజార్ నిర్మాణానికి అన్ని హంగులూ పూర్తి చేసుకుని రెడ్డి గారు పెట్టుబడి సంగతి చూస్తే మొత్తము సినీమాకి 28 సెట్స్ తో అప్పటి నిర్మాణ వ్యయము 28 లక్షలు లెక్కలు తేలింది. ఆ రోజులలో, అంటే 1955-56 లలో ఒక సాంఘిక చిత్రానికి 6 లేక 7 లక్షల రూపాయల పెట్టుబడి అవసరమయితే, మాయా బజార్ నాలుగు సినీమాల పెట్టు బడికి సమానము మాట. అంత పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి వెనుకంజ వేసి మాయా బజార్ నిర్మాణము నుండి విరమించుకుందామని నిర్ణయించుకున్నారు.
ఆ వార్త తెలుసుకున్న దర్శకులు రెడ్డి గారూ, నటీ నటులు, సాంకేతిక వర్గం అందరూ నీరు కారి పోయేరు.
1955 వ సంవత్సరములో 28 లక్షల రూపాయల విలువ తెలియాలంటే , అప్పుడు పది గ్రాముల బంగారము వెల కేవలము 78 రూపాయలు. ఇప్పుడు పది గ్రాముల వెల 38,000 రూపాయలు. అంటే అప్పటి 28 లక్షలు ప్రస్తుతము 131 కోట్ల 42 లక్షల రూపాయలతో సమానం మాట. ఇక్కడ మరొక విషయము గుర్తు పెట్టుకోవాలి. అప్పటి రోజులలో నటీ నటులకు సాంకేతిక వర్గానికి పారితోషికాలు చాలా తక్కువగా ఉండేవి. చాలా మంది విజయ స్టూడియోలో నెలసరి జీతము మీద పని చేసేవారు. కృష్ణ పాత్రధారి రామారావు గారు విజయా వారి పెర్మనంట్ ఆర్టిస్ట్‌గా నెలసరి జీతము తీసుకునేవారట.
సుమారు రెండు నెలల తర్జన భర్జనలు జరిగేక నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి గార్లు మాయా బజార్ చిత్ర నిర్మాణానికి అంగీకరించేరు.
వెంటనే కళా దర్శకులు మాధవపెద్ది గోఖలే కళాధర్ గార్లు సెట్టింగులు ప్రారంభించేరు.
మాయా బజార్ చిత్రములో పన్నెండు పాటలు, నాలుగు పద్యాలు, ఒక దండకము ఉన్నవి. సంగీత దర్శకుకు సాలూరి రాజేశ్వర రావు గారు నాలుగు పాటలకు పల్లవి సిధ్ధం చేసేరు. ఆ నాలుగు పాటల లో మూడు పాటల విషయములో ఏకాభిప్రాయమే.
ఆ మూడు పాటలు చూపులు కలసిన శుభ వేళా, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునదీ.
నాలుగవ పాట విషయములో భేదాభిప్రాయము ఉంది. రావి కొండల రావు గారు శ్రీ కరులు దేవతలు శ్రీరస్తురనగా అనే మొదటి పాటకు రాజేశ్వర రావు గారు బాణీ చేకూర్చేరని అంటే మరొకరు నీవేనా నన్ను తలచినదీ అన్నారు.
ఏదయితేనేం? నాలుగు పాటలకు బాణీ కట్టిన తరువాత సాలూరి వారు సంగీత దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నారు.
ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వ బాధ్యతలను చేపట్టి సాలూరి వారి నాలుగు బాణీలను ఉంచి పాటలు వ్రాయించి సంగీతము సమకూర్చేరు.
మరి ఎనిమిది పాటలు పద్యములు, దండకములను సమకూర్చేరు.
ఈ చిత్ర సంగీతము లోని రెండు ముఖ్యాంశములు చెప్తాను.
ఈ సినీమాలో ఒక పాటకు గాయని పీ లీల గారికి 28 టేకులు తీసుకున్న ఘంటసాల మాస్టారు 5 వ టేకును నిర్ధారించేరని ఆవిడే ఒక ఇంటర్వ్యూ లో చెప్పేరు.
ఈ చిత్రములో ఘటోత్కచ పాత్రధారి రంగారావు గారి మీద చిత్రీకరించిన వివాహ భోజనము వింతైన వంటకంబు పాట వరుసను సురభీ నాట్య మండలి వారి నాటకములోని పాట ఆధారంగ పింగళి వారు ఆ పాటకు కొత్త సాహిత్యమును అందించేరట. సురభీ నాట్య మండలి వారు వివాహ భోజనము పాటకు ప్ర్రఖ్యాత హరికథా కళాకారిణి శ్రీమతి నగరాజకుమారి గారి జానకీ పరిణయము హరి కథ ఆధారమయితే, ఆవిడ ఆ పాటను 1936 వ సంవత్సరములో వచ్చిన మాయా బజార్ చిత్రమునకు విఖ్యాత సంగీత దర్శకులు శ్రీ గారి పెంచల నరసింహ రావు గారు రచించిన పాట ఆధారంగా ఒక పాటను తన హరికథలో పాడే వారట.
