[సంచిక పాఠకుల కోసం ‘ద విజిటర్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
ఒకప్పుడు మనుషులు ప్రపంచంలో ఎక్కడికైనా స్వతంత్రంగా వెళ్ళేవారు. తర్వాత దేశాలు ఏర్పడి ఒక దేశంలో ప్రవేశించాలంటే అనుమతి (వీసా) తీసుకునే పద్ధతి వచ్చింది. అసలు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే ఇది నా దేశం, అది నీ దేశం అనుకోవాల్సిన అవసరం ఏముంది? నమ్మకం లేక దేశాలు ఏర్పడ్డాయా లేక దేశాలు ఏర్పడి మనుషులు వేరయ్యాక నమ్మకం పోయిందా? ఏమో! ఈ సరిహద్దులు మనుషుల్ని ఎలా వేరు చేస్తున్నాయో హృద్యంగా చూపించిన చిత్రం ‘ద విజిటర్’ (2007). సరిహద్దుల వల్ల మనుషులు విడిపోవటమే కాదు, మనసులూ ముక్కలవుతున్నాయి. ఈ చిత్రం యూట్యూబ్‌లో లభ్యం.
వాల్టర్ అమెరికాలోని ఒక యూనివర్సిటీలో అర్థశాస్త్రం బోధించే ప్రొఫెసర్. అర్థశాస్త్రం మీద మూడు పుస్తకాలు రాశాడు. మరో పుస్తకం రాస్తున్నాడు. అతని భార్య పియానో వాద్యకారిణి. ఆమె మరణించాక అతను ఒంటరివాడయ్యాడు. అతనికో కొడుకు ఉన్నాడు కానీ అతని జీవితం అతనిది. భార్య స్మృతిని సజీవంగా ఉంచటానికి వాల్టర్ పియానో నేర్చుకుంటూ ఉంటాడు. కానీ అతనికి ఆ విద్య పట్టుబడదు. అతను గురువులను మారుస్తూ ఉంటాడు. యూనివర్సిటీలో విద్యాసంవత్సరం మొదలై చాలా రోజులైనా అతను సిలబస్ ఇంకా నిర్ధారించలేదు. ఒక విద్యార్థి అడిగాక అతను గత సంవత్సరం సిలబస్ మీద సంవత్సరం మార్చి అదే సిలబస్ ఇస్తాడు. మరో ప్రొఫెసర్‌తో కలిసి అతను ఒక పరిశోధనాపత్రం రాశాడు. ఆ ప్రొఫెసర్ మెటర్నిటీ లీవులో ఉంది. ఆ పత్రం మీద ప్రసంగించటానికి అతన్ని వెళ్ళమని అడిగితే అతను “నేను సిద్ధంగా లేను. ఆమె అడిగింది కాబట్టి సహ రచయితగా ఉండటానికి ఒప్పుకున్నాను అంతే. క్లాసులు కూడా చెప్పాలి. నా పుస్తకం పూర్తి చేయాలి” అంటాడు. అయితే చివరికి అతను వెళ్ళక తప్పదు. యూనివర్సిటీ ప్రతిష్ఠకి సంబంధించిన విషయం మరి. అతను చెప్పేది ఒకటే సబ్జెక్ట్. భార్య మరణించాక అతను కుంగిపోయాడు. పని మీద ఆసక్తి లేదు.
