[శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు రచించిన ‘మొపాసా రచనలు – జీవితం’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము. ఇది మొదటి భాగము.]
19వ శతాబ్దంలో మాత్రమే నేడు మనం చదువుతున్నఆధునిక చిన్నకథ అసలు సిసలైన రూపును దిద్దుకుంది. చిన్నకథకు, నవలకు గల వ్యత్యాసాన్నిఆరుగురు ఫ్రెంచ్ ‘స్వాభావిక రచయితల బృందం’ [Naturalists] ఎత్తి చూపారు. వాళ్లలో ఎమిల్ జోలా [Emile Zola], మొపాసాలు కాక మరో నలుగురున్నారు. మొపాసా నిజానికి అలాంటి ముద్ర వేయించుకోడానికి వ్యతిరేకి. అందులో చేరినపుడు తాను రచనలు చేసి ఉండకబోబట్టి, ప్రసిద్ధులైన జోలా లాంటి రచయితలతో భుజం భుజం రాసుకోవడం అతనికి ఉపయోగపడుతుంది కాబట్టి, ఆదిలో తన అభ్యంతరాన్ని వ్యక్తం చెయ్యలేదు. చిన్నకథలో ‘చాలినంత’ [enough] చెప్పకూడదని, అతిగా చెప్పకూడదని చెఖోవ్ [Anton Chekhov] భావించాడు. జీవితం ఏదో ఒక మలుపుతో ఆగిపోక నిరంతరం సాగే ప్రావాహం కాబట్టి చెఖోవ్ అంతిమ మలుపులను [twists] ఎద్దేవా చేశాడు. తుర్గనీవ్ [IvanTurganev] పాత్రోల్న్మీలనం, భౌతిక అంశాల వర్ణలను చిన్నకథలలో చొప్పించడం ఆరంభించాడు. అలాంటి వర్ణాలకు మొపాసా ప్రాధాన్యతను ఇవ్వలేదు.
హెన్రి ఆల్బెర్ట్ రినే గి ద మొపాసా [Henri Albert Rene Guy de Maupassant] గొప్ప ఆధునిక కథా రచయితగా వెనుక తరాల రచయితలకు పరిచితుడు.
ఎన్ని విధాలుగా, ఏ ఏ విషయాలను, వ్యథలను, వ్యథలు కానివాటినీ కథలుగా మలచడం సాధ్యమో దాదాపు అంత పనీ చేశాడు. వాటిని ‘ఇవిగో’ అని మొపాసా చూపించిన తరువాత – “ఇంకా ఏమన్నా మిగిలి ఉందా?” అని సాహిత్యాధ్యయనం చేసిన వారు ఆశ్చర్యపోతే, మనం ఆశ్చర్య పోనక్కరలేదు.
ప్రపంచ ఆధునిక కథకు పితగా భావించబడే ఇద్దరు ముగ్గురు కథానికా రచయితలలో ఫ్రాన్స్‌కు చెందిన మొపాసా ఒకడు.
జీవించి ఉంటే ఇప్పుడు 175 ఏళ్ళ వయసు వాడయ్యే వాడు. 132 ఏళ్ల క్రితం ఘోర మరణం పాలయ్యాడు. పోతూ పోతూ, వీలునామా అక్కరలేనట్టి రసప్లావితమైన అక్షర ప్రోవులను ప్రపంచ సాహిత్య అభిమానులకు ఆస్తిగా మిగిల్చాడు. అది ప్రపంచ సాహిత్య వారసత్వ సంపద – కేవలం ఫ్రెంచి వారిదే కాదు. ఆ ఆస్తి విలువకు రాబడి పన్ను, ఆస్తి పన్నుఅంచనా వేయగల నిపుణుడు లేడు. మొపాసా మనకు ఒదిలి వెళ్ళినది అందరినీ ఎప్పటికీ అలరించే నిత్య యవ్వనవతిని కూడా.
అతని జీవితం, మరణం కూడా విషాదాంత గాథలు.
“నేను ఉల్కలా సాహిత్య జీవితంలోకి ప్రవేశించాను; దీని నుంచీ పిడుగులా నిష్క్రమిస్తాను,” అన్నాడు.
