[సంచిక పాఠకుల కోసం ‘ప్రిజనర్స్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
కొన్ని పరిస్థితుల్లో కొందరు మనుషులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకపోవటం ఒక కారణం. చాలా సినిమాల్లో హీరో తన తండ్రినో, తల్లినో చంపిన వ్యక్తిని చంపి పగ తీర్చుకోవటం, చివరికి శుభం కార్డు పడటం చూశాం, చూస్తున్నాం. కానీ నిజజీవితంలో చట్టం దృష్టిలో ఆ హీరో నేరస్థుడే అవుతాడు. ‘ప్రిజనర్స్’ (2013) లో హీరో కూడా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో వాస్తవికంగా చూపించారు. దర్శకుడు డెనీ విల్నవ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతను ‘డ్యూన్’, ‘డ్యూన్–2’ లాంటి భారీ చిత్రాలు తీసి ఇప్పుడు ప్రఖ్యాతి గడించాడు కానీ మొదట్లో అతని చిత్రాలు చిన్న స్థాయిలో ఉండేవి. అయినా కథాబలం పుష్కలంగా ఉండేది. అతను తీసిన ‘సికారియో’ (2015), ‘అరైవల్’ (2016) చిత్రాలను గతంలో ఈ శీర్షికలో విశ్లేషించటం జరిగింది. ‘ప్రిజనర్స్’ అంటే ఖైదీలు అని అర్థం. ఈ చిత్రంలో భౌతికంగా ఖైదు అయినవాళ్ళూ ఉంటారు, మానసికంగా ఖైదు అయినవాళ్ళూ ఉంటారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. పెద్దలకి మాత్రమే.
కెలర్, ఫ్రాంక్ స్నేహితులు. కెలర్ ఇళ్ళల్లో రిపేరు, రీమోడలింగ్ పనులు చేస్తాడు. అతను ఒక ప్రెపర్ (prepper – ఈ పదం prepare అనే పదం నుంచి వచ్చింది). అంటే విపత్తులు వచ్చినపుడు కొన్నాళ్ళు తట్టుకోవటానికి కుటుంబానికి కావల్సిన సామాను ముందే సిద్ధం (prepare) చేసుకునే మనిషన్నమాట. అయితే అతనికి దేవుడి మీద నమ్మకం ఉంది. అతని కూతురు ఆనా, ఫ్రాంక్ కూతురు జాయ్ కలిసి ఆడుకోవటానికి బయటకి వెళ్ళినపుడు వారిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇంటికి కాస్త దూరాన ఒక ఆర్వీ (ప్రైవేటుగా వాడుకునే బస్సు లాంటి వాహనం) దగ్గరకి వాళ్ళు ఆడుకోవటానికి వెళ్ళారని తెలిసి అక్కడికి వెళితే ఆ ఆర్వీ అక్కడ ఉండదు. పోలీసులకి సమాచారం ఇస్తే వారు ఆ ఆర్వీని గుర్తిస్తారు. అందులో ఉన్న వ్యక్తిని అరెస్టు చేస్తారు. అతని పేరు ఆలెక్స్. కేసు విచారణ చేసే పోలీసు డిటెక్టివ్ పేరు లోకీ. ఎంత భయపెట్టినా ఆలెక్స్ ఏమీ చెప్పడు. అతను మానసికంగా ఎదగలేదు. లోకీ ఆలెక్స్ ఇంటికి వెళితే అతని పెద్దమ్మ హాలీ ఉంటుంది. ఆలెక్స్ తలిదండ్రులు మరణిస్తే ఆమె, ఆమె భర్త అతన్ని దత్తత తీసుకున్నారు. వారి సొంత బిడ్డ క్యాన్సర్‌తో మరణించాడు. అప్పటి నుంచి దేవుడి మీద నమ్మకం పోయిందని ఆమె అంటుంది. ఆమె భర్త కొన్నేళ్ళ క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.
ఆర్వీలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని ఫొరెన్సిక్ నిపుణులు చూస్తారు. పిల్లలు వేసుకున్న ఉన్ని దుస్తుల నుంచి పీచు ఏమన్నా ఆర్వీలో కుర్చీల మీద ఉందేమో అని చూస్తారు. ఏమీ దొరకదు. ఆలెక్స్ ఇంటిలో కూడా ఏమీ దొరకదు. పిల్లలని బలవంతంగా తీసుకువెళితే, వారు పెనుగులాడితే అలాంటివి దొరికేవి అని ఫొరెన్సిక్ అధికారి అంటాడు. ఏ ఆధారాలు లేకపోతే ఎవరినీ 48 గంటలకి మించి అరెస్టు చేయకూడదు. లోకీ కెలర్, ఫ్రాంక్‌ల ఇళ్ళకి వెళతాడు. రెండు కుటుంబాలూ దుఃఖంలో కూరుకుపోయి ఉంటాయి. లోకీ వారికి పరిస్థితిని వివరిస్తాడు. కెలర్ ఇంటికి వెళ్ళినపుడు కెలర్ “ఆలెక్స్‌కి లై డిటెక్టర్ పరీక్ష చేశారా?” అని అడుగుతాడు. లోకీ “అతని ఐక్యూ పదేళ్ళ పిల్లాడి ఐక్యూ. ప్రశ్నలు అర్థం కాకపోతే లై డిటెక్టర్ పరీక్ష చేసినా ప్రయోజనం లేదు” అంటాడు. కెలర్ కోపంగా లోకీ మీద అరుస్తాడు. లోకీ అతన్ని శాంతంగా మాట్లాడమంటాడు. చివరికి కెలర్ “అతన్ని వదలకండి” అంటాడు. లోకీ “ఏ అభియోగం లేకుండా అతన్ని అరెస్టు చేసి ఉంచలేం” అంటాడు. కెలర్ “చిన్న పాపల కోసం ఆ మాత్రం చేయలేరా? ప్లీజ్” అంటాడు. లోకీ అయిష్టంగా తల ఊపుతాడు. అతనికి కెలర్ తీరు నచ్చదు.
