Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 44: క్యాట్‌ఫైట్

కాలేజీలో ఉన్నప్పుడు రకరకాల మనుషులు పరిచయమవుతారు. జీవితంలో ఎవరు ఏమనుకున్నా కాలేజీ స్నేహితుల ముందు మాత్రం పరువు పోకూడదని చాలామంది అనుకుంటారు. ఈ భావన హద్దు దాటితే ఎలా ఉంటుందో చూపించిన వ్యంగ్యాత్మక చిత్రం ‘క్యాట్‌ఫైట్’ (2016). క్యాట్‌ఫైట్ అంటే ఇద్దరు స్త్రీల మధ్య కొట్లాట. ఇది మాటల యుద్ధం కావచ్చు, జుట్టూ జుట్టూ పట్టుకోవటమూ కావచ్చు. ఈ చిత్రంలో ఇద్దరు కాలేజీ స్నేహితుల మధ్య వివాదం యుద్ధంలా మారిపోతుంది. అదే సమయంలో నిజంగానే యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం కారణంగా వారి జీవితాలు మారిపోతాయి. ఇలాంటి విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రం షాక్‌కి గురి చేసినా ఒక హెచ్చరికగా కూడా పని చేస్తుంది. తోటి మనుషులతో సామరస్యంగా ఉండాలనే సందేశం ఇస్తుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

వెరానికా ఒక సంపన్న మహిళ. న్యూయార్క్‌లో ఉంటుంది. ఆమె భర్త ఒక కాంట్రాక్టరు. వారికి కిప్ అనే ఒక కొడుకు. పదిహేనేళ్ళు. కిప్‌కి బొమ్మలు గీయటం ఇష్టం. అది వెరానికాకి నచ్చదు. “కాలేజీలో నాకొక స్నేహితురాలుండేది. బొమ్మలు గీసేది. తానేదో గొప్ప అన్నట్టు భావించేది. నువ్వేం చేసినా సరే కానీ ఈ బొమ్మలు గీయటం మానెయ్” అంటుంది. ఆమె భర్త కూడా కిప్ ని “బొమ్మలు గీయటం వల్ల ఉపయోగం ఏమిటి” అని అడుగుతాడు. కిప్‌కి చిత్రలేఖనం నేర్చుకోవాలని కోరిక. అది 2003వ సంవత్సరం. ఇరాక్ మీద అమెరికా యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో వ్యర్థాలను తొలగించే కాంట్రాక్టు వెరానికా భర్తకి వస్తుంది. “యుద్ధం ఎందుకు?” అని కిప్ అడిగితే “మన కంటే బలమైనవారు ఏమైనా చెబితే అది మనం వినాలి. ఎందుకంటే వారి మేధ వారిని బలవంతుల్ని చేసింది. అలాంటివారు చెప్పింది వినకపోతే యుద్ధాలొస్తాయి” అంటుంది వెరానికా. బలవంతులదే రాజ్యం అనే భావన ఇక్కడ కనపడుతుంది. బలం ఉంటే ఆధిపత్యం చెలాయించవచ్చు. అవతలివారికి వారి పద్ధతులు ఉన్నా వారు మన మాటే వినాలి. ఇలా ఉంటుంది ఆమె ధోరణి. అమెరికా ఈ ధోరణితోనే ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరిస్తూ ఉంటుంది. నిజానికి వెరానికా లోలోపల అసంతృప్తిగా ఉంటుంది. ఆమె కాలేజీ పూర్తి చేయలేదు. భర్త సంపాదన మీద బ్రతుకుతూ ఉంటుంది. అసంతృప్తిని దాచుకోవటానికి మద్యం కాస్త ఎక్కువగా పుచ్చుకుంటూ ఉంటుంది. పైకి మాత్రం అంతా బావున్నట్టు భేషజం. ఆమె ఇంట్లో ఓ పనిమనిషి ఉండటంతో ఇంటి పని కూడా చేయకుండా కాలం వెళ్ళదీస్తూ ఉంటుంది. ఆమె భర్తకి ఆమె మద్యం అలవాటుతో అసహనంగా ఉంటుంది.

