Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 93: స్టిల్ ఆలిస్

[సంచిక పాఠకుల కోసం ‘స్టిల్ ఆలిస్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

వృద్ధాప్యంలో వ్యాధులు రావటం సహజం. అయితే కొన్ని వ్యాధులు భయంకరంగా ఉంటాయి. అందులో ఆల్జీమర్స్ ఒకటి. ఇతరులను గుర్తుపట్టలేకపోవటమే కాదు, తామెవరో కూడా గుర్తుండకపోవటం ఈ వ్యాధి లక్షణం. పరమాత్మ ఎరుకతో అన్నీ మరచిపోతే పరవాలేదు. కానీ పరమాత్మ మీద మనసు లగ్నం కాక తమను తాము కూడా మరచిపోతే ఎలా ఉంటుందో ఊహించటానికే భయం వేస్తుంది. ఇక అనుభవించేవారి వేదన గురించి చెప్పనక్కరలేదు. అలాంటి ఒక స్త్రీ కథే ‘స్టిల్ ఆలిస్’ (2014). ఆలిస్ ఆ స్త్రీ పేరు. ‘స్టిల్’ అంటే ‘చలనం లేని’ అని ఒక అర్థం. ‘స్టిల్ వాటర్’ అంటే ‘చలనం లేని నీరు’. జ్ఞాపకాలేమీ లేకపోతే మెదడులో చలనం ఉండదు. కానీ తెలియని అలజడి ఉంటుంది. ‘స్టిల్’ అంటే మరో అర్థం ‘ఇప్పటికీ’ అని. జ్ఞాపకాలు లేకపోతే ఆ మనిషి ఉనికి లేనట్టేనా? ఇతరులకి ఆమె ఇప్పటికీ పాత మనిషే కదా? భర్త, పిల్లల జ్ఞాపకాల్లో ఆమె ఇంకా ఉంది కదా? అందుకే ఆమె ఎప్పటికీ ఆలిస్సే. ఆమెది ఒక నరకమైతే, కుటుంబానిది మరో నరకం. ఇలాంటి అన్ని కోణాలని స్పృశించిన చిత్రం ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

ఆలిస్ న్యూయార్క్ నగరంలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర ప్రొఫెసర్. వయసు యాభై. ఆమె భర్త జాన్ డాక్టరు. అతను విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఆసుపత్రిలో పని చేస్తాడు. వారికి ముగ్గురు పిల్లలు. ఆనా, టామ్, లిడియా. ఆనా లాయరు. టామ్ మెడిసిన్ చదువుతున్నాడు. లిడియా నాటకాల్లో నటించే నటి. ఆనాకి పెళ్ళయింది. టామ్ పలువురు అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. లిడియాకి తన నటనావృత్తి అంటే చాలా ఇష్టం. మిగతా అందరూ న్యూయార్క్‌లో ఉంటే లిడియా కాలిఫోర్నియాలో ఉంటుంది. తూర్పు పడమర అన్నమాట. ఆలిస్ ఒక ప్రసంగం ఇవ్వటానికి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి వెళుతుంది. ప్రసంగంలో ఆమె ఒక పదం మర్చిపోతుంది. కష్టమ్మీద గుర్తుతెచ్చుకుంటుంది. ఎందుకలా జరిగిందా అని ఆలోచిస్తుంది కానీ పెద్దగా పట్టించుకోదు. లిడియాని కలుసుకుంటుంది. లిడియా పని చేసే నాటకాల కంపెనీకి జాన్ ఆర్థిక సాయం చేస్తాడు. లాభాల్లో లిడియాకి వాటా ఉంటుంది. జాన్ ఈ విషయం ఆలిస్‌కి చెప్పానంటాడు కానీ అమెకి గుర్తు లేదు. ఆలిస్ లిడియాని పై చదువులు చదువుకుని డిగ్రీ తెచ్చుకోమంటుంది. “నాకు నచ్చినది నేను చేస్తున్నాను” అంటుంది లిడియా. “డబ్బు పెట్టేది ఎవరు?” అంటుంది ఆలిస్. “ఆనాకి, టామ్‌కి పై చదువులకి సాయం చేశారుగా?” అంటుంది లిడియా. “అవి నిజమైన వృత్తులు. నీకు కూడా వేరే మార్గాలు ఉండాలి” అంటుంది ఆలిస్. “నా మార్గాలు నువ్వే నిర్ణయిస్తావా?” అంటుంది లిడియా. ఆలిస్ వాదించటం ఇష్టం లేక వెనక్కి తగ్గుతుంది. ఇది పెద్దలకీ, పిల్లలకీ ఎప్పుడూ ఉండే ఘర్షణే. తప్పటడుగు వేయనంత వరకు పిల్లల ఆకాంక్షలను గౌరవించటమే మంచిది. వారి భవిష్యత్తు గురించి చింత పడకూడదు. పిల్లల్ని కనగలం కానీ వారి తలరాతలని కనలేం.

