[సంచిక పాఠకుల కోసం ‘పీపుల్ ప్లేసెస్ థింగ్స్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
‘పీపుల్ ప్లేసెస్ థింగ్స్’ అనే మాట వ్యసనపరుల విషయంలో వాడతారు. కొందరు మనుషులను (పీపుల్), కొన్ని చోట్లను (ప్లేసెస్), కొన్ని వస్తువులను (థింగ్స్) చూస్తే వారికి వారి వ్యసనం గుర్తుకొస్తుంది. అది మద్యం వ్యసనం కావచ్చు, డ్రగ్స్ వ్యసనం కావచ్చు. కాబట్టి ఆ మనుషులకి, చోట్లకి, వస్తువులకి దూరంగా ఉండాలని వారికి సూచన చేస్తారు నిపుణులు. కానీ ‘పీపుల్ ప్లేసెస్ థింగ్స్’ (2015) చిత్రంలో అలాంటి వ్యసనపరులు ఎవరూ లేరు. ఇది ముఖ్యంగా ఒక విడిపోయిన జంట కథ. వారికి ఇద్దరు కవల అమ్మాయిలు ఉంటారు. పిల్లలు లేకపోతే ఒకరికొకరు దూరంగా ఉండవచ్చు, కానీ పిల్లలున్నాక మనుషులని కలవక తప్పదు. వారి కథ కన్నా పిల్లల మీద పడే ప్రభావం ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించటం నాకు నచ్చింది. విడిపోవాలనుకునే జంటలు ఈ చిత్రం చూడాలి. మరో విశేషమేమిటంటే ఈ చిత్రం హాస్యప్రధానంగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. హిందీ శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది.
విల్ బొమ్మల నవలలు రాస్తాడు (గీస్తాడు అనాలేమో). అతను కాలేజీలో టీచర్ కూడా. బొమ్మలు వేయటంలో ఉన్న మెళకువలు నేర్పిస్తాడు. అతని సహచరి చార్లీ (ఆడవారు కూడా ఈ పేరు పెట్టుకుంటారు). వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. వారికి ఐదేళ్ళ కవల అమ్మాయిలు ఉన్నారు. వారి పుట్టినరోజు నాడు చార్లీ గ్యారీ అనే ఒక మోనోలాగిస్ట్ (ఏకపాత్రాభినయం చేసే నటుడు)తో సంబంధం పెట్టుకుందని విల్‌కి తెలుస్తుంది. ఇద్దరూ ఒక గదిలో కలిసి ఉండగా విల్ ఆ గదిలోకి వెళతాడు. ఆమె “నువ్వే నన్ను ఈ సంబంధంలోకి నెట్టావు” అంటుంది. తొందరపడి ఆమెని తప్పుబట్టవద్దు. చిత్రం సాగుతున్న కొద్దీ ఆమె చెప్పినది నిజమేమో అనిపిస్తుంది. అతను “మనం సంతోషంగానే ఉన్నాం కదా?” అంటాడు. ఆమె లేదంటే “సంతోషం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండదు” అంటాడు. ఆమె గ్యారీ వైపు తిరిగి “చూశావా?” అంటుంది. గ్యారీ కాస్త లావుగా ఉంటాడు. అతను ఆమెతో “తొందరపడకు. అతనికి ఒక్కసారిగా ఇదంతా అర్థం చేసుకోవటం కష్టం కదా” అంటాడు. అతను వేళాకోళంగా కాకుండా సహానుభూతితో మాట్లాడాడు. ఇది చాలా అరుదు. ఇక్కడే హాస్యం పుడుతుంది. ఆ సమయంలో గ్యారీ ఏం మాట్లాడినా లాభం లేదు. ఆ సందర్భం అలాంటిది. విల్‌కి కోపం వస్తుంది. గ్యారీ మీద కలబడతాడు. అతని పద్ధతి నచ్చక చార్లీ “విల్. ఇట్స్ ఓవర్” అంటుంది. గుట్టు రట్టయిన తర్వాత ఇంక కలిసి ఉండి లాభం ఏమిటి ఆమె భావం. చివరికి ఆమె “ఐ లవ్ యూ. కానీ నా జీవితం ఏం బాగాలేదు” అంటుంది. ఇద్దరూ విడిపోతారు.
