Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 123: స్వాలో

[సంచిక పాఠకుల కోసం ‘స్వాలో’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

‘స్వాలో’ (2019) చిత్రకథ పైకా (Pica) అనే ఒక వింత వ్యాధి బారిన పడిన ఒక యువతి కథ. ఈ వ్యాధి లక్షణం ఏమిటంటే ఆహారపదార్థాలు కాకుండా ఇతర పదార్థాలు తినాలని అనిపించటం. అలా ఎందుకు అనిపిస్తుంది? శరీరంలో ఏదైనా ఒక ఖనిజం తగ్గితే ఆ ఖనిజం స్థూలంగా కనిపించే పదార్థం తినాలని అనిపిస్తుంది. గర్భవతులకి ఏవేవో తినాలనిపిస్తుంది. ఈ చిత్రంలో నాయిక కూడా గర్భవతే! అయితే ఆమెకి తెలియని కారణం మానసికం. ఈ చిత్రం కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. నిజమే! గర్భవతి అయిన స్త్రీ తినకూడనివి తింటుంటే చూడటం కష్టమే. కానీ దానికి పరిస్థితులు కారణం. మూలకారణానికి విరుగుడు చూడాలి కానీ లక్షణాలకి మందు వేస్తే లాభం లేదు. ఇంతకీ ‘స్వాలో’ అంటే మింగటం అని అర్థం. ఈ చిత్రం మూబీలో లభ్యం.

హంటర్ ఒక నది ఒడ్డున పెద్ద ఇంట్లో ఉంటుంది. కనుచూపు మేరలో వేరే ఇల్లు ఉండదు. ఆమె భర్త రిచీ తండ్రి కంపెనీలో పెద్ద హోదాలో ఉంటాడు. ఇల్లు కూడా తండ్రి ఇచ్చినదే. అమెరికాలో పిల్లలు వేరుగా ఉండటం మామూలే. హంటర్ కాలక్షేపానికి ఇల్లు అలంకరిస్తూ ఉంటుంది. పూల మొక్కలు పెంచాలని అనుకుంటుంది. కానీ రిచీకి పనే ముఖ్యం. పైకి ప్రేమగా ఉంటాడు కానీ భార్య అంటే వారసుడిని కనే మనిషి అనే అతని భావన. హంటర్ గర్భం ధరిస్తుంది. రిచీ అమితానందపడతాడు. అతని తండ్రి “ఆ కడుపులో ఉన్నది కాబోయే సీఈఓ” అంటాడు. ఎంత ఆశ్చర్యం! బిడ్డ పుట్టకముందే తమ ఆశలని వారి మీద రుద్దటం. పుట్టేవారు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని కోరుకోకుండా ఏవేవో కోరుకోవటం. హంటర్ ఒక షాపులో పని చేసేది. రిచీ ఆమెనెందుకు పెళ్ళి చేసుకున్నాడు? ఆమె అయితే కృతజ్ఞతతో ఉంటుందని, తన చెప్పుచేతల్లో ఉంటుందని! ఆమెకి అత్తామామలు కూడా పెద్ద విలువ ఇవ్వరు. అత్తగారైతే ఆమె మీద కాస్త అక్కసు కూడా చూపిస్తుంది.

ఒకరోజు హంటర్ ఒక గోళీకాయ మింగేస్తుంది. తర్వాత అది మలంలో బయటకి వచ్చేస్తుంది. దాన్ని తీసి ఆమె ఒక చోట భద్రపరుస్తుంది. అత్తగారు ఆమెని అవమానపరిచిన రోజు ఆమె ఒక చిన్న పిన్ను మింగేస్తుంది. అలా ప్రమాదకరమైన వస్తువులు మింగటం ప్రారంభిస్తుంది. కొన్ని బయటకి వచ్చేస్తాయి. కొన్ని కడుపులోనే ఉండిపోతాయి. ఆమె ఎవరికీ చెప్పదు. ఒకరోజు మెడికల్ చెకప్‌కి వెళితే ఆమె కడుపులో ఏవో ఉన్నాయని గుర్తించి వాటిని తొలగిస్తారు. పిన్నీసులు, బ్యాటరీలు లాంటివి ఉంటాయి. ఇది పైకా అనే వ్యాధి అని తెలుస్తుంది. ఆమె భర్త ఆమె మీద కేకలేస్తాడు. ఆమెని సైకియాట్రిస్ట్ దగ్గరకి తీసుకువెళతాడు. అతని తండ్రి కూడా వస్తాడు. సైకియాట్రిస్ట్‌తో “మీకు ఫీజు ఇచ్చేది నేను. కాబట్టి ఫలితాలు బావుండాలి” అంటాడు. ‘డబ్బు పారేస్తాను. సమస్యని పరిష్కరించు’ అనే మనస్తత్వం. రిచీ తండ్రి ఆడించినట్టల్లా ఆడతాడు. రేపు తన బిడ్డని అలాగే ఆడిస్తాడన్నమాట.