కాలిఫోర్నియా నుంచి తిరిగి వచ్చి ఆలిస్ తన క్యాంపస్‌లో రన్నింగ్ చేయటానికి వెళుతుంది. వ్యాయామం కోసం ఇలా వెళ్ళటం మామూలే. అయితే కాసేపటికి ఆమె తాను ఎక్కడున్నానో మర్చిపోతుంది. చుట్టూ జనం, భవనాలు ఉంటాయి కానీ ఆమెకి దారి తెలియదు. కాసేపటికి తేరుకుని ఇంటికి చేరుకుంటుంది. భర్తకి ఈ విషయం చెప్పదు. భర్త తనకి చెప్పకుండా ఒక నాటకాల కంపెనీకి సాయం చేస్తున్నాడనే కోపం ఒక పక్క. ఎందుకైనా మంచిదని డాక్టర్ దగ్గరకి వెళుతుంది. డాక్టర్‌కి తన మతిమరపు గురించి చెబుతుంది. తనకి మెదడులో కణితి ఉందేమో అంటుంది. అతను ఆమె జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాడు. ఒక వ్యక్తి పేరు, అడ్రసు చెబుతాడు. ఆమె కొద్దిసేపటికి కింద అడ్రసు మర్చిపోతుంది. డాక్టర్ ఆమె కుటుంబ నేపథ్యం గురించి అడుగుతాడు. ఆమె తండ్రి లివర్ సిరోసిస్‌తో మరణించాడని, ఆఖరి దశలో మతిలేని స్థితిలో ఉండేవాడని చెబుతుంది. తనకి తండ్రితో సత్సంబంధాలు ఉండేవి కావని చెబుతుంది. డాక్టర్ ఆమెకి మెదడులో పుండ్లు ఏమైనా పడ్డాయేమో చూడటానికి ఎమ్మారై తీయించుకోమంటాడు. వ్యాయామం బాగా చేయమంటాడు, నీళ్ళు బాగా తాగమంటాడు. వ్యాయామం, నీళ్ళు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అందరూ ఎంతో కొంత వ్యాయామం చేయాలి. నడకైనా మంచిదే. గాంధీజీ “నడక వ్యాయామాలకి రాజు” అనేవారు. వ్యాయామం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మెదడుకి కూడా మంచిది. అలాగే నీళ్ళు బాగా తాగాలి. ఈ మాత్రం కూడా చేయకపోతే వృద్ధాప్యంలో సమస్యలు తప్పవు. అయితే ఆలిస్ విషయం వేరు. ఆమె వ్యాయామం చేస్తుంది. మరి సమస్య ఏమిటి? అది తర్వాత తెలుస్తుంది.