బొమ్మలు గీస్తుంది అని వెరానికా చెప్పిన స్నేహితురాలు పేరు యాష్లీ. ఆమె ఇప్పుడు న్యూయార్క్‌లో ఒక చిన్న స్టూడియో పెట్టుకుని బొమ్మలు గీస్తూ ఉంటుంది. మనుషుల స్వార్థం, పైశాచికత్వం మీద బొమ్మలు గీస్తూ ఉంటుంది. అయితే ఆమె వేసిన పెయిటింగులు కొనేవారు తక్కువ. ఆమెకు లీసా అనే ప్రియురాలు ఉంటుంది. ఆమె కేటరింగ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. యాష్లీ తగినంత డబ్బు సంపాదించటం లేదని ఆమెకి అసంతృప్తి. యాష్లీ స్టూడియోలో ఒక అసిస్టెంట్ ఉంటుంది. ఆమె కొంచెం అమాయకంగా ఉంటుంది. ఆమెని యాష్లీ చేతకానిదానిలా చూస్తూ ఉంటుంది. ఒక కస్టమర్ ఆ అసిస్టెంట్ వేసే కుందేలు బొమ్మల్ని పొగిడితే యాష్లీకి చిరాకుగా ఉంటుంది. తనకు సరైన గుర్తింపు రాలేదని ఆమె అసంతృప్తితో ఉంటుంది. అందరికీ ఏదో ఒక అసంతృప్తి.

వెరానికా భర్త తన భాగస్వామి ఇంట్లో పార్టీకి వెరానికాని తీసుకుని వెళతాడు. అదొక ఆకాశహర్మ్యంలోని అపార్ట్మెంట్. ఆ పార్టీలో కేటరింగ్ చేసేది లీసా. యాష్లీని సాయం చేయమని బలవంతంగా తీసుకువస్తుంది. యాష్లీ అయిష్టంగానే వస్తుంది. మద్యం అందిస్తూ ఉంటుంది. వెరానికా మద్యం కోసం ఆమె దగ్గరకి వస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపడతారు. యాష్లీకి భూమి కుంగిపోయినట్టుంటుంది. తన పాత స్నేహితురాలి ఎదుట అలా మద్యం అందిస్తూ ఉండటంతో ఆమె పరువు పోయిందని ఆమె అనుకుంటుంది. వెరానికా తన వైభవాన్ని ప్రదర్శిస్తుంది. యాష్లీని కించపరుస్తూ మాట్లాడుతుంది. “ఈ కేటరింగ్ పని కాకుండా ఇంకేం చేస్తున్నావు?” అంటుంది. “పెళ్ళయిందా? మర్చేపోయాను. నీకు ఆడవాళ్ళంటే ఆకర్షణ కదా” అంటుంది. అప్పటికి అమెరికాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం కాలేదు. “ఇంకా ఆ బొమ్మల పని చేస్తున్నావా? అదే ఆ పెయింటింగు పని” అంటుంది. యాష్లీకి మెల్లగా కోపం వస్తుంది. “అవును. ఆ బొమ్మల పని ఇంకా చేస్తూనే ఉన్నాను” అంటుంది. “దాన్నే కొనసాగిస్తున్నావన్న మాట” అంటుంది వెరానికా. “కొనసాగించటమేమిటి? నా జీవితపు లక్ష్యం అది. అయినా.. ఎందుకులే” అంటుంది యాష్లీ అవమానభారంతో. యాష్లీకి ఇబ్బందిగా ఉందని పట్టించుకోకుండా “మా అబ్బాయికి కళాకారుడు కావాలని కోరిక. నేను వద్దంటున్నాను” అంటుంది వెరానికా. “ఎందుకు?” అంటుంది కాస్త కోపంగా యాష్లీ. “ఎందుకో నీకు తెలియదా?” అంటుంది వెరానికా. అంటే ‘నీ బతుకు చూసుకో. ఇలాంటి బతుకు నా కొడుక్కి రాకూడదు’ అని భావం. తానేమో భర్త సంపాదన మీద బతుకుతూ ఉంది. పైగా యాష్లీని చులకనగా మాట్లాడుతుంది. భర్త సంపాదన మీద బతకటం తప్పు కాదు. కానీ సొంత కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నించే వారిని కించపరచటం తప్పు.