అతని రచనా వ్యాసాంగ జీవితం ఉల్క ఉనికిలా చిన్నది – ఒక దశాబ్ద కాలానికి పరిమితమైనది. అతను సృష్టించిన సాహిత్యం మాత్రం ఉల్కలానో, పిడుగులానో అంతరించి పోలేదు. ఈ 140 సంవత్సరాల కాలంలోనూ అతని సాహిత్యాన్ని పాఠకులు, రచయితలూ చదువుతూనే ఉన్నారు; దాని గురించీ మాట్లాడుకుంటూనే ఉన్నారు.
తన ముప్పై ఏళ్ళ దాకా అతను పెద్దగా రచనకు పూనుకోలేదు. మొపాసా పేరుతో రమారమి 65 నకిలీ కథలు చలామణి అయినట్టు నిపుణులు తేల్చారు. అనుకరణ అసలు వస్తువుకు మెచ్చుకోలుగానూ, దాని విలువను పరోక్షంగా తెలియజేస్తున్నట్టుగాను భావిస్తుంటాము.
“నేను రచించడాన్నిద్వేషిస్తున్నా; డబ్బూ దాని వలన నేను వేగపు పడవలో [yacht] తిరగగలగడం అన్న ఆలోచన నన్నుకొరడాతో కొట్టినట్టు ఈ పని చేయిస్తోంది,” అన్నాడు.
మొపాసా జీవితాన్ని ప్రేమించాడు, ద్వేషించాడు. ఒంటరితనాన్ని కళత్రంగా స్వీకరించాడు; అదంటే భయపడేవాడు! స్త్రీ ఒడిలో ఓదార్పును, లైంగిక సుఖాన్నిపొందే ప్రయత్నం చేశాడు. స్త్రీలను ద్వేషించాడు కూడా. కోకొల్లలుగా స్త్రీలు తూరీగల్లా అతని చుట్టూ మూగేవాళ్ళు; ఉత్తరాలు వ్రాస్తూండేవాళ్లు, అతనితో లైంగిక సుఖం పంచుకోడానికి. అతని చావు భయం అతనిలో సృజనాత్మక శక్తిని ఇనుమడింప చేసింది. కర్పూరసదృశ జీవితకాలం వేధించింది. తన నిస్పృహను ఇలా వ్యక్తం చేశాడు:
“నాకు సాధ్యపడుంటే, కదిలిపోయే కాలాన్ని ఆపివుండేవాడిని. గంట వెనుక గంట, నిమిషం వెనుక నిమిషం, క్షణం వెనుక క్షణం తరలి పోతుంటాయి రేపటి శూన్యతకై. నా నుంచీ అనుక్షణం రవంత దోచుకుంటూ కాలం ప్రవహిస్తుంటుంది ఈ క్షణపు క్షణం ఎప్పటికీ తిరిగి రాదు.”
రచన గురించీ ఇలా అన్నాడు మొపాసా:
“మాట్లాడే పదాలు మెరుస్తాయి, ముఖం వాటిని మూకాభినయం చేస్తుంది కాబట్టి మోసం చేస్తాయి. కానీ ఒక పుట మేరకు వ్రాసిన నల్లటి సిరా పదాలు నగ్నపు ఆత్మ; ఆత్మకు గవాక్షం.”
కథా సమయాన్ని, స్థలాన్ని, పాత్రలను, వాతావరణాన్ని సృష్టించడంలో సిద్ధహస్తుడు.