ప్రసంగం చేయాల్సింది న్యూయార్క్ నగరంలో జరిగే ఒక కాన్ఫరెన్స్‌లో. వాల్టర్ ఉండే చోటికి న్యూయార్క్ నగరం దగ్గరే. అక్కడ అతనికి ఒక సొంత అపార్ట్‌మెంట్ ఉంది. ఖాళీగా ఉంచాడు. అయితే అన్ని సౌకర్యాలు, సామాన్లు ఉన్నాయి. అతను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక యువజంట ఉంటారు. వాళ్ళు మొదట అతన్ని దొంగవాడనుకుంటారు. వాళ్ళకి ఒక మోసగాడు ఆ ఇల్లు తనదేనని చెప్పి అద్దెకిచ్చాడు. నిజం తెలుసుకుని వారు అతనికి సారీ చెప్పి, వెళ్ళిపోవటానికి సిద్ధమవుతారు. వారి పేర్లు టారెక్, జెనాబ్. టారెక్ సిరియా వాడు. జెనాబ్ సెనెగల్ నుంచి వచ్చింది. వాల్టర్ వాళ్ళ నిజాయితీ చూసి వేరే చోటు దొరికేవరకు అక్కడ ఉండమంటాడు. ఈ రోజుల్లో అంత నమ్మకం ఊహించలేం. మనిషిని బట్టి నమ్మకం ఉండాలి కానీ అసలు మనిషిని నమ్మకూడదు అనుకుంటే కష్టం.
టారెక్ జెంబె అనే వాయిద్యం వాయిస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అది తబలా లాంటి పరికరమే కానీ తబలాలా రెండు పరికరాలు ఉండవు, ఒకటే పరికరం. పొడుగ్గా ఉంటుంది. వాల్టర్ న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్‌లో ఇద్దరు వాద్యకారులు బకెట్లు బోర్లించి కర్రలతో వాయించటం విని ఆకర్షితుడయ్యాడు. అతనికి ఆ ధ్వని నచ్చింది. భార్యకి పియానో నచ్చిందని అతనికీ నచ్చాలని లేదుగా! పియానో నచ్చకపోతే భార్య స్మృతికి ద్రోహం చేసినట్టు అవుతుందని అతను భావించాడు. ప్రేమ అంటే ఒకరి ఇష్టాలని ఒకరు గౌరవించటమే కానీ వారి ఇష్టాలని మన ఇష్టాలుగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. వాల్టర్ కాన్ఫరెన్స్ మొదటి రోజు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి టారెక్ జెంబె వాయించటం సాధన చేస్తూ ఉంటాడు. టారెక్ వాల్టర్ పట్ల స్నేహంగా ఉంటాడు కానీ జెనాబ్ అతని పట్ల అయిష్టంగా ఉంటుంది. టారెక్ తాను పాల్గొనే ఒక సంగీత కార్యక్రమానికి వాల్టర్‌ని తీసుకువెళతాడు. వాల్టర్‌కి ఆ సంగీతం నచ్చుతుంది. తర్వాత వాల్టర్ ఆసక్తి చూసి టారెక్ అతనికి జెంబె వాయించటం నేర్పించటం మొదలుపెడతాడు. “మీరు మేధావి. కానీ జెంబె వాయించినపుడు ఎక్కువ ఆలోచించవద్దు. వాయించటమే మన పని” అంటాడు టారెక్. వాల్టర్‌కి ఆ విద్య త్వరగా పట్టుబడుతుంది.
జెనాబ్‌కి హస్తకళలు తెలుసు. ఆమె గొలుసులు, చెవిరింగులు తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. వాల్టర్ ప్రసంగం ఇవ్వాల్సిన రోజు వస్తుంది. అతను ప్రసంగం సంతృప్తికరంగా ముగిస్తాడు. ముగించాక టారెక్‌తో కలిసి సెంట్రల్ పార్క్‌కి వెళ్ళి అక్కడ డప్పులు వాయిస్తున్న బృందంతో కలిసి జెంబె వాయిస్తాడు. అందులోనే అతనికి ఆనందం అనుభవానికి వస్తుంది. తర్వాత ఇద్దరూ మెట్రోలో జెనాబ్ దగ్గరకి వెళ్ళటానికి హడావిడిగా స్టేషన్‌కి వెళతారు. జెంబె పరికరం పెద్దది కావటంతో టికెట్ స్కాన్ చేసే చోట టారెక్ ఇరుక్కుపోతాడు. వాల్టర్ సాయం చేస్తాడు. అయితే అప్పటికే స్కానింగ్ సమయం మీరటంతో అడ్డుగా ఉన్న కడ్డీ మూసుకుపోతుంది. టారెక్ ఎలాగూ స్కానింగ్ అయింది కదా అని కడ్డీ దాటుతాడు. ఇది సెక్యూరిటీ గార్డు చూస్తాడు. రుసుం చెల్లించకుండా దాటుతున్నాడనుకుని అతన్ని అరెస్టు చేసి తీసుకుపోతారు. టారెక్ రుసుం చెల్లించాడని వాల్టర్ చెప్పినా వినరు.