సికియాట్రిస్ట్ “నేను హంటర్‌తో ఒంటరిగా మాట్లాడాలి” అంటుంది. రిచీ “అలా కాదు. నేను ఇక్కడే ఉంటాను. ఆమె కోసం” అంటాడు. ఆమె కోసం కాదు, ఆమె మీద పెత్తనం కోసం. కానీ సైకియాట్రిస్టులకి మూలకారణం కావాలి. పేషెంటుతో ఒంటరిగా మాట్లాడితేనే అది తెలుస్తుంది. వేరే వారు ఉంటే వారి ప్రభావం పేషెంటు మీద ఉంటుంది. ఇది తెలియనంత మూర్ఖుడు కాదు రిచీ. అయినా అంతా తన కనుసన్నల్లో జరగాలని తాపత్రయం. కానీ హంటర్ తెలివిగా “పర్వాలేదు” అంటుంది. ‘నా కోసం నువ్వు ఉండక్కరలేదు. నేనేం చిన్నపిల్లని కాదు’ అన్నట్టు ఉంటుంది. రిచీ, అతని తండ్రి బయటకి వెళతారు. “నాకు మందులిస్తే చాలు” అంటుంది హంటర్. ఆందోళన తగ్గటానికి మందులు ఉన్నాయి. కానీ ఆందోళన మళ్ళీ రాకూడదంటే మూలకారణం కనుక్కోవాలి. “మందులిస్తాను. కానీ భావాలు వ్యక్తీకరించటం కూడా ముఖ్యమే. నీ బాల్యం గురించి చెప్పు” అంటుంది సైకియాట్రిస్ట్. “నా బాల్యం మామూలుగానే గడిచింది. నా కుటుంబం నన్ను ఎంతో ప్రేమించింది. అంతకన్నా ఏముంది? నేను వస్తువులు మింగటం మానేసి రిచీని సంతోషపెడితే చాలు” అంటుంది హంటర్. ఆమెకి అపరాధభావం కూడా ఉంది. రిచీ తనకేదో ఉపకారం చేశాడని, తనకి అసంతృప్తి కలిగితే అది కృతఘ్నత అని ఆమె భావన. అసంతృప్తి కలిగితే అవతలి వారి తప్పు కూడా ఉంటుందని అంతరాంతరాల్లో తెలుసు, కానీ ఆ భావాలని తొక్కిపెడుతుంది. అందుకే ఈ వ్యాధి వచ్చింది. సైకియాట్రిస్టులు ఒక్కరోజులోనే అన్నీ తెలుసుకోలేరు. అందుకే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి.

 

ఇదిలా ఉండగా హంటర్ అత్తగారు “నీ దేహానికి పోషకాలు అందట్లేదు. అందుకే అది మెదడుకి ఆహారం కోసం తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. కూరగాయలు, పళ్ళు కలిపి జ్యూస్ చేసుకుని తాగు” అని జ్యూస్ చేయటం నేర్పిస్తుంది. హంటర్‌కి సంతోషంగా ఉంటుంది, అత్తగారు తన గురించి ఇంత శ్రద్ధ చూపిస్తోందని. సూటిపోటి మాటలనే అత్తగారు ప్రేమ చూపిస్తోందని. కానీ అందరికీ ఆమె కనబోయే బిడ్డ గురించే చింత, ఆమె గురించి కాదు. ఇది వెంటనే తెలిసిపోతుంది. హంటర్ కోసం ఒక బాడీగార్డ్‌ని పెడతారు. అది అత్తగారి ఐడియానే! ఆ బాడీగార్డ్ పని హంటర్ ఏ వస్తువులూ తినకుండా చూడటం. అతని పేరు లువే. హంటర్‌కి ఇది నచ్చదు. అత్తగారు “నువ్వు ఒట్టిమనిషివి కాదు. ఒక పనిమనిషి ఉండటం మంచిది. పైగా హాస్పిటల్ నుంచి వచ్చి ఎన్నో రోజులు కాలేదు” అంటుంది. ఆ విధం ఆమె స్వేచ్ఛని హరిస్తారు. వారికి తెలియనిదేమిటంటే ఇది హంటర్ ఆందోళనని ఇంకా పెంచుతుంది. రిచీ ఆమెని పంజరంలో చిలకలా పెట్టటం వల్లే ఆమెకి ఈ వ్యాధి వచ్చిందని వారికి అర్థం కాదు. వారికే కాదు, ఆమెకి కూడా తెలియదు. పంజరంలో పెట్టటమే కాకుండా ఇప్పుడు కాపలా కూడా పెట్టారు. దాంతో ఆమె తిరిగి వస్తువులు తినటం ప్రారంభిస్తుంది. లువేకి తెలియకుండా బాత్రూమ్‌లో చిన్న నట్లు దాచుకుని తింటూ ఉంటుంది.

