[సంచిక పాఠకుల కోసం ‘రామ్ ప్రసాద్ కీ తేరహ్వీ’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు. ]
మనిషి మరణించాక సమాజం అతని గురించి ఏమనుకున్నా కుటుంబసభ్యులు మాత్రం అతని వలన కలిగిన లాభనష్టాల గురించే మాట్లాడుకుంటారు. ఇది కఠోరసత్యం. ఇది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. అప్పుడే వైరాగ్యం అలవడుతుంది. ‘నా బాధ్యతగా చేశాను. వారి నుంచి ఏమీ ఆశించను. పొగిడినా సరే. తెగిడిగా సరే’ అనుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. ‘అందరూ ఎలా ఉన్నా నా కుటుంబం వేరు’ అనుకుంటే అది మూర్ఖత్వమే. ‘రామ్ ప్రసాద్ కీ తేరహ్వీ’ (2021) చిత్రం ఒక వ్యక్తి మరణానంతరం జరిగే పరిణామాలు చూపించి మనల్ని హెచ్చరిస్తుంది. ఇలాంటి కథల నుంచి మనం జీవితపాఠాలు (మరణపాఠాలు అనాలేమో) నేర్చుకోవచ్చు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా చనిపోతే పదకొండో రోజు వరకు కర్మకాండ చేస్తారు. ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల్లో పదమూడో రోజు వరకు చేస్తారు. ఆ పదమూడో రోజునే ‘తేరహ్వీ’ అంటారు.
లక్నోలో ఉండే రామ్ ప్రసాద్‌కి సంగీతమంటే ఇష్టం. కానీ కుటుంబబాధ్యతల వల్ల సంగీతవాయిద్యాల రిపేరు షాపు పెట్టుకుని బతికాడు. ఇప్పుడు ముసలితనం. ఇంట్లో ఒక పియానో ఉంటుంది. దాని మీద పక్కింటి కుర్రాడికి సంగీతం నేర్పిస్తుంటాడు. ఒకరోజు పియానో సరిగ్గా పలకకపోతే అతనికి అది అపస్వరం ఎందుకు పలకుతోందో చూసేదాకా నిద్రపట్టదు. అలా చూస్తూ పియానో మీదే ఒరిగిపోతాడు. ప్రాణాలు వదిలేస్తాడు. ఆయన భార్య ఆయన మీద విసుక్కుంటూ ఉండేది. ఇప్పుడు విసుక్కోవటానికి కూడా ఎవరూ లేరు. వారికి ఆరుగురు సంతానం. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. అందరూ కుటుంబాలతో సహా వస్తారు. చివరి కొడుకు నిశాంత్ మాత్రం ఒక్కడే వస్తాడు, భార్య లేకుండా. తల్లి పేరు సినిమాలో చెప్పలేదు. అందరూ అమ్మ అనే పిలుస్తారు. ఆమె అన్నగారు మాత్రం ఆమెని లాలీ అని పిలుస్తాడు. ఆయన్ని అందరూ మామాజీ అనే పిలుస్తారు. ఆయన పెత్తనం చేయటానికి ప్రయత్నిస్తే రామ్ ప్రసాద్ కొడుకులకి నచ్చదు. కానీ ఆయన నోరు పెద్దది. వినక తప్పదు. రామ్ ప్రసాద్ అన్నగారు సంపన్నుడు. ఆయనకి భేషజం ఎక్కువ. రామ్ ప్రసాద్‌కి ఒక అక్క. ఆమె వీల్ చెయిర్లో ఉంటుంది. చింత చచ్చినా పులుపు చావలేదు. రామ్ ప్రసాద్ ఇల్లు పెద్దది. దుకాణం ఉంది. దాని మీద అప్పు కూడా ఉంది.
మొదటి కీచులాట కొడుకులకి, మామాజీకి మధ్య జరుగుతుంది. మూడో కొడుకు రైలు లేటయింది అంటాడు. రెండో కొడుకు “మేము టాక్సీలో వచ్చేశాం” అంటాడు. అదో గొప్ప. మామాజీ “అందరి కంటే ముందు నేనొచ్చాను” అంటాడు. అప్పటికి నిశాంత్ రాకపోతే “ఎందుకు రాలేదు? బాధ్యత లేదా?” అంటాడు. పెద్ద కొడుకు “వాడు ముంబయి నుంచి రావాలి. విమానం లేటయింది. మేమొచ్చేశాంగా. మీరు కూర్చోండి” అంటాడు. “కూర్చుంటే ఎలా? పనులన్నీ ఎవరు చేస్తారు?” అంటాడు మామాజీ. పెద్దల్లుడు “నేను ఎప్పుడో వచ్చాను. నన్నెవరూ పట్టించుకోరు” అంటాడు. ఎవరి అహం వారిది. ఈ పెద్దల్లుడే దహనం జరిగే చోట కట్టెల కోసం బేరమాడతాడు.
