Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 88: జోరమ్

[సంచిక పాఠకుల కోసం ‘జోరమ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

హిందీ చిత్రం ‘జోరమ్’ 2023లో విడుదలయింది. అయితే పెద్దగా ప్రచారం రాలేదు. ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అభివృద్ధి పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలకి అద్దం పట్టే చిత్రమిది. అయితే పగ, ప్రతీకారం లాంటి అంశాలు కూడా ఉన్నాయి. ఎక్కడా బోరు కొట్టదు. దురదృష్టమేమిటంటే తెలుగు శబ్దానువాదం కానీ, సబ్ టైటిల్స్ కానీ లేవు. ఆంగ్లం సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఆదివాసీలు ప్రకృతిపై ఆధారపడి జీవిస్తారు. వారి మానాన వారిని వదిలేస్తే హాయిగా ఉంటారు. అడవుల్ని కాపాడతారు. కానీ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వారి భూముల్ని దోచుకుంటున్నారు. అది నచ్చని ఆదివాసీలు కొందరు మావోయిస్టులుగా మారుతున్నారు. మిగిలనవారు కూలీలుగా మారుతున్నారు. మొత్తానికి వారి జీవితాలు నాశనమవుతున్నాయి. నిజం చెప్పాలంటే ‘అవతార్’ మొదటి భాగంలో కథ ఇదే. పండోరా గ్రహం మీద ఖనిజాలు ఉన్నాయని భూగ్రహం మీది వ్యాపారస్థులు ఆ గ్రహాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తారు. ఆ గ్రహవాసులు తిరుగుబాటు చేస్తారు. అది ఫ్యాంటసీ చిత్రం కాబట్టి చివరికి వారు గెలుస్తారు. ‘జోరమ్’ వాస్తవికతకు అద్దం పట్టే చిత్రం. కఠోరమైన నిజాలు చూపించే చిత్రం.

దస్రూ, వానో ఝార్ఖండ్లో ఒక ఆదివాసీ జంట. వారి ముఖాల మీద పచ్చబొట్లు ఉంటాయి. ముక్కులకి, చెవులకి రింగులు ఉంటాయి. తలలో చాలా పిన్నులు ఉంటాయి. ఆమె చెట్టుకి కట్టిన ఉయ్యాల ఊగుతుంటే దస్రూ పాడుతూ ఉండగా చిత్రం మొదలవుతుంది. ఇద్దరూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఐదేళ్ళ తర్వాత వారిద్దరూ ముంబయిలో ఒక భవన నిర్మాణంలో కార్మికులుగా ఉంటారు. కట్టే భవనంలోనే ఒక అంతస్తులో రేకులు అడ్డుపెట్టుకుని నివస్తిస్తూ ఉంటారు. వారికో చంటి పాప. వారి జీవితం ఎందుకిలా అయింది? ఇది తర్వాత తెలుస్తుంది. ముంబయిలో ఒకరోజు ఝార్ఖండ్ నుంచి వచ్చిన ఫూలో కర్మా అనే ఎమ్మెల్యే భవన నిర్మాణం జరిగే చోట చీరలు, సోలార్ దీపాలు పంచి పెడుతుంది. ఆమె కూడా ఆదివాసీ స్త్రీయే. కట్టూబొట్టూ అలాగే ఉంటాయి. ఆమె దస్రూని గుర్తు పడుతుంది. అయితే దస్రూ బాలా అని పేరు మార్చుకున్నాడు. ఏమీ తెలియనట్టుంటాడు. ఆమె కూడా తెలియనట్టు ఉంటుంది. అతను ఆమెని చూసి జంకుతూ ఉంటాడు. ఆమెకి ఆతని మీద ఏదో అనుమానం ఉందని తెలిసిపోతూ ఉంటుంది. కొన్నాళ్ళకి దస్రూ ఇంటికి వచ్చేసరికి వానోని చంపేసి తలకిందులుగా వేలాడదీస్తారు కొందరు. వారు అతని మీద కూడా దాడి చేస్తారు. అతను ప్రతిఘటించి వారిని తరిమేస్తాడు. దుఃఖం ఉన్నా వానో శవాన్ని వదిలేసి బిడ్డని తీసుకుని పారిపోతాడు. ఫూలో భవనానికి కాస్త దూరంలో కారులో ఉంటుంది. ఆమె మనుషులే వానోని చంపారు. అసలు దస్రూని చంపాలని ఆమె పథకం. విషయమేమిటంటే దస్రూ ఒకప్పుడు మావోయిస్టు.

