[సంచిక పాఠకుల కోసం ‘మై ఓల్డ్ యాస్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
‘మై ఓల్డ్ యాస్’ (2024) అనే పేరు కాస్త అసభ్యంగా ధ్వనిస్తుంది. హాస్య చిత్రం కాబట్టి ఇలాంటి పేరు పెట్టారు. హాస్యచిత్రమే అయినా మనసుకి హత్తుకునే చిత్రమిది. ‘యాస్’ అంటే పృష్ఠభాగం. తెలుగులో ‘నా పిచ్చి మొహం’ లాంటి ప్రయోగాలు ఉన్నాయి. ‘నా పిచ్చి మొహానికి తట్టలేదు’ అని అప్పుడప్పుడూ మన తెలివితక్కువతనానికి మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటాం. అలాగే అంగ్లంలో ‘మై ఓల్డ్ యాస్’ అంటే ‘నా ముసలి మొహం’ అనే అర్థం వస్తుంది (యాస్ అంటే గాడిద అనే అర్థం కూడా ఉంది కానీ అది ఇక్కడ అతకదు). ఇక్కడ నిజంగా మొహం గురించో, పృష్ఠభాగం గురించో కాదు మాట్లాడేది. మనిషి గురించే, తన గురించి తానే చెప్పుకోవటం. ఈ చిత్రంలో పద్దెనిమిదేళ్ళ నాయికకి ముప్ఫై తొమ్మిదేళ్ళున్న తానే కనిపిస్తుంది. అంటే భవిష్యత్తు నుంచి వచ్చి ఈ అమ్మాయితో మాట్లాడుతుందన్నమాట. ఆ ప్రౌఢని ఈ అమ్మాయి ‘నా ముసలి మొహం’ అంటుంది. పద్దెనిమిదేళ్ళ వాళ్ళకి ముప్ఫై తొమ్మిదేళ్ళున్నవారు ముసలివారిలానే కనపడతారు. ఆ అమ్మాయి లెస్బియన్. అమ్మాయిలంటే ఆకర్షణ. ఈ కాలంలో పాశ్చాత్య దేశాలలో ఇలాంటి వారి పట్ల వివక్ష తగ్గింది. దాంతో ఈ అమ్మాయి అందరికీ తాను లెస్బియన్ అని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ‘ఇన్నాళ్ళూ మాలాంటి వారు బాధపడ్డారు. ఇప్పుడు మేం తలెత్తుకుని బతుకుతాం’ అన్నట్టు ఉంటుంది. కానీ ఆ క్రమంలో కాస్త అతిగా ప్రవర్తిస్తుంది. ఆమె ‘ముసలి మొహం’ ఆమెకి కొన్ని సలహాలు ఇస్తుంది. ఆ సలహాల పర్యవసానం ఏమిటి అన్నదే కథ. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.
నాయిక పేరు ఎలియట్. కెనడాలో ఒక ఊళ్ళో ఉంటుంది. ఆమె తలిదండ్రులుకి క్రాన్బెరీలు (ఒక రకం వాక్కాయలు) పండించే పొలాలు ఉంటాయి. ఆమెకి ఇద్దరు తమ్ముళ్ళు. ఆమె మూడు వారాల్లో ఆ ఊరు విడిచి టొరంటో విశ్వవిద్యాలయానికి వెళ్ళబోతోంది. ఆమెకి దిగులు లేదు. పైగా సంతోషం. ఊరు విడిచి నగరానికి వెళుతున్నానని ఆనందంగా ఉంటుంది. ఒక అమ్మాయితో చిన్నపాటి ప్రేమాయణం సాగిస్తూ ఉంటుంది. లైంగిక వాంఛలు తీర్చుకోవటమే ప్రధాన ఉద్దేశం. ఆమె పద్దెనిమిదో పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు తన ఇద్దరు స్నేహితురాళ్ళతో కలిసి ఒక సరస్సు మధ్యలో ఉన్న దీవికి వెళుతుంది. మోటారు పడవ తానే నడుపుతుంది. మరో పక్క ఆమె ఇంట్లో అందరూ పుట్టినరోజు కేకు కోద్దామని ఎదురుచూస్తుంటారు. అయితే ఆమె తల్లికి ముందే ఇంటికి రానని చెప్పింది. తల్లి మర్చిపోయింది. ఇంతకీ దీవికి వెళ్ళినది మత్తు కలిగించే పుట్టగొడుగులతో టీ కాచుకుని తాగటానికి. రాత్రంతా అక్కడే ఉండాలని వారి పథకం. చిన్న టెంట్లు కూడా తీసుకువెళతారు.
