[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘మే డే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
స్వేదం నీది
లాభం వారిది
తర తరాల చరిత్ర ఇది
అంతు లేని కథ ఇది
ఓ శ్రామికుడా..
రైతు చెమట పంటకు ఎరువు
నీ చెమట పారిశ్రామిక ఉత్పత్తికి ఎరువు
రాజులు నవాబులు షరాబులు
నీ చెమటకు దాసులు బానిసలు
నీ స్వేద జలమే
వారి బలం
వారి బలుపుకు
మూలం
మేడల్లో మిద్దెల్లో వారు
పూరి గుడిసెలో నువ్వు
మార్క్స్ అన్నట్టు
ఉన్నోడు ఇంకా వున్నోడు
అవుతున్నాడు
నీ శ్రమతో
నీ బతుకు మాత్రం
ఎక్కడేసిన గొంగళి అక్కడే
పాత చరిత్ర
నడుస్తున్న చరిత్ర
తలచు కుంటున్నాం
నెమరేసుకుంటున్నాం
ఇది చాలదు కార్మికా!! కర్షకా !!
పేదోడి రాజ్యం రావాలి
అప్పుడే మెరుగవును
నీ బతుకు ముఖ చిత్రం
ఓటు నీ పాశుపతాస్త్రం
అర్జునుడి వై విజృంభించు
సుక్క ముక్క చూపి
ఓటు అడిగే వారికి
చుక్కలు చూపించు
కళ్ళు తెరువు శ్రామికుడా
కలలు మాను కర్షకా
మరో లోకం
నీ లోకం పిలుస్తుంది
ప్రొ. పంజాల నరసయ్య డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్గా పదవీవిరమణ చేశారు.