[సంచిక పాఠకుల కోసం ‘ద ఫాల్స్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
కరోనా గుర్తుందా? నాకైతే పూర్వజన్మలో ఎప్పుడో జరిగినట్టుంది. అప్పట్లో ఎన్ని జీవితాలు అతలాకుతలం అయ్యాయో! మామూలు గానే జీవితం కష్టాలమయం. ఆ కష్టాలకి తోడు కరోనా లాంటిది వస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఆలోచనతోనే ఒక తల్లీకూతుళ్ళ జీవితాలని పరిశీలిస్తూ వచ్చిన తైవాన్ దేశపు చిత్రం ‘ద ఫాల్స్’ (2021). దీనిలో సామాజిక వ్యాఖ్య ఉంటుంది. ఆలోచనలు రేకెత్తించే విషయాలు ఉంటాయి. ఇది మామూలుగా వచ్చే చిత్రాల లాంటిది కాదు. జీవితాన్ని చూసినట్టు ఉంటుంది. ‘ద ఫాల్స్’ అంటే ‘ద వాటర్‌ఫాల్స్’కి సంక్షిప్త రూపం. జలపాతం అని అర్థం. ఆ పేరు ఎందుకు పెట్టారో చిత్రం చూసి తెలుసుకుంటేనే బావుంటుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. ఆంగ్ల శబ్దానువాదం అందుబాటులో ఉంది కానీ కృతకంగా ఉంది. మూలభాష అయిన మ్యాండరిన్‌లో చూస్తూ ఆంగ్ల సబ్‌టైటిల్స్ పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం.
పిన్-వెన్, షావ్ జింగ్ తల్లీకూతుళ్ళు. షావ్ జింగ్ ఇంటర్‌మీడియట్‌లో చదువుతూ ఉంటుంది. అప్పుడే కరోనా వ్యాపిస్తోంది. షావ్ జింగ్ కాలేజీకి బయల్దేరటానికి ఎప్పుడూ ఆలస్యం చేస్తుంది. పిన్-వెన్ ఆమెని రోజూ కాలేజీకి కారులో తీసుకువెళుతుంది. “నేనే వెళతానుగా” అంటుంది కూతురు. “అంటే రోజూ ఆలస్యంగా వెళతావా?” అంటుంది తల్లి. రోజూ ఇద్దరికీ గొడవే. కరోనా నివారణకి కాలేజీలో విద్యార్థుల శరీర ఉష్ణోగ్రత చూసి లోపలికి పంపిస్తూ ఉంటారు. పిన్-వెన్ ఒక కంపెనీలో మంచి హోదాలో ఉంటుంది. ఆ రోజు ఆమెకి జీతం తగ్గిస్తున్నట్టు ఈమెయిల్ వస్తుంది. ఆమె తన మ్యానేజర్ దగ్గరకి వెళ్ళి అరుస్తూ ప్రశ్నిస్తుంది. అతను “నాకూ జీతం తగ్గింది” అంటాడు. కరోనా ప్రభావాన్ని అంచనా వేసి ఎన్ని కంపెనీ ఇలా జీతాలు తగ్గించాయో? అదే రోజు పిన్-వెన్‌కి కూతురి కాలేజీ నుంచి ఫోన్ వస్తుంది. కూతురి క్లాసులో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెబుతారు. ఆమె తన మ్యానేజర్‌కి విషయం చెప్పి సగం రోజు సెలవు పెట్టి కూతుర్ని ఇంటికి తీసుకువెళుతుంది. ఆమె అసలు విషయం చెప్పటంతో కంపెనీ వారు ఆమెకి “మీ అమ్మాయిని దగ్గరుండి చూసుకోండి” అని చెబుతారు. అంటే దాని అర్థం ఆమెని ఆఫీసుకి రావద్దని. తల్లీకూతుళ్ళిద్దరికీ ఇంట్లోనే పద్నాలుగు రోజుల క్వారంటైన్ మొదలు. వాళ్ళున్న అపార్ట్‌మెంట్ భవంతికి మరమ్మత్తులు చేస్తుండటంతో మొత్తం భవంతికి నీలం రంగు టార్పాలిన్ కప్పి ఉంటుంది. దాంతో ప్రపంచం కనపడకుండా మూసేసినట్టు ఉంటుంది.
