[సంచిక పాఠకుల కోసం ‘విరాట పర్వం’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
తెలుగు చిత్రం ‘విరాట పర్వం’ 2022లో వచ్చింది. కరోనా వల్ల కొంత, భారీ తారాగణం లేకపోవటం వల్ల కొంత ఈ చిత్రం మరుగునపడిపోయింది. కానీ ఈ చిత్రంలో నటించిన నటీనటుల పేర్లు చూస్తే ఈ చిత్రం సత్తా తెలిసిపోతుంది. సాయి పల్లవి, రానా దగ్గుబాటి, సాయిచంద్, నందితా దాస్, ఈశ్వరీ రావు, జరీనా వాహబ్, ప్రియమణి, నవీన్ చంద్ర, బెనర్జీ, రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. రచయిత, దర్శకుడు వేణు ఊడుగుల. ఇతను 2018లో ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో చిత్రరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ చిత్రం కూడా ప్రశంసలు అందుకుంది. 90వ దశకంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వేణు ‘విరాట పర్వం’ కథ రాసుకున్నాడు. ఆ వాస్తవ సంఘటనలు ఏమిటని చెప్పేస్తే సినిమా ముగింపు చెప్పేసినట్టవుతుంది. పరిచయం లేకుండానే ఒక నక్సలైట్ నాయకుడిని ప్రేమించిన అమ్మాయి కథ ఇది. పరిచయం లేకుండా మనిషిని ప్రేమించటం సాధ్యమేనా? సాధ్యమేనంటుంది ఆ అమ్మాయి. అంటే తెలియకుండానే అతని ఆదర్శాలని ప్రేమించిందా? ఇలాంటి ప్రశ్నలతో ఈ చిత్రం ఆలోచింపజేస్తుంది. మహాభారతంలోని ‘విరాట పర్వం’లో మారుపేర్లతో పాండవులు అజ్ఞాతవాసం చేశారు. నక్సలైట్లు కూడా అజ్ఞాతంలోనే ఉంటారు. పైగా నక్సలైట్లలో కోవర్టులు (నక్సలైట్లలా నటించే పోలీసు గూఢచారులు) ఉంటారు. అందుకే ఈ చిత్రానికి ఆ పేరు పెట్టారు. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.
నాయిక పేరు వెన్నెల (సాయి పల్లవి). ఆమె పుట్టినప్పుడు అమె తల్లి (ఈశ్వరీ రావు) ప్రసవవేదన పడుతుంటే ఆమెని ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి అడవిలో రాత్రిపూట వానలో బండిలో ఆమె తండ్రి (సాయిచంద్) వెళుతుంటాడు. అప్పుడే నక్సలైట్లకీ, పోలీసులకీ కాల్పులు జరుగుతూ ఉంటాయి. ఒక మహిళా నక్సలైటు తాను డాక్టరునంటూ వెన్నెల తల్లికి పురుడు పోస్తుంది. వెన్నెల తండ్రి కోరిక మీద ఆమే పాపకి వెన్నెల అని పేరు పెడుతుంది. అప్పుడే తలకి తూటా తగిలి మరణిస్తుంది. అలా వెన్నెల పుట్టుక సంఘర్షణ నేపథ్యంలో జరుగుతుంది. ఆమె తండ్రి ఒగ్గు కథ చెప్పే కళాకారుడు. అతనికి నరసింహ శతకం రాసిన శేషప్ప కవి అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి వెన్నెలకి కథలు, పద్యాలు చెబుతాడు. ఆమెకి తన దగ్గరున్న కృష్ణుడి నకాషీ బొమ్మంటే ప్రాణం.
పెద్దయ్యాక విప్లవ కవిత్వం చదవటం ఆరంభిస్తుంది. ఆ కవిత్వం రాసిన అరణ్య అసలు పేరు రవన్న (రానా దగ్గుబాటి) అని తెలుస్తుంది. ఒకసారి అన్నలకి సాయం చేశారని ఊరివాళ్ళని పోలీసులు కొడతారు. వెన్నెల తండ్రిని కూడా కొడతారు. వెన్నెల పోలీసులతో గొడవపడుతుంది. అప్పుడే రవన్న వచ్చి పోలీసులని తరిమికొడతాడు. వెన్నెల అతన్ని ప్రేమించటం మొదలుపెడుతుంది. తన దగ్గరున్న కృష్ణుడి బొమ్మకి రవన్నలా మీసాలు దిద్దుతుంది. ఇంట్ళో వాళ్ళు బావ (రాహుల్ రామకృష్ణ) తో పెళ్ళి చేయబోతే చేసుకోనని చెప్పేస్తుంది. ఒక రాత్రి ఉత్తరం రాసి పెట్టి రవన్నని వెతుక్కుంటూ బయల్దేరుతుంది. ఆమె దగ్గరున్నది విరసం వారి అడ్రసు మాత్రమే. అది రవన్న రాసిన పుస్తకంలో దొరికింది. విరసం సభ్యుడైన విద్యాధరరావు ఇంటికి వెళుతుంది. రవన్న కాంటాక్ట్ కావాలని అడుగుతుంది. “ఏమన్నా తగాదాలున్నాయా?” అని అడుగుతాడాయన. అంటే తగాదాలుంటే దళం వారు వచ్చి పరిష్కరిస్తారని అతని ఉద్దేశం. ఆమె తగాదేలేమీ లేవని, తాను రవన్నని ప్రేమిస్తున్నానని చెబుతుంది. అతను “బుద్ధుందా లేదా? మీ ఊరికి వెళ్ళిపో” అంటాడు. ఆమె అక్కడి నుంచి వచ్చేస్తుంది. ‘ప్రేమని అర్థం చేసుకోలేని వాడు జీవించినట్టే కాద’ని అతని ఇంటి గోడ మీద రాసి వచ్చేస్తుంది. ఆమెలో ఆవేశం ఉంది. ఆలోచన తక్కువ. చిన్న వయసు కదా. ఆమె వెళ్ళిపోగానే పోలీసులు వచ్చి విద్యాధరరావుని ఎత్తుకెళతారు.
