[సంచిక పాఠకుల కోసం ‘కాజ్‌వే’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
యుద్ధమంటే నరకం అని అందరికీ తెలుసు. యుద్ధభూమి నుంచి తిరిగివచ్చిన సైనికుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎలాంటి గాయాలు లేకుండా తిరిగివచ్చిన వారే తాము చూసిన దారుణాలు మరచిపోలేక మనోవ్యథ అనుభవిస్తారు, ఇక గాయపడి వచ్చినవారి సంగతి చెప్పాలా? అలాంటి ఒక యువతి కథే ‘కాజ్‌వే’ (2022). ఆ యువతికి ఒక మెకానిక్ పరిచయమౌతాడు. అతని జీవితం పైకి బాగానే ఉన్నా అతని మస్తిష్కంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. అది యుద్ధభూమిని మించిన నరకం. వారు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు ఆసరా అయితే అది మామూలు కథ. ఈ కథ అలాంటిది కాదు. ఈ చిత్రం యాపిల్ టీవీ+ లో లభ్యం. ‘కాజ్‌వే’ అంటే నీటి మీద వేసిన రహదారి. నీటిని దాటే దారి అన్నమాట.
లిన్సీ అమెరికా సైన్యం తరఫున ఆఫ్గనిస్తాన్‌లో ఉండగా ఆమెకి బాంబు పేలుడులో గాయాలవుతాయి. సైన్యం అనగానే పోరాడేవారే కాదు, ఇతర పనులు చేసేవారూ ఉంటారు. ఆమె జలవ్యవస్థల నిపుణురాలు. ఒక ఆనకట్ట నిర్వహించే పని మీద వెళుతుంది. బాంబు పేలుడులో మెదడు నుంచి రక్తస్రావం కావటంతో ఆమెకి నడవటం కూడా కష్టంగా మారుతుంది. కారు నడపటం కూడా మళ్ళీ నేర్చుకోవాల్సిన పరిస్థితి. కోలుకోవటానికి ఒక రీహ్యాబ్ సెంటర్‌కి పంపిస్తారు. అక్కడ ఒక నర్సు ఆమెకి సాయం చేస్తుంది. ఆమె వయసు పెద్దదే. తల్లిలా లిన్సీని సాకుతుంది. లిన్సీ కోలుకుంటుంది. కొన్ని వారాల తర్వాత తన తల్లి దగ్గరకి ప్రయాణమవుతుంది. ఆశ్చర్యమేమిటంటే లిన్సీ మళ్ళీ సైన్యంలో చేరాలని పట్టుదలగా ఉంటుంది. “లేకపోతే కోలుకుని లాభమేమిటి?” అంటుంది నర్సుతో. కానీ ఆమె తిరిగి సైన్యంలో చేరాలంటే ఆమె శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉందని డాక్టరు ధృవపత్రం ఇవ్వాలి. సొంత ఊరిలో కొన్నాళ్ళు ఉండి ఆ ధృవపత్రం తీసుకోవాలని ఆమె ఆలోచన.