క్రిస్మస్‌కి అందరూ వస్తారు. టామ్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకువస్తాడు. ఆలిస్ ఆమెతో “నేను ఆలిస్. నువ్వొచ్చినందుకు సంతోషంగా ఉంది” అంటుంది. మళ్ళీ భోజనాల దగ్గర ఆమెతో అదే మాట అంటుంది. రెండో సారి పరిచయం చేసుకునే సరికి ఆమెకి వింతగా ఉంటుంది. లిడియా ఇది గమనిస్తుంది. ఆలిస్ కొన్ని రెసిపీలు కూడా మర్చిపోతుంది. ఒక్కోసారి చేసిన పనే మళ్ళీ చేస్తుంది. డాక్టర్ ఎమ్మారై బాగానే ఉంది కానీ పెట్ స్కాన్ చేయించుకోమంటాడు. ఆల్జీమర్స్ లక్షణాలు ఉన్నాయంటాడు. ఆల్జీమర్స్ సాధారణంగా డెబ్భై ఏళ్ళు దాటాక వస్తుంది. కానీ కొందరికి ముందుగానే రావచ్చు. ఆలిస్ భయంతో జాన్‌కి చెబుతుంది. అతను “ఏం కాదులే” అంటే ఆమె “నా మెదడు చచ్చుబడిపోతుందనిపిస్తోంది. నువ్వు వినవేంటి?” అని విలపిస్తుంది. అతను సముదాయిస్తాడు. డాక్టర్ ఆమె స్కాన్ ఫలితాలు, లక్షణాలని బట్టి ఆమెది ఎర్లీ ఆన్సెట్ (ముందే ప్రారంభమైన) ఆల్జీమర్స్ అని తేలుస్తాడు. ఈ వ్యాధికి చికిత్స లేదు. మందులు కాస్త ఉపశమనం ఇస్తాయంతే. నిబంధనల ప్రకారం ఆలిస్‌కి జన్యు పరీక్షలు చేస్తే ఆమెకి ఈ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చిందని తెలుస్తుంది. ఆమె తండ్రి నుంచి సంక్రమించింది. ఇది చాలా అరుదుగా జరుతుంది. ఇక్కడ మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే వ్యాధి ఆమె పిల్లలకి సంక్రమించవచ్చు. ఒకవేళ ఆ జన్యువు ఆమె పిల్లల్లో ఎవరికైనా ఉంటే వారికి కూడా ఆ వ్యాధి తప్పక వస్తుంది! అప్పటి దాకా ఎక్కువ కంగారు పడని జాన్‌లో ఈ మాట విన్నాక ఆందోళన ప్రవేశిస్తుంది. అది కోపం రూపంలో బయటికొస్తుంది. ఆలిస్ మీద కోపం కాదు. తమకే ఎందుకు జరిగిందని కోపం. దీనికి సమాధానం లేదు. వ్యాధులు ఎందుకొస్తాయి? ఆహారవిహారాల్లో క్రమశిక్షణ లేకపోతే వస్తాయి. కానీ కొందరికి ఎంత క్రమశిక్షణతో ఉన్నా వస్తాయి. అది కర్మఫలం. అనుభవించక తప్పదు. నాకెందుకో ఆల్జీమర్స్ అంటే ఆ వ్యక్తికి కాక కుటుంబానికి కర్మఫలం అనిపించింది. కర్మఫలమే కాక పరీక్ష కూడా. క్యాన్సర్ లాంటి వ్యాధి ఉంటే కుటుంబం కన్నా ఆ వ్యక్తి ఎక్కువ బాధపడుతుంది. కానీ ఆల్జీమర్స్ ఉంటే ఆ వ్యక్తికి కొంత కాలానికి ఏమీ తెలియదు. కుటుంబం వారు మాత్రం ఆమె తమని గుర్తు పట్టకపోతే బాధపడాలి, ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ పక్క వేదన, ఓ పక్క బాధ్యత. ఈ బాధ్యతని ఎవరు బాగా నిర్వర్తిస్తారో వారు ఉన్నతులు.

