[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో సైన్స్ ఫిక్షన్ విభాగంలో బహుమతి పొందిన కథ ‘మత్స్య గ్రహం’. రచన తిరుమల శ్రీ.]
అది 2050వ సంవత్సరం. అంతరిక్షం..
అప్పుడు భూమి యొక్క కాలమానం ప్రకారం రాత్రి పన్నెండు గంటలు అవుతుంది.
భారతదేశానికి చెందిన అంతరిక్ష నౌక- ‘స్పేస్ స్టార్’ యొక్క ‘స్పేస్ మాడ్యూల్’ అది. అందులో అత్యవసర సమావేశం జరుగుతోంది.
కెప్టెన్ రోహిత్, వైస్-కెప్టెన్ పుష్యమిలతో పాటు – మొత్తం ఆరుగురు సభ్యులు వున్నారు అందులో. కెప్టెన్, వైస్ కెప్టెన్ల వదనాలు తీవ్ర గంభీరంగా ఉండడంతో.. ఏం జరిగిందో, ఆ అత్యవసర సమావేశానికి హేతువు ఏమిటో బోధపడక తెల్లమొహాలతో ఒకరి నొకరు చూసుకున్నారు మిగతా ఆస్ట్రోనాట్స్.
ఇటీవల భారతదేశపు ఖగోళశాస్త్రజ్ఞులు – అంతరిక్షంలో మార్స్కీ, వీనస్కీ నడుమ ఓ నూతన గ్రహాన్ని కనిపెట్టడం జరిగింది. అది మీనాకృతిలో చిన్నగా వున్నట్టు గుర్తించారు. అందువల్ల దానికి ‘ఫిష్ ప్లానెట్’ (మత్స్య గ్రహం) అని నామకరణం చేసారు.
ఆ నూతన గ్రహన్ని చేరి, అందులో ప్రాణులు ఏవైనా ఉన్నవో లేదో, అది ఆవాసయోగ్యమో కాదో.. అందులో జీవనానికి అవసరమైన నీరు, గాలి వగైరా వనరులు ఉన్నవో లేవో.. లేక, అది కేవలం ఓ మినరల్ డంపో.. తెలుసుకునేందుకు భారతదేశం పూనుకుంది. ఫలితంగా కొందరు ఆస్ట్రొనాట్స్తో ‘స్పేస్ స్టార్’ అనే ఓ అంతరిక్ష నౌకను స్పేస్ లోకి పంపించింది ‘ఇస్రో’.
‘స్పేస్ స్టార్’ అంతరిక్షంలో ప్రవేశించగానే, ‘మదర్ షిప్’ కక్షలో తిరుగుతూంటే, దానినుండి విడివడ్డ ‘స్పేస్ మాడ్యూల్’, చేప ఆకారంలో ఉన్న ఆ నూతన, మిస్టీరియస్ గ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పూనుకుంది. స్కెలెటెన్ ‘క్రూ’ని మదర్ షిప్లో ఉంచి.. కెప్టెన్, వైస్ కెప్టెన్ లతో సహా ఆరుగురు సభ్యులతో ఆ మిస్టీరియస్ గ్రహాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించింది.
ఆ వింత గ్రహం పైన ల్యాండ్ అయింది స్పేస్ మాడ్యూల్. అది ఓ స్ట్రేంజ్ ప్లానెట్. దాని మీది స్థితిగతులు ఏమిటో తెలియదు. అందుకే కెప్టెన్ రోహిత్, వైస్ కేప్టెన్ పుష్యమి ఇద్దరు సభ్యులను తీసుకుని గ్రహం పైన అడుగు పెట్టారు. మిగతా ఇద్దరూ మాడ్యూల్ లోనే ఉండిపోయారు.
సుమారు ఓ కిలోమీటరు విస్తీర్ణంలో ఉన్న ఆ గ్రహం – మీనాకారంలో ఉంది. చదునైన ప్రదేశం, చిన్న లోయ, మట్టిదిబ్బలు, అడవీ – అంతా భూమి (ఎర్త్) పైన లాగే ఉంది. ఐతే దాని మీది మట్టి ఊదా రంగులో ఉండడం విశేషం. నిశ్శబ్దం తాండవమాడుతోంది గ్రహం పైన. అక్కడ జీవనం వున్న దాఖలాలు గోచరించలేదు – కనీసం జంతువులు, పక్షుల ఉనికి కూడా. అది అన్-ఇన్హాబిటేటెడ్ ప్లానెట్ అనుకున్నారు.