గతంలోకి వెళితే ప్రభుత్వం పేరు చెప్పి కొందరు వ్యక్తులు ఆదివాసీల భూమి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. “డబ్బు కూడా ఇస్తాం. మీ దగ్గర పత్రాలేమీ లేవు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేవు. ఇప్పుడు భూమి ఇవ్వకపోతే తర్వాత ఈ డబ్బు కూడా రాదు” అంటాడు అక్కడికొచ్చిన వ్యక్తి. అతనికి మాడ్వీ అనే ఒక ఆదివాసీ యువకుడు తోడుగా ఉంటాడు. “వాళ్ళకి కాస్త సమయం ఇవ్వండి” అంటాడు. దస్రూ “ఈ భూమి మాది” అంటాడు. తర్వాత భూమి కోసం పోరాడటానికి దస్రూ మావోయిస్టులలో చేరతాడు. వానో వద్దంటుంది కానీ వినడు. మాడ్వీ ఫూలో కొడుకు. ఫూలో అప్పట్లో సాధారణ గృహిణి లాగే ఉండేది. మాడ్వీ తండ్రితో “ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు. భూమీ పోతుంది. డబ్బూ రాదు” అంటాడు. అతను చెడ్డవాడని అనలేం. ఒక స్టీల్ కంపెనీ అక్కడి భూమిలో ఇనుము నిల్వలు ఉన్నాయని తెలిసి ఆ భూమిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మాడ్వీకి తెలుసు. రాజకీయనాయకుల అండదండలు వాళ్ళకి ఉన్నాయి. ఆదివాసీలు డబ్బు తీసుకుని ఎక్కడికైనా పోయి బతకొచ్చు కదా అని మాడ్వీ వాదన. ఫూలోకి ఇవేవీ తెలియదు. “ఊరికే వారిని ఒత్తిడి చేయకు” అంటుంది. “అమ్మా. వాళ్ళకి ఎలాంటి దుర్గతి పట్టబోతోందో వాళ్ళకి తెలియట్లేదు” అంటాడు మాడ్వీ. వాళ్ళని ఏదో రకంగా ఒప్పిస్తే వాళ్ళకే మంచిదని అతని ప్రయత్నం. తర్వాత ఏమైందనేది చిత్రంలో తర్వాత తెలుస్తుంది.