ఆలిస్, జాన్ తమ పిల్లలకి విషయం చెబుతారు. విషాదం ఏమిటంటే ఆమెకి వ్యాధి ఉందని చెప్పటమే కాక పిల్లలకి కూడా రావచ్చని చెప్పాల్సి రావటం. జాన్ పిల్లలతో “మీరందరూ జన్యు పరీక్ష చేయించుకోవచ్చు. చేయించుకోవాలో వద్దో మీ ఇష్టం” అంటాడు. ఆలిస్ కన్నీళ్ళతో “నన్ను క్షమించండి” అంటుంది. ఆమె తప్పు లేదు. అయినా ‘నా పిల్లలయినందువల్లే కదా వీరికి ఈ కష్టం’ అనిపించటం సహజం. మనకి జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. ఎవరి వల్లో జరిగిందని అనిపిస్తుంది కానీ నిజానికి అది జరగాలి కాబట్టి జరిగింది. అవతలి వారు నిమిత్తమాత్రులు. ఇక్కడ ఆలిస్ ది దోషమని ఎలా అనలేమో అక్కడ కూడా అవతలి వారి దోషం లేదని తెలుసుకుంటే స్థిమితంగా ఉండగలం. ‘పైకి కనిపిస్తోంది కదా, దోషం లేదని ఎలా అనగలం’ అనుకోవటం సహజం. రామాయణంలో మంథర చేసింది తప్పు అనిపించవచ్చు. కానీ రాముడు అరణ్యవాసం రాసిపెట్టి ఉంది కాబట్టి తప్పదు అనుకున్నాడు. మంథరని ఏమీ అనవద్దు అన్నాడు. అది జ్ఞానుల లక్షణం. ఆ స్థాయి చేరుకోవటం చాలా కష్టం. కానీ ప్రయత్నం చేయటమే మన కర్తవ్యం. మానవప్రయత్నానికి భగవంతుడు సంతోషిస్తాడు. ఆనా, టామ్ పరీక్షలు చేయించుకుంటారు. లిడియా చేయించుకోదు. ఆనాకి వ్యాధి యొక్క జన్యువు ఉందని, టామ్‌కి లేదని తెలుస్తుంది. అంటే ఆనాకి తప్పకుండా వ్యాధి వస్తుంది. ఆమె గర్భధారణ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ పిండాలకి కూడా పరీక్షలు చేయించాల్సిన పరిస్థితి. ఆనాలో ఎక్కడో తల్లి మీద కోపం ఉన్నట్టు అనిపిస్తుంది. విధి ఎంత విచిత్రమైనది! లిడియా ఎందుకు పరీక్ష చేయించుకోలేదు? జరగాల్సింది ఎలాగూ జరుగుతుంది. ముందు తెలుసుకుని ఏం లాభం, అనవసరంగా తల్లిని బాధపెట్టటం తప్పితే? ఆ పరిపక్వత లిడియాకి ఉంది. మిగతావారికి లేదు.

ఆలిస్ పాఠాలు సరిగా చెప్పలేకపోవటంతో విద్యార్థులు ఫిర్యాదు చేస్తారు. చివరికి ఆమె ఉద్యోగం పోతుంది. ఒక సందర్భంలో ఆలిస్ “నాకు క్యాన్సరన్నా వచ్చి ఉంటే బావుండేది. ఇంత సిగ్గుపడాల్సిన అవసరం ఉండేది కాదు. క్యాన్సర్ వచ్చినవాళ్ళ కోసం అందరూ విరాళాలు సేకరిస్తారు. నేనేమో బయటకు వెళ్ళటానికే భయపడాలి” అంటుంది. ఆమె ఆల్జీమర్స్ పేషెంట్స్ కోసం ఉద్దేశించిన కేంద్రానికి వెళుతుంది. పేషెంట్స్ అక్కడే నివసిస్తారు. అక్కడివారితో మాట్లాడేటపుడు ఆమె తన తండ్రి కోసం వచ్చానని అబద్ధం చెబుతుంది. సాధారణంగా ఇలాంటి కేంద్రాలలో అందరినీ కూర్చోబెట్టి ఆటలాడించటం లాంటివి చేస్తారు. అయితే ఆల్జీమర్స్ రోగులలో ఆ ఆటలు కలిగించే ఉత్తేజం అయోమయానికి, చివరికి విపరీతమైన ఆందోళనకి దారి తీస్తుంది. కాబట్టి వారిని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో విషయమేమిటంటే ఈ రోగం వచ్చినవారిలో ఉన్నత విద్యావంతులు ఎక్కువ! దానికి కారణమేంటో పరిశోధన జరగాలి. పని ఎక్కువ చేయటం వల్ల వస్తుందా లేక పోటీతత్వం వల్ల వస్తుందా లేక సమాజంలో గౌరవం నిలబెట్టుకోవటానికి పడే ఒత్తిడి వల్ల వస్తుందా? అయితే ఈ చిత్రం కేవలం ఆలిస్ గురించి కాదు. జాన్, పిల్లలు ఎలా స్పందిస్తారు అనేది కూడా ముఖ్యమే. ఇలాంటప్పుడే మనుషుల ప్రాథమ్యాలు తెలుస్తాయి.