మూడు రోజులపాటు ఆ గ్రహం అంతటా తిరిగి దాని మీది అట్మాస్ఫియర్, నీటి వనరులు, ప్రాణవాయువు, ఖనిజాల ఉనికి, వగైరా ముఖ్యమైన డాటాని కలెక్ట్ చేసుకున్నారు. వీడియోలు, ఫొటోలూ తీసారు ఆస్ట్రోనాట్స్.
మూడవ రోజున వారు ఊహించని ఘటన ఒకటి జరిగింది. ఎక్కడినుండి వచ్చాయో, ‘డార్ట్స్’ కొన్ని వారి పైన విడవకుండా వర్షించనారంభించాయి. అవి ఏవో ఆయుధాలలా ఉన్నాయి. వాటి ప్రభావం ఎలాంటిదో, అవి విషపూరితమో తెలియదు. ప్రొటెక్టివ్ గేర్స్ ధరించినందున వాటి వల్ల వారికి హాని కలుగలేదు.
లోయ వద్ద కొన్ని ఆకారాలు ప్రత్యక్షం అయ్యాయి. వారు హ్యూమన్ ఫామ్ లోనే కనిపిస్తున్నా ఆకారాలు విస్పష్టంగా లేవు. వారు ఆ గ్రహవాసులు అయివుంటారనుకున్న ఆస్ట్రోనాట్స్, వాళ్లు అంతవరకు కనిపించకపోవడం ఆశ్చర్యం గొలిపింది.
ఆకాశంలో (శూన్యంలో) ఏవో ఆకారాలు తిరుగుతూ మేఘశకలాలలా లీలగా గోచరించాయి. వాటి రూపాలు అస్పష్టంగా వున్నాయి. బహుశా వారు ఆ గ్రహవాసులు అయివుంటారనీ, కొత్తవారు రావడంతో ఎటాక్ చేస్తున్నారనీ అనుమానించారు ఆస్ట్రోనాట్స్.
నిజానికి వారి అనుమానం సరైనదే.. వారు ఆ గ్రహవాసులు. గండభేరుండ పక్షిలాంటిది – భూతంలాంటి ‘పక్షి’ (స్పేస్ మాడ్యూల్) ఏదో వచ్చి తమ గ్రహం పైన వాలడం గమనించారు వాళ్ళు. అందులోంచి కొందరు ‘ఎలీన్స్’ (ఇతర గ్రహవాసులు) దిగడం, గ్రహమంతా తిరగడం, మట్టి శాంపుల్స్, వగైరాలను సేకరించడం, ఫొటోలు, వీడియోలూ తీయడం- లోయలో దాక్కుని రెండు రోజులపాటు జాగ్రత్తగా గమనించారు.
మూడవ రోజున వారికి స్పష్టమయిపోయింది – ఆ ఆగంతకులు ఏదో అన్యగ్రహానికి చెందినవారు అయివుంటారనీ, వారి వల్ల తమకు ప్రమాదం పొంచివుందనీ, తమ గ్రహాన్ని ఆక్రమించుకోవడానికే వారు వచ్చారనీను.. అంతే! తమ ఆయుధాలతో వారిపైన దాడి జరిపారు. వారి ఆయుధాలు ఎలెక్ట్రానిక్ ‘డార్ట్స్’. అవి తగిలిన జీవి తక్షణం మరణించవలసిందే.
“మన దగ్గరున్న లేజర్ వెపన్స్ తో ఎదురుదాడి చేద్దామా, కెప్టెన్?” అని అడిగింది వైస్ కెప్టెన్ పుష్యమి. ఇరవయ్ ఎనిమిదేళ్ళు ఉంటాయి ఆమెకు.
“నో! మనం ఇక్కడికి వచ్చింది ఈ గ్రహం గురించి తెలుసుకోవడానికీ, దీని మీద లైఫ్ ఉన్నదీ లేనిదీ కనిపెట్టడానికీను.. ఆక్రమించుకోవడానికి కాదు,” అంటూ ఆమె సూచనను ‘వీటో’ చేసేసాడు ముప్పయ్ రెండేళ్ళ కేప్టెన్ రోహిత్.