తన వ్యాధి గురించి రిచీ ఆఫీసులో వాళ్ళకి చెప్పేశాడని హంటర్‌కి తెలుస్తుంది. ఆమెకి కోపం వస్తుంది. రిచీ తీయగా మాట్లాడి ఆమె కోపం తగ్గిస్తాడు. హంటర్ సైకియాట్రిస్ట్ దగ్గరకి వెళుతూ ఉంటుంది. ఆమె మీద నమ్మకం కుదిరాక ఒకరోజు తన తల్లి గురించి మాట్లాడుతుంది. “మా నాన్న మా నాన్న కాదు. మా అమ్మని ఒకతను బలాత్కరించాడు. ఫలితంగా నేను పుట్టాను” అంటుంది. “అతన్ని పోలీసులు పట్టుకున్నారా?” అంటుంది సికియాట్రిస్ట్. “ఊఁ! అతనికి శిక్ష పడింది. అతని ఫోటో చూస్తారా?” అంటూ తన బ్యాగులో నుంచి ఒక ఫోటో తీస్తుంది. అది దినపత్రిక నుంచి కత్తిరించిన ఫోటో. అది చూసి సైకియాట్రిస్ట్ ఆశ్చర్యచకితురాలవుతుంది. తల్లిని రేప్ చేసిన వాడి ఫోటో, తనకి తండ్రి అయినా ఎప్పుడూ కలవని వాడి ఫోటో ఆమె తన దగ్గర పెట్టుకుంది. అదేమిటని అడిగితే “నేను రాజీ పడిపోయాను. దాని గురించి ఆలోచించాను. చివరికి రాజీ పడిపోయాను” అంటుంది. ఎంత విచిత్ర పరిస్థితి? మామూలుగా బలాత్కారం వల్ల పుట్టిన పిల్లలకి ఆ విషయం చెప్పరు. ఆమెకి ఎలా తెలిసింది? పైగా ఆమె తల్లి వేరే పెళ్ళి చేసుకుంది. ఆ పెంచిన తండ్రి మంచివాడే. మరి రేప్ గురించి చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఆమెకి ఆ వ్యక్తి ఫోటో ఎక్కడ దొరికింది? ఆమె తల్లి దినపత్రికలో వచ్చిన వార్త కత్తిరించుకుని దాచుకుని ఉంటుంది. ఎప్పుడో కోపంలో హంటర్‌కి అసలు విషయం చెప్పి ఆ వార్త, ఫోటో చూపించి ఉంటుంది. అలాంటి తల్లులు కూడా ఉంటారు. సైకియాట్రిస్ట్‌కి ఆమెది ఎంత లోతైన గాయమో తెలుసు. ఆమెకి అంతఃచేతనలో తానొక విలువ లేని మనిషిని అనే భావం ఉంది. భర్త నుంచి ప్రేమ లభించకపోవటంతో అది వ్యాధి రూపంలో బయటపడింది. “మీ అమ్మ అబార్షన్ చేయించుకోవాలని అనుకులేదా?” అంటుంది సైకియాట్రిస్ట్. ఇది ఎంత వింత ప్రశ్న! అబార్షన్ చేయించుకుంటే హంటర్ పుట్టేదే కాదు. “మా అమ్మకి మతం పిచ్చి ఎక్కువ. అబార్షన్ పాపం అని ఆమె నమ్మకం. కానీ మా అమ్మకి నా మీద కోపం లేదు. నా చెల్లెళ్ళు కూడా నన్ను ఎంతో ప్రేమిస్తారు” అంటుంది. ఆమె నిజం చెప్పట్లేదని తెలిసిపోతూనే ఉంటుంది. ఎంత దీనస్థితి! ఈ రహస్యం బయటపడటంతో చిత్రం స్వరూపమే మారిపోతుంది.