ఇక్కడ అమెరికా చేసే యుధ్ధాల గురించి చెప్పుకోవాలి. దాడి జరిగితే దేశరక్షణ కోసం చేసే యుద్ధాలది ఒక దారి. ‘మా దేశానికి ముప్పు ఉంది’ అని అభూతకల్పనలు చేసో, ‘మీ దేశాన్ని ఉద్ధరిస్తాం’ అని బీరాలు పలికో అమెరికా లాంటి దేశాలు చేసే యుద్ధాలు ఎక్కడికి దారి తీస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఏళ్ళ తరబడి యుద్ధం చేసి చివరికి విసిగిపోయి వెళ్ళిపోవటమే తప్ప ఏం లాభం లేదు. మరి అమెరికా సైనికుల త్యాగాలకి విలువ ఏది? అమరులైన వీరుల కుటుంబాలకి ఎంత పరిహారం ఇచ్చినా మనిషి లేని లోటు తీర్చగలరా? శారీరకంగా, మానసికంగా గాయపడిన సైనికుల అతలాకుతలమైన జీవితాలు సరిచేయగలరా? సరైన లక్ష్యం ఉంటే అమరవీరుల కుటుంబాలకి, గాయపడిన సైనికులకి సంతృప్తి ఉంటుంది. లక్ష్యం లేని యుద్ధాలతో జీవితాలు పాడవటం తప్ప ఏమీ లాభం లేదు. అమెరికా ఇది ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
లిన్సీ సొంత ఊరు న్యూ ఆర్లీన్స్. వేసవి కావటంతో వేడి ఎక్కువ ఉంటుంది. ఇంటికి తిరిగి వస్తున్నట్టు తల్లికి సమాచారం ఇస్తుంది. బస్సు దిగగానే తల్లి వచ్చి ఇంటికి తీసుకువెళుతుందని చూస్తుంది. కానీ తల్లి రాదు. ఆమే బస్సు ఎక్కి ఇంటికి చేరుకుంటుంది. తల్లి రాత్రివేళ ఇంటికి వస్తుంది. “నువ్వు శుక్రవారం వస్తావనుకున్నాను. నీ కోసం కేకు కూడా తెద్దామనుకున్నాను” అంటుంది. లిన్సీ “పర్వాలేదు” అంటుంది. తల్లి “నీ గురించి కంగారుపడ్డాను. నువ్వు నీలాగే ఉన్నావు” అంటుంది. ఆమె ఎంత కష్టపడిందో పట్టించుకోదు. ఇలాంటి తల్లులు కూడా ఉంటారు. లిన్సీ పైకి మామూలుగా ఉన్నా లోలోపల బాధపడుతుంది. ఆమె తల్లికో ప్రియుడు కూడా ఉంటాడు. అతన్ని కలవటం ఇష్టం లేక లిన్సీ ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది.
ఖాళీగా ఉండటం ఇష్టం లేక లిన్సీ ఈతకొలనులు శుభ్రం చేసే పనిలో చేరుతుంది. ఒకరోజు ఆమె ట్రక్కు (వెనక సామాన్లు పెట్టుకునేలా ఖాళీగా ఉండే కారు లాంటి వాహనం) లో వెళుతుంటే అది హఠాత్తుగా ఆగిపోతుంది. ఆ ట్రక్కుని మెకానిక్ షాపుకి తీసుకెళుతుంది. అక్కడ జేమ్స్ అనే మెకానిక్ ఉంటాడు. ట్రక్కుని బాగు చేశాక చెబుతానని ఆమె ఫోన్ నంబర్ తీసుకుంటాడు. తర్వాత ఆమెని ఇంటి దగ్గర దింపటానికి తన కార్లో తీసుకువెళతాడు. మాటల్లో అతని చెల్లెలు, లిన్సీ బాస్కెట్ బాల్ పోటీల్లో వేరు వేరు స్కూళ్ళ తరఫున ఆడారని తెలుస్తుంది. “మీ చెల్లెలు గట్టిది” అంటుంది లిన్సీ. చెల్లెలి ప్రసక్తి రాగానే జేమ్స్ ముఖం మ్లానమైపోతుంది. మౌనంగా అయిపోతాడు. లిన్సీ అది గమనిస్తుంది కానీ ఏమీ అనదు. ఆమెకి తన సొంత సమస్యలే బోలెడు ఉన్నాయి.