కొడుకులు కీచులాడుకుంటుంటే కోడళ్ళు మాత్రం విచిత్రంగా సఖ్యంగా ఉంటారు. ఎందుకుంటే అందరు కోడళ్ళూ కలిసి చిన్నకోడలిని ఆడిపోసుకుంటారు. ఆడపడుచుల మాట చెప్పక్కరలేదు. “మామగారు పోయినప్పుడైనా రావొచ్చుగా” అంటుంది పెద్ద ఆడపడుచు. చుట్టుపక్కలవారు పలకరింపులకి వచ్చి ఏమయింది అని అడిగితే ఆమ్మ “పిల్లవాడు పియానో వాయించి బయల్దేరాడు. ఆయన పియానో దగ్గరకి వెళ్ళి అక్కడే ఒరిగిపోయారు. పిల్లవాడిని వెనక్కి పిలిచాను చూడమని” అంటుంది. ఊరివారు తక్కువేం కాదు. “ఇరుగుపొరుగే పిలుపుకి అందుతారు. సొంతవారు ఎక్కడొస్తారు?” అంటారు. రాత్రి కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చుంటారు. “మేం దీపావళికి వచ్చి వెళ్ళాం” అంటాడు పెద్దకొడుకు. రెండోవాడు “మేం కొత్త సంవత్సరం ఇక్కడే చేసుకోవాలనుకున్నాం” అంటాడు. పెద్ద కూతురు “మీరొచ్చి ఇక్కడ ఎక్కువ రోజులు ఎప్పుడు ఉన్నారు గనక? మీ పిల్లలకి చదువులుంటే మాత్రం.. సెలవులే ఉండవా ఏమిటి? నిశాంత్కైతే పిల్లలు కూడా లేరు” అంటుంది దెప్పిపొడుస్తూ.
మర్నాడు మూడో వాడు నిశాంత్‌ని “సీమ ఎందుకు రాలేదు?” అని అడుగుతాడు. “నీకు తెలుసుగా ఆమె సంగతి” అంటాడు నిశాంత్. “ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పావు?” అంటే “ఆమెకి ఒంట్లో బాలేదని చెప్పాను” అంటాడు. “అమ్మ అర్థం చేసుకుంటుంది. కానీ పెద్దక్క గొడవ చేస్తుంది” అంటాడు మూడో వాడు. రెండో కొడుకు రామ్ ప్రసాద్ ఫోటోకి పెద్ద ఫ్రేమ్ కట్టించి తీసుకువస్తాడు. “పదమూడు రోజుల కార్యక్రమం చెయ్యాలా లేక నాలుగు రోజులా అని పంతులుగారు అడిగారు” అంటాడు. చిన్న కూతురు “పదమూడు రోజులూ చెయ్యాలని అమ్మ కోరిక” అంటుంది. కొడుకులందరూ అస్థికలు కాశీలో గంగలో కలపటానికి బయల్దేరతారు. మామాజీ “పెద్ద కొడుకు వెళ్ళకూడదు. నువ్వు కొరివి పెట్టావు. ఇల్లు కదలకూడదు” అంటాడు. పెదనాన్న “వెళ్ళొచ్చు. నా కారులో హాయిగా వెళ్ళండి” అంటాడు. “ఇదేదో తిరనాళ్ళలా ఉంది” అని మామాజీ ఉడుక్కుంటూ లోపలికి పోతాడు. వచ్చిన వాళ్ళందరికీ అమ్మ పియానో కథ వినిపిస్తుంటే పెద్ద మనవళ్ళిద్దరికీ నవ్వు వస్తూ ఉంటుంది. ఒకడు పెద్ద కొడుకు కొడుకు. ఒకడు రెండో కొడుకు కొడుకు. ఇద్దరిదీ కాలేజీ వయసు. పెద్ద మనవడు పక్కింటి అమ్మాయితో చనువుగా ఉంటాడు. ఆమెకి కూడా అతనంటే ఇష్టం. వారి వ్యామోహాలు వారివి. సంసార లంపటం అక్కడే మొదలవుతుందని తెలియని వయసు.