ప్రస్తుతానికి వస్తే దస్రూయే వానోని చంపాడని పోలీసులు అనుకుంటారు. రత్నాకర్ అనే ఎస్సై మీద దస్రూని పట్టుకోమని ఒత్తిడి ఉంటుంది. అతని ముఖంలో అలసట కనపడుతూ ఉంటుంది. అతను రెండు రోజులుగా ఇంటికి వెళ్ళలేదు. వేరే ఎస్సై అనారోగ్యంతో ఉంటే అతని బదులు డ్యూటీకి వచ్చాడు. నేరాలు చూసి చూసి అతని మనసు మొద్దుబారిపోయింది. డీజీపీ అతని మీద ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఫూలో ఒక టీవీ చానల్ కి పాత వీడియో ఒకటి పంపిస్తుంది. అందులో దస్రూ తుపాకీ పట్టుకుని ఉంటాడు. ఆ వీడియో ప్రసారమవుతుంది. దస్రూ మావోయిస్టని, జరిగినది ఉగ్రవాద దాడి అని ప్రచారమవుతుంది. ఫూలో పథకం పోలీసుల చేత దస్రూని పట్టించి రాజకీయంగా ఒత్తిడి చేసి దస్రూని తానే అంతమొందించాలని. దస్రూ రైల్వే స్టేషన్లో ఉన్నాడని సీసీటీవీ ద్వారా తెలుస్తుంది. పోలీసులు అక్కడకు వెళతారు. చంటి బిడ్డని వీపుకి కట్టుకుని దస్రూ రైల్లో వెళుతుంటాడు. పోలీసులు రైల్లో అతన్ని వెంబడిస్తారు. కానీ అతను తప్పించుకుంటాడు. చంటి బిడ్డకి ప్రమాదం లేకుండా అతను తప్పించుకోవటం నమ్మశక్యంగా ఉండదు. కానీ కథలో ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని మనం ఈ విషయాన్ని విస్మరించాలి. దస్రూ ఝార్ఖండ్ వెళుతున్నాడని రత్నాకర్ ఊహిస్తాడు. డీజీపీ అతన్ని ఝార్ఖండ్ వెళ్ళమంటాడు. దస్రూ తప్పించుకున్నాడని తెలిసి ఫూలో కూడా ఝార్ఖండ్ వెళుతుంది. అతను అక్కడికి వస్తాడని ఆమె కూడా ఊహిస్తుంది.

దస్రూ ఝార్ఖండ్ వెళుతున్నాడని అందరూ ఊహించటం విచిత్రంగా ఉంటుంది కానీ ఆలోచిస్తే అతనికి వేరే దారి లేదు అని అర్థమవుతుంది. ముంబయిలో ఉన్నా అతన్ని వెతికి వానోని చంపేశారని అతను అనుకున్నాడు. ఇక ఎక్కడికి వెళ్ళినా అతనికి భద్రత లేదు. కాబట్టి ఝార్ఖండ్ వెళ్ళి తన భార్యని చంపినవాళ్ళని కలుసుకోవాలని అతని ఆలోచన. కలుసుకుని ఏం చేస్తాడు? పగ తీర్చుకుంటాడా? నిజానికి అతని భార్యని చంపించింది ఫూలో. ఆమెకి నకలైట్లంటే అంత కోపం ఎందుకు? తన రాజకీయ ప్రయోజనాలకి అడ్డు వస్తున్నారనా? అసలు గృహిణిగా ఉన్న ఆమె రాజకీయాల్లోకి ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నల కన్నా ఆదివాసీల వెతలే ఇందులో ముఖ్యం. అందుకే హత్య ఎవరు చేయించారన్నది ప్రేక్షకులకి ముందే చెప్పేశాడు దర్శకుడు. చిత్రం పొడుగునా హంతకులు ఎవరు అనే విషయం మీద దృష్టి పెడితే అసలు విషయం పక్కదారి పడుతుంది.

