Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 131: ద వండర్

[సంచిక పాఠకుల కోసం ‘ద వండర్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

తవిశ్వాసాలు మూఢాచారాలుగా మారటం అన్ని దేశాల్లోనూ ఉంది. మన దేశంలో మగవారు యజ్ఞాలు చేయాలంటే భార్య ఉండాలని ముసలివాళ్ళకి చిన్నపిల్లలనిచ్చి వివాహం చేసేవారు. అప్పట్లో బాల్యవివాహాలు ఎక్కువ కాబట్టి చిన్నపిల్లలు తప్ప వేరే వధువులు దొరికేవారు కాదు. ఆడపిల్లల తండ్రులు కన్యాశుల్కం కోసం ఆశపడి కూతుళ్ళని అమ్ముకునేవారు. ఏం, యజ్ఞం చేయాలంటే భార్యే పక్కనుండాలా? వేరే దారి లేదా? శ్రీరాముడు కాంచనసీతని పెట్టుకుని యజ్ఞం చేయలేదా? శ్రీరాముడిని పూజిస్తారు కానీ ఆయన చూపిన మార్గంలో నడవరు. అసౌకర్యంగా ఉంటే ప్రత్యామ్నాయాలు వెతుకుతారు కానీ సౌకర్యంగా ఉంటే వేరే మార్గం ఎందుకూ? ఏదో సాకు చెప్పి జీవితం సాఫీగా సాగటానికి, భోగాలు అనుభవించటానికి ఈ తతంగాలు. ముసలాయన పోయి పిల్ల వితంతువు అయితే ఆమె మీద ఆంక్షలు. ఆమెని చూస్తే అరిష్టమని నిషేధాలు. ఇరవయ్యవ శాతాబ్దం మధ్య వరకు ఇవి జరిగాయి. పంతొమ్మిదవ శతాబ్దంలో ఐర్లండ్‌లో మతవిశ్వాసాలు ఎలా వెర్రితలలు వేశాయో చూపించిన చిత్రం ‘ద వండర్’ (2022). ఇది కల్పిత కథే అయినా మనుషుల మూఢనమ్మకాలు ఎలా ఉంటాయో చూపిస్తుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. హిందీ శబ్దానువాదం అందుబాటులో ఉంది.

1862వ సంవత్సరం. ఐర్లండ్‌లో పదేళ్ళ క్రితం వరకు ఉన్న పెద్ద క్షామం జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోలేదు. ఆ క్షామం ఇంగ్లండ్ పుణ్యమే అని ఐర్లండ్ వారి భావన. ఇలాంటి పరిస్థితుల్లో ఐర్లండ్‌లోని ఒక చిన్న గ్రామంలో ఆనా అనే పదకొండేళ్ళ అమ్మాయి నాలుగు నెలలుగా నిరశన వ్రతం చేస్తోంది అనే వార్త అందరినీ ఆకర్షిస్తుంది. ఆ అమ్మాయి తనకి ఆకలి వేయటం లేదని, తనకి దేవలోకం నుంచి మానా (మన భాషలో అమృతం అనుకోవచ్చు) అందుతోందని అంటుంది. ఎక్కువ సమయం ప్రార్థన చేస్తూ గడుపుతుంది. ఆమెని చూడటానికి ఒక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉంటారు. ఇదంతా దేవుడి మహిమ అంటారు. ఊరి పెద్దలు ఇది నిజమేనా అని తర్జనభర్జన పడుతుంటారు. నిజం నిగ్గు తేల్చటానికి ఇంగ్లండ్ నుంచి ఒక నర్సుని, ఒక క్రైస్తవ సన్యాసినిని రప్పిస్తారు. వారిద్దరూ వంతులవారీగా ఆనాని అంటిపెట్టుకుని ఉండి ఆమె నిజంగానే ఆహారం లేకుండా జీవిస్తోందా అని తెలుసుకోవాలి. రెండువారాల గడువు.

