[సంచిక పాఠకుల కోసం ‘గాడ్జిల్లా మైనస్ వన్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
గాడ్జిల్లా అనేది అణుధార్మికత వల్ల పుట్టిన ఒక జీవిగా జపాన్ కథల్లో ప్రసిద్ధి చెందింది. భారీ ఆకారంతో చూడటానికి రాక్షసబల్లి (డైనొసార్) లా ఉంటుంది. తొలి గాడ్జిల్లా చిత్రం 1954లో వచ్చింది. తర్వాత గాడ్జిల్లా హాలీవుడ్ చిత్రాల్లోకి కూడా పాకింది. గాడ్జిల్లా అంటే తెలియని పిల్లలు దాదాపు ఉండరు. అయితే 2023 లో వచ్చిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’ భారతదేశంలో విడుదలకు నోచుకోలేదు. ఒక కారణం ఇది జపనీస్ భాషలో జపనీస్ నటులతో తీసిన చిత్రం. మరొక కారణం మన దేశంలో హాలీవుడ్ చిత్రాలకి ఉన్న వెసులుబాట్లు ఇతర దేశాల చిత్రాలకు లేకపోవటం. ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఆంగ్లం, హిందీ శబ్దానువాదాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి చిత్రాలు పిల్లలు చూస్తారు కానీ సాధారణంగా పెద్దలు చూడరు. కానీ ఇది చూడదగ్గ చిత్రం. కథ చాలా బావుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) అద్భుతంగా ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఆస్కార్ వచ్చింది. ఈ విభాగంలో ఆస్కార్ వచ్చిన తొలి అంతర్జాతీయ చిత్రం ఇదే. వెండితెర మీద చూడలేకపోయినా పెద్ద బుల్లితెరలు వచ్చాయి కాబట్టి చూసి ఆనందించవచ్చు.
గాడ్జిల్లాని అణ్వాయుధాల వల్ల కలిగే దుష్పరిణామాలకి సంకేతంగా చూపించటం ఒక ఉద్దేశం. అణ్వాయుధాల రేడియేషన్ ఎలా జీవితాలను ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసినదే. దాన్ని వదిలించుకోవటం చాలా కష్టం. అలాగే గాడ్జిల్లా కూడా ఒక పట్టాన చావదు. శరీరానికి గాయాలైతే ఉత్పరివర్తనం (మ్యూటేషన్) జరిగి ఇంకా పెరుగుతుంది. ఇంతకీ గాడ్జిల్లా మైనస్ వన్ అంటే ఏమిటి? గాడ్జిల్లా, గాడ్జిల్లా 1, గాడ్జిల్లా 2, గాడ్జిల్లా 3 చిత్రాలు ఇంతకు ముందే వచ్చాయి. ఈ చిత్రం 1945 నుంచి 1947 వరకు జరిగిన కథ. దానికి గాడ్జిల్లా 4 అని పేరు పెట్టటం కన్నా వెనక్కి వెళ్ళి గాడ్జిల్లా -1 అని పెట్టారు. అదే గాడ్జిల్లా మైనస్ వన్.
రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ జర్మనీతో కలిసి పోరాడింది. జపాన్ సైనికులు కొంతమంది ఆత్మాహుతి దాడులు చేసేవారు. యుద్ధవిమానాల్లో వెళ్ళి శత్రువుల యుద్ధనౌకలను ఢీకొనటం వారి పని. అలాంటి సైనికులని కామికాజి (Kamikaze) అనేవారు. వారిలో ఒకడు కథానాయకుడు షికిషిమా. అయితే అతను ప్రాణభయంతో పారిపోయి తన యుద్ధవిమానంలో వైమానిక స్థావరం ఉన్న ఒక ద్వీపానికి వస్తాడు. అప్పటికే యుద్ధం చివరి దశలో ఉంటుంది. అతను తన విమానానికి మరమ్మత్తు అవసరమని అబద్ధం చెబుతాడు. అక్కడ తాచిబానా అనే అతని పర్యవేక్షణలో మెకానిక్కులు ఉంటారు. విమానాన్ని పరీక్షించిన మీదట వారికి షికిషిమా అబద్ధం చెబుతున్నాడని అర్థమవుతుంది. దాడి చేయటానికి భయపడి వచ్చేశాడని ఊహిస్తారు. అతన్ని పిరికివాడిలా చూస్తారు.
