Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 119: పర్ఫెక్ట్ డేస్

[సంచిక పాఠకుల కోసం ‘పర్ఫెక్ట్ డేస్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

జీవితమంటే ఉరుకులూ పరుగులేనా? పేరూ డబ్బూ ముఖ్యమా లేక ప్రశాంతంగా ఉండటం ముఖ్యమా? ప్రశాంతతే ముఖ్యం. డబ్బు ఉండాలి కానీ బతకడానికి ఉంటే చాలు. ఇలా ఆలోచించేవారు తక్కువ. ‘బాగా సంపాదించాలి. రేపు ఎలా ఉంటుందో తెలియదు’ అనుకునేవారే ఎక్కువ. హిరయామా అలా కాదు. ఏ బాదరబందీ లేకుండా ఉంటాడు. డబ్బు కోసం టాయిలెట్లు శుభ్రం చేస్తాడు. మిగతా సమయాల్లో సంగీతం వింటాడు. ఫోటోలు తీస్తాడు. పుస్తకాలు చదువుతాడు. ముఖ్యంగా ప్రకృతిని చూసి ఆనందిస్తాడు. ప్రకృతే కాదు మనసుకి నచ్చేది ఏదైనా చూసి ఆనందిస్తాడు. అలా అనటం కంటే ఏది కనపడితే దానిలోనే అందం, ఆనందం వెతుక్కుంటాడు అంటే బావుంటుంది. మొత్తానికి అతని రోజులు పరిపూర్ణమైనవి. ‘పర్ఫెక్ట్ డేస్’ అన్నమాట. అతనికి తోడు ఎవరూ లేరు. తోడు లేని జీవితం నిస్సారం కదా? అతనికి కాదు. అతని జీవితంలో లోపం వెతకటానికి ఇతరులకి ఏం హక్కు ఉంది? ఇతరులు అతని జీవితంలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. ఆ సంఘటనల ప్రభావం అతని మీద ఎలా ఉంటుంది? అదే ‘పర్ఫెక్ట్ డేస్’ (2023) అనే జపనీస్ చిత్రంలో కథ. మూబీలో లభ్యం. ఈ చిత్రం చాలా నెమ్మదిగా నడుస్తుంది. హిరయామాతో పాటు మనం కొన్నిరోజులు ప్రయాణం చేసినట్టు ఉంటుంది. ప్రతి సన్నివేశంలోనూ భావోద్వేగాలు ఉండాలి అనుకునేవారికి ఈ చిత్రం నచ్చకపోవచ్చు.

హిరయామా నడివయసువాడు. టోక్యో నగరంలో ఒక చిన్న ఇంట్లో ఉంటాడు. నేల మీద పరుపు వేసుకుని పడుకుంటాడు. పొద్దున్నే పరుపు మడతపెట్టి మూలన పెడతాడు. దాంతో గది ఖాళీగా ఉంటుంది. ఒకప్పుడు మనదేశంలో కూడా పడుకునేటప్పుడు మంచాలు వేసుకుని, పొద్దున్నే వాటిని ఎత్తి పక్కకి పెట్టేవారు. గది ఖాళీగా ఉండేది. ఇప్పుడు మంచాలు ఎప్పుడూ వేసే ఉంటాయి. వాటి చూట్టూ జాగ్రత్తగా తిరగాలి. అప్పుడప్పుడూ కాలికి దెబ్బలు తగిలించుకోవాలి. గదులు ‘నిండుగా’ కనపడకపోతే అదో వెలితి! హిరయామా పడగ్గదిలో ఓ పక్కన పుస్తకాల అల్మరా ఉంటుంది. రాత్రివేళ పుస్తకం చదువుతూ నిద్రాదేవి ఒడిలోకి జారుకుంటాడు. పొద్దున్నే పళ్ళు తోముకుని, మీసంలో పెరిగిన వెంట్రుకలు కత్తిరించుకుని, గడ్డం గీసుకుని పనికి బయల్దేరుతాడు. వెళ్ళే ముందు ఇంట్లో ఒక చిన్న గదిలో ఉన్న మొక్కలకి నీళ్ళు స్ప్రే చేస్తాడు. బయటకి రాగానే ఆకాశం వంక చూసి చిరునవ్వుతో శ్వాస పీలుస్తాడు. దగ్గరే ఉన్న వెండింగ్ మెషీన్‌లో డబ్బులు వేసి చల్లటి కాఫీ క్యాన్ తీసుకుని తాగుతాడు. కారులో క్యాసెట్ పెట్టుకుని వింటూ బయల్దేరుతాడు. అతను వినేవన్నీ ఇంగ్లిష్ పాప్ సంగీతం పాటలే. అతనికి ఇంగ్లిష్ బాగా వచ్చని తెలిసిపోతుంటుంది. బాగా చదువుకున్నవాడు అయి ఉండవచ్చు.