నర్సు పేరు ఎలిజబెత్. ఆమె సైన్యంలో నర్సుగా పనిచేసి వచ్చింది. ఆమె ఈ పని ఒక నర్సు చేయాల్సిన పని కాదని అనుకుంటుంది. అయినా ఒప్పుకుంటుంది. ఎందుకు? ఒక కారణం ఉత్సుకత. మరో కారణం ఖాళీగా ఉండలేక. ఆమెకి పెళ్ళయిందని, భర్త చనిపోయాడని చెబుతుంది కానీ ఒక బిడ్డ పుట్టి మరణించిందని తర్వాత తెలుస్తుంది. ఆ శోకాన్ని భరించలేక ఆమె ఏదో పని చేయాలని వచ్చింది. రాత్రి పూట మనసులో గూడుకట్టుకున్న వేదనని భరించలేక శరీరానికి గాయాలు చేసుకుంటుంది. వేలిని సూదితో గుచ్చుకుంటుంది. నిద్ర పట్టటానికి ఒక అరుకు తాగుతుంది. ఈ బాధకి తోడు ఆమె ఇంగ్లండ్ నుంచి వచ్చింది కాబట్టి ఊరివారికి ఆమె అంటే గిట్టదు. ఆమె బస చేసిన సత్రం యజమాని కూడా ఆమె మీద అసహనం చూపిస్తాడు.

మొదటి రోజు ఆమె ఆనాని పరీక్షిస్తుంది. ఆమె ఆరోగ్యం క్షీణించింది కానీ నెలల తరబడి ఆహారం లేని వారికి క్షీణించినంతగా క్షీణించలేదు. అసలు నాలుగు నెలలు ఆహారం లేకపోతే జీవించటమే కష్టం. రెండో రోజు ఎలిజబెత్ ఆనా విడిచిన బట్టలని తనిఖీ చేస్తుంది, ఏమన్నా దాచుకుని తింటోందేమోనని. ఆనాకి ఒక అన్నయ్య ఉండేవాడు. అతను మరణించాడు. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఫొటోలో అతని కళ్ళ మీద పెయింట్ వేయించింది తల్లి. అతను మరణించాడనటానికి ఇది సంకేతం. “దేవుడు తనకి ఇష్టమైన వారిని తన దూతలుగా చేసుకుని తొందరగా తీసుకెళతాడు” అంటుంది.

విల్ అనే ఒక పాత్రికేయుడు ఆనా గురించి రాయటానికి ఆ ఊరు వస్తాడు. ఆనా నాటకం ఆడుతోందని, ఆమెకి ఆహారం అందుతోందని ఎలిజబెత్‌తో అంటాడు. ఎలిజబెత్‌కి కూడా అదే అనిపిస్తుంది కానీ ఆమె వద్ద ఆధారాలు ఏమీ లేవు. అతనికున్న నమ్మకం తనకి లేదని ఆమెకి తన మీద తనకే కోపంగా ఉంటుంది. ఆ కోపం అతని మీద చూపిస్తుంది. ఆనా తల్లి, తండ్రి, పనిమనిషి ఎవరూ ఆమె దగ్గరకి రాకూడదని ఆంక్ష విధిస్తుంది. వారిలో ఎవరో వచ్చి ఆమెకి ఆహారం ఇస్తున్నారని ఆమె ఉద్దేశం. ఆనా తల్లి, తండ్రి రోజూ ఉదయం, రాత్రి ఆమెకి ముద్దు పెడతారు. “తల్లి ముద్దు పవిత్రమైనది” అంటుంది తల్లి. ఎలిజబెత్ మొండిగా వారిని దూరంగా ఉండమని చెబుతుంది.

ఎలిజబెత్‌కి అంత పట్టుదల ఎందుకు? ఆనాకి ఆహారం అందితే ఆమె బతుకుతుంది కదా? అదే కదా కావల్సింది? ఆమె పంతం దేవుడి మీద. అందరూ దేవుడు చేసిన అద్భుతం (వండర్) వలనే ఆనా నిరాహారంగా ఉన్నా బతుకుతోందని అంటున్నారు. మరి తన బిడ్డని దేవుడు ఎందుకు తీసుకుపోయాడు? అది అన్యాయం కాదా అని ఆమె అక్కసు. అందుకని దేవుడు లేడని నిరూపించాలని ఆమె ప్రయత్నం. మరి తిండి లేకపోతే ఆనా చనిపోతుంది కదా? ఆమె చనిపోయే పరిస్థితి వస్తే అందరినీ ఒప్పించి తిండి పెట్టొచ్చని ఆమె ఆలోచన. అయితే ఊరి డాక్టరు కూడా ఆనా అందరి లాంటి పిల్ల కాదేమో, ఆమెలో సూర్యరశ్మిని బలంగా మార్చుకునే శక్తి ఉందేమో అంటాడు. ఊరి ఫాదరు సరేసరి. అంతా దేవుడి మహిమ అంటాడు.