వివాహ భోజనంబు పాటలో మధ్య లో వినిపించిన అట్టహాసము ‘అహహ్హ హహ్హ హహ్హ’ కు ఆధారము 1922 వ సంవత్సరములో ఛార్లెస్ పెన్ రోజ్ వ్రాసి పాడిన పాట “ ది లాఫింగ్ పోలీస్ మేన్”.
మాయా బజార్ పాటలన్నీ కాదు గాని, మరో రెండు పాటల విశేషాలు చెప్తాను.
ఆహ నా పెళ్ళియంట ఒక్క పాటను ఘంటసాల మాస్టారు సుశీల గారి చేత పాడించేరు. మిగిలిన యుగళ గీతాలను లీల గారి ద్వారా పాడించేరు.
ఈ పాటలో ‘తాళి గట్ట వచ్చునంట’ తరువాత వచ్చే త త థోం త త ధీం’ స్వరాలను ఘంటసాల మాస్టారే పాడేరట. ఇదే పాటలో కనిపించే పాదాలు నృత్య దర్శకులు కృష్ణ మూర్తి గారివి. ఆయన పాదాలను ఘటోత్కచుని రాక్షస పాదాలు అని భ్రమింప చేయడానికి తన పాదాలపై జుత్తులు అంటించుకున్నారట.
లక్ష్మణ కుమారుని వేషములో ఉన్న రేలంగి గారు పాడిన పాట “ఓహో సుందరీ నీ వంటి దివ్య స్వరూపంబు” పాటను పిఠాపురం నాగేశ్వర రావు గారి చేత కూడా పాడించేరట. మాస్టారు కూడా పాడేరట.
అప్పటికే మాస్టారు వాహినీ వారి పెద్ద మనుషులు చిత్రములో రేలంగి గారికి నందామయా గురుడ నందామయా మరియు శివ శివ మూర్తివి గణనాథా పాటలు పాడేరు. ఆ రెండు పాటలు ప్రసిధ్ధికి ఎక్కి, జనబాహుళ్యం నాలుకల మీద నిలిచేయి. కాని, ఉమాసుందరి కథ చిత్రములో రేలంగి గారి కోసం ఆ చిత్ర సంగీత దర్శకులు అశ్వథ్థామ గారు పిఠాపురం నాగేశ్వర రావు గారి చేత “ మాయా సంసారం తమ్ముడూ”, “నమ్మకురా ఈ ఆలు బిడ్డలను నమ్మకురా జీవా తోలూ బొమ్మలురా జీవా” పాటలు పాడించేరు. ఈ రెండు పాటలు కూడా ప్రసిధ్ధికి ఎక్కేయి.
చివరికి, ఘంటసాల మాస్టారి పాటనే సినీమాలో ఉంచి రేలంగి గారి చేత అభినయము చేయించేరు. గ్రామఫోన్ రికార్డులలో కూడా మాస్టారి పాటే వచ్చింది.
ఇక్కడ సాలూరి వారి గురించి కొంచెం చెప్పాలి.
ఇక మాధవపెద్ది సత్యం గారు రంగారావు గారికి 1955 లో విడుదల అయిన బంగారు పాప చిత్రం లో పాడిన పాట “తా ధిమి తకధిమి తోలూ బొమ్మా” బాగా ప్రచారములోకి రావడంతో, మాయా బజార్ చిత్ర దర్శకులు ఘంటసాల మాస్టారు రంగారావు గారికి సత్యం గారి చేత వివాహ భోజనంబు పాట, మూడు పద్యాలు, సినీమా చివరలో దండకము పాడించేరు.
ఈ సినీమాలో నాలుగవ పద్యమును సుభద్ర పాత్రధారిణి ఋష్యేంద్రమణి గారి చేతనే పాడించి ఆవిడ మీద చిత్రీకరించేరు. ఈ పద్యము అభిమన్యుడు ఘటోత్కచుని గదాప్రహారమునకు మూర్ఛిల్లినప్పుడు ఆవిడ విల్లందుకుని బాణము సంధించి ఘటోత్కచునికి గురి పెట్టిన సందర్భములో పాడుతారు.
మిస్సమ్మ చిత్రానికి సంగీత దర్శకత్వము నిర్వహించి ఆ చిత్రములోని అన్ని పాటలను చిర స్మరణీయముగా చేసిన సాలూరి వారు మాయా బజార్ చిత్ర సంగీత సారధ్యానికి అంగీకరించేరు.
నాలుగు పాటలకు పల్లవులు తయారు చేసి ఆయన విరమించుకున్నారు.
విజయా వారి తరువాత చిత్రము అప్పు చేసి పప్పు కూడు చిత్రానికి సంగీత దర్శకత్వము బాధ్యతలను సాలూరి రాజేశ్వర రావు గారికే అప్ప చెప్పేరు నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి గార్లు.