కొన్ని జంటలు ఇలాగే ఉంటాయి. ఒకరికి ఏదో అసంతృప్తి బయల్దేరుతుంది. అలాంటప్పుడు మనసు విప్పి మాట్లాడుకుంటే బావుంటుంది. కానీ ఏ కారణం చేతో మాట్లాడుకోరు. ఇక్కడ విల్ తన ప్రపంచంలో తాను ఉండిపోయాడు. పిల్లల బాధ్యత చాలావరకు చార్లీ మీద పడింది. ఆమెకి నటి కావాలని కోరిక. గ్యారీ పరిచయమయ్యాడు. అతను ఆమెని అర్థం చేసుకోగలడని అనిపించింది. మరి పిల్లల సంగతి ఏమిటి? ఈ కాలంలో పిల్లలే ఎక్కువ నలిగిపోతున్నారు. పిల్లల కోసం పెద్దలు సర్దుకుపోలేరా? తల్లే సర్దుకుపోవాలా అని కొందరు అనవచ్చు. ముమ్మాటికీ కాదు. కానీ బంధం తెంచుకునే ముందు దాన్ని సరిచేసుకోవటానికి ప్రయత్నించాలి. విల్ నలుగురితో కలవటం ఇష్టంలేని మనిషి. తన పనేదో తాను చేసుకుంటాడు. కానీ ఒక బంధంలో అడుగుపెట్టాక అలా ఉండటం కుదరదుగా. అలా కాదంటే బంధమే పెట్టుకోకూడదు.
ఒక సంవత్సరం గడిచిపోతుంది. పిల్లలు చార్లీ దగ్గర ఉంటారు. ఆమె వారిని ప్రేమగా, క్రమశిక్షణగా పెంచుతుంది. గ్యారీ ప్రోత్సాహంతో నటనలో శిక్షణ తీసుకుంటూ ఉంటుంది. విల్ ఇల్లు విడిచి ఒక అపార్ట్‌మెంట్లో ఉంటున్నాడు. నిజానికి విల్‌కి, చార్లీకి పెళ్ళి కాలేదు. కాబట్టి అతను ఆమెకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ పిల్లల కోసం అతను ఇల్లు చార్లీకే ఇచ్చేశాడు. వారాంతాలలో పిల్లలు విల్ దగ్గరకి వస్తారు. అతను కూడా వారిని ప్రేమగా చూసుకుంటాడు. కానీ క్రమశిక్షణ ఉండదు. పిల్లలకి క్రమశిక్షణ లేకపోతేనే హాయిగా ఉంటుంది. మరో పక్క విల్ తన కథనే బొమ్మలుగా వేస్తుంటాడు. ఒక ఏడాది గడిచినా అతను చార్లీని మరచిపోలేక బాధపడుతూ ఉంటాడు. నిజానికి అతని అహం దెబ్బ తింది. కోలుకోలేకపోతున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు చార్లీ “నేను గర్భవతిని. గ్యారీని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. అతను నన్ను నటిగా ఎంతో ప్రోత్సహిస్తున్నాడు” అంటుంది. అమెరికా సమాజంలో పెళ్ళి కాకుండా పిల్లలని కనటం ఆమోదయోగ్యమే. ఆమె గతంలో విల్‌ని పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకోలేదు. పెళ్ళి చేసుకుంటే బంధం పలచపడిపోతుందని ఆమె భావన. ‘స్వయంవరం’ (వేణు, లయ నటించినది) సినిమా గుర్తుందా? పెళ్ళి చేసుకుంటే గొడవలు మొదలవుతాయని నాయకుడు పెళ్ళి చేసుకోనంటాడు. చార్లీ అలాంటిదే. ఇప్పుడు మాత్రం పెళ్ళి చేసుకోవాలనుకుంటోంది. ఆమెకి తన మీద లేని నమ్మకం గ్యారీ మీద కలిగిందని అతనికి కోపం వస్తుంది.