ఎలిజబెత్‌కి విల్ గురించి ఒక విషయం తెలుస్తుంది. అతను ఆ ఊరి వాడే. చదువుకోవటానికి ఇంగ్లండ్ వెళ్ళాడు. క్షామం సమయంలో అతని కుటుంబం తిండి లేక అల్లాడింది. చివరికి ఇంటి లోపల తాళం వేసుకుని వారందరూ మరణించారు. అది అతని జీవితంలోని విషాదం. ఆ రోజుల్లో సమాచారం తొందరగా తెలిసేది కాదు. అయినా కుటుంబం వారు అతనికి తెలియపరచలేదనే అనుకోవాలి. అతనిలో అపరాధభావన ఉంది. ఇక్కడ అంతర్లీనంగా ఉన్న విషయం ఏమిటంటే తిండి లేకపోయినా ఒక మనిషి బతకగలదంటే అతనికి కోపం వచ్చేది ఇందుకే. తన కుటుంబం తిండి లేక చనిపోయింది, ఆనా మాత్రం తిండి లేకపోయినా బతుకుతోందంటే అతనికి కోపం రాదూ?

విల్ మనసుని ఎలిజబెత్ అర్థం చేసుకుంటుంది. అతని మీద సానుభూతి చూపిస్తుంది. “నువ్వు ఇక్కడ ఉండి ఉంటే ఏదో ఒక రకంగా వారిని కాపాడుకునేవాడివి” అంటుంది. ఆమె సానుభూతికి అతను చలించిపోతాడు. ఇద్దరూ సన్నిహితులవుతారు. శారీరక సంబంధం ఏర్పడుతుంది. ఇద్దరూ ప్రేమ కోసం తపించినవారే. ఆమె భర్త నిజానికి బిడ్డ మరణం తర్వాత ఆమెని వదిలిపోయాడు. అతను చనిపోయాడని ఆమె అందరికీ చెబుతుంది. విల్‌కి మాత్రం నిజం చెబుతుంది. ఆమె సైన్యంలో పని చేసినపుడు సైనికులకి సేవ చేసేది. ఎంతో మంది ఆమె కళ్ళ ముందే చనిపోయారు. చనిపోయే ముందు తమ గతం చెప్పుకునేవారు. ఒక రకంగా అది వారికి నిష్కృతి. ఘోరాలు చూసినవారు కొందరు. ఘోరాలు చేసినవారు కొందరు. జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆమెకి తెలుసు.

ఆనాని వ్యాహ్యాళికి తీసుకువచ్చినపుడు ఎలిజబెత్ ఆమెని విల్‌కి పరిచయం చేస్తుంది. విల్ పొడుపు కథలు చెప్పి ఆనాని ఆకట్టుకుంటాడు. ప్రతి విషయంలోనూ తర్కం ఉంటుందని చెప్పటం అతని ఉద్దేశం. అతను ఎన్నో దేశాలు చుట్టివచ్చాడని తెలిసి ఆనా అబ్బురపడుతుంది. ఆనా బలహీనంగా మారుతుండటంతో ఎలిజబెత్ ఆమె తల్లినీ, తండ్రినీ ఆమెని ఆహారం తినటానికి ఒప్పించమని అడుగుతుంది. ఆమె తల్లి “నువ్వు వచ్చేదాకా ఆమె బాగానే ఉంది” అంటుంది. ఆమె తండ్రి “ఆమె పుట్టినరోజు నాడు ఒట్టు వేయించుకుంది, ఇంకెప్పుడూ భోజనం చేయమని అడగవద్దని” అంటాడు. ఒకరోజు ఎలిజబెత్ ఆనా గొంతులో ఒక గొట్టం పెట్టి ఆమెకి సూప్ తినిపించాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆనా వద్దని ప్రాధేయపడుతుంది. జాలిగొలిపే ఆమె మొర విని ఎలిజబెత్ తన ప్రయత్నం విరమించుకుంటుంది. ఇంతకీ ఆనా ఎందుకు ఈ వ్రతం చేస్తోంది? దీని వెనక ఒక భయంకరమైన నిజం ఉంది. అది తెలిశాక మతవిశ్వాసాలని వక్రీకరించి మనుషులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో కదా అనిపిస్తుంది. దీని వెనుక కారణం అహంకారం, మమకారం. ఇవే మనిషికి శత్రువులు.