మొదట్లో వానో ఉయ్యాలూగిన చెట్టు చివర్లో మళ్ళీ కనపడుతుంది. మోడుగా ఉంటుంది. చుట్టూ తవ్వకాలు జరుగుతుంటాయి. మరుభూమిలా ఉంటుంది. ఇది ఆదివాసీల జీవితాలకి ప్రతీక. వారి కథని చెప్పటానికి రచయిత, దర్శకుడు దేవాశిష్ మఖీజా ఒక హత్యా ఉదంతాన్ని ఆలంబనగా ఎంచుకున్నాడు. అది లేకపోతే చాలామంది చిత్రం చూడరు. ఇంతకీ ‘జోరమ్’ అంటే ఏమిటి? అది దస్రూ బిడ్డ పేరు. ఆడపిల్ల. ఆశకి, ప్రకృతికి ప్రతీక. దస్రూ ఝార్ఖండ్‌లో తన ప్రాంతానికి తిరిగి వెళతాడు. అక్కడ హై టెన్షన్ టవర్లు ఉంటాయి. దస్రూ నిద్ర పోతున్న జోరమ్ తో “ఇదే మన ఊరు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. నది కూడా ఉండేది. ఆనకట్ట కట్టి నదిని మళ్ళించినట్టున్నారు. మీ అమ్మ ఊరికి పోదాం, నదిలో స్నానం చేస్తాను అనేది. వానో, వచ్చేశాం చూడు” అంటాడు. ఇప్పుడు నది లేదు. ఊరు మాత్రం ఉంది కళ తప్పి. ఆనకట్ట కడితే సాధారణంగా ఇలాంటి ప్రాంతాల్లో ఊరు మునిగిపోతుంది. కానీ ఈ ఊళ్ళో ఇనుము నిల్వలు ఉన్నాయి కదా. అందుకని ఊరు మునగకుండా చూసుకున్నారు. పైగా నది ఎండిపోయేలా చేశారు. తవ్వకాలు చెయ్యాలి కదా. వ్యాపార లాభాల కోసం ఆదివాసీల భూముల్ని సొంతం చేసుకున్నారు. అభివృద్ధి పేరుతో నిజానికి జరిగేది దోపిడీయే. అందుకే మేధా పట్కర్ లాంటి ఉద్యమకారులు ఇలాంటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. అభివృద్ధి అంటే ఆధునికీకరణేనా? ప్రకృతితో మమేకమై జీవిస్తే ఏ అభివృద్ధీ అవసరం లేదు. అన్నీ ప్రకృతే ఇస్తుంది. మనిషి అవసరాలని తీరుస్తుంది. సమస్యల్లా అవసరాలని దాటి అత్యాశకి పోతేనే. దస్రూ తర్వాత కొంతమంది ఊరి వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు కూలిపనులకు వెళుతుంటారు. “ఇక్కడ ఇప్పుడు తిండి గింజలు కాదు, ఇనుము పండుతోంది” అంటారు వారు. “మీరెందుకు పోరాడటం లేదు?” అంటాడు దస్రూ. “పోరాడితే మనసు నిండుతుందేమో. పొట్ట నిండదుగా” అంటుందొకామె.

ఎస్సై రత్నాకర్ కూడా ఆ ఊరికి వస్తాడు. అతనికి యువ కానిస్టేబుల్ ముచాకీ సహాయకారుడు. ముచాకీ ఒక ఆదివాసి. మొబైల్ నెట్వర్క్ పనిచెయ్యటం లేదేంటని రత్నాకర్ అడిగితే ముచాకీ “ఇంతకు ముందు పని చేసేది. మావోయిస్టులు టవర్లు కూల్చేశారు” అంటాడు. “మరి కమ్యూనికేషన్ ఎలా?” అంటాడు రత్నాకర్. ముచాకీ కోపాన్ని అణచుకుంటూ “ఉన్నంతలో ఏదో చేసుకుంటున్నాం” అంటాడు. ముంబయి నుంచి వచ్చి రత్నాకర్ తమని చులకనగా చూస్తున్నాడని అతని భావన. రత్నాకర్‌కి నిజంగానే అక్కడికి రావటం ఇష్టం లేదు. ఇలా అందరూ ఏదో అసంతృప్తితో ఉంటారు. మావోయిస్టులు, ఫూలోతో సహా. బాగుపడేది మాత్రం ఇనుము తవ్వకాలు చేస్తున్న స్టీల్ కంపెనీ. రత్నాకర్ మినరల్ వాటర్ కొనుక్కుంటానంటే బోరు నీళ్ళు తాగమంటాడు ముచాకీ. “ఇవీ మినరల్ వాటరే. ఉచితం కూడానూ” అంటాడు. నిజమే కదా. కుళాయిలో వచ్చిన నీళ్ళు ఎలాంటి పైపుల నుంచి వస్తాయో తెలియదు. కానీ బోరు నీళ్ళు నేరుగా భూమి నుంచి వస్తాయి. అంతకంటే మంచి మినరల్ వాటర్ ఏముంటుంది? ముచాకీ రత్నాకర్ని పోలీస్ స్టేషన్‌కి మోటార్ సైకిల్ మీద తీసుకువస్తుంటాడు. దారిలో రోడ్డు వేస్తూ ఉంటారు. అక్కడ కొందరు ఆదివాసీలు నిరసన గీతాలు పాడుతూ ఉంటారు. “మా అడవుల జోలికి రావద్దు. మా భూముల జోలికి రావద్దు. మా నదుల జోలికి రావద్దు. ఆనకట్టలు కడతారు, నదులెండబెడతారు. గనులు తవ్వుతారు, భూమిని నాశనం చేస్తారు. రోడ్లేస్తారు, చెట్లు కూలుస్తారు. మాకు ఆకలి, రోగాలు మిగులుస్తారు” అని పాడుతుంటారు. పాటకి ఎంతో శక్తి ఉంది. అందుకే విప్లవ గీతాలు రగిల్చే స్ఫూర్తికి ఏదీ సాటి రాదు. రత్నాకర్ నిరసనకారుల్ని దాటి పోవాలనే ఉద్దేశంతో ముచాకీతో “పక్క నుంచి పోదాం” అంటే అతను “ఆగాలి సర్. తప్పదు” అంటాడు. అతని గొంతులో అశక్తత కంటే నిరసనకారుల పట్ల సంఘీభావమే ఎక్కువ ఉంటుంది.