వాల్టర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి స్టేట్‌మెంట్ ఇచ్చి ఇంటికి వస్తాడు. జెనాబ్‌కి జరిగింది చెబుతాడు. “మీరు స్టేట్‌మెంటిచ్చినా లాభం లేదు. మేము చట్టవ్యతిరేకంగా ఇక్కడ ఉంటున్నాము. అది వాళ్ళకి తెలిస్తే..” అని లేచి వెళ్ళిపోతుంది. వారికి వీసాలు లేవు. తమ దేశంలో ఉండలేక అమెరికాకి వచ్చారు. మర్నాడు భయపడినంతా జరుగుతుంది. టారెక్‌ని డిటెన్షన్ సెంటర్ (అక్రమ వలసదారుల బందిఖానా)కు తరలిస్తారు. జెనాబ్ అతన్ని కలుకోవటానికి అక్కడికి వెళ్ళటానికి నిరాకరిస్తుంది. ఆమె అక్కడికి వెళితే ఆమె పత్రాలను పరిశీలిస్తారు. ఆమె కూడా అక్రమంగా దేశంలో ఉంటోందని తెలిస్తే ఆమెని కూడా బంధిస్తారు. తర్వాత ఆమె వాల్టర్ ఇంటిలో ఉండటం సబబు కాదని కాస్త దూరంలో ఉన్న తన కజిన్ ఇంటికి వెళ్ళిపోతుంది. అది చాలా చిన్న ఇల్లని చెప్పి టారెక్ సామాను వదిలి వెళుతుంది. వాల్టర్ తన ఖర్చుతో ఒక లాయరుతో అపాయింట్‌మెంట్ తీసుకుంటాడు. టారెక్‌ని ఎలాగైనా బయటకి తీసుకురావాలని కంకణం కట్టుకుంటాడు.
అక్రమ వలసలని సమర్థించలేం, నిజమే. కానీ ఉన్నచోట బతుకు దుర్భరమై వేరే దేశాలకి కొందరు వెళతారు. సిరియా నుంచి తప్పించుకుని ఇటలీకి చేరుకోవటానికి చిన్న పడవల్లో సముద్రం దాటుతూ చనిపోయినవారిలో ఒక పిల్లవాడు ఉండటం దశాబ్దం క్రితం వార్తలకెక్కింది. ఆ పిల్లవాడిది ఏం తప్పు? అలాంటి వారిని జర్మనీ తమ దేశంలోకి అనుమతించింది. కానీ జర్మనీ లాంటి దేశాలలో చిన్న కళాకారులకి పెద్దగా సంపాదన ఉండదు. అమెరికాలో అయితే ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. అందుకే అమెరికాని ‘స్వేచ్ఛాజీవుల గడ్డ’ అంటారు, కాదు కాదు, అనేవారు. 9/11 తర్వాత అమెరికాలో అదో రకమైన భయం ప్రవేశించింది. అందుకే టారెక్ విషయంలో పోలీసులు అతిగా ప్రవర్తించారు. వారి జాగ్రత్త వారిది. నిజానికి ఎవరిదీ పూర్తిగా తప్పు కాదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎప్పుడో పోయింది. కానీ ఈ అడ్డుగోడల వల్ల మనుషుల బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. జెనాబ్ టారెక్‌కి కనీసం చూడలేని పరిస్థితి. వాల్టర్ కోరిక మీదే టారెక్ అతన్ని పార్కులో కళాకారుల బృందం దగ్గరకి తీసుకువెళ్ళాడు. తన వల్లే టారెక్ చిక్కుల్లో పడ్డాడని వాల్టర్ బాధ. అతనిదీ తప్పు కాదు. అంతా విధివిలాసం.