ఆ కోపమంతా తన క్లాసులో బయటపెడతాడు. “నా మాజీ ప్రేయసి నన్ను వదిలిపోయింది. ఇప్పుడు వేరొకరిని పెళ్ళిచేసుకుంటోంది. అతను నా ఇంట్లో ఉంటాడు. నా కూతుళ్ళతో నాకన్నా ఎక్కువ సమయం గడుపుతాడు” అంటాడు తన విద్యార్థులతో. వాళ్ళు విస్తుపోతారు. ఒక అమ్మాయి అందరూ వెళ్ళిపోయాక అతని దగ్గరకి వస్తుంది. ఆమె పేరు క్యాట్ (‘సి’ తో మొదలయ్యే క్యాట్ కాదు, ‘కె’ తో మొదలయ్యే క్యాట్). “మా ఇంటికి భోజనానికి రండి. మా అమ్మని కలవండి” అంటుంది. ఆమె తల్లి సింగిల్ పేరెంట్. క్యాట్ విల్‌ని ఎందుకు ఆహ్వానించింది? విల్ పద్ధతి చూస్తే చాలామంది అతని దూరంగా పారిపోతారు. కానీ అలాంటివారిలో ఉన్న బాధని కొందరు చూడగలుగుతారు. పైగా విల్ క్లాసు బాగా చెబుతాడు. క్యాట్ తన తల్లిని, విల్‌ని డేటింగ్ చేయమనే ఉద్దేశంతోనే అతన్ని రమ్మంది. డేటింగ్ అంటే ముఖ్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి కలుసుకుని మాట్లాడుకోవటం. ఇది శృంగారానికి కూడా దారి తీయవచ్చు కానీ మామూలుగా ఒక తోడు వెతుక్కోవటానికే డేటింగ్ చేస్తారు.
విల్ క్యాట్ తల్లిని కలవటానికి వెళతాడు. ఆమె పేరు డయాన్. నిజానికి ఆమె విల్ కన్నా వయసులో పెద్ద. కానీ విల్ కుంగుబాటు కారణంగా వయసు మీద పడినట్టు కనపడతాడు. డయాన్‌కి క్యాట్ ఎంచుకున్న కోర్సు అంటే సదభిప్రాయం లేదు. బొమ్మలు వేస్తే ఏం వస్తుంది అనే రకం. ఆమె యూనివర్సిటీలో సాహిత్యం బోధిస్తుంది. కూతురు కోర్సే నచ్చనిది కోర్సు చెప్పే టీచరుని మెచ్చుతుందా? ఆమె ముందే విల్‌తో “నేను వేరొకరితో డేటింగ్ చేస్తున్నాను. అతనంటే ఇష్టమా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను కానీ ఒకేసారి ఇద్దరితో డేటింగ్ చేయను” అని చెప్పేస్తుంది. కానీ క్యాట్ కోసం ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఆమె అతను రాసే బొమ్మల నవలలని కామిక్ బుక్స్ అని చులకన చేసి మాట్లాడుతుంది. అతను కామిక్ బుక్స్ కూడా సాహిత్యమే అంటాడు. ఆమె అతను రాసిన ఒక కామిక్ బుక్ చదివింది. “మీ చిన్ని బుక్ నాకు నచ్చింది” అంటుంది. చిన్ని బుక్ అనటంలోనే న్యూనతాభావం ఉంది. అతను “చిన్ని బుక్కా? భలే” అంటాడు చిరాకుగా. తాను తెచ్చిన వైన్ సీసా తిరిగి ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు. మామూలుగా ఎవరి ఇంటికైనా ఏదైనా పదార్థం తీసుకెళితే మిగిలిన పదార్థం తిరిగి తీసుకువెళ్ళటం మర్యాద కాదు. కానీ అతనికి చిరాకు రావటంతో ఆ పని చేస్తాడు. ఇదంతా హాస్యస్ఫోరకంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నంత సేపూ క్యాట్ కాస్త దూరాన కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. అతను వెళ్ళిపోయాక క్యాట్ తల్లిని “డేట్ ఎలా జరిగింది?” అని అడుగుతుంది. “కాస్త పొగరుగా ఉన్నాడు” అంటుంది డయాన్. “నీకూ పొగరు ఉందిగా” అంటుంది క్యాట్. డయాన్‌కి బొమ్మలు వేసే పని నచ్చదు. అందుకని క్యాట్‌ని వేరే కోర్సు చేయమంది. విల్‌ని అవమానించింది. విల్ మాటకి మాట జవాబు చెప్పాడు. అది పొగరైతే డయాన్‌దీ పొగరే.