ఒకచోటి నుంచి ఇంకో చోటికి వెళుతూ పబ్లిక్ టాయిలెట్లు శుభ్రం చేస్తాడు. చాలా శ్రద్ధగా చేస్తాడు. వచ్చేవారికి శుభ్రం చేస్తున్నట్టు తెలియటానికి బయట పసుపు బోర్డు పెడతాడు. ఆ బోర్డుని విస్మరించి ఒక్కోసారి టాయిలెట్ వాడుకోవటానికి ఎవరో ఒకరు లోపలికి వచ్చేసినా అతను విసుక్కోడు. అలాంటప్పుడు బయటకి వెళ్ళి తలుపు పక్కన నిలబడతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ లోపలికి వెళతాడు. అలా బయట నిలబడినపుడు చుట్టూ ఉన్న పరిసరాలని చూస్తాడు. చెట్లు కనపడితే వాటి వంక చూస్తాడు. ఒక్కోసారి గోడ మాత్రమే ఉంటుంది. అప్పుడు గోడ మీద పడుతున్న నీడల్ని చూస్తాడు. చూడాలి గానీ అన్నిట్లోనూ సౌందర్యం ఉంటుంది. ఎవరో అన్నారు – ‘ప్రపంచంలో ఉన్నవన్నీ అద్భుతాలే అనుకుని జీవించటం ఒక పద్ధతి. అంతా సాధారణమే అనుకుని జీవించటం మరో పద్ధతి. ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి’. నేల అద్భుతం కాదా? గాలి అద్భుతం కాదా? వాన అద్భుతం కాదా? పని విషయానికి వస్తే ఇల్లు ఊడుస్తున్నా, గిన్నెలు తోముతున్నా ‘తప్పదు’ అనుకుని చేస్తే అదే భారమౌతుంది. ‘ఇప్పుడు ఇదే నా పని’ అనుకుని చేస్తే భారం తగ్గుతుంది. హిరయామా ఎవరో వాడిన టాయిలెట్లు కూడా విసుక్కోకుండా శుభ్రం చేస్తాడు. మధ్యాహ్నం పార్కుకి వెళ్ళి శాండ్‌విచ్ తింటాడు. కూడా తెచ్చుకున్న కెమెరాతో చెట్ల ఫోటోలు తీస్తాడు. మొలకలేవైనా కనపడితే పొట్లంలో పెట్టి ఇంటికి తీసుకువచ్చి మిగతా మొక్కలతో పాటు పెడతాడు. సాయంత్రం స్నానానికి పబ్లిక్ బాత్‌రూమ్‌కి వెళతాడు. అక్కడి నుంచి ఒక చిన్న ఆహారపు స్టాల్‌కి వెళ్ళి కాస్త తింటాడు. ఆ స్టాల్ ఓనరుకి అతను బాగా తెలుసు. ఇంటికి వచ్చి పుస్తకం చదువుకుంటూ పడుకుంటాడు. ఏవో తెలియని కలలు వస్తాయి. అతని రోజులన్నీ ఇలాగే ఉంటాయి.