వెన్నెల రవన్న పెరిగిన ఊరు ఏదో తెలుసుకుని అతని ఇంటికి వెళుతుంది. ఇంట్లో రవన్న తల్లి (జరీనా వాహబ్) ఉంటుంది. “అడవిలకి పోయిండు. వాడు వస్తడని ఎదురుచూస్తున్నా కానీ వస్తలేడు” అని కన్నీరు పెట్టుకుంటుంది. “నువ్వు చెప్పాలనుకున్నదంతా నాకు ఉత్తరంలో రాసివ్వు. అది నీ కొడుక్కి చేర్చే బాధ్యత నాది” అంటుంది వెన్నెల. ఇంటిలో రెండు రోజులు ఉండి ఇల్లంతా శుభ్రం చేస్తుంది. బయల్దేరేటప్పుడు రవన్న తల్లి “నువ్వెవరో మాత్రం చెప్పకపోతివి” అంటుంది. “నేను నీ కోడల్ని అత్తా. కానీ నీ కొడుక్కి తెలియదు” అంటుంది వెన్నెల. పెద్దావిడ సంతోషంగా నవ్వుతుంది. వెన్నెల బయల్దేరి రవన్న కోసం ఊరూరా తిరుగుతుంది. ఒక ఊళ్ళో రవన్న తిరుగుతున్నాడని పోలీసులు పహరా కాస్తుంటారు. ఆ ఊళ్ళోనే ఒకామె వెన్నెలకి ఆశ్రయం ఇస్తుంది. ఆమె దళం కోసం జెండాలు తయారు చేస్తుంటుంది. వెన్నెల తన కుటుంబం ఒక భూవివాదంలో చిక్కుకుందని అబద్ధం చెప్పి రవన్న సాయం కావాలని అడుగుతుంది. ప్రపంచం లౌక్యం నేర్పిస్తుంది. మొదట తన ప్రేమ గురించి నిజాయితీగా చెప్పిన వెన్నెల ఇప్పుడు లౌక్యంగా రవన్నని చేరుకోవాలని ప్రయత్నిస్తుంది. వెన్నెలకి ఆశ్రయం ఇచ్చినామె జెండాలు తీసుకెళ్ళటానికి వచ్చిన వ్యక్తితో వెన్నెల గురించి చెబుతుంది. “ఆ అమ్మాయి ఎవరో తెలియదు. రవన్న కాంటాక్ట్ ఇచ్చేస్తామా?” అంటాడతను. నిజమే. వెన్నెల పోలీసులు పంపించిన గూఢచారి అయితే ఎంత ప్రమాదం? అయితే వారిద్దరి మాటల్లో రవన్న దగ్గర్లో ఉన్న డిగ్రీ కాలేజీకి వస్తున్నాడని చాటుగా ఉన్న వెన్నెలకి తెలిసిపోతుంది.