యాష్లీ అవమానభారంతో అపార్ట్మెంట్ బయటకి వచ్చి మెట్లు ఉన్న చోట గంజాయి సిగరెట్ కాలుస్తూ ఉంటుంది. అందరూ లిఫ్ట్‌లో వెళతారు కాబట్టి మెట్ల దగ్గరకి ఎక్కువగా ఎవరూ వెళ్ళరు. వెరానికా ఎక్కువగా తాగటంతో ఆమె భర్తకి కోపం వస్తుంది. ఆమెని ఇంటికి వెళ్ళిపొమ్మంటాడు. తనకు విలువ లేదని తెలిసి ఆమె ఖిన్నురాలవుతుంది. లిఫ్ట్ వెంటనే రాకపోవటంతో అక్కడ ఉండలేక మెట్ల దగ్గరకి వస్తుంది. యాష్లీ గంజాయి తాగుతూ ఉండటంతో ఆమెని వెక్కిరిస్తుంది. మాటా మాటా పెరుగుతుంది. “నీ కొడుకు మీద నాకు జాలిగా ఉంది” అంటుంది యాష్లీ. దాంతో వెరానికా యాష్లీ ముఖం మీద పిడిగుద్దు గుద్దుతుంది. ఇద్దరూ బాహాబాహీకి దిగుతారు. ఈ సన్నివేశం చూసి ప్రేక్షకులు షాక్‌కి లోనవుతారు కానీ వారు తమలో గూడు కట్టుకున్న అసంతృప్తిని ముష్టిఘాతాలతో వెళ్ళగక్కుతున్నారనిపిస్తుంది. ఈ సన్నివేశం ఎంతో నైపుణ్యంతో తెరకెక్కించారు. ఇద్దరి ముఖాలు రక్తమోడుతూ ఉంటాయి. యాష్లీ పైచేయి సాధిస్తుంది. వెరానికాని కిందపడేసి ఆమె ముఖం మీద పిడిగుద్దులు కురిపిస్తుంది. వెరానికా కదలలేక ఉండిపోతుంది. యాష్లీ మెట్లు దిగి వెళ్ళిపోతుంది. వెరానికా లేచి నిలబడి తూలి మెట్లమీద నుంచి కింద పడిపోతుంది. స్పృహ కోల్పోతుంది. ఇక్కడ కథ ఒక్కసారిగా రెండేళ్ళ తర్వాతకి వెళుతుంది.