ఆ రాత్రి షికిషిమా ఆ ద్వీపం మీదే ఉండిపోతాడు. రాత్రివేళ గాడ్జిల్లా సముద్రం నుంచి వస్తుంది. యుద్ధంలో వేసిన అణుబాంబుల వల్ల గాడ్జిల్లా పుట్టింది. వైమానిక స్థావరం మీద దాడి చేస్తుంది. ఆ జీవి ఏమిటో అర్థం కాక అక్కడి వారందరూ భయభ్రాంతులవుతారు. ఒక మెకానిక్ మాత్రం ఇలాంటి జీవి ఉందని విన్నానంటాడు. తాచిబానా షికిషిమాతో “నీ విమానం మీద ఉన్న పెద్ద తుపాకీతో దాన్ని కాల్చు” అంటాడు. షికిషిమా విమానం ఎక్కుతాడు కానీ దగ్గరి నుంచి గాడ్జిల్లాని చూసి మ్రాన్పడిపోతాడు. తుపాకీ పేల్చడు. చివరికి తాచిబానా, షికిషిమా తప్ప అందరూ గాడ్జిల్లా దాడిలో చనిపోతారు. తాచిబానా షికిషిమాని “అంతా నీవల్లే” అని దూషిస్తాడు. నిజానికి షికిషిమా తుపాకీ పేల్చినా గాడ్జిల్లా మరణించేది కాదు. అప్పుడు తన ప్రయత్నం తాను చేసినట్టు ఉండేది. అతన్ని ఎవరూ తప్పుబట్టేవారు కాదు. కానీ అతను తుపాకీ పేలిస్తే గాడ్జిల్లా దృష్టిలో పడి అది అతని మీద దాడి చేసేది. అందుకే అతను భయపడిపోయాడు. స్వార్థం చూసుకుంటే ఎప్పటికైనా దోషిగా నిలబడాలి. మనకి ఖడ్గ తిక్కన కథ తెలుసు. అతను యుద్ధంలో ఓడిపోయి ఇంటికి వస్తే తల్లీ, భార్యా అతన్ని అవమానిస్తారు. “పౌరుషం లేకుండా ఓడిపోయి తిరిగి వచ్చావు” అంటారు. సొంత వాళ్ళే అలా అన్నప్పుడు బయటి వాళ్ళు షికిషిమాని తప్పుబట్టారంటే వింతేముంది? షికిషిమా విషయంలో యుద్ధం నుంచి పారిపోయి రావటానికి ఒక కారణం ఉంది. యుద్ధం చివరి దశలో ఉంది. జపాన్ ఓడిపోతుందని తెలుసు. అలాంటప్పుడు తన ప్రాణాలు అర్పించి లాభం లేదని అతను అనుకున్నాడు. గాడ్జిల్లా దాడికి ముందు ఒక మెకానిక్ అతనితో “నువ్వు చేసిన దాంట్లో తప్పు లేదు. గెలిచే అవకాశం లేనపుడు ప్రాణాలు ఎందుకు ఒడ్డాలి?” అంటాడు. కొందరికి సహానుభూతి ఉంటుంది. చాలామందికి ఉండదు. అది తప్పని అనలేం. షికిషిమా గాడ్జిల్లా మీద తుపాకీ పేల్చకపోవటం మాత్రం తప్పే. అతనికి షూటర్‌గా నైపుణ్యం ఉంది. కానీ భయం వల్ల ఆ నైపుణ్యం కొరగాకుండా పోయింది. దాంతో అతను తన మనస్సాక్షి ముందే దోషిగా నిలబడ్డాడు.
యుద్ధం ముగిసిన తర్వాత షికిషిమా తన ఇంటికి తిరిగి వస్తాడు. అతని ఇల్లు నేలమట్టమై ఉంటుంది. అతని తలిదండ్రులు ఒక వైమానిక దాడిలో మరణించారు. వారి పక్కింటామె పేరు సుమీకో. ఆమె భర్త, పిల్లలు యుద్ధం వల్ల మరణించారు. ఆమె కూడా షికిషిమాని పిరికివాడని దూషిస్తుంది. “నీ లాంటి పిరివాళ్ళందరూ తమ తమ విద్యుక్తధర్మం చేసి ఉంటే నా పిల్లలు బతికి ఉండేవాళ్ళు” అంటుంది. షికిషిమా అపరాధభావంతో కుంగిపోతాడు. అతని తలిదండ్రులు అతను సజీవంగా తిరిగి రావాలని కోరుకుంటూ అతనికి ఉత్తరం రాశారు. షికిషిమా తప్పించుకుని రావటానికి అదో కారణం. ఇప్పుడు వారే లేరు. షికిషిమాకి ఇది దెబ్బ మీద దెబ్బ. తాను వారి కోసం తిరిగి రాకుండా ఆత్మాహుతి చేసుకుని ఉంటే వారు బతికేవారా? తాను గాడ్జిల్లా మీద తుపాకీ పేల్చి ఉంటే మెకానిక్కులు బతికేవారా? యుద్ధం ఎన్ని గాయాలు చేస్తుందో కదా? యుద్ధానంతర ఒత్తిడితో ఎందరో సైనికులు బాధపడతారు.
