Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 132: ది అసిస్టెంట్

[సంచిక పాఠకుల కోసం ‘ది అసిస్టెంట్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

2017లో హార్వీ వైన్‌స్టీన్ అనే హాలీవుడ్ నిర్మాత ఎందరో సినీతారలని లైంగికంగా వేధించాడనే వార్తలు గుప్పుమన్నాయి. అప్పుడు ‘మీ టూ’ (నేను సైతం) అనే ఉద్యమం మొదలయింది. సినీ, టీవీరంగాల్లో లైంగిక వేధింపులకి గురయిన వారు బయటకి వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీంతో చాలా కంపెనీలు కొత్త నియమావళి రూపొందించాయి. ముఖ్యంగా మానవ వనరుల విభాగం ప్రాముఖ్యం పెరిగింది. ఎవరైనా వేధింపులకు గురైతే ఆ విభాగానికి తెలియజేయాలి. వారు విచారణ చేసి న్యాయం చేస్తారు. కానీ ఒకేసారి మార్పు వచ్చేసిందనుకుంటే పొరపాటే. మార్పు అంత తేలిక కాదు. ఇందులో చాలా సూక్ష్మమైన అంశాలు ఉంటాయి. అలాంటి అంశాలని చూపించిన చిత్రం ‘ది అసిస్టెంట్’ (2020). ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. కథలో సింహభాగం ఒక అఫీసులో నడుస్తుంది కాబట్టి కాస్త నెమ్మదిగా సాగినట్టు ఉంటుంది. కానీ కథనంలో పట్టు ఎక్కడా సడలదు.

జేన్ ఒక సినిమా నిర్మాణ సంస్థలో కొత్తగా చేరిన అసిస్టెంట్. ఆమె బాస్ ఆ సంస్థలో ఒక నిర్మాత. నిర్మాత అనగానే డబ్బులు పెట్టే వ్యక్తి అనుకోవద్దు. హాలీవుడ్‌లో నిర్మాత అంటే సంస్థ నిధులని వినియోగించి చిత్రాలు నిర్మించే వ్యక్తి. అతను బాగా పలుకుబడి ఉన్న నిర్మాత. అమెరికా అధ్యక్షుడి పేరు మీద వైట్ హౌస్‌లో జరిగే విందుకి ఆహ్వానం అందుకేనంత పలుకుబడి ఉంది. దాన్ని బట్టి అతను మంచివాడు అవటం అటుంచి చెడ్డవాడయ్యే అవకాశాలే ఈ రోజుల్లో ఎక్కువ! జేన్ చీకటితోనే లేచి ఆఫీసుకి వెళుతుంది. ఆమె అన్ని రకాల పనులూ చేస్తుంది. బాస్ గదిలో అన్నీ శుభ్రంగా ఉంచటం దగ్గర నుంచి, అతనికి వచ్చిన స్క్రిప్టులు (స్క్రీన్‌ప్లేలు) చదవటం వరకు అన్ని పనులూ చేస్తుంది. కొత్త అసిస్టెంట్ కదా అని మిగతా ఉద్యోగులు ఆమెకి చెప్పకుండానే పనులు చేయించుకుంటారు. బాస్ మీటింగుల్లో వాడబడిన పింగాణీ పళ్ళేలు ఆమె ప్యాంట్రీలో కడుగుతుండగా అక్కడికి వచ్చిన ఒక ఉద్యోగిని టీ కప్పు వదిలేసి పోతే ఆమె కడుగుతుంది. ఈమె కొంచెం నెమ్మదస్తురాలు కావటం వారికి ఇంకా అలుసు. ఆమె బాస్‌కి ఇంకా ఇద్దరు మగ అసిస్టెంట్లు ఉంటారు. వాళ్ళు సీనియర్ అసిస్టెంట్లు! జేన్ జూనియర్ కాబట్టి చిన్న పనులన్నీ ఆమే చెయ్యాలి. పైగా ఆడది కదా! సీనియర్ అసిస్టెంట్లు ఆడవారు ఉంటారేమో కానీ జూనియర్ అసిస్టెంట్లు ఎప్పుడూ మగవారు ఉండరు. అదేంటో?