ఇక్కడ స్క్రీన్‌ప్లేలోని ఒక విశేషం చెప్పుకోవాలి. రోజూ ఫోన్ చేయకపోతే తన తల్లి కంగారు పడుతుందని టారెక్ ఒక సందర్భంలో అంటాడు. అది తల్లి ప్ర్రేమ అని మనం అనుకుంటాం. కానీ దానికి కారణం భయం. ఆమె కూడా అక్రమంగా అమెరికాలో ఉంటోంది. ఆమె ఉండేది వేరే రాష్ట్రంలో. ఏ చిన్న పొరపాటు చేసినా టారెక్ పోలీసుల దృష్టిలో పడతాడని ఆమెకి తెలుసు. అక్కడి నుంచి తీగ లాగితే డొంకంతా కదులుతుంది. అక్రమంగా దేశంలో ఉంటున్నాడని తెలిసిపోతుంది. అదీ ఆమె భయం. అందుకే రోజూ ఫోన్‌లో మాట్లాడుతుంది. కథ టారెక్ మీద కేంద్రీకృతమవుతుందని మనం అనుకుంటాం. కానీ తర్వాతి కథలో అతని తల్లిది ముఖ్యపాత్ర అవుతుంది. అదే ఈ చిత్రంలోని విశేషం.
ఈ చిత్రానికి టామ్ మెకార్తీ స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించాడు. రిచర్డ్ జెంకిన్స్ వాల్టర్ పాత్ర పోషించాడు. అతనికి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ముఖ్యంగా టారెక్ తనకి జరిగిన అన్యాయానికి అసహనంతో వాల్టర్ మీద కోపం చూపించినపుడు రిచర్డ్ నటన గుండెని తాకుతుంది. మూనాగా హియమ్ అబ్బాస్, టారెక్‌గా హాజ్ స్లెమాన్ నటించారు. ప్రభుత్వాల మీద విమర్శలు చేయకుండా ప్రజల జీవితాలని ప్రభుత్వాలు ఎలా ప్రభావితం చేస్తాయో చూపించి అరుదైన చిత్రమిది.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. స్పాయిలర్లు ఉంటాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
వాల్టర్ డిటెన్షన్ సెంటర్‌లో టారెక్‌ని కలుస్తాడు. జెనాబ్ వాల్టర్‌కి టారెక్ గతం గురించి చెప్పింది. టారెక్, అతని తల్లి అమెరికాకి వచ్చినపుడు వారు తమకు ఆశ్రయం ఇవ్వమని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు టారెక్ మైనర్. ఆశ్రయం కోరటానికి అనేక కారణాలు చెప్పొచ్చు. తమ దేశంలో అనిశ్చితి ఉందని, వివక్ష ఉందని.. ఇలా అనేక కారణాలతో ఆశ్రయం పొందొచ్చు. అయితే టరెక్‌కీ, అతని తల్లికీ ఆశ్రయం ఇవ్వటానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. అలాంటి సందర్భాలలో కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టులో విచారణ జరిగే వరకు అమెరికాలో ఉండొచ్చు. “అప్పుడు విచారణకి వెళ్ళారా?” అని టారెక్‌ని అడుగుతాడు వాల్టర్. “వెళ్ళాం. అప్పుడు అధికారులు చెప్పినట్టు అన్నీ పూర్తి చేశాం” అంటాడు టారెక్. “మీ అమ్మని అడిగితే మంచిదేమో” అంటాడు వాల్టర్. “అమెకి చెప్పకండి. కంగారుపడుతుంది” అంటాడు టారెక్. వాల్టర్‌కి యూనివర్సిటీ నుంచి ఫోన్ వస్తుంది. మర్నాడు స్టాఫ్ మీటింగ్‌కి రావాలని సారాంశం. వాల్టర్ వస్తానంటాడు.