షికిషిమా తన స్థలంలో ఒక చిన్న షెడ్డులాంటిది వేసుకుంటాడు. అతనికి నోరీకో అనే ఒక యువతి తారసపడుతుంది. ఆమె దగ్గర ఒక చంటి పాప ఉంటుంది. దిక్కు లేక ఆమె షికిషిమా పంచన చేరుతుంది. ఆ పాప ఆమె బిడ్డ కాదు. ఆ పాప తల్లి ఒక దాడిలో చనిపోతూ తన బిడ్డని చూసుకోమని నోరీకోకి ఇచ్చింది. ఇదంతా చూసి సుమీకో షికిషిమాని “పెద్ద వీరుడిలా వాళ్ళిద్దరినీ చేరదీశావా?” అని దెప్పుతుంది కానీ పరిస్థితి తెలిసి పాపకి జావ కాచి ఇవ్వమని తన దగ్గరున్న కాసిని బియ్యం ఇస్తుంది. తల్లి ఎప్పటికీ తల్లే! ‘అమ్మతనం ఏ దేశంలో ఐనా ఒకేలా ఉంటుంది’ అని ‘కంచె’ సినిమాలో ఒక డైలాగు. అక్షరాలా నిజం! తన పిల్లల్ని పోగొట్టుకున్న ఆ తల్లిలో.. ఒక చంటి పాపని చూసి మాతృత్వం పొంగిందంటే వింతేముంది? తర్వాత కొన్ని నెలలు షికిషిమా చిన్నాచితకా పనులు చేస్తాడు. అయితే ఆ డబ్బు సరిపోదు. ఇంతలో ప్రభుత్వం యుద్ధసమయంలో అమెరికా, జపాన్ సముద్రంలో విడిచిన మందుగుండ్లని నాశనం చేయటానికి ఉద్యుక్తమవుతుంది. ఆ మందుగుండ్లు అలా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. షికిషిమా ఆ పని కోసం వెళ్ళటానికి సిద్ధమవుతాడు. డబ్బు బాగా వస్తుందని అతని ఆశ. రోజూ పడవ మీద సముద్రం మీదకి వెళ్ళి మందుగుండ్లు కనిపెట్టి వాటిని పేల్చేయాలి. అయితే జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణానికే ప్రమాదం. నోరీకో వద్దంటుంది. ఆమెకి అతన్ని పెళ్ళి చేసుకోవాలని ఆశ. అయితే అతను పెళ్ళికి సిద్ధంగా లేడు. అతనిలో అంతర్మథనం నడుస్తూ ఉంటుంది. ‘నేను ఒక కుటుంబాన్ని పోషించగలనా? ఒకవేళ రేపేదైనా ఆపద వస్తే ఎదురు నిలబడగలనా? భయపడి పారిపోతానా?’ అని తనని తానే ప్రశ్నించుకుంటాడు. ఇది ఎంత నరకం! తాను పోయినా నోరీకో, బిడ్డా బావుండాలి అనుకుంటాడు. అందుకే మందుపాతరలు నాశనం చేసే పనికి ఒప్పుకుంటాడు. పాప బాగా చూసుకోవాలంటే ఈ పని అవసరమని నోరీకోని ఒప్పిస్తాడు. ప్రమాదకరమైన పని అయినంత మాత్రాన తనకేమీ కాదని అంటాడు. పనిలో చేరతాడు. తన నైపుణ్యంతో చాలా మందుగుండ్లని పేలుస్తాడు. డబ్బు బాగా వస్తుంది. ఇలా ఒక సంవత్సరం గడుస్తుంది. షికిషిమా ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాడు. అతని సహచరులు అతని ఇంటికి వస్తారు. వారు అతనితో పడవలో పనిచేసేవాళ్ళు. అతనికి నోరీకోతో పెళ్ళి కాలేదని తెలిసి ఆశ్చర్యపోతారు. అతను పాపకి కూడా “నేను మీ నాన్నని కాదు” అని చెప్పటం వారికి అసలు నచ్చదు. నోరీకోకి బాధగా ఉన్నా మౌనంగా ఉంటుంది. తర్వాత ఆమె కూడా ఒక ఉద్యోగంలో చేరుతుంది. ఆమె ఉద్యోగానికి వెళ్ళినపుడు పాపని సుమీకో చూసుకుంటుంది.