కథంతా ఒక సోమవారం రోజు జరుగుతుంది. గడిచిన వారాంతం కూడా జేన్ అఫీసుకి వచ్చింది. వారాంతంలో సీనియర్ అసిస్టెంట్ల పని కూడా ఆమె చేసింది. సినిమా సంస్థ కదా, పని ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. చిన్న పనులు బాగా చేస్తే కొన్నాళ్ళకి నిర్మాణానికి సంబంధించిన పనులు ఇస్తారని ఆమె ఆశ. సృజనాత్మక రంగానికి, వ్యాపారాత్మక రంగానికి వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా సినిమా రంగంలో ఎక్కువే. అయితే ఉద్యోగంలో చేరిన కొత్తలో పని కాస్త ఎక్కువ ఉండటం పెద్ద అన్యాయమేమీ కాదు. కానీ దేనికైనా హద్దు ఉండాలి. జేన్ తల్లికి ఫోన్ చేస్తే “నిన్న నాన్న పుట్టినరోజు” అంటుంది. జేన్ తన తండ్రి పుట్టినరోజు మరచిపోయింది. పాశ్చాత్య దేశాలలో పిల్లలతో పాటు పెద్దల పుట్టినరోజులూ ముఖ్యమైనవే. జేన్ తన పొరపాటుకి నొచ్చుకుంటుంది.

ఆఫీసులో అన్నీ సవ్యంగా ఉన్నాయని చూసుకుని జేన్ అల్పాహారం తింటుంది. ఆమె తినేది ఫ్రూట్ లూప్స్. ఇది చిన్నపిల్లలు తినే ఆహారం. ఆమెలో ఇంకా బాల్యపు అమాయకత్వం ఉందనే సూచన ఇక్కడ ఉంది. అయితే ఆమెకి ప్రపంచం పోకడ తెలియనిదేమీ కాదు. బాస్ గదిలో కింద ఆమెకి ఒక చెవి రింగు కనపడుతుంది. అది అక్కడ ఎందుకు పడిందో తెలియనంత అమాయకురాలు కాదు ఆమె. ఆ చెవి రింగుని తీసి తన టేబుల్ సొరుగులో పెడుతుంది. తర్వాత ఆ చెవి రింగు సొంతదారైన యువనటి వచ్చి దాన్ని తీసుకుపోతుంది. ఆ యువనటిలో కొంచెం కలవరం, కొంచెం సిగ్గు కనపడుతుంది. ఏదో అడగబోతుంది కానీ ఏం అనకుండానే వెళ్ళిపోతుంది. క్రితం వారం తనకి బాస్ ఆఫీసు గదిలో ఒక హెయిర్ బ్యాండ్ దొరికిందని జేన్ తర్వాత ఒక వ్యక్తికి చెబుతుంది.

ఆఫీసులో మగవారు చాలామంది బాస్ గురించి గుసగుసలాడుతూ ఉంటారు. ఆడవారు కొంతమంది వేరే విభాగంలోకి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటారు. ఇదంతా జేన్ గమనిస్తుంది. ఆమెకి ఇంకో తలనొప్పి బాస్ భార్య. బాస్ భార్య ఫోన్ చేస్తే మగ అసిస్టెంట్ ఎత్తుతాడు కానీ జేన్‌ని మాట్లాడమని ఆమెకి బదిలీ చేస్తాడు. ఇదో రకం పైశాచికత్వం. బాస్ భార్య “అతను నా క్రెడిట్ కార్డులన్నీ రద్దు చేశాడు” అంటుంది. జేన్ “నేను బ్యాంక్ వారితో మాట్లాడతాను. ఎక్కడో పొరపాటు జరిగింది” అంటుంది. “బ్యాంక్ కాదు, అతనే చేస్తున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడు? నన్నిలా చులకన చేసే హక్కు అతనికి లేదు” అని బాస్ భార్య ఫోన్ పెట్టేస్తుంది. జేన్ అవస్థ చూసి మగ అసిస్టెంట్ వంకరగా చిరునవ్వు నవ్వుతాడు. కాసేపటికి బాస్ ఫోన్ చేస్తాడు.