ఆ చిత్రానికి బాణీలు కట్టడానికి వచ్చిన సాలూరి వారు పింగళి వారితో “రావయ్యా నాగేంద్ర రావూ, మాయా బజార్ లో ‘నీ కోసమె నే జీవించునదీ’ అని విడి పోయేము. ఇప్పుడు చేయీ చేయీ కలుపుదాం . రా” అన్నారట.
వెంటనే పింగళి వారు ‘చేయీ చేయీ కలుప రాదె హాయి హాయిగా’ పల్లవి వినిపించేరట. అంతే! అలా ఆ పాటకి సాలూరి వారి బాణీ సిధ్ధమయిపోయిందట.
ఇక కళా దర్శకత్వము అనబడే ఆర్ట్ విభాగానికి వద్దాం.
మాధవ పెద్ది గోఖలే, కళాధర్ గార్లు ఈ చిత్రానికి కళా దర్శకత్వము వహించి ఎన్నో అద్భుతాలు సృష్టించేరు.
ఉదాహరణకు శ్రీ కృష్ణుడు, ఘటోత్కచుడు, దుర్యోధనుడు దుశ్శాసనుడు, కర్ణ పాత్రధారుల కిరీటాలు, నగలు, వస్త్రాలు మొదలుకొని వారి మీసాలు వరకు ప్రతి విషయాన్ని ఎంత కృషి చేసి తీర్చి దిద్దేరు.
శ్రీ కృష్ణ పాత్రధారి రామారావు గారి ముఖానికి సరిపోయేటట్టు కిరీటాల నమూనాలు చాలా చేసేరు. కిరీటము మీద నెమలి పింఛములు ఎన్ని ఉండాలి, అవి ఏ పరిమాణములో ఉండాలి అన్నది కూడా చాలా నమూనాలు వేసేరు.
అలాగే, ఘటోత్కచుడు ద్వారకా నగర ప్రవేశదృశ్యము కొఱకు 50 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు ప్రదేశములో ద్వారకా నగరము మీనియేచర్ సెట్ వేసి అది రాత్రి పూట అని చెప్పడానికి ఆ బొమ్మల మధ్య బల్బులు పెట్టేరు. ద్వారకా నగరము సముద్ర మధ్యములో ఉన్నదని తెలియ పరచడానికి, ఆ మీనియేచర్ సెట్ చుట్టూ నీరు నింపి నీటిలో అలలు వచ్చేటట్టు చేసేరు.
1956 తరువాత వచ్చిన పౌరాణిక చిత్రాలకు గోఖలే కళాధర్ లు మాయా బజార్ చిత్రములో చూపిన కళా సృష్టి ఒరవడి గా మారింది.
వారు ఏ ముహూర్తములో బలరాముడికి గెడ్డం పెట్టేరో, ప్రతి పౌరాణిక చిత్రములో బలరామ పాత్రధారికి గెడ్డం పెట్టుకోక తప్ప లేదు.
అయితే తెలుగు భాష తో బాటుగా తమిళ భాషలో విజయా వారు నిర్మించిన మాయా బజార్ చిత్రములో బలరామ పాత్రధారి శ్రీ డీ బాల సుబ్రహ్మణ్యం గారికి గెడ్డం అతుక్కొనడానికి ఉపయోగించే జిగురు వలన ఎలర్జీ ఉండడము వలన ఆయనకు గెడ్డం పెట్ట లేదు.
ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే మార్కస్ బార్ట్ లే కేమెరా తో ఒక అద్భుత ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందు ఉంచేరు.
వెన్నెల పాటలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారేరు బార్ట్ లే గారు.
మిస్సమ్మ చిత్రములో రెండు వెన్నెల పాటలు ఉన్నాయి.
రావోయి చందమామా మా వింత గాధ వినుమా, ఏమిటో ఈ మాయా .
కాని, మాయా బజార్ లోని లాహిరి లాహిరి లాహిరి లో పాట చిత్రీకరణకు వచ్చిన పేరు మరి యే పాటకు రాలేదు. చివరకు వెన్నెల పాట చిత్రీకరణ కు లాహిరి లాహిరి పాట ఒక కొల మానం (bench mark) అయ్యింది.
ఈ పాటకు అడయార్ నది దృశ్యము కేవలము పదిహేను సెకనులే.
అయినా, వెన్నెల లో నౌకా విహరణలో మూడు జంటలూ సుమారు అయిదు నిమిషాలు గడిపినట్లు మనకు అనుభూతి కలిగించిన బార్ట్ లే గారు అమరులు.
మాయా బజార్ సినీమాలో ట్రిక్ ఫోటోగ్రఫీ ఆబాల గోపాలాన్నీ ఆకట్టుకొంటుంది.
వివాహ భోజనము పాట తరువాత ఘటోత్కచుడు కూర్చుని పాత్రలను తన దగ్గరకు పిలిపించుకునే సన్నివేశములో “ షూట్ స్టాప్ షూట్ “ టెక్నిక్ ద్వారా పాత్రలను అంచెలంచలుగా కదుపుతూ షూట్ చేస్తూ అవి ఘటోత్కచుని వద్దకు చేరేయన్న భ్రమను కలిగించేరు మార్కస్ బార్ట్ లే గారు.