అతనితో పాటు తకాషీ అనే యువకుడు పని చేస్తాడు. “అంత శ్రద్ధగా శుభ్రం చేయక్కరలేదు. మళ్ళీ ఎలాగూ మురికి అయిపోతుందిగా” అంటాడు తకాషీ. హిరయామా ఎక్కువ మాట్లాడడు. తకాషీ మీద విసుగు వచ్చినా సైగల్లోనే “పని చూసుకో” అని చెబుతాడు. తకాషీకి ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉంటుంది. ఆమె పేరు ఆయా. ఒకరోజు తకాషీ హిరయామాని అతని కారు ఇమ్మని అడుగుతాడు. ఆయాని బయటకి తీసుకువెళ్ళటానికి. హిరయామా అయిష్టంగానే కారు ఇస్తాడు కానీ కారులో వెనక కూర్చుంటాడు. అది మామూలు కారు కాదు. వెనక సీటు లేదు. అక్కడ రకరకాల పరికరాలు, వస్తువులూ ఉంటాయి. అన్నీ టాయిలెట్లకి సంబంధించినవే. హిరయామా తన సొంత డబ్బుతో అవి కొన్నాడు. “ఈ ఉద్యోగమంటే నీకు చాలా ఇష్టం కదా? ఎందుకో నాకు అర్థం కాదు” అంటాడు తకాషీ. ఆయా ఒక క్యాసెట్టు తీసి ప్లేయర్లో పెడుతుంది. ఆమెకి క్యాసెట్టు వినటం అదే మొదటిసారి. ఇప్పుడు పాటలన్నీ మొబైల్‌లోనే వింటున్నారు కదా. హిరయామాకి తన క్యాసెట్టు ముట్టుకున్నందుకు ఆమె మీద చిరాకు వస్తుంది కానీ ఆమె పాటని ఆస్వాదిస్తుంటే ఆనందిస్తాడు. “క్యాసెట్లలో శబ్దం బాగా వినిపిస్తుంది” అంటుందామె. ఇప్పటి పరికరాల్లో శబ్దం స్పష్టంగా వినపడుతుంది కానీ, అసలు పాట వినపడదు కదా! అప్పట్లో పాటకే ప్రాధాన్యత. పాట బాగా వినపడే సరికి ఆమెకి కొత్తగా ఉంది. ఆమె తనకి అదనపు షిఫ్ట్ ఉందని మధ్యలో కారు దిగి వెళ్ళిపోతుంది.

తకాషీ కన్ను ఆ క్యాసెట్ల మీద పడుతుంది. ఒక క్యాసెట్టు తీసి చాటుగా ఆయా బ్యాగులో వేస్తాడు. అరుదుగా దొరికేవి ఎక్కువ డబ్బుకి కొని సేకరించేవారు ఉంటారు కదా? అలా ఆ క్యాసెట్లు అమ్మితే డబ్బు వస్తుందని అతని ఆశ. అలాంటి ఒక దుకాణానికి హిరయామాని తీసుకువెళతాడు. క్యాసెట్లు అమ్మించాలని చూస్తాడు. హిరయామా ససేమిరా అంటాడు. “ఆయాని కలవటానికి వెళతాను. డబ్బు కావాలి. డబ్బు లేకపోతే ప్రేమించకూడదా?” అంటాడు తకాషీ. హిరయామా క్యాసెట్లు తన దగ్గర అట్టిపెట్టుకుని తకాషీకి తన దగ్గరున్న డబ్బు ఇస్తాడు. తకాషీ ఎగిరి గంతేస్తాడు. హిరయామాని హత్తుకుని పరుగున వెళ్ళిపోతాడు. హిరయామాకి యౌవనంలో ఉండే కోరికలు తెలుసు. ప్రపంచం మీద అతనికి ద్వేషం లేదు. కానీ ప్రపంచం పోకడలకి దూరంగా ఉంటాడు. ఎవరికీ సూక్తులు చెప్పడు. ప్రపంచం కూడా ఎక్కువగా అతన్ని పట్టించుకోదు. టాయిలెట్లు శుభ్రం చేసేవారిని ఎవరు పట్టించుకుంటారు? అసలు అందుకే అతను ఆ పని ఎంచుకున్నాడేమో అనిపిస్తుంది.