లోకీ గతంలో లైంగిక నేరాలకి పాల్పడిన వారి ఇళ్ళకి వెళ్ళి విచారణ చేస్తాడు. ఈ క్రమంలో ఒక క్రైస్తవ ఫాదర్ ఇంటికి వెళతాడు. అతను తాగి పడి ఉంటాడు. లోకీ అతని ఇంట్లో సోదా చేస్తాడు. బేస్‌మెంట్‌లో ఒక శవం ఉంటుంది. ఫాదర్‌ని బెదిరించి అడిగితే “ఆ వ్యక్తి కన్ఫెషన్ చేయటానికి వచ్చాడు. 16 మంది పిల్లల్ని అపహరించానని చెప్పాడు. ఇంకా అపహరిస్తానని అన్నాడు. అందుకే అతన్ని బంధించాను. అతను చనిపోయాడు” అంటాడు. పోలీసులు ఫాదర్‌ని అదుపులోకి తీసుకుంటారు. కానీ ఫాదర్‌ని విచారించినా ఏమీ లాభం ఉండదు. మరో పక్క 48 గంటలు పూర్తవటంతో పోలీసులు ఆలెక్స్‌ని విడుదల చేసే పనిలో ఉంటారు. ఆ విషయం తెలిసి కెలర్ పోలీస్ స్టేషన్‌కి వెళతాడు. ఆలెక్స్ పెదమ్మ హాలీతో కలిసి బయటకి వస్తాడు. టీవీ రిపోర్టర్లు ఉంటారు. వారందరినీ తోసుకుని కెలర్ ఆలెక్స్ మీద దాడి చేస్తాడు. ఆలెక్స్ కింద పడతాడు. కెలర్‌తో “నేను వాళ్ళని వదిలి వెళ్ళనంత వరకు వాళ్ళు ఏడవలేదు” అంటాడు. అది కెలర్ మాత్రమే వింటాడు. పోలీసులు కెలర్‌ని లాగి నిర్బంధిస్తారు. ఆలెక్స్, హాలీ ఇంటికి వెళ్ళిపోతారు.
ఆలెక్స్ అన్న మాటని కెలర్ లోకీకి, అతని పై అధికారికి చెబుతాడు. వాళ్ళు నమ్మరు. లోకీ ఆలెక్స్ ఇంటికి వెళ్ళి అతన్ని కెలర్‌తో ఏం అన్నావని అడుగుతాడు. ఎంత అడిగినా అతను ఏమీ అనలేదనే అంటాడు. అదే విషయం లోకీ కెలర్‌కి ఫోన్ చేసి చెబుతాడు. కెలర్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. పోలీసుల వల్ల ఏమీ కాదని నిర్ణయించుకుంటాడు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆలెక్స్‌ని కిడ్నాప్ చేసి తన తండ్రికి చెందిన ఒక బిల్డింగ్‌లో బంధిస్తాడు. కెలర్ తండ్రి ఆ బిల్డింగ్‌ని కెలర్ పేర్న రాసి మరణించాడు. ఆ బిల్డింగ్ ఖాళీగా ఉంది. కెలర్ ఫ్రాంక్‌ని తీసుకువచ్చి ఆలెక్స్‌ని చూపిస్తాడు. “ఇది తప్పు. అతను నేరం చేశాడో లేదో మనకి తెలియదు” అంటాడు ఫ్రాంక్. “వీడే చేశాడు. పిల్లలు ఎక్కడున్నారో చెప్పేదాకా వీడిని వదలను” అంటాడ్ కెలర్. ఆలెక్స్‌ని కొట్టడం మొదలుపెడతాడు. అయినా ఆలెక్స్ ఏమీ చెప్పడు.
“నేను వాళ్ళని వదిలి వెళ్ళనంత వరకు వాళ్ళు ఏడవలేదు” అని ఆలెక్స్ అన్నది నిజమే. కానీ అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరో పిల్లల గురించి అని అర్థమవుతూనే ఉంది. మరి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పడేం? అతని మానసిక స్థితి బాగాలేదు. మరి అలాంటి వాడి మాటలు నమ్మవచ్చా? కెలర్‌కి ఇవన్నీ అనవసరం. అతనే చేశాడని కెలర్ నమ్మకం. నమ్మకమా లేక అలా నమ్మకపోతే దిక్కుతోచని పరిస్థితి వల్ల అతను తనని తాను మోసం చేసుకుంటున్నాడా? ఓ పక్కన అతని భార్య కూతురి కోసం బెంగపెట్టుకుంది. “మా అందర్నీ అన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తానని అన్నావుగా?” అంటుంది. దాంతో అతనిలో ఏదో చేయాలని పట్టుదల. చాలామంది ఇలా ఉంటారు. ఏదో ఒకటి చేసి తాను కార్యశూరుడినని చూపించుకుంటారు. ఫ్రాంక్ కెలర్‌తో ఒక మంచి మాట అంటాడు. “నువ్వు సరిగ్గా విన్నావో లేదో. నువ్వు వినాలనుకున్నదే విన్నావేమో” అంటాడు. కానీ ప్రేక్షకులమైన మనకి కూడా ఆలెక్స్ అన్న మాటలు తెలుసు. అలాంటి పరిస్థితిలో ఏ తండ్రైనా కెలర్‌లాగే ప్రవర్తిస్తాడేమో. ఆలెక్స్ మానసిక స్థితి బాగా లేదనేది పట్టించుకోడేమో. ఆ స్థానంలో ఉంటే గానీ ఎవరికీ తెలియదు.
