Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 124: ఉల్లోళుక్కు (అంతఃప్రవాహం)

[సంచిక పాఠకుల కోసం ‘ఉల్లోళుక్కు’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

మానవసంబంధాలు ఎంతో క్లిష్టమైనవి. వాటి మీద వచ్చిన చిత్రాలు ఆ క్లిష్టతని ఇంకా పూర్తిగా దర్శింపజేసే ప్రయత్నం చేయలేదనే చెప్పాలి. ఆ క్లిష్టతలో ఒక పార్శ్వాన్ని చూపించిన మళయాళ చిత్రం ‘ఉల్లోళుక్కు’ (2024). ఆంగ్లంలో ‘Ullozhukku’ అని రాస్తారు. అంతఃప్రవాహం అని అర్థం. అందరూ తప్పులు చేస్తారు, మరి అవతలి వారి తప్పులనే ఎందుకు భూతద్దంలో చూస్తారు? ఇది మానవ స్వభావం. ఆ స్వభావాన్ని నిస్సంకోచంగా చూపించిన చిత్రం ఇది. అయితే ఈ చిత్రంలో భావోద్వేగాలే తప్ప కోపాలూ, పగలూ ఉండవు. అదే ఈ చిత్రం ప్రత్యేకత. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. దురదృష్టం ఏమిటంటే తెలుగులో డబ్బింగూ చేయలేదు, సబ్‌టైటిల్సూ పెట్టలేదు. ‘చూసేవాళ్ళు తక్కువ, అంత శ్రమ ఎందుకు’ అనుకుని ఉంటారు. ఆంగ్లంలో సబ్‌టైటిల్స్ ఉన్నాయి.

అంజు ఒక క్రిస్టియన్ అమ్మాయి. రాజీవ్ అనే హిందూ అబ్బాయిని ప్రేమించింది. అతనికి ఉద్యోగం లేదు. అసలే హిందువు, ఉద్యోగం కూడా లేదు. అందుకని ఆమె తలిదండ్రులు ఆమెకి థామస్‌కుట్టీతో పెళ్ళి చేసేస్తారు. స్థితిమంతుల కుటుంబం. మామగారు చనిపోయాడు. అత్తగారు లీలమ్మ ఉత్తమురాలు. అయితే కొన్నాళ్ళకే థామస్‌కుట్టీకి ఆరోగ్యం చెడిపోతుంది. అతని మెదడులో కణితి ఉందని తెలుస్తుంది. అంజు ఓపిగ్గా అతనికి సేవలు చేస్తుంది. అత్తగారు కూడా సేవలు చేస్తుంది. తను ఆనందంగా ఉండటం చూసి దేవుడికి కన్ను కుట్టిందని వాపోతుంది. ఒకరోజు టౌనులో హాస్పిటల్‌కి వెళ్ళినపుడు అంజుకి రాజీవ్ మళ్ళీ తారసపడతాడు. అంజు ఇంట్లో ఉన్న దుర్భర పరిస్థితుల నుంచి తప్పించుకోవటానికి మందులు కొనాలనీ ఇంకా ఏవో సాకులు చెప్పి టౌనులో ఉన్న రాజీవ్ దగ్గరకి వెళుతూ ఉంటుంది. ఇద్దరికీ శారీరక సంబంధం ఏర్పడుతుంది. అంజు అత్తగారిల్లు ఉన్న ఊరు ఒక లంకగ్రామం. టౌనుకి వెళ్ళాలంటే పడవలే ఆధారం. టికెట్ల మీద నడిచే పెద్ద పడవలు ఉంటాయి. అంజుకి చిన్న పడవ నడపటం వచ్చు.

అంజు గర్భవతి అవుతుంది. ఆ బిడ్డ రాజీవ్ బిడ్డ. లీలమ్మకి చెప్పదు కానీ ఒకరోజు అద్దంలో పొట్ట చూసుకుంటుంటే లీలమ్మ చూస్తుంది. ఆమెకి తెలిసిపోతుంది. బిడ్డ తన కొడుకు బిడ్డే అనుకుంటుంది. అయితే థామస్‌కుట్టీకి తెలిసే ముందే అతను చనిపోతాడు. నిజానికి అతనికి అనారోగ్యం వచ్చాక భార్యాభర్తలు శారీరకంగా కలవలేదు. అతనికి బిడ్డ గురించి చెప్పమని లీలమ్మ అంటుంది. అంజు అతని దగ్గరకి వెళ్ళినపుడు లీలమ్మ పక్కనే ఉంటుంది. అయితే అంజు చెప్పేలోపే అతను చనిపోతాడు. ఇక్కడ అంజుగా నటించిన పార్వతీ తిరువోతు నటన అద్భుతంగా ఉంటుంది. తను చేసిన తప్పు గురించి ఆలోచించాలా, చనిపోయిన భర్త గురించి ఆలోచించాలా తెలియక ఆమె దిగ్భ్రమలో ఉంటుంది.