షికిషిమా చేసే పని వెనక ప్రభుత్వం అసలు ఉద్దేశం గుట్టు చప్పుడు కాకుండా గాడ్జిల్లాని మట్టు పెట్టటమే. ప్రజలకి గాడ్జిల్లా గురించి తెలిస్తే భాయాందోళనలకి గురవుతారు. ఒకరోజు ప్రభుత్వం నుంచి షికిషిమా బృందానికి ఆదేశాలు వస్తాయి, దాచిపెట్టిన మందుగుండ్లని వాడి గాడ్జిల్లాని హతమార్చమని. వీళ్ళది చెక్కతో చేసిన చిన్న పడవ. మొత్తం నలుగురు ఉంటారు. నోడా అనే అతను అందరిలో అనుభవజ్ఞుడు. కెప్టెన్ వేరే ఉంటాడు కానీ నోడాకి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. నౌకాదళంలో పని చేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత బతుకుతెరువు కోసం ఈ పని చేస్తున్నాడు. గాడ్జిల్లా గురించి అందరూ భయపడుతుంటే నోడా “అమెరికా సాయానికి రాదు. వస్తే రష్యా ఊరుకోదు. మన ప్రజల్ని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు? సింగపూర్ నుంచి ఒక యుద్ధనౌక వస్తుంది. అప్పటి దాకా గాడ్జిల్లాని కట్టడి చేస్తే చాలు” అంటాడు. కాసేపటికి గాడ్జిల్లా ఈదుకుంటూ వస్తుంది. పడవని వెంబడిస్తుంది. అది గతంలో కంటే పెద్దదిగా తయారయింది. దాని వీపు మీద కత్తుల్లాంటి స్పైక్స్ ఉంటాయి. అందరూ కలిసి తాళ్ళు ఉపయోగించి చాకచక్యంగా గాడ్జిల్లా నోటిలోకి ఒక మందుగుండు వెళ్ళేలా చేస్తారు. దాన్ని షికిషిమా తుపాకీతో పేలుస్తాడు. గాడ్జిల్లా దవడకి గాయమైనా వెంటనే ఉత్పరివర్తనం జరిగి నయమైపోతుంది. ఈ క్రమంలో అలల తాకిడి వల్ల పడవ ఊగిసలాడి షికిషిమా గాయపడతాడు. అందరూ నిస్సహాయులై ఉంటారు. గాడ్జిల్లా కోపంతో పడవ మీద దాడి చేయబోతుంటే యుద్ధనౌక వచ్చి దాని మీద ఫిరంగులతో దాడి చేస్తుంది. అది ఆగ్రహంతో తన నోటి నుండి ఒక శక్తివంతమైన కాంతి పుంజాన్ని వెలువరిస్తుంది. యుద్ధనౌక ధ్వంసమౌతుంది. ప్రతిఘటన లేకపోవటంతో గాడ్జిల్లా దాడి విరమించి వెళ్ళిపోతుంది.
షికిషిమాలో ఉన్న అపరాధభావం చిత్రంలో ప్రధానాంశం. ఒకరకంగా గాడ్జిల్లా ఆ అపరాధభావానికి ప్రతీక. గాడ్జిల్లా మీద దాడి చేయటానికి ముందు షికిషిమాకి పీడకలలు వస్తుంటాయి. అతనితో ఒక వింత ఆలోచన బయల్దేరుతుంది. తాను గాడ్జిల్లా దాడిలో మరణించానని, తానిప్పుడు జీవిస్తున్న జీవితం చనిపోయే ముందు కన్న కల అని ఆ ఆలోచన. ఒకసారి ఉద్వేగానికి లోనై “నేను నిజంగా బతికే ఉన్నానా?” అని నోరీకోని కుదిపేస్తూ అడుగుతాడు. తన వల్ల కొందరి ప్రాణాలు పోయాయంటే ఆ ప్రభావం మనసుపై ఎలా ఉంటుందో ఊహించటం కష్టం. తనకి శిక్ష పడకుండా ఈ అపరాధభావం పోదని అతను అంతరాంతరాల్లో అనుకుంటాడు. అతనికి శిక్ష పడకపోగా అతనికో తోడు దొరికింది. ఓ పాప కూడా చెంత చేరింది. ఈ ఆనందానికి నేను అర్హుడిని కాదు అనే భావన అతనిలో ఉంటుంది. ఆ భావనకి రూపమే గాడ్జిల్లా. అది ఎంతకీ చావదు.