తకాషీకి ఒక స్నేహితుడు ఉంటాడు. అతనికి డౌన్ సిండ్రోమ్ ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారికి మానసిక ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. ఆ స్నేహితుడికి తకాషీ చెవులంటే ఇష్టం. వాటికి పట్టుకుని నిమురుతాడు. తకాషీ “అతను నా చెవులకే స్నేహితుడు. నేను బోనస్ మాత్రమే” అంటాడు. తకాషీ పైకి పైలా పచ్చీసుగా కనపడినా అతనిలో మానవీయ కోణం ఉంది. అది చూసి హిరయామా ఆనందపడతాడు. అందరిలో మంచి గుణాలు ఉంటాయి. అలాగని తకాషీ చెడ్డవాడేమీ కాదు. కుర్రతనం అంతే. హిరయామాకి అది తెలుసు. ఎవరైనా ఆనందంగా ఉంటే హిరయామాకి ఆనందం. అందరి ఆనందమూ తన ఆనందమే అనుకునే స్వభావం. అయితే అతనికి రకరకాల మనుషుల తారసపడుతుంటారు. ఉదాహరణకి పార్కులో శాండ్‌విచ్ తినేటపుడు పక్క బెంచ్ మీద ఒక యువతి కూడా శాండ్‌విచ్ తింటూ ఉంటుంది. హిరయామా పలకరింపుగా నవ్వితే ఆమె నిర్లిప్తంగా చూస్తుంది. అతను పెద్దగా పట్టించుకోడు. ఎవరికి ఏం కష్టాలున్నాయో ఎవరికి తెలుసు?

ఒకరోజు అతను ఒక టాయిలెట్ దగ్గర నుంచి బయల్దేతుండగా ఆయా ఒంటరిగా అతన్ని కలుసుకోవటానికి వస్తుంది. అప్పటికే తకాషీ “ఆయాకీ, నాకూ కుదిరేటట్టు లేదు” అన్నాడు అతనితో. తకాషీ తన బ్యాగ్‌లో వేసిన క్యాసెట్టు ఆయా అతనికి తిరిగి ఇస్తుంది. ఇచ్చే ముందు “ఒకసారి మళ్ళీ వినొచ్చా” అంటుంది. అతను సరే అని కారులో ఆ క్యాసెట్టు వినిపిస్తాడు. విన్నాక “తకాషీ ఏమైనా చెప్పాడా?” అంటుంది. అతను ఇబ్బందిగా నవ్వి ఊరుకుంటాడు. ఆమెకి కన్నీరు ఉబికి వస్తుంది. తమాయించుకుని అతని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. అతను నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఈ సంఘటనని ప్రేక్షకులు తమకి తోచినట్టు అర్థం చేసుకోవచ్చు. నాకు అనిపించినది ఏమిటంటే క్యాసెట్టు దొంగిలించినందుకు ఆయా తకాషీతో గొడవపడింది. తకాషీని దూరం పెట్టింది. అతన్ని క్షమించలేదు, అలాగని మరచిపోలేదు. క్యాసెట్టు తిరిగి హిరయామాకి ఇచ్చేసింది. మళ్ళీ అతన్ని కలుసుకునే అవకాశం లేదని అతనికి ముద్దిచ్చి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. మనకి ఆ కథలు తెలియవు. కాబట్టి అందరినీ దయతోనే చూడాలి. ఈ కాలంలో అందరినీ అనుమానంగా చూడటం మామూలైపోయింది. అది మారాలి.

విమ్ వెండర్స్ ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు. యాభై ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నాడు. తీసినవి కొన్ని చిత్రాలైనా మంచి పేరు గడించాడు. టోక్యోలో పబ్లిక్ టాయిలెట్ల మీద షార్ట్ ఫిల్మ్‌లు తీయమని అతన్ని ప్రభుత్వం వారు ఆహ్వానించారు. ఆ టాయిలెట్లు ఆధునికంగా ఉంటాయి. విమ్ ఏకంగా ఒక సినిమానే తీశాడు. భారీగా సినిమాలు తీయటం కన్నా ఒక జీవితాన్ని పరిశీలించటం ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించాడు. హిరయామాగా నటించిన కోజి యకూషోకి కాన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. నాకు పాప్ సంగీతం పెద్దగా పరిచయం లేదు కానీ ఈ చిత్రంలో ఉపయోగించిన పాటలు ఆహ్లాదంగా ఉంటాయి. ఆ పాటలు తెలిసినవారు ఇంకా ఆస్వాదించగలరు.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