వెరానికా హాస్పిటల్లో కోమాలో ఉంటుంది. ఒకరోజు ఆమె కోమాలో నుంచి బయటకి వస్తుంది. ఆమె పనిమనిషి డోనా ఆమె గదిలో ఉంటుంది. డాక్టర్ వస్తాడు. ఆరోగ్య బీమా ముగియటంతో ఆమె బ్యాంక్ ఖాతాలోంచి డబ్బులు తీస్తున్నామని, అవి కూడా అయిపోయాయని అంటాడు. డోనా ఇంకా దారుణమైన విషయాలు చెబుతుంది. వెరానికా భర్త ప్రమాదవశాత్తూ తుపాకీ పేలటంతో మరణించాడు. వెరానికా కొడుకు కిప్ యుద్ధం చేయటానికి వెళ్ళి మరణించాడు. “అంత చిన్న వయసులో సైన్యంలో ఎలా చేరాడు?” అంటుంది వెరానికా. “పదహారేళ్ళకే సైన్యంలో చేరవచ్చని చట్టం వచ్చింది” అంటుంది డోనా. ఇది వాస్తవం కాదు. ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం ఎలా చట్టాలు చేస్తాయో వ్యంగ్యంగా చెప్పటం ఇక్కడ ఉద్దేశం. వెరానికా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. ఆమెని ఒక్కసారిగా భయం ఆవరిస్తుంది. పెద్దగా నవ్వుతుంది. “నువ్వు ఇన్నాళ్ళూ నా పక్కనే ఉన్నందుకు థ్యాంక్స్” అంటుంది డోనాతో. “నిజానికి నేను ఈ హాస్పిటల్లో పని చేస్తున్నాను. గదులు తుడిచే పని” అంటుంది డోనా. మరి యాష్లీ ఏమైంది? ఆమె పెయిటింగులు ఇప్పుడు బాగా అమ్ముడుపోతున్నాయి. యుద్ధం కారణంగా ఆమె వేసే చిత్రాలకు డిమాండు పెరిగింది. స్వార్థం, పైశాచికత్వం విషయాలుగా ఆమె చిత్రాలు పౌరుల మనఃస్థితికి దర్పణం పడుతుంటాయి. ఆమెని పోలీసులు పట్టుకోలేదా? పోలీసులు విచారణ చేసి ఉంటే ఆమె పట్టుబడేది. ఆమెకి కూడా గాయాలు అయ్యాయి కాబట్టి. అయితే లీసా బలవంతం మీద యాష్లీ కేటరింగ్‌కి వెళ్ళింది కాబట్టి లీసా ఆమెని దాచేసి ఉండొచ్చు. ఇది కాస్త నమ్మశక్యం కాని విషయమే. గట్టిగా విచారణ చేస్తే యాష్లీ దొరకకుండా ఉండదు. అయినా సినిమా కాబట్టి ఇలాంటి లోపాలు ఉంటూనే ఉంటాయి. మనుషుల స్వాభావాలను వ్యంగ్యంగా చూపించటమే ఈ చిత్రం ఉద్దేశం. పాలకుల స్వార్థాలు కూడా పౌరులను ప్రభావితం చేస్తాయి.

‘ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి’ అనే సామెత ఈ కథలో నిజమౌతుంది. వెరానికా ఉన్న ఆస్తినంతా కోల్పోతుంది. యాష్లీ తన పెయింటింగుల ద్వారా రెండు చేతులా సంపాదిస్తుంది. “యుద్ధం ద్వారా నువ్వు లాభపడుతున్నావు” అని ఆమె పాత కస్టమర్ అంటాడు. “అది నిజం కాదు. ఈ జాతి హృదయంలో గూడు కట్టుకున్న భీతిని చూపిస్తున్నానంతే” అంటుందామె. ఆ కస్టమర్ యాష్లీ అసిస్టంట్ వేసే కుందేలు బొమ్మలను మళ్ళీ పొగుడుతాడు. అతను తన కంటే తన అసిస్టెంట్‌ని మెచ్చుకోవటంతో ఆమె ఏదో సాకు చెప్పి తన అసిస్టెంట్‌ని అవమానిస్తుంది. ఎంత పేరొచ్చినా మనిషికి ఏదో అభద్రత. ఆ అభద్రతే మనిషికి శాపం. భౌతిక సుఖాలే పరమార్థమని అనుకుంటే ఇదే జరుగుతుంది. యాష్లీ వీర్యదానం ద్వారా గర్భం ధరిస్తుంది. లీసాకు గర్భం ధరించే అవకాశం లేకపోవటంతో యాష్లీ ఒప్పుకుంటుంది.