తల్లీకూతుళ్ళ గొడవలు ఎక్కువవుతాయి. షావ్ జింగ్ గదిలోనే ఉంటుంది. ఎందుకని అడిగితే కరోనా నిబంధన అంటుంది. “ఇద్దరమే ఉన్నాం కదా. దూరం దూరంగా కూర్చుని భోంచేద్దాం” అంటుంది పిన్-వెన్. షావ్ జింగ్ వస్తుంది కానీ భోజనం అయ్యాక ప్లేటు మీద ఒక తిట్టు పదం రాసి వెళుతుంది. అది పిన్-వెన్ చూస్తుంది. తర్వాత ఒకరోజు షావ్ జింగ్ తన గది నుంచి బయటకి వచ్చి హాల్లో కూర్చుంటుంది. పిన్-వెన్ ఏమైందని అడుగుతుంది. షావ్ జింగ్ “నాకు ఒంట్లో బాగాలేదు” అంటుంది. పిన్-వెన్ “డాక్టరు దగ్గరకి వెళదామా?” అంటే ఆమె మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. పిన్-వెన్ తన మాజీ భర్తని రమ్మంటుంది. “నేనిలా ఈ ఇంట్లో కదలకుండా ఉండలేను. మీకు తప్ప ఎవరికి ఫోన్ చేయాలో తెలియలేదు. షావ్ జింగ్ ఒంట్లో బాగాలేదంది కానీ ఏమయిందో చెప్పటం లేదు. గదిలోనే ఉంటుంది. నన్ను దూరంగా ఉండమంటుంది” అని కన్నీరు పెట్టుకుంటుంది. అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. అతను విడిపించుకుంటాడు. ఆమె “అవున్లెండి. మీకు పెళ్ళయింది కదా. ఇన్నాళ్ళయినా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను” అంటుంది. అతను “షావ్ జింగ్ బాగానే ఉంటుందిలే. నేను తనతో తర్వాత మాట్లాడతాను” అని వెళ్ళిపోతాడు.
మాజీ భర్తని మర్చిపోలేకపోవటం, కూతురు సరిగా మాట్లాడకపోవటం, ఇల్లు మరమ్మత్తులకి టార్పాలిన్ వేయటం, ఉద్యోగంలో జీతం తగ్గటం – వీటికి తోడు ఎక్కడికీ కదలనివ్వకుండా కరోనా! ఈ కథ పిన్-వెన్ ది. ఇలాంటి కథలు ఇంకా ఎన్ని ఉన్నాయో కరోనా సమయంలో! కానీ అసలు సమస్య వేరే ఉంది. ఒక రాత్రి జడివాన పడుతుంటే పిన్-వెన్ మేలుకొంటుంది. హాల్లోకి వెళ్ళి చూస్తే కిటికీ తెరిచి ఉంటుంది. ఆమె కిటికీ మూసి షావ్ జింగ్ గదిలోకి వెళుతుంది. ఆమె గదిలో లేదు! కిటికీలు తెరిచి ఉన్నాయి. గదిలో పుస్తకాలు వర్షానికి తడిసిపోతూ ఉన్నాయి. ఆమె కిటికీలు మూసి షావ్ జింగ్‌ని వెతకటానికి వెళుతుంది. ఇంతలో సన్నివేశం మారి ఇంట్లో ఫోన్ మోగుతుంది. బయట వర్షం లేదు. షావ్ జింగ్ తన గదిలో నుంచి వచ్చి ఫోన్ ఎత్తుతుంది! “మీ అమ్మ హాస్పిటల్లో ఉంది. త్వరగా రండి” అని అవతలి గొంతు చెబుతుంది.
అసలు జరిగిందేమిటంటే పిన్-వెన్‌కి మానసిక వ్యాధి ఉంది. వర్షం ఆమె ఊహ. షావ్ జింగ్ గదిలో లేకపోవటం ఆమె ఊహ. టార్పాలిన్ వేసి ఉండగా గది తడవటం సాధ్యం కాదు కదా? ఆమె గది తడిసినట్టు ఊహించుకుంది. ఇక్కడ దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. చెప్పకనే కొన్ని విషయాలు చెబుతాడు. ఆమె రోడ్డు మీద వర్షం పడుతున్నట్టు ఊహించుకుని కూతురి కోసం వెతుకుతూ ఒక చోట ఏడుస్తూ ఆగిపోతే పోలీసులు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళారు. నిజానికి షావ్ జింగ్ ప్లేటు మీద తిట్టు పదం రాయటం, తనకి ఒంట్లో బాగాలేదని చెప్పటం – ఇవన్నీ కూడా పిన్-వెన్ ఊహించుకుంది. అసలు పిన్-వెన్‌కి ఇలా ఎందుకు జరిగింది? ఆమె భర్తతో గొడవపడి విడాకులు తీసుకున్నా అతన్ని మరచిపోలేకపోయింది. వేరొకరితో బంధం పెట్టుకోలేకపోయింది. ఒంటరిగా కూతుర్ని పెంచాల్సివచ్చింది. కరోనా సమయంలో భౌతిక దూరం పాటించాలని నియమం ఉండటంతో కూతురు గదిలోనే ఉండిపోయింది. పిన్-వెన్ దాన్ని ద్వేషంగా భావించింది. ఉన్న ఒక్క బంధమైన కూతురు తనని ద్వేషిస్తోందని ఏదేదో ఊహించుకుంది. ఇదంతా ఆమె మానసికస్థితి మీద ప్రభావం చూపించింది. అందరికీ ఇలా జరుగుతుందా? లేదు. పిన్-వెన్‌కి జరిగింది. మానసిక సమస్యలు ఉన్నవారు కరోనా సమయంలో ఎంత నరకం అనుభవించి ఉంటారో! ఇంకా తర్వాత తెలిసేది ఏమిటంటే పిన్-వెన్ ఏవో ఫండ్స్‌లో డబ్బు పెట్టి నష్టపోయింది. ఇది దెబ్బ మీద దెబ్బ.