లీసా జెనోవా రాసిన నవల ఆధారంగా రిచర్డ్ గ్లాట్జర్, వాష్ వెస్ట్ మోర్లండ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించారు. వేరే దర్శకులైతే సెంటిమెంట్ ఎక్కువ చూపించి ఉండేవారేమో. వీరు వాస్తవికతకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆలిస్‌గా జూలియాన్ మూర్ నటించింది. ఆస్కార్ గెలుచుకుంది. ఆమె ఈ పాత్రలో జీవించిందనే చెప్పాలి. వివిధ భావోద్వేగాలని అద్భుతంగా అభినయించింది. జాన్‌గా ఆలెక్ బాల్డ్విన్, లిడియాగా క్రిస్టెన్ స్టువర్ట్ నటించారు. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే మంచితనాన్ని చూపించే లిడియా పాత్రలో క్రిస్టెన్ చాలా బాగా నటించింది. ‘ట్వైలైట్’ సీరీస్ చిత్రాలతో పేరు తెచ్చుకున్నా ఆమె తర్వాత మంచి పాత్రలు చేసింది. ఆమెకి 2021లో ‘స్పెన్సర్’ చిత్రానికి ఆస్కార్ నామినేషన్ వచ్చింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఆలిస్ తన ఫోన్లో కొన్ని ప్రశ్నలు రాసుకుంటుంది. ‘నువ్వుండే వీధి పేరు ఏమిటి?’, ‘నీ పెద్ద కూతురి పేరేమిటి?’ లాంటి ప్రశ్నలు. రోజూ ఆ ప్రశ్నలకి సమాధానాలివ్వాలి. ఆ ప్రశ్నలకి సమాధానాలివ్వలేని రోజు ల్యాప్‌టాప్‌లో బటర్‌ఫ్లై అనే ఫోల్డర్ తెరవమని ఫోన్లోనే రాసుకుంటుంది. ఆ ఫోల్డర్లో ఆలిస్ తనను తానే రికార్డ్ చేసుకున్న ఒక వీడియో పెడుతుంది. దాని సారాంశం “నువ్వు ఏ ప్రశ్నలకీ సమాధానం ఇవ్వలేకపోతున్నావు కాబట్టి తర్వాతి అడుగు ఇదే. నీ పడక గదిలో కప్ బోర్డులో పై అరలో వెనకాల ఒక సీసా ఉంటుంది. అందులో మాత్రలు ఉంటాయి. ఆ మాత్రలన్నీ వేసుకుని నీరు తాగి పడుకో. ఎవరికీ చెప్పకు” అని. అంటే ఆత్మహత్య చేసుకోవాలని ఆమె ముందే నిర్ణయించుకుంటుంది. ఆత్మహత్య చేసుకోవాలని కూడా తట్టని స్థితి వస్తుందని కూడా ఆమెకి తెలుసు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించని స్వభావం ఉంటే అది మంచిదే కదా? ఇతరులకి భారమౌతానని ఆమె భయం. ఇతరులకి భారమైతే వారే ఏ కేంద్రంలోనో చేర్పిస్తారు. ప్రాణం ఎందుకు తీసుకోవాలి? ఆత్మగౌరవం పోతుందని మరో భయం. ఆత్మగౌరవం అంటే ఏమిటో కూడా తెలియనపుడు పోతే ఏం? భారతీయులైతే ఇలా ఆలోచిస్తారేమో. వేదాంతం కొద్దో గొప్పో వంటబట్టింది కాబట్టి. క్లిష్ట పరిస్థితుల్లో పాశ్చాత్యుల ఆలోచనావిధానం నకారాత్మకంగానే ఉంటుంది. నిజానికి ఈ చిత్రంలో దైవం ప్రసక్తి రాకపోవటం నాకు విచిత్రంగా అనిపించింది. ఇంతకీ ఆమె ఆత్మహత్యకి ప్రయత్నిస్తుందా? అది అంత ముఖ్యం కాదు. సినిమా కాబట్టి కొంచెం ఉత్కంఠ ఉండాలని ఈ మెలిక పెట్టారు. అయితే సినిమాలో ఈ మెలిక కూడా విడిపోతుంది.