పుట్టగొడుగుల టీ తాగాక స్నేహితురాళ్ళిద్దరూ మత్తులో తూగుతూ ఉంటారు. ఎలియట్కి మత్తు ఎక్కదు. ఆమెకి హఠాత్తుగా ముప్ఫై తొమ్మిదేళ్ళ తన రూపమే కనపడుతుంది. మరో మనిషి ఉన్నట్టే కనపడుతుంది. పెద్ద ఎలియట్ తన పక్కటెముకల మీద ఉన్న మచ్చ చూపించి తాను పెరిగిన ఎలియట్నని నిరూపిస్తుంది. తాను పీహెచ్డీ చేస్తున్నానని చెబుతుంది. “నడివయసు వచ్చినా ఇంకా చదువుతూనే ఉంటానా?” అని చిన్న ఎలియట్ చిరాకు చూపిస్తుంది. పెద్ద ఎలియట్ తక్కువేమీ కాదు. ఇద్దరూ ఒకే మనిషి కదా. స్వభావమెక్కడికి పోతుంది? “నోర్మూసుకో. ముప్ఫై తొమ్మిదంటే నడివయసేం కాదు. పడుచు వయసే” అంటుంది. జీవితం బావుండాలంటే ఏమన్నా సలహా ఇవ్వమని చిన్న ఎలియట్ అడుగుతుంది. ఇద్దరిదీ ఒకే జీవితం కదా. పెద్ద ఎలియట్ చేసిన తప్పులేమీ చేయకుండా ఉండాలని చిన్న ఎలియట్ ఆశ. పెద్ద ఎలియట్ “చాడ్ అనే వాడికి దూరంగా ఉండు. అమ్మతో విసుక్కోకుండా మాట్లాడు. నువ్వు చాలా లక్కీ. జీవితం ఇప్పుడున్నంత బావుండదు. నగరంలో జీవితం వేగంగా ఉంటుంది. థాంక్స్‌గివింగ్ (ఒక పండగ) కి ఇంటికి వెళ్ళకుండా ఉండకు” అంటుంది. ఉపయోగపడే సలహాలు చెప్పమంటే ఏదేదో చెబుతోందని చిన్న ఎలియట్ విసుక్కుంటుంది. ఎలియట్ లెస్బియన్. ఆమె మగవారి జోలికి వెళ్ళదు. అసలు చాడ్ ఎవరో కూడా ఎలియట్కి తెలియదు. మరి చాడ్కి దూరంగా ఉండమని పెద్ద ఎలియట్ ఎందుకు చెప్పింది? ఇదే ప్రేక్షకులకి ఆసక్తి రేపుతుంది.