షావ్-జింగ్ హాస్పిటల్‌కి వెళుతుంది. అయితే ఆమె క్వారెంటైన్‌లో ఉంది కాబట్టి ఆమె హాస్పిటల్లోకి వెళ్ళకూడదు. ఆమె తండ్రికి ఫోన్ చేస్తుంది. పిన్-వెన్ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. పిన్-వెన్‌కి ఉన్న మానసిక వ్యాధి ఇంకా ఎవరికీ తెలియదు. షావ్-జింగ్ తండ్రి కూతురిని తన ఇంటికి తీసుకువెళతాడు. దారిలో అతను పిన్-వెన్ తనని ఇంటికి పిలిచి చెప్పిన విషయాలన్నీ చెబుతాడు. షావ్-జింగ్ తాను ప్లేటు మీద తిట్టు పదం రాయలేదని, తనకి ఒంట్లో బాగా లేదని చెప్పలేదని అంటుంది. అతను అయోమయంలో పడతాడు. అతను ఆమె అబద్ధం చెబుతోందని అనుకునే అవకాశం కూడా లేకపోలేదు. మానసిక వ్యాధి అది సోకినవారినే కాక ఇతరులనీ బాధపెడుతుందనటానికి ఇదో ఉదాహరణ. దీనికి మరో పార్శ్వం ఏమిటంటే మానసిక వ్యాధి సోకిందని తెలిశాక ఆ వ్యాధి సోకిన వ్యక్తి నిజం చెప్పినా అది ఊహ మాత్రమే అని అందరూ అనుకోవటం.
షావ్-జింగ్ తండ్రి ఇంట్లో అతని రెండో భార్య, పదేళ్ల కొడుకు ఉంటారు. షావ్-జింగ్ ముభావంగా ఉంటుంది. పిల్లవాడిని “నీ తలిదండ్రులు ఎవరు?” అని అడుగుతుంది. అందరూ అయోమయంగా చూస్తే “అతను మీ కొడుకేనా అని తెలుసుకోవటానికి అడిగాను” అంటుంది. సవతి తల్లి “మా ఇద్దరి కొడుకే” అంటుంది. షావ్-జింగ్ తండ్రితో “నన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళండి” అంటుంది. దారిలో “నేను తొమ్మిదో క్లాసులో ఉన్నప్పుడు మీకు అమ్మతో విడాకులయ్యాయి. మీకు అప్పుడే అంత పెద్ద కొడుకు ఎలా ఉన్నాడు? అమ్మకి తెలుసా?” అంటుంది. అతను మొదట “ఇంటికి వెళ్ళాక నీకు అంతా చెబుదామని అనుకున్నాను” అని మాత్రం అంటాడు. “అమ్మకి తెలుసా?” అని రెట్టించి అడిగితే “మీ అమ్మకి చెప్పలేదు” అంటాడు. అతనికి విడాకులకి ఐదారేళ్ళ ముందే కొడుకు పుట్టాడు. విడాకుల తర్వాత ఆ కొడుకుని కన్న తన ప్రేయసిని పెళ్ళి చేసుకున్నాడు. కొడుకు ఉన్నాడని పిన్-వెన్‌కి చెప్పలేదు. కూతురికైనా ముందు చెప్పకుండా ఇంటికి తీసుకువెళ్ళటం ఎంత దారుణం! తండ్రి చేసిన మోసం ఆ అమ్మాయిని ఎంత క్షోభ పెడుతుంది! ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు. పిన్-వెన్‌కి తెలియకుండా కాపాడుకోవాలి అంతే.