“ఎట్ లీస్ట్.. ఓ డార్ట్౬ని కలెక్ట్ చేసుకుని మనతో తీసుకువెళ్తే, అది ఏ విధమైన ఆయుధమో, దాని ప్రభావం ఎంతటిదో.. మన లేబ్లో పరిశోధించవచ్చును” అంది పుష్యమి.
రోహిత్ ఓ క్షణం యోచించి, “ఎస్, ఐ థింక్ యు ఆర్ రైట్.. పికప్ వన్. బట్ బీ కేర్‌ఫుల్,”” అన్నాడు.
పుష్యమి ఓ ‘డార్ట్’ ని కలెక్ట్ చేసుకుంది.
ఆ గ్రహవాసుల దాడి ముమ్మరం కావడంతో, తమవారిని వెంటనే మాడ్యూల్ లోకి వెళ్లిపోవలసిందిగా ఆదేశించాడు కెప్టెన్. అందరూ మాడ్యూల్ వైపు పరుగెత్తారు. వారిలో ఓ ఆస్ట్రోనాట్ లేడు.
“మీరు లోపలికి వెళ్ళండి. మునీర్ ఎక్కడ ఉన్నాడో చూసి తీసుకొస్తాను నేను” అన్నాడు రోహిత్.
పుష్యమి, “మీరు లోపలికి వెళ్ళండి, కెప్టెన్! నేను వెళ్ళి తీసుకువస్తాను,” అంటూ జవాబుకు ఎదురుచూడకుండానే మళ్ళీ వెనక్కి పరుగెత్తింది.
అలా మునీర్‌ని వెదుకుతూ వెళ్లిన పుష్యమి ఓ చోట హఠాత్తుగా ఆగిపోయింది. దూరంలో కనిపించిన దృశ్యం ఆమెను నిర్ఘాంతపరచింది. అలా ఎంతసేపు చేష్టలు దక్కి వుండిపోయిందో తెలియదు, స్పృహలోకి రాగానే గిరుక్కున వెనుదిరిగి వడివడిగా మాడ్యూల్ వైపుకు నడచింది.
కాసేపటికి తప్పిపోయిన ఆస్ట్రోనాట్ తిరిగిరావడంతో, ఇద్దరూ మోడ్యూల్‌లో ప్రవేశించారు..
“కెప్టెన్! ఇంత హఠాత్తుగా సమవేశం ఏర్పాటుచేసారు. కారణం ఏమిటి?” అని అడిగాడు ఆస్ట్రోనాట్ డేవిడ్.
“కామ్రేడ్స్! మనం వచ్చిన మిషన్ పూర్తయింది. ఇక మదర్షిప్కి తిరిగి చేరుకోవలసివుంది. కానీ..” కెప్టెన్ సగంలో ఆగడంతో ఆత్రుతగా చూసారంతా.
“ఇప్పుడు రెండు సమస్యలు ఉత్పన్నం అయ్యాయి..” కెప్టెన్ సైగను అందుకుని, వైస్ కేప్టెన్ పుష్యమి చెప్పింది. “మొదటిది- మన మాడ్యూల్ లో ఓ పెద్ద స్నాగ్ ఏర్పడింది. మాడ్యూల్ పైన సైబర్ దాడి జరిగినట్లు అనుమానంగా వుంది. ఫలితంగా, మాడ్యూల్ ఆపరేషనల్ గా లేదు. అండ్, వీ ఆర్ ఫాస్ట్ రన్నింగ్ అవుటాఫ్ ఆక్సిజన్..”
ఉలిక్కిపడ్డారంతా. “ఎవరు చేసుంటారు?” ప్రశ్నించారు.
“అది ఈ గ్రహవాసుల పని అయివుంటుందనిపిస్తోంది,” చెప్పింది పుష్యమి. “ఆ గ్లిచ్ ఏమిటో కూడా అంతుపట్టడంలేదు. వీళ్ళు టెక్నలాజికల్గా బాగా ఎడ్వాన్స్‌డ్‌గా ఉన్నట్టు తోస్తోంది”.
“ఐతే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు?”
“మాడ్యూల్ ని అబాండన్ చేసి మదర్షిప్కి టెలిపోర్ట్ అవడం కంటే వేరే మార్గం కనిపించడంలేదు. కానీ..”
ఆత్రుతగా చూసారంతా.