అస్థికలు కలపటానికి వెళ్ళేదారిలో కారు ఆగిపోవటంతో కొడుకులందరూ ఒక సత్రంలో దిగుతారు. అక్కడ రాత్రి మద్యం తాగుతారు. పెద్ద కొడుకు “నాన్న మనకోసం ఏం చేశారు? ఆయన సంగీతం ఆయనది. అమ్మ మహా కంత్రీది. నా మీద నాన్నకి ఉన్నవీ లేనివీ చెప్పి కొట్టించేది” అంటాడు. నిశాంత్ ఈ మాటలు ఆపబోతాడు కానీ మూడోవాడు “చెప్పుకోకపోతే ఎలా? నన్ను చూడండి. నేనెందులో వేలు పెట్టినా ఓటమే” అంటాడు. రెండో వాడు “నాకెప్పుడూ కటకటే. మీరెవరన్నా నా గురించి పట్టించుకున్నారా? మా మామగారే పట్టించుకున్నారు” అంటాడు. విషయం ఏమిటంటే అతను ఇల్లరికపు అల్లుడు. అతని భార్య కూడా తోడికోడళ్ళ దగ్గర “మామగారు ‘నువ్వు పెద్దింటి పిల్లవి. నీ తీరే వేరు’ అనేవారు” అంటుంది తోడికోడళ్ళ దగ్గర. ఎంత చేసినా కొడుకులు ‘మాకేం చేశారు?’ అనే అంటారు. లోకం తీరే అంత. జీవితమంటే ఒడిదుడుకులు ఉంటాయి. తమ వైఫల్యాలకి తలిదండ్రులని నిందించటం మామూలైపోయింది. ‘మా నాన్న సంపాదించలేదు కాబట్టి మాకీ గతి పట్టింది’ అనే కొడుకులే ఎక్కువ. ఉన్నదానితో సంతృప్తి అయినా ఉండాలి. లేకపోతే నేనే కష్టపడతాను అనే పట్టుదలైనా ఉండాలి. తలిదండ్రులు కూడా కాస్త వైరాగ్యం అలవరచుకోవాలి. ముసలితనంలో కూడా పిల్లల గురించి తాపత్రయపడతూ ఉండకూడదు. వారి నుంచి ఏమీ ఆశించకూడదు. ‘పెంచాం కదా. ఆశ ఉండదా?’ అంటే ఉండకూడదు అనే చెప్పాలి. తమ జాగ్రత్తలో తాము ఉండాలి. అంతే. ‘కా తే కాంతా కస్తే పుత్ర్రః’ (ఎవరు నీ భార్య, ఎవరు నీ కొడుకు) అని జగద్గురువు ఎప్పుడో చెప్పారు. ఈ బంధాలేవీ నిలబడవు.
అమ్మ పక్షపాతం చూపించదు. వంట కూడా కూతుళ్ళనే చేయమంటుంది. కోడళ్ళు చేయకూడదు అంటుంది. రామ్ ప్రసాద్ చనిపోయినది డిసెంబర్ 19వ తేదీ. చలి బాగా ఉండే కాలం. పదమూడో రోజు జనవరి ఒకటిన వస్తుంది. ఆ రోజు అందరూ కొత్త సంవత్సరం పార్టీలు చేసుకుంటారని పెద్దకొడుకు జనవరి రెండునో, డిసెంబరు 31నో తేరహ్వీ జరుపుదాం అంటాడు. దీని గురించి రభస జరుగుతుంది. పెద్దల్లుడు ఒక మాట అంటాడు. మామాజీ ఒక మాట అంటాడు. రామ్ ప్రసాద్ అన్న, అక్క కూడా చెరో మాట అంటారు. ఇద్దరూ కీచులాడుకుంటారు. చివరికి జనవరి ఒకటినే జరపాలని నిశ్చయిస్తారు. తన మాట చెల్లలేదని మామాజీ “నా చెల్లెలు ఉన్నంత వరకు బంధం ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం” అని లేచిపోతాడు. ఇంతలో చిన్న కోడలు సీమ వస్తుంది. ఇప్పటికే చిటపటలాడుతున్న వారంతా ఆమె రాకతో గుసగుసలు మొదలెడతారు. ఇదంతా తుఫాను ముందరి ప్రశాంతతలా ఉంటుంది. ఒకరోజు విస్ఫోటం జరగనే జరుగుతుంది. ఒక పక్క అమ్మ ఎవరి దగ్గర ఉండాలి అనే చర్చ. మరో పక్క రామ్ ప్రసాద్‌కి అప్పు ఇచ్చిన బ్యాంకు వారు వాయిదాల గురించి అడగటానికి వస్తారు. ఇక్కడ రహస్యాలన్నీ బయటపడతాయి.
సీమా పాహ్వా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించింది. ఆమె హిందీ చిత్రరంగంలో మంచి పేరున్న నటి. 80వ దశకంలో ‘హమ్ లోగ్’ సీరియల్లో నటించింది. ఈ చిత్రంలో హేమాహేమీల్లాంటి నటీనటులు నటించారు. అమ్మగా సుప్రియా పాఠక్, సీమగా కొంకణా సేన్ శర్మ ముఖ్యపాత్రలు పోషించారు. మిగతా పాత్రల్లో మనోజ్ పాహ్వా (ఈయన దర్శకురాలి భర్త), వినయ్ పాఠక్, పరమ్‌బ్రత చట్టోపాధ్యాయ్, విక్రాంత్ మాసే (2023కి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు), దీపికా అమీన్, దివ్యా జగ్దలే, వినీత్ కుమార్, బ్రిజేంద్ర కలా తదితరులు నటించారు. అమ్మ పాత్రలో సుప్రియా పాఠక్ వయసు చిన్నగానే కనిపిస్తుంది. సీమ పాత్రలో కొంకణా వయసు కాస్త పెద్దగా అనుపిస్తుంది. కానీ నటనలో వారికి వారే సాటి. రామ్ ప్రసాద్‌గా అతిథి పాత్రలో నసీరుద్దిన్ షా నటించాడు. చిత్రం పొడుగునా ఆయన అమ్మకి ఆత్మగా కనిపిస్తూ ఉంటాడు. హిందూ శాస్త్రాల ప్రకారం జీవాత్మ శరీరం విడిచాక ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది, మమకారం చావక. ఈ విషయాన్నే చిత్రంలో అలా చూపించారు.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. స్పాయిలర్లు ఉంటాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
కీచులాటలతో అమ్మకి మనసు క్షోభ పడుతుంది. చావు ఇంట్లో కొడుకులు మద్యం తాగుతున్నారని తెలుస్తుంది. మనవళ్ళు సెలవులకి వచ్చినట్టు బయట తిరగటం గమనిస్తుంది. చిన్న కూతురితో తన బాధ చెప్పుకుంటుంది. “అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నట్టే ఉంది” అంటుంది. మాటల్లో చిన్న కూతురు “నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు?” అని అడుగుతుంది. అమ్మ జవాబు దాటవేస్తుంది. “నిశాంత్, సీమల మధ్య ఏదైనా గొడవా?” అని అడుగుతుంది. “అలాగే ఉంది. నటి కావాలని ముంబయి వెళ్ళింది. ఏం సాధించింది? వాళ్ళ అన్నని పట్టుకుని వేళ్ళాడుతుంది. అతనూ నటుడే కదా. మన దగ్గర కూడా నటిస్తాడు” అంటుంది చిన్న కూతురు.