పెద్ద ఎలియట్ చిన్న ఎలియట్ ఫోన్లో ‘మై ఓల్డ్ యాస్’ అనే పేరు పెట్టి తన నంబరు ఎక్కిస్తుంది. చిన్న ఎలియట్ పడుకున్నాక పెద్ద ఎలియట్ మాయమైపోతుంది. మర్నాడు పొద్దున స్నేహితురాళ్ళు ముగ్గురూ ఇళ్ళకి వెళతారు. ఎలియట్కి వ్యవసాయం చేయాలనే ఆసక్తి లేదు కానీ తండ్రికి పొలం పనులలో సాయం చేస్తుంది. ట్రాక్టర్ నడుపుతుంది. ఒకరోజు పనులు చేశాక దగ్గరున్న చెరువులో స్నానం చేస్తూ ఉంటుంది. అక్కడ చాడ్ అనే అబ్బాయి ఉంటాడు! అతను కూడా తన తండ్రికి పొలం పనులలో సాయం చేస్తుంటాడు. అతని పేరు వినగానే ఎలియట్ పారిపోతుంది. అప్పటి దాకా పెద్ద ఎలియట్ని చూడటం తన భ్రమ అనుకుంది. పెద్ద ఎలియట్కి ఫోన్ చేస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. (ఒక అమ్మాయి భవిష్యత్తులో ఉన్న తనతోనే ఫోన్లో ఎలా మాట్లాడుతుంది అనేది పక్కన పెట్టాలి.) పెద్ద ఎలియట్ “వాడి జోలికి వెళ్ళకు. తమ్ముడితో గోల్ఫ్ ఆడటానికి వెళ్ళు. నాన్న వండే చేపలు తిని ఆనందించు” అంటుంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడపమని పెద్ద ఎలియట్ పదే పదే చెబుతూ ఉంటుంది. “జీవితంలో జరిగే ఇతర విషయాల గురించి చెప్పను. ఎందుకంటే చెబితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలియదు” అంటుంది. నిజమే! గతంలోకి వెళ్ళే అవకాశం ఉంటే పెద్ద పెద్ద మార్పులు చేసి భవిష్యత్తులో ఆనందంగా ఉండొచ్చు అనుకుంటాం కానీ ఆ మార్పుల పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదు కదా. ఏ మనిషికైనా జీవితమంతా సుఖమే అనుభవించటం సాధ్యం కాదు. కష్టాలు పడాల్సిందే. పెద్ద ఎలియట్ పీహెచ్డీ విద్యార్థిని కనక ఆమెకి ఈ అవగాహన ఉంది.
పెద్ద ఎలియట్ ఫోన్లో చిన్న ఎలియట్‌తో మాట్లాడుతూనే ఉంటుంది. చాడ్కి దూరంగా ఉండమని పదే పదే చెబుతుంది. అయితే ఒకరోజు చిన్న ఎలియట్కి చాడ్తో మాట్లాడక తప్పని పరిస్థితి వస్తుంది. ఆమె మోటారు పడవ సరిగా పని చేయట్లేదంటే చాడ్ బాగు చేస్తానంటాడు. సరదాగా మాట్లాడతాడు. “కాలేజీ అయిపోయాక ఏం చేస్తావు?” అని అడుగుతాడు. “వ్యవసాయమైతే చేయను. ఏం చేస్తానో తెలియదు” అంటుందామె. “కుటుంబవృత్తి చేయటం ఇష్టం లేదంటే ఏదో పెద్ద ఆశయం ఉందనుకున్నాను. ప్రధానమంత్రి కావటం లాంటి ఆశయాలు ఉన్నాయనుకున్నాను” అంటాడతను. అతని పద్ధతి నచ్చక “నాకు ఫ్రెంచ్ భాష రాదు. కాబట్టి ప్రధాని కాలేను” (కెనడాలో ఫ్రెంచ్ ముఖ్యమైన అధికార భాష. చాలామందికి ఫ్రెంచ్ తప్ప వేరే భాష రాదు.) అంటుందామె. అతను ఫ్రెంచ్‌లో “పడవ బాగయింది. అలా షికారు వెళ్ళొద్దామా?” అంటాడు. ఆమెకి ఫ్రెంచ్ భాష వచ్చు. అతనికి ఫ్రెంచ్ వచ్చునని ఆమె ఊహించలేదు. కాస్త ఖంగు తింటుంది. అతను ఫ్రెంచ్‌లో అడిగాడని మర్చిపోయి “నీతో ఎప్పటికీ షికారుకి రాను” అంటుంది. అతను “నీకు ఫ్రెంచ్ వచ్చు కదా?” అంటాడు. “అవును. నిజమే. నేను పైకి కనపడినదానికంటే తెలివైనదాన్ని. సరేనా?” అంటుందామె. “నువ్వు తెలివైనదానిలానే కనపడతావు” అంటాడతను. “అలా తీయగా మాట్లాడకు” అని ఉక్రోషపడుతుందామె. అతను నవ్వేస్తాడు. తర్వాత పెద్ద ఎలియట్‌తో ఫోన్లో మాట్లాడుతూ “చాడ్ ఏం చేయబోతున్నాడో చెప్పు. అతను చాలా మంచివాడిలా ఉన్నాడు. అందగాడు” అంటుంది. పెద్ద ఎలియట్ నిస్పృహతో “అతనితో సెక్స్ మాత్రం చేయకు” అని ఫోన్ పెట్టేస్తుంది.