లిన్సీ డాక్టరు దగ్గరకి వెళుతూ ఉంటుంది. ఇది ఆమె పూర్తిగా కోలుకునే క్రమంలో ఒక భాగం. ఒకరోజు ఆమె తల్లికి తాను తిరిగి సైన్యంలో చేరాలనుకుంటున్నానని చెబుతుంది. ఆమె “పరాచికాలా? ఈ పరిస్థితిలో ఎలా వెళతావు?” అంటుంది. “అది నువ్వు నాకు వదిలెయ్” అంటుంది లిన్సీ. దాంతో ఆమె తల్లి ‘నీ ఇష్టం’ అన్నట్టు మాట్లాడుతుంది. మరో పక్క లిన్సీకి జేమ్స్‌తో స్నేహం పెరుగుతుంది. జేమ్స్ నల్లజాతి వాడు. ఆమె శ్వేతజాతికి చెందినది. అమెరికా పైకి ఎన్ని సుద్దులు చెప్పినా నల్లజాతి వారి మీద వివక్ష మాత్రం ఇంకా ఉంది. అలాంటి వాడితో ఆమె స్నేహం చేయటానికి కారణం ఒకరకంగా అతను కూడా తనలాగే అన్యాయానికి గురయ్యాడనే భావన కావచ్చు. ఇక్కడ ఇంకో కోణం ఉంది. లిన్సీ ఒక లెస్బియన్ (స్త్రీలంటే ఆకర్షణ ఉన్న స్త్రీ). ఆమె కూడా వివక్ష ఎదుర్కొన్న మనిషే.
ఒకరోజు లిన్సీ తనకి ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ప్రమాదం గురించి జేమ్స్‌కి చెబుతుంది. తాను లెస్బియన్ అని కూడా చెబుతుంది. అతను వివక్ష చూపే మనిషి కాదు. ఆమె అతన్ని “నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా?” అని అడుగుతుంది. “ఉండేది. నా కాలు పోయాక వదిలి వెళ్ళిపోయింది” అంటాడు. అతను కృత్రిమ కాలుతో నడుస్తున్నాడు. “కాలు ఎలా పోయింది?” అంటే “కారు యాక్సిడెంట్లో పోయింది. యాక్సిడెంట్ జరిగినపుడు మా చెల్లెలు, ఆమె కొడుకు కారులోనే ఉన్నారు. ఆమె వెనక సీట్లో ఉంది. రియర్‌వ్యూ మిర్రర్‌లో ఆమె ముఖంలోకి చూస్తే వీడ్కోలు చెబుతున్నట్టు అనిపించింది” అంటాడు. “మీ చెల్లెలు చనిపోయిందా?” అంటుంది ఆమె. “చనిపోయింది ఆమె కాదు” అంటాడతను. అంటే చెల్లెలి కొడుకు చనిపోయాడు. జేమ్స్‌కి ఈ అపరాధభావమే నరకం. అది అతని ముఖంలో కనపడుతూ ఉంటుంది. నిర్వేదంలో ఉంటాడు.
లిన్సీ అప్పుడు తన అన్న గురించి చెబుతుంది. “డ్రగ్స్ ఎక్కువ తీసుకునేవాడు. మా అమ్మకి అతని డ్రగ్స్ వ్యసనం తెలియలేదు. మత్తులో ఉంటే అలిసిపోయాడని అనుకునేది. అతను ఉంటే నాకు కొంచెం ఊరటగా ఉండేది. నేను ఆ ఇంటి నుంచి బయటపడ్డాను. వాడు పడలేకపోయాడు” అంటుంది. తల్లి వల్లే అన్నకి ఆ గతి పట్టిందని ఆమె భావన. అందుకే ఆ ఇంట్లో ఉండటం తనకు ఇష్టం లేదంటుంది. బయటపడటానికి ఆమెకి తెలిసిన దారి ఒకటే. సైన్యంలో మళ్ళీ చేరటం. వారిద్దరూ ఒకరి బాధని ఒకరు అర్థం చేసుకున్నారనుకుంటే పొరపాటే. కాకపోతే జేమ్స్‌కి తాను చేసింది తప్పని తెలుసు. ఆమె కూడా అతని తప్పు ఎంతో కొంత ఉందనే అనుకుంటుంది. కానీ ఆమెకి తన తప్పులు తెలియవు. జేమ్స్ వాటిని పసిగడతాడు. ఏమిటా తప్పులు? అదే మిగతా కథ.