“ఆమె దగ్గర ఏం చెత్త వాగుడు వాగావు? ఆమెకి ఉన్నవీ లేనివీ చెప్పటం నీ పని కాదు. పాత అమ్మాయి పనికిమాలినదనుకున్నాను, నువ్వు ఆమెని మించిపోయావు. నువ్వు తెలివైనదానివని చెప్పారు. నువ్వు సలాడ్లు ఆర్డర్ చేయటానికి తప్ప దేనికీ పనికి రావు” అంటాడు బాస్. జేన్ సారీ చెప్పగానే ఫోన్ పెట్టేస్తాడు. ఆమెకి తల తీసేసినట్టు ఉంటుంది. బాస్ భార్య బాస్‌కి ‘నీ అసిస్టెంట్ నువ్వే క్రెడిట్ కార్డులు రద్దు చేశావని చెప్పింది’ అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇంతకీ బాస్ విడాకులకి సిద్ధమవుతున్నాడన్నమాట. అసలే ధనవంతుడు. తన డబ్బుని జాగ్రత్త చేసుకోకపోతే భార్య భరణం కింద పట్టుకుపోతుందిగా! మధ్యలో జేన్ ఇరుకునపడింది. ఉరుము ఉరిమి మంగలం మీద పడిందన్నట్టు అతను ఆమెని తిట్టాడు.

జేన్ అవమానాన్ని దిగమింగి బాస్‌కి క్షమాపణ చెబుతూ ఒక ఈమెయిల్ రాస్తుంది. మగ అసిస్టెంట్లలో ఒకతను ఆమె అడగకుండానే వచ్చి ఈమెయిల్ చూసి “క్షమాపణతో పాటు ‘ఈ కంపెనీలో పని చేసే అవకాశం రావటం నా అదృష్టం. మిమ్మల్ని మరోసారి నిరాశపరచను’ అని కూడా రాయి” అంటాడు. ఒకరి ఈమెయిల్ మరొకరు చూడటం సంస్కారం కాదు. కానీ ఆ అఫీసు వాతావరణం అలాంటిది. ఇదంతా పని నేర్పించటంలో భాగమే అన్నట్టు సీనియర్ అసిస్టెంట్ ప్రవరిస్తాడు. చివరికి “నువ్వేం ఫీలవ్వలేదు కదా?” అంటాడు, బాస్ తిట్టినందుకు ఆమె ఫీలయిందేమోనని. ఆమె లేదు అనే అంటుంది. తప్పు తనది కాకపోయినా క్షమాపణ చెప్పాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ‘తప్పదు, ఇది మామూలే’ అన్నట్టు మిగతావారు ప్రవర్తిస్తారు. ఆమె ఎందుకు ఇదంతా భరిస్తోంది? ఆమెకి సినిమా కళ అంటే ఇష్టం. సొంతంగా సినిమాలు తీయాలంటే అంత తేలిక కాదు. ఏదైనా సినిమా సంస్థలో చేరితే కొన్నాళ్ళకి నిర్మాతగా మారొచ్చు. ఇప్పుడు కాదని వెళ్ళిపోతే ఆమె సినిమా కల ఎప్పటికీ నెరవేరకపోవచ్చు. ఇంతకీ బాస్ ఆమెని వేధించలేదుగా, లైంగిక వేధింపుల గురించి ఎందుకు ప్రస్తావించాను అని మీరు అనుకోవచ్చు. సినిమా ద్వితీయార్థంలో బాస్ లైంగిక వ్యవహారాలే ముఖ్యాంశంగా మారతాయి.