ఈ స్క్రీన్‌ప్లేలో గొప్పదనమేమిటంటే ఎలియట్ అల్లరిపిల్లలా ఉంటుంది, కానీ భవిష్యత్తులో పీహెచ్డీ చేస్తుంది అంటే నమ్మటం మొదట్లో కష్టంగా ఉంటుంది. కానీ ఆమె తెలివైనదని చెప్పే సన్నివేశాలూ ఉంటాయి. అలాగే కుటుంబం విలువ గురించి చెబుతున్నట్టు ఉంటుంది, కానీ చివరికి కథలో అసలు విషయం ఏమిటో తెలిస్తే రచయిత్రి మేగన్ పార్క్ ఎంత చాకచక్యంగా స్క్రీన్‌ప్లే రాసిందో కదా అనిపిస్తుంది. ఈ చిత్రానికి దర్శకురాలు కూడా ఆమే. చిన్న ఎలియట్గా నటించిన మేసీ స్టెల్లా నటన అత్యంత సహజంగా ఉంటుంది. ఆమె ఎన్నో ప్రశంసలని అందుకుంది. పెద్ద ఎలియట్గా నటించిన ఆబ్రీ ప్లాజా కూడా మంచి మార్కులు వేయించుకుంది. చాడ్గా పెర్సీ హైన్స్ వైట్ నటించాడు. ఇతను చిత్రంలో ఏం చేయబోతున్నాడు అనే ఉత్కంఠ చివరి దాకా ఉంటుంది.
చిత్రంలో హాస్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పెద్ద ఎలియట్ మొదటిసారి కనపడినపుడు చిన్న ఎలియట్ “యాపిల్ సంస్థ లాగ బాగా ఎదిగే సంస్థ ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు. షేర్లు కొని కోటీశ్వరులు అయిపోవచ్చు” అంటుంది. పెద్ద ఎలియట్ చెప్పనంటుంది. తాను ఎలియట్నేనని నిరూపించుకోవటానికి ఆమె రెండో రుజువు కూడా చూపుతుంది. “మన స్నేహితురాలి రెండో పెళ్ళిలో చిన్న ప్రమాదం జరిగి మన కాలి చిటికెన వేలు తెగిపోయింది చూడు” అని చూపిస్తుంది. అంతలోనే “అయ్యో. అది నీకింకా జరగలేదు కదా!” అని నాలిక కరుచుకుంటుంది. స్నేహితురాలి రెండో పెళ్ళి అనటంలో కూడా నేటి వివాహవ్యవస్థ మీద వ్యంగ్యం ఉంది. ఒకసారి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న ఎలియట్కి ఫోన్లో సైరెన్లు వినిపిస్తాయి. “అందరూ బేస్మెంట్లోకి పరుగెత్తండి” అంటుంది పెద్ద ఎలియట్. అంటే భవిష్యత్తులో యుద్ధాల భయం ఇంకా పెరుగుతుందని సూచన. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సూచన చూసి మనం నిట్టూర్పు విడవక తప్పదు.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
ఎలియట్ తన తమ్ముడు మ్యాక్స్‌తో గోల్ఫ్ ఆడటానికి వెళుతుంది. ఆమె కూడా వస్తానంటే మ్యాక్స్‌కి ముందు వింతగా ఉంటుంది. “త్వరలో వెళ్ళిపోతాను కదా. కాసేపు మాట్లాడుకుందామని” అంటుందామె. వెళుతుంది కానీ అతను బంతిని కొడుతుంటే చూస్తూ కూర్చుంటుంది అంతే. మధ్యలో మాట్లాడుతూ ఉంటుంది. అతను “అమ్మా నాన్నా నాతో వెళ్ళమని