ఆ ఊరి ఎస్సై నిర్లిప్తంగా ఉంటాడు. “ఇక్కడందరూ మావోయిస్టులే. కాకపోతే సానుభూతిపరులే” అంటాడు. అక్కడి పోలీసులూ బతకనేర్చారు. ఏ ఎండకా గొడుగు పడతారు. రత్నాకర్ “దస్రూని పట్టుకోవటానికి కొందరు పోలీసులు కావాలి” అంటే అక్కడి ఎస్సై “మీ ముంబయి వాళ్ళకి అంతా తొందరే. అందుకే దస్రూ చిక్కినట్టే చిక్కి పారిపోయాడు” అంటాడు. రత్నాకర్ ఏం సమాధానం చెప్పగలడు? స్టేషన్లో కొందరు మైనర్ ఆదివాసీలని బందీలుగా ఉంచటం రత్నాకర్ చూస్తాడు. ఎందుకని అడిగితే “వారి దగ్గర విల్లు, బాణాలు ఉన్నాయి” అంటాడొక పోలీసు. “ఆదివాసీల దగ్గర విల్లూ బాణాలు ఉండటం మామూలే కదా” అంటాడు రత్నాకర్. “Armed unlawful assembly (ఆయుధాలతో గుమిగూడటం) కింద అరెస్టు చేశాం. పైనుంచి ఆదేశాలు వచ్చాయి. 144 సెక్షన్ పెట్టారు కదా” అంటాడు పోలీసు. ఇలా ఉంటాయి చట్టాలను అమలు చేసే విధానాలు. 144 సెక్షన్ అక్కడ ఎప్పటి నుంచో ఉంది. సమస్యని పరిష్కరించటం మానేసి ప్రజల సామాన్య హక్కులను హరిస్తున్నారన్నమాట. అసలు సమస్య పరిష్కరించాలనే ఉద్దేశం లేదు. ఎందుకంటే స్టీల్ కంపెనీ రాజకీయనాయకులకి ‘విరాళాలు’ ఇస్తుంది కదా.