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే దర్శకత్వం కార్లో మిరబెల్లా-డేవిస్. ఇది ఒక హారర్ చిత్రంలా అనిపిస్తుంది. ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తుంది. హంటర్‌గా హేలీ బెనెట్ నటన ఆకట్టుకుంటుంది. ఏం చేయాలో తెలియని నిస్సహాయతని ఆమె బాగా అభినయించింది. రిచీగా నటించిన ఆస్టిన్ స్టోవెల్, అతని తండ్రిగా నటించిన డేవిడ్ ర్యాష్, తల్లిగా నటించిన ఎలిజబెత్ మార్వెల్ విలనిజాన్ని ఎంత సూక్ష్మంగా ప్రదర్శించవచ్చో చూపించారు. చిత్రంలో తర్వాత హంటర్ అసలైన తండ్రి కూడా కనపడతాడు. కానీ అతనికన్నా ఈ ముగ్గురే కర్కశంగా అనిపిస్తారు. ఇది ఆ నటీనటుల ప్రతిభ. లువే పాత్రని లేత్ నక్లీ పోషించాడు. అతను “నేను సిరియాలో యుద్ధం తప్పించుకుని వచ్చాను. యుద్ధం నుంచి పారిపోతుంటే మానసిక సమస్యలకి తావు ఉండదు” అంటాడు హంటర్‌ని ఎగతాళి చేస్తూ. ఎవరి మానసిక సమస్య వారికి యుద్ధమే. దాన్ని చులకన చేయకూడదు. అది లువేకి తర్వాత అర్థమవుతుంది. హంటర్‌కి సానుభూతి చూపించేది అతనే.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

సైకియాట్రిస్ట్‌ని కూడా రిచీ కొనేశాడు. ఆమె హంటర్ తల్లి రేప్ గురించి రిచీకి ఫోన్లో చెప్పేస్తుంది. అది హంటర్ వింటుంది. ఆమెకి భూమి కుంగిపోయినట్టుంటుంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే రిచీ అంతా తెలిసినా ఏమీ తెలియనట్టు బయటికి వెళ్ళేటపుడు “నీకేం కావాలో చెప్పు. నెక్లెసా? వాచీయా?” అంటాడు. ఆమె “బ్రేస్లెట్” అంటుంది. అతను వెళ్ళిపోతాడు. అతని మనసులో ఏముంది? బిడ్డ పుట్టేదాకా ఆగి ఆమెని వదిలేస్తాడా? ఈ ఆలోచనలతో హంటర్‌కి పిచ్చెక్కుతుంది. ఆమె మంచం కిందకి దూరి పడుకుంటుంది. లువే వస్తాడు. అతను యుద్ధం తప్పించుకుని వచ్చాడు. అతనికి భయం అంటే ఏమిటో తెలుసు. అతను మంచం కిందకి దూరి ఆమెని సముదాయిస్తాడు. ఇద్దరూ అక్కడ నిద్రపోతారు. కాసేపటికి హంటర్ లేచి బయటకి వచ్చి ఒక చిన్న స్క్రూడ్రైవర్ మింగేస్తుంది. ఆమెకి ఆపరేషన్ చేసి దాన్ని తొలగిస్తారు.