కొడుకు చనిపోయినా కోడలు గర్భవతి కదా అని లీలమ్మ సాంత్వన పొందుతుంది. కోడల్ని ప్రేమగా చూసుకుంటుంది. థామస్‌కుట్టీ చనిపోయే సమయానికి వర్షాలవల్ల లంక గ్రామం మోకాలు లోతు నీటిలో మునిగిపోయి ఉంటుంది. కొడుకుని తండ్రి సమాధి పక్కనే ఖననం చేయాలని లీలమ్మ పట్టుదల. నీటి వరద వల్ల ఖననాన్ని వాయిదా వేస్తారు. లీలమ్మకి ఒక కూతురు కూడా ఉంది కానీ ఆమె కుటుంబం ఆమెది. లీలమ్మకి కూతురి మీద ఆశలు లేవు. కోడలే తనకి తోడు ఉంటుందని ఆశపడుతుంది. ఖననం పూర్తయ్యక ఆస్తి కోడలి పేరు మీద రాసేస్తానని అంటుంది. అటక మీద ఉన్న ఉయ్యాల కిందకి దింపించి శుభ్రం చేయిస్తుంది. ఇదంతా చూసి అంజుకి అపరాధభావం పెరుగుతుంది. రాజీవ్‌తో కలిసి పారిపోదామనుకుంటుంది. కానీ రాజీవ్ వద్దంటాడు. అతను వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగం చూసుకుంటూ ఉంటాడు. తన సంపాదన సరిపోదని అంజుతో అంటాడు. లీలమ్మ ఆస్తి రాసే దాకా ఉండమంటాడు. ఆమె “వద్దు. నేనక్కడ ఉండలేను” అంటుంది. అతను “నువ్వు నన్ను వదిలి ఇంకో పెళ్ళి చేసుకున్నావు. అయినా నాకు కోపం లేదు. నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వచ్చాక నా స్నేహితులు నన్ను ఎగతాళి చేశారు. అయినా ఓర్చుకున్నాను. నువ్వంటే ప్రేమ కాబట్టి” అంటాడు. అలా ఆమెలో అతను కూడా అపరాధభావం కలిగిస్తాడు. లీలమ్మ ఆస్తి సంగతి అతనికి ఎందుకు? ఈ విషయం అంజు ఆలోచించదు. ఆమె ఆందళన ఆమెది. అయినా రాజీవ్ ఆగమన్నాడు కాబట్టి ఆమె ఆగిపోతుంది.

రాజీవ్ అంజుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆమె అతని నంబరు ‘మారియా’ అనే పేరుతో సేవ్ చేసుకుంది. తన స్నేహితురాలు అని చెబుతుంది. ఒకరోజు అంజు అక్కడ లేకపోతే లీలమ్మ ఫోన్ ఎత్తుతుంది. అవతల మగగొంతు విని నిశ్చేష్టురాలవుతుంది. అంజుని అడిగితే “నా స్నేహితుడు. మా నాన్నకి నేను అబ్బాయిలతో మాట్లాడటం ఇష్టం లేదు. అందుకే ఫోన్‌లో మారియా అని పెట్టుకున్నాను. అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూ ఉంటాడు. మీకిష్టం లేకపోతే మానేస్తాను” అంటుంది. లీలమ్మది సంకుచిత మనస్తత్వం కాదు. ఆమె డాక్టర్ కావాలనుకుంది. కానీ తండ్రి త్వరగా పెళ్ళి చేసేశాడు. అప్పటి నుంచి కుటుంబమే జీవితంగా బతికింది. ఇదంతా అంజుకి తెలుసు. లీలమ్మ ఆమెతో “అతనితో మాట్లాడటం మానక్కరలేదు. ఇబ్బంది కాకుండా చూసుకో” అంటుంది.

అంజు తలిదండ్రులు వస్తారు. ఆమె తల్లి కూతురి పరిస్థితి చూసి “నేనే ఈ పెళ్ళికి బలవంతపెట్టాను. నా మీద కోపమా?” అంటుంది. అంజుకి గతం గురించి ఆలోచించే ఓపిక లేదు. భవిష్యత్తు ఏమిటని ఆమె బాధ. లీలమ్మ చూపించే ప్రేమ భరించటం ఆమెకి కష్టంగా ఉంటుంది. తప్పు చేసినపుడు మంచితనాన్ని భరించటం కూడా కష్టమే. ఒకరోజు ఆమె లీలమ్మతో “నేను అంత్యక్రియలు అయ్యాక వెళ్ళిపోతాను” అంటుంది. “మీ పుట్టింట్లో ఏం ఉంది? మీ అమ్మానాన్నలు కూడా నువ్వు ఇక్కడ ఉండాలనే చెబుతారు. ఇక్కడే ఉండు” అంటుంది లీలమ్మ. “నేను పుట్టింటికి వెళ్ళను. వేరుగా వెళ్ళిపోతాను” అంటుంది అంజు. “నీ ఇష్టం. నా కొడుకు బిడ్డ మాత్రం నాకు కావాలి” అంటుంది లీలమ్మ. “ఇది నా బిడ్డ” అంటుంది అంజు. లీలమ్మ అమాయకురాలు కాదు. ఆమెకి అసలు విషయం అర్థమైపోతుంది. “టౌనుకి వెళ్ళి నువ్వు అతన్ని కలిసేదానివి కదా? ఎన్నాళ్ళుగా సాగుతోంది? ఈ బిడ్డ థామస్‌కుట్టీ బిడ్డ కాదు కదా? నిన్ను కూతురిలా చూసుకున్నాను. నిజం చెప్పు” అంటుంది. “ఈ బిడ్డ థామస్‌కుట్టీ బిడ్డ కాదు” అంటుంది అంజు. లీలమ్మ మౌనంగా భరిస్తుంది. ఇదిలా ఉండగా వరద పెరిగి ఇంటిలోకి నీరు వస్తుంది. ఆ ఊరివారికి ఇది అలవాటే. ఈసారి వరద లీలమ్మ దుఃఖానికి ప్రతీకలా వచ్చింది.