“దేర్ ఎరైజెస్ ద సెకండ్ ప్రోబ్లెమ్..” అన్నాడు కెప్టెన్.
అయోమయంతో ముఖాలు చూసుకున్నారు అంతా.
“మన దగ్గర వున్న టెలిపోర్టేషన్ పిల్స్‌లో ఒకటి తప్ప అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి..”
ఉలిక్కిపడ్డారంతా. “హౌ కమ్? మనం ఇక్కడికి వచ్చి మూడు రోజులే అయింది. పిల్స్ లైఫ్ ముప్పయ్ రోజులు. ఇంతలోనే ఎలా ఎక్స్పైర్ అవుతాయి? అబ్సర్డ్!” అన్నాడు ఆస్ట్రోనాట్ డేవిడ్, కెప్టెన్ ముఖంలోకి చూస్తూ.
“యు ఆర్ రైట్. కానీ, ఈ గ్రహం మీద అడుగు పెట్టగానే త్వరగా ఏజింగ్‌కి గురయ్యాము మనము. బహుశా మీరు గమనించివుండరు. అది ఈ గ్రహం యొక్క ప్రత్యేకత అయివుంటుంది. ఈ మూడు రోజుల్లో కనీసం మూడు సంవత్సరాలైనా పెరిగాయి మన వయసులు..” చెప్పాడు కేప్టెన్.
చటుక్కున తమ వంక చూసుకున్నారంతా. తాము అక్కడికి వచ్చినప్పటేకంటే వయసు బాగా పెరిగినట్లు గుర్తించి నిశ్చేష్ఠులయ్యారు.
“సో, ఈ పిల్స్ కూడా అఫెక్ట్ అయివుంటాయి,” చెప్పాడతను. “ఐతే, ఒకటి మాత్రం ఇంకా లైఫ్‌తో ఉండడం విశేషమే!”
“మనలో ఒకరు ఆ పిల్‌తో మదర్ షిప్ కి వెళ్ళి, మిగతావారికోసం ఫ్రెష్ పిల్స్‌ని తీసుకురావచ్చును” అన్నాడు ఆస్ట్రోనాట్ మునీర్.
“పిల్స్ అన్నీ మనతో తెచ్చేసాము. అక్కడ ఒక్కటీ లేదు” అంది పుష్యమి పెదవి విరుస్తూ.
“ఎక్స్పైర్డ్ పిల్స్ వాడితే ఏమవుతుంది?” అడిగాడు ఓ ఆస్ట్రోనాట్.
“మన దేహం గాలిలోనే శకలాలుగా డిసింటిగ్రేట్ అయిపోతుంది,” చెప్పాడు కెప్టెన్.
“మరైతే.. వాటీజ్ ద సొల్యూషన్?” అడిగాడు ఇంకో ఆస్ట్రొనాట్.
పుష్యమి అంది- “ఫ్రెండ్స్! మనలో ఒక్కరే ఇక్కడినుండి ప్రాణాలతో బయటపడగలమని అర్థమవుతోంది. సో, కేప్టెన్ ప్రపోజల్ ఏమిటంటే.. మనలో ఈ మిషన్కి ఎవరు ఎక్కువగా ఉపయోగపడతారో నిర్ణయించుకుని వారికి ఆ మంచి పిల్ ని ఇద్దాము. ఆ వ్యక్తి మనం సేకరించిన డాటాతో సేఫ్‌గా మదర్ షిప్ కి టెలిపోర్ట్ కావచ్చును..”
పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడింది అక్కడ.
“హు విల్ డిసైడిట్?” అడిగాడు ఒకతను.
“ఎస్, అయామ్ కమింగ్ టు దట్.. మనలో ఆ పిల్కి ఎవరు ఎక్కువ అర్హులో సూచించాలి అందరమూ. ఎవరికి ఎక్కువ నామినేషన్స్ వస్తాయో వారు అర్హులవుతారు. అయితే, ఎవరి పేరు వారు ప్రపోజ్ చేసుకోకూడదు,” చెప్పింది పుష్యమి. “సేఫ్ పిల్ కెప్టెన్ రూమ్‌లో సెపరేట్ గా వుంచబడింది”.
మళ్ళీ నిశ్శబ్దం అలముకుంది.