చెప్పారా? నేను నీ తమ్ముడినని అందరికీ తెలియటం నీకిష్టం లేదుగా” అంటాడు. “అదేం లేదు” అంటుందామె. “నా పుట్టినరోజుకి నువ్వు నా గ్రీటింగ్ కార్డ్‌లో ‘నీకు హ్యాపీ బర్త్‌డే చెప్పాలని ఉంది కానీ తెల్లజాతికి చెందిన సిస్జెండర్ మగవాళ్ళు ఇప్పటికే చాలా హ్యాపీగా ఉన్నారుగా’ అని రాశావు” అంటాడతను. సిస్జెండర్ అంటే మగవారుగా పుట్టినవారు మగవారిగా, ఆడవారిగా పుట్టినవారు ఆడవారిగా తమని తాము గుర్తించుకోవటం. దీనికి వ్యతిరేకమైనది ట్రాన్స్‌జెండర్. తెల్లజాతి మగవారు ప్రపంచాన్ని శాసిస్తున్నారని ఎలియట్ భావన. తెల్లజాతి కానివారు, ఆడవారు, ట్రాన్స్జెండర్లు వివక్షకి గురవుతున్నారని దాని అర్థం. ఇది నిజమే కావచ్చు. అయితే సొంత తమ్ముడిని ఈ మాటలతో గాయపరచాలా? అదీ పుట్టినరోజు నాడు. ఈ రోజుల్లో పాశ్చాత్యదేశాలలో వివక్ష లేని చోట కూడా వివక్ష ఉందని గోలపెట్టే ‘క్యాన్సెల్ కల్చర్’ పెరిగిపోయింది. దానికి ప్రతినిధి ఎలియట్. కానీ ఆమె తను చేసిన తప్పుని తెలుసుకుంటుంది. తమ్ముడికి సారీ చెబుతుంది.
ఎలియట్ తల్లితో కూడా ప్రేమగా మాట్లాడుతుంది. చిన్న తమ్ముడితో కలిసి అతనికిష్టమైన సినిమా చూస్తుంది. తాను ఇంతకు ముందు తన ఇంట్లోని వారితో దురుసుగా ప్రవర్తించానని ఆమెకి అర్థమవుతుంది. ఆమెలో పశ్చాత్తాపం మొదలవుతుంది. దీనికి తోడు తాను ప్రేమిస్తున్న అమ్మాయితో సాంగత్యం ఇప్పుడు ఆమెకి అంత ఉత్తేజంగా ఉండదు. తనకేమవుతోందో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. పెద్ద ఎలియట్‌తో దీని గురించి మాట్లాడుతుంది. “నేను చెడ్డదాన్నా?” అని అడుగుతుంది. “నువ్వు పెద్దెనిమిదేళ్ళ అమ్మాయివి అంతే” అంటుంది పెద్ద ఎలియట్. పద్దెనిమిదేళ్ళకి స్వార్థమే ఎక్కువ ఉంటుంది. అది సహజం. చిన్న ఎలియట్ “నేను ఎప్పటి నుంచో కోరుకున్న అమ్మాయి కూడా నాకు నచ్చటం లేదు” అంటుంది. పెద్ద ఎలియట్ “నువ్వు కోరుకున్నది దక్కాక నువ్వు కోరుకున్నది అది కాదు అని తెలియటం జీవితంలో ఇదే ఆఖరిసారి కాదులే” అంటుంది. ‘ఇది దక్కితే చాలు’ అని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. కానీ ఎప్పుడైనా నిజంగా తృప్తి కలిగిందా అని ఆలోచించుకుంటే లేదనే సమాధానమే వస్తుంది. ఉన్న స్థితిని ఆమోదించి, లభించినదానితో తృప్తిగా ఉంటేనే సంతోషం సొంతమవుతుంది. “నిజమైన ప్రేమంటే భద్రత, స్వేచ్ఛ కలిసి ఉన్నదే” అంటుంది పెద్ద ఎలియట్.