గాడ్జిలా గురించి అంతవరకు షికిషిమా నోరీకోకి చెప్పలేదు. గాడ్జిల్లాని చంపలేకపోయినందుకు (అపరాధభావం ఇంకా పోనందుకు) అతను బాధ పడుతుంటే ఆమె “నీ బాధ నాతో పంచుకో” అంటుంది. అతను గాడ్జిల్లా గురించి చెబుతాడు. తన పిరికితనం గురించి చెబుతాడు. ఆమె “యుద్ధంలో బతికిన వారంతా జీవించటానికి అర్హులే. నా తలిదండ్రులు మంటల్లో కాలిపోతూ ‘నువ్వు బతకాలి’ అన్నారు. అందుకే నేను పోరాడుతూ జీవిస్తున్నాను. వారి కోసం” అంటుంది. వారు పోయారని ఆమెకి దిగులు ఉంటుంది. కానీ వారి కోసం బతకాలి అనే ఆమె సంకల్పం ఆ దిగులు కంటే బలమైనది. బతకాలనే సంకల్పం ఉండాలి. చచ్చి ఏమీ సాధించలేం. షికిషిమాకి బతుకు మీద ఆశ కలుగుతుంది. కానీ ఇంతలోనే గాడ్జిల్లా సముద్రం నుంచి వచ్చి భూమి దాడి చేస్తుంది. దాంతో షికిషిమా జీవితం మళ్ళీ అస్తవ్యస్తం అవుతుంది.
గాడ్జిల్లా చిత్రాలు నేను ఎక్కువ చూడలేదు కానీ చూసినవాటిలో కొన్ని పాత్రల స్వభావాలు దురుద్దేశంతో కూడుకుని ఉంటాయి. ఈ చిత్రంలో ఎవరికీ దురుద్దేశాలు ఉండవు. షికిషిమా స్వార్థం చూపించినా అతనికి దురుద్దేశం లేదు. మిగతా పాత్రలన్నీ ఉన్నతమైన పాత్రలే. అదే ఈ చిత్రం లోని గొప్పతనం. పాత్రలన్నిటికీ మంచి జరగాలని మనం కోరుకుంటాం. వారికేదైనా అయితే ఉద్వేగానికి లోనవుతాం. ఇలాంటి స్క్రీన్ ప్లే రాసిన తకాషీ యామజాకీని అభినందించకుండా ఉండలేం. అతనే దర్శకుడు. అతనూ, కియోకో షిబూయా కలిసి గ్రాఫిక్స్ రూపొందించారు. సముద్రంలో గాడ్జిల్లా ఈదుతూ, మునుగుతూ ఉన్నప్పుడు నీటి కదలికలు ఎంతో సహజంగా ఉండేలా గ్రాఫిక్స్ ఉంటాయి. ఈ సహజత్వం ఎలా సాధించారా అని అబ్బురపడాల్సిందే. షికిషిమాగా రయునొసుకే కమీకీ, నోరీకోగా మినామీ హమాబే నటించారు. షికిషిమా అంతర్మథనాన్ని రియునొసుకే అద్భుతంగా అభినయించాడు. అతని బాధని అర్థం చేసుకోవటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించే పాత్రలో మినామీ ఒదిగిపోయింది. చిత్రంలో సంగీతం కూడా బావుంటుంది. జపనీస్ సంస్కృతి కూడా చక్కగా చూపించారు. నమస్కారాలు, కృతఙతలు తెలుపటానికి జపనీయులు నడుము దగ్గర వంగుతారు. ఎంత గౌరవం చూపించాలంటే అంత ఎక్కువ వంగుతారు. అవతలి వారు చూస్తున్నారా లేదా అనేది అనవసరం. సుమీకో పాప కోసం బియ్యం ఇచ్చి వెళ్ళిపోతున్నప్పుడు నోరీకో ఆమె వెనక నిలబడి పూర్తిగా వంగుతుంది. షికిషిమా ఒక సందర్భంలో ఒక పాత్రని సాయం చేయమని వేడుకుంటాడు. ఎదురుగా ఉన్న బల్ల మీద గబుక్కున తల ఆనించి ప్రాథేయపడతాడు. ఇది భారతీయ సంస్కృతిలో కాళ్ళు పట్టుకోవటం లాంటిది. అలాగే పూర్వకాలంతో జపనీయులు ఇళ్ళలో మోకాళ్ళ మీద కూర్చునేవారు. అది కూడా ఈ చిత్రంలో కనిపిస్తుంది.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ వ్యాసంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు.