కెలర్ ఆలెక్స్ ముఖం మీద విపరీతంగా కొడతాడు. అతని ముఖం కమిలిపోయి రక్తం ఓడుతూ ఉంటుంది. ఫ్రాంక్ ఇది తట్టుకోలేకపోతాడు. కెలర్ క్రూరత్వం చూసి అతను నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఆ రాత్రి పిల్లల కోసం కొవ్వొత్తుల ప్రదర్శన జరుగుతుంది. అక్కడ లోకీకి ఒక యువకుడు అనుమానాస్పదంగా కనపడతాడు. ఆ యువకుడు లోకీ తనని చూడటం చూసి పారిపోతాడు. లోకీ అతన్ని వెంబడిస్తాడు కానీ అతను తప్పించుకుంటాడు. లోకీ అతని బొమ్మ గీయించి టీవీలలో ప్రసారం చేయిస్తాడు. మర్నాడు ఈ ప్రకటన అందరూ చూస్తారు. ఇదిలా ఉండగా లోకీకి ఆలెక్స్ కనపడటం లేదని తెలుస్తుంది. అతను తన పై అధికారిని “అతని ఇంటి దగ్గర నిఘా పెడతానన్నారుగా” అంటాడు. “అతను అమాయకుడని నువ్వు అన్నావుగా. అమాయకుల మీద కూడా నిఘా పెట్టేటంత బడ్జెట్ లేదు” అంటాడతను. అమెరికా అగ్రరాజ్యమే కానీ అక్కడ నేరాలు ఎక్కువే. నేరాలు ఎక్కువైనప్పుడు పోలీసులు నేరపరిశోధనే చేయాలా లేక నిఘా చేస్తూ గడపాలా? ఎక్కువ మంది పోలీసులని చేర్చుకుందామంటే నిధులు ఉండాలిగా? ఎవరికీ అపరిమితమైన నిధులు ఉండవు.
ఆరోజు కెలర్ ఫ్రాంక్‌ని తీసుకుని మళ్ళీ ఆలెక్స్ దగ్గరకి వెళతాడు. బిల్డింగ్ బయట ఫ్రాంక్ “పోలీసులు వేరే యువకుడి కోసం వెతుకుతున్నారు. ఆలెక్స్ అమాయకుడేమో” అంటాడు. కెలర్ “ఇద్దరూ తోడుదొంగలు. ఆలెక్స్ ఆ రెండోవాడి దగ్గర పిల్లలని వదిలి వచ్చాడు. వాడెక్కడున్నాడో ఆలెక్స్‌కి తెలుసు” అంటాడు. కెలర్ మళ్ళీ ఆలెక్స్‌ని కొడతాడు. ఫ్రాంక్‌కి అంతర్మథనం ఎక్కువవుతుంది. ఇంటికి వెళ్ళగానే అతని భార్య ఎక్కడికెళ్ళావని అడుగుతుంది. ఫ్రాంక్ ఆమెకి నిజం చెప్పేస్తాడు. ఫ్రాంక్ భార్య కెలర్ దగ్గరకి వచ్చి అతన్ని చీవాట్లేస్తుంది. అంతలోనే “అతని దగ్గరకి తీసుకెళ్ళండి” అంటుంది. ముగ్గురూ ఆలెక్స్ దగ్గరకి వస్తారు. ఫ్రాంక్ భార్య ఆలెక్స్ ముఖాన్ని చూసి అవాక్కవుతుంది. కానీ అతని బాధ కన్నా ఆమెకి తన బిడ్డ ముఖ్యం. తన బిడ్డ ఎక్కడుందో చెప్పమని ప్రాథేయపడుతుంది. అతనేం చెప్పడు. తర్వాత కెలర్ చెక్కలతో బాత్రూమ్‌లో ఒక చిన్న గది కడతాడు. అందులో ఆలెక్స్‌ని బంధిస్తాడు. ఆలెక్స్‌తో మాట్లాడేందుకు వీలుగా చెక్క గోడలో ఒక రంధ్రం చేస్తాడు. ఆ గదిలో పైన రెండు షవర్ కుళాయిలు ఉంటాయి. బయట నుంచి ఆ కుళాయిల ద్వారా సలసల కాగే నీరు, అతి చల్లని నీరు పంపించే ఏర్పాటు కెలర్ చేస్తాడు. ఆ విధంగా ఆలెక్స్‌ని చిత్రహింసలు పెట్టి నిజం రాబట్టాలని అతని ప్రయత్నం. ఫ్రాంక్ అడ్డు చెబుతాడు. కెలర్ “నీకు ఇష్టం లేకపోతే ఈ చెక్క గదిని కూలగొట్టి అతన్ని విడిపించు” అంటాడు. ఫ్రాంక్ ఆ పని చేయటానికి సిద్ధపడతాడు. ఫ్రాంక్ భార్య ఫ్రాంక్‌ని ఆపుతుంది. “మన బిడ్డ గురించి ఆలోచించు” అంటుంది. ఫ్రాంక్ ఆగిపోతాడు. ఎవరి అవేదన వారిది. చేస్తున్నది చట్టరీత్యా తప్పని తెలుసు. కానీ తమ పిల్లల కోసం వారు తప్పు చేయటానికి వెనకాడరు.
ఆ రాత్రి కెలర్ ఆలెక్స్ దగ్గర ఉన్న సమయంలో కొవ్వొత్తుల ప్రదర్శనలో కనిపించిన యువకుడు కెలర్ ఇంటిలో ప్రవేశిస్తాడు. ప్రవేశించినది ఆ యువకుడనేది ప్రేక్షకులమైన మనకి మాత్రమే తెలుసు. చప్పుడు విని కెలర్ భార్య వస్తుంది. అతను కిటికీ తెరిచి పారిపోతాడు. ఆమె లోకీకి ఫోన్ చేస్తుంది. అతను వస్తాడు. ఆమె చెప్పింది వింటాడు. కెలర్ ఎక్కడున్నాడని అడుగుతాడు. ఆమె బిడ్డ మీద బెంగతో బాగా కుంగిపోయి ఉంది. కోపంగా “మా అమ్మాయి తప్పిపోయినప్పటి నుంచి నా భర్త తన కోసం చూస్తున్నాడు కదా. ఎక్కుడున్నాడని అంటారేం?” అంటుంది. దీంతో లోకీకి అనుమానం వస్తుంది. కెలర్ ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళుతున్నాడని అతనికి అర్థమవుతుంది. మరో పక్క కొవ్వొత్తుల ప్రదర్శనలో కనిపించిన యువకుడి రేఖాచిత్రం టీవీలో చూసి ఒక బట్టల షాపులో పని చేసే అమ్మాయి లోకీకి ఫోన్ చేస్తుంది. అతను ఇంతకు ముందు ఆ షాపులో చిన్నపిల్లల బట్టలు కొన్నాడని చెబుతుంది. అతను మళ్ళీ వస్తే ఫోన్ చేయమని లోకీ చెబుతాడు. ఆ యువకుడికి ఈ కేసుతో ఏదో సంబంధం ఉంది. కానీ అతనెవరో చిత్రంలోని పాత్రలకి తెలియదు. ప్రేక్షకులకి అతను కెలర్ ఇంట్లో ప్రవేశించాడని తెలుసు. అతనే అపరాధి, ఆలెక్స్ నిరపరాధి అనే భావన కలుగుతుంది. కెలర్ అనవసరంగా ఆలెక్స్ ని చిత్రహింసలు పెడుతున్నాడని అనిపిస్తుంది. కానీ వారిద్దరూ తోడుదొంగలేమో అని కూడా అనిపిస్తుంది.