లిడియా ఆలిస్‌ని చూడటానికి వస్తుంది. ఆలిస్ అమెతో “కాలేజీకి వెళ్ళి చదువుకో. కావాలంటే డ్రామా కోర్సులో చేరు. ఒకవేళ నటిగా అవకాశాలు రాకపోతే పాఠాలు చెప్పుకోవచ్చు. నేను వెళ్ళే లోగా నీకో మార్గం ఏర్పడితే బావుంటుంది” అంటుంది. లిడియా “నీ పరిస్థితి చూపించి నువ్వు కోరిందల్లా చేయమంటే ఎలా? అది న్యాయం కాదు” అంటుంది. “నాకు న్యాయంగా ఉండాల్సిన పని లేదు. నేను నీ తల్లిని” అంటుందామె. ‘నా తృప్తి కోసం నువ్వు ఈ పని చెయ్యి’ అని పిల్లల్ని చాలా మంది తల్లులు బలవంతం చేస్తారు. ఆలిస్ కూడా అలాంటిదే. దీనికి కారణం మమకారం. మనిషి అహంకారమైనా వదులుకుంటాడేమో కానీ మమకారం వదులుకోవటం కష్టం. ‘నేను పోయేముందు మీరందరూ స్థిరపడాలి’ లాంటి కోరికలు అర్థం లేనివి. జరగాల్సినదేదో జరుగుతుంది. ఆలిస్ తనకి ఆల్జీమర్స్ వస్తుందని ఊహించిందా? అంత పెద్ద ప్రొఫెసరయినా చివరికి ఆమె పరిస్థితి ఏమయింది? అందుకే భవిష్యత్తుని నియంత్రించాలని ప్రయత్నించటం అవివేకం.

ఒకరోజు ఆలిస్ కాలక్షేపం కోసం లిడియా దగ్గరున్న నాటకాలలో ఒకటి చదవాలని ఆమె గదికి వెళుతుంది. అక్కడ లిడియా డైరీ ఉంటుంది. అదేమిటో తెలియని స్థితిలో ఆలిస్ ఆ డైరీ చదువుతుంది. అది తెలిసి లిడియా తన గోప్యతకి భంగం కలిగిందని ఆలిస్ మీద చిర్రుబుర్రులాడుతుంది. మర్నాడు ఆలిస్ లిడియాతో “నీకు కోపం వచ్చిందని గుర్తుంది కానీ ఎందుకో గుర్తు లేదు. ఏమైనా నన్ను మన్నించు” అంటుంది. లిడియా “కాదు నువ్వే నన్ను క్షమించాలి. నేను అతిగా ప్రవర్తించాను” అంటుంది. ఎప్పుడూ మన గురించే ఆలోచిస్తూ ఉంటే అసహనం తప్పదు. అవతలి వారి స్థానంలో ఉండి ఆలోచిస్తే కొన్నిసార్లు వారు తెలియక తప్పు చేశారని అర్థమవుతుంది. తర్వాత ఆల్జీమర్స్ సంఘంలో ప్రసంగం ఇవ్వటానికి ఆలిస్ ఒప్పుకుంటుంది. అయితే ఆమె తన అనుభవాలను పంచుకోవటానికి బదులు వ్యాధి గురించి జరుగుతున్న పరిశోధనల గురించి మాట్లాడాలని అనుకుంటుంది. ప్రసంగం రాసుకుని వీడియో కాల్లో లిడియాకి వినిపిస్తుంది. లిడియా “దీని బదులు నీ అనుభవాలని పంచుకోవచ్చు కదా?” అంటుంది. ఆలిస్‌కి రాయటం, చదవటం – ఈ ప్రక్రియ మొత్తం చాలా కష్టంగా ఉంటుంది. ఒకప్పుడు అలవోకగా పాఠాలు చెప్పింది. ఇప్పుడు చదవటమే కష్టంగా ఉంది. ఆమెకి విసుగు వస్తుంది. ఆ విసుగుని లిడియా మీద చూపిస్తుంది. ఇలా తల్లీకూతుళ్ళు ఒకరి మీద ఒకరు విసుగుపడుతూ ఉంటారు. చివరికి ఆలిస్ తన ప్రసంగాన్ని మారుస్తుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. అయితే ఆలిస్ ఆత్మహత్యాప్రయత్నం చేసిందా అనేది ప్రస్తావించలేదు. అయినా ముగింపు తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

తన ప్రసంగంలో ఆలిస్ ఎలిజబెత్ బిషప్ రాసిన కవిత ఉటంకిస్తుంది:

The art of losing isn’t hard to master

So many things seem filled with the intent to be lost

That their loss is no disaster

మర్చిపోవటం ఒక కళ. దానిలో ఆరితేరటం కష్టమేమీ కాదు.

చాలా విషయాల మూల లక్షణం లుప్తమైపోవటమే.

కాబట్టి అవి లుప్తమైపోవటం పెద్ద ఉపద్రవమేమీ కాదు.