జర్మన్ల ఫ్రాన్స్ దురాక్రమణ అతన్ని చాలా బాధించి, ఆ యుద్ధం నేపథ్యంలో అనేక కథలను వ్రాయించింది. చనిపోబోయేముందు కూడా దాని గురించే పలవరించాడు. దాపరికం లేకుండా మానవ మనస్తత్వాలను అతని కథలు శోధించాయి. యాత్రా ముచ్చట్లు, కవిత్వం కూడా వ్రాశాడు. పాత్రికేయుడిగా పనిచేశాడు. 19వ శతాబ్దంలో కొనసాగిన జానపద గాథల, పురాతన పద్ధతులలో కథలు చెప్పడానికి భరత వాక్యం పలికి, వాస్తవికతను ఆధునిక పద్ధతిలో చిత్రించడం ఆరంభించడంలో అతని పాత్ర ఘనంగా ఉంది. ఈ రచయిత కథలు వైవిధ్యభరితం. ఈ చిత్రకారుడి కాన్వస్ [canvas] అవధులు లేనిది; కుంచె మంత్రదండం. ఎదో ఒక మూసకో, వాదపు సంకుచితానికో పరిమితం అవడానికి నిరాకరించాడు. ఆయన కథలు మనలను వినోదింపచేయడమే కాక, మన హృదయాలను గిలిగింతలు పెడుతుంటాయి; పిడికిట్లో బిగించి నొక్కి బాధిస్తాయి; మానవ మనుగడ పట్ల విచారాన్ని కలిగిస్తాయి.
ఏ రచయితైనా ప్రపంచం పట్ల అతని వైఖరి ఏమిటో దానికి అనుగుణంగానే రచనలు చేస్తాడు. మొపాసా ఎంచుకున్న సంఘటనలలో గోప్యత, చెప్పేదాంట్లో క్లుప్తత ఉంటాయి. అనవసర పదాలు వాడి కాలక్షేపం చేయడు. అసహనంతో నేరుగా కథలోకి వెళ్ళిపోతాడు; నీళ్లు నమలడు. ఒక్కొక కథను ఒక్కొక విధంగా చెబుతాడు. అలా అని కొన్ని కథలను ఒకేలా చెప్పలేదని అనలేము. మొపాసా కథలు మడుగులోని మొసలిలా చదవడం ఆరంభించిన వాళ్ళను లోపలికి లాక్కుపోతాయి. కొన్ని కథలు మనలో బీభత్సాన్ని సృష్టిస్తాయి, మనలను క్రుంగదీస్తాయి, మనమంటే మనకు జాలి పుట్టిస్తాయి. అతని ఆవేదన మనదీ అవుతుంది. అతనికి స్త్రీ ద్వేషం ఉంది అంటారు కానీ సమాజపు ఉన్నత స్థాయి స్త్రీలంటే వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదని చిన్నచూపు వుంది. అతను కేవలం ఉన్నత స్థాయి స్త్రీలతోనే లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. స్త్రీల గొప్పతనాన్ని వెలికి తీసే కథలూ వున్నాయి అనేకం. నేచరలిజం [Naturalism] నుంచి బైటపడిన తరువాత రియలిజంకు [realism] అంకితమయ్యాడు. చిత్రీకరణలో బూతును కూడా బూతుగా చూపించడానికి వెరవ లేదు. అతని మిత్రుడు, సాటి రచయిత హెన్రీ జేమ్స్ [Henry James] అతను నైతిక పథంలో సింహం లాంటి వాడు అన్నాడు [నైతిక వాదులకు సింహస్వప్నం అనవచ్చేమో]. మానవ జీవితంలో ఏ అంశాన్నీ ఒదలకుండా దశాబ్దం కంటే తక్కువ కాలంలో వ్రాసిన మరొక రచయిత లేడు. మానవతా వాదాన్ని మరువనివాడు. ప్రేమించే గుణం వున్నవాడు. అతని గురువును, తల్లిని, తమ్ముడిని, చివరకు అతని సేవకుడిని ప్రాణప్రదంగా ప్రేమించినవాడు. వ్యభిచార గాథలే కాక నిజమైన ప్రేమ గురించీ కథలు వ్రాసాడు. వ్యభిచారంలోనూ ప్రేమకు స్థానం ఉందని తెలియజేశాడు.