లీలమ్మ చెల్లెలు రోజమ్మ ఒక క్రైస్తవ సన్యాసిని. ఆమె వస్తుంది. చెల్లెలిని చూసి లీలమ్మకి ఇంకా దుఃఖం వస్తుంది. “నాకెవరూ లేరు” అని ఏడుస్తుంది. అయినా ఆమె అసలు విషయం ఎవరికీ చెప్పదు. ఎంతో సహనంగా ఉంటుంది. ఇలా ఉండేవారు చాలా తక్కువ. అంజు తన కొడుక్కి సేవలు చేయటం ఆమె చూసింది. కొడుకు అనారోగ్యంతో ఉండటంతో అంజు రాజీవ్‌తో కలిసి తప్పటడుగు వేసిందని అనుకుంటుంది. రాజీవ్‌ని ముందే ప్రేమించిందని ఆమెకి తెలియదు. రోజమ్మ “థామస్‌కుట్టీ బిడ్డని బాగా చూసుకోవటమే ఇప్పుడు నీ కర్తవ్యం” అంటుంది. లీలమ్మ అంజు దగ్గరకి వెళ్ళి “రోజమ్మ బిడ్డని బాగా చూసుకోవాలని అంటోంది. ఈ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా కొడుకు ఎంత నరకం అనుభవించాడు? అతని ఆత్మకి శాంతినివ్వు. నలుగురూ నా కొడుకుని హేళన చేస్తే నేను భరించలేను. ఇక్కడే ఉండొచ్చు కదా?” అని విలపిస్తుంది. “నేనుండలేను. వెళ్ళిపోతాను. ఇక్కడుండి మిమ్మల్ని బాధ పెట్టలేను” అంటుంది అంజు.

ఎంత చిత్రమైన పరిస్థితి! లీలమ్మ పరువు కోసం అంజుని ఉండిపొమ్మంది. ఆమెకి కక్ష ఏమీ లేదు. అంజు అక్కడుంటే బిడ్డ తన మనవడని చెప్పుకుని ప్రేమగా పెంచుతుంది. అంజుని కూడా ప్రేమగా చూసుకుంటుంది. కానీ అంజుకి ఈ ప్రేమే పెద్ద శిక్ష. అంతా తెలిసిన లీలమ్మ దగ్గర ఉండటం ఆమెకి క్షోభ. మోసం చేసిందని తెలిసీ అత్తగారు ఆదరిస్తే ఆమె తట్టుకోలేదు. “మిమ్మల్ని బాధ పెట్టలేను” అంటుంది కానీ నిజానికి ఆమెకే అది రంపపుకోత. మరి అత్తగారికి నిజం ఎందుకు చెప్పింది? ఆమెకి రాజీవ్ కావాలి. బిడ్డ రాజీవ్ బిడ్డ అని చెబితే తనని అసహ్యించుకుని పొమ్మంటుందని అనుకుంది. కానీ పరువు ఒకటి ఉంది కదా! అత్తింటి పరువు కోసం అంజు ఉండిపోతుందా?

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం క్రిస్టో టామీ. కథలో ఎక్కడా ఆసక్తి తగ్గకుండా స్క్రీన్ ప్లే ఉంటుంది. మొదటి సీన్లోనే అంజు, రాజీవ్‌ల ప్రేమ, అతని ఆర్థిక పరిస్థితి, ఆమె కుటుంబం వ్యతిరేకత అన్నీ తెలిసిపోతాయి. ఓ అరగంట సాగదీసి చెప్పటం కన్నా ఇలా చెప్పటం బావుంది. అంజుగా పార్వతీ తిరువోతు, లీలమ్మగా ఊర్వశి పోటీపడి నటించారు. ఊర్వశి నటన కొన్ని చోట్ల కన్నీరు పెట్టిస్తుంది. కేరళ ప్రభుత్వం ఆమెకి ఉత్తమ నటి అవార్డు ఇచ్చింది. వయసు మీరిన నటి కాబట్టి సహాయనటిగా ముద్ర వేయకుండా ఉత్తమ నటి అవార్డు ఇవ్వటం ముదావహం. నదిలో పడవ వెళ్ళే సన్నివేశాలు, నేపథ్య సంగీతం అంజు ఒంటరితనాన్ని ప్రభావవంతంగా ఆవిష్కరించాయి. వరద నీరు ఇంట్లోకి వచ్చినా అందరూ ఎవరి పనుల వారు మామూలుగా చేసుకోవటం వింతగా ఉంటుంది. లంకగ్రామాల్లో ఇది సాధారణం. నిజంగానే వరదలో చిత్రీకరణ జరిగిందా లేక కృత్రిమమా అనేది నాకు తెలియలేదు. అంత సహజంగా ఉంటుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