వాల్టర్ బయల్దేరుతుండగా టారెక్ తల్లి అతని అపార్ట్‌మెంట్‌కి వస్తుంది. ఆమె పేరు మూనా. టారెక్ ఫోన్ చేయట్లేదని ఆమె అదుర్దాతో వచ్చింది. వాల్టర్ ఆమెకి అంతా చెబుతాడు. ఆమె నిబ్బరంగా ఉంటుంది. ఆమె కూడా టారెక్‌ని చూడటానికి వెళ్ళే అవకాశం లేదు. వెళితే ఆమెని కూడా బంధిస్తారు. వాల్టర్ ప్రయాణం మానుకుని టారెక్‌ని కలవటానికి వెళతాడు. టారెక్ “మా అమ్మని పంపేయండి. ఆమెకి ఇక్కడ ఎవరూ తెలియదు” అంటాడు. అయితే మూనా “నా కొడుకు ఆ బందిఖానాలో ఉండగా నేను ఎక్కడికీ వెళ్ళను” అంటుంది. వాల్టర్ ఆమెని తన అపార్ట్‌మెంట్‌లోనే ఉండమంటాడు. ఆమె మొదట ఒప్పుకోదు. వాల్టర్ “నా వల్లే టారెక్ ఈ చిక్కులో పడ్డాడు. మీరు ఇక్కడ ఉంటే నాకు శాంతిగా ఉంటుంది” అంటాడు. ఆమె ఒప్పుకుంటుంది. ఆమె కోసం వాల్టర్ న్యూయార్క్‌లో ఉండిపోతాడు. ఆమె టారెక్‌తో ఫోన్‌లో మాట్లాడుతుంది. అమెరికా లాంటి దేశాల్లో కనీసం ఫోన్ చేసుకునే హక్కు ఉంటుంది. అంతవరకు నయం.
వాల్టర్, మూనా లాయర్‌ని కలవటానికి వెళతారు. కోర్టు విచారణలో తీర్పు తమకి వ్యతిరేకంగా వచ్చిందని మూనా చెబుతుంది. “మరి మీకు బహిష్కారం ఉత్తర్వు లేఖ వచ్చిందా?” అంటాడు లాయరు. రాలేదు అంటుంది మూనా. “ఆ లేఖ వచ్చినా మీరు విస్మరించి ఉంటే నేనేం చేయలేను. కొన్ని సందర్భాలలో లేఖ పంపటం మర్చిపోతారు. 9/11 కి ముందు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడలా కాదు” అంటాడు లాయరు. మూనా “అయితే టారెక్‌కి సాయం చేయగలరా?” అంటుంది మూనా. ప్రయత్నిస్తానంటాడు లాయరు. తర్వాత మూనాని వాల్టర్ జెనాబ్ దుకాణం దగ్గరకి తీసుకువెళతాడు. తల్లి వద్దన్నా టారెక్ తన సంగీతం ప్రదర్శించటానికి న్యూయార్క్ వచ్చాడు. అక్కడ జెనాబ్ పరిచయమయింది. ప్రేమలో పడ్డాడు. జెనాబ్ నల్లజాతికి చెందిన యువతి అని చూసి మూనా మొదట ఆశ్చర్యపోతుంది. కానీ ఆమెని ప్రేమగానే పలకరిస్తుంది. శరీరం రుంగుని చూసి మనిషిని అంచనా వేయటం ఎప్పటికి ఆగుతుందో? కొత్తగా కొన్ని ఐరోపా దేశాలలో భారతీయుల మీద దాడులు జరుతున్నాయి. శరీరం రంగే దానికి ముఖ్య ప్రాతిపదిక. ఈ దాడులు చేసేది టీనేజర్లట! ప్రపంచం ముందుకి పోతోందా? వెనక్కి పోతోందా?