చార్లీ పెళ్ళి చేసుకోబోతోందని తెలిసింది. డయాన్ అతన్ని అవమానించింది. దాంతో విల్ కసిగా ఉంటాడు. పిల్లలని తన వైపు తిప్పుకోవటానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తాడు. అలాగని అతను తల్లి విషయంలో పిల్లల మనసులు విరచటానికి ప్రయత్నించడు. పిల్లలని వారాంతంలో ఒక అడవిప్రాంతానికి క్యాంపింగ్ తీసుకెళతాడు. పిల్లలకి తమ తల్లి గ్యారీని పెళ్ళి చేసుకోబోతోందని తెలుసు. కానీ వారికి అర్థం కాదు. ఆరేళ్ళ పిల్లలకి ఏం అర్థమవుతుంది? “అమ్మకి నువ్వంటే ఇష్టం లేదా?” అంటుంది ఒక పాప. “అదేం లేదు” అంటాడు విల్. “మరి అమ్మ గ్యారీని ఎందుకు పెళ్ళి చేసుకుంటోంది?” అంటుంది రెండో పాప. “మీకు అర్థం కాదు” అంటాడు విల్. “అమ్మ చెడ్డది” అంటుందా పాప ఒక తిట్టుపదం వాడుతూ. “నువ్వు అమ్మని తిట్టావని అమ్మకి చెబుతాను” అంటుంది మొదటి పాప. విల్ ఇద్దరినీ శాంతపరుస్తాడు. తర్వాత ఒక పాప “నువ్వు ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నావా?” అంటుంది. లేదంటాడు విల్. ఆ పాప “హమ్మయ్య” అంటుంది.
చిన్నారి మనసులు ఎంత నలిగిపోతాయో ఈ సన్నివేశంలో తెలుస్తుంది. వారికి తల్లీ తండ్రీ ఒకరినొకరు ప్రేమించుకోవటమే కావాలి. మధ్యలోకి ఎవరైనా వస్తే తట్టుకోలేరు. ఒకవేళ మధ్యలోకి ఎవరూ రాకపోయినా అమ్మా నాన్న వేరుగా ఎందుకుంటున్నారో అర్థం కాదు. కొందరు పిల్లలైతే తాము చేసిన మారాం వల్లో, చిలిపి పనుల వల్లో తండ్రి (లేదా తల్లి) తమని వదిలి వెళ్ళిపోయాడని అనుకుంటారు. అది మరీ హృదయవిదారకం. ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. చార్లీ పిల్లలని చెల్లో (పెద్ద వయొలిన్ లాంటి వాద్యం) క్లాసులకి పంపిస్తుంది. ఫ్రెంచ్ క్లాసులకి పంపిస్తుంది. మన దేశంలో మూడు భాషలు అలవోకగా నేర్చుకుంటాం కానీ అమెరికాలో రెండో భాష నేర్చుకునేవారు తక్కువ. అలా నేర్చుకుంటే మెదడు వికసిస్తుంది. పిల్లల విద్యాభ్యాసం విషయంలో చార్లీ శ్రద్ధ తీసుకుంటోంది. ప్రేమకి కూడా కొదవ లేదు. కానీ తలిదండ్రులు వేరువేరుగా ప్రేమించటం వేరు, కలిసి ఉండి ప్రేమించటం వేరు. విల్ కూడా పిల్లల కోసం తన వంతు ధనసహాయం చేస్తాడని వేరే చెప్పక్కరలేదు.
పిల్లలని వారాంతాలలోనే కాక వారంలో కొన్నిరోజులు తాను చూసుకుంటానని విల్ చార్లీతో అంటాడు. “స్కూల్ దూరమవుతుంది” అని ఆమె అంటే “నేను స్కూలుకి దగ్గర ఒక ఇల్లు తీసుకుంటాను” అంటాడు. “అంత ఖర్చు భరించగలవా?” అంటుందామె. “నాకు పిల్లలు కావాలి” అంటాడతను కాస్త మొండిగా. ఆమెకి న్యూనతాభావం కలిగించటానికి “గ్యారీ ఏడి?” అంటాడు. గ్యారీ చార్లీతో నివసిస్తున్నాడని అతను అనుకున్నాడు. “అతనికి వేరే అపార్ట్‌మెంట్ ఉంది. పని కోసం అక్కడికి వెళతాడు” అంటుంది. “అదేంటి వింతగా?” అంటాడు విల్. విడిపోయిన జంటల్లో ఇలాంటి దెప్పిపొడుపులు మామూలే. ఆమె కొంచెం సున్నితం. “నిజమే కదా. అలాంటి వాడితో పెళ్ళి కరెక్టేనా?” అని తనలో తనే అనుకుంటున్నట్టు అంటుంది. అతను మౌనంగా ఉంటాడు. లోలోపల సంబరపడుతున్నాడని ఊహించటం కష్టం కాదు. క్లాసులో కూడా ఉత్సాహంగా ఉంటాడు. ఒక రాత్రి చార్లీ పిల్లలని తీసుకుని అతని అపార్ట్‌మెంట్‌కి వస్తుంది. పిల్లలని చూసుకునే ఆయా పని మానేసిందని, పిల్లలని చూసుకోమని అంటుంది. అతను అడగటమైతే అడిగాడు కానీ హఠాత్తుగా పిల్లలు వచ్చేసరికి తబ్బిబ్బు పడిపోతాడు. ఆమె మీద కసితోనే అతను పిల్లలని అడిగాడు. నిజానికి అతనికి పిల్లలని చూసుకునే చాకచక్యం లేదు. కానీ తప్పదు. కుదరదంటే పెద్ద గొడవైపోతుంది.