పోలీసు వ్యవస్థని పూర్తిగా నమ్మలేకపోవటం వల్లనే ఈ పరిణామాలు. పోలీసులు అతీంద్రియ శక్తులున్నవారు కాదు కదా? వారూ తప్పులు చేస్తారు. లోకీ కెలర్ చెప్పిన మాటలు ఎందుకు నమ్మలేదు? అతనికి కెలర్ దుందుడుకు వ్యక్తి అనే అభిప్రాయం ఉంది. కెలర్ మాటలని అతను నమ్మి ఉంటే విచారణ వేరేలా ఉండేది. మన అభిప్రాయాలు ఒక్కోసారి మనల్ని తప్పు దోవ పట్టిస్తాయి. కెలర్‌లో ఉన్న లోపం తేలిగ్గా సహనం కోల్పోవటం. ఫ్రాంక్ శాంతమూర్తిలా ఉంటాడు కానీ ఆలెక్స్ అన్న మాటలు ఫ్రాంక్ విని ఉంటే అతనేం చేసేవాడు? కెలర్‌ని తప్పుబట్టడం తేలికే కానీ అతని స్థానంలో ఉంటే లోకీ అయినా, ఫ్రాంక్ అయినా కచ్చితంగా భిన్నంగా వ్యవహరించేవారు. కెలర్‌కి దైవభక్తి ఉంది. “నా పాపాలకు క్షమాభిక్ష పెట్టు” అని ఒక సందర్భంలో ప్రార్థిస్తాడు. తను చేసేది పాపం అయితే క్షమించమని అతని ప్రార్థన. కానీ చట్టం నేరాలని ఉపేక్షించదు కదా.
కెలర్‌గా హ్యూ జాక్‌మన్, లోకీగా జేక్ జిలెన్‌హాల్ నటించారు. హ్యూ శృంగారం, హాస్యం తప్ప అన్ని రసాలని పోషించాడు ఈ చిత్రంలో. ఇలాంటి పాత్ర చాలా అరుదుగా దొరుకుతుంది. ఒక సీన్‌లో అతని రౌద్రం చూసి ఫ్రాంక్ పాత్రలో నటించిన టెరెన్స్ హవర్డ్ నిజంగానే జడుసుకున్నాడట. జేక్ ఉండుండి కళ్ళు ఆర్పే మ్యానరిజంతో లోకీ పాత్ర పోషించాడు. ప్రేక్షకుల సానుభూతి పొందే కెలర్ పాత్రకి దీటుగా నటించాడు. రోజర్ డీకిన్స్ ఛాయాగ్రహణానికి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఆ ఒక్క నామినేషన్ తప్ప వేరే నామినేషన్లు రాకపోవటం విచిత్రం. ఆరన్ గుజికౌస్కీ రాసిన స్కీన్‌ప్లే చాలా పకడ్బందీగా ఉంటుంది.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
మర్నాడు లోకీ కెలర్‌ని వెంబడిస్తాడు. కెలర్‌కి అది తెలిసిపోతుంది. అతను తన బిల్డింగ్‌కి వెళ్ళకుండా మద్యం షాపుకి వెళ్ళి మద్యం తెచ్చుకుంటాడు. లోకీ కారు దగ్గరకి వస్తాడు. లోకీ ఆలెక్స్ కనపడటం లేదని చెబుతాడు. “నేరం చేశాడు కాబట్టి ఊరొదిలి పారిపోయాడేమో. నిఘా పెట్టలేదా? నన్ను వెంబడించటం ఆపి నా కూతుర్ని వెతకండి” అంటాడు కెలర్ కోపంగా. లోకీ అతనికి జవాబు చెప్పలేక అప్పటికి ఊరుకుంటాడు కానీ త్వరలోనే కెలర్‌కి తండ్రి ద్వారా వచ్చిన బిల్డింగ్ గురించి తెలుసుకుంటాడు. ఆ బిల్డింగ్‌కి వెళతాడు. కెలర్ లోపలే ఉంటాడు. లోకీ వచ్చినట్టు పసిగడతాడు. ఆలెక్స్‌ని చప్పుడు చేస్తే వేడి నీళ్ళు వదులుతానని బెదిరిస్తాడు. ఆలెక్స్ తెలివి కలవాడైతే ఎవరో వచ్చారని పసిగట్టి అరిచేవాడు. అతనికంత తెలివి లేదు. లోకీ కిటికీ లోనుంచి లోపలికి వస్తాడు. కెలర్ ఒంటరిగా మద్యం తాగటానికి అక్కడికి వచ్చానని అతనికి చెబుతాడు. లోకీ కాస్త తనిఖీ చేస్తాడు కానీ ఫోన్ రావటంతో వెళ్ళిపోతాడు.