ఈ చిత్రానికి లీలా న్యుజ్‌బౌర్ దర్శకత్వం వహించింది. ఇదే ఆమె మొదటి చిత్రం. రోమ్ చిత్రోత్సవంలో ఆమెకి ఉత్తమ మొదటి చిత్ర దర్శకురాలి అవార్డు వచ్చింది. జెన్నిఫర్ లారెన్స్, బ్రయన్ టైరీ హెన్రీ ముఖ్యపాత్రలు పోషించారు. బ్రయన్‌కి ఉత్తమ సహాయనటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. చిత్రంలో జేమ్స్ చేసిన కారు యాక్సిడెంట్ ఒక కాజ్‌వే మీద జరుగుతుంది. ‘కాజ్‌వే’ అని పేరు పెట్టటానికి కారణం జీవితం దాటటానికి మనకి బంధాలే ఒక కాజ్‌వే అని చెప్పటమే. బంధాలని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. స్పాయిలర్లు ఉంటాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
ఒకరోజు రాత్రి బాగా తాగిన తర్వాత జేమ్స్‌ని అతని ఇంటికి తీసుకువెళుతుంది లిన్సీ. జేమ్స్ ఇల్లు పెద్దది. అతని తల్లి చనిపోయాక వచ్చిన డబ్బుతో అతను, అతని చెల్లెలు ఆ ఇల్లు కొనుక్కున్నారు. చెల్లెలి కొడుకుతో సహా మూడేళ్ళు కలిసి ఉన్నారు. యాక్సిడెంట్ తర్వాత చెల్లెలు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అంటే అన్న వల్లే తన కొడుకు చనిపోయాడని అనుకుందన్నమాట. అది జేమ్స్‌కి పెద్ద శిక్ష. అతను ఆ ఇంట్లో ఉండిపోవటం మంచిది కాదని లిన్సీ అభిప్రాయం. “మా అమ్మ కూడా మా ఇంట్లో ఉండిపోయింది. అలా ఉండిపోవటం శ్రేయస్కరం కాదు” అంటుంది. “నా సంగతా? మీ అమ్మ సంగతా?” అంటాడతను. ఆమె ఒక్క క్షణం ఆలోచించి “నా సంగతి” అని నిర్వేదంగా నవ్వుతుంది. తిరిగి ఆ ఇంటికి రావటం ఆమెకి మానసికంగా కష్టంగా ఉంది. కానీ ఏం చేస్తుంది? వేరే దారి లేదు. సైన్యం నుంచి వెళ్ళిన ప్రతివారినీ పోషించాలంటే ప్రభుత్వానికీ కష్టమే. అనవసరమైన యుద్ధాలలో తలదూరిస్తే ఇలాగే ఉంటుంది. వేల కొద్దీ పౌరుల్ని సైన్యంలో చేర్చుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం వారిని పోషించే సమయం వచ్చేసరికి నీరుగారిపోతుంది. జేమ్స్ ఆమెకి తల్లి దగ్గర ఉండటం ఇష్టం లేదని “నువ్వు ఇక్కడ ఉండొచ్చు” అంటాడు. అతనికి ఒక తోడు కావాలి. ఖాళీగా ఉన్న ఇల్లు అతనికి జైలులా ఉంది. ఆమె నవ్వేసి ఊరుకుంటుంది. అతను తాగిన మైకంలో అంటున్నాడని ఆమె భావన. కానీ అతనికి నిజంగానే ఒక తోడు కావాలి.
ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి మేలుకునే ఉంటుంది. ఉక్కపోత ఎక్కువ ఉంటుంది. తల్లి కోరిక మీద ఇద్దరూ ఇంటి పెరట్లో రబ్బర్ పూల్‌లో సేద తీరుతారు. డాక్టరు ఏమంటున్నాడని తల్లి అడుగుతుంది. “22వ తేదీన మళ్ళీ డాక్టరు దగ్గరకి వెళ్ళాలి” అని లిన్సీ అంటుంది. “నేను తీసుకువెళతాను. ఎవరో ఒకరు తోడుంటే డాక్టరుకి కూడా మంచి అభిప్రాయం కలుగుతుంది” అంటుంది తల్లి. లిన్సీకి ఇది ఆనందం కలిగిస్తుంది. తల్లి “అంత దూరం ఎందుకు వెళ్ళావు? ఇక్కడ ఉండటం దుర్భరం అయిపోయిందా?” అంటుంది. లిన్సీ తటపటాయిస్తూ “అవును. ఇక్కడ ఉండలేకపోయాను” అంటుంది. “నీ వయసులో నేనూ అంతే. ఒక్క చోట ఉండేదాన్ని కాదు” అంటుంది తల్లి. ఇంతలో ఇంట్లో ఉన్న ఫోన్ మోగుతుంది. తల్లి లోపలికి వెళుతుంది. ఆమె మాటలు వినపడుతూ ఉంటాయి. ఆమె ప్రియుడు ఫోన్ చేశాడు. ఆమె కూతుర్ని వదిలి తన గదిలో వెళ్ళిపోతుంది. లిన్సీని నిరాశ ఆవహిస్తుంది. తల్లికి తన కంటే ప్రియుడే ముఖ్యమని ఆమె బాధ. డాక్టర్ దగ్గరకి వెళ్ళేరోజు తల్లి ఇంట్లో లేకపోవటంతో ఆమె నిరాశ ఇంకా పెరుగుతుంది.
లిన్సీ ట్రక్కు రిపేరు ఆలస్యం కావటంతో ఆమె డాక్టరు దగ్గరకి వెళ్ళటానికి జేమ్స్ సాయం అడుగుతుంది. అప్పటి దాకా ఆమె తాను మళ్ళీ సైన్యంలో చేరాలనుకుంటున్నానని అతని చెప్పలేదు. అప్పుడు చెబుతుంది. “అంత ప్రమాదం జరిగాక కూడా మళ్ళీ వెళతావా?” అంటాడతను. ఆమె “ఇక్కడి నుంచి బయటపడాలి” అంటుంది. అతను ఆమె వంక తదేకంగా చూస్తాడు. రీహ్యాబ్ సెంటర్లో నర్సు ఆమెని తిరిగి సైన్యంలోకి వెళ్ళొద్దంది. తల్లి వద్దంది. అతను కూడా వద్దంటాడని మనకి అనిపిస్తుంది. ఆమెకి కూడా అదే అనిపిస్తుంది. కానీ అతను ఏమీ అనడు. ఆమె అతను తనని అర్థం చేసుకున్నాడని సంతోషిస్తుంది. అతను తదేకంగా చూసిన చూపులోని అర్థం తర్వాత తెలుస్తుంది. లిన్సీ డాక్టరు దగ్గరకు వెళుతుంది. డాక్టరు ఆమెకి పూర్తి సామర్థ్యం ఉందని ధృవపత్రం ఇవ్వటానికి నిరాకరిస్తాడు. పొగ త్రాగటం ఎలా క్యాన్సర్‌కి దారి తీస్తుందో అలాగే తీవ్ర గాయాలు PTSD (బాధాకరమైన సంఘటన తర్వాత కలిగే విపరీత మానసిక స్థితి) కి దారి తీస్తాయని, ప్రమాదకర వాతావరణంలోకి వెళితే PTSD తిరగబెడుతుందని అంటాడు.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
ఆ రాత్రి లిన్సీ, జేమ్స్ ఒక ఈత కొలనులో సేద తీరుతారు. అప్పుడు జేమ్స్ “నేను నీకు నా యాక్సిడెంట్ గురించి పూర్తిగా చెప్పలేదు. నా మేనల్లుడు ముందు సీట్లో కూర్చుంటానన్నాడు. (ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అమెరికాలో చట్టాలు స్పష్టంగా ఉంటాయి. కఠినంగా అమలు చేస్తారు. ఒక వయసు వచ్చేవరకు పిల్లలు కారులో ముందు సీట్లో కూర్చోకూడదు. చిన్నపిల్లలకి ప్రత్యేకమైన చైల్డ్ సీట్లు బజార్లో దొరుకుతాయి. ఆ చిల్డ్ సీటుని కారు వెనక సీట్లో ఉన్న సీట్ బెల్ట్‌తో కదలకుండా బిగించాలి. పిల్లలని ఆ సీట్లో కూర్చోబెట్టి బెల్ట్ బిగించాలి.) మా చెల్లెలు ఒప్పుకోలేదు. చైల్డ్ సీట్లో కూర్చోబెట్టాలని అంది. కానీ వాడి సరదా చూసి నేను ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నాను. వాడు అడిగినది ఇవ్వాలని అనుకున్నాను. గారాబం చేశాను” అని బాధపడతాడు. ఆమె అతని బాధ చూసి అతన్ని ఓదార్పుగా కౌగిలించుకుంటుంది. అంతటితో ఆగక అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంటుంది.