రవన్న డిగ్రీ కాలేజీకి వచ్చేది ఒక అమ్మాయిని మోసం చేసినవాడికి బుద్ధి చెప్పటానికి. అతను ఆ అమ్మాయిని ప్రేమించానని వంచించాడు. ఆమె నిలదీస్తే అతని వర్గం వారు ఆమెని చంపి ఆత్మహత్యగా చిత్రించారు. ఆమె తండ్రి ఎక్కడా న్యాయం జరగక రవన్న దగ్గరకి వెళ్ళాడు. రాజీ చేసుకుందామని ఆ వంచకుడిని డిగ్రీ కాలేజీకి పిలిపింపజేస్తాడు రవన్న. ఇదంతా వెన్నెలకి తెలియదు. రవన్న డిగ్రీ కాలేజీకి వస్తున్నాడని అక్కడికి బయల్దేరుతుంది. దారిలో ఒక చోట కూర్చుని ఉంటే అటుగా జీపులో వెళుతున్న సీఐ ఆమెని ప్రశ్నిస్తాడు. రవన్న చుట్టుపక్కల తిరుగుతున్నాడని పోలీసులు అలర్ట్‌గా ఉంటారు. సీఐతో పాటు కానిస్టేబుళ్ళు కూడా ఉంటారు. వెన్నెల తన దోస్తు కోసం ఎదురుచూస్తున్నానని అంటుంది. ఆమె బ్యాగులో ఏముందని అడిగితే కృష్ణుడి బొమ్మ చూపిస్తుంది. దోస్తు కోసం తెచ్చానని అంటుంది. సీఐకి ఆ బొమ్మ నచ్చుతుంది. వెన్నెలని పొమ్మని చెప్పినా మళ్ళీ కానిస్టేబుల్ని ఆమె వెంట పంపి బొమ్మ ఇస్తే రెండొందలు ఇస్తానని చెప్పిస్తాడు. వెన్నెల ఇవ్వనంటుంది. కానిస్టేబుల్ “ఆ సీఐ గలీజు ముం..కొడుకు. నిన్ను చంపినా చంపుతాడు” అంటాడు. నక్సలైట్ల పేరు చెప్పి పోలీసులు అమాయకులని ఎలా హింసించేవారో కదా అనిపిస్తుంది. వెన్నెలకి రోషం వస్తుంది. “నన్నెందుకు చంపుతాడు? నేనేం చేశినా?” అంటుంది. సీఐ వచ్చి బెదిరిస్తాడు. వెన్నెల బొమ్మని ఇచ్చినట్టే ఇచ్చి కసిగా నేలకేసి కొడుతుంది. బొమ్మ ముక్కలవుతుంది. సీఐ ఆమెని చెంపదెబ్బ కొడతాడు. వెన్నెల బొమ్మ ముక్కలని తీసుకుని బ్యాగులో పెట్టుకుంటుంటే బ్యాగులోంచి పడిన విప్లవ కవితల పుస్తకాలు సీఐకి కనపడతాయి. అతని ఆదేశం మీద ఆమెకి సంకెళ్ళు వేసి జీపులో కూర్చోబెడతారు కానిస్టేబుళ్ళు.
వెన్నెల బొమ్మ ఇవ్వకపోవటానికి కారణం అది రవన్న ప్రతిరూపమని ఆమె భావించటం అనిపిస్తుంది కానీ నాకైతే ఇంకా లోతైన కారణం ఉందనిపించింది. వెన్నెలకి పోలీసుల జులుం తెలుసు. ఆమెది తిరుగుబాటు స్వభావం. తన వస్తువుని బలవంతంగా పోలీసులు తీసుకోవటం ఆమెకి కోపం కలిగించింది. అది బొమ్మ కాక ఏ వస్తువైనా ఆమె ఇచ్చేది కాదు. పోలీసుల అరాచకత్వం ఎందుకు భరించాలి? రవన్న కవిత్వం చదివిన వెన్నెల ఎప్పటికీ భరించదు. ప్రాణం పోయినా సరే. ఆమె బొమ్మని విరగగొట్టటం ఆమె తిరుగుబాటుకి ప్రతీక. ఆమె సాధారణమైన అమ్మాయి అయి ఉంటే ‘రవన్నని చూడబోతున్నాను. ఈ బొమ్మ కోసం గొడవ ఎందుకు? బొమ్మ ఇచ్చేసి బయటపడతాను’ అనుకునేది. కానీ వెన్నెల రవన్న ఆదర్శాలు ఆకళింపు చేసుకున్న అమ్మాయి. అందుకే తిరగబడింది. వెన్నెల పాత్రని ఈ సన్నివేశం ఉన్నతంగా నిలబెట్టింది. రచయితకి అభినందనలు చెప్పకుండా ఉండలేం.