ఎలియట్ చాడ్కి దూరంగా ఉంటుంది. కానీ ఒకరోజు చాడ్ తన ట్రాక్టర్ రిపేర్ చేశాడని ఎలియట్ తండ్రి అతన్ని అల్పాహారానికి పిలుస్తాడు. ఎలియట్ ముభావంగా ఉంటుంది. చాడ్ తాను క్యాన్సర్ పరిశోధన చేయాలనుకుంటున్నానని అంటాడు. వేసవి కావటంతో తన కుటుంబానికి చెందిన పొలంలో పని చేస్తుంటాడు. తన బామ్మతో సమయం గడుపుతూ ఉంటాడు. అతని మాటలు విని ఎలియట్ కుటుంబమంతా అతన్ని మెచ్చుకుంటుంది. ఎలియట్కి ఇరకాటంగా ఉంటుంది. ఇదిలా ఉండగా తన తలిదండ్రులు పొలం అమ్మేస్తున్నారని ఎలియట్కి తెలుస్తుంది. తనకెందుకు చెప్పలేదని ఉక్రోషపడుతుంది. “నువ్వు ఇంట్లో ఉంటేగా” అంటాడు తండ్రి. ఆమె పెద్ద ఎలియట్కి ఫోన్ చేస్తుంది కానీ ఆమె ఫోన్ తీయదు. పొలం అమ్మేస్తున్నారంటే ఎలియట్కి విచారంగా ఉంటుంది. పెద్ద ఎలియట్ సలహా ఇస్తే పొలం అమ్మకుండా ఆపవచ్చని ఆమె ఆశ. వ్యవసాయం చేయదు కానీ పొలం మాత్రం ఉండాలి. అంటే అప్పుడప్పుడూ అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండటానికి అన్నమాట. మనలో చాలామంది ఇలాగే ఉంటారు. ‘మట్టి పిసకను కానీ పచ్చని పొలాలు చూసి ఆనందిస్తాను’ అంటారు. వ్యవసాయాన్ని చులకన చేయకూడదు. ఒకవేళ కౌలుకి ఇచ్చినా ఆ కౌలు రైతుల సంక్షేమం మనమే పట్టించుకోవాలి. వ్యవసాయం కుంటుబడితే అన్నం ఉండదని గుర్తుపెట్టుకోవాలి.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
కొన్నిరోజుల పాటు పెద్ద ఎలియట్ ఫోన్ తీయకపోవటంతో చిన్న ఎలియట్ తన గోడు చాడ్తో చెప్పుకుంటుంది. “పొలం అమ్మేస్తే ఈ ఊరికి ఇక వీడ్కోలే. నాకు వీడ్కోలు చెప్పటమంటే ఇష్టం ఉండదు” అంటుంది. చాడ్ “చిన్నప్పుడు స్నేహితులతో కలిసి దొంగ-పోలీస్ ఆట ఆడుకున్నావు కదా? చివరిసారిగా ఆ ఆట ఎప్పుడు ఆడావో గుర్తుందా?” అంటాడు. లేదంటుంది ఎలియట్. “అంటే ఒకరోజు ఆ ఆట ఆడి ఇంటికెళ్ళి పడుకున్నావు. మళ్ళీ ఆ ఆట ఆడనని నీకు తెలియదు. తలచుకుంటే బాధగా లేదూ? వీడ్కోలు