పిన్-వెన్‌కి ఒత్తిడి వల్ల నెర్వస్ బ్రేక్‌డౌన్ అయిందని డాక్టరు చెబుతాడు. ఆమెని షావ్-జింగ్ ఇంటికి తీసుకువస్తుంది. ఇప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. ఇంతకు ముందు తల్లి కూతుర్ని చూసుకునేది. ఇప్పుడు కూతురు తల్లిని చూసుకుంటుంది. తల్లి విపరీతంగా ప్రవర్తిస్తుంటుంది. షావ్-జింగ్ క్వారెంటైన్ పూర్తయినా ఆమె కాలేజీకి వెళ్ళలేక ఇంట్లో ఉంటుంది. ఆమె స్నేహితురాళ్ళు ఆమె కోసం వస్తారు. మాటల్లో పిన్-వెన్‌కి ఒంట్లో బాగాలేదని ఆ స్నేహితురాళ్ళకి షావ్-జింగ్ వాట్సాప్ చాట్ లో చెప్పేసిందని పిన్-వెన్‌కి తెలుస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఎందుకు చెప్పావని పిన్-వెన్ అడుగుతుంది. కసిగా నోట్లో ఉన్న నీళ్ళు కూతురి మీద ఉమ్మేస్తుంది. షావ్-జింగ్ ఓపిగ్గా భరిస్తుంది. గతంలో కూతురి విపరీత ప్రవర్తన తల్లి ఊహ. ఇప్పుడు తల్లి వివరీత ప్రవర్తన నిజం. అయినా షావ్-జింగ్ భరిస్తుంది. పిన్-వెన్‌కి అలాంటి కూతురు ఉండటం ఆమె అదృష్టం. దేవుడు ఒక తలుపు మూస్తే ఒక కిటికీ తెరుస్తాడని ఆంగ్లంలో నానుడి. షావ్-జింగ్ తల్లితో గొడవపడినా ఆమె మనసు మంచిది.
ఇదిలా ఉండగా పిన్-వెన్ సరిగా పనిచేయట్లేదని ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. ఆమె కూతురికి నిజం చెప్పదు. రోజూ ఆఫీసుకి వెళ్ళి బయట కూర్చుని వచ్చేస్తుంది. ఇంట్లో దాచుకున్న బంగారం, విదేశీ డబ్బు కోసం వెతుకుతుంది. అవి దొరక్కపోతే ఇల్లు పీకి పందిరి వేస్తుంది. అసలు ఆమె అవి దాచుకుందా లేక భ్రమా? ఆమె పనిమనిషికి మూడు నెలల జీతం ఇవ్వలేదని, భవంతి నిర్వహణ ఖర్చు కూడా ఇవ్వలేదని తెలుస్తుంది. ఇంత జరుగుతుంటే ఆమె కూతురితో “మీ నాన్న వచ్చి మనతో ఉంటారు” అంటుంది. ఇంకా ఆమెకి ఆశ చావలేదు. ఒకరోజు షావ్ జింగ్ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి పిన్-వెన్ వల్ల చిన్న అగ్నిప్రమాదం జరుగుతుంది. ఆమెని హాస్పిటల్లో పెడతారు. తర్వాత ఏమైందనేది మిగతా కథ.
ఈ చిత్రానికి చంగ్ మాంగ్-హాంగ్, చాంగ్ యావ్-షెంగ్ స్క్రీన్ ప్లే రాయగా చంగ్ మాంగ్-హాంగ్ దర్శకత్వం వహించాడు. మాంగ్-హాంగ్ ఎన్నో అవార్డులు పొందిన దర్శకుడు. విభిన్న కథాంశాలతో చిత్రాలు తీశాడు. కరోనా నేపథ్యంలో వచ్చిన మొదటి చిత్రాలలో ఇది ఒకటి. పిన్-వెన్‌గా ఆలిస్సా చియా నటించింది. మామూలుగా మానసిక వ్యాధి ఉన్న పాత్రలలో తమకి మానసిక వాధి ఉందని తెలియని పాత్రలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈమెకి తనకి మానసిక వ్యాధి ఉందని తెలుసు. సమాజం తనని చులకనగా చూస్తుందని బెరుకు ఉంటుంది. అందుకే కూతురితో తప్ప వేరే వారితో ఎక్కువ మాట్లాడదు. షావ్ జింగ్‌గా జింగిల్ వాంగ్ నటించింది. ఇద్దరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
మంటలని ఆర్పటానికి నీళ్ళు ఉపయోగించటంతో భవంతిలో నీరు నిలిచిపోతుంది. కరెంటు కూడా ఆపేస్తారు. సగం కాలిన ఫ్లాట్‌లో షావ్ జింగ్ ఒంటరిగా ఉంటుంది. ఆమెకి తండ్రికి ఫోన్ చేయటం కూడా ఇష్టం లేదు. పక్క ఫ్లాట్ వాళ్ళు పిన్-వెన్‌ని ఆడిపోసుకుంటూ ఉంటారు. “మీ అమ్మ మేము చెప్పుల స్టాండ్లు బయట పెట్టామని గొడవ చేసేది. ఇప్పుడు చూడు, ఏం చేసిందో” అంటారు. ఇలాంటి సమయంలో పనిమనిషి షావ్ జింగ్ కోసం పరుగెత్తుకుని వస్తుంది. ఆమెని రెస్టారెంట్‌కి తీసుకెళ్ళి భోజనం పెట్టిస్తుంది. ఇంట్లో పని కూడా చేస్తుంది. ఆమెకి జీతం ఇవ్వకపోయినా యజమాని పట్ల విశ్వాసం ఉంది.