గాడ్జిలా నగరం మీద దాడి చేసే సమయంలో నోరీకో మెట్రో రైల్లో (జపాన్, అమెరికా లాంటి దేశాల్లో మెట్రో రైలు ఎప్పటి నుంచో ఉంది) వెళుతూ ఉంటుంది. గాడ్జిల్లా రైలుని నోట కరుచుకుని పైకి లేపుతుంది. నోరీకో నదిలో దూకి తప్పించుకుంటుంది. రేడియోలో దాడి సంగతి విని షికిషిమా నగరంలోకి వస్తాడు. అతనికి నోరీకో కనపడుతుంది. ఇద్దరూ జనంతో పాటు పరుగెడుతూ వెళుతుంటారు. ఇంతలో సైన్యం వారు గాడ్జిల్లా మీద బాంబులతో దాడి చేస్తారు. అందరూ ఆగి చూస్తారు. గాడ్జిల్లా చావకపోగా మరింత బలపడుతుంది. దాని వీపు మీద కొత్త స్పైక్స్ పుట్టుకొస్తాయి. అది గర్జించి నోటిలో నుంచి కాంతిపుంజం వదులుతుంది. ఆ పుంజం దూరాన భూమిని తాకి పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. నగరం మొత్తం క్రమంగా నేలమట్టం అవుతుంది. విస్ఫోటనం ప్రభావం దగ్గరపడుతున్నపుడు నోరీకో షికిషిమాని ఒక సందులోకి తోసేయటంతో అతను బతికిపోతాడు. ఆమె మాత్రం ఆ ప్రభావానికి శిథిలాలతో పాటు విసిరివేయబడుతుంది. ఆ శిథిలాలలో కలిసిపోతుంది. షికిషిమా ఆక్రోశిస్తాడు. తర్వాత ‘నేను చేసినదానికి నాకు పడిన శిక్ష ఇదే’ అనుకుంటాడు. పాపతో ఒంటరిగా మిగులుతాడు.
గాడ్జిల్లాని అంతమొందించటానికి పూర్వసైనికులు సిద్ధమవుతారు. షికిషిమాతో మందుగుండ్లు నాశనం చేయటానికి వెళ్ళిన నోడా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాడ్జిల్లాని అంతమొందించటానికి ఒక ప్రణాళిక వేస్తాడు. నీటిలో తేలుతున్న ఏ వస్తువైనా ఎక్కువ బుడగలు మధ్య చిక్కుకుంటే ఆ ఒత్తిడికి మునిగిపోతుంది. అలాగే సముద్రంలో గాడ్జిల్లా చుట్టూ పెద్ద గ్యాస్ సిలిండర్లు పెట్టి వాటిని పేలిస్తే అది పెద్ద బుడగల్లో చిక్కుకుని వేగంగా మునిగిపోతుంది. సముద్రంలో కిందకి వెళ్ళిన కొద్దీ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడికి గాడ్జిల్లా పేలిపోతుందని నోడా అంచనా. ఒకవేళ అది బతికినా సముద్రం అడుగున ఒక పెద్ద రబ్బరు బుడగలోకి ఒక్కసారిగా గాలి పంపి దాన్ని అదాటున పైకి పంపాలని మరో ప్రత్యామ్నాయ పథకం వేస్తారు. ఒత్తిడి ఒక్కసారిగా తగ్గటంతో అది తనలోకి తానే కుంగిపోతుందని మరో అంచనా. ఈ పథకానికి శాస్త్రవిజ్ఞానం కూడా అనుకూలంగా ఉంటుంది.