కాసేపటికి బాస్ పిల్లలని తీసుకుని ఆయా అఫీసుకి వస్తుంది. అంటే అతని భార్య పిల్లలని పంపించిందన్నమాట. అతను “పిల్లలని ఇక్కడికి తీసుకురావద్దు” అనటం జేన్‌కి వినపడుతుంది. ఆయా కూడా ఒత్తిడి పడుతూనే ఉంటుంది. ఇది కాక ఇంకా చిన్న చిన్న సన్నివేశాలు బాస్ జీవితం గురించి తెలియజేస్తాయి. అతను మందులు వాడతాడు. ఆఫీసుకి మందుల డబ్బాలు వస్తాయి. వాటన్నిటినీ జేన్ సర్ది పెడుతుంది. వాడేసిన సిరంజిలని పారేసే పని కూడా ఆమెదే. అంటే బాస్‌కి జబ్బులు కూడా ఉన్నాయి. ఒక సన్నివేశంలో సినిమాల్లో అవకాశాల కోసం కొందరు అమ్మాయిలు పంపించిన ఫోటోలు జేన్ ప్రింట్ చేస్తుంది. ఆ ఫోటోలు ఒక్కొక్కటే ప్రింటర్ నుంచి బయటకు వస్తుంటే వీరిలో ఎవరు బాస్‌కి ఎర కాబోతున్నారో అని మనసు ఉసూరుమంటుంది. స్క్రీన్‌ప్లే ఇలా కూడా రాయవచ్చు కదా అనిపిస్తుంది. ఒక ఆలోచనని ప్రేక్షకుడి మెదడులో నాటితే సన్నివేశాలని బట్టి ప్రేక్షకుడే కథ అల్లుకుంటాడు. అంతా విడమరచి చెప్పక్కరలేదు. ఇంకో విశేషమేమిటంటే బాస్ ముఖం ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. అతను గదిలో ఉన్నాడో లేదో మాటల ద్వారానే తెలుస్తుంది. అంటే మనిషి మీద కన్నా వ్యవస్థ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అని సందేశం. వ్యవస్థని బాగు చేసుకుంటే మనుషులు దారిలోకి వస్తారు. వ్యవస్థలోని లోపాలే చిత్రం ద్వితీయార్థంలో ప్రస్తావించబడ్డాయి.

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కిట్టీ గ్రీన్. ఇదే ఆమె మొదటి చిత్రం. మొదటి చిత్రం అయినా చాలా పరిణతి కనిపిస్తుంది. మొదట్లో వచ్చే కొన్ని సన్నివేశాలు అవసరం లేని సన్నివేశాల్లా ఉంటాయి కానీ తర్వాత వాటి అవసరం తెలుస్తుంది. నాకైతే చిత్రం రెండోసారి చూసినపుడు బాగా అర్థమయింది. ఇది చిత్రంలోని లోపం కాదు. ప్రేక్షకుడిగా నా లోపం. ఉదాహరణకి మొదట్లో జేన్ బాస్ గదిలో ఉన్న సోఫాని లిక్విడ్ స్ప్రేతో శుభ్రం చేస్తుంది. అప్పుడు ఆమె ముఖంలో కాస్త అసహ్యం కనపడుతుంది. తర్వాత తెలిసేదేమిటంటే బాస్ ఆ సోఫా మీద శృంగారకలాపాలు సాగించాడు. కాస్టింగ్ కౌచ్ అనే మాట ఇలాంటి వారి వల్లే పుట్టింది. బాస్ సోఫా మీద శృంగారకలాపాలు సాగించాడని చెప్పటానికి కూడా రచయిత సూక్ష్మమైన పద్ధతినే ఎంచుకుంది. ఒక మీటింగ్ కోసం వచ్చిన కొందరు ఉద్యోగులలో ఒకతను “ఆ సోఫా మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోవద్దు” అంటాడు. మనం ఆలోచిస్తే దాని వెనుక ఉన్న అర్థం బోధపడుతుంది. చిత్రంలో ఛాయాగ్రహణం కాస్త మసకగా ఉన్నట్టు అనిపిస్తుంది.  కళాదర్శకత్వం మాత్రం బావుంటుంది. బాస్ గదిలో షోకేస్‌లో ఆస్కార్ అవార్డు ఉంటుంది. ఇలాంటివి పూర్తి ఏకాగ్రతతో చిత్రం చూస్తే తప్ప కనపడవు. జేన్‌గా జూలియా గార్నర్ జీవించిందనే చెప్పాలి. చిత్రంలో తర్వాత వచ్చే ఒక పాత్రలో మ్యాథ్యూ మెక్‌ఫేడియన్ ఒదిగిపోయి నటించాడు. తేనె పూసిన కత్తిలాంటి పాత్ర అది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. స్పాయిలర్లు ఉంటాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