హిరయామా సెలవు రోజున ఏం చేస్తాడు? సంగీతం వింటాడు. గుడికి వెళతాడు. లాండ్రోమ్యాట్‌కి వెళ్ళి బట్టలు వాషింగ్ మెషీన్‌లో ఉతుక్కుంటాడు. ఫోటోలు ప్రింట్ చేయించుకుంటాడు. అతని దగ్గరున్నది పాత కాలపు కెమెరా. ఫోటోలు ప్రత్యేకంగా ప్రింట్ చేయించుకోవాలి. పుస్తకాల షాపుకి వెళ్ళి పుస్తకాలు కొంటాడు. ఇల్లు శుభ్రం చేసుకుంటాడు. ఉద్యోగానికి మాత్రమే కారులో వెళతాడు, మిగతా చోట్లకి సైకిల్ మీదే వెళతాడు. అదే అతనికి వ్యాయామం. సెలవు రోజున సాయంత్రం తనకిష్టమైన రెస్టారెంటుకి వెళతాడు. రెస్టారెంట్ అంటే పెద్దదేమీ కాదు, చిన్నదే. మామా అనే ఆమె నడుపుతుంది. ఆమెకి అతను బాగా తెలుసు. అతను చదివే పుస్తకాల గురించి అడుగుతుంది. ఆమెకి కూడా పుస్తకాలంటే అభిరుచి. “మీరు మేధావులు” అంటుంది. అతను సిగ్గుపడతాడు. ఆమె దగ్గరే కాస్త ఎక్కువ మాట్లాడతాడు. ఆమె అతనికి తిండి పదార్థాలు కాస్త ఎక్కువ ఇస్తోందని మిగతావారు ఆట పట్టిస్తారు. ఆమె పాటలు కూడా పాడుతుంది. అతను కళ్ళు మూసుకుని ఆమె పాటని ఆస్వాదిస్తాడు.

ఒకరాత్రి అతని మేనకోడలు నీకో అతని కోసం ఇంటి బయట వేచి ఉంటుంది. ఆమెని అతను మొదట గుర్తుపట్టడు. తర్వాత “ఎంత ఎదిగిపోయావు!” అంటాడు. ఆ రాత్రి పడగ్గది ఆమెకిచ్చి అతను సామాన్లు పెట్టుకునే చిన్న గదిలో పడుకుంటాడు. మర్నాడు ఆమె పడుకుని ఉండగానే పనికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటాడు. అతని వెళ్ళిపోతే ఆమె ఏం తింటుంది అని ఆలోచించడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చినది తన సంగతి తాను చూసుకోలేదా? అయితే అతను వెళ్ళక ముందే ఆమె నిద్ర లేస్తుంది. “నన్నూ తీసుకువెళ్ళు. లేకపోతే ఎక్కడెక్కడ తిరుగుతానో నాకే తెలియదు” అంటుంది. అతను ఆమెని కూడా తీసుకెళతాడు. ఇంతకీ ఆమె ఎందుకు వచ్చిందో అతను అడగడు. ఆమె ఇష్టంగా ఆమె వచ్చింది. అతను ఇంట్లో చోటిచ్చాడు. ఏదీ పెద్దగా అంటించుకోడు. మర్నాడు ఆమె అతనికి పనిలో సాయం చేస్తుంది. టాయిలెట్లో గచ్చు తుడుస్తుంది. భోజనవిరామంలో అతను ఆమెతో పాటు పార్కులో ఎప్పుడూ కూర్చునే బెంచీ మీద కూర్చుంటాడు. ఎదురుగా ఉన్న చెట్టుని ఆమె ఫొటో తీస్తుంది. అతను కూడా ఫోటో తీస్తాడు. “ఈ చెట్టు నీ ఫ్రెండా?” అంటుందామె. అతను ఆ ప్రశ్నకి విస్తుపోతాడు. “అవును. నా ఫ్రెండే” అంటాడు. చిన్న వయసు అమ్మాయే అలాంటి ప్రశ్న వేయగలదు. పెద్దయ్యాక మనసు మొద్దుబారిపోతుంది.