అదే విధముగా, కంచం లోని లడ్డూలు ఘటోత్కచుని నోటి లోకి చేరే దృశ్యాన్ని “ షూట్ అండ్ రివెర్స్ ప్లే “ పధ్ధతి ద్వారా ఘటోత్కచుని పాత్రధారి రంగారావు గారి నోటిలో నుండి కంచం లోకి లడ్డు వేయించి ఆ దృశ్యాన్ని చిత్రీకరించి అదే దృశ్యాన్ని విపరీత దిశలో అంటే కంచంలో లడ్డూ పడిన ఆఖరి దృశ్యాన్ని మొదటి దృశ్యముగా, నోటిలో లడ్డూ ఉంచుకున్న మొదటి దృశ్యాన్ని ఆఖరి దృశ్యముగా చిత్రీకరించి లడ్డూలు ఘటోత్కచుని నోటిలోకి వెళ్ళినట్లు భ్రాంతి కలిగించిన మార్కస్ బార్ట్ లే గారు చిర్చ స్మరణీయులు.
శ్రీ కృష్ణ బలరాములు సముద్రము మధ్యన ఉన్న ద్వారకలో ఉన్నారనడానికి ఋజువుగా, చిత్రం ప్రారంభములో ద్వారకా నగరాన్ని నీరు కెరటాల మధ్య చూపించేరు.
అలాగే, ఘటోత్కచుడు ఆకాశ మార్గము నుండి ద్వారకలో ప్రవేశించేటప్పుడు అతని నీడ నీటిలో స్పష్టముగా కనిపిస్తుంది.
మూడవ సారి ఆ దృశ్యము సినీమా ప్రారంభము అయిన రెండు గంటలకు మాయా శశి రేఖ తెల్ల వారి లేవడానికి ముందు కూడా కనిపిస్తుంది.
ఇక పింగళి నాగేంద్ర రావు గారి సంభాషణల గురించి చెప్పేదేముంది ?
ఆయన తెలుగునాట ప్రచారములోకి తెచ్చిన వీర తాడు,కంబళి, గింబళి, తల్పం, గిల్పం, శాకంబరీ ప్రసాదం, అసమదీయులు, తసమదీయులు,
దుషట చతుషటయము…..
వీటితో పాటు విశేషార్థాలు తెలిపిన నీటు గోటు మాటల గురించి చెప్తాను.
వల్లూరి బాలకృష్ణ, వంగర వెంకట సుబ్బయ్య, అల్లు రామ లింగయ్య ,
నల్ల రామ్మూర్తి , చదలవాడ కుటుంబ రావు, రమణారెడ్డి గార్లతో సినీమా ప్రారంభం అయిన 2 గంటల 14 నిముషాలకు, మగ పెళ్ళి వారికి ఇచ్చిన విడిది సన్నివేశం లో గోటు అంటే గొప్ప అని, తీట అంటే గౌరవం అని అర్థాలు చెప్పించి , మూడు నిముషముల తరువాత శకుని చేత పాచికలు వేయించిన వెంటనే శశిరేఖ (సావిత్రి) నోట “ ఆ నీటు గోటూ మా బావేనా “ అనిపించి పింగళి వారు నీటు గోటు మాటలకు గౌరవము తెచ్చేరు.
మాయా బజార్ సినీమా లో రెండు నృత్య నాటకాలు ఉన్నాయి.
కృష్ణ జన్మదిన సందర్భములో “ విన్నావటమ్మా ? ఓ యశోదా “ రెండవది ఘటోత్కచుని ఆశ్రమములో అభిమన్యుడు సుభద్రలు వచ్చినప్పుడు చిన్నమయ్య ఏర్పాటు చేసిన “ మోహినీ భస్మాసుర.”
విన్నావటమ్మా ఓ యశోదా లో యశోదగా శ్రీమతి బెజవాడ నాగరత్నం గారు ,
చిన్ని కృష్ణుడిగా మాస్టర్ బాబ్జీ కనిపిస్తారు.
మోహినీ భస్మాసుర లో విష్ణుమూర్తి గా నృత్య దర్శకులు శ్రీ సాగిరాజు రాజం రాజు గారు ( ముక్కు రాజు గారు ).
మాయా బజార్ లో ప్రముఖ కళా కారులతో పాటు ఒకటి రెండు సన్నివేశాలలో కనిపించిన కళాకారులు ఎందరో ?
వారిలో ముఖ్యులు.