వెరానికా ఉండటానికి చోటు లేక తన పిన్నికి ఫోన్ చేస్తుంది. ఈ పిన్నికి చిత్తభ్రాంతి ఉంటుంది. భూమిని కాపాడుకోకపోతే త్వరలోనే భూమి బద్దలైపోతుందని ఆమె నమ్మకం. వెరానికా ఫోన్ చేసినపుడు కూడా ఆమె ఆ మాటే చెబుతూ ఉంటుంది. అలాంటి పిచ్చిదానితో ఉండలేనని వెరానికా ఫోన్ పెట్టేస్తుంది. ఆమెకి సాయం చేసే స్నేహితులు ఎవరూ లేరు. డోనా ఆమెని తన ఇంటికి తీసుకెళుతుంది. ఆమె సహృదయానికి వెరానికా కరిగిపోతుంది. “నువ్వు పనిమనిషిగా ఉన్నపుడు నీకు మేం సరైన జీతం ఇవ్వలేదు” అంటుంది. తన చుట్టూ ఉన్నవారి బాగోగులను కనిపెట్టుకునే మనిషి ఇలా పశ్చాత్తాపపడాల్సిన అవసరం రాదు. మనం ఎవరికో ఏదో చేయక్కరలేదు. మన మీద ఆధారపడిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇచ్చే చోట కొంచెం ఎక్కువ ఇవ్వాలి. తీసుకునే చోట కొంచెం తగ్గించి తీసుకోవాలి. చాలామంది దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. అదే వచ్చిన చిక్కు. డోనా కొడుకుని ప్రభుత్వం సైన్యంలో చేరమని ఆదేశించి యుద్ధానికి పంపించింది. అయితే కిప్ మాత్రం స్వచ్ఛందంగా సైన్యంలో చేరాడని డోనా చెబుతుంది. కిప్ యుద్ధంలో పోరాడుతూ అప్పుడప్పుడూ తల్లికి వీడియో ఉత్తరాలు పంపేవాడు. ఒక వీడియోలో “నాకు ఆర్ట్ కాలేజీలో ప్రవేశం దొరికింది. అయినా నువ్వు చెప్పినట్టు ప్రపంచానికి ఏదైనా చేయాలని నేను సైన్యంలో చేరుతున్నాను. కళ కన్నా శాంతి ముఖ్యం కదా” అంటాడు. అది చూసి వెరానికా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆమె, ఆమె భర్త యుద్ధాన్ని తేలిగ్గా తీసుకున్నారు. అది చూసి వారి బిడ్డ యుద్ధం సమంజసమే అనే భావంతో సైన్యంలో చేరాడు. ఇప్పుడు వెరానికాకి తాను చేసిన తప్పు తెలిసింది. బలంతో ఆధిపత్యం చేస్తే అది ఒక్కోసారి తిప్పికొడుతుంది. మనుషుల జీవితాల్లో ఇది ఎంత నిజమో దేశాల విషయంలో కూడా అంతే నిజం. ఉక్రెయిన్ మీద రష్యా సులభంగా విజయం సాధించొచ్చు అనుకుంది. ఏడాది దాటినా విజయం మాత్రం దక్కలేదు. ఒకరోజు వెరానికాకి యాష్లీ ముఖచిత్రంతో ఒక పత్రిక కనపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.

ఈ చిత్రానికి ఓనుర్ టుకెల్ దర్శకత్వం వహించాడు. వెరానికాగా శాండ్రా ఓ, యాష్లీగా యాన్ హేష్ నటించారు. ఇద్దరూ పోటీ పడి నటించారు. సహాయ పాత్రలలో నటించిన నటులు కూడా ఆకట్టుకుంటారు. ఎక్కడా బోరు కొట్టకుండా ఈ చితాన్ని దర్శకుడు నడిపించిన తీరు అబ్బురపరుస్తుంది. చిన్న చిన్న సన్నివేశాలలో మనుషుల ప్రవృత్తులపై సునిశితమైన విమర్శ చేస్తాడు. వెరానికా ఒక హోటల్‌లో గదులు శుభ్రం చేసే పనిలో చేరుతుంది. అక్కడ ఒక గదిలో ఆమెకి యాష్లీ ముఖచిత్రం ఉన్న పత్రిక కనపడుతుంది. ఆ పత్రికని ఆమె తీసుకుని వెళుతుంటే ఆ గదిలో ఉన్నతను గదికి వస్తూ చూస్తాడు. “నా పత్రిక ఎందుకు తీసుకున్నావు?” అంటాడు. ఆమె బుకాయించటానికి ప్రయత్నిస్తుంది కానీ దొరికిపోతుంది. “ఇంకో ప్రతి కొనుక్కునే స్తోమత నీకు ఉంది కదా” అంటుంది. ఏ పరిస్థితిలోనూ ఇతరుల వస్తువులు తీసుకోకూడదు. ఇది తెలిసి కూడా ఆమె అతనితో వాదిస్తుంది. పట్టుబడితే మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ చిన్న సన్నివేశంలో చూపించారు. ఇంకో సన్నివేశంలో వెరానికా ఒక లాడ్జిలో గది తీసుకుంటుంది. రెసెప్షన్లో పనిచేసే అతనితో దురుసుగా ప్రవర్తిస్తుంది. అతను చెవిటివాడు అని తెలిసి చిన్నబుచ్చుకుంటుంది. ఏ పనీ చిన్నది కాదు. ఎవరినీ మనం చిన్నచూపు చూడకూడదు. యాష్లీ కేటరింగ్‌కి వచ్చినపుడు ఆ పని చిన్నతనంగా భావిస్తుంది. లీసాతో “నేను గంభీరమైన పెయింటింగులు వేయటం మానేస్తాను. పువ్వులు చిత్రిస్తాను. డబ్బు సంపాదిస్తాను. ఈ పని మాత్రం చేయను” అంటుంది. తనకు అవమానం అని భావించే పరిస్థితిలో మనిషి తన సిద్ధాంతాలను కూడా వదిలేస్తాడు. యాష్లీకి గోరుచుట్టు మీద రోకటిపోటులా అప్పుడే వెరానికా తారసపడుతుంది. ఇదే కథని పెద్ద మలుపు తిప్పుతుంది. చిత్రంలో తర్వాత వచ్చే ఒక సన్నివేశంలో వెరానికా పిన్ని తాను తన ఇంటి దగ్గర ఉన్న చెట్లకు పేర్లు పెట్టానని అంటుంది. “వాడు బెర్నీ. మంచివాడు. స్థిరంగా ఉంటాడు. ఇది హిల్లరీ. దృఢంగా ఉంటుంది కానీ నమ్మదగింది కాదు. వీడు డొనాల్డ్. పెద్ద వెధవ” అంటుంది. ఈ పేర్లన్నీ 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏదో ఒక సమయంలో పోటీ చేసిన వారివే. పూర్తి పేర్లేంటో మీరు గ్రహించే ఉంటారు!

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు మరో హెచ్చరిక ఉంటుంది.

వెరానికాకి డోనా ఇంటిలో ఉండలేని పరిస్థితి వస్తుంది. ఆమె గత్యంతరం లేక తన పిన్ని ఇంటికి వెళ్ళటానికి బస్ టికెట్ కొంటుంది. అయితే యాష్లీ చిత్ర ప్రదర్శన గురించి తెలిసి అక్కడికి వెళుతుంది. అక్కడ ఒక పెయింటింగులో వెరానికాని కొట్టినపుడు ఆమె ముఖం ఎలా ఉందో చిత్రించబడి ఉంటుంది. అది చూసి వెరానికాకి కోపం కట్టెలు తెంచుకుంటుంది. అక్కడున్న పెయిటింగులని చెల్లాచెదురు చేసి ఆ పెయింటింగు పట్టుకుని బయటకి పారిపోతుంది. యాష్లీ ఆమెని వెంబడిస్తుంది. ప్రదర్శనకి వచ్చినవాళ్ళు ఇదంతా ప్రదర్శనలో భాగమనుకుని చప్పట్లు కొడతారు! ఒక మెకానిక్ షెడ్డు దగ్గర ఇద్దరూ మళ్ళీ కలియబడతారు. పిడిగుద్దులు గుద్దుకుంటారు. సుత్తితో ఒకరు, రెంచీతో ఒకరు దాడి చేస్తారు. ఈసారి వెరానికాది పైచేయి అవుతుంది. కింద పడిన యాష్లీని వదిలేసి వెళ్ళిపోతుంది. తూలుతున్న యాష్లీ తల మీద ఒక సిమెంట్ దిమ్మ పడటంతో ఆమె కోమాలోకి వెళుతుంది! రెండేళ్ళు కోమాలో ఉండిపోతుంది.