తర్వాత ఆమె “అమ్మకి నువ్వంటే ఇష్టం లేదా? నీ గురించి ఎప్పుడు మాట్లాడినా మాట మార్చేస్తుంది” అంటుంది. “నువ్వు అమ్మతో దెబ్బలాడావా? ఇలా ఇల్లు వదిలి వచ్చేస్తుంటావా?” అంటాడతను. “ఇదే మొదటిసారి. నీ దగ్గరకే రావాలని ఎప్పుడూ అనుకునేదాన్ని” అంటుందామె. తర్వాత “నీ ప్రపంచమూ, మా ప్రపంచమూ వేరని అమ్మ అంటూ ఉంటుంది” అంటుంది. “ఈ ప్రపంచంలో చాలా ప్రపంచాలు ఉన్నాయి” అంటాడతను. నది మీద బ్రిడ్జిపై సైకిళ్ళ మీద వెళుతుంటారు. ఆమె “ఈ నది సముద్రంలో కలుస్తుంది కదా? అక్కడికి వెళదామా?” అంటుంది. “వచ్చేసారి వెళదాం” అంటాడతను. ఆమె రెట్టిస్తుంది. “వచ్చేసారి వచ్చేసారే. ఇప్పుడు ఇప్పుడే” అంటాడతను. ప్రాచ్య దేశాలకి, పాశ్చాత్య దేశాలకి ఇదే తేడా. పాచ్య దేశాలు కాలాన్ని ఒక చక్రంలా చూస్తాయి. పోయిన క్షణం మళ్ళీ వస్తుందని అనుకుంటాయి. పాశ్చాత్య దేశాలు ఈ క్షణం మళ్ళీ రాదు, ఇప్పుడే అన్నీ అనుభవించాలి అనుకుంటాయి.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేసరికి నీకో తల్లి అక్కడ ఉంటుంది. ఆమెకి పెద్ద కారుంటుంది. డ్రైవరు ఉంటాడు. “నీకో! నీ బ్యాగు తెచ్చుకో. వెళదాం” అంటుంది. అతను కూడ నీకోని తల్లితో వెళ్ళమంటాడు. నీకో అయిష్టంగానే తన బ్యాగు తెచ్చుకోవటానికి వెళుతుంది. నీకో తల్లి అతనికిష్టమైన చాక్లెట్ హిరయామాకి ఇస్తుంది. “నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఇది తీసుకో. నాన్న నర్సింగ్ హోమ్‌లో ఉన్నాడు. ఏం గుర్తు లేదు. వెళ్ళి చూడొచ్చుగా. ఇంతకు ముందులా ప్రవర్తించడు” అంటుంది. అతను తల వంచుకుని అడ్డంగా ఊపుతాడు. వాళ్ళ తండ్రి వారిని సరిగా చూసుకునేవాడు కాదన్నమాట. లేక అతన్నే ఎక్కువ బాధపెట్టేవాడేమో. అతను ఎక్కువగా బంధాలు పెట్టుకోకపోవటానికి అదో కారణం. ఆమె “నువ్వు నిజంగానే టాయిలెట్లు శుభ్రం చేస్తున్నావా?” అంటుంది. అతను తల ఎత్తి చిరునవ్వు నవ్వుతూ అవునన్నట్టు తల ఊపుతాడు. అతనంటే ఆమెకి చులకన. డబ్బు సంపాదిస్తేనే విలువ ఇస్తారు కొందరు కుటుంబసభ్యులు. లేకపోతే తమ పరువేదో వారు తీస్తున్నట్టు భావిస్తారు. ‘నలుగురూ ఏమనుకుంటారు’ అంటారు కానీ ఆ మనిషిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరు. హిరయామా చిరునవ్వులో గర్వమో, ఎగతాళో ఉండదు. కల్మషం లేని నవ్వది. నీకో వచ్చి అతనికి థ్యాంక్స్ చెప్పి కారు ఎక్కుతుంది. అతను నీకో తల్లిని హత్తుకుంటాడు. ఆమె ఒక నిట్టూర్పు విడిచి కారెక్కుతుంది. వాళ్ళు వెళ్ళిపోతారు. అతను కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ప్రపంచాన్ని అతను వదిలినా ప్రపంచం అతన్ని వదలలేదు. ఏడిపించి కానీ వదలలేదు.