ముఖ్యపాత్రల్లో నటించిన నటీనటులే కాక అందరూ చక్కగా నటించారు ఈ చిత్రంలో. సాంకేతిక వర్గం పడిన శ్రమ కూడా కనపడుతుంది. అడవిలో దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. శేషప్ప కవి, దేవులపల్లి, శివసాగర్ రాసిన పద్యాలు, కవితలు, పాటలు చిత్రంలో సందర్భోచితంగా వాడుకున్నారు. ఇది దర్శకుడి అభిరుచికి సంకేతం. సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆమె ఈ చిత్రాన్ని తన భుజాల మీద మోసింది. సమ్మయ్యతో మొదటిసారి మాట్లాడినపుడు అతను ‘లాల్ సలాం’ అని ముగిస్తాడు. ఆ అభివాదం ఆమెకి కొత్త. ఆమె ‘లాల్ సలాం’ అంటూ చేతులు కొద్దిగా జోడిస్తుంది. చిత్రం చివరికి వచ్చేసరికి పిడికిలి బిగించి లాల్ సలాం అంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఈ చిత్రంలో ఉంటాయి. ఒడియా కుటుంబంలో పుట్టిన నందితా దాస్ తెలుగులో తానే డబ్బింగ్ చెప్పుకోవటం విశేషం. రాహుల్ రామకృష్ణది చిన్న పాత్రే అయినా ఒక సన్నివేశంలో అతను మెరిశాడు. అన్ని పాత్రలకి న్యాయం చేశారనటానికి ఇదో ఉదాహరణ.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
పోలీసు జీపు తిన్నగా డిగ్రీ కాలేజీకి వెళుతుంది. అక్కడ రవన్న.. అమ్మాయిని వంచించిన వ్యక్తి చేత తప్పు అంగీకరించినట్టు ఉత్తరం రాయించి అతన్ని చంపేస్తాడు. రవన్న అనుచరులు కూడా ఉంటారు. తుపాకీ శబ్దం విని పోలీసులు లోపలికి వెళతారు. పోలీసులకి, నక్సలైట్లకి మధ్య కాల్పులు జరుగుతాయి. ఈ హడావిడిలో కానిస్టేబుల్ వెన్నెల సంకెళ్ళు తీసేసి ఆమెని పారిపొమ్మంటాడు. ఆమె అక్కడున్న పొదల్లో దాక్కుంటుంది. కాల్పుల్లో సీఐతో పాటు కొందరు పోలీసులు మరణిస్తారు. వెన్నెలని విడిపించిన కానిస్టేబుల్ ఒక నక్సలైట్‌ని గాయపరుస్తాడు. ఎంత జాలి గుండె ఉన్నా తన వృత్తిధర్మం మరచిపోడు. రవన్న ఆ కానిస్టేబుల్‌ని తుపాకీతో కాల్చి చంపేస్తాడు. గాయపడిన నక్సలైట్‌ని తీసుకుని రవన్న బృందం వెళ్ళిపోతుంది. వెన్నెలకి రవన్నని కలుసుకోవాలన్ని కోరిక తీరదు.
ఒక రాత్రి వెన్నెల కమ్యూనిస్టు పార్టీకి చెందిన ప్రొఫెసర్ శకుంతల (నందితా దాస్) ఇంటికి వెళుతుంది. అప్పుడు రవన్న తన ఇద్దరు అనుచరులతో అక్కడే ఉంటాడు. దళసభ్యుల కోసం వారందరూ అన్నం పొట్లాలు కడుతూ ఉంటారు. తలుపు కొట్టిన చప్పుడు కావటంతో అందరూ దాక్కుని తుపాకీలతో సిద్ధంగా ఉంటారు. వెన్నెల దూరం నుంచి వచ్చానని చెప్పటంతో శకుంతల ఆమెని లోపలికి రావటానికి అనుమతిస్తుంది. ఈసారి వెన్నెల తెలివిగా “నా పిన్ని కూతురు ఒక నక్సలైట్‌ని ప్రేమించింది. అతను పరిస్థితులు బాగా లేవని వెళ్ళిపోయాడు. రోజూ ఎన్‌కౌంటర్ వార్తలు విని మా పిన్ని కూతురు మంచం పట్టింది. మావాళ్ళు అతన్ని గురించి తెలుసుకుని రమ్మని నన్ను పంపించారు. మీ సాయం కావాలి” అంటుంది. శకుంతల ఆమెని పై అంతస్తుకి పంపించి రవన్న బృందాన్ని పంపించేస్తుంది. ఆ విధంగా వెన్నెల రవన్నని కలుసుకునే మరో అవకాశాన్ని కోల్పోతుంది.
శకుంతలకి ఎంతో అనుభవముంది. వెన్నెల.. పిన్ని కూతురు మిషతో చెప్పిన కథ ఆమెదే అని గ్రహిస్తుంది. దానికి కారణం ఆమె కూడా ఒక విప్లవవాదికి ఆకర్షితురాలై కుటుంబాన్ని వదిలి వచ్చింది. ఆ విప్లవవాది వివాహితుడైనా అతనితో సాహచర్యం చేసింది. అతను మరణించాక అతని ఆదర్శాల కోసం పని చేస్తోంది. “నక్సలైటుతో ప్రేమంటే బోలెడు త్యాగాలు చేయాలి. తెలుసా?” అంటుంది వెన్నెలతో. తెలుసంటుంది వెన్నెల. “తెలీదు నీకు. తెలుసనుకోవటం నీ అమాయకత్వం” అంటుంది శకుంతల. ఆమె అనుభవంతో ఆ మాటలు చెప్పింది. ఆ త్యాగాలు ఎలాంటివో తెలిస్తే వెన్నెల తన ఊళ్ళోనే ఉంటూ రవన్నని ప్రేమించేది. ఒకరకంగా అదే అసలైన త్యాగం. ‘నువ్వు ప్రేమించిన వారిని స్వేచ్ఛగా వదిలేయటమే నిజమైన ప్రేమ’ అని ఒక నానుడి. వెన్నెలది అది అర్థమయ్యే వయసు కాదు. అయినా ప్రేమించిన వారిని వదిలి ఉండటం చాలా కష్టం. శకుంతల ఇప్పుడైతే ఇలా మాట్లాడుతోంది కానీ ఒకప్పుడు ఆమె కూడా వెన్నెల లాగే ప్రవర్తించింది. ‘యౌవనం యువకుల చేతుల్లో నిరుపయోగం’ అని అందుకే అన్నారు. వెన్నెల “జీవితాంతం అతనితో కలిసి బతకాలి” అంటుంది. ఆమె తన మాట వినదని శకుంతలకి అర్థమవుతుంది.