రిచీకి హంటర్ తన గతం గురించి నిజం చెప్పకపోవటం తప్పు కాదా? ఆమె స్వయంగా చేసిన తప్పయితే ఆమె చెప్పేది. ఇది ఆమె చేసిన తప్పు కాదు. ఎవరో చేసిన తప్పుకి ఫలితం ఆమె. అయినా అమెరికాలో పెళ్ళికి ముందు లైసెన్స్ తీసుకోవాలి. అప్పుడు వైద్య పరీక్షలు చేస్తారు. అంతా బావుంటేనే లైసెన్స్ ఇస్తారు. జన్యుపరంగా లోపాలు లేనప్పుడు హంటర్ సామాన్య జీవితం గడపాలని అనుకోవటం తప్పు కాదు. అయినా నైతికంగా ఆమెది తప్పే. తల్లి నీడ నుంచి బయటపడి మంచి జీవితం గడపొచ్చని ఆశ పడింది. అంతే కానీ మోసం చేయాలని అనుకోలేదు. సైకియాట్రిస్ట్ మాత్రం హంటర్‌ని మోసం చేసింది. పేషెంట్లు చెప్పిన విషయాలు ఇతరులకి చెప్పకూడదు. డబ్బుకి ఆశపడి చెప్పేసింది. ఆమెని నమ్మిన హంటర్‌కి తీవ్ర నిరాశ మిగిలింది. ప్రపంచమంతా తన మీద కక్ష కట్టినట్టు అనిపించింది. ఆమె మెదడు చెప్పిన రీతిలోనే స్పందించింది. స్క్రూడ్రైవర్ మింగి తనకు తాను హాని చేసుకుంది.

హాస్పిటల్ నుంచి ఆమె ఇంటికి వచ్చాక ఆమెని మానసిక వైద్యశాలకి పంపించాలని రిచీ, అతని తలిదండ్రులు నిర్ణయిస్తారు. ఆమె వద్దని ప్రాథేయపడుతుంది. “వద్దంటే రిచీకి విడాకులివ్వాలి” అంటాడు మామగారు. “ఏడు నెలలే కదా” అంటుంది అత్తగారు. ఆమె గత్యంతరం లేక ఒప్పుకుంటుంది. ఇదంతా లువే చూస్తూ ఉంటాడు. హంటర్ వెళ్ళే ముందు తన ఫోన్ చార్జర్ కోసం పడగ్గదిలోకి వెళుతుంది. కుంగిపోయి మంచం మీద పడుకుంటుంది. అది చూసి లువే జాలి పడతాడు. ఆమె నిస్సహాయ స్థితిలో ఉందని అతనికి అర్థమయింది. అతను ఆమెని తప్పిస్తాడు. హంటర్ పారిపోతుంది. లువే ఆమె తనకి తెలియకుండా బాత్రూమ్ నుంచి పారిపోయిందని భ్రమ కల్పిస్తాడు. రిచీ ఆమెని వెతుకుతూ బయల్దేరుతాడు.

హంటర్ ఒక మోటల్‌కి వెళ్ళి అక్కడి నుంచి రిచీకి ఫోన్ చేస్తుంది. “నిన్ను సంతోషపెట్టడానికి నేను అనాలోచితంగా నీ వెంట నడిచాను. ఎక్కడ నివసించాలో.. బిడ్డ విషయంలో కూడా. అంతా నీ కోసమే” అంటుంది. అతను “నాకు నువ్వు కావాలి. తిరిగి వచ్చెయ్. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండవచ్చు. వచ్చెయ్” అంటాడు. ఆమె రాలేనంటుంది. “ఎలా బతుకుతావు? నీకేం చేత కాదు. ఇంత కంటే మంచి జీవితం నీకు దొరకదు. వచ్చెయ్. లేకపోతే నిన్ను వెంటాడి పట్టుకుంటాను. విశ్వాసం లేని ముం..” అంటాడు కసిగా. ఆమె నిర్లిప్తంగా ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసే ముందు అతను “నా బిడ్డ నాక్కావాలి” అనటం వినిపిస్తుంది. అతనికి కావల్సింది బిడ్డ మాత్రమే. ఆమెకి ఏ ఆధారమూ లేదని ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. ఆమెకి తల్లితో బంధం లేదని తెలిసే చేసుకున్నాడు. ఎవరూ లేకపోతే ఎక్కడికీ పోదని ధీమా. అమెరికాలో వ్యక్తి స్వాతంత్ర్యం ఎక్కువ. వేరే అమ్మాయిలైతే అతని ఆటలు సాగేవి కాదు. మేకపిల్ల లాంటి హంటర్‌ని ఏరికోరి చేసుకున్నాడు. అది ఇప్పుడు హంటర్‌కి అర్థమయింది. ఆమె తల్లి రేప్ గురించి తెలిసి అతనికి అసహ్యమేమీ కలగలేదు. ‘అదీ మంచిదే. ఆమెలో ఆత్మన్యూనత ఉంది. ఎక్కడికీ పోదు’ అనుకున్నాడు. హంటర్‌ని ఇతరులతో కలవకుండా ఏకాంత ప్రదేశంలో ఇంట్లో పెట్టాడు. ఆమె పెద్ద ఇల్లు చూసి మోజు పడింది. కానీ ఆ జీవితం ఎంత నరకమో తర్వాత అర్థమయింది. రేపు బిడ్డని కూడా ఆమెకి దక్కనివ్వరు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