మర్నాడు మళ్ళీ పనిలో పడతాడు. తకాషీ ఫోన్ చేస్తాడు. “మీరు నా పట్ల ఎంతో ఆదరణ చూపించారు. నేను పని మానేస్తున్నాను. మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను” అంటాడు. హిరయామాకి మొదటి వచ్చే ఆలోచన “నీ పని ఎవరు చేస్తారు?” అని. అదే అంటాడు. తకాషీ జవాబు చెప్పకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఆ రోజు అతని పని కూడా హిరయామా చేస్తాడు. పని ముగించుకునే సరికి ఆలస్యమవుతుంది. కంపెనీకి ఫోన్ చేసి “ఈ రోజుకి మాత్రమే చేస్తున్నాను. వెంటనే ఇంకొకరిని పెట్టండి” అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. ఏదీ పెద్దగా పట్టించుకోని అతనికి నీకో వెళ్ళిపోగానే అదనపు పని మీద పడటంతో చిరాకు వస్తుంది. అందరికీ ఇలాంటి సందర్భాలు వస్తాయి. ‘ఈ రోజు ఎప్పుడు ముగుస్తుందా’ అనిపిస్తుంది. హిరయామా కూడా దానికి అతీతుడు కాదు. ఆరోజు పుస్తకం చదవకుండానే అలసిపోయి నిద్రపోతాడు.

మర్నాడు ఒక యువతి పనిలో చేరుతుంది. ఆమెకి కారు కూడా ఉంటుంది. గంభీరంగా ఉంటుంది. హిరయామాకి అభివాదం చేసి పనిలోకి దిగుతుంది. ఆమె కూడా తన లాంటిదే అని అతనికి కాస్త సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తకాషీ చేసే అల్లరి అతను మిస్సవుతాడని కూడా అనిపిస్తుంది. కొన్నాళ్ళకి అతను మళ్ళీ పూర్వపు జీవితంలో పడిపోతాడు. ఒక సెలవు రోజున పనులన్నీ చేసుకుని రెస్టారెంట్‌కి వెళతాడు. మూసి ఉంటుంది. రోడ్డు అవతల లాండ్రోమ్యాట్‌లో కూర్చుంటాడు. కాసేపటికి మామా ఒక పురుషుడితో వస్తుంది. రెస్టారెంట్ తెరుస్తుంది. ఇద్దరూ లోపలికి వెళతారు. హిరయామా వెళ్ళి తలుపు తీసే సరికి వారిద్దరూ కౌగిలించుకుని ఉంటారు. ఆమె అతన్ని చూస్తుంది. అతను గబగబా సైకిలెక్కి వెళ్ళిపోతాడు. ఏదో తెలియని బాధ. బీరు, సిగరెట్లు కొనుక్కుని నది ఒడ్డుకి వెళతాడు.

బీరు క్యాన్ ఒకటి తెరిచి తాగుతాడు. సిగరెట్ వెలిగిస్తాడు. వెంటనే దగ్గు వస్తుంది. అప్పుడే రెస్టారెంట్లో మామాతో ఉన్నతను అక్కడికి వస్తాడు. అతన్ని చూసి హిరయామా ఖంగు తింటాడు. అతను సిగరెట్ అడుగుతాడు. సిగరెట్ అంటించగానీ అతనికి కూడా దగ్గు వస్తుంది. హిరయామాకే కాదు అతనికి కూడా దుఃఖం ఉందనే సూచన ఇది. మనమందరం మన కష్టాలే పెద్దవి అనుకుంటాం. అందరికీ కష్టాలు ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి. ఆ వ్యక్తి “నేను మామా మాజీ భర్తని” అంటాడు. హిరయామా “అలాగా” అంటాడు. ఆ వ్యక్తి “నేను మళ్ళీ పెళ్ళి చేసుకున్నాను. మామాని చూసి ఏడేళ్ళు అయింది. నాకు క్యాన్సర్ వచ్చింది. బాగా ముదిరింది. మామాని చూడాలనిపించింది” అంటాడు. హిరయామా గంభీరంగా వింటాడు. అతనికో బీరు క్యాన్ ఇస్తాడు. ఇద్దరూ బీరు తాగుతారు. ఆ వ్యక్తి “మామాని జాగ్రత్తగా చూసుకోండి” అంటాడు. “మా మధ్య ఏమీ లేదు” అంటాడు హిరయామా. “మీరు ఆమెని చూసుకుంటారనే నేను ఆశిస్తున్నాను” అంటాడతను.