ఒక మీటింగు కోసం ఒక పాడుబడిన బంగళాకి రవన్న వస్తున్నాడని పోలీసులకి తెలుస్తుంది. అదే సమయంలో శకుంతల వెన్నెలని ఒక దళసభ్యుడితో ఆ బంగళాకి పంపిస్తుంది. వెన్నెల రవన్నని కలుసుకుంటుంది. అతనికి వెన్నెల ప్రేమ సంగతి శకుంతల ముందే చెప్పింది. వెన్నెల విరిగిపోయిన కృష్ణుడి బొమ్మని అతికించి తెచ్చింది. అది రవన్నకి ఇస్తుంది. రవన్న ఆ బొమ్మని పక్కన పెట్టి “మీ పట్టుదల నచ్చింది. మీరు ఆ పట్టుదలని సరైన మార్గంలో పెట్టాలి. స్త్రీల అభ్యుదయం కోసం పని చేయండి” అంటాడు. వెన్నెలకి రోషం వస్తుంది. “నీ కోసం ఏడ్చి ఏడ్చి నీ కమ్యూనిస్టు రంగులోకి మారిన నా కళ్ళు చూడు. నా కళ్ళలో ప్రేమ కనిపిస్తలేదా?” అంటుంది. “దేనికి పనికొస్తది ఈ ప్రేమ? ప్రేమ ఒక సామాజిక రుగ్మత” అంటాడతను. “జెన్నీని ప్రేమించిన కార్ల్ మార్క్స్, జియాంగ్‌ని ప్రేమించిన మావో, క్రుపస్కయాని ప్రేమించిన లెనిన్.. వాళ్ళది కూడా రుగ్మతేనా?” అంటుందామె. అతని అవాక్కయి ఉండిపోతాడు. ఆమె మళ్ళీ “నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతలో కచ్చితంగా నేనే ఉన్నా. నా డైరీ నిండా నీ గురించే రాసుకున్నా. అది చదివితే నీకర్థమవుతుంది. మీ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం కూడా తెచ్చా. ఇప్పుడే తెస్తా” అంటుంది. శకుంతల ఇంటికి వెళ్ళి అవి తెద్దామనుకుంటుంది కానీ అప్పుడే పోలీసులు వస్తారు. ఆమెని తీసుకువచ్చిన దళసభ్యుడు ఆమెని పక్కకి తీసుకువెళ్ళి ఇంటికి పొమ్మంటాడు కానీ ఆమె “నేను కూడా ఏదో సాయం చేస్తా. ఏదో ఒక ఉపాయం చెప్పు” అంటుంది. అతను ఆమెకి వైర్ల సాయంతో పేలే బాంబులు ఇస్తాడు. ఆమె ఆ బాంబులు అమర్చి అవి పేలడానికి సాయం చేస్తుంది. బాంబులు పేలటంతో బంగళా కప్పులో కన్నాలు పడతాయి. ఆ కన్నాల ద్వారా రవన్న బృందం తప్పించుకుంటుంది. అయితే వెన్నెల పోలీసులకి దొరికిపోతుంది. మరో నక్సలైటు కూడా దొరుకుతాడు.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
పోలీసులు వెన్నెలని హింస పెట్టి రవన్న ఎక్కడున్నాడో చెప్పమంటారు. ఆమె అంతా భరిస్తుంది. ఆ రాత్రి రవన్న దళం పోలీస్ స్టేషన్‌కి వచ్చి బయట మందుపాతర పేల్చేసి ఆమెని విడిపిస్తారు. రవన్న ఆమె చేయి పట్టుకుని పరుగెడుతూ ఉంటే ఆమెకి ఆకాశం మీద తేలిపోతున్నట్టుంటుంది. అయితే అతను ఆమెని శకుంతల ఇంట్లో దింపేసి “ఆమెకి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించండి” అని వెళ్ళిపోతాడు. వెన్నెల మళ్ళీ కుంగిపోతుంది. పట్టుదలతో పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటుంది. శకుంతల ఎంత చెప్పినా వినదు. పోలీసులు పట్టుకున్న నక్సలైటుకి శకుంతల బెయిలు ఇప్పించింది. అతని పేరు సమ్మయ్య. అతను వెన్నెల పట్టుదల చూసి “నువ్వు మమ్మల్ని కాపాడినవ్. ఏం ధైర్యం నీది! నీ లాంటి వాళ్ళు దళంలో చేరాలి. కాంటాక్ట్ నేనిప్పిస్తా” అని ప్రోత్సహిస్తాడు. అయితే సమ్మయ్య బాగా డబ్బు కూడబెట్టాడని పోలీసులకి తెలిసిపోతుంది. పోలీసులు బెదిరించటంతో తర్వాత అతను కోవర్టుగా మారతాడు. మరో వైపు వెన్నెల కుటుంబం కోసం పోలీసులు అన్వేషణ మొదలు పెడతారు. ఆమె తండ్రిని, బావని పట్టుకుంటారు. ఎస్పీ (బెనర్జీ) వారిని ప్రశ్నిస్తాడు. “నక్సలైట్లు ఎంతమంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు? వారి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా?” అంటాడు. వెన్నెల బావ “ఉపయోగముంది సార్! మా ఊళ్ళల్ల ఆడోళ్ళ మీద అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చిన్రు సార్? పోనీ మీ పోలీసోళ్ళు వచ్చిన్రా సార్? మా అన్నలు వచ్చిన్రు సార్. నోరు లేని సమాజానికి నోరు అందించిన్రు సార్ వాళ్ళు” అంటాడు. వెన్నెల తండ్రి అతన్ని కొట్టి నోరు మూయిస్తాడు. వ్యవస్థ సరిగా పని చేస్తే అసలు నక్సలైట్లు పుట్టేవారే కాదు. ఇప్పుడు వ్యవస్థ పూర్తిగా మారకపోయినా మెరుగయింది. నక్సలైట్లు గత అనుభవాలని మరచి కొత్త జీవితం ప్రారంభించవచ్చు. కానీ ఆదివాసీలకి మాత్రం ఇంకా అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. వాటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
ఎస్పీ వెన్నెల తండ్రితో “వాడు కరెక్టుగానే మాట్లాడాడు. నక్సలైట్లలో క్యాడర్ మన బహుజనులే. కానీ లీడర్లు అగ్రవర్ణాల వారు. లీడర్లు చనిపోరు. మనవాళ్ళే పోతారు. రెండు రోజులు టైం ఇస్తున్నా. మీ అమ్మాయిని తీసుకు రండి” అంటాడు. మరో పక్క వెన్నెల దళంలో చేరటానికి అడవిలోకి బయల్దేరుతుంది. శకుంతల ఆమెకి ఒక సందేశం రాసి ఇస్తుంది. “జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్నీ స్వాగతించు. అవి అతిథుల్లాంటివి” అని ఆ సందేశం. ఎంత నిజం! కష్టమైనా, సుఖమైనా అతిథులే. వచ్చి పోతుంటాయి. అన్నిటినీ స్వాగతించాలి. దేనికీ కుంగిపోకూడదు, దేనికీ పొంగిపోకూడదు. అద్వైత సిద్ధాంతం కూడా ఇదే చెబుతుంది. అద్వైతం (అంతా ఒకటే బ్రహ్మ పదార్థం) అందరూ పాటిస్తే కమ్యూనిజం (అందరూ సమానమే) వచ్చినట్టే.