చెప్పకపోతే చివరిసారి ఆ విషయాన్ని ఆస్వాదించటం కూడా ఉండదు” అంటాడు చాడ్. ఒక కాలేజీ అబ్బాయి ఇలా మాట్లాడతాడా? కొందరు సున్నితమనస్కులు ఇలాగే ఉంటారు. అతను చెప్పిన విషయం ఎంత లోతైనది! మన జీవితంలో ఉన్న ఎన్నో విషయాలని మనం తేలికగా తీసుకుంటాం. కొన్నిటి విలువ అవి లేనప్పుడే తెలుస్తుంది. అందుకే ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. అతని మాటలు విని ఎలియట్కి అతని మీద ఇష్టం ఇంకా పెరుగుతుంది. ఆమెకి అమ్మాయిలంటే ఆకర్షణ కదా? మరి అబ్బాయిని ఎలా ఇష్టపడింది? ఆమెకి కూడా అది అర్థం కాదు. తన స్నేహితురాలికి అదే చెబుతుంది. ఆమె “ఇష్టానికి ఏదో ఒక పేరు పెట్టక్కరలేదని నువ్వే చెప్పావు కదా?” అంటుంది. ‘Falling in love with someone’s mind’ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే ఒక మనిషిని వారి మేధ చూసి ప్రేమించటం. ఇక్కడ లైంగిక ఆకర్షణ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనిషి మనసు ఎంత క్లిష్టమైనదో కదా?
కాలేజీకి వెళ్ళేరోజు దగ్గరపడుతూ ఉంటుంది. ఎలియట్ తన తల్లితో సమయం గడుపుతుంది కానీ చాడ్ విషయం చెప్పదు. ఒకరోజు ఆమె తల్లి “చిన్నప్పుడు నువ్వు సరిగా నిద్రపోయేదానివి కాదు. ఎప్పుడూ ఎత్తుకుని జోకొట్టాల్సి వచ్చేది. కానీ ఒకరోజు హఠాత్తుగా నువ్వు క్రిబ్ (తొట్టి లాంటి పడక) ని చూపించి ‘క్రిబ్’ అన్నావు. నిన్ను క్రిబ్‌లో పడుకోబెడితే నన్ను చూసి నవ్వి పక్కకి తిరిగి పడుకుని నిద్రపోయావు. నాకు ముచ్చటేసింది కానీ ఇక నిన్ను ఎత్తుకుని జోకొట్టే అవకాశం లేదని బాధ కూడా వేసింది” అంటుంది. తల్లులు పిల్లల కోసం ఎంత చేస్తారు! ఎప్పుడూ వారికి ఋణపడి ఉండాలి. ఒక రాత్రి ఎలియట్కి బెంగ మొదలవుతుంది. ఆమెకి ప్రత్యేకమైన గది ఉంది. అక్కడ పడుకోలేక ఆమె తమ్ముళ్ళ గదిలోకి వెళ్ళి వారి మంచాల మధ్య కింద పడుకుంటుంది. ఎవరికైనా కుటుంబమే ప్రధానమైన ఆస్తి.