అంజు, లీలమ్మ భావోద్వేగంతో మాట్లాడుకోవటం చూసిన అంజు తల్లి ఏమయ్యిందని లీలమ్మని అడుగుతుంది. ఆమె అంజు రాజీవ్‌తో వెళ్ళిపోతానని చెప్పానని చెబుతుంది. అంజు బిడ్డకి రాజీవ్ తండ్రి అని మాత్రం చెప్పదు. అంజు తండ్రి అంజు రాజీవ్‌తో వెళ్ళిపోతానంటోందని తెలిసి ఆమెని కొడతాడు. “నీ భర్త అంత్యక్రియలు కూడా కాలేదు. నువ్వు అతని బిడ్డని తీసుకుని వాడితో పోతానంటావా?” అంటాడు. అప్పుడే రాజీవ్ అంజుకి ఫోన్ చేస్తాడు. అంజు తండ్రి ఫోన్ ఎత్తి అతన్ని తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. గొడవ విని రోజమ్మ, అంజు తల్లి, లీలమ్మ కూతురు వస్తారు. లీలమ్మ తన గదిలో ఉంటుంది. ఆమెకి అంతా వినపడుతుంటుంది. అంజు “నేను రాజీవ్‌ని పెళ్ళి చేసుకుంటానని కాళ్ళావేళ్ళా పడినా మీరు వినలేదు. అమ్మా! నేను ఈ జీవితం భరించలేనని నీకు చెప్పలేదా? నువ్వే కదా ఓర్చుకోమన్నావు. ఇక ఓర్చుకోవటం నావల్ల కాదు” అంటుంది. లీలమ్మ కూతురు అంతా అర్థమై అంజు కుటుంబాన్ని పరువు లేని కుటుంబం అని తిడుతుంది. రోజమ్మ ఆమెని వారిస్తుంది. అంజు తండ్రి “నువ్వు వాడితో వెళ్ళటం జరగదు” అని వెళ్ళిపోతాడు. అంజు ఫోన్ తన దగ్గర పెట్టుకుంటాడు. అంజు కుమిలిపోతుంది.

వరద తగ్గుతుంది. థామస్‌కుట్టీ పార్థివశరీరాన్ని మార్చురీ నుంచి ఇంటికి తీసుకువస్తారు. ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అంజు తన గదిలో ఉండిపోతుంది. వచ్చినవారందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అంజు ఎంతకీ ఫోన్ ఎత్తకపోవటంతో రాజీవ్ వస్తాడు. అంజు గది కిటికీ దగ్గరకి వెళ్ళి దొంగచాటుగా మాట్లాడతాడు. “ఆరోజు వెళ్ళిపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు” అంటాడు. ఇల్లు హడావిడిగా ఉండటంతో అంజు అతన్ని పంపించేస్తుంది. తగ్గిపోయిందనుకున్న వర్షం మళ్ళీ మొదలవుతుంది. శ్మశానం మళ్ళీ నీటిలో మునిగిపోతుంది. ఖననం చేయటం కుదరదు. టౌనుకి వెళదామంటే లీలమ్మ ఒప్పుకోదు. అంత్యక్రియల ఏర్పాట్లు చూసేది అంజు తండ్రి. ఆయన “అందరూ పనులు మానుకుని ఉన్నారు” అంటాడు. “వెళ్ళిపోవాలనుకునేవారు వెళ్ళిపోవచ్చు. ఈ కుటుంబానికి కొన్ని సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్నాయి. అవి పాటించాల్సిందే” అంటుంది లీలమ్మ. ఇది పరోక్షంగా అంజు కుటుంబాన్ని దెప్పినట్టే ఉంటుంది.

లీలమ్మ అంజుని ప్రార్థనకి రావాలని బలవంతపెడుతుంటే రోజమ్మ వస్తుంది. “అంతా తెలిసీ అంజు థామస్‌కుట్టీని చేసుకుంది కదా. వదిలెయ్” అంటుంది రోజమ్మ. అంజుకి అర్థం కాదు. లీలమ్మ “ఏంటి అంతా తెలియటం? వాడికి ఎప్పుడో తలనొప్పి వచ్చింది. తర్వాత తగ్గిందిగా. నీకు జబ్బు చేసిందని నాన్న నిన్ను దేవుడికి అర్పించాడు. నువ్వు బాగానే ఉన్నావుగా? నీకు కుటుంబం లేదు కదా అని నా కుటుంబాన్ని చూసి ఈర్ష్యపడకు” అంటుంది లీలమ్మ. రోజమ్మ క్రీస్తు బోధనలు ఆకళింపు చేసుకుంది. అంజు పాపం చేసిందని తెలుసు. అయినా క్షమించింది. అంజు పరిస్థితిని అర్థం చేసుకుంది. ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకోలేక, జబ్బు పడిన భర్తని చూసుకుంటూ ఆమె పడిన వేదన ఆమెకి అర్థమయింది. లీలమ్మ మనసు మంచిదయినా పరువు కోసం ఆమె ఆరాటపడుతూ ఉంటుంది. పైగా చెల్లెలిని ఈర్ష్య పేరుతో నిందిస్తుంది. అక్కచెల్లెళ్ళలో ఈ పంతాలు మామూలే. కానీ రోజమ్మ సన్యాసిని. ఆమెని నిందించటం తప్పు.