జెనాబ్‌తో మాట్లాడాక అమె టారెక్‌ని అమితంగా ప్రేమించిందని మూనాకి అర్థమౌతుంది. అతని కోసం జెనాబ్ బెంగ పెట్టుకుందని తెలిసిపోతూ ఉంటుంది. మూనా జెనాబ్‌ని “నువ్వూ, టారెక్ ఎక్కడెక్కడకి వెళ్ళాలనుకున్నారో నన్ను అక్కడికి తీసుకెళ్ళు” అంటుంది. ఒంటరిగా ఇంట్లో కూర్చుని బాధపడటం కన్నా కొడుకు లేని లోటుని ఇలా తీర్చుకుంటుంది. ఇందులో హృద్యమైన విషయం ఏమిటంటే జెనాబ్‌కి కూడా మూనా సాంగత్యం ఉత్సాహం కలిగిస్తుంది. టారెక్‌తో పంచుకున్న అనుభూతులని ఆమె మూనాకి చెబుతుంది. టారెక్ లేకపోయినా అతని ద్వారా వారిద్దరి మధ్య బంధం ఏర్పడుతుంది. వాల్టర్ టారెక్‌ని కలిసినపుడు టారెక్ తన గతం గురించి ఇంకా చెబుతాడు. “అమ్మకి నా పరిస్థితి చూసి మా నాన్నకి జరిగిన అన్యాయం గుర్తొస్తూ ఉండి ఉంటుంది. ఆయన సిరియాలో విలేకరి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాసం రాస్తే జైల్లో పెట్టారు. ఆయన ఆరోగ్యం పాడయింది. విడుదలయ్యాక రెండు నెలలకే మరణించారు. అప్పుడే మేం ఇక్కడికి వచ్చాం” అంటాడు. మనకెన్నో కష్టాలు ఉన్నాయి అనుకుంటాం. కానీ కొన్ని దేశాలలో నిరంకుశ పాలనలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో గుర్తు పెట్టుకోవాలి. గాజాలో ఆకలికి అలమటిస్తున్న చిన్నారులని గుర్తు పెట్టుకోవాలి. వారి కష్టం ముందు మన కష్టం ఎంత?
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
ఇంటిలో మూనా వాల్టర్‌కి వంట చేసి పెడుతుంది. అతని బోధనావృత్తి గురించి అడిగితే “నా పుస్తకం రాయటానికి సమయం కోసం నేను క్లాసులు తగ్గించుకున్నాను” అంటాడు. ఆమె అతని పుస్తకం గురించి అడిగితే “రచయితలు కాని వారికి పుస్తకరచన అంటే ఏమిటో అంత త్వరగా అర్థం కాదు” అని విసుక్కుంటాడు. నిజానికి అతను తన పుస్తకం మీద దృష్టి పెట్టడం లేదు. క్లాసుల గురించి ప్రశ్నిస్తే పుస్తకం సాకు చెబుతాడు, అంతే. అతనికి యూనివర్సిటీకి తిరిగి వెళ్ళటం ఇష్టం లేదు. టారెక్ కోసం, మూనా కోసం న్యూయార్క్‌లో ఉండక తప్పదని తనకి తాను చెప్పుకుంటాడు. అతనికి బోధన మీద, పుస్తకరచన మీద ఆసక్తి తగ్గటానికి కారణం అతని భార్య మృతి అని అనిపిస్తుంది. కానీ అతను తర్వాత మూనాకి నిజం చెబుతాడు. అతనికి తాను బోధించే సబ్జెక్ట్ ఇష్టం లేదు. పుస్తకరచన ఆపేశాడు. పరిశోధనాపత్రం మీద అతని పేరు ఉంది కానీ అతనేం రాయలేదు. ఇరవై ఏళ్ళుగా బోధించి విసిగిపోయాడు. కానీ ఏం చేయాలో తెలియదు. నడివయసులో వచ్చే అసంతృప్తి (మిడ్ లైఫ్ క్రైసిస్) ఇది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మూనా మాత్రం “ఏం చేయాలో తెలియకపోతే ఎన్నో అవకాశాలు ఉన్నట్టే” అంటుంది.