చాడ్, ఎలియట్ ప్రేమలో పడతారు. శారీరకంగా కలుస్తారు. ఒకరోజు చిన్న ఎలియట్కి పెద్ద ఎలియట్ మళ్ళీ కనిపిస్తుంది. తాను ఒక ధ్యాన శిబిరానికి వెళ్ళానని, అందుకే ఫోన్ తీయలేదని అంటుంది. చిన్న ఎలియట్ జరిగినదంతా చెబుతుంది. పెద్ద ఎలియట్ని నిస్పృహ ఆవహిస్తుంది. అది చూసి చిన్న ఎలియట్ “అతను ఏం చేశాడో చెప్పు” అంటుంది. పెద్ద ఎలియట్ “అతను చనిపోయాడు” అంటుంది! చిన్న ఎలియట్ నోట మాటరాక ఉండిపోతుంది. పెద్ద ఎలియట్ కొనసాగిస్తూ “అతన్ని నువ్వు ఎవర్నీ ప్రేమించనంత ప్రేమించాక అతను చనిపోయాడు. ఆ బాధ నీకొద్దు” అంటుంది. చిన్న ఎలియట్ కాసేపు ఆలోచిస్తుంది. “లేదు. నేను అతన్ని ప్రేమిస్తాను. మాకు ఎంత గడువు ఉంటే అంతా ఆస్వాదిస్తాను. జీవితంలో తగిలే ఎదురుదెబ్బలకి భయపడితే ఎప్పటికీ ఇంట్లో కూర్చోవాలి” అంటుంది. అంతలో చాడ్ వస్తాడు. అతను పెద్ద ఎలియట్ని చూస్తాడు. అతన్ని చూసి ఆమెకి గుండె పిండేసినట్టుంటుంది. వెళుతూ అతన్ని కౌగిలించుకుని అతనికి కనపడకుండా కన్నీరు పెట్టుకుంటుంది. చాడ్కి ఆమె చేష్ట వింతగా ఉంటుంది కానీ అతను సహృదయంగా ఉంటాడు. చివరికి ఎలియట్ సంతోషంగా కుటుంబంతో, చాడ్తో ఆ ఊరిలో చివరి రోజులు గడుపుతుంది. చాడ్ కూడా ఆమె వెళ్ళే కాలేజీలోనే చదువుతున్నాడు. ఇద్దరూ కలిసి ఆనందంగా కొన్ని రోజులైనా గడుపుతారు అనే సూచనతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రం స్క్రీన్‌ప్లే లో నైపుణ్యం ఏమిటంటే “చాడ్కి దూరంగా ఉండు” అని పెద్ద ఎలియట్ అనగానే అతనేదో తప్పుడు పని చేస్తాడని ప్రేక్షకులకి అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్బాయిలు తప్పులు చేస్తారనే అభిప్రాయం నాటుకుపోయింది. దాన్ని తెలివిగా వాడుకుంది రచయిత్రి. పైగా ఎలియట్ లెస్బియన్ కాబట్టి చాడ్ ఆమెని బలవంతంగా ఏమైనా చేస్తాడేమో అని కూడా అనిపిస్తుంది. కుటుంబానికి కూడా ప్రాధాన్యం ఇవ్వటంతో స్క్రీన్‌ప్లేలో సమతౌల్యం వచ్చింది. విచిత్రమేమిటంటే గతాన్ని మార్చకూడదు అనే అవగాహన ఉన్న పెద్ద ఎలియట్ చాడ్ని మాత్రం దూరంగా పెట్టు అంటుంది. అది గతాన్ని మార్చటం కాదా? మనిషి స్వభావం ఇలాగే ఉంటుంది. అన్నీ సరే గానీ ఇదొక్కటీ వేరు అనిపిస్తుంది. ఆ ఒక్కదాన్నీ వేరే వాటితో సమానంగానే చూస్తే గొడవే ఉండదు.
చివర్లో చిన్న ఎలియట్ అంత పరిపక్వతతో ఎలా ఆలోచించగలిగింది? ఆమె తెలివైనదని చిత్రం పొడుగునా తెలిసిపోతూనే ఉంటుంది. “ప్రపంచం తగలబడుతోంది” అంటుంది చిత్రం మొదట్లోనే. అంటే ప్రపంచాన్ని మార్చాలనుకోవటం మూర్ఖత్వం అని ఆమెకి తెలుసు. మరి అలాంటప్పుడు చాడ్ చనిపోతాడు కదా అని అతన్ని ప్రేమించటం మానేస్తుందా? పైగా ఆమె తన గురించి కాక చాడ్ గురించి ఆలోచించింది. తెలిసో తెలియకో అతనితో సాన్నిహిత్యం పెరిగింది. ఇప్పుడు అతను చనిపోతాడని తెలిసి అతనికి దూరంగా వెళితే అతని పరిస్థితి ఏమిటి? అతనితో కలిసుంటే అతను చివరి దాకా ఆనందంగా ఉంటాడు. తన కోసం కాక ఇతరుల కోసం బతకటం ఎప్పుడూ ఉన్నతమైనదే.