ఇంతకీ ‘అంతా తెలిసీ’ అని రోజమ్మ ఎందుకంది? అంజుకి అనుమానం వస్తుంది. హాస్పిటల్‌కి వెళ్ళినపుడు లీలమ్మ అంజుని ఏదో సాకుతో పక్కకి పంపించి థామస్‌కుట్టీని తానే డాక్టరు దగ్గరకి తీసుకువెళ్ళేది. అంజు చేత వేరే మందులు కూడా తెప్పించేది. అంజుకి అప్పుడు అనుమానం రాలేదు. ఇప్పుడు మెడికల్ రిపోర్టులు వెతుకుతుంది. పాత రిపోర్టులు దొరుకుతాయి. థామస్‌కుట్టీకి పెళ్ళికి ముందే జబ్బు చేసిందని అర్థమౌతుంది. కొడుకు జబ్బు మనిషి అని తెలిసి కూడా లీలమ్మ చెప్పకుండా ఎలా పెళ్ళి చేసింది? ఉత్తమురాలు అనుకున్న అత్తగారి మీద అంజుకి కోపం వస్తుంది. జబ్బు గురించి తెలిస్తే అంజు పెళ్ళే చేసుకునేది కాదు. అప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అంటే అత్తగారి వల్లే తాను ఈ పరిస్థితిలో ఉన్నానని అంజుకి ఉక్రోషం వస్తుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

అంజు లీలమ్మని నిలదీస్తుంది. లీలమ్మ “అప్పుడెప్పుడో వాడికి తల వాచింది. తర్వాత తగ్గింది. జబ్బు తిరగబెడుతుందని నాకు తెలియదుగా. అంతా దేవుడి ఇచ్ఛ” అంటుంది. ఆమె నిజాయితీగానే ఈ మాట అంటుంది. “దేవుడి మీద తోయకండి. నాకు తెలియకూడదనే మీరు డాక్టరు గదిలోకి నన్ను తీసుకెళ్ళేవారు కాదు కదా? నాకింత అన్యాయం చేస్తారా?” అంటుంది అంజు. “నువ్వు నా బిడ్డకి, నాకు చేసిన దాని కన్నా ఇది ఎక్కువేం కాదు” అంటుంది లీలమ్మ. ఆమె అంజు దగ్గర గతంలో వచ్చిన జబ్బు విషయం దాచాలనుకోవటం నిజం. అది తప్పని ఆమెకీ తెలుసు. కానీ ‘నువ్వూ తప్పు చేశావు’ అంటుంది. ‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’ అని అందుకే అన్నారు. అంజు కోపంతో “మీకూ, మీ అబ్బాయికి తగిన శాస్తే జరిగింది” అంటుంది. అయితే ఆమెకి తర్వాత ఇంకో రహస్యం తెలుస్తుంది. దానితో అంజుకి తన దుర్గతికి ఎవరు కారణం అనేది అర్థం కాకుండా పోతుంది.

రోజమ్మ అంజుని సముదాయించటానికి వెళుతుంది. అప్పుడో విషయం తెలుస్తుంది. రోజమ్మకి సత్యపాలన ముఖ్యం. తెలిసిన విషయాన్ని దాచకూడదు. క్రైస్తవుల పెళ్ళిలో కూడా ఫాదర్ వధూవరులను భార్యాభర్తలుగా ప్రకటించే ముందు ‘ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి’ అంటాడు. అప్పుడు వధూవరులకి తెలియని విషయాలు చెప్పవచ్చు. పెళ్ళికి ముందు రోజమ్మ అంజు ఊరి ఫాదర్‌కి థామస్‌కుట్టీకి గతంలో వచ్చిన జబ్బు సంగతి చెప్పింది. ఆ ఫాదర్‌ని అంజు తండ్రికి చెప్పమంది. తండ్రి తెలిసి తెలిసీ తనకీ పెళ్ళి చేశాడని అంజు తండ్రిని నిలదీస్తుంది. అయితే ఫాదర్ వచ్చినపుడు ఆయన ఇంట్లో లేడు. ఆ ఫాదర్ అంజు తల్లికి విషయం చెప్పాడు. ఆమె భర్తకి చెప్పకుండా దాచింది! “ఇంతదాకా వస్తుందని అనుకోలేదు. మంచి సంబంధమని, నువ్వు సుఖపడతావని అనుకున్నాను” అంటుంది అంజు తల్లి. అంజు ఇది విని తల్లితో మాట్లాడటం మానేస్తుంది. అంజు కోరుకున్నవాడితో పెళ్ళి చేయకపోవటం అంజు తండ్రి తప్పు. పెళ్ళిమాటలు జరుగుతున్నప్పుడు జబ్బు సంగతి చెప్పకపోవటం లీలమ్మ తప్పు. తెలిసినా దాచటం అంజు తల్లి తప్పు. కానీ వాళ్ళందరూ అంజు మంచి కోరి చేశారు. అంతా బాగుంటుందనే చేశారు. అంజు మాత్రం అందరూ బాధపడతారని తెలిసీ తప్పు చేసింది. కానీ ఆమె పరిస్థితులని భరించలేక సాంత్వన కోసం తను ప్రేమించినవాడితో సంబంధం పెట్టుకుంది. అది తప్పని అనగలమా? అందుకే ఎవరినీ తొందరపడి దోషులుగా నిర్ధారించకూడదు.