తర్వాత ఆ వ్యక్తి హఠాత్తుగా “నీడలు ఒక దాని మీద ఒకటి పడితే మరింత నల్లబడతాయా?” అంటాడు. ఇలాంటి వింత ఆలోచనలు అందరికీ వస్తాయి. హిరయామా “చూద్దాం పదండి” అని తన నీడ, అతని నీడ ఒకదాని మీద ఒకటి పడేలా నిలబడతాడు. అతను “నాకేం తేడా కనపడటం లేదు” అంటాడు. హిరయామా “మరింత నల్లబడింది” అంటాడు. తర్వాత హిరయామా “నీడని తొక్కే ఆట ఆడదాం” అంటాడు. ఈ ఆటలో అవతలి వారు మన నీడ తొక్కితే మనం ఓడిపోయినట్టన్న మాట. ఇద్దరూ నవ్వుకుంటూ ఆ ఆట ఆడతారు. జీవితాన్ని కూడా ఆటగా భావిస్తే చింత తగ్గుతుంది. ఇప్పుడు ఆటలనే మరీ గంభీరంగా తీసుకుని గెలుపోటముల గురించి మథనపడుతున్నాం. అందుకే ఇంత అసంతృప్తి. హిరయామా జీవితమనే ఆటలో పండాడు. గెలుపోటములకి అతీతంగా. చివరికి హిరయామా మరో కొత్త రోజు ప్రారంభించటంతో చిత్రం ముగిస్తుంది. ‘ఫీలింగ్ గుడ్’ అనే పాట వింటూ వెళతాడు. సముద్రంలో చేపలా, ప్రవహించే నదిలా స్వేచ్ఛగా ఉండాలని ఆ పాటలో భావం.

చాలామంది ఇష్టం లేని ఉద్యోగాలలో పని చేస్తూ ఉంటారు. దేవుడు అందరికీ ఏదో ప్రతిభ ఇస్తాడు. ఆ ప్రతిభకి తగిన పని ఎన్నుకుంటే సంతోషంగా ఉండొచ్చు. డబ్బు కోసం ఏదో ఉద్యోగంలో చేరితే కొన్నాళ్ళకి అసంతృప్తి తలెత్తుతుంది. అదే ఒత్తిడికి దారి తీస్తుంది. అలాగని హఠాత్తుగా ఉద్యోగం వదిలేయమని కాదు. కోరుకున్న రంగంలో ప్రవేశించటానికి ప్రయత్నించాలి. వ్యూహాత్మకంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. డబ్బు తక్కువైనా ఆనందం సొంతమవుతుంది. నలుగరూ ఏమనుకుంటారు అనే ఆలోచన మానుకోవాలి. హిరయామాకి కళలంటే ఇష్టం. ఫోటోలు బాగా తీస్తాడు. కానీ ఆత్మానందం కోసమే. దాని ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా అతను డబ్బు కోరుకోడు. టాయిలెట్లు శుభ్రం చేస్తే వచ్చే డబ్బు అతనికి చాలు. అది అతని సొంత నిర్ణయం. అతను ఆనందంగానే ఉన్నాడు. రేపేమవుతుంది అనే చింత లేదు. ఇది మంచి పద్ధతేనా? అతని వరకూ అది మంచి పద్ధతే. ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి. జపాన్ లాంటి దేశాల్లో వృధ్ధులకి ప్రభుత్వ సాయం ఉంటుంది. అది లేని దేశాల్లో రేపటి గురించి ఆలోచించక తప్పదు. కానీ అసంతృప్తి రాకుండా చూసుకోవాలి.

Exit mobile version