మధ్యాహ్నం ఒక అమ్మాయి అఫీసుకి వస్తుంది. అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారని చెబుతుంది. మానవ వనరుల విభాగం వారు ఆమె చేత సంతకాలు చేయించుకుంటారు. ఆమె ఏదో కాన్ఫరెన్స్‌లో బాస్‌ని కలిసిందని మగ అసిస్టెంట్ అంటాడు. జేన్‌కి ఇది వింతగా ఉంటుంది. కాన్ఫరెన్స్‌లో కలిసిన అమ్మాయికి ఇంత తేలికగా ఉద్యోగం రావటం వింతే. ఆ అమ్మాయి పేరు సియెనా. ఇరవై ఏళ్ళ లోపే ఉంటుంది. ఐడహో అనే రాష్ట్రం నుంచి వచ్చింది. అదో మారుమూల రాష్ట్రం. ఆమెకి మంచి హోటల్‌లో గది కూడా ఇచ్చారు. ఆమెని హోటల్‌కి తీసుకెళ్ళే పని జేన్‌ది. కారులో వెళుతుండగా సియెనా “నువ్వు చేరినప్పుడు నీకు కూడా ఆ హోటల్‌లోనే గది ఇచ్చారా?” అని జేన్‌ని అడుగుతుంది. “నాకు ఎక్కడా గది ఇవ్వలేదు” అంటుంది జేన్. అంటే సియెనాకి ప్రత్యేకంగా గది ఇచ్చారన్నమాట. బాసే ఇప్పించాడు. సియెనా తాను కాన్ఫరెన్స్ జరిగిన చోట రెస్టారెంట్లో పని చేశానని, అక్కడే బాస్‌ని కలిశానని, తనకి ఒక చిన్న చిత్రం నిర్మాణంలో పని చేసిన అనుభవం ఉందని అంటుంది. జేన్ నవ్వుతూ ఆమె మాటలు వింటుంది కానీ ‘నాకు ఇవ్వని సౌకర్యాలు ఈమెకి ఎందుకిచ్చారు?’ అనే భావన ముఖంలో కనపడుతూ ఉంటుంది.

సియెనాని హోటల్లో దింపి జేన్ అఫీసుకి తిరిగి వస్తుంది. కాసేపటికి బాస్ భార్య మళ్ళీ ఫోన్ చేస్తుంది. బాస్ అఫీసులో లేడు. ఏదో పని ఉందని వెళ్ళాడు. బాస్ భార్య భర్త ఎక్కడున్నాడని అడుగుతుంది. జేన్ “ఆయన అఫీసులో లేరు” అంటుంది. “ఎక్కడున్నాడో, ఎవరితో ఉన్నాడో చెప్పు” అంటుంది బాస్ భార్య. జేన్ “నాకు తెలియదు” అంటుంది. బాస్ భార్య ఫోన్ పెట్టేస్తుంది. కాసేపటికి చైనా నుంచి వచ్చిన నిర్మాణ బృందం ఒకటి బాస్‌ని కలవటానికి వస్తుంది. ముందే అనుకున్న సమావేశం. కానీ బాస్ లేడు. వారికి సర్ది చెప్పటానికి ఒక సీనియర్ ఉద్యోగి కిందా మీదా పడుతూ ఉంటాడు. ఇదంతా జేన్ చూస్తుంది. వాళ్ళు వెళ్ళాక కొందరు ఆఫీసు ఉద్యోగులు బాస్‌ని కలవటానికి వస్తారు. “ఆయన ఎక్కడున్నారు?” అని మగ అసిస్టెంట్‌ని అడుగుతారు. అతను జేన్‌ని “ఆమెని ఎక్కడికి తీసుకెళ్ళావు?” అని అడుగుతాడు. అతను అడిగినది సియెనా గురించి. జేన్ హోటల్ పేరు చెబుతుంది. అతను ఆ ఉద్యోగులకి హోటల్ పేరు మళ్ళీ చెప్పి అర్థమయిందిగా అన్నట్టు వెళ్ళిపోతాడు. అంటే బాస్ సియెనాని కలవటానికి హోటల్‌కి వెళ్ళాడని అతని ఉద్దేశం.