అంజు లీలమ్మ మీద అక్కసు వెళ్ళగక్కుతుంది. ఇక్కడ కూడా నావారు, పరాయి వారు అనే తేడా చూపిస్తుంది. తలిదండ్రులు తప్పు చేసినా ఆమె లీలమ్మ మీదే విషం కక్కుతుంది. “మీ సంతోషం చూసి దేవుడికి కన్నుకుట్టిందని అన్నారు. అంతా మీ భ్రమ. దేవుడి దాకా ఎందుకు, మనుషులకి కన్నుకుట్టటానికి కూడా మీ దగ్గర ఏం లేదు. మీ భర్త ఎప్పుడూ మీ మీద, మీ బిడ్డల మీద ప్రేమ చూపలేదు. అందుకే మీకు ప్రేమంటే ఏమిటో తెలియదు. థామస్‌కుట్టీ నన్నెప్పుడూ ప్రేమగా చూడలేదు. ఎవరేమన్నా నేను రాజీవ్‌తో వెళ్ళిపోతాను. మీకు మా ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు” అంటుంది. లీలమ్మ భర్త సంగతి అంజుకెలా తెలుసు? థామస్‌కుట్టీ కొంత చెప్పి ఉంటాడు. ఊళ్ళో వాళ్ళు కొంత చెప్పి ఉంటారు. లీలమ్మ భర్త తన కుటుంబాన్ని ప్రేమించకపోవటం నిజమే కావచ్చు. కానీ లీలమ్మ అంజు మీద చూపించిన ప్రేమ సంగతి ఏమిటి? లీలమ్మ లాంటి ఎందరో స్త్రీలు తమని దక్కని ప్రేమ కోడళ్ళకి దక్కకూడదని ఆరళ్ళు పెడతారు. కానీ లీలమ్మ అలా కాదు. ఆ సంగతి అంజు మరచిపోయింది. కాదు, కావాలనే విస్మరించింది. లేకపోతే ఆమెకి లీలమ్మని వదిలివెళ్ళటం సాధ్యం కాదు.

లీలమ్మలో ఉత్తమగుణం ఏమిటంటే ఆమెలో ఆత్మపరిశీలన ఉంది. ఆమె రోజమ్మతో “నువ్వు వాళ్ళకి పెళ్ళికి ముందే చెప్పి మంచి పని చేశావు. అయినా నేను చెప్పకపోవటం తప్పే కదా?” అంటుంది. రోజమ్మ “వాళ్ళు కూడా అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పలేదుగా” అంటుంది. రోజమ్మ పాత్ర ఉదాత్తంగా నిలిచిపోతుంది. అందరి తప్పులూ సాక్షిగా చూస్తుంది. ఎవరినీ దోషులగా చూడదు. తప్పుని ద్వేషించాలి కానీ తప్పు చేసినవారిని కాదు. లీలమ్మ “నీకు కుటుంబం లేదు. నాకుంది. అయినా మన జీవితాలు మాత్రం ఒకటే” అంటుంది. మనిషి ఎన్నో బంధాలు, ఆశలు పెట్టుకుంటాడు. కానీ అన్ని బంధాలు చివరకు బూటకమనే తెలుస్తుంది. అందుకే మమకారం కన్నా త్యాగమే గొప్పది. త్యాగం ద్వారానే అమృతత్వం సాధ్యం. లీలమ్మ అంజు తండ్రిని పిలిచి “అంజుని థామస్‌కుట్టీ ప్రేమగా చూడలేదని నాకు తెలియదు. వాడు కోలుకోవాలనే నేను కోరుకున్నాను” అంటుంది. “అతనికి జబ్బు ఉందని తెలిస్తే నేను ఈ పెళ్ళికి ఒప్పుకునేవాడినే కాదు” అంటాడతను. “మీ ఆవిడకి తెలుసుగా. మీరు మాత్రం అంజు కోరుకున్నవాడితో పెళ్ళికి అడ్డు చెప్పలేదా? ఒకరినొకరు నిందించుకుని లాభం లేదు. ఆమె కోరిక ఇప్పటికైనా మన్నించండి” అంటుందామె. “నేను చచ్చినా ఒప్పుకోను. నేను పరువుగా బతికాను. మీ కుటుంబానికీ ప్రతిష్ఠ ఉంది” అంటాడతను. “ఏం ప్రతిష్ఠ? పిల్లలు సంతోషం లేకపోతే ప్రతిష్ఠ ఎందుకు? అంజు అంత్యక్రియలు కాగానే వెళతానని అంది. ఆమె మనసు మారుతుందని నేను అంత్యక్రియలు ఆపాను. ఇక ఆపను. టౌనులో అంత్యక్రియలకి ఏర్పట్లు చేయండి. అంజుని రాజీవ్‌తో వెళ్ళనివ్వండి” అంటుంది. తండ్రి సమాధి పక్కనే కొడుకు సమాధి ఉండాలని లీలమ్మ అనేది. కానీ అదంతా లోకుల కోసమే. బతికున్నప్పుడు కొడుకును ప్రేమించనివాడి సమాధి పక్కన కొడుకు సమాధి కట్టి అతని ప్రతిష్ఠ నిలబెట్టాల్సిన అవసరం లేదు.