ఈ చిత్రానికి స్కీన్‌ప్లే, దర్శకత్వం జేమ్స్ స్ట్రౌస్. హాస్యాన్ని బాగా పండించాడు. జెమెయిన్ క్లెమెంట్, స్టెఫనీ యాలైన్, రెజీనా హాల్ ముఖ్యపాత్రల్లో నటించారు. క్లాసులో జరిగే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. బొమ్మకీ బొమ్మకీ మధ్య ఉన్న ఖాళీలో అర్థం ఉంటుందని విల్ చెబుతాడు. తన కథకి విల్ వేసిన బొమ్మలు చిత్రం పొడుగునా ప్రముఖంగా కనిపిస్తాయి. చిత్రలేఖనానికి, కథారచనకి మధ్య ఉండే ఈ ప్రక్రియ ఎంత ప్రభావవంతమైనదో ప్రేక్షకులమైన మనకి కూడా అవగతమవుతుంది. విల్ ఒకసారి క్లాసులో “Misery is inexorably linked to happiness” అంటాడు. సుఖం వెనుకే దుఃఖం వస్తుంది అని భారతీయ వేదాంతశాస్త్రం చెప్పిన మాటే ఇది. మన కర్తవ్యం మనం చేస్తే దుఃఖం వచ్చినా పశ్చాత్తాపం ఉండదు. కర్తవ్యం విస్మరిస్తే వచ్చే దుఃఖం తట్టుకోవటం కష్టం.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
పిల్లలని చూసుకోవటానికి విల్ నానాతంటాలు పడుతూ ఉంటాడు. చార్లీ ఫోన్ చేస్తే అంతా బాగా ఉన్నట్టు అబద్ధాలు చెబుతాడు. ఒకరోజు బాంబు బెదిరింపు వల్ల స్కూలు మూసేస్తారు. పిల్లలని ఎక్కడ వదలాలో విల్‌కి అర్థం కాదు. అతను క్లాసు చెప్పటానికి వెళ్ళాలి. దిక్కు తోచక అతను క్యాట్ ఇంటికి వెళతాడు. ఆమె అతని క్లాసుకు రావాలి, కానీ పిల్లలని చూసుకోమని ఆమెకి అప్పగిస్తాడు. ఆమెకిదంతా నచ్చదు కానీ అతనికి వేరే దారి లేదని ఒప్పుకుంటుంది. రాత్రి అతను తిరిగి వెళ్ళేసరికి డయాన్ ఉంటుంది. పిల్లలు అప్పటికే పడుకున్నారు. ఆమె అతన్ని చీవాట్లేస్తుంది. “పిల్లలకి స్థిరత్వం ఉండాలి. ఇలా ఇష్టమొచ్చినట్టు వారిని వదిలేయటం సరి కాదు” అంటుంది. ఎంత నిజం! తమ ఇంట్లో కాక ఎక్కడో ఉండాల్సి రావటం పిల్లలకి లేని భయాలు కలిగిస్తుంది. తల్లీ తండ్రీ తమని పట్టించుకోరనే భావన కలిగిస్తుంది.