మర్నాడు సీమ వంటింట్లోకి వచ్చి టీ తీసుకువెళ్ళి మగవాళ్ళకి ఇస్తుంది. “అందరికీ తాను కూడా పని చేస్తున్నానని చూపించాలి కదా. మహానటి మరి” అని తోటికోడళ్ళ దగ్గర ఎకసెక్కం చేస్తుంది మూడో కోడలు. వాళ్ళు నవ్వుతున్నప్పుడే చిన్న ఆడపడుచు వస్తుంది. చావు ఇంట్లో నవ్వితే అదో నేరం. “అమ్మ ఇక్కడ ఒక్కతే ఉండలేదు. మీరు ఇక్కడికొచ్చి ఉంటారో, అమ్మని మీ దగ్గర ఉంచుకుంటారో తేల్చుకోండి” అని వెళ్ళిపోతుంది చిన్న ఆడపడుచు. “అది తల్లీకొడుకులు తేల్చుకోవాలి. మనకేంటి?” అంటుంది పెద్దకోడలు తోటికోడళ్ళతో. “తేల్చుకోమనండి. అప్పుడు కానీ అసలు రంగు బయటపడదు” అంటుంది మూడో కోడలు. అందరూ నవ్వుతుంటే అప్పుడే వచ్చిన సీమ తన గురించే నవ్వుతున్నారని విసవిసా వెళ్ళిపోతుంది. పెద్ద కోడలు వెనకాలే వెళుతుంది. సీమని ఏమైందని అడుగుతుంది. “నన్ను చూసి అందరికీ వేళాకోళమే. మేం మామగారి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బు పంపించాం. ఎవరైనా కనీసం థ్యాంక్స్ చెప్పారా? డబ్బు కావాలన్నప్పుడు మాత్రం మేం గుర్తుకొస్తాం” అంటుంది సీమ. పెద్ద కోడలు “అదేం మాట? మా అబ్బాయి అడ్మిషన్ కోసం పాతిక వేలు తీసుకున్నామే అనుకో. తిరిగి ఇచ్చేశాం కదా” అంటుంది. “మూడో ఆయన యాభై వేలు మింగేశారుగా” అంటుంది సీమ. “ఆ గొడవలోకి నన్ను లాగకు” అని పెద్ద కోడలు కోపంగా వెళ్ళిపోతుంది.
కుటుంబాల్లో ఆర్థిక వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. తీసుకున్నవాళ్ళకి కృతజ్ఞత ఉండదు. మావాడు కాబట్టి తీసుకున్నాం అంటారు. మరి తండ్రి ‘మావాడు’ కాదా? తండ్రికి ఆసరాగా ఉండాలిగా? తమకి అవసరమైనపుడు అంతా మనవాళ్ళే. అవతలివారికి అవసరమైతే ‘మాకు ఖాళీ లేదు’ అని తప్పించుకోవటం. సాయమంటే డబ్బే కాదు, సేవ చేయొచ్చు. అసలు లక్నో పెద్ద నగరం. కావాలంటే ఉద్యోగాలు దొరక్కపోవు. పెళ్ళాల మాట విని వేరు కాపురాలు, వేరే ఊళ్ళో నివాసాలు. తన భర్త నిశాంత్, సీమల దగ్గర డబ్బు తీసుకున్నాడని తెలిసినా మూడో కోడలు సీమనే వెక్కిరిస్తూ ఉంటుంది. ఇదో రకం అసూయ. అసలు డబ్బు నిశాంత్దే అయి ఉంటుంది. అతను ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు. అన్నలకి అవసరాలకి ఇచ్చాడు. సీమ ఆ విషయాన్ని వదిలేయవచ్చు. ‘డబ్బు తీసుకుని పైగా మాటలా’ అని ఆమె బాధ. ఇది ఎంతకీ వీడని చిక్కుముడి. విచిత్రమేమిటంటే సీమ గురించి నవ్వినపుడు సీమ అక్కడ లేదు. వేరే విషయం గురించి నవ్వుతుంటే అప్పుడే వచ్చి తన గురించి నవ్వుతున్నారనుకుంటుంది. నిజమా అంటే కాదు. అబద్ధమా అంటే అదీ కాదు. అంతా మాయ. జగన్నాటకం! ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. నలుగురిలో ముగ్గురు కొడుకులవి ఆర్థిక సమస్యలు. చివరి కొడుకు నిశాంత్ ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నాడు. కానీ అతనిది ఇంకో రకం సమస్య. డబ్బుంటే సమస్యలు ఉండవనుకోవటం మూర్ఖత్వం.