రిచీ తనకి మళ్ళీ ఫోన్ చేయకుండా హంటర్ తన సెల్ ఫోన్‌ని పగలగొట్టేస్తుంది. తల్లికి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంది. “నేను ఇంటికి వచ్చి కొన్నాళ్ళు ఉంటాను. నా పరిస్థితి బాలేదు” అంటుంది. “ఎప్పుడైనా రా బంగారూ. కానీ ఇప్పుడు నీ చెల్లెలు తన పాపతో ఇక్కడ ఉంది. ఇరుకైపోతుంది” అంటుంది తల్లి. హంటర్ గబాల్న ఫోన్ పెట్టేస్తుంది. తల్లి కూడా ఆమెకి ఆదరణ చూపించదు. ఏమైంది అని అడగదు. అసలు హంటర్‌కి తల్లి అంటే ఇష్టం లేదు. కానీ వేరే దారి లేక ఫోన్ చేసింది. అక్కడ కూడా నిరాశే మిగిలింది. తన అసలు తండ్రిని వెతుక్కుంటూ బయల్దేరుతుంది. అతని అడ్రసు దొరుకుతుంది.

అతని ఇంటికి వెళితే అక్కడ ఒక బర్త్‌డే పార్టీ జరుగుతూ ఉంటుంది. అతని పేరు విలియమ్. పెళ్ళి చేసుకున్నాడు. అతనికి భార్య, చిన్న కూతురు ఉంటారు. ఆ కూతురిదే పుట్టినరోజు. హంటర్ ఇంటిలోకి వెళుతుంది. విలియమ్ ఆమె పార్టీకి వచ్చిన పిల్లల్లో ఒకరి తల్లి అనుకుంటాడు. పాప చేత కేకు ముక్క ఇప్పిస్తాడు. “మిమ్మల్ని ఎక్కడో చూశాను” అంటాడు. ఇంతలో అతని భార్య వస్తుంది. “ఈ పిల్లల్లో ఎవరు మీవాళ్ళు?” అంటుంది. “ఎవరూ కాదు. కానీ నేను గర్భవతిని” అంటుంది. గర్భవతి అంటే ఎవరూ తొందరపడి ఏమీ అనరు. హంటర్ విలియమ్ భార్యకి సాయం చేస్తానంటూ వంటింట్లోకి వెళుతుంది. విలియమ్ కూడా వెనకే వస్తాడు. “మిమ్మల్ని ఈ పార్టీకి ఎవరు పిలిచారు?” అంటాడు. “మీకు జిల్ మెకాయ్ తెలుసు కదా? నేనామె కూతుర్ని” అంటుంది హంటర్. విలియమ్ ముఖం పాలిపోతుంది. అది హంటర్ తల్లి పేరు. విలియమ్ భార్య “జిల్ ఎవరు?” అంటుంది. అతను “ఆమె, నేను హైస్కూల్లో కలిసి చదువుకున్నాం. మొన్న అనుకోకుండా కనపడింది. పార్టీకి రమ్మన్నాను. కూతుర్ని తీసుకుని వస్తానంది. మీ అమ్మ రాలేదా?” అంటాడు తెలివిగా. “కుదర్లేదు” అంటుంది హంటర్. “నీకు ఏం కావాలి?” అని వెంటనే “కూల్ డ్రింక్ కావాలా? పంచ్ కావాలా?” అంటాడు. పంచ్ అంటే రెండు అర్థాలు. ఒక అర్థం ఒక రకమైన పానీయం. మరో అర్థం పిడిగుద్దు. హంటర్ తెలివిగా “నేనింకా నిర్ణయించుకోలేదు” అంటుంది. పిడిగుద్దులు కురిపించాలో లేదో ఇంకా నిర్ణయించుకోలేదని అర్థం కూడా వస్తుంది. విలియమ్ భార్యకి మాత్రం ఏం అనుమానం రాదు.