దాన్ని చీల్చుతూ, “కమాన్ బాయ్స్! ఈ రాత్రంతా ఆలోచించుకుని తెల్లవారేసరికి మీ నామినేషన్స్ ని తెలియపరచాలి. ఉదయం మళ్ళీ ఇక్కడే కలుద్దాము..” అనేసి, సమావేశానికి ముగింపు పలికాడు కెప్టెన్.
ఉదయం అందరూ మళ్ళీ సమావేశం అయేసరికి, కెప్టెన్ క్యాబిన్లో గ్లాస్ బాక్స్‌లో భద్రంగా వుంచిన ‘సేఫ్ పిల్’ అదృశ్యమయింది! ఎవరో దాన్ని సంగ్రహించినట్లు అర్థమయింది.
తమలో ఆస్ట్రోనాట్ మునీర్ లేడన్న విషయం గ్రహించిన పుష్యమి, “మునీర్ ఎక్కడ? చూద్దాం రండి” అంటూ టెలిపోర్టేషన్ రూమ్ కి తీసుకువెళ్లింది అందరినీ.
అక్కడ ఓ టెలిపోర్టేషన్ చెయిర్లో కూర్చునివున్నాడు మునీర్. వారిని చూసి, అదోలా నవ్వాడు అతను. “మదర్ షిప్కి సేఫ్‌గా చేరుకునేది నేనే!” అన్నాడు.
“దిసీజ్ చీటింగ్!” అన్నారు ఇతరులు.
బదులుగా నవ్వే సమాధానం చేసాడు మునీర్.
ఓసారి నిశితంగా అతని వంక చూసి అంది పుష్యమి- “అయామ్ సారీ! నువ్వు తీసుకున్నది సేఫ్ పిల్ కాదు..”
మునీర్ అయోమయానికి గురయ్యాడు.
“ఎస్, రాత్రి అబద్ధం చెప్పాం మేము. నిజానికి, నువ్వు మ్రింగిన పిల్ ఒక్కటే ఎక్స్పైర్ అయినది. మిగతావన్నీ సేఫ్ గానే ఉన్నాయి..”
ఉలిక్కిపడ్డాడు అతను. “నో! ఇటీజ్ ఎ లై..” అరచాడు.
“కాసేపటికి నువ్వు మ్రింగిన పిల్ పనిచేయడం ఆరంభిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది నీకు..” అందామె కూల్ గా. “మనలోని ట్రెయిటర్ ఎవరో కనిపెట్టడం కోసమే ఈ నాటకం ఆడవలసివచ్చింది..”
నిశ్చేష్టులైన మిగతావారు తేరుకునేలోపునే, “ఇప్పుడు కెప్టెన్ రూమ్‌లో ఉన్న మిగతా పిల్స్ ని తీసుకువస్తాను,” అంటూ అక్కడి నుండి నిష్క్రమించింది.
కాసేపటి తరువాత తిరిగివచ్చిన పుష్యమితో వచ్చిన వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డారు ఆస్ట్రోనాట్స్- “కెప్టెన్..!?”
“ఎస్, మన కేప్టెన్ రోహిత్ ఇతనే..” అంది పుష్యమి్. అతని చేతిలో టెలీపోర్టింగ్ పిల్స్‌తో కూడిన బాక్స్ ఉంది.
అంతవరకు తమతో వున్న వ్యక్తి వంక చూసారు- “మరి.. ఇతను.. ఎవరు..?!”
“ఇంపోస్టర్!” అంటూ పుష్యమి చెప్పిన సంగతులను నోరు తెరచుకుని వింటూ వుండిపోయారు వాళ్ళు-
‘ఈ గ్రహవాసులు టెక్నాలజీలో ఎంతో ఎడ్వాన్స్‌గా ఉన్నారు. ఆ స్పేస్ మాడ్యూల్ ని చూసి రెండు రోజులపాటు రహస్యంగా ఆస్ట్రోనాట్స్ యొక్క చర్యలను కనిపెట్టారు. వారిని ఆక్రమణదారులుగా ఎంచి, దాడి చేసారు. ప్రొటెక్టివ్ గేర్స్ ఆస్ట్రోనాట్స్‌ని కాపాడాయి. కానీ, ఆస్ట్రోనాట్ మునీర్‌ని కాప్చర్ చేసారు వాళ్ళు. సైన్ లాంగ్వేజ్ (సైగలు) ద్వారా అతని నుండి విషయం తెలుసుకున్నారు. మునీర్‌ని బంధించి, గ్రహవాసులలో ఒకడు అతని ప్రొటెక్టివ్ గేర్ని ధరించి మాడ్యూల్ లో ప్రవేశించాడు.. మునీర్‌ని వెదకడానికి వెళ్ళిన పుష్యమి, వారికి తెలియకుండా అదంతా గమనించింది. కెప్టెన్ రోహిత్‌తో ఆ విషయాలు చర్చింది.