వాల్టర్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటాడు. యూనివర్సిటీకి వెళ్ళి సెలవు పెడతాడు. తన పియానోని కూడా అమ్మేస్తాడు. తిరిగి న్యూయార్క్ వస్తాడు. అతను ఎందుకిలా చేశాడు? అతనికి మూనా సాంగత్యం నచ్చింది. ఆమె సహనం నచ్చింది. మొక్కవోని స్థైర్యం నచ్చింది. అతనిది తొందరపాటు కాదా? అతనికి అది సరైన నిర్ణయం అనిపించింది. అతనికి జెంబె వాయిద్యం కూడా ఒక తోడుగా ఉంది. డబ్బుకి లోటు లేనపుడు ఇష్టం లేని ఉద్యోగం మానేస్తే ఏం? మూనాని కలిశాక అతను టారెక్‌ని కలవటానికి వెళతాడు. “నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి పంపించేస్తారేమోనని భయంగా ఉంది. నేనేం తప్పు చేశాను. నేను ఉగ్రవాదినా? ఉగ్రవాదులకి బోలెడు సహాయం ఉంటుంది. ఇది అన్యాయం” అంటాడు టారెక్. “నాకు నీ బాధ అర్థమయింది” అంటాడు వాల్టర్. “మీకేం అర్థమవుతుంది?” అని కోప్పడతాడు టారెక్. వాల్టర్ నిశ్చేష్టుడవుతాడు. “సారీ” అంటాడు. టారెక్ “నేను నా సంగీతం ప్రదర్శించి జెనాబ్‌తో జీవితం పంచుకోవాలనుకున్నాను. అది తప్పా?” అంటాడు. “కాదు” అంటాడు వాల్టర్. ఉగ్రవాదుల వల్ల అపనమ్మకం పెరిగి ఏ తప్పూ చేయనివారు కూడా ఉగ్రవాదుల ముద్ర మోయాల్సి వస్తోంది. ప్రతి వ్యక్తినీ పరిశీలించి వారికి ఆశ్రయం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించే సమయమూ, నిధులూ అమెరికా దగ్గర కూడా లేవు. అనుమానం వస్తే బంధించటమే. రేపు మరో ఉగ్రవాద దాడి జరిగితే ప్రభుత్వాన్నే తప్పు పడతారు. దీనికి పరిష్కారం లేదు.
లాయరుతో మాట్లాడితే అతను ఖైదీలని ఎప్పుడైనా ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు అని చెబుతాడు. అది విని మూనా, జెనాబ్ ఆందోళన పడతారు. మూనా టారెక్‌ని ఫోన్‌లో సముదాయిస్తుంది. ఆరోజు రాత్రి వాల్టర్ మూనాని ‘ద ఫాంటమ్ ఆఫ్ ది ఆపెరా’ అనే సంగీతభరిత నాటకం చూడటానికి తీసుకువెళతాడు. ఆమె సీడీలో ఆ నాటకం వింది. ఆమెకి ఎంతో నచ్చింది. ఇప్పుడు ఆ నాటకం చూసింది. తర్వాత ఇద్దరూ రెస్టారెంట్‌కి వెళ్ళి భోజనం చేస్తారు. నాకు ఈ చిత్రంలో నచ్చినదేమిటంటే ఒక పక్క సమస్య ఉన్నా దానికి చేయవలసింది చేసి జీవితాన్ని ఆస్వాదించటం. ఇంట్లో కూర్చుని బాధపడితే లాభం ఏమిటి? మనం చేయగలిగింది చేసి దేవుడి మీద భారం వేయాలి, అంతే.
మర్నాడు టారెక్ తనని బదిలీ చేస్తున్నారని వాల్టర్‌కి మెసేజ్ పెడతాడు. వాల్టర్, మూనా హడావిడిగా డిటెన్షన్ సెంటర్‌కి వెళతారు. వాల్టర్ లోపలికి వెళతాడు. అక్కడ వాకబు చేస్తే టారెక్‌ని దేశబహిష్కారం చేసి సిరియాకి పంపించేశారని తెలుస్తుంది. వాల్టర్ హతాశుడవుతాడు. అక్కడున్న ఉద్యోగుల మీద కేకలు వేస్తాడు. మూనా వచ్చి అతన్ని బయటకి తీసుకుపోతుంది. టాక్సీలో వెళుతుంటే మూనా “అతను ఏ తప్పూ చేయలేదు” అని విలపిస్తుంది. వాల్టర్ ఆమెని అక్కున చేర్చుకుని సాంత్వనపరుస్తాడు. జెనాబ్‌కి విషయం చెబుతారు. ఆమె ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. భగ్నప్రేమికుల జాబితాలో ఆమె కూడా చేరిపోయింది. మళ్ళీ టారెక్‌ని ఎప్పటికీ చూడలేదు. ఆ రాత్రి మూనా “నేను సిరియాకి వెళ్ళాలి. నా బిడ్డ కోసం వెళ్ళాలి. రేపే వెళతాను” అంటుంది. “నువ్వు వెళితే మళ్ళీ తిరిగి రాలేవు” అంటాడు వాల్టర్. “తెలుసు” అంటుందామె. రాత్రి పొద్దు పోయాక ఆమె వాల్టర్ గదిలోకి వస్తుంది. అతని పక్కన పడుకుంటుంది. “నాదే తప్పు. ఆ బహిష్కారం ఉత్తర్వు లేఖ వచ్చింది. నేను ఆ లేఖని పారేశాను. అప్పటికే మూడేళ్ళు అమెరికాలో ఉన్నాం. నాకు చిన్న ఉద్యోగం దొరికింది. టారెక్ స్కూల్లో ఉన్నాడు. అందరూ కంగారు పడవద్దనే చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోదని చెప్పారు. నేను కూడా కొన్నాళ్ళకి ఆ సంగతి మరచిపోయాను” అంటుంది. అతను “నీ తప్పు లేదు” అని ఆమెని పొదివిపట్టుకుంటాడు. మర్నాడు ఆమె సిరియాకి వెళ్ళిపోతుంది. వాల్టర్ జీవితం మళ్ళీ శూన్యమవుతుంది.
ప్రభుత్వ విధానాలు మారిపోతూ ఉంటాయి. అవి కొందరి పాలిట శాపాలవుతాయి. జెనాబ్ మనసు ముక్కలయింది. కొత్త జీవితం కోసం ఆశించిన వాల్టర్‌కి భంగపాటు ఎదురయింది. టారెక్ కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించాలి. మనకి వార్తాపత్రికల్లో కనిపించే వార్తల వెనక ఎన్ని జీవితాల విషాదాలు ఉన్నాయో! కానీ ఒడిదుడుకులని తట్టుకోవటమే జీవితం. వాల్టర్ ఒక మెట్రో స్టేషన్‌కి వెళ్ళి అక్కడ జెంబె వాయిస్తూ ఉండగా చిత్రం ముగుస్తుంది. చిత్రం పేరుకి రెండు అర్థాలు. ‘ద విజిటర్’ అంటే సందర్శకుడు/సందర్శకురాలు అనే కాక అతిథి అనే అర్థం కూడా ఉంది. టారెక్‌ని చూడటానికి వెళ్ళినపుడు వాల్టర్ సందర్శకుడు. మూనా వాల్టర్ జీవితంలోకి వచ్చిన అతిథి. అతిథి మాత్రమే!