ఈ చిత్రానికి ఎమ్మా డోనహ్యూ రాసిన నవల ఆధారం. సెబాస్టియన్ లెలియో దర్శకత్వం వహించాడు. ఎలిజబెత్‌గా ఫ్లోరెన్స్ ప్యూ నటించింది. చిన్న వయసులోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్న నటి ఆమె. ఆనాగా కీలా లార్డ్ క్యాసిడీ నటించింది. ఆహారం లేని మనిషిగా ఆమెని చూపించటంలో మేకప్ కళాకారులు కృతకృత్యులు కాలేదనే చెప్పాలి. ఆమె నటన మాత్రం బావుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. స్పాయిలర్లు ఉంటాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఆనా ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. ఆమెకి నడవటానికి కూడా శక్తి లేదు. వీల్ చెయిర్ వాడటం మొదలుపెడుతుంది. విల్ ఆనా గురించి రాసిన వ్యాసం ప్రచురితమవుతుంది. ‘అంచెలంచెలుగా హత్య చేస్తున్నారు’ అనే అర్థం వచ్చేలా రాశాడు. ఇది ఊరి వారికి నచ్చదు. ఎలిజబెత్‌కి మాత్రం ఆనా గురించే బెంగ. ఒకరోజు ఆమెకి హఠాత్తుగా ఒక విషయం స్ఫురిస్తుంది. ఆనా తల్లి ఆనాని ముద్దు పెట్టుకునేటపుడు పెదవుల మీద ముద్దు పెట్టుకునేది. చేతులతో ముఖాన్ని కప్పేది. ఆ సమయంలో ఆమె తన నోటిలో ఉన్న ఆహారాన్ని కూతురికి అందించేదని ఎలిజబెత్‌కి అనుమానం వస్తుంది. ఆనా దగ్గరకి వెళ్ళి అడుగుతుంది. ఆనా “అది దేవలోకం నుంచి అందిన మానా” అంటుంది. చిన్నపిల్లకి అంతకన్నా ఏం తెలుస్తుంది. తల్లి ఎలా చెబితే అలా. ఎలిజబెత్ “నేను ఊరి పెద్దలకి నిజం చెప్పాలి” అంటుంది. ఆనా వద్దంటుంది. “అయితే భోజనం చెయ్యి” అంటుంది ఎలిజబెత్. ఆనా దానికీ ఒప్పుకోదు. “అయితే మీ అమ్మని మళ్ళీ ముద్దు పెట్టమని అడుగుతాను. దేవుడిచ్చిన మానా తీసుకోవచ్చుగా?” అంటుంది ఎలిజబెత్. ఆనా దానికీ ఒప్పుకోదు.

ఎందుకని అడిగితే “నిరశన వ్రతం చేస్తూ రోజూ 33 సార్లు ప్రార్థన చేయాలి. ఒక ఆత్మకి ముక్తి రావాలి. నరకం నుంచి. నరకజ్వాలల నుంచి” అంటుంది. “ఎవరి ఆత్మ? మీ అన్నయ్యదా?” అంటుంది ఎలిజబెత్. అవునని తల ఊపుతుంది ఆనా. “అతనో పిల్లవాడు. అతనెందుకు నరకంలో ఉంటాడు?” అంటుంది ఎలిజబెత్. అప్పుడు ఆనా ఒక భయంకర రహస్యం చెబుతుంది. “అతను ప్రేమ రెట్టింపు అవుతుందన్నాడు. చెల్లి ప్రేమ, భార్య ప్రేమ కలపాలి అన్నాడు” అన్నాడు. అంటే ఆమె అన్నయ్య ఆమెతో శారీరకంగా కలిసేవాడు! అప్పుడు ఆమెకి తొమ్మిదేళ్ళు. ఎలిజబెత్ అవాక్కయి ఉండిపోతుంది. “అతను జబ్బు చేసి చనిపోయాడు. మా అమ్మ నా వల్లే అతన్ని దేవుడు తీసుకుపోయాడని అంది” అంటుంది ఆనా. అంటే ఆమె తల్లికి తెలుసు. మగవాడి కామానికి కూడా ఆడదాన్ని దోషిని చేయటం ఎప్పటి నుంచో ఉంది.