జీవితం చివరి దశలో ఎంత మర్చిపోగలిగితే అంత మంచిది. లేకపోతే అదొక బరువైపోతుంది. కానీ ఆలిస్‌కి మర్చిపోవటం అసంకల్పితం. “నేను మర్చిపోవటమనే కళని రోజూ నేర్చుకుంటున్నాను. ఇతరులకి నేను హాస్యాస్పదంగా కనిపిస్తున్నాను. కానీ అది నా గుర్తింపు కాదు. అది నా వ్యాధి మాత్రమే. అన్ని వ్యాధులలాగే దీనికీ కారణం ఉంది, పరిణామక్రమం ఉంది, ఒకరోజు చికిత్స ఉంటుంది. మన భావితరం నాలాగ ఇబ్బంది పడకూడదని కోరుకుంటున్నాను. ఈలోగా ఈ మరపు అనే కళలో ఆరితేరుతున్నందుకు నన్ను నేను నిందించుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను” అంటుంది. విషాదమేమిటంటే ఆమె సంకల్పాలు కూడా ఆమెకి గుర్తుండవు. నడివయసు నుంచే మెదడు ఉత్తేజంగా ఉండే పనులు చేస్తే ఆల్జీమర్స్ రాదంటారు. క్రాస్ వర్డ్ (పదవినోదం), స్క్రాబుల్ (పదాలు పేర్చే ఆట) లాంటివి మెదడుని ఉత్తేజంగా ఉంచుతాయి. అయితే ఆలిస్‌కి వచ్చినది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. ఆమె నిజానికి తన ఫోన్‌లో స్క్రాబుల్ కూడా ఆడుతుంది. విధి ఒక్కోసారి చాలా కఠినంగా ఉంటుంది.

కొంతకాలం గడుస్తుంది. ఆనా కవలలకి జన్మనిస్తుంది. జాన్‌కి వేరే రాష్ట్రంలో పరిశోధన చేసే ఉద్యోగం వస్తుంది. అయితే ఆలిస్‌కి సొంత ఊరు వదిలి వెళ్ళటం ఇష్టం ఉండదు. జాన్ కూడా ఉన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండవచ్చు. కానీ డబ్బు అవసరాలు పెరిగాయి. ఆలిస్ కోసం ఒక ఆయాని పెట్టాడు. అతను ఆలిస్‌ని తనతో పాటు రావటానికి ఒప్పించాలని ప్రయత్నిస్తాడు. ఆమె వస్తే అతను ఆమెకి తోడుగా ఉంటాడు. కానీ కొన్నాళ్ళకి ఆమెకి అంత పెద్ద నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అతను వెళ్ళాలనే నిశ్చయించుకుంటాడు. లిడియా తల్లి కోసం న్యూయార్క్‌కి వచ్చేస్తుంది. న్యూయార్క్‌లో కూడా నాటకాలకి అవకాశాలు ఉంటాయి. ఆయా ఎలాగూ ఉంటుంది. లిడియా వచ్చాక జాన్‌తో మాట్లాడుతుంది. “నాకు అవకాశాల గురించి చింత లేదు. అమ్మ దగ్గర ఉండటమే ముఖ్యం” అంటుంది.

జాన్ “నువ్వు నాకన్నా ఉన్నతమైన దానివి” అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. “అమ్మని నేను చూసుకుంటానుగా” అని ఆమె అతన్ని సముదాయిస్తుంది. డబ్బూ అవసరమే. కానీ మనిషికి మనిషి తోడుగా ఉండటం ఇంకా అవసరం. అలాగని ఎవర్నీ వెంటనే తప్పుబట్టలేం. లిడియా తల్లితో అప్పుడప్పుడూ గొడవపడ్డా చివరికి ఆమే తల్లికి అండగా నిలిచింది. కళాకారులలో ఉండే గుణమిదే. కళ బంధాల విలువ నేర్పిస్తుంది. చివర్లో లిడియా తల్లికి ఓ కవిత చదివి వినిపించి “ఈ కవిత దేని గురించి?” అని అడుగుతుంది. స్మృతి పూర్తిగా క్షీణించినా “ప్రేమ గురించి” అని చెబుతుంది ఆలిస్. కళకున్న మరో శక్తి ఆత్మని తాకటం.

Exit mobile version