వెన్నెల తండ్రి, బావ వెన్నెలని కోసం వెతుకుతూ ఉంటే ఆమె ఒక దళ సహాయకుడి ఆటోలో అడవికి వెళుతూ కనపడుతుంది. వెన్నెల తండ్రితో మాట్లాడుతుంది. బావ కాస్త దూరంగా ఉంటాడు. వెన్నెల తండ్రితో “నీ ఆశలన్నీ వమ్ము చేశినా. నా అసువంటి బిడ్డ అస్సలు పుట్టకూడదు. నన్ను తీస్కపోనీకి వచ్చిన్రా బాపూ?” అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. “కాదు బిడ్డా. చూసి పోదామని వచ్చినా. ఆశలన్నీ వమ్ము చేసినానంటివి కదా. అవి బయటికి కనపడే సంగతులు. లోపల ఆత్మకి తెలిసినవి వేరే ఉంటయ్యి. ఒగ్గుకథకి, నాకు ఏదో సంబంధమున్నది. అదేంది అనేది నాకు తప్ప వేరేటోల్లకి అర్థం కాదు. పద్యాలు పాడకుండా నేనుండలేను. ప్రేమ కోసం తపించకుండా నువ్వుండలేవు. లోపల గట్టిగా ఏదైనా కోరుకుంటివా ఈ లోకం వ్యతిరేకిస్తది. నా జీవితం ఒగ్గుకథకే అంకితమన్నప్పుడు నన్ను పిచ్చోడన్నది. ఇప్పుడు నీ జీవితం నీ ప్రేమ కోసమే అంటున్నవ్. నిన్నూ గట్లనే చూస్తది. నేను నిన్ను అర్థం చేసుకోగలను. నిన్ను చూస్తుంటే ఇది నా బిడ్డ అరిచి చెప్పాలనిపిస్తంది” అంటాడు. అతను మీరాబాయి కృష్ణప్రేమని అర్థం చేసుకున్న వేదాంతి. కూతురి ప్రేమని కూడా అర్థం చేసుకుని ఉన్నతంగా నిలిచాడు. తండ్రి ఒప్పుకోలుకి వెన్నెలకి దుఃఖం పొంగుకొస్తుంది. ఆమె బావకి కూడా కాస్తో కూస్తో అర్థమై మనసు బరువెక్కుతుంది. ఆమెని వదిలి వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలు తమకి నచ్చినట్టే ఉండాలనుకునే తలిదండ్రులు వెన్నెల తండ్రి నుంచి ఎంతో నేర్చుకోవాలి. తప్పుదారి పట్టనంతవరకు పిల్లలని వారి బతుకు వారిని బతకనివ్వాలి. వెన్నెలని దారి మార్చుకోమనటానికి ఆమె తండ్రి ఎన్నో కారణాలు చెప్పొచ్చు. కానీ ఈరోజుల్లో పిల్లలని దారి మార్చుకోమనటానికి డబ్బు ఒక్కటే కారణంగా ఉంది. ఇది ఆలోచించాల్సిన విషయం.
వెన్నెలని దళంలో చేర్చుకోవటానికి రవన్న మొదట ఒప్పుకోడు. భారతక్క (ప్రియమణి) అనే నక్సలైటు కూడా దళంలో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఆమెకి వివరిస్తుంది. వెన్నెల “నాకు ప్రాణాలంటే లెక్క లేదు” అంటుంది. ఆ ధైర్యం చూసి ఆమెని దళంలో చేర్చుకోవాలని నిర్ణయిస్తారు. రఘు (నవీన్ చంద్ర) అనే సభ్యుడు వ్యతిరేకిస్తాడు. అసలు రవన్న కంటే ముందు అతనే నాయకుడు. పొరపాట్లు చేయటం వల్ల అతన్ని డిమోట్ చేశారు. భారతక్క అతనికి సర్దిచెబుతుంది. వెన్నెల దళంలో చేరుతుంది. ఆమెకి శిక్షణ ఇస్తారు. రవన్న వెంట ఉండటమే ఆమెకి చాలు. ఆమె ఆనందంగా ఉంటుంది. ఒక రాత్రి పోలీసు దెబ్బలకి మంచం పట్టిన ఒక సభ్యుడికి డబ్బు అందించి వెన్నెల, స్వర్ణక్క అనే నక్సలైటు తిరిగి వస్తూ ఉంటారు. దారిలో పోలీసులకి దొరికిపోతారు. రవన్న బృందం వచ్చి పోలీసుల మీద కాల్పులు జరుపుతుంది. వెన్నెల గ్రెనేడ్ కూడా పేలుస్తుంది. చాలా మంది పోలీసులు చనిపోతారు. ఒక పోలీసు నక్సలైట్లకి చిక్కుతాడు. అతన్ని రఘు చంపబోతాడు. వెన్నెల అడ్డుపడుతుంది. ఆయుధం లేని వాడిని చంపకూడదని పార్టీ సిద్ధాంతం అంటుంది. రవన్న ఆమెని సమర్థిస్తాడు. అందరూ వెన్నెలని మెచ్చుకుంటారు. రఘుకి అక్కసు పెరుగుతుంది.
రవన్న ఇన్నాళ్ళూ చూడనన్న తల్లి ఉత్తరం ఇప్పుడు వెన్నెల ఇస్తే చదువుతాడు. ఒక హాస్పిటల్లో తల్లిని కలుసుకోవటానికి వెళతాడు. ఆమె అతన్ని వెన్నెలని పెళ్ళి చేసుకోమంటుంది. కోవర్టు సమ్మయ్య ద్వారా రవన్న ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అక్కడికి వస్తారు. రవన్న, వెన్నెల తప్పించుకుంటారు. వాళ్ళు తిరిగి వచ్చే లోపలే రాత్రి వేళ సమ్మయ్య కొందరు నక్సలైట్లని చంపి వెళ్ళిపోతాడు. పోలీసుల పత్రికా సమావేశంలో “దళానికి డబ్బు పిచ్చి పట్టింది. నేను తిరగబడితే నన్ను చంపాలని చూశారు. అందుకే నేను వారిని చంపి వచ్చాను. నాలాంటి వారు దళంలో ఇంకా ఉన్నారు” అంటాడు సమ్మయ్య. కోవర్టులున్నారని నాయకత్వం అప్రమత్తమవుతుంది. రవన్న, భారతక్క, రఘు సమావేశమవుతారు. రఘు “వెన్నెలే కోవర్టు. ఆమెని సమ్మయ్యే సిఫార్సు చేశాడు” అంటాడు. భారతక్క అతన్ని సమర్థిస్తుంది. “సమ్మయ్య మనవాళ్ళని చంపటానికి ఆమెకి చెప్పి నిన్ను అమ్మ దగ్గరకి వెళ్ళేలా చేశాడు. ఆమె దళం కాంటాక్ట్ కోసం మూడు నెలలు తిరిగింది. ఒక్కొక్కరికీ ఒక్కో కారణం చెప్పింది” అంటుంది.