అంజు తండ్రి లీలమ్మ చెప్పినట్టే చేయటానికి నిర్ణయించుకుంటాడు. అంజుతో “నువ్వు అతనితో వెళ్ళవచ్చు” అంటాడు. అంజు ఏదో చెప్పబోతుంది కానీ అతను ఏమీ చెప్పవద్దంటాడు. అంజు రాజీవ్‌కి ఫోన్ చేసి “మా నాన్న ఒప్పుకున్నాడు. థామస్‌కుట్టీకి ముందే జబ్బు ఉంది. అది దాచారు. ఇప్పుడు తెలిసింది. అందుకే మా నాన్న ఒప్పుకున్నాడు” అంటుంది. తండ్రికి లీలమ్మ చెప్పిందని ఆమెకి తెలియదు. రాజీవ్ “సరే. ఇల్లు చూస్తాను. ఆస్తి విషయం లీలమ్మని అడుగు. ఆస్తి ఉంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి” అంటాడు. ఆమె అడగనంటుంది కానీ అతను బలవంతం చేస్తాడు. ఆమె లీలమ్మని అడుగుదామని వెళుతుంది (ఇది ఆమె పాత్ర స్వభావానికి విరుద్ధంగా ఉందని నాకనిపించింది). అప్పుడే లీలమ్మ కూతురు వచ్చి తల్లితో “ఆమె మన ఇంటి బిడ్డని తీసుకుని వేరే వాడితో వెళ్ళిపోతే మన పరువు పోతుంది. ఆమె ఆడించినట్టల్లా ఆడితే నీకు మా మద్దతు ఉండదు” అంటుంది. లీలమ్మ “మీ అన్నగారు జబ్బుపడినప్పుడు నువ్వెక్కడున్నావు? తనే కదా వాడిని చూసుకుంది. అదే తనకి ఈ ఇంట్లో హోదా ఇచ్చింది” అంటుంది. ఎంత కృతజ్ఞత! మనమెప్పుడూ మనకి జరిగిన అన్యాయాల గురించి మాట్లాడతాం కానీ మనకి జరిగిన మంచిని తలచుకుని కృతజ్ఞతగా ఉంటున్నామా అని అలోచించుకోవాలి. లీలమ్మ కూతురు “అన్న ఆత్మ నిన్ను క్షమించదు” అని అంజుతో “నువ్వు ఇంతకింతా అనుభవిస్తావు” అని వెళ్ళిపోతుంది. లీలమ్మ అంజుతో “ఆమె మాటలు పట్టించుకోకు. బాధలో ఉంది. నువ్వేదో అడగాలని వచ్చావు. చెప్పు” అంటుంది. అంజు భారమైన మనసుతో “ఏం లేదు” అని వచ్చేస్తుంది. అసలు ఆమె అంతరాత్మ ఆస్తి అడగటానికి ఒప్పుకోదు. రాజీవ్ చెప్పాడని అడగటానికి వచ్చింది. అత్తగారి సహృదయం చూసి ఆమెకి సిగ్గేసింది.

టౌనులో అంత్యక్రియలకి ఏర్పాట్లు పూర్తవుతాయి. అంజు కూడా బట్టలు సర్దుకుంటుంది. అంత్యక్రియలు అవ్వగానే రాజీవ్ తో వెళ్ళిపోవటానికి. అందరూ బయల్దేరటానికి సిద్ధంగా ఉంటారు. లీలమ్మ అంజు దగ్గరకి వస్తుంది. “తెలిసో తెలియకో నేను నిన్ను చాలా బాధపెట్టాను. మనసులో పెట్టుకోకు” అంటుంది. అంజు “నాకు దిక్కు తోచలేదు. చాలా తప్పులు చేశాను. నన్ను ద్వేషించవద్దు” అంటుంది. లీలమ్మ “లేదమ్మా. నీ పరిస్థితి అందరికన్నా నాకు బాగా అర్థమయింది. ఇక నుంచైనా నువ్వు సంతోషంగా ఉండొచ్చు. నీకు ఆస్తి ఇచ్చేస్తాను” అంటుంది. అంజు “వద్దు అత్తయ్యా. అది నాకు భారమవుతుంది” అంటుంది. లీలమ్మ ఒక బంగారు గొలుసు ఇచ్చి “ఇది మాత్రం వద్దనకు. పిల్లవాడి మెడలో వెయ్యి. ప్రవసం అయ్యాక ఒకసారి నేను బిడ్డని చూడొచ్చా?” అంటుంది. “మేం ఇక్కడికి వస్తూ ఉంటాం” అంటుంది అంజు. “నువ్వు, బాబూ ఇక్కడ ఉండొచ్చు. ఇది మీ ఇల్లే” అంటుంది లీలమ్మ.