ఆమె ఎందుకలా చేసింది? ఆమెకి పురుషులంటే ఆకర్షణ లేదు కదా? భర్తని గానీ, ప్రియుడిని గానీ లైంగికంగా సంతృప్తిపరిస్తే బాధ తగ్గుతుందని స్త్రీలు భావించటం మామూలే. లైంగిక స్వేచ్ఛ ఉన్న దేశాల్లో పరాయి పురుషుల విషయంలో కూడా స్త్రీలు ఇలాగే ఆలోచిస్తారు. అందుకే ఆమె అలా చేసింది. కానీ ఆమె ముద్దు దగ్గరే ఆగిపోతుంది. “సారీ. నేనలా చేయకుండా ఉండాల్సింది” అంటుంది. అతను “మరి ఎందుకు చేశావు?” అంటాడు. “నీ మీద జాలేసింది” అంటుందామె. అతని మనసు చివుక్కుమంటుంది. అతను కొలను నుంచి బయటకి వచ్చి “అసలు మన మధ్య ఈ బంధం ఏమిటి? నీకు డ్రైవరు కావాలంటే టాక్సీ మాట్లాడుకో. నా దగ్గరకి రాకు” అంటాడు. ఆమె అక్కసుగా “నీతో పడుకోవటం లేదని స్నేహం మానేస్తావా?” అంటుంది. “ముద్దు పెట్టుకున్నది నువ్వు. నీ సమస్యల్లోకి నన్ను లాగొద్దు. నీ సమస్యేంటో కూడా నాకు నువ్వు చెప్పలేదు. నాకు తెలిసింది సమాచారం మాత్రమే. అదేంటంటే నీకు బాంబు ప్రమాదం జరిగింది. నువ్వు మా చెల్లెలితో బాస్కెట్ బాల్ ఆడావు. మీ అన్న చనిపోయాడు” అంటాడతను. “మా అన్న చనిపోలేదు” అంటుందామె. “మరి అతని గురించి పాస్ట్ టెన్స్‌లోనే మాట్లాడావుగా” అంటాడతను. “వాడు డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్నాడు” అంటుందామె. “అతను చనిపోయాడని అనుకునేలా మాట్లాడావు. అతని కర్మకి అతన్ని వదిలేసి పోయావుగా. అందుకే అతను చనిపోయాడని నమ్మిస్తున్నావేమో” అంటాడతను. ఆమెకి కోపం వస్తుంది. “నీలాగా నేను కూడా గతాన్ని తలుచుకుని కుమిలిపోతున్నానని అనుకున్నావా?” అంటుంది. “నోర్ముయ్” అంటాడతను. ఆమె “నేనేం దాయలేదు. నువ్వే ఏదో దాస్తున్నావు. నీ మేనల్లుడిని ముందు సీట్లో కూర్చుబెట్టుకున్నానని ఇప్పుడు చెప్పావు. ఇంకేం దాస్తున్నావు? ఆరోజు తాగి కారు నడిపావా? చెప్పు” అంటుందామె. అతను మౌనంగా అయిపోతాడు. కాసేపటికి “నేను ఆరోజు రెండు బీర్లు తాగాను. నిజమే. కానీ నువ్వు చేసిన పనికి సంజాయిషీ ఏమిటి? కుటుంబాన్ని వదిలి పారిపోయావు. అందరూ నీకు ద్రోహం చేశారని అనుకుంటావు. వాళ్ళకి నువ్వే ద్రోహం చేశావని నేనంటాను” అని వెళ్ళిపోతాడు.