షికిషిమా మొదట ఒప్పుకోడు. దీని అర్థం అతను రాజీ పడిపోయాడు. ‘గాడ్జిల్లాని చంపటం సాధ్యం కాదు. నా తప్పులకి శిక్ష పడింది. ఇక రాజీపడి బతుకుతాను’ అనుకుంటాడు. కానీ నోడా అతన్ని బతిమాలుతాడు. షికిషిమా అయిష్టంగానే ఒప్పుకుంటాడు. తనకో యుద్ధవిమానం కావాలని నోడాని అడుగుతాడు. “యుద్ధవిమానంతో గాడ్జిల్లాని దృష్టిని ఆకర్షించి దాన్ని సముద్రం లోతుగా ఉన్న చోటికి తీసుకొస్తాను” అంటాడు. అతను పని చేసిన పడవ కెప్టెన్ “అంతేనా లేక చావటానికి ఇది నువ్వు ఎంచుకున్న మార్గమా? నోరీకో చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని నీ ఆలోచనలా ఉంది. అలాంటప్పుడు ఆమె చావకముందే ఆమెని ఎందుకు పెళ్ళి చేసుకోలేదు?” అని అతన్ని నిలదీస్తాడు. ఆ సహచరుడికి షికిషిమా కథ తెలియదు. షికిషిమా అంతఃశత్రువుల (Inner demons) తో పోరాడుతున్నాడు. తన మీద తనకే నమ్మకం లేదు. ఆ సహచరుడితో “నా వల్ల కాలేదు. నా యుద్ధం ఇంకా ముగిసిపోలేదు” అంటాడు. అంతఃశత్రువులతో చేసే యుద్ధం కన్నా పెద్ద యుద్ధం ఏముంటుంది? బయటి యుద్ధంలో ధైర్యంగా ఉంటే లోపలి యుద్ధం తీవ్రత తగ్గుతుంది. జీవనపోరాటం కూడా ఒక యుద్ధమే. మానవప్రయత్నం ఉండాలి. భయపడితే ఏమీ సాధించలేం. ఇక్కడ ఇంకో విషయం. కెప్టెన్ షికిషిమాని “నోరీకోని ఎందుకు పెళ్ళి చేసుకోలేదు” అని అడగటం జపాన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. భారతీయ సంస్కృతికి ఇది కాస్త దగ్గరగా ఉంటుంది. ప్ర్రాచ్య దేశాలలో పై అధికారులు ఉద్యోగులకి కుటుంబవిషయాల్లో కూడా సలహాలు ఇస్తారు. ఇంటిలో ఏదైనా పార్టీ జరిగితే పై అధికారుల్ని ఆహ్వానించటం చూస్తూ ఉంటాం. పాశ్చాత్య దేశాలలో ఇలాంటివి తక్కువ. ఎవరి జీవితం వారిదే. అది మంచిది, ఇది చెడ్డది అనలేం. సంస్కృతి ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అర్థం చేసుకుని సర్దుకుపోవటమే.
నోడా షికిషిమా కోసం ఒక యుద్ధవిమానాన్ని ఏర్పాటు చేస్తాడు. కానీ అది కొత్త తరహా విమానం. యుద్ధం చివరిలో దాన్ని తయారు చేశారు. ఎప్పుడూ వాడలేదు. రెండేళ్ళుగా మూలపడి ఉంది. దాన్ని బాగుచేయాలి. ఒక మంచి మెకానిక్ కావాలి. షికిషిమా తాచిబానా కోసం వెతుకుతాడు. అతని ఆచూకీ దొరకదు. షికిషిమా ఒక పథకం వేస్తాడు. తాచిబానా పూర్వం పని చేసిన దళం వివరాలు కనుక్కుని వారికి ఉత్తరాలు రాస్తాడు. ఆ ఉత్తరాలలో “ద్వీపం మీద మెకానిక్కులు మరణించటానికి తాచిబానాయే కారణం” అని రాస్తాడు! అతనికి తెలుసు, ఇలా అయితే తాచిబానా తనని వెతుక్కుంటూ వస్తాడని. హిందీలో ఒక సామెత ఉంది. ‘సీధీ ఉంగ్లీ సే ఘీ న నిక్లే తో ఉంగ్లీ టేఢీ కర్నీ పడ్తీ హై’ అని. వేలు నిటారుగా పెట్టి నెయ్యి గిన్నెలో నుంచి నెయ్యి తియ్యలేకపోతే వేరు కాస్త వంకర చేయాలి. షికిషిమా అదే చేశాడు. తాచిబానా ప్రతిష్ట మీద దాడి చేస్తే అతను ఊరుకోడు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఒక్కోసారి