ఆ ఫోన్ బట్టల షాపు అమ్మాయి చేసింది. రెండో యువకుడు మళ్ళీ షాపుకి వచ్చాడని చెబుతుంది. అతని కారు నంబరు నోట్ చేసుకుంటుంది. దాని ఆధారంగా లోకీ ఆ యువకుడి ఇంటికి వెళతాడు. ఆ యువకుడు అనుమానాస్పదంగా ప్రవర్తించటంతో అతనికి సంకెళ్ళు వేసి ఇల్లు సోదా చేస్తాడు. గోడలు మీద మేజ్ పజిళ్ళు (గజిబిజి దారుల్లో బయటకి దారి కనుక్కునే పజిళ్ళు) గీసి ఉంటాయి. కిచెన్ సింక్‌లో పంది తల ఉంటుంది. లోపలి గదిలో కొన్ని పెద్ద పాస్టిక్ డబ్బాలు ఉంటాయి. వాటిలో రక్తం అంటిన పిల్లల దుస్తులు ఉంటాయి. దుస్తులు అధిక సంఖ్యలో ఉంటాయి. వాటితో పాటు పెట్టెల్లో పాములు ఉంటాయి. కానీ పిల్లల జాడ మాత్రం లేదు. లోకీ ఆ బట్టల ఫోటోలు తీసి ఫ్రాంక్‌నీ, కెలర్‌నీ భార్యలతో పాటు పోలీస్ స్టేషన్‌కి రమ్మంటాడు. ముందు ఫ్రాంక్‌కి, అతని భార్యకి ఫోటోలు చూపిస్తాడు. వారు కొన్ని బట్టలని గుర్తు పడతారు. హతాశులై వెళ్ళిపోతారు. కెలర్ ఒక్కడే పోలీస్ స్టేషన్‌కి వెళతాడు. అతని భార్య కుంగుబాటులో ఉంది. మంచం దిగట్లేదు. కెలర్ లోకీతో “అతను నేరం అంగీకరించాడా?” అంటాడు. లోకీ “మొదట అతను అబద్ధం చెబుతున్నాడనిపించింది. శవాలు కూడా దొరకలేదు. కానీ ఫ్రాంక్ వాళ్ళు కొన్ని దుస్తులని గుర్తు పట్టారు” అంటాడు. ఫోటోలు చూసి కెలర్ కూడా రక్తం అంటిన ఒక సాక్ గుర్తుపడతాడు. దుఃఖం పొంగుకొస్తుంది. “మీ వల్లే ఇది జరిగింది” అని వచ్చేస్తాడు. ఫ్రాంక్ కుటుంబం విషాదంలో మునిగిపోతుంది. కెలర్ మాత్రం శవాలు దొరకలేదు కాబట్టి పిల్లలు ఇంకా బతికే ఉన్నారనే ఆశతో ఉంటాడు. తన భార్యకి ఏమీ చెప్పడు.
లోకీ ఒక పక్కన పిల్లల కోసం విచారణ చేస్తూనే కెలర్ మీద నిఘా పెట్టాడు. అతను తన పై అధికారులకి కెలర్ మీద అనుమానం ఉన్నట్టు చెప్పలేదు. నిజానికి హాలీ (ఆలెక్స్ పెద్దమ్మ) ఆలెక్స్ కనపడటం లేదని ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. లోకీ సొంతంగా విచారణ మొదలుపెట్టాడు. ఎందుకంత పట్టుదల? కెలర్ అసహనపరుడు కాబట్టి ఆలెక్స్‌ని అపహరించాడని అతని అనుమానం. అది నిజమే. కానీ కెలర్‌కి ఇది కోపం తెప్పిస్తుంది. ‘నా కూతుర్ని వెతక్కుండా నా వెంట పడతారా?’ అంటాడు. ఎంత చిత్రం! ఆలెక్స్‌ని బంధించిన బిల్డింగ్‌కి లోకీ వచ్చినపుడు “ఆ అమ్మాయిలని ఇక్కడ దాచలేదు కదా” అంటాడు కెలర్‌తో. అంటే కెలర్ స్వయంగా వారిని అపహరించాడని కూడా లోకీకి అనుమానం వచ్చింది. కెలర్ లాంటి వారి మీద పోలీసులకి అనుమానం రావటం విచిత్రమేమీ కాదు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారు నేరాలు కూడా చేస్తారని వారికి అనుభవపూర్వకంగా తెలుసు. తర్వాత తన కూతురి సాక్‌ని గుర్తుపట్టినపుడు కెలర్ ముందు లాగా కోపం ప్రదర్శించడు. దీనికి ఒక కారణం దుఃఖం. రెండో కారణం తాను నిర్బంధించిన ఆలెక్స్ పిల్లలని చంపలేదు. వేరేవాడు చంపానని ఒప్పుకున్నాడు. అంటే తాను పొరపాటు పడ్డాడు. ఇప్పుడు ఆలెక్స్‌ని ఏం చేయాలి? కానీ కెలర్‌లో ఇంకా ఆశ మిగిలి ఉంది. పిల్లల శవాలు చూసేవరకు అతను వారు చనిపోయారని ఒప్పుకునే మనిషి కాదు. అందుకే ఆలెక్స్‌ని బంధించే ఉంచుతాడు.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
రెండో యువకుడి పేరు బాబ్. అతన్ని పోలీసులు అరెస్టు చేస్తారు. అతను పిల్లలని చంపానంటాడు కానీ శవాలు ఎక్కడున్నాయో చెప్పడు. అయితే అతనిలో క్రూరత్వం ఉండదు. అదో రకమైన అశక్తత ఉంటుంది. శవాలు దొరకకపోతే కేసు ముగియదు. బాబ్ శవాలున్న చోటుకి మ్యాప్ గీస్తానంటే అతనికి పోలీసులు పేపరూ, పెన్సిలూ ఇస్తారు. అతను మేజ్ పజిళ్ళు గీస్తూ ఉంటాడు. లోకీకి సహనం సన్నగిల్లుతుంది. “ఏం గీస్తున్నావో చెప్పు” అంటాడు. బాబ్ ఏడుస్తూ “చెప్పలేను” అంటాడు. లోకీ కోపంగా అతని తలని బల్లకేసి కొడతాడు. మిగతా పోలీసులు లోకీని ఆపుతారు. అమెరికా లాంటి దేశాల్లో నేరస్థులనైనా కొట్టకూడదు. మన దేశంలో కొట్టడం, లాకప్ డెత్‌లు మామూలే. అమెరికాలో పోలీసు అవినీతి తక్కువ. అవినీతి అంతా కింది స్థాయిలో కాక పై స్థాయిలో జరుగుతుంది! బాబ్ తనని కాపాడటానికి వచ్చిన ఒక పోలీసు దగ్గర తుపాకీ లాక్కుని తనని తాను కాల్చుకుని చనిపోతాడు. మరో పక్క కెలర్ ఆలెక్స్ దగ్గరకి మళ్ళీ వెళ్ళి పిల్లల జాడ చెప్పమంటాడు. అతను “వారు మేజ్‌లో ఉన్నారు” అంటాడు. మేజ్ ఎక్కడుంది అంటే చెప్పడు. అతను ఆహారం లేక కృశించిపోయి ఉంటాడు.