మాయా కృష్ణునిగా చిరంజీవ చిరంజీవ అంటూ కంచి నరసింహా రావు గారు, సాత్యకి గ నాగభూషణం గారు, దారుకుని గా ( రథ సారధి ) ప్రఖ్యాత నేపధ్య గాయకులు మాధవ పెద్ది సత్యం గారు, కూలంకష ప్రజ్ఞావంతులు జ్రోతిష్యులు శంఖు తీర్థులుగ బొడ్డపాటి కృష్ణారావు గారు, శంఖు తీర్థుల వారి సహాయకునిగా సీ వీ వీ పంతులు గారు, శశిరేఖ ఇష్ట సఖి మైనా గా సీత, ఒకటే మా వయసు పాటలో నృత్య కళాకారిణులు రీటా , లలితా రావు గార్లు, చిన్న శశి రేఖ గ సచ్చు, చిన్న అభిమన్యునిగా మాస్టర్ ఆనంద్, వినావటమ్మా ఓ యశోద పాటలో చిన్న కృష్ణునిగా మాస్టర్ బాబ్జీ .
“మాయా బజార్ చిత్రము గురించి ఇంత చెప్పినప్పుడు సావిత్రి మహానటిగా నీరాజనాలు అందుకున్న ఆవిడ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆవిడ నటనకు మచ్చుకు రెండు మూడు సన్ని వేశాల గురించి చెప్తాను రాజు గారూ!” అన్నాడు మూర్తి.
“సరే చెప్పండి మూర్తి గారూ” అన్నారు రాజు గారు.
ప్రారంభించేడు మూర్తి.
“సావిత్రి హావభావాలతో అలరించిన మొదటి సన్నివేశము నీవేనా నను తలచినదీ పాటలో. ప్రియదర్శిని పేటిక తెరవగానే నీవేనా నను తలచినదీ అంటూ అభిమన్య పాత్రధారి అక్కినేని వారు కనిపించగానే, ఆశ్చర్యము, సంతోషము ఒకేసారి ముఖములో అభినయించిన సావిత్రి నటన అద్వితీయము.
ఇక రెండవ సన్నివేశము ‘ఆహా నా పెళ్ళంట’ పాటలో అద్దం ముందుకు వచ్చినప్పటి నుండి పాట చివరలో మంచం మీదకు వాలి పోవడము వరకు ఆవిడ నటన వర్ణనాతీతము.
జడ ముందుకు వేసుకోవడమైనా, మూతి విరుపులైనా, ఓర చూపులైనా వాలు చూపులైనా, భుజాలు ఎగరవేయడమైనా ఆ పాటకి ఆవిడ చేసిన అభినయము అవిస్మరణీయము.
ముచ్చటగా మూడవ దృశ్యము.
విడిదిలో భానుమతి శకుని ఎదుట మాయా శశిరేఖగా ఆవిడ కోనసీమ ఏసతో దీర్ఘాలు తీస్తూ ఆవిడ పలుకులు నటన అపూర్వము.
మరీ ముఖ్యముగా
“ఓ కళ్ళు జిగేల్ మన్నట్లు ఇవన్నీ ఇలా పరిచి పెట్టారేమిటీ?” అంటూ ఒక నగ తీసి అది రెండు ముక్కలయితే వెంటనే “అయ్యొ రామా, ఇవి నా కంటె సుకుమారంగా ఉన్నాయే! ముట్టుకుంటేనే చిట్లి పోయినయ్. ఇంత కంటే మంచి నగలు మా ఇంట్లో కోకొల్లలు.” ఈ సంభాషణలు పలికేటప్పుడు సావిత్రి గారి అభినయము న పూర్వో న భవిష్యతి అనిపిస్తుంది.
మాయా బజార్ చిత్రములో పింగళి వారు ‘పరవ’ అనే ఉర్దూ మాటను మూడు సార్లు ఉపయోగించేరు.
చిత్రము ప్రారంభమయిన 33 వ నిసుషములో శకుని పాత్రధారి సీ ఎస్ ఆర్ గారు ‘పర్వాలేదు దుర్యోధనా’ అంటారు.
రెండవసారి చిన్నమయ్య వేషములో ఉన్న రమణారెడ్డి గారు శిష్యులు అయిన లంబు జంబులను ఉద్దేశించి “పర్వాలేదు అనండి దుష్ట చతుష్టయం” అని అంటే, మూడవ సారి శ్రీ కృష్ణ పాత్రధారి రామారావు గారు ఘటోత్కచునికి శశిరేఖ ఇష్ట సఖి మైనాను పరిచయం చేస్తూ, ఇక నుంచీ నీవు ఇతనికే ఇష్ట సఖివి అన్నప్పుడు, మైనా భయపడుతూంటే “పర్వాలేదు” అని అంటారు.
రెండవది శ్రీ కృష్ణ పాత్రధారి రామారావు గారి కుడి చేతి మీద ఉన్న శ్రీ కృష్ణుని పచ్చ బొట్టు చిత్ర ప్రారంభములో తొమ్మిది నిముషముల 40 సెకన్లకు కృష్ణుడు సుభద్రను ఉద్దేశించి “అన్న గారిని ఏ వరము కోరుకుంటావో కోరుకో” అన్నప్పుడు స్పష్టముగా కనిపిస్తుంది.
ఇక మూడవ విషయము.