ఫలితంగా ఆ రాత్రి టెలిపోర్టేషన్ పిల్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయినట్లు నాటకమాడారు ఇద్దరూ. ఊహించినట్టే, మునీర్ స్థానంలో ప్రవేశించిన ‘ఎలీన్’, అందరూ పడుకున్నాక కెప్టెన్ గదిలో ప్రవేశించి, కావాలనే ప్రత్యేకంగా వుంచిన పిల్‌ని కైవసం చేసుకున్నాడు. అంతేకాదు, అతను మాడ్యూల్ ద్వారాన్ని తెరవడంతో మరో గ్రహవాసి లోపల ప్రవేశించాడు. ఇద్దరూ కలసి నిద్రిస్తూన్న కెప్టెన్‌ని బంధించి, రెండోవాడు అతని రూపాన్ని ధరించాడు.. ఎలర్ట్ గా ఉన్న పుష్యమి కెప్టెన్ గదికి వచ్చేసరికి అదంతా కంటపడింది. తాను బయటపడకుండా, రహస్యంగా జరిగినదంతా గమనించింది.. ఇప్పుడు ‘ఫేక్’ కెప్టెన్‌ని ఎక్స్పోజ్ చేసే నిమిత్తం, పిల్స్ తీసుకురావడం కోసమని వెళ్ళి కెప్టెన్‌ని బంధవిముక్తుణ్ణి చేసి తీసుకువచ్చింది..’
నోట మాట రాలేదు ఎవరికీను.
వారు తేరుకునేలోపునే, ‘ఫేక్’ కేప్టెన్ వెళ్ళి ఓ టెలిపోర్టింగ్ చెయిర్లో కూర్చున్నాడు. సైన్ లాంగ్వేజ్ తో, “ఆ పిల్స్ లో ఒకటి ముందే సంగ్రహించాను నేను. దాంతో మీ మదర్ షిప్కి టెలిపోర్ట్ అవుతాను. అక్కడ వున్నవారిని ఓవర్-పవర్ చేసి దాన్ని స్వాధీనం చేసుకుంటాను. మా దగ్గర బందీగా వున్న మీ ఆస్ట్రోనాట్ ద్వారా దాని ఆపరేషన్ని తెలుసుకుని మీ గ్రహానికి వెళతాం మేము. టెక్నాలజీలో మాకున్న సుపీరియారిటీతో మీ గ్రహం పైన దాడి చేసి ఆక్రమించుకుంటాము..” అంటూ గుప్పిట్లో దాచుకున్న పిల్ ని చటుక్కున మ్రింగేసాడు.
పుష్యమి నవ్వింది. “ముందు నువ్వు ప్రాణాలతో బయటపడు..” అంది. “నువ్వు మ్రింగిన పిల్ విషపూరితమైనది”.
వాడు తెల్లబోతూ అపనమ్మకంగా చూస్తే- “ఎస్. రాత్రి మీ వ్యవహారమంతా గమనించాక పిల్స్ అన్నిటినీ జిలామెట్రిక్ పాయిజన్ తో ట్రీట్ చేసాను నేను. ఆ పిల్ ని మ్రింగినవారు కొద్దిసేపటిలోనే ప్రాణాలు కోల్పోతారు..” అందామె.
నిర్ఘాంతపోయి చూసాడు వాడు. అంతలోనే తేరుకుని, “పిల్స్ అన్నిటినీ పాయిజన్ చేసానంటున్నావు. అప్పుడు మీరందరూ కూడా చస్తారుగా?” అన్నాడు.
“దటీజ్ వేర్ యు ఆర్ మిస్టేకెన్. మా మిషన్‌ని ఆరంభించగానే ఎలాంటి విషప్రభావమూ మాపైన పనిచేయకుండా, మేమంతా విరుగుడును తీసుకోవడం జరిగింది. సో, ఇట్ డజంట్ అఫెక్ట్ అజ్” అంది మళ్ళీ నవ్వుతూ.