భార్య వెళ్ళిపోయాక విలియమ్ “నా జీవితం పాడు చేయటానికి వచ్చావా?” అంటాడు. “చేస్తే ఏం?” అంటుందామె. అతను ఆమెని సముదాయించాలని ప్రయత్నిస్తాడు. ఆమెలో కోపం కట్టెలు తెంచుకుంటుంది. “మాట్లాడకు. నేను చెప్పింది విను” అంటుంది. అతను వెనక్కి తగ్గుతాడు. “ఎందుకు చేశావు ఆ పని?” అంటుందామె. “దానికి తర్కం లేదు. నేను ఏవో భ్రమల్లో ఉన్నాను. నేనందరి లాంటి వాడిని కాదని, బలవంతుడినని అనుభూతి చెందటానికి చేశాను. నన్ను జైల్లో పెట్టారు. అక్కడ నన్ను ఖైదీలు చిత్తు కింద కొట్టారు. అప్పుడు నా బలం ఏపాటిదో తెలిసింది” అంటాడు. హంటర్ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. “నన్ను చూసి సిగ్గు పడుతున్నావా?” అని అడుగుతుంది. అది ఆమె తల్లిని అడగాల్సిన ప్రశ్న. అడగకుండానే తల్లి సమాధానం ఇచ్చిన ప్రశ్న. తల్లి తనని చూసి సిగ్గు పడుతోందని తెలుసు. తండ్రి కూడా సిగ్గు పడుతున్నాడా అని అడుగుతుంది. ఈ ప్రశ్నకి అర్థం లేదు. కానీ బలాత్కారం వల్ల పుట్టిన పిల్లలు, ఆ విషయం తెలిస్తే ఎంత క్షోభ పడతారో తెలిపే ప్రశ్న ఇది. అతను “నేను చేసిన పనికి సిగ్గు పడుతున్నాను” అంటాడు. “నా స్వభావం నీలాంటిదేనా?” అంటుందామె. “ఏమో. నువ్వే చెప్పాలి” అంటాడతను. “నేను నీలాంటి దాన్ని కాదు. నీ నోటితో ఆ మాట చెప్పు” అంటుందామె. “నువ్వూ నేనూ ఒకటి కాదు. నువ్వే తప్పూ చేయలేదు” అంటాడతను. జీవితమంతా ఆ మాట వినటానికి ఆమె తపించింది. తల్లీ ఆ మాట అనలేదు. సైకియాట్రిస్టూ ఆ మాట అనలేదు. ఆ మాట విని ఆమె భారం తగ్గుతుంది.

తర్వాత ఆమె అబార్షన్ చేయించుకుంటుంది. అదే ఆమెకి మిగిలిన దారి. రిచీని నమ్మి అతన్ని పెళ్ళి చేసుకుంది. రిచీకి కావలసింది భార్య కాదు, పిల్లల్ని కనే యంత్రం. అబార్షన్ చేయించుకోవటం ధర్మమా? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఆమెకి జరిగిన అన్యాయం సంగతి ఏమిటి? తల్లి ఆమెని కన్నది కానీ ఆమెని ఒక తప్పుగానే పరిగణించింది.  హంటర్ బిడ్డని కని రిచీకి ఇవ్వచ్చు కదా అని కొందరు అనవచ్చు. బిడ్డని కని వదిలేయటం ఏ తల్లికీ అంత సులువు కాదు. అయినా తమ దేహాల మీద తమకి అధికారం ఉండాలని పాశ్చాత్య మహిళలు అంటారు. అక్కడ ఎన్నికల్లో అబార్షన్ ఒక ముఖ్యమైన అంశం. 1973లో అమెరికాలో అబార్షన్‌ని చట్టబద్ధం చేశారు. కానీ 2022లో ఆ తీర్పుని సుప్రీం కోర్టు కొట్టేసింది. అబార్షన్ చట్టబద్ధం చేస్తే అది దుర్వినియోగం అవుతుంది కదా? అందుకే ఇది క్లిష్టమైన సమస్య. ఎవరికి వారే కట్టుబాట్లు పెట్టుకుంటే కానీ ఏ చట్టమూ దీనికి పరిష్కారం చూపలేదు. హంటర్ తప్పేదైనా ఉంటే అది ఆత్మన్యూనతా భావం. అది ఆమె తప్పని అనలేం. ఆమె ఉన్న పరిస్థితిలో ఆమెకి అబార్షనే మార్గం. ఇప్పుడు ఆమె స్వతంత్రంగా ఉంటుంది. ఆత్మాభిమానం పెంచుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఎవరికైనా ముందు ఉండాల్సింది ఆత్మాభిమానమే.

Exit mobile version