“నీ కోసమె నే జీవించునదీ” పాటలో శశిరేఖ గదిలో ఉన్న అద్దములో అభిమన్యు పాత్రధారి నాగేశ్వర రావు గారు కనిపించుతున్నప్పుడు ఆయన నీడ, ఆయన చేతినెత్తినప్పుడు చేతి నీడ స్పష్టముగా కనిపిస్తాయి.
విడుదలలో జాప్యము.
మాయా బజార్ చిత్రములో దుశ్శాసన పాత్రధారి ఆర్ నాగేశ్వర రావు గారు ఆ చిత్ర నిర్మాణము జరుగుతున్నప్పుడు సెట్స్ మీద ప్రమాదానికి గురి కావడముతో ఆయన ఉండవలసిన చిత్రములోని ఆఖరి దృశ్యముల చిత్రీకరణ మూడు నెలలు వాయిదా పడింది. అందు వలన మాయా బజార్ విడుదల బహుశః 1957 జనవరి సంక్రాంతికి బదులు, 31 మార్చ్ 1957 ఆదివారము ఉగాది పండుగ కు ముందు 27 మార్చ్ 1957 బుధ వారము నాడు విడుదల అయ్యింది.
శశికళ గదిలో ఉంచిన నిలువుటద్దం కూడా మూడు సన్నివేశాలలో నటించింది.
అద్దం నటించడం ఏమిటీ అంటారా ?
చదవండి మరి!
“నీ కోసమె నే జీవించునదీ” పాటలో అభిమన్యు పాత్రధారి నాగేశ్వర రావు గారి ప్రతిబింబము అద్దములో కనిపిస్తూ “కలలోనైనా మెలకువనైనా” చరణం పాడుతుంది.
రెండవ సారి, లాహిరి లాహిరి లాహిరిలో పాటకు ముందు రేవతి పాత్రధారిణి ఛాయాదేవి శశిరేఖ చెంప మీద కొట్టి విస విసా నడుచుకుంటూ వెళ్ళడం అద్దంలో స్పష్టముగా కనిపిస్తుంది.
మూడవ సారి “ ఆహ నా పెళ్ళంట “ పాట ప్రారంభం లో శశిరేఖ పాత్రధారిణి సావిత్రి గారు ఒయ్యారంగా నడిచి అద్దం ముందుకు వచ్చి రెండు చేతులనూ నడుము మీద వేసుకుని పాట అందుకునే సన్నివేశం, ఆ తరువాత పాటలో చాలా భాగములో అద్దం కనిపిస్తూనే ఉంటుంది.
మాయా బజార్ నటీ నటులు సాంకేతిక నిపుణుల సృజనాత్మకత (Creativity)
మాయా బజార్ నటీ నటులు సాంకేతిక నిపుణుల సృజనాత్మకతలు ఒక ప్రముఖ కారణము వారిలో అత్యాధికులు 30- 40 మధ్య వారే ! ఉత్సాహముతో ఉరకలు వేస్తున్న యువతీ యువకులే!
అందరి కన్న వయసులో పెద్ద వారు వంగర వెంకట సుబ్బయ్య గారు 59 సంవత్సరాలు (1897 జననము) , సీ ఎస్ ఆర్ గారు 49 సంవత్సరాలు (1907). రేలంగి గారు 47 సంవత్సరాలు ( 1909 . పింగళి వారి వయసు 55 సంవత్సరములు (1901) చక్రపాణి గారు 48 సంవత్సరములు (1908).
నలుపు తెలుపు రంగులలో ఉన్న మాయా బజార్ చిత్రానికి రంగులను అద్ది రంగుల సినీమాగా మార్చడానికి హైదరాబాద్ లో ఉన్న గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ సంస్థ మాయా బజార్ చిత్రానికి కావలసిన నెగటివ్ హక్కులు కొని, సుమారు ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో ఆ చిత్రానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానముతో రంగుల మాయా బజార్ గా తీర్చి దిద్దేరు. రంగులతో పాటు, సంభాషణలను, , సంగీతమును, పార్శ్వ సంగీతమును సాంకేతిక పరముగా ( digitalisation ) మార్చి, 30 అక్టోబర్ 2010 న 45 సినీమా హాళ్ళలో విడుదల చేస్తే, రంగుల మాయా బజార్ చిత్రము కూడా అఖండ విజయమును సాధంచింది.
ఈ విధముగా నలుపు తెలుపులలో నిర్మింప బడి రంగులలో మారిన తొలి తెలుగు చిత్రము మాయా బజార్.
మాయా బజార్ చిత్రాన్ని వర్ణ చిత్రము గా తీర్చి దిద్దడానికి 165 మంది సాంకేతిక నిపుణులు ఎనిమిది నెలల పాటు పరిశ్రమించేరు. సుమారు 1,80,000 రంగులను (shades) అద్ది సర్వాంగ సుందరముగా తీర్చి దిద్దేరు. ఒకే ఒక్క ట్రేక్ లో ఉన్న సంభాషణలను, సంగీతమును, పార్శ్వ సంగీతమును ఏడు ట్రేక్ లలో మార్చడానికి నిపుణులు పరిశ్రమించేరు.