జేన్‌కి ఇది షాక్ కలిగిస్తుంది. ఇరవై ఏళ్ళు కూడా లేని అమ్మాయి బాస్ చేతికి చిక్కిందని ఆమె భయం. ఆమె నేరుగా మానవ వనరుల విభాగం మేనేజర్ దగ్గరకి వెళుతుంది. “చాలా చిన్న అమ్మాయి. ఐడహో నుంచి వచ్చింది. రెస్టారెంట్లో పని చేసేదట. అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. మంచి హోటల్లో గది ఇచ్చారు. ఆఫీసులో అందరూ బాస్ కూడా అక్కడే ఉన్నాడని అనుకుంటున్నారు. జోకులు వేసుకుంటున్నారు. నాకు ఈరోజు బాస్ గదిలో ఒక చెవి రింగు దొరికింది. పోయిన వారం ఒక హెయిర్ బ్యాండ్ దొరికింది. మీరు ఏదో ఒకటి చేయాలి” అంటుంది. అతను శ్రద్ధగా వింటాడు. ఆమె చెప్పినవి నోట్స్ లాగ రాసుకుంటాడు. కానీ “ఏం జరిగిందని ఏదో చేయాలంటున్నావు? నాకిదేదో అసూయ లాగ అనిపిస్తోంది. నువ్వే కాలేజీలో చదువుకున్నావు?” అంటాడు. ఆమె నార్త్‌వెస్టర్న్ అని చెబుతుంది. అది మంచి కాలేజీ. “భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు?” అంటాడతను. “నిర్మాతని కావాలనుకుంటున్నాను” అంటుందామె. “మరి దాని మీద దృష్టి పెట్టక అనవసర విషయాల్లో ఎందుకు తల దూరుస్తావు? ఆమె రెస్టారెంట్లో పని చేస్తే ఆమెకి అర్హత లేదనా? సరేలే. నువ్వు పట్టు పడితే ఫిర్యాదు నమోదు చేస్తాను. కానీ దాని వల్ల ఒరిగేదేమీ లేదు. చెయ్యమంటావా?” అంటాడతను. జేన్‌కి రోజంతా జరిగిన అవమానాలని తోడు ఇంకో అవమానం. ఆమె “వద్దు” అని అక్కడి నుంచి లేస్తుంది. ఆమె తలుపు తీస్తుంటే అతను “నువ్వేం భయపడకు. నీ టైపు అమ్మయిలు ఆయనకి నచ్చరు” అంటాడు. అంటే అతనికి బాస్ బాగోతాలు తెలుసు. తేనె పూసిన కత్తి. జేన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేస్తుంది.

జేన్ మంచి కాలేజీలో చదువుకుంది. పెద్ద అందగత్తె కాదు. అందుకే ఆమెని బాస్ దగ్గర పనిలో పెట్టారేమో. బాస్ “నువ్వు తెలివైన దానివని చెప్పారు” అన్నాడుగా. మానవ వనరుల విభాగం వారే ఆమెని సిఫారసు చేసి ఉంటారు. బాస్ దృష్టిలో తెలివంటే తను చేసిన తప్పుడు పనులన్నీ సమర్థించుకు రావడమన్నమాట. కొత్త చట్టాలు వచ్చాయి కాబట్టి జేన్ ఫిర్యాదు చేయటానికి వెళ్ళింది. కానీ ఆమె ఒక విషయం విస్మరించింది. ఆమె దగ్గర సాక్ష్యం ఏది? సియెనా హోటల్‌కి వెళ్ళింది. జేనే తీసుకువెళ్ళింది. బాస్ ఆ హోటల్‌కే వెళ్ళాడని ఎవరో అన్నారు. రుజువేది? పోనీ వెళ్ళాడు, అతను సియెనా మీద లైంగిక దాడి చేశాడనటానికి రుజువేది? సియెనా ఒప్పుకుందేమో? అసలు లైంగిక వ్యవహారమేమీ జరగలేదేమో? హెచ్ఆర్ మేనేజర్ తెలివైనవాడు. బాస్ బాగోతాలు అతనికి తెలుసు. కానీ ఇక్కడ సాక్ష్యాలేమీ లేవని కూడా తెలుసు. ‘నీకు అసూయ’ అని జేన్ మీదే నింద వేశాడు. పైగా ‘నువ్వు పెద్ద అందగత్తెవేం కాదు’ అని కూడా అన్నాడు. ఇక జేన్ మనఃస్థితి ఎలా ఉంటుందో ఊహకి కూడా అందదు. లోకం తీరు ఆమెకి ఒక్కరోజులో తెలిసిపోయింది. బాస్ కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతున్నాడు. అదే అందరికీ ముఖ్యం. పైకి తెలియనపుడు తెర వెనుక ఎన్ని వేషాలేస్తే ఏం? ఇక్కడ అందరికీ గుణపాఠం ఉంది. ఫిర్యాదు చేసేటపుడు సాక్ష్యాలు ఉండాలి. లేకపోతే లాయర్లు ఫిర్యాదు చేసినవారిని చీల్చి చెండాడుతారు. ఈ లోకమే అంత.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