అతనిది అనితర సాధ్యమైన శైలి. సోమర్సెట్ మామ్, ఓ హేన్రి, చెఖోవ్, హేన్రి జేమ్స్ లాంటి వారూ అతని ప్రభావానికి లోనయ్యారు. ‘హారం’ [The Necklace] అన్న కథను కనీసం ముగ్గురు ఇతర ప్రసిద్ధ రచయితలు అనుకరించారు. అతని భయానక [హారర్], మానవాతీతమైన [super-natural] కథల వెనుక ఎడ్గార్ ఎలెన్ పో [Edgar Allan Poe] రచనల ప్రభావం ఉంది. ఆయన రచనలు వంద భాషల్లోకి అనువదించబడినాయి. అందరికన్నాఎక్కువగా చదవబడిన రచయిత. ఆయనకన్నాఎక్కువ ప్రసిద్ధుడైన రచయితే మరొకరున్నారంటే అది చార్ల్స్ డికెన్స్ [Charles Dickens] మాత్రమే అని ఒకాయన అన్నాడు.
తుర్గనీవ్ ఇతని కథలు టాల్స్టాయికి {Leo Tolstoy] ఇచ్చి చదవమన్నాడు. ఆ సంకలనం ఆయనకు అంతగా నచ్చలేదు. ఆయన రచనకు ఉండవలసిన మూడు లక్షణాలను చెప్పాడు. ఒకటి: రచయత ఆ రచనలోని నైతికత లేక అనైతికతకు ఎటు పక్కనున్నాడో అందులో తెలియాలి; రెండు: స్పష్టత; మూడు: వ్రాసెన దానిపట్ల దాచని ఇష్టం లేక అనిష్టం. చివరి రెండు లక్షణాలూ మొపాసా కథలలో కలవు కానీ నైతికత లేదు అని అతను మొదట భావించాడు. కర్షకుల పట్ల అతనికి సానుభూతి లేదు అన్నది అతని మరో అభిప్రాయం. ఆ సంపుటిలో తండ్రి లేని బిడ్డకు తండ్రి అయిన ‘సైమన్ తండ్రి’ [Simon’s Papa] అనే కథ మాత్రం నచ్చింది. ఏ నాడో విడిపోయి ఒక వేశ్యా గృహంలో కలుసుకున్న అన్నా చెల్లెళ్ళ కథ ‘ద పోర్ట్’ [The Port] మొదలైన మొపాసా కథలను టోల్స్టాయ్ రష్యన్ లోకి తర్జుమా చేసాడు. ‘ఒక స్త్రీ జీవితం’ [Une Vie] అతనికి బాగా నచ్చింది. విక్టర్ హ్యూగో[Victor Hugo] వ్రాసిన మహర్నవల ‘లే మిజరబల్’ [Les miserables] తరువాత అది అంత గొప్ప నవల అన్నాడు. మొపాసా గొప్ప మేధోసామర్థ్యం గలవాడు [genius] కానీ నైతికతను ఎరుగడు అన్నాడు. విలియం సారోయన్ [William Saroyan] మొపాసా గురించి ఏకంగా ఒక కథ వ్రాసాడు. నోబెల్ బహుమాన గ్రహీత, గొప్ప జర్మన్ రచయిత, థామ మాన్ [Thomas Mann] మొపాసా అందరికన్నాగొప్ప కథానికా రచయితలలో ఒకడు అని ప్రశంసించాడు.
మొపాసాకు 14 ఏళ్ల వయసున్నపుడు ఆంగ్ల కవి, రచయిత స్విన్‌బర్న్[Algernon Charles Swinburne] చూపిన నిలువ ఉంచబడిన తెగిన చెయ్యి ప్రభావంతో తొలుత ‘ఆ చెయ్యి’ [The Hand] అన్నకథను1876 లో; మారుపేరుతో ప్రచురించాడు. దాన్ని తిరిగి 1883 వ్రాసాడు. అందులో ఒక ఆంగ్లేయుడు “నేను మనుషులను కూడా వేటాడతా” అంటాడు. అతని ఇంటి గోడకు కొట్టి, ఒక బలమైన ఇనుప గొలుసుతో కట్టివేసిన ఒక తెగిన హస్తం ఉంటుంది. అది అతని శత్రువుది. ఏ సందర్భంలో అది తెగ కొట్టబడిందో తెలియదు. ఆ హస్తం గల వ్యక్తి, ఆంగ్లేయుడు ఒకరిని ఒకరు నిర్మూలించే ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు ఆ అదృశ్య వ్యక్తి గెలుస్తాడు. ఆ హస్తానికున్న ఒక వేలు చంపబడిన ఆంగ్లేయుడి పళ్ళ మధ్య మిగిలి పోతుంది.