మాయా బజార్ రంగుల చిత్రము సమయము 2 గంటల 42 నిముషములు.
రంగుల మాయా బజార్ లో భళి భళి భళి భళి దేవా పాట, మోహినీ భస్మాసుర నృత్య నాటకము లేవు.
ఇంతటి వ్యయ ప్రయాసలను వెచ్చించి 45 కేంద్రములలో విడుదల అయిన మాయా బజార్ వర్ణ చిత్రము విడుదల సందర్భములో ఆ చిత్రములో నటించిన మహామహులు అధికులు స్వర్గస్థులయ్యేరు. మాయా బజార్ వర్ణ చిత్రము విడుదల కావడానికి నాలుగు రోజుల ముందు 26 అక్టోబర్ 2010 న బలరామ పాత్రధారి గుమ్మడి వెంకటేశ్వర రావు గారు స్వర్గస్థులయ్యేరు.
ఆ చిత్రము విడుదల నాటికి అప్పటి బాల కళాకారులు మినహా, అభిమన్య పాత్రధారి అక్కినేని నాగేశ్వర రావు గారూ, కర్ణ పాత్రధారి మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారూ, శశికళ ఇష్ట సఖి మైనా పాత్రధారిణి సీత గారు మాత్రమే ఉన్నారు.
“ఇంకా ఏమైనా చెప్పాలా మూర్తీ?”
“మాయా బజార్ గురించి ఎన్నయినా చెప్పొచ్చు!” మూర్తి అన్నాడు.
“విసిగించకుండా చెప్పు” అన్నాను చిరాకుగా.
“ఒక సారి, చక్రపాణి గారిని ఎవరో అడిగేరట. మీరు చిన్న పిల్లల కోసం ఎందుకు సినీమా తీయ లేదని”. ఆయన తాపీగా “మాయా బజార్ ఎవరి కోసం తీసినట్టో?” అన్నారట తనదైన శైలిలో.
దర్శకుకు కే వీ రెడ్డి గారి ఏకాగ్రత గురించి, బహుశః గుమ్మడి గారు అనుకుంటా, ఒక ఇంటర్వ్యూలో చెప్పేరు.
ఒకరోజు, షూటింగ్ లో, ఒక షాట్ గురించి రెడ్డి గారు, మాకస్ బార్ట్ లే గారూ లైటింగ్ గురించి తర్జన భర్జన పడుతున్నారట. సెట్ లో ఉన్న నిర్మాతలు నాగి రెడ్డి గారు, చక్రపాణి గారు గుమ్మడి గారూ, కొందరు నటీ నటులు గట్టిగ మాటాడుకోవడము దర్శకులు రెడ్డి గారికి చిరాకు కోపం తెప్పించేయట.
ఆయన గట్టిగా “all of you get out of the set” అని అరిచేరట.
రెడ్డి గారి కోపము గురించి తెలిసిన గుమ్మడి గారూ, నటీ నటులు వెంటనే సెట్ బయటకు వెళ్ళిపోయేరట.
సెట్ లోనే ఉన్న నిర్మాతలిద్దరికీ కూడా సెట్ బయటకు వెళ్ళవలసిన వచ్చిందట.
“రాజు గారూ! మరో మాట!! ఒక వేళ శ్రీ కృష్ణుడు అర్జునిడికి భగవద్గీత ఉపదేశిస్తే, దశమాధ్యాయము విభూతి యోగములో 19వ శ్లోకము నుండి 42వ శ్లోకము వరకూ, తన ఉనికిని చెప్పేటప్పుడు, 43వ శ్లోకములో నేను సినీమాలలో ‘మాయా బజార్’ని అని తప్పకుండా అనేవాడు అని నా నమ్మకం” అన్నాడు మూర్తి.
“ఇంకా నయం! పచ్చళ్ళలో గోంగూర పచ్చడిని, కూరలలో కందా బచ్చలి కూర అని, అనేవాడేమో శ్రీ కృష్ణుడు” వెటకారంగా అన్నాను నేను.
“అలా అంటే కళ్ళు పోతాయి. లెంపలేసుకో!” కోపంగా అన్నాడు మూర్తి.
“కళ్ళు పోకుండా మాయా బజార్ చూస్తానులే “ అన్నాను .
“అలాంటి వేళాకోళాలే వద్దండీ రాజు గారూ “ అంటూ మళ్ళీ ప్రారంభించేడు మూర్తి.
“మాయా బజార్ సినీమా గురించి చెప్పాలంటే ఎంతయినా ఉంది. రెండు విషయాలు చెప్పి ప్రస్తుతానికి ఆపుచేస్తాను” అన్నాడు మూర్తి.
మా ముఖాలనును చూస్తూ ప్రారంభించేడు మూర్తి.
1960-70 ల మధ్య కాలేజీ స్టూడెంట్లలో మాయా బజార్ అభిమానులు ప్రతి కాలేజీ లోనూ ఉండే వారు.
మేము కూడా అప్పుడే కాలేజీ చదువు పూర్తి చేసేం.