కెలర్ హాలీ దగ్గరకి వెళతాడు. హాలీతో మాట్లాడితే ఏమన్నా తెలుస్తుందని అతని ఆశ. “ఆలెక్స్ పారిపోవటానికి నేనే కారణం అని బాధగా ఉంది” అంటాడు. ఆమె అతన్ని లోపలికి అహ్వానిస్తుంది. ఆలెక్స్ గురించి చెబుతుంది. “నేనూ నా భర్తా దేవుడి సందేశాన్ని ప్రచారం చేసేవారం. మా అబ్బాయి క్యాన్సర్‌తో చనిపోయాక దేవుడి మీద నమ్మకం పోయింది. ఆలెక్స్‌ని దత్తత తీసుకున్నాం కానీ వేదన పూర్తిగా తగ్గలేదు” అంటుంది. అతను తన బాధ చెబుతూ “నాకు నిద్రపట్టడం లేదు. మేజ్‌లో ఉన్నట్టు కలలు వస్తున్నాయి” అంటాడు తెలివిగా. ఆమె ఎలా స్పందిస్తుందో అని చూస్తాడు. ఆమె ఒక్క క్షణం అవాక్కవుతుంది. కానీ మాట మార్చి “ఆలెక్స్ కోసం ఎవరైనా వస్తే నాకేం మాట్లాడాలో తెలియదు. ఆలెక్స్ ఎక్కువ మాట్లాడే రకం కాదు. మా ఆయన పాములు పెంచేవాడు. వాటిని చూసి ఆలెక్స్ ఒకసారి జడుసుకున్నాడు. అప్పటి నుంచి ఎక్కువ మాట్లాడడు” అంటుంది.
లోకీ శవాలు దొరకలేదని అసహనంగా ఉంటాడు. అతనికి ఫాదర్ బేస్‌మెంట్‌లో దొరికిన శవం ఫోటోలో శవం మెడలో ఉన్న లాకెట్ మేజ్ ఆకారంలో ఉండటం కనిపిస్తుంది. బాబ్‌కీ, ఆ మనిషికీ ఏదో సంబంధం ఉంది. బాబ్ గతం గురించి వాకబు చేస్తే అతన్ని చిన్నప్పుడు ఎవరో అపహరించారని, అతనికి మత్తు మందిచ్చారని, అతను తప్పించుకున్నాడని తెలుస్తుంది. బాబ్‌కి ఏమీ గుర్తు లేకపోవటంతో అతన్ని అపహరించిన వ్యక్తిని పట్టుకోలేకపోయారు. ప్రస్తుతం బాబ్ ఇంట్లో దొరికిన బట్టల మీద రక్తం పంది రక్తం అని తెలుస్తుంది. బాబ్ ఇంట్లో ‘ఫైండింగ్ ద ఇన్విజిబుల్ మ్యాన్’ అనే ఒక పుస్తకం దొరుకుతుంది. ఒక మాజీ ఎఫ్‌బీఐ (అమెరికా దర్యాప్తు సంస్థ) ఏజెంటు పిల్లల కిడ్నాపర్ గురించి ఊహించి రాసిన పుస్తకం అది. ఇదంతా చూసి ఫొరెన్సిక్ నిపుణుడు “బాబ్ తనని ఇన్విజిబుల్ మ్యాన్ కిడ్నాప్ చేశాడని ఊహించుకుని అతని లాగే నటించటం మొదలుపెట్టాడు. పిల్లల బట్టలు కొని పంది రక్తం అంటించాడు. పిల్లల్ని చంపినట్టు ఊహించుకుని అదో రకం పైశాచికానందం పొందాడు” అంటాడు. మరి ఆనా, జాయ్ బట్టలు అతనికి ఎలా వచ్చాయి? అతని వాళ్ళ ఇళ్ళలోకి ప్రవేశించి బట్టలు దొంగిలించాడు. ఇది రూఢి అయ్యాక ఆనా, జాయ్‌లని బాబ్ చంపలేదని నిర్ధారణ అవుతుంది.
అదే రోజు జాయ్ (ఫ్రాంక్ కూతురు) రోడ్డు మీద పారిపోతూ ఉంటే ఒక స్త్రీ కాపాడి పోలీసులకి అప్పగిస్తుంది. ఆమెని హాస్పిటల్లో చేరుస్తారు. అమె తలిదండ్రులు ఊపిరి పీల్చుకుంటారు. కెలర్, అతని భార్య హాస్పిటల్‌కి వెళతారు. జాయ్ మత్తులో ఉంటుంది. కెలర్ ఆనా గురించి అడుగుతాడు. ఆమె కళ్ళు తెరిచి “నువ్వు అక్కడికి వచ్చావు” అంటుంది. అంటే హాలీ ఇంట్లో జాయ్ ఉందన్నమాట! కెలర్ హాలీని కలవటానికి వెళ్ళినపుడు జాయ్ అతన్ని చూసింది. ఆమె నోటి మీద టేప్ ఉండటంతో మాట్లాడలేకపోయింది. తర్వాత ఆనా, జాయ్ పారిపోవటానికి ప్రయత్నించారు. ఆనాని హాలీ పట్టుకుంది. ఇది అర్థమై కెలర్ హాలీ ఇంటికి వెళతాడు. పోలీసులకి చెబితే వాళ్ళు తొందరగా హాలీ ఇంటిని సోదా చేస్తారో లేదో తెలియదు. సెర్చ్ వారెంట్ లేకుండా చేయరు. అందుకని కెలర్ తానే వెళతాడు.