ఇంతకు ముందు చెప్పినట్లు మొపాసా మొదట్లో ‘Naturalist’ [స్వభావ బృందం] కు చెందినవాడు. పుట్టుకతో వచ్చే లక్షణాలు, మనస్తత్వం, పరిస్థితుల ప్రభావం మనిషి ప్రవర్తనను ఎలా నిర్ణయిస్తాయో తెలియజేసే సిద్ధాంతం అది. ఆ వాదానికి ఎమిల్ జోలా ఆద్యుడు [ఒకే కుటుంబ చరిత్ర మీద మనస్తత్వ పరిశీలనతో తన 20 నవలలలో ఎక్కువ భాగం వ్రాశాడు జోలా]. మొత్తం ఆరుగురి రచనలతో ‘మెడాన్ సాయంత్రాలు’ [Evenings of Medan] అన్న కథా సంపుటికి ఆ ఆరుగురూ ప్రష్యన్ యుద్ధం ప్రాతిపదికగా ఆరు కథలు వ్రాసారు. ‘మెడాన్’ పల్లె జోలా సొంత ఊరు. అది పారిస్‌కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాంట్లో మొపాసా తన పేరుతో వ్రాసిన అతని తొలి కథ ‘కొవ్వు బంతి’ [A Ball of Fat] ప్రచురించబడి సంచలనం సృష్టించింది. మిగతా ఐదుగురి కథల గురించీ ఎవరూ పట్టించుకో లేదు. మొపాసా కథలో ఫ్రాన్స్- జర్మన్ యుద్ధ నేపథ్యంగా ఒక వేశ్య గొప్పతనం, బూర్జువా వర్గ [ఎగువ మధ్య తరగతి] ప్రయాణీకుల ద్వంద వైఖరి, నైచ్యం, వాళ్లు ఆమె పట్ల ప్రవర్తించిన తీరు చిత్రించబడినాయి. ఆ ఒక్క కథతోనే ఫ్రాన్సులో అతను వినుతికెక్కాడు.
ఆ కథ వెనుక అంతకన్నా దయనీయమైన గాథ ఉంది. రుఆన్ [Rouen] లో ఏడ్రియన్ లేగే [Adrienne Legay] అనే స్త్రీ వేశ్య వృత్తిలో తొలుత, 44 ఏళ్ళ వయసులో కుట్టుపని చేసి జీవిస్తుండేది. వయసులో వున్నపుడు జర్మన్ సైనికులతో కలిసి వ్యభిచరిస్తుండేది, ఆ పట్నం వీధులలో తిరిగేది. మొపాసా కథలో దానికి విరుద్ధమైన సంఘటన చిత్రించబడింది. 44 ఏళ్ళ వయసులో తన బ్రాషియర్ను [brassiere] నిప్పుకణికలతో నింపి మూతికి కట్టుకుని, ఊపిరాడక, ఉక్కిరిబిక్కిరయి ఆత్మహత్య చేసుకుంది. అది 1888 వ సంవత్సరం. అప్పుడు మొపాసా ఆసుపత్రిలో ఉన్నాడు. ఆత్మహత్యకు కారణం దారిద్య్రం. ఆమె శవాన్ని ఆమెకు అయినవారు ఎవరూ ముందుకొచ్చి తీసుకోకపోవడం వలన, వైద్యవిద్యార్థులకు ఆ మృతదేహం కోసి పాఠాలు నేర్చుకోడానికి ఉపయోగించారు. తరువాత ఆ ఛిద్రమైన శరీరాన్ని వీల్బరో [wheelbarrow] లో తీసుకు పోయి ఒక భిక్షగాడి సమాధిలోకి తోసి పూడ్చారు. ఆమె బతికున్నప్పుడు అనింది: మొపాసాతో మాట్లాడటానికి ఆమె నిరాకరించిందన్నకోపంతో ఆ కథలో అతను అబద్ధం వ్రాసాడు అని. మొపాసా తల్లికి ఆ వేశ్య కష్టాలు తెలిసి ఉన్నాసహాయం చేసే ప్రయత్నం చేసినట్టు లేదు.