జేన్ తిరిగి తన డెస్క్ దగ్గరకి వస్తుంది. కాసేపటికి బాస్ ఫోన్ చేస్తాడు. “నాతో ముందు కనీసం మాట్లాడకుండా కట్టుకథలు అల్లుతావా? నీకీ ఉద్యోగం కావాలా వద్దా?” అంటాడు. ఆమె ఈసారి ఉద్వేగానికి లోనవదు. నిర్లిప్తంగా ఉంటుంది. లోకం సున్నితమైనవారిని కూడా రాటుదేలేలా చేస్తుంది. అతని ప్రశ్నకి జవాబుగా ఆమె “కావాలి” అంటుంది. “అయితే నాకు క్షమాపణ కావాలి” అని అతను ఫోన్ పెట్టేస్తాడు. హెచ్ఆర్ మేనేజర్ బాస్‌కి ఆమె ఫిర్యాదు సంగతి చెప్పేశాడు. అందరూ తోడుదొంగలే. కళ మీద ఇష్టంతో వచ్చిన జేన్ ఈ పరిస్థితులని తట్టుకుంటే కానీ ముందుకు సాగటం కష్టం. తనకి నేరుగా ఏమైనా అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా తనకి అన్యాయం జరిగిందని చెబితే ఆసరాగా నిలబడవచ్చు. మానవ వనరుల విభాగంలో మేనేజర్ లాంటివాళ్ళు ఉన్నంతవరకు చట్టాలు అమలుకి నోచుకోవు. జేన్ క్షమాపణ చెబుతూ ఈమెయిల్ రాస్తుంటే ఈసారి ఇద్దరు మగ అసిస్టెంట్లూ వచ్చి ఎలా రాయాలో సలహాలు ఇస్తారు. బాస్ ఈమెయిల్‌కి సమాధానం ఇస్తాడు. “సారీ. నువ్వు బాగా పని చేస్తున్నావు. నేను నీ పట్ల కఠినంగా ఉండటానికి కారణం నిన్ను గొప్ప మనిషిని చేయాలనే” అని అతని సమాధానం.

కాసేపటికి సియెనా హోటల్ నుంచి తిరిగి వస్తుంది. అప్పటికి చీకటి పడుతుంది. ఆమె జేన్ ఎదురుగా ఉన్న ఖాళీ డెస్క్ దగ్గర కూర్చుంటుంది. ఆమె ముఖంలో ఏ రకమైన ఉద్వేగమూ లేదు. నాకైతే బాస్ ఆమెతో లైంగిక కార్యకలాపాలేమీ చేయలేదనే అనిపించింది. మరొకరికి వేరేలా అనిపించవచ్చు. అదే ఈ సినిమాలో విశిష్టత. అయితే బాస్ ఏమీ చేయలేదంటే ఇక ముందు చేయడని అనుకోవటానికి లేదు. సియెనా జేన్‌ని “నాకు ఈ డెస్క్ ఇచ్చారు. నాకు ఫోన్ సిస్టమ్ ఎలా వాడాలో నేర్పిస్తావా?” అంటుంది. జేన్ నిబ్బరంగా ఆమెకి ఫోన్ సిస్టమ్ వివరిస్తుంది. కొన్ని ఫైల్స్ ఇచ్చి చదువుకోమంటుంది. ఆమె చదువుతుంటే జేన్ ఆమెని గమనిస్తూ ఉంటుంది, ఏదైనా ఉద్వేగం ఆమె ముఖంలో కనపడుతుందేమోనని. అలాంటిదేమీ లేదు. కాసేపటికి జేన్ “ఈరోజుకి నువ్వు వెళ్ళొచ్చు” అంటుంది. ఆమె వెళ్ళిపోతుంది. మగ అసిస్టెంట్లు కూడా వెళ్ళిపోతారు.