సీమ అన్న మాట మూడో కొడుక్కి తెలిసిపోతుంది. “అందరి ముందు నా పరువు తీసింది” అని మిగతా అన్నదమ్ముల దగ్గర చిర్రుబుర్రులాడతాడు. నిశాంత్ సముదాయిస్తాడు. కొడుకుల సంగతి ఇలా ఉంటే కూతుళ్ళు ఏం తక్కువ తినలేదు. చిన్న కూతురు అమ్మ గురించి బాధపడుతుంటే పెద్ద కూతురు కోడళ్ళ ఎదుటే “అమ్మకి ఇప్పుడు ఇంత శోకం ఎందుకు? ఇన్నాళ్ళూ నాన్నని ఆడిపోసుకుంటూనే ఉంది కదా. నన్నేమో పదహారేళ్ళకే పెళ్ళి చేసి పంపేసింది. నా మొగుడికి నిలకడైన ఉద్యోగం లేదని తెలిసి కూడా. బతుకంతా పుట్టింటి సొమ్ము మీదే ఆధారపడ్డాను. దానికి మాటలు పడ్డాను. నా మొగుడికి కూడా ఈ ఇంట్లో మర్యాద లేదు” అంటుంది. అన్ని మాటలూ ఆమే అంటుంది. ఇలాంటి వాళ్ళు మాటని ఎలాగైనా తిప్పగలరు.
ఇదిలా ఉండగా బ్యాంకు వాళ్ళు వచ్చి అప్పు సంగతి అడుగుతారు. అప్పు పది లక్షలు. దుకాణం తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు. “అంత అప్పు ఎందుకు తీసుకున్నారు?” అని నిశాంత్ తప్ప ముగ్గురు కొడుకులూ అమ్మని అడుగుతారు. ఆమె లెక్కలు చూపిస్తుంది. పెద్ద కూతురికి, ముగ్గురు కొడుకులకి ఇవ్వటానికే రామ్ ప్రసాద్ అప్పు తీసుకున్నాడని తెలుస్తుంది. పైగా ఆయన ఖర్చులు ఉండవా? రెండో కొడుకు మామగారిని పొగిడాడు. అతను కూడా తండ్రి దగ్గర డబ్బు తీసుకున్నాడు. డబ్బు తీసుకుని కూడా కొడుకులు ఇలా అడుగుతున్నారని అమ్మకి నిర్వేదంగా ఉంటుంది. పెద్ద కూతురు “అమ్మ నాకు బలవంతంగా డబ్బు ఇచ్చింది” అంటుంది. కొడుకులు తండ్రికి తిరిగి ఇచ్చిన డబ్బు వివరాలు కూడా ఉంటాయి. పెద్దవాడు మొత్తం తిరిగి ఇచ్చినా మిగతా ఇద్దరు పూర్తిగా తిరిగి ఇవ్వలేదు. మొదట్లో తండ్రి కొడుకులని పట్టించుకోలేదని ప్రేక్షకుల్లో ఎవరికైనా అనిపిస్తే ఇక్కడ నిజం బయటపడుతుంది. తండ్రి డబ్బు ఇస్తుంటే తీసుకోవటమే కానీ ఎలా వచ్చింది అని ఒక్కరూ అడగలేదు. పైగా తండ్రి మాకు ఏం చేశాడని అంటారు. ఇది చూసి కూడా వైరాగ్యం రాకపోతే మనదే తప్పు. లోకం ఇలాగే ఉంటుంది. అందుకే అంటీ ముట్టనట్టు ఉండాలి. నిజానికి రామ్ ప్రసాద్ చేసింది తప్పు. అప్పు చేసి పిల్లలకి ఇవ్వాలా? ఇవ్వకుండా ఉంటే అమ్మ అయినా ప్రశాంతంగా ఉండేది. అసలు అమ్మే నస పెట్టి అప్పు చేయించిందేమో? అలా అయితే ఇప్పుడు ఆమెకి బాగా బుద్ధి వచ్చింది.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
అప్పు సంగతి తెలిసి అందరికీ గుండెల్లో రాయి పడుతుంది. బాకీ ఎనిమిది లక్షలు. దుకాణం తాకట్టులో ఉంది. అమ్మటానికి వీలు లేదు. కొడుకులు అప్పు ఎలా తీర్చాలా అని తలలు బద్దలుకొట్టుకుంటూ ఉంటారు. సీమకి సందు దొరికినట్టుంటుంది. తోటికోడళ్ళ దగ్గర “నేను రాకపోకలు మానేసినందుకు చెడ్డదాన్నయ్యాను. కానీ ఇంటిని అప్పులపాలు చేసింది నేను కాదుగా” అంటుంది. నిశాంత్ వచ్చి “ఆపు నీ గోల. సఖ్యంగా మట్లాడలేకపోతే పోయావు గానీ గొడవలు పెట్టకు” అంటాడు. సీమ నిర్ఘాంతపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె బట్టలు సర్దుకుంటుంటే పెద్ద కోడలు వచ్చి “అందరి ముందూ యాగీ చేయకు. బంధువులు వెళ్ళాక మాట్లాడుకుందాం” అంటుంది. “ఏఁ? అందరి ముందు మాట్లాడటానికి భయమెందుకు?” అంటుంది సీమ. పెద్ద కోడలు “నువ్వు చేసిన నిర్వాకం చెబితే నీకు ముఖం చెల్లదు. నిశాంత్‌కి పిల్లలంటే ఎంత ఇష్టం. అతనికి సంతోషం లేకుండా చేశావు. నువ్వు నటి కావాలని ముంబయి వెళితే నీ కోసం అతను వచ్చాడు. అందరి ముద్దుల కొడుక్కి ఎంత కష్టం వచ్చింది!” అంటుంది. పెద్ద వదినగా మరిది మీద ఆమెకి వాత్సల్యం ఉంటుంది. అతని కాపురం బాగాలేదని బాధ ఉంటుంది. సీమ డబ్బు గురించే ఆలోచించింది కానీ డబ్బుకి మించి జీవితంలో ప్రాధాన్యం ఉన్నవి చాలా ఉంటాయని తెలుసుకోలేకపోయింది. మూడో కోడలు సీమని మేడ మీద గదిలో ఉండమని పంపిస్తుంది. ఆమె తెలివైనది. ఎక్కడ మాట్లాడాల్సింది అక్కడ మాట్లాడుతుంది.
నిశాంత్ సీమతో మాట్లాడతాడు. ఆమె వెళ్ళిపోతానంటుంది. “రేపు డిసెంబర్ 31 కదా. ఫ్లైట్ టికెట్స్ లేవు. జనవరి 2న వెళ్ళొచ్చు. అప్పటికి తేరహ్వీ కూడా అయిపోతుంది” అంటాడతను. “ఇక్కడ నాకు ముళ్ళ మీద ఉన్నట్టు ఉంది. డబ్బులు ఇచ్చేదీ మనమే. హేళన పడేదీ మనమే” అంటుందామె. “ఈ పరిస్థితిలో గొడవ పెట్టుకోలేం కదా?” అంటాడతను. “గొడవెందుకు? నిజం ఒప్పుకుంటే చాలు” అంటుందామె. “నీ నిజం నువ్వు ఒప్పుకున్నావా?” అంటాడతను. సీమ “ఏం నిజం?” అని అడుగుతున్నా “వదిలెయ్” అని వెళ్ళిపోతాడు. ఆమె కుంగిపోయి మద్యం తాగుతుంది. అప్పుడే పెద్ద మనవడు అక్కడికి వస్తాడు. వారిద్దరికీ వయసులో పెద్ద తేడా లేదు. అతనికి ఆమె అంటే ఇష్టం. ఆమెకి ఇది తెలుసు. ఇది ఇబ్బందిగా ఉన్నా నిజం. మద్యం మత్తులో ఆమె “నీకు నేనంటే ఇష్టం కదా. నిజం చెప్పటానికి భయమెందుకు?” అంటుంది. ఎవరికీ తానంటే ఇష్టం లేదని, ఈ అబ్బాయికి ఇష్టం ఉన్నా చెప్పటం లేదని ఆమె బాధ. ఇష్టమైనవన్నీ బయట పెట్టుకుంటే చాలా ప్రమాదం. కొన్ని కట్టుబాట్ల గిరిలో ఉండిపోవాలి. ఆ అబ్బాయి ‘అందరూ నాటకాలు ఆడతారు. ఈమె మాత్రమే ఉన్నదున్నట్టు అంటుంది’ అనుకుంటాడు. కొత్త తరం కదా. కొత్త తరం వారికి విలువల గురించి చెబితే గిబితే తలిదండ్రులే చెబుతారు. బయటకి వెళితే ఎవరూ చెప్పటం లేదు. కాలేజీల్లో విలువల గురించి బోధించటం ఎప్పుడో మానేశారు. తలిదండ్రుల్లో లోపాలు కనపడతాయి. ఇక కొత్త తరం తప్పుదోవ పట్టటంలో ఆశ్చర్యం ఏముంది? సీమ లాంటి వాళ్ళు నాగరికత పేరుతో మద్యం తాగి అతిగా ప్రవర్తిస్తారు. మగవాళ్ళు తాగగా లేనిది ఆడవాళ్ళు తాగితే అభ్యంతరమా అంటే అసలు ఎవరూ మద్యం తాగకూడదు. మనశ్శాంతి లేకపోతే మాట్లాడుకుని మనసుని మార్చుకోవాలి కానీ మద్యం ఆసరా తీసుకోకూడదు. చివరికి సీమ పడుకుంటుంది. ఆ అబ్బాయి చీకట్లో ఆమెని ముద్దుపెట్టుకోబోతాడు, కానీ తమ్ముడు రావటంతో ఆదరాబాదరాగా వెళ్ళిపోతాడు.