‘హొర్ల’ [The Horla] మానవాతీత, హారర్ కథ. దినచర్య రూపంలో వ్రాయబడింది. కథకుడు ఒక రోజు వెళ్ళిపోతున్న నౌకకు సముద్ర తీరం నుంచీ శాల్యూట్ చేస్తాడు. దాంట్లో నుంచి ఒక అదృశ్య శక్తి ఇతని ఇంటికి ఒచ్చి తిష్ఠ వేస్తుంది. నీళ్ళూ పాలూ మాత్రమే తాగి జీవిస్తుందది. మనుషుల మనసులను వేధిస్తుంది. ఎప్పుడూ అతని మీద నిఘా వేసి అతనికి శాంతి లేకుండా చేస్తుంది. నిద్రకూడా పోనీయదు. తన ఇల్లు తగులబెట్టుకుంటాడు అలాగైనా ఆ బూతం కాలిపోతుంది అన్నఆశతో. ఆ అశరీర శక్తి చస్తుందా? చచ్చి ఉండకపోతే తనను తాను చంపుకోడం ఒకటే మిగిలింది అనుకుంటాడు. ఇదే రచయిత వ్రాసిన ‘అతను’ [He} కూడా చాలా మేరకు పై కథను పోలి ఉంటుంది. ‘అతను’ మొపాసా తన గురించీ తాను వ్రాసుకున్నకథ.
తనకు స్నేహితులు, ఇతరులు చెప్పిన సంఘటనలను కథలుగా మలిచాడు. అలా చెప్పినవాళ్లలో అడవిజంతువులను పక్షులను కాచేవాళ్లూ, రైతులు, పల్లె పోలీసులు, పల్లె హోటళ్లు [inns] నడిపేవాళ్ళూ ఉన్నారు. వాళ్లంతా మొపాసా సొంత ప్రాంతం నార్మాండికి [Normandy] చెందినవాళ్లు. ఒకటి రెండు ఎమిల్ జోలా ప్రభావంతో మొపాసా వ్రాసాడు. అవి ‘సైమన్ తండ్రి’ [Simon’s Papa], Bel-Ami నవల. తన యాట్ [వేగపు పడవ] పేరే ఆ నవలకు పెట్టాడు. రచయితగా అతనిలోని ఒక గొప్ప లక్షణం ఏమిటంటే ఎవరి రచననూ అతను కాపీ కొట్టలేదు.
‘హారం’ [The Necklace] అన్న కథలో సామాన్య కుటుంబములో పుట్టిన ఒక గుమస్తా భార్యకు రాజవంశంలో పుట్టినంత అతిశయం. ఆమెను సంతోష పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు భర్త. వాటిలో భాగంగా విద్యా మంత్రిత్వశాఖ ఇస్తున్న పెద్ద వాళ్ళ విందుకు ఒక ఆహ్వానాన్ని సంపాయిస్తాడు ఆ గుమస్తా. కానీ తనకు నగలు లేవని రానని మొరాయిస్తుంది ముందు. తరువాత ఒక ధనవంతురాలైన స్నేహితురాలిని అడిగి వజ్రాల హారం బదులు తెచ్చుకుంటుంది ఆ రోజుకు. దాన్ని పారేసుకుంటుంది. ఆ విషయం అనేక విధాల దాచి పెట్టి, కొన్ని సంవత్సరాలు స్నేహితురాలి దగ్గిరికి వెళ్లకుండా, అరవ చాకిరి చేసి, పోయిన నగలాంటిది తయారు చేయించి స్నేహితురాలికి ఇవ్వబోతుంది. ఆమె తాను ఇచ్చింది నకిలీ నగ అంటుంది. గుమస్తా భార్య కుదేలవుతుంది తాను అన్ని సంవత్సరాల పాటు పడిన శ్రమ, యాతనను గుర్తుకు తెచ్చుకుని.