షావ్ జింగ్ పిన్-వెన్ ఆఫీసుకి వెళుతుంది. తల్లి ఉద్యోగం పోయిందని ఆమెకి తెలియదు. వాళ్ళు “మీ అమ్మ ఉద్యోగం పోయినా ఇక్కడికి వచ్చి రెసెప్షన్‌లో రోజంతా కూర్చునేది” అంటారు. “మరి మీరు ఏం చేయలేదేం?” అంటుంది షావ్ జింగ్. “ఏం చేయాలి? పోలీసులని పిలవాలా?” అంటారు వాళ్ళు. పోలీసులని పిలవటం ఒక్కటే మార్గమా? ఈరోజుల్లో ప్రైవేటు కంపెనీల్లో అత్యవసర సమయాల్లో ఎవరికి కబురు చేయాలి అనే సమాచారం సేకరిస్తున్నారు. పిన్-వెన్ తన మాజీ భర్త ఫోన్ నంబర్ ఇచ్చే ఉంటుంది. అయినా వాళ్ళు చేయలేదు. మనకెందుకు అని ఊరుకున్నారు. పనిమనిషికి ఉన్న విశ్వాసం పని చేయించుకున్న యజమానికి లేదు! షావ్ జింగ్ విషయాన్ని పెద్దది చేస్తుందేమో అని భయపడి కంపెనీ వాళ్ళు ఆరు నెలల జీతాన్ని ఉద్వాసన భత్యం కింద ఇస్తారు. ఆ డబ్బుతో ఆమె మొదట పనిమనిషి బాకీ తీర్చేస్తుంది. మన దేశంలో లాగా ఇతర దేశాల్లో పనిమనుషుల జీతాలు తక్కువ ఉండవు. మంచి జీతాలే ఉంటాయి. “మా అమ్మ నీ జీతం నీకిమ్మని చెప్పింది” అంటుంది షావ్ జింగ్. “అదేంటి? మీ అమ్మ హాస్పిటల్లో ఉంది కదా?” అంటుంది పనిమనిషి. “నేను ఈరోజు హాస్పిటల్‌కి వెళ్ళాను. అమ్మ డబ్బు విత్‌డ్రా చేసి నీకిమ్మని చెప్పింది” అంటుంది షావ్ జింగ్. “ఇబ్బందిగా ఉంటే ఇప్పుడే వద్దులే” అంటుంది పనిమనిషి. షావ్ జింగ్ పట్టుబట్టి డబ్బు ఇచ్చేస్తుంది. ఇంకా సమాజంలో మంచితనం ఉందనటానికి ఆ పనిమనిషి నిదర్శనం. కొన్ని కార్పొరేట్ సంస్థలు మాత్రం ఉద్యోగుల బాగోగులు పట్టించుకోవటం లేదు.