దస్రూగా మనోజ్ బాజ్‌పాయ్, ఫూలో గా స్మితా తాంబే, రత్నాకర్‌గా మహమ్మద్ జీషన్ అయ్యుబ్, ముచాకీ గా జాకీ భవసర్ నటించారు. అందరూ మంచి నటులే. మనోజ్ బాజ్‌పాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. స్మితా తాంబే, జాకీ భవసర్‌ల నటన ఆకట్టుకుంటుంది. ఫూలో పాత్రలో స్మితా కళ్ళు గాజు కళ్ళలా ఉంటాయి. వాటిలో జీవం ఉండదు. కర్కశత్వం ఉంటుంది. ఈ పాత్రకి స్మితాకి సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఇక ముచాకీ పాత్రలో ఒక నిర్వేదం ఉంటుంది. అసలు తప్పు స్టీల్ కంపెనీది. ఆ తప్పు వల్ల ఆదివాసీలు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. కొందరు సాధారణ పౌరులు, కొందరు పోలీసులు, కొందరు మావోయిస్టులు, కొందరు రాజకీయనాయకులు. అన్ని వర్గాల్లోనూ ఆదివాసీలున్నారు. ఇది చూసి ముచాకీలో నిర్వేదం పుడుతుంది. రత్నాకర్ బయటి నుంచి వచ్చి తమని చులకనగా చూడటం అతనికి నచ్చదు. అయితే పరిస్థితులు చూసి రత్నాకర్ అన్యాయానికి వ్యతిరేకంగా తన వంతు కృషి చేయాలని అనుకుంటాడు. అప్పుడు ముచాకీ అతనికి సహకరిస్తాడు. ఇలా ముచాకీ పాత్ర ఎన్నో భావోద్వేగాలతో ఉంటుంది. జాకీ ఈ పాత్రని చక్కగా పోషించాడు. చిత్రంలో కొన్ని దృశ్యాలు ఆలోచింపజేస్తాయి. మావోయిస్టులు ఎవరినైనా శిక్షించాలంటే ఒక దుడ్డుకర్రకి చివర మేకులు కొట్టి దానితో కొడతారు. దస్రూ కూడా ఆ శిక్షల్లో సహకరిస్తాడు. అతను కూలీగా మారినపుడు పొయ్యిలోకి తెచ్చుకునే కట్టెల చివర కూడా మేకులుంటాయి. అవి భవన నిర్మాణంలో వాడిన కట్టెలు. ఆ మేకులు తీసి కట్టెలు పొయ్యిలో పెడతాడు. అతను హింసని వదిలేశాడని సంకేతంగా చూపించాడు దర్శకుడు. కానీ అతని జీవితం మాత్రం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంటుంది.

ఈ క్రింద చిత్రకథ మరి కొంచెం ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునే వారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. ఈ వ్యాసంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. చిత్రం చూసే అవకాశం ఉన్నవారు ముందు చిత్రం చూడండి.

దస్రూ తన స్నేహితుడిని కలుసుకుంటాడు. “నేను దళం కమాండర్‌ని కలుసుకుని నన్ను వదిలేయమని అడుగుతాను. నేను కూడా లేకపోతే నా బిడ్డ ఎలా బతుకుతుంది? అయితే ఎక్కడా దళం ఆనవాళ్ళు కనబడటం లేదు” అంటాడు. వానోని తలకిందులుగా వేలాడదీసి చంపేశారని, అలా చేసేది మావోయిస్టులేనని అంటాడు. గతంలో ఫూలో కొడుకు మాడ్వీ మళ్ళీ మళ్ళీ ఊరివాళ్ళని భూమి కోసం ఒత్తిడి చేస్తుంటే మావోయిస్టులు అతన్ని శిక్షిస్తారు. జనం చూస్తుండగానే చెట్టుకి తలకిందులుగా వేలాడదీసి మేకులు కొట్టిన కర్రతో కొడతారు. తర్వాత మావోయిస్టు లీడరు జనంతో “వీడు మీ బాగు కోసం ఏమీ చేయట్లేదు. వీడికి కమీషన్ వస్తుంది. అందుకని మీ భూమి అమ్మమంటున్నాడు. ఎవరైనా మళ్ళీ ఇలా చేస్తే వదలం” అంటుంది. ఆ శిక్ష చూసి దస్రూ హింస వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. రాత్రికి రాత్రే వానోని తీసుకుని వెళ్ళిపోతాడు. తన బిడ్డ క్షేమం కోసం తిరిగి వచ్చాడు. దళం వారినందరినీ సీఆర్పీఎఫ్ వాళ్ళు చంపేశారని దస్రూ స్నేహితుడు చెబుతాడు.