యాష్లీ లేచేసరికి ఆమె అసిస్టెంట్ శాలీ అక్కడ ఉంటుంది. అయితే శాలీ ఇప్పుడు ఆమె అసిస్టెంట్ కాదు. ఆమె కుందేలు బొమ్మలతో ఒక కామిక్ బుక్ విడుదల చేసింది. దానికి ప్రపంచ ప్రఖ్యాతి వస్తుంది. హాలీవుడ్ వాళ్ళు హక్కులు కొని సినిమా తీసే ప్రయత్నాలలో ఉంటారు. హాస్పిటల్లో పిల్లల వార్డులో కామిక్ బుక్స్ పంచటానికి వచ్చింది. యాష్లీని చూసి పోదామని ఆమె గదిలోకి వచ్చింది. యాష్లీకి గర్భం పోయింది. ఉన్న డబ్బంతా హాస్పిటల్ ఖర్చులకి అయిపోయింది. లీసా ఆమెని వదిలేసి వెళ్ళిపోయింది. శాలీ ఆమెని తనతో తీసుకువెళుతుంది. తన స్టూడియోలో బొమ్మలు వేసుకోమని అంటుంది. అయితే యాష్లీకి బొమ్మలు వేయటం సాధ్యం కాదు. రెండేళ్ళు కోమాలో ఉండటంతో ఆ చేతుల్లో పట్టు ఉండదు. ఒకరోజు లీసా ఆమెని చూడటానికి వస్తుంది. ఆమె వస్తువులు కొన్ని తెచ్చి ఇస్తుంది. ఒక చిన్న బాబుని ఎత్తుకుని వస్తుంది. తన బిడ్డే అంటుంది. “నువ్వు కోమా నుంచి లేస్తావో లేదో తెలియలేదు” అంటుంది. అర్థం చేసుకున్నానంటుంది యాష్లీ. “నా దగ్గర డబ్బు అయిపోయింది. ఇప్పుడు కూడా నా దగ్గర డబ్బు లేదు. కానీ నాకో తోడు దొరికింది” అంటుంది లీసా. ఎవరామె అంటుంది యాష్లీ. “ఆమె కాదు, అతను” అంటుంది లీసా. ఇదంతా చూస్తే లీసా తాను గర్భం ధరించే అవకాశం లేదని చెప్పటం అబద్ధం అనిపిస్తుంది. ఆమె ఒకరకంగా యాష్లీని మోసం చేసింది. ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం ఆమెకి మాత్రమే తెలియాలి. కొందరు మనుషులు సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నామనుకుని వింత పోకడలు పోతారు. ఎదురుదెబ్బలు తగిలాక వారికి భయం పుడుతుంది. సంఘం వేసిన బాటలోకే వెళ్లిపోతారు. లీసా ఎప్పుడైనా వెళ్ళిపోవటానికి దారులు తెరిచి ఉంచుకుంది. అందుకే యాష్లీని గర్భం ధరించమని అడిగింది.

శాలీ యాష్లీకి ఎందుకు సాయం చేసింది? ఇదే మాట యాష్లీ అడుగుతుంది. “నీ పట్ల దారుణంగా ప్రవర్తించాను” అంటుంది. “నీ ప్రవర్తన వల్ల నాకు కసి పెరిగింది. ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే అదో ఆనందం” అంటుంది శాలీ. అందరూ డోనాలా ఉండరు. మనం బాధపడుతుంటే చూసి ఆనందించేవాళ్ళూ ఉంటారు. యాష్లీకి ప్రపంచం మీద కసి పెరుగుతుంది. లీసా ఇచ్చిన వస్తువుల్లో ఒక బస్ టికెట్ ఉంటుంది. అది వెరానికాది అని ఆమెకి అర్థమవుతుంది. యాష్లీ ప్రదర్శనకి వచ్చినపుడు వెరానికా టికెట్ అక్కడ పడిపోయింది. వెరానికా తన పిన్ని ఇంట్లో ఉంటుంది. అదో నిర్జన ప్రదేశంలో ఉండే ఇల్లు. చుట్టూ చెట్లు ఉంటాయి. వెరానికా పిన్నికి ఆ చెట్లంటే ప్రేమ. ప్రభుత్వమంటే గిట్టదు. భూమి నాశనం కాబోతోందని ఆమె భయపడుతూ ఉంటుంది. వెరానికా ఆమెని అంటిపెట్టుకుని ఉంటుంది. అప్పుడే యాష్లీ అక్కడికి వస్తుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