అతను అన్న మాటతో మొత్తం కథ మారిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమె తల్లి చేసిన తప్పు ఏమిటి అనిపిస్తుంది. ఆమె తల్లికి ప్రియుడు ఉన్నాడు. అది తప్పు కాదు. డాక్టరు దగ్గరకి వెళ్ళాలని లిన్సీ తల్లికి తేదీ చెప్పింది. మళ్ళీ గుర్తు చేసిందా? గుర్తు చేయకుండా తల్లి మర్చిపోయిందంటే న్యాయమా? ఆమె సంగతులన్నీ అందరూ గుర్తు పెట్టుకోవాలా? కొడుకు దూరమై తల్లి బాధ పడుతోందని లిన్సీకి తోచలేదు. అన్నయ్య డ్రగ్స్ వ్యసనంతో బాధపడుతుంటే దగ్గరుండి సాయం చేయాలిగా? తల్లికి ఆసరాగా ఉండలిగా? పోనీ వదిలి వెళ్ళిపోయింది, మరి తల్లి నుంచి ఏదో ఆశించే హక్కు ఆమెకి ఏముంది? తల్లి తన బాధ మరచిపోవటానికి ఏవో వ్యాపకాలు పెట్టుకుంది. కూతురు తన బాధ పట్టించుకోదని ఆమె బాధ. చిత్రం మొదట్లో ఆమె నిర్దయగా మాట్లాడిందని అనిపిస్తుంది కానీ ఆమె మనసు బండబారిపోయింది. కూతురి విషాదం గురించి తెలుసుకుని ఓదార్చే శక్తి ఆమెకి లేదు. నిజానికి తన బాధ్యతల నుంచి మొదట పారిపోయింది లిన్సీయే. దీన్ని జేమ్స్ గ్రహించాడు. ముందటి సన్నివేశం అతను ఆమెని తదేకంగా చూడటంలో అర్థం ఇదే. వెనక్కి తిరిగి చూస్తే జేమ్స్ పాత్ర పోషించిన బ్రయన్ టైరీ హెన్రీ నటనా కౌశలం అబ్బురపరుస్తుంది. అందుకే అతనికి ఆస్కార్ నామినేషన్ వచ్చింది.
ఇక్కడ జేమ్స్ చేసిన తప్పు గురించి కూడా చెప్పుకోవాలి. రవాణా చట్టాలు ప్రజల బాగు కోసమే ప్రభుత్వాలు పెడతాయి. పిల్లలు ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి, తాగి కారు నడపకండి అని చెబితే ఆ నియమాలు మన శ్రేయస్సు కోసమే. ‘నేను మంచి డ్రైవరుని. ఏ ప్రమాదమూ జరగదు’ అనుకుంటే తప్పు. ఏదైనా జరిగితే కుమిలిపోవాల్సింది మనమే. మన వల్ల ఇంకో కుటుంబానికి కూడా అన్యాయం జరగవచ్చు. కనుక ట్రాఫిక్ నియమాలు పాటించాలి. సమయం మిగలాలని వేగంగా పోవటం, పెట్రోలు మిగలాలని అపసవ్యదిశలో పోవటం తప్పు. మన దేశంలో జనాభా ఎక్కువ. ట్రాఫిక్ ఎక్కువ. అందుకని యూ టర్న్‌లు ఎక్కువ ఉంటాయి. యూ టర్న్ దాకా వెళితే నాకు ఖర్చు ఎక్కువ అనుకుంటే అది ద్రోహమే. దేశం కోసం ఆ మాత్రం ఖర్చు మనం భరించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు. మరి ఈ చిత్రంలో జేమ్స్‌కి చట్టం శిక్ష వేయలేదా? దీని గురించి స్పష్టంగా చెప్పకపోవటం ఈ చిత్రంలో ఒక లోపం.