ఒక మనిషి చేసిన పని తప్పుగా అనిపించవచ్చు. కానీ ఉద్దేశం మంచిదై ఉండవచ్చు. ఇక్కడ షికిషిమా వల్ల తాచిబానా పరువు పోయింది. కానీ అతని పరువు కన్నా దేశక్షేమం బృహత్తరమైనది. ఏ పనికైనా ఉద్దేశం పరిశీలించాలి. ఉద్దేశం మంచిదైనా ఫలితం చెడుగా ఉండవచ్చు. అప్పుడు శిక్ష కఠినంగా ఉండకూడదు. ఉద్దేశం చెడ్డదైతేనే దండించాలి. తాచిబానా వస్తాడు. చీకట్లో షికిషిమా మీద దాడి చేస్తాడు. షికిషిమా తన ఉద్దేశమేంటో చెబుతాడు. గాడ్జిల్లా మీద కలిసి దాడి చేద్దామంటాడు. తాచిబానా మెత్తబడడు. “నీకు నేనెందుకు సాయం చేయాలి?” అంటాడు. షికిషిమా “గాడ్జిల్లా బాహ్యశరీరం మీద దాడి చేస్తే దానికి హాని జరగదు. దాని నోట్లో నేను మందుగుండు పేలిస్తే దాని దవడ గాయపడింది. మనం యుద్ధవిమానంలో బాంబులు పెట్టి దాని నోట్లోకి వెళ్ళి పేలిస్తే అది కచ్చితంగా చచ్చిపోతుంది” అంటాడు. అంటే ఆత్మాహుతి దాడి అన్నమాట. ఈ రకంగా షికిషిమా తాను చేసిన రెండు తప్పులని ఒకేసారి కడిగేసుకోవాలనుకుంటాడు. తాచిబానా కూడా అపరాధభావంతో ఉన్నాడు. అతని సహచరులందరూ అతని కళ్ళ ముందే మరణించారు. అతనికీ గాడ్జిల్లా మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది. షికిషిమా ప్రాణాలని పణంగా పెట్టటానికి సిద్ధపడటం అతన్ని కదిలిస్తుంది. అతను ఒప్పుకుంటాడు. పతాక సన్నివేశాలు థ్రిల్లింగ్ గా ఉంటాయని వేరే చెప్పక్కరలేదు. కానీ ఇక్కడ అదొక్కటే లక్ష్యంగా దర్శకుడు పెట్టుకోలేదు. చివర్లో భావోద్వేగాలు ఉప్పొంగేలా చిత్రాన్ని మలిచాడు. గాడ్జిల్లా కథతో భావోద్వేగాల కథని మిళితం చేసి అందించిన దర్శకుడు ఎంతైనా అభినందనీయుడు.
ఈ సినిమా ప్రీమియర్ షో చూసాను. మంచి ఎమోషన్లు కలుపుతారు బ్లాక్‌బస్టర్ కథలకు జాపనీయులు, కొరియన్లు. గాడ్జిల్లా (గోజీరా – జాపనీయులు పిలిచే విధానం) అంటే అమెరికా ఒకరకంగా. అమెరికన్ల ఆధిపత్యాన్ని జాపనీయులు ఎదుర్కుంటం, ఎదుర్కోలేక సర్దుకుంటం. అమెరికన్లకు గాడ్జిల్లా ఒక మాన్స్టర్. ఒక బ్లాక్‌బస్టర్ కాలక్షేపం సినిమా కోసం. ఈ సినిమా అమెరికాలో బాగా ఆడుతున్నా గాడ్జిల్లా x కాంగ్ రాబోతోందని త్వరగా థియేటర్ల నుంచీ తీసేసారు. మనవైపు ఆసియా సినిమాలు అంత ఆడవు. ఏళ్ళ కొద్దీ టొరెంట్ లలో, తరువాత స్ట్రీమింగ్ లో చూడటం అలవాటయ్యి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మల్లంపల్లి సోమశేఖరశర్మగారి జీవితం విజ్ఞానానికి వెలుగుబాట!
జీవన రమణీయం-78
సరికి సరి – పై వాడి లెక్క!!
ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారికి ‘సాహితీ కిరణం’ పురస్కారం
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-33
జ్ఞాపకాల పందిరి-180
మా బావి కథ-2
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-49
నాకొక కథ చెప్పవూ!
మా కిష్టం – మా కిష్టం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®