డిసెంబర్ 31న ఊరంతా సంబరాల్లో ఉంటుంది. మూడో కొడుకు అమ్మ ఇచ్చిందని తండ్రి కోటు వేసుకుంటే పెద్ద కొడుకు “అందరూ దొంగలే. దొరికినంత పట్టుకు పోవాలనే చూస్తున్నారు. సిగ్గు లేకుండా” అంటాడు. సీమ అమ్మ గది పక్క నుంచి వెళుతుంటే ఆమెకి అమ్మ, మామాజీ మాటలు వినపడతాయి. మామాజీ భార్య కూడా అక్కడే ఉంటుంది. మామాజీ “అందరి దగ్గర కొన్నేసి నాళ్ళు ఉంటే సరిపోతుంది. ముగ్గురు కోడళ్ళు మంచివారేగా” అంటాడు. చిన్న కోడలు కలుపుగోలుగా ఉండదని ఆయన అభిప్రాయం. “వాళ్ళు పైకే అలా ఉంటారు. పదమూడు రోజులు కాకుండానే అందరూ దెబ్బలాడుకుంటున్నారు. కుటుంబాన్ని పోషించటానికి ఆయన కోరికలని చంపుకున్నారు. పల్లెత్తు మాట అనలేదు. పియానో వాయించి ఆనందపడేవారు. ‘వాయిద్యాలని ఎలాగోలా మరమ్మతు చేసి శ్రుతి చేస్తాను. కానీ నా పిల్లల బతుకుల్ని శ్రుతి చేయలేకపోయాను’ అనేవారు” అంటుంది అమ్మ. “వీళ్ళలో ఎవరికీ విశ్వాసం లేదు” అంటాడు మామాజీ. “వారి తప్పు లేదు. మా పెంపకంలోనే లోపం ఉందేమో. వీళ్ళకి కృతజ్ఞత నేర్పలేదు. సొంతవాళ్ళకి థ్యాంక్స్, సారీ చెప్పటం మనకి గుర్తే ఉండదు. వాళ్ళ బాధ్యత అనుకుంటాం. వాళ్ళు మనకి సాయం చేస్తున్నారనే విషయం మర్చిపోతాం. ఆలస్యం కాక ముందే అందరికీ థ్యాంక్స్ చెప్పాలి” అంటుంది అమ్మ. అమ్మ తన గురించే మాట్లాడుతోంది. ఆమె ఎప్పుడూ భర్తకి థ్యాంక్స్ చెప్పలేదు. పైకి చెప్పక్కరలేదు, మనసులో ఉంటే అదే చేతల్లో కనపడుతుంది. మనసుకి అవతలి వ్యక్తి విలువ తెలిసేసరికి ఆలస్యం అయిపోయింది. అమ్మ మాటలు విని సీమకి మనసు చలించిపోతుంది. ఆమె చేసిన తప్పు గుర్తొస్తుంది. ఆమె అబార్షన్ చేయించుకుంది. “నేను నిర్ణయించుకున్నాను. నువ్వు సంతకం మాత్రం చెయ్యి” అని మాత్రం భర్తని అడిగింది. అతను మారు మాటాడకుండా సంతకం చేశాడు. ఆమెకి తన తప్పు ఇప్పుడు తెలిసింది. భర్త దగ్గరకి వెళ్ళి సారీ చెబుతుంది. అతను ఆమెని అక్కున చేర్చుకుంటాడు.