పిల్లలని నిద్ర లేపటం మంచిది కాదని అతన్ని ఆ రాత్రి అక్కడే ఉండమంటుంది డయాన్. మాటల్లో “క్యాట్ మనం ఒకరికొకరు నచ్చలేదని నిరాశపడింది” అంటుందామె. ఆమె మంచం పక్కన ఒక బొమ్మల నవల ఉంటుంది. తాను ఆ నవల చదువుతున్నానని, కామిక్ బుక్స్‌లో కూడా భావోద్వేగాల కథలు ఉన్నాయని తెలిసిందని అంటుంది. క్యాట్ ఎంచుకున్న కోర్సు మీద దురభిప్రాయం పోయిందని అంటుంది. అందుకు అతనికి కృతజ్ఞతలు చెబుతుంది. అతనికి సందు దొరికినట్టు ఉంటుంది. “అప్పుడు ఒకతను నచ్చాడో లేదో తెలీదని అన్నారే. అతన్ని ఇంకా డేట్ చేస్తున్నారా?” అంటాడు. అమెరికన్ సమాజంలో ఎన్ని బాదరబందీలున్నా తోడు కోసం వెతకటం ఆపరు. సెక్స్ కోరుకోవటం కూడా ఒక కారణం. ఆమె “లేదు. మీరు వచ్చి వెళ్ళిన మర్నాడే అతన్ని వదిలేశాను” అంటుంది. తర్వాత ఇద్దరూ ముద్దు పెట్టుకుంటారు. శృంగారానికి కూడా సిద్ధమవుతారు. పిల్లలు పక్క గదిలో ఉండగా ఇలా ప్రవర్తించటం డయాన్ పాత్ర స్వభావానికి అతకలేదని నాకనిపించింది. ఏమైనా ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు. ఆమె “నాకు అబద్ధాలు మాత్రం చెప్పకండి. ఇంతకు ముందు అబద్ధాలు చాలా విన్నాను” అంటుంది. అతనితో బంధానికి ఆమె షరతు అది. ఆమె అబద్ధాలు చెప్పే మగవాళ్ళతో విసిగిపోయింది. అతను “నాకర్థమైంది. నా మనసు కూడా ఒకసారి గాయపడిన మనసే” అంటాడు. “మిమ్మల్ని చూడగానే అర్థమయింది. అందుకే మీరు నాకు నచ్చారు” అంటుందామె. ఒక పాప నిద్ర లేచి “నాన్నా” అని పిలవటంతో విల్ పిల్లలు పడుకున్న గదిలోకి వెళతాడు. విల్ లాగ కుంగిపోయిన వారికి కూడా ఎవరో ఒకరు తోడు దొరుకుతారు. కానీ పాత తప్పులు చేయకుండా ఉంటేనే కొత్త బంధాలు నిలబడతాయి. మరి కొత్త తప్పులు చేస్తే?
మర్నాడు క్యాట్ తన గదిలో విల్ పడుకుని ఉండటం చూసి అతన్ని లేపుతుంది. ఆమె రాత్రంతా ఎక్కడుంది? అదే అతను అడుగుతాడు. “ఆ సంగతి మీకెందుకు?” అంటుందామె. తల్లే స్వేచ్ఛ ఇచ్చినపుడు అడగటానికి అతనెవరు? అతను “పిల్లలని చూసుకున్నందుకు ఎంత ఇవ్వను?” అంటాడు. డబ్బులు తీసుకుని ఒక రోజు పిల్లలని చూసుకోవటం అమెరికాలో మామూలే. డబ్బులు ఇవ్వకపోతేనే తప్పు. క్యాట్ “నేనో పుస్తకం రాశాను. మీరు చూసి మీ అభిప్రాయం చెప్పండి చాలు” అంటుంది. విల్ ఆ పుస్తకం తీసుకుంటాడు. తర్వాత పిల్లలని స్కూలుకి తీసుకువెళతాడు. ఒక పాప “నువ్వు క్యాట్‌ని పెళ్ళి చేసుకుంటావా?” అంటుంది. పిల్లలకి తమ చుట్టూ జరిగే సంఘటనలు చూసి ఇలాంటి అనుమానాలు రావటం సహజమే. పిల్లలని ఇలాంటి పరిస్థితిలోకి నెట్టడం తలిదండ్రుల తప్పు. రెండో పాప “నాకు అమ్మ కావాలి” అని ఏడవటం మొదలుపెడుతుంది. ఇది చూసి మనసు ఉసూరుమంటుంది.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
పిల్లలు అయోమయంలో ఉన్నారని విల్ చార్లీకి చెబుతాడు. నెపమంతా ఆమె మీద నెట్టాలని అతని ప్రయత్నం. ఆమె గ్యారీని పెళ్ళి చేసుకోవాలనుకోవటమే కారణమన్నట్టు మాట్లాడతాడు. కానీ ఆడవారు మగవారి కన్నా నాలుగు రెట్లు తెలివైనవారు. “నువ్వు ఎవరినో డేటింగ్ చేస్తున్నావు కదూ?” అంటుందామె. అతను అవునూ, కాదని చెప్పడు. ఆమెకి రూఢి అయిపోతుంది. అతనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతుంది. “నేను మొదట నిన్ను చూసుకున్నాను. తర్వాత పిల్లలని చూసుకున్నాను. నన్ను ఎవరూ చూసుకోలేదు” అంటుంది. అతని ప్రయత్నం బెడిసికొట్టింది. తర్వాత విల్ డయాన్‌ని కలుస్తాడు. ఆమె అతని గతం గురించి అడుగుతుంది. అతను చెబుతాడు. “చార్లీ సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. చలాకీగా ఉండేది. నేను నెమ్మదస్తుడిని. నన్ను ఎంతో ప్రోత్సహించింది. నా మీద నాకన్నా ఆమెకే నమ్మకం ఎక్కువ. కొన్నాళ్ళకి ఆమె ముభావంగా ఉండటం మొదలెట్టింది. నేను ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదించటం మొదలెట్టాను. అదే నా తప్పు” అంటాడతను. అతనికి తన తప్పు తెలుసు. కానీ గతాన్ని మార్చలేడుగా.