హాలీ తెలివైనది. కెలర్‌ని లోపలికి రానిచ్చి అతని మీద తుపాకీ గురి పెడుతుంది. జాయ్ తప్పించుకున్నాక కెలర్ వచ్చాడంటే తన రహస్యం బయటపడిందని ఆమెకి తెలిసిపోయింది. అతన్ని బెదిరించి సంకెళ్ళు వేస్తుంది. మత్తు మందు తాగిస్తుంది. అతని ఫోన్, కారు తాళాలు తీసుకుంటుంది. “ఆలెక్స్‌ని అపహరించి తెచ్చాం. బాబ్‌ని కూడా మేమే అపహరించాం. పిల్లల్ని అపహరించి దేవుడి మీద యుద్ధం చేస్తున్నాం. నీలాంటి వారికి దేవుడి మీద నమ్మకం పోయేలా చేసి రాక్షసులుగా తయారు చేస్తున్నాం. మా ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఈ పని కష్టమయింది కానీ ఇంకా చేస్తూనే ఉన్నా” అంటుంది. అతన్ని ఇంటి బయట ఉన్న ఒక లోతైన గోతిలో దిగమంటుంది. “అమ్మాయిలని మొదట ఈ గోతిలోనే పెట్టాను. కానీ ఒంటరితనం భరించలేక వారిని ఇంట్లో పెట్టుకున్నాను” అంటుంది. అతని కాలి మీద తుపాకీతో గాయం చేసి అతన్ని గోతిలోకి దూకమంటుంది. అతను దూకుతాడు. మత్తు మందు ప్రభావంతో అతను తూలుతూ ఉంటాడు. ఆమె గోతిని మూసేసి దానిపై కారు నిలబెడుతుంది. నిజానికి కెలర్ తన బ్యాగులో తుపాకీ తెచ్చుకున్నాడు కానీ హాలీ ముందు గురిపెట్టింది. ఆమెని అతను తక్కువ అంచనా వేశాడు. ఆలెక్స్ అసలు కిడ్నాపరని, హాలీ గత్యంతరం లేక పిల్లలని దాచిపెట్టిందని అనుకున్నాడు. హాలీయే అసలు కిడ్నాపరు.
మరోపక్క కెలర్ హాస్పిటల్ నుంచి హడావిడిగా వెళ్ళటం చూసి లోకీ అతని బిల్డింగ్‌కి వెళతాడు. అతనే కిడ్నాపరని, ఆనా ఆ బిల్డింగ్‌లో ఉందని అతని అనుమానం. అతనికి అక్కడ ఆలెక్స్ దొరుకుతాడు. ఆలెక్స్‌ని హాస్పిటల్లో చేర్పిస్తాడు. తర్వాత ఆలెక్స్ దొరికాడని హాలీకి చెప్పటానికి ఆమె ఇంటికి వెళతాడు. హాలీ అతను తనని అరెస్టు చేయటానికి వచ్చాడని అనుకుంటుంది. ఆమె తలుపు తీయకుండా ఆనా ఉన్న గదికి వెళుతుంది. ఆమె పలకకపోయేసరికి లోకీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆమె పడగ్గదిలోకి వెళతాడు. అక్కడ ఆమె భర్త ఫోటో ఉంటుంది. అతని మెడలో మేజ్ లాకెట్టు ఉంటుంది. ఫాదర్ బేస్‌మెంట్‌లో దొరికిన శవం అతనిదే. దేవుడి మీద యుద్ధం చేస్తున్నామని చెప్పటానికి అతను ఫాదర్ దగ్గరకి వెళ్ళాడు.
లోకీకి ఇప్పటికి కానీ అసలు విషయం అర్థం కాలేదు. అతను తుపాకీ తీసి ఇల్లు సోదా చేస్తాడు. హాలీ ఆనాకి మత్తు ఇంజక్షన్ ఇస్తూ ఉంటుంది. లోకీ రావటం చూసి ఆమె “నన్ను దహనం చేయండి. పెట్టెలో పెట్టి పూడ్చకండి” అని తుపాకీ పేలుస్తుంది. లోకీ కూడా తుపాకీ పేలుస్తాడు. ఆమెకి గుండెలో తూటా దిగి మరణిస్తుంది. ఆమె పేల్చిన తూటా లోకీ నుదురుకి రాసుకుని వెళ్ళిపోతుంది. అతను ఆఘమేఘాల మీద ఆనాని హాస్పిటల్‌కి తీసుకువెళతాడు. కెలర్ మాత్రం గోతిలో బందీగా ఉండిపోతాడు. హాస్పిటల్లో కెలర్ భార్య లోకీకి కృతజ్ఞతలు చెబుతుంది. “కెలర్ నాకు ఫోన్ కూడా చేయలేదు. మీరు నమ్మరేమో” అంటుంది. అతను పారిపోయాడని ఆమె భావన. “అతను దొరికితే జైలుకి పంపిస్తారా?” అంటుంది. “కావచ్చు” అంటాడు లోకీ. ఆమె ఏడుస్తూ “అతను మంచి మనిషి. ఆనా కోసం చేయగలిగినంతా చేశాడు. దేవుడి కృప” అంటుంది. తర్వాత ఆలెక్స్‌ని అతని నిజమైన తల్లికి అప్పగిస్తారు పోలీసులు. హాలీ ఇంటి దగ్గర సోదాలు చేస్తుంటే లోకీకి ఒక ఈల వినపడుతుంది. అది ఆనా ఈల. గోతిలో కెలర్ కి దొరికింది. లోకీ ఈల వినపడిన వైపు చూస్తుండగా చిత్రం ముగుస్తుంది. కెలర్ దొరుకుతాడనే అనుకోవాలి. ఆలెక్స్‌ని చిత్రహింసలు పెట్టినందుకు జైలుకి వెళతాడనే అనుకోవాలి.