పిన్-వెన్ మానసిక చికిత్స చేసే వార్డులో ఉంటుంది. తల్లి పరిస్థితి చూసి షావ్ జింగ్ బాధపడుతుంది కానీ స్థైర్యం కోల్పోదు. డాక్టర్ “ఆమె మందులు తీసుకోకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇక నుంచి మందులు తీసుకోవాలి. నువ్వు ఆమె ఏం చెప్పినా ఓపిగ్గా విను” అంటుంది. పిన్-వెన్ హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంది. షావ్ జింగ్ కాలేజీకి లీవు పెట్టేస్తుంది. ఎలాగూ పోటీ పరీక్షకి తయారవటమే మిగిలింది. ఒకరోజు పిన్-వెన్ తలుపు బయట ఎవరో కాపలావాళ్ళు ఉన్నారని భ్రమపడుతుంది. షావ్ జింగ్ విసుక్కోకుండా బయటకి వెళ్ళి వారిని తరిమినట్టు అరుస్తుంది. అలా తల్లి భ్రమలని భ్రమలు అని చెప్పకుండా పోగొడుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఇల్లు అమ్మేద్దామని అంటుంది. పిన్-వెన్ ఒప్పుకోదు. “మీ నాన్న తిరిగి వస్తారు. ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఆయన వస్తువులు ఉన్నాయి” అంటుంది. షావ్ జింగ్ తండ్రికి ఫోన్ చేస్తుంది. “ఇక్కడ ఉండటానికి ఎప్పుడు వస్తున్నారో అమ్మకి చెప్పండి” అంటుంది. అతను మాట్లాడడు. పిన్-వెన్ ఫోన్ తీసుకుని కాల్ కట్ చేసేస్తుంది. “మీ నాన్న ఇక్కడికి వచ్చి ఉంటారని ఎవరికైనా చెబితే నిన్ను క్షమించను” అంటుంది. అతను రాడని ఆమెకి తెలుసు. కూతుర్ని మాయ చేస్తుంటుంది. కూతురు ఇంకా చిన్న పిల్లే అన్నట్టు ప్రవర్తిస్తుంది. చివరికి కూతురికి పరిస్థితి అర్థమయిందని తెలిసి ‘మీ నాన్న ఇక రాడు. ఆశ వదులుకో’ అన్నట్టు మాట్లాడుతుంది. మానసిక వ్యాధి ఉన్నవారు ఎప్పుడు ఎలా మాట్లాడతారో చెప్పటం కష్టం. ఓపిగ్గా ఉండటమే దారి.
పిన్-వెన్ ఒక సూపర్ మార్కెట్‌లో వస్తువులు సర్దే పనిలో చేరుతుంది. ఏదో పని లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆమె పనిలో చేరాక కరోనా లాక్‌డౌన్ ముగుస్తుంది. జనం స్వేచ్ఛని ఆస్వాదిస్తూ ఉంటారు. ఒకరోజు మానసిక చికిత్స వార్డులో పిన్-వెన్‌తో పాటు ఉన్న యువతి సూపర్‌మార్కెట్‌కి వస్తుంది. తాను ఎందుకు హాస్పిటల్లో చేరాల్సి వచ్చిందో చెబుతుంది. “నాకు ఒక గొంతు వినపడుతూ ఉండేది. ఒక మగ గొంతు. తీయగా మాట్లాడేది. కొన్నాళ్ళకి అది దుర్భరమైపోయింది. పని కూడా చేసుకోలేకపోయేదాన్ని. నా చెల్లెలు నాకు తోడుగా ఉండేది. హాస్పిటల్లో చేరాక ఆ గొంతు వినపడటం ఆగిపోయింది. దాంతో ఏదో వెలితిగా ఉండేది. ఇప్పుడూ వెలితిగా ఉంటుంది కానీ ఆ గొంతు వినాలని మాత్రం కోరుకోను” అంటుంది. పిన్-వెన్ లాంటివారు తాము ఒంటరి పోరాటం చేస్తున్నామని అనుకుంటారు. కానీ తమలాగే మానసిక వ్యాధులు ఉన్నవారు చాలామంది ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. సమాజం కూడా వారిని వివక్షతో చూడటం ఆపాలి. దేహానికి వ్యాధులు వచ్చినట్టే మనసుకి కూడా వ్యాధులు వస్తాయి. చికిత్సతో, ఆదరణతో నయమవుతాయి.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
తల్లీకూతుళ్ళు ఉండే భవంతి మరమ్మత్తులు పూర్తవటంతో టార్పాలిన్ తీసేస్తారు. సూర్యకాంతి ధారాళంగా ఇంట్లోకి వస్తుంది. అయితే పిన్-వెన్ ఇల్లు అమ్ముదామని అంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. షావ్ జింగ్ “ఎక్కువ ఆలోచించకు. నీ ఉద్యోగం నువ్వు చేసుకో. నేను రియల్ ఎస్టేట్ కంపెనీతో మాట్లాడతాలే” అంటుంది. మర్నాడు సాయంత్రం భోజనాల సమయంలో షావ్ జింగ్ “రియల్ ఎస్టేట్ వాళ్ళతో మాట్లాడాను. మార్కెట్ పడిపోయిందట. అంతా పోను మూడు కోట్ల డాలర్లు (తైవాన్ డాలర్లు) మాత్రమే వస్తుందట” అంటుంది. పిన్-వెన్ “అది చాలా తక్కువ. కొన్నది నాలుగున్నర కోట్లకి” అంటుంది. “మనకి మూడు కోట్లు వచ్చినా అప్పు పోగా కోటిన్నర మిగులుతుంది. దాని మీద వచ్చే వడ్డీ, నీ జీతం కలిపి నలభై వేలు నెలనెలా వస్తుంది. మనం అద్దె ఇల్లు తీసుకుని సౌకర్యంగా ఉండవచ్చు” అంటుంది షావ్-జింగ్. “ఇంకో కంపెనీతో మాట్లాడితే మంచిది” అంటుంది. “ఈ ఏజెంటు మంచివాడు. అద్దె ఇల్లు కూడా చూస్తానన్నాడు” అంటుంది షావ్ జింగ్. పిన్-వెన్ ఒప్పుకుంటుంది.