ఆ రోజులలో, మా మాయా బజార్ ముఠా ఎప్పుడైనా ఒక చెత్త సినీమా చూస్తే, ఆ పాప పరిహార్ధం మర్నాడు చుట్టు పక్కల మాయా బజార్ ఎక్కడ ఆడుతోందో తెలుసుకుని, దూరాభారమయినా, డబ్బులు ఖర్చు అవుతున్నా లెక్క పెట్టక వెళ్ళి మాయా బజార్ చూసే వాళ్ళం.
మాయా బజార్ చిత్రానికి ఒక సంవత్సరము ముందు అంటే 1956 లో హాలీవుడ్ సూపర్ హిట్ టెన్ కమేండ్మెంట్స్ (Ten Commandments ) వచ్చింది. రెండేళ్ళ తరువాత 1959 లో బెన్ హర్ (Ben Hur) వచ్చింది. అయినా మాయా బజార్ సినీమాకు ఉన్న జనాకర్షణ ఏ హాలీవుడ్ బాలీవుడ్ చిత్రానికీ లేదు. ఏమంటారు రాజు గారూ?”
“ఇంతకీ మూర్తి గారూ ! మాయా బజార్ సినీమాకి హీరో ఎవరండీ?” అడిగేరు రాజు గారు.
మూర్తి ప్రారంభించేడు.
“మాయా బజార్ సినీమాకి హీరో ఎవరు అని నిర్ధారించే ముందు హీరోయిన్ విషయములో శశిరేఖ అనవచ్చుకదా! హీరోయిన్ అయిన శశిరేఖ ప్రేమించి, డ్యూయెట్లు పాడి పెళ్ళి చేసుకుంది కాబట్టి అభిమన్యుడు హీరో అనుకోవచ్చును. కధని నడిపించిన శ్రీ కృష్ణుడు కూడా హీరో యే! తన మాయాజాలంతో నాయికా నాయకులను కలిపి విలన్లు కౌరవులను ముప్పు తిప్పలు పెట్టిన ఘటోత్కచుడు కూడా హీరో అనుకోవచ్చును.
ఇదే విషయాన్ని అభిమన్య పాత్రధారి అక్కినేని నాగేశ్వర రావు గారిని అడిగితే, ఆయన కధా పరముగా అభిమన్యుడిగా తనే హీరో అయినా, నటనా పరంగా శశిరేఖ పాత్ర లో జీవించిన సావిత్రి గారే మాయా బజార్ సినీమాకి హీరో అన్నారు. అక్కినేని వారితో నేనూ ఏకీభవిస్తాను” అన్నాడు మూర్తి.
“అవును. నా దృష్టిలో కూడా శశిరేఖ పాత్ర లో జీవించిన సావిత్రి గారే మాయా బజార్ సినీమాకి అసలూ సిసలయిన హీరో” అన్నారు రాజు గారు.
మళ్ళీ ప్రారంభించేడు మూర్తి. “అంత ఎందుకు? ఫేస్ బుక్ లో ఇప్పుడు అరవయ్యేళ్ళు పైబడిన వారిలో చాలా మంది మాయా బజార్ అభిమానులే! ఈ మధ్యనే ఫేస్ బుక్ లో
శ్రీ గొట్టుముక్కల కమలాకర్ గారూ మాయా బజార్ దండకం వ్రాసేరు తెలుసునా?” అన్నాడు మూర్తి.
“అయితే మూర్తీ” మూర్తి వాక్ప్రవాహానికి ఆనకట్ట వేసేరు రాజు గారు.
“మూర్తీ! ఈ పళంగా దేముడు ప్రత్యక్షమయి ఏదయినా ఒకే ఒక్క వారం కోరుకోమంటే ఏమిటి కోరుకుంటావు?” అన్నారు రాజు గారు.
“మాయా బజార్ సినీమా చూస్తూ నా ప్రాణం పోవాలి” అన్నాడు మూర్తి.
ఆంతవరకూ మౌనంగా ఉన్న నేను నిలబడి కుడి చేతిని పైకి ఎత్తి అరిచేను.
“ మాయా బజార్ జిందాబాద్! మాయా బజార్ అభిమాన సంఘం వర్ధిల్లాలి!” అని అరిచేను.
నా అరుపులకు మూర్తి, రాజు గారు నమ్మలేనట్లు చూస్తూ నిలబడ్డారు.
ముగ్గురమూ కుడి చేయీ పిడికిలు బిగించి ఒక్క సారిగా అరిచేము.
“మాయా బజార్ జిందాబాద్! మాయా బజార్ అభిమాన సంఘం వర్ధిల్లాలి”
అవును, మాయా బజార్ అభిమాన సంఘం వర్ధిల్లాలి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
గతించని గతం-4
ఉనికి
మద్రాసు లలితాంగి యం. యల్. వసంతకుమారి
ఇట్లు కరోనా-11
సంచిక – పద ప్రతిభ – 81
పదసంచిక-62
ఇట్లు కరోనా-12
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-30
నీలమత పురాణం – 28
సౌభాగ్య భారతం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®