ఒక రాత్రి పిల్లలు తల్లి దగ్గర ఉన్నప్పుడు ఒక పాప నాన్నతోనే ఉంటాను అని బాత్రూమ్‌లోకి వెళ్ళి గడియ వేసుకుంటుంది. రెండో పాప కూడా ఆ పాపతోనే ఉంటుంది. చార్లీ విల్‌ని ఫోన్ చేసి పిలిపిస్తుంది. చార్లీ “ఇదంతా నీ తప్పే. నువ్వు నాతో ఎప్పుడూ సరదాగా ఉండేవాడివి కాదు. పిల్లలతో మాత్రం ఆటలాడతావు. క్యాంపింగ్‌కి తీసుకెళతావు” అంటుంది. అప్పుడే సరదాగా ఉండి ఉంటే విడిపోయేవాళ్ళం కాదు కదా అని ఆమె భావన. విడిపోయిన జంటల్లో ఇలాంటి భావాలు రావటంలో ఆశ్చర్యం లేదు. విడిపోయాక మనుషులు కొంతైనా మారతారు. ఈ మార్పేదో ముందే వచ్చి ఉంటే బావుండేదని అవతలి వారు అనుకుంటారు. అప్పటికే ఆలస్యమైపోతుంది. కొన్ని జీవితాలింతే. చార్లీ “నీ ప్రేయసి గురించి గ్యారీకి చెప్పాను. అతను నాకు నువ్వంటే అసూయ అన్నాడు. అలా నేను నీ గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటే పెళ్ళి చేసుకోవటం సబబేనా అని ఆలోచిస్తున్నాడు. నాకంతా అయోమయంగా ఉంది” అని కన్నీరు పెట్టుకుంటుంది. జీవితాలని సంక్లిష్టం చేసుకోవటం అంటే ఇదే. అహాలని పక్కన పెట్టి మాట్లాడుకుంటే ఇంత బాధ ఉండదు. ముందు ఉండాల్సింది ఈ బంధం తెంచుకోను అనే పట్టుదల. పిల్లలున్నప్పుడైతే ఈ పట్టుదల పది రెట్లు ఉండాలి. పిల్లల పెరిగే వరకు వారి బాధ్యత తలిదండ్రులదే. ఆ బాధ్యత తప్పించుకోవటం పాపమే అవుతుంది. చట్టం విడిపోవటానికి అనుమతిస్తుంది కానీ చట్టం వేరు, ధర్మం వేరు. ధర్మంగా ఉన్నప్పుడే మనశ్శాంతి ఉంటుంది. లేకపోతే వయసు పెరిగేకొద్దీ పశ్చాత్తాపాలు పెరుగుతాయి.