ఇంటి కొనుగోలుదారులైన దంపతులతో మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఏజెంటు కూడా ఉంటాడు. సంతకాలు పెట్టే సమయానికి కంపెనీ యజమాని వస్తాడు. అతను కాయితాలు చూసి కొనుగోలుదారులతో “ఇంత తక్కువ ధర ఇవ్వటం మీకు భావ్యంగా తోస్తోందా?” అంటాడు. అంటే యజమానికి తెలియకుండా లంచం తీసుకుని ఏజెంటు తక్కువ ధరకే ఇల్లు అమ్ముతున్నాడన్నమాట. యజమాని ఏజెంటు మీద కేకలేస్తాడు. పిన్-వెన్‌తో “మీకు నాలుగు కోట్ల ఇరవై లక్షలు వచ్చేలా నేను చూస్తాను” అంటాడు. కొన్ని సంస్థలు ఎలా బలహీనులని మోసం చేస్తున్నాయో ఈ ఉదంతం తెలుపుతుంది. షావ్ జింగ్‌ది అనుభవలేమి. ఏజెంట్ నవ్వుతూ మాట్లాడితే నమ్మేసింది. పిన్-వెన్‌ది ఆత్మవిశ్వాసలేమి. బయటివారితో మాట్లాడితే తన వ్యాధి బయటపడుతుందని ఆమె మొత్తం భారం షావ్ జింగ్ మీద వేసింది. కానీ కంపెనీ యజమాని మంచివాడు కావటంతో వారు మోసపోకుండా బయటపడ్డారు. మామూలుగా సినిమాలలో అన్నీ కష్టాలే చూపిస్తారు. ఇక్కడ ఈ పరిణామం జీవితంలో అన్నీ కష్టాలే ఉండవు అని నిరూపిస్తుంది. బలహీనులకి దైవం సహాయం చేస్తుంది.
షావ్ జింగ్ తన తండ్రిని కలిస్తుంది. తల్లి పరిస్థితి వివరిస్తుంది. తండ్రితో బంధం ఇంక కొనసాగదని అంటుంది. “మీ ఇద్దరూ కలిసి ఉండలేకపోవటం వల్ల నేనెందుకు ఇబ్బందిపడాలి? పైగా అబద్ధాలు! మీరు ఉన్నాడని కూడా చెప్పని మీ కొడుకుని నా తమ్ముడని ఎందుకు ఒప్పుకోవాలి? మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం. మీ వస్తువులు అక్కడే వదిలేస్తాం. మీరు వెళ్ళి తీసుకోండి” అని చెప్పి వచ్చేస్తుంది. బంధుత్వం ఉన్నంత మాత్రాన దానికి అనవసర ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదు. అవతలి వారు విలువ ఇస్తేనే మనమూ ఇవ్వాలి. షావ్ జింగ్ తండ్రి చేసినది దారుణమైన మోసం. విడాకులకి ముందే వేరే స్త్రీతో కొడుకుని కన్నాడు. ఆ విషయం దాచాడు. అలాంటి వ్యక్తికి తండ్రి హోదా ఇవ్వనవసరం లేదు. షావ్ జింగ్ తండ్రితో తెగతెంపులు చేసుకుని పిన్-వెన్‌కి మంచే చేసింది. తల్లికి గతంలోకి చేదుని చూపించకుండా ఉపకారం చేసింది.
సూపర్‌మార్కెట్ మ్యానేజరుకి పిన్-వెన్ అంటే ఇష్టం కలుగుతుంది. ఆమెని డేట్‌కి తీసుకువెళతాడు. ఆమె తన గతం గురించి చెబుతుంది. తన మానసిక వ్యాధి గురించి కూడా చెబుతుంది. అతను అర్థం చేసుకుంటాడు. అతని భార్య మరణించింది. తామిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండాలని కోరుకుంటాడు. షావ్ జింగ్ కూడా ఈ బంధాన్ని హర్షిస్తుంది. ఒకరోజు పిన్-వెన్ ఇంట్లోకి పాము వచ్చిందని, టీవీ వెనకాల ఉందని అంటుంది. షావ్ జింగ్ ఆమె మాట నమ్ముతుంది. ఫైర్ డిపార్ట్‌మెంట్ వారిని పిలిపిస్తుంది. బిల్డింగ్ మ్యానేజరు వచ్చి “పాము ఎలా వస్తుంది? ఎన్నాళ్ళు ఈ గోల మాకు?” అని ఆడిపోసుకుంటాడు. ఇంతలో పాము దొరుకుతుంది. టార్పాలిన్ వేసి ఉండటం వలన పాము వచ్చిందని ఫైర్ డిపార్ట్‌మెంట్ వారు అంటారు. షావ్ జింగ్ తల్లి మాట నమ్మింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేది? అందుకే ఎప్పుడూ సహనం కోల్పోకూడదు. అవతలి వారి మీద గతం ఆధారంగా తప్పుడు అంచనాలు వేయకూడదు.