జరిగింది ఏమిటంటే కొడుకు మరణించిన తర్వాత ఆనా తల్లి కొడుకు ఆత్మని నరకం నుంచి తప్పించటానికి ఆనా చేత వ్రతం చేయిస్తోంది. కొడుకు చేసినది మహాపాతకం. మరి శిక్ష పడదా? తన కొడుకు కాబట్టి పడకూడదు. ఈ మమకారమే అనేక రకాల పాపాలు చేయిస్తుంది. అదే బయటి వ్యక్తి ఎవరన్నా తన కూతురిని లొంగదీసుకుంటే ఆమె ఏం చేసేది? అన్ని శిక్షలూ పడాలని కోరుకునేది. తన వారికో న్యాయం, బయటి వారికో న్యాయం! ఆనాకి కూడా పాపంలో భాగముందనే వింత తర్కంతో ఆమె చేత వ్రతం చేయించింది. అయితే వ్రతం కూడా సరిగా చేయలేదు. వ్రతం పూర్తి కాకుండా కూతురు చనిపోతుందనే భయం ఉంది. అందుకే కూతురికి తన నోటి ద్వారా ఆహారం అందించింది. అది మానా అని చెప్పింది. తను కూడా అది మామూలు ఆహారం కాదని నమ్మింది. దానికి ‘తల్లి ముద్దు పవిత్రమైనది’ అని ముసుగు వేసింది. మతం పేరుతో చేసే వింత చేష్టలివి. ఆనా తండ్రికి ఇదేమీ తెలియదు.