హాలీ, ఆమె భర్త పిల్లలని అపహరించి వారికి మత్తుమందు, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి శారీరకంగానూ, పరిష్కరించలేని పజిళ్ళ పుస్తకాలు ఇచ్చి మానసికంగానూ బలహీనుల్ని చేసేవారు. వారు మానసికంగా పూర్తిగా నిర్వీర్యులైపోయేవారు. ఇదంతా ఎందుకంటే తమ బిడ్డ తమకు దక్కలేదని. దేవుడిని నమ్మేవారికి ఆ నమ్మకం పోయేలా వారు పిల్లల్ని అపహరించారు. కర్మఫలం వల్లనే బిడ్డలు చనిపోతారు. అది అంగీకరించలేక కొందరు దేవుడిని నమ్మటం మానేస్తారు. హాలీ, ఆమె భర్త విపరీత పోకడలు పోయి ఇతరుల బిడ్డలని అపహరించటం మొదలుపెట్టారు. అలాంటి వారు మనశ్శాంతి కోసం సేవా కార్యక్రమాలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. భౌతికవాదం పెరిగిపోయిన అమెరికా లాంటి దేశాల్లో ఎదురుదెబ్బలు తగిలితే దైవభక్తి వదిలేయటం ఆశ్చర్యం కాదు. ఆధ్యాత్మికత కలిగిన మన దేశంలో ఏం జరిగినా దైవనిర్ణయం అని సరిపెట్టుకుంటారు. అందుకే ఏదైనా కష్టం వస్తే గుడికో, ఆశ్రమానికో వెళ్ళటం మనకి అలవాటు.
లొకీ కెలర్ మాటలని నమ్మి హాలీ ఇంటికి సోదా చేసి ఉంటే పిల్లలు దొరికేవారేమో. కానీ కెలర్ తనకి తానే శత్రువయ్యాడు. లోకీకి మొదటి నుంచే అతనంటే గిట్టదు. దేవుడు కెలర్‌ని పరీక్షించాడు. కెలర్ విఫలమయ్యాడు కానీ ఆలెక్స్ కెలర్ చేతిలో చనిపోలేదంటే అది దేవుడి దయే అనుకోవాలి. ఆలెక్స్ చనిపోయి ఉంటే కెలర్‌కి యావజ్జీవ కారాగార శిక్ష పడేది. ఒకరకంగా కెలర్ వల్లే హాలీ పట్టుబడింది, ఆనా దొరికింది. అందుకే కెలర్ భార్య అతన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. తన గురించి ఆలోచించకుండా బిడ్డ కోసం అతను తన జీవితాన్నే పణంగా పెట్టాడు.
ఇంతకీ ఏం జరిగింది? ఆలెక్స్ ఇద్దరమ్మాయిలని ఆర్వీలో ఎక్కించుకున్నాడు. అతను కేవలం వారితో ఆడుకుందామనుకున్నాడు. వారిని ఇంటికి తీసుకువెళితే హాలీ వారిని బంధించింది. మరి ఆలెక్స్ పోలీసులకి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? చెప్పాలనుకున్నా చెప్పటం అతనికి చేత కాదు. ఆలెక్స్ మొదట్లో పోలీసులకి చిక్కగానే హాలీ పిల్లల్ని గోతిలో ఉంచింది. తర్వాత వారిని ఇంట్లో పెట్టుకుంది. బాబ్‌కి, ఆలెక్స్‌కి ఉన్న ఒకే ఒక సంబంధం ఏమిటంటే వారిద్దరూ హాలీ దంపతుల చేత అపహరించబడ్డారు. బాబ్‌ది మరో రకమైన మానసిక వికారం. తానే ఒక సీరియల్ కిల్లర్ అయినట్టు నటించి ఆనందం పొందేవాడు. తాను పిల్లలని చంపానని అబద్ధం చెప్పాడు.
ఈ చిత్రంలో ఆలెక్స్ ముఖ్యమైన బందీ (ప్రిజనర్). కెలర్ తన స్వభావానికి తానే బందీ అయ్యాడు. తాను చేస్తున్నది తప్పని తెలిసీ చేయటం ఆపలేకపోయాడు. చివరికి నిజంగానే బందీ అయ్యాడు. లోకీ గతంలో అన్ని కేసులూ పరిష్కరించాడు. ఇప్పుడు ఈ కేసు పరిష్కరించలేక అతని అహం దెబ్బ తింది. అతను తన అహానికి బందీ. చివరికి ఆనా అతనికే దొరికినా కెలర్ వల్లే దొరికిందని తెలుసు. కెలర్‌ని నమ్మి ఉంటే ముందే దొరికేదనీ తెలుసు. అతను కెలర్‌కి శిక్ష తగ్గించేలా చేస్తాడనడంలో సందేహం లేదు. కెలర్ భార్య, ఫ్రాంక్ భార్య కూడా తక్కువ వారు కాదు. కెలర్ భార్య “నువ్వు మమ్మల్ని రక్షించలేకపోయావు” అని కెలర్‌ని నిందిస్తుంది. ఫ్రాంక్ భార్య “కెలర్ ఏదో చేస్తున్నాడు, అతన్ని చేయనివ్వు, మన మీదకి వస్తే మనం చేతులు దులిపేసుకోవచ్చు” అన్నట్టు మాట్లాడుతుంది. ఇదంతా దేవుడి నాటకం. ఒకరి చేత ఒకలా, మరొకరి చేత మరొకలా నటింపజేస్తాడు. నాటకం ఆడిస్తాడు. స్వభావానికి లొంగిపోతే రసాభాస తప్పదు. స్వభావాన్ని అధిగమించటమే అసలైన సాధన.