తల్లీకూతుళ్ళు ఇల్లు మారతారు. సూపర్‌మార్కెట్ మ్యానేజరు సాయం చేస్తాడు. ఒకరోజు తల్లీకూతుళ్ళ మధ్య తండ్రి ప్రస్తావన వస్తుంది. షావ్ జింగ్ “అతనికి మన గురించి చింత లేదు. అతను కేవలం వీర్యం ఇచ్చాడంతే” అంటుంది. పిన్-వెన్ “అంత దారుణంగా మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నావు?” అంటుంది. “నా చిన్నప్పుడు మీరిద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు. నాన్న బాధ్యత లేకుండా ఉండేవాడని నువ్వు తిట్టేదానివి. అతను కేవలం వీర్యం ఇచ్చాడని నువ్వే అన్నావు” అంటుంది షావ్ జింగ్. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నామో ఆచితూచి చూసుకోవాలి. లేకపోతే ఇలాంటి మాటలు వారి చెవిన పడతాయి. అర్థం కావు. పెద్దయ్యాక అర్థమయితే అదో మాయని మచ్చలా ఉండిపోతుంది. షావ్ జింగ్ ఎంత నలిగిపోయిందో కదా అనిపిస్తుంది. షావ్ జింగ్ ఆ విషయం గురించి మాట్లాడుతుంటే పిన్-వెన్‌కి జలపాతం హోరు వినపడుతుంది. కాసేపటికి ఆగిపోతుంది. షావ్ జింగ్ ఏమైందని అడుగుతుంది. పిన్-వెన్ “నాకు ఓ శబ్దం వినపడేది. ఏమిటో అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు నువ్వు మీ నాన్న గురించి మాట్లాడుతుంటే ఆ శబ్దం వినపడింది. అంతలోనే ఆగిపోయింది. తర్వాత నది గలగలలు వినపడ్డాయి. ఇంతకు ముందు వినపడింది జలపాతం అని ఇప్పుడు అర్థమైంది” అంటుంది. తన మాజీ భర్త తలపులు పూర్తిగా దూరమైతే గానీ ఆమెకి హోరు తగ్గలేదు. తల్లి చెప్పింది విని షావ్ జింగ్ “అమ్మా. ఇప్పుడెలా ఉంది?” అంటుంది. పిన్-వెన్ శాంతంగా “ఇంకెప్పుడూ నాకెలా ఉంది అని అడగకు. వ్యాధిని తగ్గించుకుని నీతో మంచి జీవితం గడపటానికి దారి నేనే చూసుకుంటాను” అంటుంది. అంటే కూతురు ఎంతో క్షోభపడిందని, ఆమె కోసం తానే తన గతాన్ని మరచి సాగిపోవాలని ఆమెకి అర్థమయింది. కూతురు తల్లికి నిస్వార్థంగా సేవ చేసింది. తల్లి తన కోసం కాక, కూతురి కోసం తాను మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవాలని తెలుసుకుంది. ఇతరుల మంచి కోరుకోవటమే మన శ్రేయస్సుకి దారి.
చివర్లో షావ్ జింగ్ కాలేజీ విహారయాత్రకి వెళుతుంది. అక్కడ ఒక ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఆకస్మిక వరదలో కొట్టుకుపోతుంది. కానీ ఆమెని సహాయక బృందాలు రక్షిస్తాయి. సహాయక బృందాలు కూతుర్ని రక్షించటం టీవీలో చూసి పిన్-వెన్ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ సన్నివేశం చిత్రంలో ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తే – జీవితంలో ఒక కష్టం ముగిస్తే ఇక కష్టాలు రావని అనుకోవటం అవివేకం అని చెప్పటం ఒక ఉద్దేశం. షావ్ జింగ్ తన జీవనపోరాటం తాను చేసుకుంటుందని, పిన్-వెన్ ఆమె గురించి బెంగ పడనవసరం లేదని చెప్పటం మరో ఉద్దేశం.