రెండు మలుపులున్న అంత మంచి కథ మరొకటుంది అది ‘నకిలీ నగలు’ [False Gems]. ఒక సామాన్య ఉద్యోగస్థుడి భార్య చనిపోతుంది. తరువాత అతనికి ఉద్యోగం పోయి రాబడి ఉండదు. ఒక వైపు అతను అమితంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం, మరోవైపు ఉద్యోగం పోవడం వలన తలెత్తిన ఆకలి సమస్య వేధిస్తాయి అతన్ని. ఇంట్లో వెదికితే భార్య వదిలి వెళ్లిన నగలు దొరుకుతాయి. అవి నకిలీవి అని భావించినా వాటిని అమ్మ జూపుతాడు ఎంతోకొంత డబ్బు రాకపోదని. అవి అతి విలువయినవని తేలుతుంది. బతికున్నప్పుడు భార్య సంపాయించినవవి. ఆమెకు ఊరికే ఒచ్చి ఉండవు కదా. అతనికి భార్య నడవడి వలన మనసు చివుక్కుమన్నా ఆ సంపద ఆనందాన్నిస్తుంది. మళ్ళీ పెళ్లాడాడు; మొదటి భార్యలా కాక రెండవ ఆమె గయ్యాళి. కానీ శీలం కలది. ఆమె శీలవంతురాలైనా అతని జీవితంలో సంతోషం లుప్తమయింది.
‘కొవ్వు బంతి’ అన్న కథ నిడివి 40 పుటలు కాగా, ‘ఉన్మాదస్త్రీ’ [Mad Woman] నాలుగు పుటల కథే. అయితేనేమి; మొదటి కథకన్నాఎక్కువగా నీడలా పాఠకుడిమనసుని వెన్నంటే గుణాన్నికలిగి ఉండటంలో దానికి కాస్త పెద్ద పీటను వెయ్యాలి. ఇదీ జర్మన్ యుద్ధ భయానకాన్నిప్రతిబింబిస్తూ వ్రాసినదే. అధికారం చేతిలో ఉన్నపుడు మనిషి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడో ఈ కథలో మరిచిపోలేని విధంగా చదవవచ్చు. ఉత్తర ఫ్రాన్స్ కు చెందిన నార్మాండీ వ్యక్తి ఈ కథను మరాక వ్యక్తికి చెబుతాడు. అడవికోళ్ళు [woodcocks] జర్మన్ల దురాక్రమణప్పుడు జరిగిన ఒక భయంకరమైన అన్యాయాన్ని తనకు గుర్తు చేస్తుంటాయి అంటాడతను. 1855వ సంవత్సరంలో ఒక స్త్రీ తన తండ్రిని, భర్తను, బిడ్డను నెల, నెల వ్యవధిలో కోల్పోయి మతి చెడి మంచంపట్టింది. ఎవరన్నా మంచం మీది నుంచీ ఆమెను తొలగిస్తే భయంతో హాహాకారాలు చేస్తుంది. ఆమె తాను కోల్పోయిన వాళ్ళను ఇంకా తలచుకుంటూ ఉందో లేక ఆమె మెదడు చైతన్యాన్ని కోల్పోయిందో తనకు తెలియదు అంటాడు సూత్రధారుడు. ఆమెకు ప్రపంచంతో సంబంధం తెగిపోయింది పూర్తిగా. ఆమెకు ఆమె గదే పపంచం. ప్రష్యన్లు అంటే జర్మన్లు ఫ్రాన్సును ఆక్రమించినపుడు ఆ సైనికుల పోషణను వాళ్ళు ఏ ఊళ్ళో ఉంటే అక్కడి ఇళ్లకు ఒక్కొక వ్యక్తి చొప్పున కేటాయించారు. అలాంటి ఒక జర్మన్ సైనికుడు ఉన్మాదిగా భావించబడిన ఆ స్త్రీ వంతుకు ఆమె ఇంటికి వచ్చినపుడు అతను పలకరిస్తే ఆమె పలకదు; మంచం మీది నుంచీ కనీసం లేవదు. అవి ఆమె కావాలని చేసిన పనులు కావని మనకు తెలుసు. తెలియని సైనికులు ఆమె ఆ జర్మన్ ను అవమానించే