Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మౌన పోరాటం

[శ్రీ ఆవుల వెంకటరమణ రచించిన ‘మౌన పోరాటం’ అనే కవితని అందిస్తున్నాము.]

దేంటో గానీ..
ఎంతలా వద్దనుకున్నా
అంతలా పెనవేసుకుంటుందే..!
మధ్య మధ్యలో నిట్టూర్పుల మజిలీలు
ఎడారి ఇసుకలో తలుక్కుమనే ఒయాసిస్సు లాగా..!
ఊపిరి బిగబట్టి అంతర్ధానమవుదామన్నా
నీడలా వెంటాడే జ్ఞాపకాల లతలు కాళ్ళను చుట్టేస్తుంది.
ఏదో తెలియని అనుభూతి నీడలా
వెంటాడుతూ లీలగా తరుముతున్న వైనం.
బాహ్య స్పర్శల్లి వదిలించుకుని
అంతర్ముఖిన మౌదామనుకున్నా
ఛేదించలేని జ్ఞాపకాల తేనె తుట్టె
ఒళ్లంతా చుట్టుముట్టిన ధైన్యం
తొలి సంధ్యలో తొలకరించిన ఊహాబీజం
మలిసంధ్యలో మహావృక్షమైనట్టు
ఏదో కావాలనుకుంటే మరేదో వచ్చి పడ్డట్టు
అంతలోకే ఒక వేడి నిట్టూర్పు మౌన సంద్రాల్లోకి నెట్టివేస్తే
ఒక చల్లని ఓదార్పు దూదిపింజను చేస్తుంది.
పరంపరాను గతంగా అంకురించిన
మరొక లత పెనవేసు కుంటుంది.
ఆశ నిరాశల ఉచ్ఛ్వాస నిశ్వాసలు
దాగుడుమూతలాట షురూ చేస్తుంది.
ఎంతకీ తీరని కోరికలా..
ఎన్నడూ చేరు కోని గమ్యంలా
ఏమిటి ఈ జీవనగమనం..?
అగమ్య గమ్యాన్ని అందుకోవాలని
అచంచల విశ్వాసంతో ఊపిరి బిగబట్టి..
ఒక్కొక్క అడుగేస్తున్నాను.

Exit mobile version