విల్ చార్లీని ఓదారుస్తాడు. ఇద్దరూ ముద్దు పెట్టుకుంటారు. పిల్లలు అప్పుడే బాత్రూమ్‌లోంచి బయటికొస్తారు. పిల్లలకి ఐస్ క్రీమ్ కొనిచ్చి వారిని ఏమారుస్తారు. విల్ డయాన్‌కి తాను చార్లీని ముద్దు పెట్టుకున్నానని చెప్పేస్తాడు. ఆమె అబద్ధాలు చెప్పవద్దని అంది కదా. డయాన్ అతనికి బ్రేకప్ చెప్పేస్తుంది. చార్లీ మాత్రం గ్యారీకి తాను విల్‌ని ముద్దు పెట్టుకున్నానని చెప్పదు. “చెప్పాలి కదా” అంటాడు విల్ కసిగా. “అదంత పెద్ద విషయం కాదు” అంటుంది చార్లీ. విల్ హతాశుడవుతాడు. చివరికి గ్యారీ చార్లీతో పెళ్ళికి ఒప్పుకుంటాడు. విల్ కుంగిపోయి ఉంటాడు. ఏ పనీ చేయలేక క్యాట్ రాసిన బొమ్మల పుస్తకం తిరగేస్తాడు. ఆమెని కలిసి పుస్తకం బావుందని చెబుతాడు. తన కథతో రాసిన పుస్తకం ఆమెకి ఇస్తాడు. ఆమె అభిప్రాయం చెప్పమంటాడు. ఆమెకి అది అతని కథ అని తెలిసిపోతుంది. అందులో ఆమె తల్లి కూడా ఒక పాత్రే కదా. “మీరు చార్లీని మరచిపోవటమే మంచిది. మా అమ్మతో రాజీ చేసుకోండి” అంటుంది.
చార్లీ పెళ్ళి రోజు వస్తుంది. విల్ వెళతాడు. అందరూ ఉంటారు కానీ చార్లీ కనపడకుండా పోతుంది. విల్‌కి తానెక్కడున్నానో మెసేజ్ పెడుతుంది. అతను ఆమె దగ్గరకి వెళతాడు. “నేను ఇంకో తప్పు చేస్తున్నానేమో అనిపిస్తోంది” అంటుందామె. ‘గోదావరి’ లాంటి చిత్రాలలో పెళ్ళి విషయంలో కొందరు అమ్మాయిలు ఎలా తికమక పడుతుంటారో చూశాం. అలాంటిదే ఇది. విల్ “మనం చేసింది తప్పు కాదు. మొదట్లో అంతా బాగానే ఉండేది కదా. తర్వాత తప్పటడుగు వేశాం. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కదా” అంటాడు. కొత్త తప్పులు చేసుకుంటూ వెళ్ళటమే తప్ప వేరే దారి లేదు అనుకునే సంస్కృతి ఇది. మన దేశంలో కూడా ఇది పెరుగుతోంది. చార్లీ గ్యారీని పెళ్ళి చేసుకుంటుంది. గ్యారీ మంచివాడే. అతనికి విల్‌కి తన మీద కోపం ఉండటం సబబే అనే భావన ఉంది. చివరికి విల్ డయాన్‌ని కలుసుకోవటానికి వెళుతుండగా చిత్రం ముగుస్తుంది.
కథ సుఖాంతం అయింది. అందరూ మంచి మనసు కలవారు కావటంతో అది సాధ్యపడింది. ఎవరి ఆనందం వారు వెతుక్కోవటంలో తప్పు లేదు. కానీ రాజీ పడే మనస్తత్వం కూడా ఉండాలి. లేకపోతే పిల్లలు కూడా తమ ఆనందమే ముఖ్యం అనుకుంటూ పెరుగుతారు. ఇక్కడ పెద్దల కథ సుఖాంతం అయినట్టే కనిపించినా ముందు ముందు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? నిజ జీవితంలో మంచి మనసు కలవారే దొరుకుతారని నమ్మకం ఏమిటి? అలాగని ఇష్టం లేని వారితో నెట్టుకురావాలా? కనీసం రాజీకి ప్రయత్నించాలి. విల్ మొత్తం భారమంతా చార్లీ మీద వేసి జీవించాడు. తనని పట్టించుకోకపోవటంతో చార్లీ అసంతృప్తికి గురయింది. విల్‌దే పెద్ద తప్పు. అలాగని చార్లీ తప్పు లేదనలేం. ఇద్దరూ రాజీ పడాల్సింది. అప్పుడు పిల్లలు కూడా భద్రతాభావంతో పెరిగేవారు. ఇప్పుడు విచ్ఛిన్నమైన బంధాల ప్రభావం వారి మీద పడకుండా ఉండదు. తర్వాత వారికి బంధాల విలువ తెలియదని బాధపడి ప్రయోజనం లేదు.