“అంతా అబద్ధం. వాళ్లు మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. లెటజ్ గో..” అని నకిలీ మునీర్ రెండవవాడితో అనడంతో, చెయిర్ ఆర్మ్ రెస్ట్ మీదున్న బటన్స్‌ని ప్రెస్ చేసారు ఇద్దరూ. ఓ పెద్ద కుదుపుతో చెయిర్స్ లోంచి ఎగిరి మాడ్యూల్ బయటకు దూసుకుపోయారు. ఐతే, కొన్ని నిముషాలకే ‘ఫేక్’ కేప్టెన్ నిర్జీవంగా కుర్చీలో వాలిపోతే.. ‘ఫేక్’ మునీర్ శరీరం ఛిద్రమయి గాలిలో కలసిపోయింది.
కొన్ని నిముషాలపాటు గంభీర నిశ్శబ్దం ఆవరించుకుంది అక్కడ.
“మరి మునీర్ సంగతేమిటి?” అనడిగారు ఒకరు.
“మనం ఆ గ్రహం మీద మళ్ళీ అడుగుపెట్టడం ప్రమాదకరం. ఫరదర్ డేంజర్ ఎదురవ్వకముందే మదర్షిప్కి చేరిపోవాలి,” అన్నాడు కెప్టెన్ రోహిత్. “పుష్యమి తెలివిగా సమయస్ఫూర్తితో నడచుకోవడంతో దురాక్రమణకు పూనుకున్న ఎలీన్స్ని సులభంగా ఎలిమినేట్ చేయగలిగాం”.
“లెటజ్ ప్రే ఫర్ కామ్రేడ్ మునీర్..” అని పుష్యమి అనడంతో, కొద్ది నిముషాలపాటు కళ్ళు మూసుకుని ప్రార్థించారంతా.
అనంతరం అందరూ టెలిపోర్టింగ్ చెయిర్స్‌లో కూర్చుని పిల్స్‌ని మ్రింగారు.
సమాప్తం
‘తిరుమలశ్రీ’ అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. ఆలిండియా సర్వీసెస్ కి చెందిన వీరు, భారతప్రభుత్వపు జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు. ‘తిరుమలశ్రీ’, ‘విశ్వమోహిని’ కలం పేర్లు.
తెలుగులో – అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. 190 నవలలు పుస్తకరూపంలోను, పత్రికలలోను, సీరియల్స్ గానూ ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలకు బహుమతులు లభించాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ఎడిటింగులో అనుభవం. పలు సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ‘కలహంస’’ పురస్కార గ్రహీత. ‘కథాకిరీటి’, ‘కథా విశారద’, ‘బాలకథాబంధు’ బిరుదాంకితులు.
ఆంగ్లంలో – కథలు, వ్యాసాలు వందకు పైగా ప్రముఖ జాతీయ దినపత్రికలలోను, ‘కేరవన్’, ‘విమెన్స్ ఎరా’, ‘ఎలైవ్’, ‘ఆడమ్ అండ్ ఈవ్’, ‘సాజిత్’, ‘చందమామ’ (ఆంగ్లం), ‘గోకుల్’, మున్నగు ప్రముఖ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు లభించాయి. ఓ ప్రముఖ జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం రాసారు. 20 ‘ఇ-బుక్స్’ ప్రచురింపబడ్డాయి. స్టోరీమిర్రర్ (మల్టీ-లింగ్యువల్ పోర్టల్) యొక్క ‘లిటరరీ కల్నల్’ మరియు ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు…‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2019’ నామినీ. ‘ఆథర్ ఆఫ్ ద మంత్’ (సెప్టెంబర్ 2020) టైటిల్ (& బహుమతి) గ్రహీతలు. ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ (1st రన్నరప్)(రీడర్స్ ఛాయిస్), మరియు, 2nd రన్నరప్ (ఎడిటర్స్ ఛాయిస్) టైటిల్స్ అండ్ ట్రోఫీస్ గ్రహీతలు.
హిందీ లో – అరడజను కథలు ప్రచురితం కాగా, బాలల నాటిక ఒకటి ఆలిండియా రేడియోలో ప్రసారమయింది.