యాష్లీ వెరానికాతో “నిన్ను నాశనం చేయటానికి వచ్చాను” అంటుంది. వెరానికా ప్రశాంతంగా ఉంటుంది. “ముందు ఏమన్నా తిందువు గానీ రా” అంటుంది. యాష్లీ కోసం ఆమ్లెట్ చేసి పెడుతుంది. ఇద్దరూ మాటల్లో పడతారు. “కిప్‌ని సైన్యంలో చేరకుండా ఆపి ఉండేదాన్ని. కానీ కోమాలో ఉండిపోయాను” అంటుంది వెరానికా. “ఆ యుద్ధం సక్రమం కాదని నీ అభిప్రాయమా?” అంటుంది యాష్లీ. “సక్రమమా అక్రమమా అని నేను ఆలోచించలేదు. కానీ యుద్ధం వల్ల మాకు డబ్బు బాగా వచ్చింది” అంటుంది. “యుద్ధం వల్లే నాకు చిత్రకారిణిగా పేరు వచ్చింది” అంటుంది యాష్లీ. తర్వాత వెరానికా కిప్ వీడియోలని యాష్లీకి చూపిస్తుంది. వీడియో కెమెరాలో ఉన్న స్క్రీన్ మీద ఇద్దరూ ఆ వీడియోలు చూస్తారు. యాష్లీ చేయి తగలటంతో గ్లాసులో నీళ్ళు ఒలికి ఆ కెమరా మీద పడతాయి. కెమెరా పాడవుతుంది. “నా బిడ్డని మళ్ళీ చంపేశావు” అని వెరానికా యాష్లీ మీదకి దూకుతుంది. ఇద్దరూ ఇంటి బయట పడి కొట్టుకుంటారు. ఇంతలో కెమెరా రీబూట్ అవుతుంది. అది పాడవలేదు, రీబూట్ అవటానికి సమయం పట్టిందంతే. బయట వెరానికా, యాష్లీ కొట్టుకుంటూనే ఉంటారు. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.

ఏవో అపోహలతో మనుషులు, దేశాలు ఎప్పుడూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూనే ఉంటారు. ఒక్కోసారి ఆ అపోహలు అబద్ధాలవుతాయి. ఇరాక్ దగ్గర మానవ హనన ఆయుధాలు ఉన్నాయని సాకు చెప్పి అమెరికా దాడి చేసింది. చివరికి అది అబద్ధమని తేలింది. ఉక్రెయిన్ తన మీద దాడికి ఆయత్తమవుతోందని రష్యా ముందే దాడి చేసింది. అది ఎంతవరకు నిజమో ఇంకా తేలలేదు. నీ తప్పు అంటే నీ తప్పు అని కొట్టుకోవటమే అలవాటుగా మారింది. అసలు తప్పే లేకపోవచ్చు. సామరస్యంగా ఉంటే తగాదా పడే అవసరం రాకపోవచ్చు. లేకపోతే అనవసరంగా జీవితాలు పాడవుతాయి. కిప్ వీడియోలు చూస్తే ఈ విషయం తెలుస్తుంది. అతను యుద్ధంలో చేరాక మళ్ళీ పెయింటింగ్ మొదలుపెడతాడు. కొన్నాళ్ళకి ఒక అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె ఇరాకీ అమ్మాయి. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. ఇంతలో ఒక పెద్ద దాడి జరుగుతుంది. అందులో అతను చనిపోతాడు. అతను చనిపోవటానికి ఎవరు కారణం? అతన్ని పెయిటింగులు మానేయమన్న వెరానికాదా? అతను సైన్యంలో చేరే సమయానికి అతని తల్లి కోమాలో ఉండేలా కొట్టిన యాష్లీదా? లేక ఊహాజనిత కారణాలతో యుద్ధం చేసే దేశాలదా? ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పగలరు?

Exit mobile version