అందరూ పడవలో టౌనులోని శ్మశానానికి వెళతారు. బంధువులు, స్నేహితులు వస్తారు. రాజీవ్ కూడా వస్తాడు. జనంలో ఒకడిగా ఉంటాడు. ఖననం చేసే ముందు అంజు భర్త చెవిలో “నేను నిన్ను క్షమించాను. నువ్వు కూడా నన్ను క్షమించు” అంటుంది. ఖననం అయ్యాక అంజు రాజీవ్‌తో మాట్లాడుతుంది. “వాళ్ళ ఆస్తి నేనెలా అడుగుతాను?” అంటుంది. “నీకు నా మీద ప్రేమ ఉంటే ఆమె ఇస్తానన్నప్పుడు వద్దనే దానివి కాదు. నీకు అందరూ నాకంటే ఎక్కువే. అప్పుడు మీ అమ్మానాన్న, ఇప్పుడు లీలమ్మ” అంటాడతను. “అలా మాట్లాడతావేంటి? నీ కోసం ఎన్ని మాటలు పడ్డాను?” అంటుందామె. “నువ్వు ఇంకొకడితో పడుకున్నా నిన్ను స్వీకరిస్తున్నాను. దానికన్నా ఎక్కువా?” అంటాడతను. ఆమె నోటమాట రాక ఉండిపోతుంది. అతను “సారీ. పోదాం పద” అంటాడు. ఆమె “నువ్వు నది ఒడ్డుకి రా. అత్తయ్య వెళ్ళాక వెళదాం” అంటుంది.

కారులో అంజు, లీలమ్మ కుటుంబం, అంజు కుటుంబం నది ఒడ్డుకి వెళతారు. రాజీవ్ మోటార్ సైకిల్ మీద వస్తాడు. లీలమ్మ పడవ ఎక్కబోతుంటే లీలమ్మ కూతురు “నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు?” అంటుంది. “పర్వాలేదు. నువ్వు వెళ్ళు” అంటుంది. లీలమ్మ అంజు తలిదండ్రులకి వీడ్కోలు చెప్పి పడవ ఎక్కుతుంది. ఇదంతా అంజు చూస్తూ ఉంటుంది. కారులో నుంచి బ్యాగులు తెచ్చుకుని రాజీవ్‌ని దాటి, అందరినీ దాటి పడవ ఎక్కి లీలమ్మ పక్కన కూర్చుంటుంది. రాజీవ్ హతాశుడై ఉండిపోతాడు. అంజు తండ్రి కూతురి వంక సంతృప్తిగా చూస్తాడు. అంజు ఎవర్నీ చూడదు. పడవ బయల్దేరుతుంది. అంజు లీలమ్మ చేతి మీద చేయి వేస్తుంది. ఇద్దరూ కన్నీరు పెట్టుకుంటారు. లీలమ్మ అంజు చేతిని గట్టిగా పట్టుకుంటుంది. పడవ సాగిపోతుంది.

ఈ ముగింపు నాకు ‘ఇది కథ కాదు’ చిత్రం ముగింపుని గుర్తు చేసింది. అందులో కూడా అత్తాకోడళ్ళు కొత్త జీవితం వైపు ప్రయాణం చేస్తారు. మగవాళ్ళ శాసించే ప్రపంచంలో ఆడవాళ్ళే ఆడవాళ్ళకి తోడు. రాజీవ్ స్వార్థపరుడని అంజుకి తెలిసిపోయింది. పైగా అతను శరీరం మలినమైందన్నట్టు మాట్లాడాడు. రేపు ఇంకా ఎన్ని అంటాడో? అంజు తన భర్త నుంచి కూడా ప్రేమ పొందలేదు. లీలమ్మ కూడా భర్త నుంచి ప్రేమ పొందలేదు. అంజుకి లీలమ్మ ప్రేమ, లీలమ్మకి అంజు తోడు చాలు. అంజు బిడ్డని లీలమ్మ అల్లారుముద్దుగా పెంచుతుందనటంలో సందేహం లేదు. అసలు స్త్రీలు మౌలికంగా ప్రేమస్వరూపులు. వారికి కాస్త ప్రేమ చాలు. పురుషులు వారిని వాడుకోవటం మానేస్తే వారికి అంతకన్నా ఏమీ అవసరం ఉండదు.

Exit mobile version