డాక్టరు దగ్గర లిన్సీ “గాయాలకి, PTSD కి లింకు ఉందన్నారు కదా. నాకు బాంబు పేలుడులో జరిగినదొక్కటే గాయల్ కాదు” అంటుంది. అంటే మానసిక గాయాలు ఉన్నాయని ఆమె ఉద్దేశం. డాక్టరు ఆమెకి సైన్యంలో చేరే సామర్థ్యం ఉందని ధృవపత్రం ఇస్తాడు. తర్వాత లిన్సీ జైల్లో ఉన్న తన అన్నను చూడటానికి వెళుతుంది. ఇన్నాళ్ళూ ఎందుకు వెళ్ళలేదు? ఆమె అన్న చేసిన పనికి సిగ్గుపడింది. ఆమె కుటుంబానికి ద్రోహం చేసిందని జేమ్స్ అనటంతో ఆమెకి తన స్వభావం తెలిసొచ్చింది. ఆమె అన్న బధిరుడు. ఇద్దరూ సౌంజ్ఞల భాషలో మాట్లాడుకుంటారు. “అమ్మ ఎప్పుడూ నన్ను చూడటానికి రాలేదు. ఆమె గురించి బెంగగా ఉంది. నేనిక్కడ బాగానే ఉన్నాను. స్నేహితులు ఉన్నారు. నేను జైల్లో ఉండటమే నాకు మంచిది. బైట ఉంటే నాకు నేనే హాని చేసుకుంటాను” అంటాడతను. లిన్సీ ఆశ్చర్యపడుతుంది. చివరికి అతను “నిన్ను మిస్సవుతున్నాను” అంటాడు. ఆమె కూడా అదే మాట అంటుంది. ఇద్దరూ ప్రేమగా ఉండేవారని వారి ముఖాలే చెబుతాయి. అలాంటి అన్నని వదిలి ఆమె వెళ్ళిపోయింది. అన్నయ్య మాటలు ఆమెలో మార్పు తెస్తాయి. సైన్యంలో చేరితే హాని జరుగుతుంది. ఆమె తెలియకుండా తనకు తాను హాని చేసుకోవటానికే ప్రయత్నిస్తోంది. దానికి కారణం అపరాధభావం. ఆ అపరాధభావం పోవాలంటే ఆమె అన్నయ్యకి, అమ్మకి చేతనైనంత సాయం చేయాలి. అందుకే ఆమె సైన్యంలోకి తిరిగి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటుంది. ఇంట్లో ఉంటే అమ్మకి ఇబ్బంది. ఆమెకి ఒక ప్రియుడు ఉన్నాడు. అందుకని లిన్సీ జేమ్స్ దగ్గరకి వెళ్ళి అతని ఇంట్లో ఉంటానని అడుగుతుంది. ఇది ఆమె స్వార్థం కాదు, జేమ్స్‌కి కూడా సాయం చేసినట్టు ఉంటుంది. అతని ఒంటరితనం పోగొట్టొచ్చు. అతను మౌనంగా ఉంటాడు. ఆమె అతనితో “నాకో స్నేహితుడు కావాలి” అంటుంది. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది. ఆమె తన తప్పులు తెలుసుకుని కుటుంబం విలువ, స్నేహం విలువ తెలుసుకోవటమే ఆమె సాధించిన విజయం.