మర్నాడు తేరహ్వీ. మామాజీ స్నానానికి సాయం చేస్తున్న భార్యకి థ్యాంక్స్ చెబుతాడు. మార్పు చిన్నగానే మొదలవుతుంది. నిశాంత్, సీమ సఖ్యంగా కనిపించటంతో అమ్మ సంతోషిస్తుంది. అందరికీ భోజనాలు పెట్టిన తర్వాత పంతులు గారు “వచ్చే సంవత్సరం అందరూ మళ్ళీ రావాలి. ఈ తంతు మళ్ళీ జరిపించాలి. అప్పుడే ఆయన ఆత్మకి ముక్తి” అంటారు. అమ్మ “ఇప్పుడే ఆ తంతేదో జరిపించండి. ఆయనకి ఇప్పుడే ముక్తి లభించాలి” అంటుంది. పైకి అందరూ ఆశ్చర్యపడినా పై ఏడాది మళ్ళీ రానక్కరలేదు అని ఒప్పుకుంటారు. పంతులు గారు ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు. తర్వాత అందరూ ప్రయాణానికి సిధ్ధం అవుతారు. ముగ్గురు కోడళ్ళు అమ్మ సంగతి ఏం చెయ్యాలి అని మల్లగుల్లాలు పడుతూ ఉంటారు. అది ఎంతకీ తేలదు. సీమ నిశాంత్‌ని అమ్మ సంగతి ఏం చేద్దాం అని అడుగుతుంది. “మా అమ్మానాన్న మాకు బాధ్యత నేర్పలేదు. ఇప్పుడు అందరికీ పెద్దరికం చూపించే అవకాశం వచ్చింది. మంచిదే. అమ్మకి మనం ఉండనే ఉన్నాం” అంటాడు. సీమ కూడా సంతోషిస్తుంది. ఎప్పుడూ తీసుకోవటం, ఇచ్చినదానికి లెక్కలడగటం కాదు, ఏం ఆశించకుండా ఇవ్వటం కూడా నేర్చుకోవాలి.
నిశాంత్, సీమ వెళ్ళేటపుడు సీమ అమ్మ దగ్గరకి వెళ్ళి ఆమెని వాటేసుకుంటుంది. అమ్మ ఈ హఠాత్పరిణామానికి ఖంగు తింటుంది. సీమ “సారీ అమ్మా. జాగ్రత్తగా ఉండండి” అంటుంది. నిశాంత్ “నీకు మేమున్నాం” అంటాడు. వాళ్ళు వెళ్ళాక మిగతా కొడుకులు, కూతుళ్ళు అమ్మతో మాట్లాడతారు. “ఈ వాటా ఉంచి మిగతా ఇల్లు అమ్మేద్దాం” అంటాడు రెండో కొడుకు. “అప్పు తీరిపోతుంది. ఇంత పెద్ద ఇల్లు ఎలా చూసుకుంటావు?” అంటాడు పెద్ద కొడుకు. అమ్మ మౌనంగా ఉంటే “ఏదో ఒకటి చెప్పమ్మా” అంటాడు పెద్ద కొడుకు. అమ్మ “మీరు బయల్దేరండి. రైలుకి సమయం అవుతోంది” అంటుంది. అందరూ ముఖముఖాలు చూసుకుంటారు. ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతారు. దారిలో మూడో కొడుకు భార్యతో “అమ్మ ఏదో దాస్తోంది. లోలోపల బాధపడుతుంది కానీ చెప్పదు” అంటాడు. రెండో కొడుకు అప్పు కాగితాలు తీసుకెళతాడు. అది చూసి అతని భార్య “అప్పు మీరు తీరుస్తారా ఏమిటి కొంపదీసి” అంటుంది. పెద్ద కోడలు భర్తతో “ఆవిడ ఏదో ముల్లె దాచింది” అంటుంది. పెద్ద కొడుకు “ఏం దాస్తుంది? ఊరికే వాగుతావు” అని కోప్పడతాడు. ఇలా కొడుకులు తల్లి గురించి చింతపడుతూనే ఉంటారు. కానీ జీవితం అనే పోరాటంలో వారికి తల్లిని చూసుకునే తీరిక లేదు. ఆరాటం తగ్గించుకుంటే తీరిక అదే దొరుకుతుంది. అది తెలియకే పోరాటం. అమ్మ చివరికి తన ఇంటిని సంగీత పాఠశాలగా మారుస్తుంది. పెద్ద ఇల్లు కాబట్టి విశాలంగా ఉంటుంది. ఎందరో టీచర్లు వచ్చి సంగీతం చెబుతారు. పిల్లలతో కోలాహలంగా ఉన్న ఇంట్లో అమ్మ ఆనందంగా ఉంటుంది.
అమ్మ భర్త అశయం కోసం ఇంటిని సంగీత పాఠశాలగా మార్చింది. బంధాల నుంచి బయటపడింది. ఆమెకి దుకాణంతో పనిలేదు. బ్యాంకు వారికి దుకాణం అప్పగించినా ఆశ్చర్యం లేదు. అమ్మకి అనారోగ్యం వస్తే ఎలా? భవిష్యత్తు గురించి ఇప్పుడు ఆలోచించటం ఎందుకు? అది వచ్చినపుడు అప్పుడే ఆలోచించవచ్చు. భవిష్యత్తు గురించి భయపడితే బతుకు జాతర సాగదు. పిల్లలు ఆసరాగా ఉంటే సరేసరి. లేకపోతే సొంతంగా బతకటానికి సిధ్ధంగా ఉండాలి. అందుకే ఆస్తులు పిల్లల పేరు మీద పెట్టకూడదు. కావాలంటే వీలునామా రాయాలి. కాస్త ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి. వైరాగ్యమంటే అన్నీ వదిలేయక్కరలేదు. ఉన్నది జాగ్రత్త చేసుకుని తృప్తిగా బతికితే అదే వైరాగ్యం.