ఎలిజబెత్ విల్‌కి అంతా చెబుతుంది. తర్వాత ఊరి పెద్దలని సమావేశపరుస్తుంది. కానీ వారికి అంతా చెప్పదు. ఆనా తల్లి ఆనాకి తన నోటి ద్వారా ఆహారం అందించేదని మాత్రమే చెబుతుంది. ఊరి పెద్దలు ఆమె చెప్పేది అబద్ధమని అంటారు. విల్‌తో కలిసి ఆమె ఆనాని ఒక సంచలన వార్తగా మార్చిందని నిందిస్తారు. తర్వాత ఆనాని పిలిచి ఎలిజబెత్ చెప్పినది నిజమేనా అని అడుగుతారు. ఆమె తాను మానా మాత్రమే తీసుకున్నానని చెబుతుంది. ఆమె నమ్మిన నిజం అదే. ఊరి పెద్దలు ఆమెనే నమ్ముతారు. ఎలిజబెత్‌ని నిఘా కొనసాగించమని చెబుతారు. ఆమె ఆనా తల్లిని ప్రాధేయపడుతుంది. “మీ విశ్వాసాలు నాకు అర్థం కావు. కానీ బిడ్డని కోల్పోవటం ఎంత బాధో నాకు తెలుసు” అంటుంది. ఆమె కొడుకు పోయిన బాధలో ఇదంతా చేస్తోందని ఎలిజబెత్ అర్థం చేసుకుంది. ఆడది కాబట్టి, తల్లి కాబట్టి, అందునా బిడ్డని పోగొట్టుకున్న తల్లి కాబట్టి అర్థం చేసుకుంది. అదే మగవాడికైతే అర్థం కాదు. “కానీ ఆనాని బతికించగలిగి కూడా మృత్యువు ఒడిలోకి నెట్టటం దారుణం” అంటుంది. ఆనా తల్లి “ఈ జన్మ తుచ్ఛమైనది. పరలోకం శాశ్వతం. నా బిడ్డలిద్దరూ స్వర్గానికి చేరతారు” అంటుంది. చాలా మతాల్లో ఉన్న నమ్మకం ఇదే. ఏ వ్రతమో, యజ్ఞమో చేస్తే పాపాలు ప్రక్షాళన అయిపోతాయి అనుకుంటారు. అలా జరగదు. ఇది మతపెద్దలు స్వార్థం కోసం చేసే ప్రచారం. పాపం చేస్తే శిక్ష అనుభవించవలసినదే. దేవుడి దగ్గర బేరసారాలు కుదరవు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ఎలిజబెత్ ఆనాని తప్పించాలని నిర్ణయించుకుంటుంది. ఆనా తలిదండ్రులు చర్చికి వెళ్ళిన సమయంలో ఆనాని భుజాల మీద ఇంటి నుంచి తీసుకువెళుతుంది. ఊరి బయట ముడుపులు కట్టే ఒక చెట్టు దగ్గర ఆమెని పడుకోబెట్టి “ఇప్పుడు నువ్వు కొత్త జన్మ పొందబోతున్నావు” అంటుంది. ఆనా కళ్ళు మూసుకుంటుంది. కాసేపటికి కళ్ళు తెరుస్తుంది. ఎలిజబెత్ ఆమెకి నాన్ అని కొత్త పేరు పెడుతుంది. నాన్ తాను కొత్త జన్మ పొందానని నమ్ముతుంది. ఎలిజబెత్ ఆమెకి బ్రెడ్ తినిపిస్తుంది. వెనక్కి వెళ్ళి ఆనా ఇంటికి నిప్పు పెడుతుంది. తర్వాత ఆనాని గుర్రం మీద తీసుకెళ్ళి విల్‌కి అప్పగిస్తుంది. మర్నాడు ఊరి పెద్దలకి ఆనా మరణించిందని, లాంతరు పడిపోవటం వల్ల ఇల్లు కాలిపోయిందని చెబుతుంది. ఆనా అస్థికలు కూడా దొరకలేదని ఊరి పెద్దలు వ్యాఖ్యానిస్తారు. ఆ ఇల్లు ఒక పుణ్యస్థలం అవుతుందని అంటారు. ఎలిజబెత్ అజాగ్రత్తకి శిక్షగా ఆమెకి ఎటువంటి వేతనం ఇవ్వటం కుదరదని అంటారు. పోలీసుల విచారణ జరుగుతుంది కానీ చనిపోయిన పిల్ల కోసం ఇంకేం విచారణ చేస్తారు? ఆమె చనిపోయిందంటే నమ్మని వారు ఎవరూ లేరు. కొన్నాళ్ళ తర్వాత ఎలిజబెత్ ఐర్లండ్ రాజధాని డబ్లిన్‌కి వెళ్ళి విల్, నాన్‌లను కలుసుకుంటుంది. ఎలిజబెత్, విల్ తమ ఇంటి పేరు మార్చుకుని నాన్‌ని తీసుకుని ఇంగ్లండ్‌కి వెళ్ళటంతో చిత్రం ముగుస్తుంది.

ఎలిజబెత్‌కి ఒక బిడ్డ దొరికింది. ఆనాకి నాన్‌గా కొత్త జీవితం దొరికింది. నాన్ తానొక కొత్త జన్మ ఎత్తానని అనుకుంటుంది. ఆమె ఎదిగే కొద్దీ ఆమె మతవిశ్వాసాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరమైన అంశం. కానీ ఈ చిత్రం కేవలం ఆమెని మూఢాచారాల నుంచి కాపాడటం పైనే దృష్టి పెట్టింది. చివరికి ఇదంతా ఒక కల్పిత కథ అని సూచించే విధంగా సినిమా సెట్టుని చూపిస్తాడు దర్శకుడు. ఇలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. వివాదాలు లేకుండా జాగ్రత్త పడ్డారేమో. మతబోధనలని వక్రీకరించి అహంకారంతో, మమకారంతో వింత ఆచారాలు పాటించేవారు ఉంటూనే ఉంటారు. చేతబడులు, నరబలులు జరగటం చూస్తూనే ఉన్నాం. దేవుడంటే మన కోరికలు తీర్చే సాధనం కాదు. దేవుడు మనం చేరుకోవలసిన గమ్యం. శరీరం దేవుడిచ్చిన సాధనం. శరీరాన్ని కృశింపజేస్తే దేవుడు సంతోషిస్తాడనుకోవటం మూర్ఖత్వం. మన కర్తవ్యం మనం చేస్తూ దేవుడిని స్మరించటమే నిజమైన సాధన.

Exit mobile version