రవన్న వాకబు చేయటం మొదలుపెడతాడు. విద్యాధరరావుకి వెన్నెల రవన్నని ప్రేమించానని చెప్పిందని, ఆమె వచ్చి వెళ్ళిన వెంటనే విద్యాధరరావుని పోలీసులు తీసుకెళ్ళారని తెలుస్తుంది. జెండాలు కుట్టే ఆమెకి భూవివాదం ఉందని చెప్పిందని తెలుస్తుంది. తర్వాత వెన్నెల పోలీసు జీపులో వెళుతుండగా కూడా ఆ జెండాలు కుట్టే ఆమె చూసింది. వెన్నెల పోలీసుల మనిషి అయి ఉండొచ్చని అనుమానం పెరుగుతుంది. భారతక్క “శకుంతల టీచర్ వద్దని చెప్పినా ఈ అమ్మాయి వినలేదు. సమ్మయ్య మాట మీద ఒక ప్లాన్ ప్రకారం దళంలోకి వచ్చింది” అంటుంది. రవన్న వెన్నెలని శిక్షించటానికి ఒప్పుకుంటాడు. భారతక్క వెన్నెలని కట్టేసి హింసిస్తుంది. “నిన్ను ఎవరు పంపించారు? ఏమిస్తామన్నారు? భూములా? డబ్బా? ఉద్యోగమా?” అని అడుగుతుంది. వెన్నెల తాను ప్రేమ కోసం వచ్చానని మొరపెట్టుకున్నా వినదు. వెన్నెల “నా డైరీ చూడండి. నేను ప్రేమ కోసం వచ్చానని అర్థమవుతుంది” అంటుంది. వెన్నెల బ్యాగులో వెతికితే డైరీ దొరకదు. భారతక్క “లేని డైరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోజు బంగళా దగ్గర కూడా డైరీ తెస్తానని వెళ్ళి పోలీసులని తీసుకొచ్చావు. మమ్మల్ని కాపాడినట్టు నటించి నమ్మకం సంపాదించావు” అంటుంది. వెన్నెల వేసారిపోతుంది. “నాకర్థమయింది. మీరేం చెప్పినా వినరు. మీకు అనుమానమనే పిచ్చి పట్టింది” అంటుంది.
రవన్న వెన్నెలని నది ఒడ్డుకి తీసుకువెళతాడు. “నిన్ను ప్రేమించాను. కానీ నువ్వు ద్రోహం చేశావు” అంటాడు. వెన్నెల హతాశురాలవుతుంది. అదే సమయంలో పార్టీ నాయకత్వం నుంచి దళానికి ఉత్తరం అందుతుంది. తన లాంటి కోవర్టులు ఇంకా కొంతమంది ఉన్నారని సమ్మయ్య చేసిన ఆరోపణలు అబద్ధం అని ఆ ఉత్తరంలోని సందేశం. భారతక్క ఆ ఉత్తరం రవన్నకి అందించాలని పరుగున వస్తుంది. అంతలోనే రవన్న వెన్నెలని తుపాకీతో కాల్చి చంపేస్తాడు. ఆమె నదిలో పడిపోతుంది. అనుమానం కారణంగా వెన్నెల జీవితం ముగిసిపోయింది. వెన్నెల ఆత్మ తాను మళ్ళీ పుడతానని, మళ్ళీ రవన్నని ప్రేమిస్తానని అంటుంది. ఆదర్శంతో ఉద్యమంలో చేరిన వారెందరో అసువులు బాసారు. అలాగే తమ బాధ్యత నిర్వహించిన అమాయకులైన పోలీసులెందరో చనిపోయారు. ఇక అమాయక ప్రజల సంగతి చెప్పక్కరలేదు. ఈ సమస్య పరిష్కారానికి దళం, ప్రభుత్వం కృషి చేయాలి. దానికి ప్రభుత్వం ముందు అవినీతిని, దోపిడీని తగ్గించాలి. లేకపోతే ఈ కాష్టం ఇలా కాలుతూనే ఉంటుంది.
Images courtesy: Internet