దస్రూ జాడ ఫూలోకి తెలిసిపోతుంది. దస్రూ స్నేహితుడే ఉప్పు అందిస్తాడు. ఫూలో పోలీసులని వెళ్ళి దస్రూని చంపమంటుంది. రత్నాకర్ మాత్రం దస్రూని ప్రాణాలతోనే పట్టుకోవాలని అంటాడు. పోలీసులు చుట్టుముట్టేసరికి దస్రూ పారిపోతాడు. ఊరి ఎస్సై కాల్పులు జరపమంటాడు, రత్నాకర్ వద్దంటాడు. ఈ గందరగోళంలో దస్రూ మళ్ళీ తప్పించుకుంటాడు. రత్నాకర్‌ని పోలీసులందరూ ఏవగింపుతో చూస్తారు. ముచాకీ మాత్రం సానుభూతితో ఉంటాడు. రత్నాకర్‌కి అసలు సంగతి చెబుతాడు. మావోయిస్టులు శిక్షించటంతో మాడ్వీ చనిపోయాడు. ఛిద్రమైన అతని దేహాన్ని చూసి అతని తండ్రి గుండె ఆగి మరణించాడు. దాంతో ఫూలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది. మామూలు గృహిణి కాస్తా ఎమ్మెల్యే అయ్యి సంకీర్ణ ప్రభుత్వంలో చేరి మావోయిస్టులని మట్టుబెడుతుంది. ఇదంతా తన కుటుంబం నాశనమైనందుకు ప్రతీకారం. అనుకోకుండా దస్రూ కనపడ్డాడు. అతన్ని చంపితే గానీ ఆమె శాంతించదు. ఒక స్త్రీ పగ అలా ఉంటుంది. ఆమెకి మావోయిస్టుల సిద్ధాంతాలతో పని లేదు. ఇదంతా కాస్త నాటకీయంగా ఉంటుంది కానీ ఆదివాసీల మీద జరిగిన అన్యాయాలు ఎన్ని రకాలో కదా అనిపిస్తుంది. నిజానికి మాడ్వీది దురుద్దేశం కాదు. కానీ అతన్ని మావోయిస్టులు మట్టుబెట్టారు. వారిని ఫూలో తుదముట్టించింది. మావోయిస్టులు లేకపోవటంతో స్టీల్ కంపెనీ లాభపడింది. పిట్టా పిట్టా పోరులో పిల్లి లాభపడినట్టు. కొన్ని వ్యాపార సంస్థల స్వార్థం తలచుకుంటే కడుపు రగులుతుంది.

ఫూలోని నిర్దయురాలైన విలన్‌లా చూపించలేదు. రాజకీయాల్లో చేరాక ఒక సన్నివేశంలో ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. వంట తానే చేసుకుంటుంది. అయితే ఒంటరిగా తినటం ఇష్టం లేక బయటకి వచ్చి తన సహాయకురాల్ని తనతో భోజనం చేయమంటుంది. ఆ సహాయకురాలు ఇంట్లో తండ్రి ఎదురుచూస్తూ ఉంటాడని చెప్పి వెళ్ళిపోతుంది. ఎవరి కుటుంబం వారిది కదా. అలా ఫూలో పట్ల కూడా సానుభూతి చూపించాడు దర్శకుడు. చివరికి ఏం జరిగిందనేది ముఖ్యం కాదు. నిజానికి చివరికి నాటకీయత కాస్త ఎక్కువయిందనే చెప్పాలి. కానీ చిత్రం ఆసక్తికరంగా ఉండటానికి సస్పెన్స్ దోహదపడింది. అసలు చెప్పదలచుకున్న విషయం కూడా ప్రేక్షకులకి చేరింది. డాక్యుమెంటరీలా కాకుండా కాస్త ఉత్కంఠ జోడించి తీసిన ఇలాంటి సినిమాలు చూసినవాళ్ళకు బాగానే ఉంటాయి. కానీ చూసేవాళ్ళే తక్కువ. సగటు ప్రేక్షకుడు స్టార్ హీరోలు లేకపోతే సినిమా చూడడు కదా!

Exit mobile version