కాసేపటికి బాస్ మళ్ళీ ఆఫీసుకి వస్తాడు. అతన్ని కలవటానికి ఒక యువనటి వస్తుంది. లోపలి నుంచి జేన్‌కి గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. బాస్ ఇంటర్‌కామ్‌లో జేన్‌తో “నీతో పని లేదు. నువ్వు వెళ్ళొచ్చు” అంటాడు. జేన్ బయల్దేరుతుంది. ఆమెతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు కూడా బయల్దేరుతారు. జేన్ కాస్త విచారంగా ఉండటం చూసి అందులో ఒక ఉద్యోగిని “విచారించకు. ఇందులో ఆయన పొందే దానికన్నా ఆమె పొందేదే ఎక్కువ” అంటుంది. అంటే ఆ యువనటి తన శరీరాన్ని పణంగా పెట్టి అవకాశాలు సంపాదించుకుంటోందని భావం. కొందరికి శీలం కన్నా డబ్బు ముఖ్యం. వారిని తప్పు పట్టటానికి మనమెవరం?

జేన్ ఆఫీసుకి రోడ్డు అవతల ఉన్న బేకరీకి వెళుతుంది. అక్కడ ఒక మఫిన్ కొనుక్కుని తింటుంది. అక్కడ కూర్చుని తండ్రికి ఫోన్ చేస్తుంది. “సారీ. మీ పుట్టినరోజు మర్చిపోయాను” అంటుంది. “నీకు పనెక్కువ ఉందని నాకు తెలుసు. నీకు మంచి అవకాశం దొరికింది. మాకెంతో ఆనందంగా ఉంది” అంటాడాయన. అతనికేం తెలుసు ఇక్కడ ఏం జరుగుతోందో? ఫలానా ప్రముఖ నిర్మాత దగ్గర కూతురు పని చేస్తోందని అనుకుంటున్నాడు. ఆమెది పైకి ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. స్నేహితులకి చెప్పుకుందామంటే సమయం కూడా ఉండటం లేదు. ఆఫీసులో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అది. ఆమె ఫోన్ పక్కన పెట్టి అఫీసులో బాస్ గది కిటికీ వైపు చూస్తుంది. అక్కడ బ్లైండ్స్ మీద బాస్ నీడ కనపడుతుంది, ఎవరితోనో సెక్స్ చేస్తున్నట్టు. జేన్ తల దించుకుని లేచి వెళ్ళిపోతుంది.

చట్టాలు మారినంత మాత్రాన పరిస్థితులు వెంటనే మారవు. చట్టాలు అమలు చేసేవారిలో నిబద్ధత ఉండాలి. అయినా ఇక్కడ బాస్ జేన్‌ని లైంగికంగా వేధించలేదు. తన దాకా వస్తే ఆమె సాక్ష్యాలతో ముందుకు వెళ్ళొచ్చు. అప్పుడు కూడా ఎదురీతే అవుతుంది. ఎందుకంటే బాస్ దగ్గర డబ్బుంది. ఇంక వేరే ఎవరినో బాస్ వేధిస్తున్నాడని ఆమె సొంతంగా ఫిర్యాదు చేయటం నిష్ప్రయోజకం. అవతలివారి సమ్మతితోనే అతని ఆటలు సాగుతున్నాయేమో ఎవరికి తెలుసు? అలాంటప్పుడు అవతలి అమ్మాయి కూడా ఏ తప్పూ జరగలేదని చెబుతుంది. అప్పుడు జేన్ ఏం చేయగలదు? మరి ఆమె ఉద్యోగం మారవచ్చు కదా? సినిమా రంగంలో ఉండాలంటే ఇలాంటివి చూడక తప్పదు. అది జేన్‌కి అర్థమయింది. కొన్నిసార్లు తల వంచుకుని మన పని మనం చేసుకోవటమే ఉత్తమం.

Exit mobile version