ఉద్దేశంతో చేసిందని భావిస్తారు. ఆమె మంచాన్ని ఆమెతో సహా తీసుకు పోయి చేరువలోని అడవిలో వదిలేస్తారు. ఆ కథ చెప్పే వ్యక్తికీ ఆమె గతి తదుపరి ఏమయ్యిందో తెలియదు. ఒక రోజు అడవికి అడవికోళ్ళను వేటాడటానికి వెళతాడు అతను. చంపిన కోళ్లను తీసుకోడానికి వెదుకుతున్నపుడు ఒక మంచం మీద అస్థిపంజరం కనిపిస్తుంది. ఆ మనిషెవరో తెలుసుకోడానికి కష్టపడక్కర లేదు. ఆమె ఎముకలు కొరికే చలి వాత పడింది. తోడేళ్ళు ఆమె మాంసాన్నిపీక్కు తిన్నాయి. అతను జర్మన్ల దౌష్ట్యాన్ని విమర్శించడు. ఇలా మాత్రం అంటాడు: “మన సంతానం యుద్ధాన్ని మరోసారి చూడకూడదు. యుద్ధం మరోసారి సంభవిస్తే ఇలాంటి ఘాతుకాలెకు అమాయుకులు తిరిగి బలి కావలసి ఉంటుంది.” అడవి కోడికి ఆ స్త్రీ ప్రతీక. కథలో చెప్పని అంశం మనం చెప్పుకో వలసినది ఒకటుంది. అలా జాలిని వ్యక్తం చేసిన వ్యక్తి ఆమెను పోలిన అడవి కోళ్లను మాత్రం బహుశా వేటాడుతూనే ఉంటాడు; జర్మన్లు ఫ్రెంచి వాళ్ళను వేటాడినట్టు.
మొపాసా వ్రాసిన ఆరు గొప్ప నవలలలో రెండు మిగతా వాటికన్నా ఉత్కృష్టమైనవి. ‘ఒక స్త్రీ జీవితం’ [Une Vie]. ఈ మొపాసా మొదటి నవల 1883 లో వెలువడింది. దీన్నే టోల్స్టాయ్ పొగిడింది; మొపాసా పట్ల సదాభిప్రాయాన్నివ్యక్తం చేసింది. దీంట్లో ఏ ప్లాట్ [plot] లేదు. జీన్ అనే గ్రామీణ అగ్రస్థాయి స్త్రీ జీవితం గురించీ వ్రాసిందిది. ఆమె 1819 కాన్వెంటును ఒదిలిన దగ్గిరనుంచీ కథనం మొదలయి ఆమె జీవితాన్ని అనుసరిస్తుంది. తక్కువ వయసులోనే ఆమె ముట్లుడిగి తాతమ్మగా 1840లో మారే వరకు వ్రాయబడింది. అన్నదమ్ములు ‘పీటర్, జాన్’ [Pierre et Jean] మనస్తత్వ పరిశీలనా నవల. జనవరి 1888 లో వెలువడింది. వివాహేతర సంబంధంలో ఇద్దరు కొడుకులలో ఒకడిని ఒక తల్లి లేక భార్య కంటుంది. ఆ రహస్యం క్రమేపీ బయటపడుతుంది. తల్లి చేసిన పని పెద్ద పిల్లాడికి తీవ్రమైన మనస్తాపం కలిగిస్తుంది. తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతాడు. ఇంటినుంచీ వెళ్ళిపోతాడు. మనస్తత్వ పరిశీలనకు సంబంధించిన విషాదాంత నవల ఇది.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 8
నమామి దేవి నర్మదే!! -5
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-6
పకోడి పొట్లం – పుస్తక పరిచయం
కాజాల్లాంటి బాజాలు-121: హజ్బెండ్స్ డే కేర్..
యువభారతి వారి ‘వ్యాస సాహితీ సంహిత’ – పరిచయం
ఈ తరం కథ
కలగంటినే చెలీ-21
వ్యామోహం-4
మన సంస్కృతి – పీరీలు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®